
అమరావతి,సాక్షి: కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లిన అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. భద్రత విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్‌షాను కలుస్తాం. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవు
రామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మాజీ సీఎం జగన్‌కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్, ఆ సంగతి అధికారులకు తెలుసు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం.
ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. గేట్లు సరిగా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు. అధికారం ఎన్నడు శాశ్వతం కాదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే ప్రజలు తిరగబడతారు. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారు.జగన్‌కు కావలసిన భద్రత కల్పించాలి. జగన్ భద్రత పట్ల మాకు ఆందోళన ఉంది. జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాము. ప్రధాని మంత్రి దగ్గరకు వెళ్ళి జగన్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాము.
ఎంపీ కృష్ణదేవరాయలకు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా. కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది.కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ వర్గం ప్రజలు కూటమి పాలనలో సంతోషంగా లేరు. 1100 మందితో భద్రత కల్పిస్తే పోలీసులు ఎక్కడ ఉన్నారు.
1100 మంది కాదు కదా 110 మంది కూడా లేరు. 1100 మంది పోలీసులు ఉండి ఉంటే అందరూ సివిల్ డ్రెస్‌లో ఉన్నారా. ఒక సెలబ్రిటీ వస్తేనే పోలీసులు ఎంతో హడావడి చేస్తారు. మాజీ సీఎం పరామర్శకు వెళ్తే భద్రత కల్పించలేరా. గతంలో చంద్రబాబు పోలీసులు గురించి మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి.రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి.ఈ రోజు మేము అవ్వచ్చు, రేపు మీరు అవ్వొచ్చు. రాజకీయ నాయకులపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయింది. మాన్యువల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మాట్లాడరు’ అని వ్యాఖ్యానించారు.