న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్‌జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది.
వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్‌జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment