
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలను ఏపీ విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ ఖండించారు. విద్యుత్ అంతరాయంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగానే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు పూర్తిగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రోజుకి 204 మిలియన్ యూనిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. 30 మిలియన్ యూనిట్లను రోజు తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా దీర్ఘకాలిక విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. జెన్‌కో, కృష్ణపట్నం, సెంట్రల్ జెనరేటింగ్, విండ్, సోలార్, జలవిద్యుత్ ఉత్పత్తిని వినియోగిస్తున్నామని వెల్లడించారు. 7 వందల నుండి 2 వేల మెగావాట్ల వరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీపీసీతో ఉన్న సమస్య పరుష్కరించామని తెలిపారు.