Central Power Department
-
ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే
వెంగళరావునగర్ (హైదరాబాద్): కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని, వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం టీఎస్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు. తెలంగాణకు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అప్పులు నిలిపేశామని ఆర్కె సింగ్ అనడం శతాబ్దకాలంలోనే అతిపెద్ద అబద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రుణాల చెల్లింపు ఆపిందిలేదని, ఏ రంగంలో అప్పు తీసుకున్నా సకాలంలో చెల్లించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్లనే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇస్తామని క్యూ కడుతున్నాయన్నారు. కేంద్రం అబద్ధాలను మానుకోవాలని సూచించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను కోరారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లు లూజుగా ఉన్నాయని ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించాలని సూచించారు. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు మాట్లాడుతూ సంస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు పగలు మాత్రమే విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని.. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటివేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటే సౌర, పవన విద్యుత్‌తో తీర్చవచ్చ ని వివరించింది. ఈ నెల 1న దేశంలో పగటిపూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు (ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లకు సమానం) పెరిగిపోయినా తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈ నెల 1న ఆ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని.. అందువల్ల వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగటివేళలకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఈ నెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ లేఖలోని వివరాల మేరకు.. 23 శాతం పెరిగిన డిమాండ్ దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఆ నెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్ యూ నిట్లకుపైగా విద్యుత్ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్‌తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మి.యూనిట్ల కొరత ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. దక్షిణాదిలోనే కొరత అధికం దేశవ్యాప్తంగా చూస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జలవిద్యుదుత్పత్తి జరగగా.. ఈసారి 40 గిగావాట్లలోపే ఉండటం గమనార్హం. జూన్–సెపె్టంబర్ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉండగా.. 2–3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలుండగా.. గ్యాస్ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. విద్యుత్ డిమాండ్ తీర్చడానికి కేంద్రం సూచించిన చర్యలివీ.. ♦ విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలి. ♦ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలి. ♦ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టు కోవాలి. ళీ నాణ్యత లేని బొగ్గు, యాష్ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక.. 12–14 గిగావాట్ల విద్యుత్ లభ్యత లేకుండా పోయింది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలి. ♦ ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకో వాలి. ళీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్‌ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్‌ను పవర్ ఎక్స్చేంజి ల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలి. ♦ డిమాండ్ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. ♦ నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలి. -
పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది. వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఏపీలో విద్యుత్ నష్టాలు తక్కువ
సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తోంది. ఆ కోవలోనే విద్యుత్ రంగంలో విప్లవాత్మక చర్యలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమేగాక జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటోంది. తాజాగా టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలను తగ్గించడంలో ఏపీ ముందంజలో నిలిచి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో బుధవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వర్చువల్‌గా సమీక్షించారు. రాష్ట్రాల వారీగా విద్యుత్ సంస్థల పనితీరు, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పురోగతిపై చర్చించారు. ఆర్డీఎస్ఎస్లో ప్రధానంగా పరిగణించే ఏటీసీ నష్టాలు మన రాష్ట్రంలో 2018–19లో 16.36 శాతం ఉండేవి. 2021–22లో అవి 11.21 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో మూడుశాతానికిపైగా నష్టాలను తగ్గించిన రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. 5.15 శాతం నష్టాల తగ్గింపుతో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2024–2025 నాటికి ఏటీసీ నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడే చేరుకున్నాయి. ఉదయ్ డ్యాష్‌బోర్డ్ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 12 రాష్ట్రాల్లో ఏటీసీ నష్టాలు 25 శాతం కంటే ఎక్కువ, ఆరు రాష్ట్రాలలో 15–25 శాతం మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును అంచనా వేయడానికి కేంద్రం ఈ ఏటీసీ నష్టాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. అవి తక్కువగా ఉన్న, వేగంగా తగ్గించుకుంటున్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్డీఎస్ఎస్ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ప్రీపెయిడ్ మోడ్‌లో స్మార్ట్‌మీటర్లు అమర్చడంపైనా మంత్రి ఆరాతీశారు. వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్ వినియోగం ప్రయోజనకరమని తెలిపారు. ఏపీ ఈ దిశగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించవచ్చని మంత్రి వెల్లడించారు. 7 పోక్సో కోర్టులకు జడ్జీలు గుంటూరు లీగల్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏడు పోక్సో కోర్టులకు జిల్లా జడ్జీలను బదిలీపై నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సునీత బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా జిల్లా జడ్జీలను అక్కడే ఉన్న పోక్సో కోర్టులకు బదిలీ చేశారు. అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ, ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి.రాజ్యలక్ష్మి, చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా, నెల్లూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి సిరిపిరెడ్డి సుమ, ఒంగోలులోని ప్రత్యేక మహిళా కోర్టు, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, విశాఖపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది, ఏలూరులోని ల్యాండ్ రీఫామ్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఉమసునందలను పోక్సో కోర్టులకు జడ్జీలుగా బదిలీ చేశారు. బదిలీ అయిన వారు పోక్సో కోర్టులకు జడ్జీలుగా కొనసాగుతూనే, ప్రస్తుతం వారు పనిచేస్తున్న జిల్లా కోర్టులకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జిగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. జనరల్ బదిలీలు జరిగే వరకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జీలుగా కొనసాగాలని తెలిపారు. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్‌కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్‌కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్‌కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్‌లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్‌రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ -
ర్యాక్‌లు కొనుక్కోండి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి. బొగ్గు రవాణాలో జాప్యం కారణంగా రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే బొటాబొటిగా అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం సరుకు రవాణా రైళ్లకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బొగ్గు తరలింపు కోసం కనీసం 10 రైల్వే ర్యాక్‌లను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సెప్టెంబర్ వరకూ విద్యుదుత్పత్తి సాఫీగా సాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 70 ర్యాక్‌లు నిల్వ ఉంచండి.. కొరత దృష్ట్యా కనీసం 70 ర్యాక్‌ల బొగ్గును నిల్వ ఉంచాలని ఎన్టీపీసీ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖలు రాసింది. బొగ్గు తరలింపు కోసం పూర్తిగా రైల్వేలపై ఆధారపడొద్దని లేఖలో పేర్కొంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి కాలరీస్, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. రెండు చోట్లా కలిపి రోజూ దాదాపు 10 నుంచి 12 ర్యాక్‌ల బొగ్గు వస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా అక్కడ ప్రస్తుతం 98,566 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3, 4 రోజులకు సరిపోతాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్(కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా 2,99,947 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 15 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 21,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇక్కడ ప్రస్తుతం కేవలం 7,997 మెట్రిక్ టన్నులే ఉంది. వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గి రోజుకు 196.27 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. హిందూజా పవర్ ప్లాంట్ నుంచి కూడా రాష్ట్రానికి విద్యుత్ అందుతోంది. ఇక్కడ రోజుకి 9,600 మెట్రిక్ టన్నులు బొగ్గు వినియోగిస్తుండగా ప్రస్తుతం 30,917 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ నిల్వతో మూడు రోజులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు 20 ర్యాక్‌ల వరకూ కేటాయింపులు పెంచాలని ఏపీ జెన్కో కోరుతోంది. పెరిగిన ఉత్పత్తి, డిమాండ్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి 27 శాతం పెరిగింది. గతేడాది జూన్ నాటికి 12,428.41 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్ నాటికి 15,913.37 మిలియన్ యూనిట్లకు పెరిగింది. మరోవైపు దీనికి తగ్గట్లు బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఆర్థికంగా భారమే.. ‘ర్యాక్‌లు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్రం గతంలోనూ చెప్పింది. సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చుల్లో దాదాపు 10 శాతం రాయితీ కూడా అందిస్తామంటోంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ర్యాక్‌లను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వాటి నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ప్రభుత్వ రంగ థర్మల్ కేంద్రాలు సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రం సూచన మేరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రైవేట్ సంస్థలు ర్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది’ –బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
గతిశక్తి పోర్టల్‌తో విద్యుత్ పంపిణీ లైన్ల అనుసంధానం
న్యూఢిల్లీ: దేశీయంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా ప్రస్తుతం ఉన్న అన్ని అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థ లైన్లను (ఐఎస్టీఎస్) పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) పోర్టల్‌కు అనుసంధానం చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. అలాగే, నిర్మాణంలో ఉన్న లైన్లలో 90 శాతం లైన్లను కూడా అనుసంధానించినట్లు వివరించింది. రూట్ సర్వే తర్వాత మిగతా వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో లైన్ల ప్లానింగ్, టెండరింగ్, అమలు, అనుమతుల ప్రక్రియలు సులభతరం అవుతాయని వివరించింది. హైవేలు, రైల్వేలు, ఏవియేషన్, గ్యాస్, విద్యుత్ పంపిణీ, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాలను అనుసంధానం చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనను మరింత మెరుగుపర్చే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆక్టోబర్‌లో పీఎం గతిశక్తి ఎన్ఎంపీని ఆవిష్కరించారు. -
ఇలా వాడితే.. చాలా ఆదా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న విద్యుత్ కొరత నేపథ్యంలో ఏసీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వినియోగించడం ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. బీఈఈ చెప్పిన అంశాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 80 మిలియన్ టన్నుల రిఫ్రిజిరేషన్ (టీఆర్) వ్యవస్థాపించిన మొత్తం ఎయిర్ కండీషనర్ సామర్థ్యం ఉంది. ఇది 10 సంవత్సరాలలోపు దాదాపు 250 మిలియన్ టీఆర్‌కు చేరుకునే ప్రమాదం ఉంది. 2030 నాటికి ఎయిర్ కండిషనింగ్‌తో దేశంలో విద్యుత్ లోడ్ సుమారు 200 గిగావాట్స్‌కు పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఏసీలకు ఏటా డిమాండ్ దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతంగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారులు తమ ఏసీల్లో డిఫాల్ట్ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేస్తే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని బీఈఈ నివేదికలో పేర్కొంది. పెంచితేనే మంచిది.. ఒక మనిషి 1.5 టన్నుల ఏసీని ఉపయోగిస్తే, అది గంటకు సుమారుగా ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగించి, దాదాపు 0.98 కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 36–37 డిగ్రీల సెల్సియస్. కానీ 18–21 డిగ్రీల సెల్సియస్‌కు ఏసీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఎముకల సమస్య, తలనొప్పి, కళ్లు, చర్మం పొడిబారడం, అల్పోష్ణస్థితి, అధిక రక్తపోటు (బీపీ) వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు సర్దుబాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఏం) విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఎస్ఈసీఎం సూచనలు ► వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. ► ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలి. ప్రతి 30 నుంచి 90 రోజులకు వాటిని శుభ్రపరచడం లేదా కొత్తవాటిని మార్చడం ద్వారా ఏసీ యూనిట్లో గాలి సజావుగా కదులుతుంది. ► వేడిని ఉత్పత్తి చేసే పరికరాలు, ఉపకరణాలను థర్మోస్టాట్‌కు దూరంగా ఉంచాలి. ► సాధ్యమైనంత వరకూ సీలింగ్ ఫ్యాన్లను ఉపయోగించాలి. ► గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, మొబైల్ చార్జర్లు, ఏసీల స్విచ్‌లను ఆఫ్ చేయాలి. -
వెంటాడుతున్న బొగ్గు భయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 14 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విద్యుత్ సంక్షోభంపై సోమవారం సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బొగ్గు సంక్షోభంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మిగులు విద్యుదుత్పత్తి కలిగిన రాష్ట్రాలు కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంక్షోభాన్ని పట్టించుకోకుండా మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజ్ల్లో విక్రయిస్తే ఆ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 15 శాతం కోటా నుంచి విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశమంతా కటకట.. దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకి 18,70,400 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఉన్న 73,16,600 మెట్రిక్ టన్నుల బొగ్గు సగటున నాలుగు రోజులకు సరిపోతుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 116 థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 15 కేంద్రాల్లో బొగ్గు అసలు లేదు. 27 కేంద్రాలలో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉంది. 20 కేంద్రాల్లో రెండు రోజులకు, 21 కేంద్రాల్లో మూడు రోజులకు, మరో 20 కేంద్రాల్లో నాలుగు రోజులకు, ఐదు కేంద్రాల్లో ఎనిమిది రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు మించి బొగ్గు చాలదు. దీంతో దేశవ్యాప్తంగా 1,42,054 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 48,600 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 26,900 మెట్రిక్ టన్నులు ఉండగా ఇది ఒక్క రోజుకే సరిపోతుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 69,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నందున నాలుగు రోజులు విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. సింహాద్రిలో 13,900 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక్క రోజుకే సరిపోనుంది. వీటన్నిటి ఉత్పత్తి సామర్థ్యం 9,370 మెగావాట్లు కాగా ప్రస్తుతం బొగ్గు కొరతతో సగం కూడా విద్యుదుత్పత్తి జరగడం లేదు. -
కరువు నివారణ ప్రాజెక్టులకు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ కరువు నివారణ పథకం, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె.సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విన్నవించారు. బుధవారం ఈ మేరకు ఆయన కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి ఎలక్ట్రో–మెకానికల్ కాంపోనెంట్ కింద రూ.12,012 కోట్లు, వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు ఎలక్ట్రో–మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 3,008 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ లిమిటెడ్‌ను కోరామని ఎంపీ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ, మార్కెట్ ధరకే రుణం ఇచ్చి రాష్ట్రంపై ఆర్థికంగా అదనపు భారం లేకుండా చూడాలని, ఆ మేర ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని విజయసాయిరెడ్డి కోరారు. -
సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు
సాక్షి, అమరావతి: వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు. ప్రజలకు ఏ మాత్రం భారం కాకుండా విద్యుత్ రంగాన్ని కాపాడాలనే ఆయన ఆలోచనలు అభినందనీయమన్నారు. సంస్కరణ దిశగా అడుగులేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ సాయిప్రసాద్ సోమవారం ఆర్కే సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ వివరాలను శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సీఎం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రికి శ్రీకాంత్ వివరించారు. వ్యవసాయ సబ్సిడీని రైతు ఖాతాలోకే ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రైతుపై భారం పడకుండా చేస్తున్నామని మంత్రికి తెలియజేశారు. ► నగదు బదిలీ విషయంలో వైఎస్ జగన్ నిర్ణయం సాహసోపేతమని, రైతుకు మేలు చేయాలనే ఆలోచన అభినందనీయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ ముందడుగును అన్ని రాష్ట్రాలకు వివరించి చెబుతామన్నారు. ఇలాంటి డైనమిక్ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కొనియాడారు. ► రైతుల కోసం రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల గురించి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ప్రాజెక్టుకు అవసరమైన చేయూతనిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల విద్యుత్ సంస్థలపై(డిస్కంలు) పడే ఆర్థిక భారంపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 12న రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లు, డిస్కంల సమస్యలపై సంప్రదింపుల కోసం నవంబర్ 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి శాఖ (ఎంఎన్ఆర్ఈ) కార్యదర్శి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలి సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల డిస్కంలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలును కేంద్రం తప్పనిసరి చేయడం వల్ల డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇలాంటి కరెంటు కొనాలంటే యూనిట్‌కు రూ.3.50 చొప్పున పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
కొత్తగూడెంలో మరో విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కానుంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల (ఎంవీ) సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్ణయించింది. అధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్న కాలం చెల్లిన పాత విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్)లోని 720 మెగావాట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఏబీసీ) ప్లాంట్‌ను ఈ ఏడాది చివరిలోగా మూసివేస్తామని జెన్కో హామీ ఇచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా నాలుగు 60 మెగావాట్ల యూనిట్లు, మరో నాలుగు 120 మెగావాట్ల యూనిట్లు కలిపి 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల కిందట దశల వారీగా జెన్కో నిర్మించింది. ఈ విద్యుత్ కేంద్రాల జీవిత కాలం ముగిసిపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఈ ప్లాంట్లు బొగ్గును అధికంగా వినియోగించుకుని తక్కువ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి కానున్న నేపథ్యంలో కాలం చెల్లిన ఏబీసీ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు జెన్కో సిద్ధమైంది. మరికొన్ని నెలల్లో ఏడో దశ విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను మూసివేసి వాటి స్థానంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సహాయంతో కొత్తగా 800 మెగావాట్ల ఒకే యూనిట్ నిర్మించాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో ఏడో దశ ప్లాంట్‌లో ఉత్పత్తి కేటీపీఎస్ 800 మెగావాట్ల ఏడో దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గత నెల చివరికి వి ద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్కో గడువు పెట్టుకు న్నా ఇంకా పూర్తి కాలేదు. జూన్ చివరికల్లా ఈ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి కానుందని, సెప్టెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయని జెన్కో ప్రాజెక్ట్స్ అధికారులు తెలిపారు. కూల్చివేతకు ఏడాదిన్నర.. కొత్తగూడెం ఏబీసీ విద్యుత్ కేంద్రం మూసివేసి అదే స్థలంలో కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జెన్కో చర్యలు ప్రారంభించనుంది. పాత విద్యుత్ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను కూల్చివేసేందుకు దాదాపు ఏడాదిన్నర వరకు సమయం పట్టనుందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పాత విద్యుత్ కేంద్రాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కేంద్రాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు సులువుగా, సత్వరంగా లభించనున్నాయి. మూసివేయనున్న విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన స్థలం, నీటి వనరులు, బొగ్గు లింకేజీలనే కొత్త విద్యుత్ కేంద్రం అవసరాలకు వినియోగించనుండటంతో అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి కానుంది. -
ప్రభుత్వాఫీసుల్లో ఎలక్ట్రిక్ కార్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె ప్రాతిపాదికన ఏర్పాటు చేసుకున్న డీజిల్, పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఇటు నిర్వహణ సమస్యలను పరిష్కరించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తోడ్పడుతుందని స్పష్టం చేస్తోంది. పర్యావరణ హితం కోసం.. దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. చమురు దిగుమతులను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని ఎన్టీపీసీ, ఆర్ఈసీ, పీఎఫ్సీ, పవర్‌గ్రిడ్‌ల సంస్థల జాయింట్ వెంచర్‌గా ‘ఈఈఎస్ఎల్’ఏర్పాటైంది. దేశంలో ఇంధన పొదుపు, ఇంధన భద్రత రంగాల్లో కీలక చర్యలు చేపడుతున్న ఈ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు అద్దె ప్రాతిపాదికన ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే టాటా మోటార్స్ కంపెనీ నుంచి 10 వేల ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది. రూ.40 వేల నెలవారీ అద్దెపై ఆరేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఏటా 10 శాతం అద్దె పెంపు ఉంటుందని తెలిపింది. అద్దె కార్లతో పాటు అందించే సేవలివీ.. - ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ కోసం సంబంధిత కార్యాలయాల్లోనే చార్జింగ్ కేంద్రాలు. - వీటిని నడిపేందుకు సుశిక్షితులైన డ్రైవర్ల సేవలు. - ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కోరిన మేరకు ‘పికప్ అండ్ డ్రాప్ సేవలు. - ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ షెడ్యూల్, చార్జింగ్, మరమ్మతులు, ఇతర నిర్వహణ. - డ్రైవర్లకు ఏటా శిక్షణ కార్యక్రమాలు. - ఒకవేళ ఆ అద్దె కార్లను ప్రభుత్వ కార్యాలయాలే కొనుగోలు చేయవచ్చు. ఈ ఈఎస్ఎల్ బిడ్డింగ్‌లో కొన్న ధరకు అదనంగా 5 శాతం చెల్లిస్తే.. కారును, ఐదేళ్ల పాటు సర్వీస్ సేవలను అందిస్తారు. -
మరో 2,500 మెగావాట్లు అవసరం
- రాష్ట్ర విద్యుత్ సమస్యలపై సమీక్షలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ - కేంద్ర విద్యుత్ మంత్రి గోయల్‌తో చర్చిస్తామని వెల్లడి - రైతులకు కనీసం 12 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్య లకు త్వరలో పరిష్కారం లభించేలా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంగళ వారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రా నికి మరో 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, రైతులకు కనీసం 12 గంటలు విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేశమంతటా 24 గంటల విద్యుత్ అందించాలన్నది ప్రధాని మోదీ సంక ల్పమని తెలిపారు. హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్లు నిర్మించాలని దత్తాత్రేయ చెప్పగా.. అందుకు రూ.350 కోట్లు అవసరమ వుతాయని అధికారులు తెలిపారు. వ్యవసా యానికి, వ్యవసాయేతర అవసరాలకు విడి విడిగా విద్యుత్ సరఫరా ఉండాలని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 9,150 గ్రామాల్లో 5.65 లక్షల ఇళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి రూ.3 వేల చొప్పున సబ్సిడీ కల్పించడానికి కేంద్రం రూ.1,107 కోట్లు కేటాయించిందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌కు సహాయం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజ నలో భాగంగా నాణ్యమైన విద్యుత్ అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ సంస్థ ద్వారా మూడేళ్లలో రూ.30 వేల కోట్లను రాష్ట్రానికి కేటాయించామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర అవసరాలకు ప్రత్యేక లైన్లకు రూ.2,300 కోట్లు అవసరమని, స్మార్ట్ మీటర్ల కోసం రూ.788 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరించారని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్ల ద్వారా శక్తిని పొదుపు చేసేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ.1,543 కోట్లు మం జూరు చేశామన్నారు. సూర్యాపేటలో 400/ 200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనుల కోసం, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 400/200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనులకు రూ.1,107 కోట్లు టీఎస్ ట్రాన్స్‌కోకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కల్లోలం సృష్టించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అశాంతితో కొట్టుమిట్టాడుతూ అభివృద్ధి ఎజెండాను కాదని.. మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఆరోపణలు చేయడం సముచితం కాదని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలీసులను అప్రతిష్టపాలు చేయడం సరైనది కాదని, జాతికి సంబంధించిన అంశంపై సంయమనంతో మాట్లాడాలన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత లెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దిగ్విజయ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.