power generation plants
-
పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే బొగ్గు లేదా లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లు తప్పనిసరిగా తమ ప్లాంటు సామర్థ్యంలో కనీసం 40 శాతం పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ అలా చేయలేకపోతే అంత స్థాయిలో హరిత శక్తిని కొనుగోలు చేయాలని పేర్కొంది. సదరు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 40 శాతం మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ (ఆర్జీవో) 2016 టారిఫ్ పాలసీని కేంద్ర విద్యుత్ శాఖ ఈ మధ్యే సవరించింది. వీటి ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించే (సీవోడీ) ప్లాంట్లు 2025 ఏప్రిల్ 1 నాటికి 40 శాతం ఆర్జీవో నిబంధనను పాటించాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 దాటిన తర్వాత వచ్చే ప్లాంట్లు వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచే దీన్ని పాటించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన దానికి అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని బట్టి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్లకు కొంత మినహాయింపు ఉంటుంది. 2030 నాటికల్లా 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారత్ భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. -
Telangana: ఇక నీటితోపాటు కరెంటు ప్రవాహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన కొత్త రుణాల సమీకరణ అసాధ్యంగా మారిన నేపథ్యంలో.. సొంత ఆదాయ వనరుల సమీకరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిరుపయోగంగా ఉన్న వాలంతరి, ఇంజనీరింగ్ ల్యాబ్ వంటి సంస్థలకి చెందిన 100 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని జలాశయాలు, సాగునీటి కాల్వలపై భారీ ఎత్తున సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు, కాల్వలపై మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు, నదులపై మరో 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలు కలిపి 13,800 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి అవకాశముందని ..తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం రానుందని, పీపీపీ పద్ధతిలో ఏటా రూ.431 కోట్లను రాయల్టీగా పొందవచ్చని అంచనా వేసింది. జలాశయాలతో రూ.100 కోట్ల ఆదాయం రాష్ట్రంలోని 16 జలాశయాలు 1,675 చ.కి.మీల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. చ.కి.మీటర్‌కు 40 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 10 శాతం విస్తీర్ణంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఒక మెగావాట్‌కి రూ.5.5 కోట్లు చొప్పున 6,700 మెగావాట్లకు రూ.36,850 కోట్ల వ్యయం కానుంది. ఏటా 10వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, రూ.3 వేల కోట్ల ఆదాయం రానుంది. జలాశయాలను అద్దెకు ఇచ్చినందుకు ప్రతి యూనిట్‌పై 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.100 కోట్లను నీటిపారుదల శాఖ పొందవచ్చు. కాల్వలతో రూ.31 కోట్లు రాష్ట్రంలో 40 వేల కి.మీ సాగునీటి కాల్వలుండగా, మరో 40 వేల కి.మీ కాల్వలు నిర్మాణంలో ఉన్నాయి. 8 వేల ఎకరాల్లోని కాల్వపై పీపీపీ పద్ధతిలో 2వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.9వేల కోట్ల వ్యయం కానుండగా, ఏటా 3,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. యూనిట్ విద్యుత్‌ను రూ.2.5 చొప్పున విక్రయించినా కనీసం ఏడాదికి రూ.775 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రైవేటు డెవలపర్ల నుంచి యూనిట్‌కి 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.31 కోట్లను నీటిపారుదల శాఖ అర్జించవచ్చు. పంప్డ్ స్టోరేజీతో రూ.300 కోట్ల రాయల్టీ ములుగు అడవుల్లో 3,960 మెగావాట్లు, నిర్మల్ అడవుల్లో 1,200 మెగావాట్లు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుంది. అక్కడి జలాశయాలను ఆధారం చేసుకుని 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మెగావాట్‌కి రూ.6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల చొప్పున రూ.35 వేల కోట్ల వ్యయం కానుంది. ఏటా 30,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, యూనిట్‌కి రూ.3 ధరతో ఏటా రూ.9,200 కోట్ల ఆదాయం రానుంది. యూనిట్‌కు 10 పైసలను ప్రైవేటు డెవలర్ల నుంచి రాయల్టీగా పొందినా ఏటా రూ.300 కోట్లు రానున్నాయి. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
వారానికోసారి కట్టించేసుకోండి
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా బకాయి పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జెన్కోలకు ఊరట కలిగేలా డిస్కంల నుంచి వారం వారం పేమెంట్లను స్వీకరించాలని సూచించింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీ రుణభారంతో కష్టనష్టాల్లో ఉన్న డిస్కంలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లేనని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. జెన్కోలకు పెరిగిన ఖర్చులు.. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సే్ఛంజీ)లో విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు పీక్ అవర్స్‌లో యూనిట్ ధర రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లు దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ దిగుమతి బొగ్గును కలిపి వాడాలని, విదేశీ బొగ్గు సరఫరా ఈ నెల నుంచే మొదలవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. ఒకప్పుడు టన్ను బొగ్గు రూ.4వేల నుంచి రూ.7 వేలు ఉండేది. కానీ ఇప్పుడది రూ.19 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. ఇంత ఖర్చవుతున్నా డిస్కంల నుంచి వస్తున్నది మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దీంతో వారం వారం బిల్లులు వసూలు చేస్తే, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులకు వాడుకోవచ్చనేది కేంద్రం భావన. డిస్కంలకు భారమే..అయినా.. కేంద్రం చెప్పిన దాని ప్రకారం..డిస్కంలు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రొవిజనల్ బిల్లులో కనీసం 15 శాతం ఒక వారంలోగా చెల్లించాలి. ఒకవేళ అలా జరగకపోతే విద్యుత్ జెన్కోలు వారి ఉత్పత్తిలో 15 శాతాన్ని పవర్ ఎక్సే్ఛంజీలకు విక్రయించుకోవచ్చు. పవర్ ప్లాంట్లు సాధారణంగా డిస్కంలతో దీర్ఘకాల (లాంగ్ టెర్మ్) అగ్రిమెంట్ల చేసుకుంటాయి. ఫిక్స్డ్ రేట్లనే కొనసాగిస్తుంటాయి. అయితే దిగుమతుల వల్ల వ్యయాలు పెరిగితే ఆ భారాన్ని డిస్కంలకు బ దిలీ చేయొచ్చు. ఈ లెక్కన విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత ఎక్కువ భారం పడనుంది. నిజానికి రుణభారం వల్ల డిస్కంల నుంచి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సరైన సమయంలో చెల్లింపులు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ డిస్కంలు సరైన సమయానికి బిల్లులు చెల్లిస్తే మాత్రం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఊరట కలుగుతుంది. అలాగే డిస్కంలకు కూడా ఊరట కలిగించేలా ఇటీవల కేంద్రం రుణ బకాయిలను 48 నెలల ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. -
‘కోల్’కుంటున్న విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: బొగ్గు సంక్షోభం నుంచి దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మెల్లగా కోలుకుంటున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వారం రోజులుగా దేశవ్యాప్తంగా మూడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెరుచుకోవడంతో పాటు కొరత ఎదుర్కొంటున్న కేంద్రాల సంఖ్య తగ్గడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి బొగ్గు కొరత తీవ్రమైంది. ఈ నెల 12 నాటికి 116 కేంద్రాల్లో బొగ్గు నిల్వల సమస్య తలెత్తింది. 18 కేంద్రాలు మూతపడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికంటే ముందుగా స్పందించి బొగ్గు కొరత నివారణకు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా ఇతర అవసరాలకు బొగ్గు సరఫరా నిలిపివేసింది. ఫలితంగా బొగ్గు నిల్వల్లో పురోగతి మొదలైంది. సీఈఏ మంగళవారం నాటి నివేదిక ప్రకారం.. మూతపడ్డ కేంద్రాల్లో వారం రోజుల్లో మూడు కేంద్రాలు ఉత్పత్తి ప్రారంభించాయి. 15 కేంద్రాలు ఇంకా మూతపడే ఉన్నాయి. 22 కేంద్రాల్లో ఒక రోజుకు, 19 కేంద్రాల్లో రెండు రోజులకు, 18 కేంద్రాల్లో మూడు రోజులకు, 15 కేంద్రాల్లో నాలుగు రోజులకు, 10 కేంద్రాల్లో ఐదు రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తంగా 1,30,184 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 107 కేంద్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మూతబడ్డ 135 కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే 1,65,066 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో సాధారణ స్థాయికి.. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 48,100 మెట్రిక్ టన్నుల బొగ్గు నాలుగు రోజులకు సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు కేంద్రంలో ఉన్న 27 వేల మెట్రిక్ టన్నులు ఒక రోజుకు, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 58,800 మెట్రిక్ టన్నులు మూడు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు వివిధ మార్గాల ద్వారా గతంలో ప్రతిరోజూ వచ్చినట్టుగానే 14 ర్యాకుల బొగ్గు ప్రస్తుతం వస్తోంది. బొగ్గు కొరతను అధిగమించాం బొగ్గు కొరతను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు విజయవంతంగా అధిగమించిందని, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తోందని ఇంధన శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. అనేక రాష్ట్రాలు బొగ్గు కొరతతో బాధపడుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి చేసిన ప్రయత్నాలతో వినియోగదారులు సంతృప్తి చెందారని పేర్కొంది. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి స్వల్పకాలిక టెండర్లను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. -
సముద్ర అలలతో విద్యుదుత్పత్తి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ఉన్న విశాల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ)తో ముందస్తు సాధ్యాసాధ్యాల అధ్యయనం (ప్రీ ఫీజుబిలిటీ స్టడీ) కూడా పూర్తి చేశారు. ఈ మేరకు ఎన్‌ఐవోటీతో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర, పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ఒప్పందం చేసుకుంది. మరో 10 రోజుల్లో ఈ సంస్థతో మరోసారి చర్చించిన అనంతరం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా సదరు ప్రాజెక్టును చేపట్టవచ్చా? లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత ముందడుగు పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఎక్కడ, ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేయవచ్చనే నిర్ణయం కూడా తీసుకుంటామని నెడ్‌క్యాప్ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అధ్యయనం పూర్తి: ఇప్పటికే సముద్ర అలలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఇజ్రాయెల్‌లో ఉన్నాయి. దేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ప్రారంభించారు. రాష్ట్రంలో తీరం వెంబడి ఏయే ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న విషయంపై ఎన్ఐవోటీ ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తి చేసింది. తీరంలో 25 మీటర్ల లోతు ఉండడంతో పాటు అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఎన్ఐవోటీ గుర్తించింది. సముద్రంలో వచ్చే భారీ అలల ధాటితో టర్బైన్లను తిరిగేలా చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ఉత్పత్తికి అనేక పద్ధతులు అమల్లో ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఆస్కిలేటింగ్ వాటర్ కాలమ్ (ఓడబ్ల్యూసీ) పద్ధతిని అమలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12 ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని స్పష్టం చేసింది. పాత సోనాపూర్, మేఘవరం, నారాయణ గజపతి రాజాపురం, విశాఖపట్నం, కుమారపురం, నీళ్లరేవు, కాలీపురం, ఎదురుమండి, కొత్తపట్నం, కావలి, కోట పులికాట్ ప్రాంతాల్లో సముద్ర అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తేలింది. అయితే, మరింత అధ్యయనం తర్వాతే ఏయే ప్రాంతాల్లో ఎంతమేర విద్యుత్ ఉత్పత్తి చేయచ్చన్న విషయం తేలనుంది. పూర్తిస్థాయి అధ్యయనం చేస్తాం సముద్ర అలల ఆధారంగా పనిచేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నాం. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతమేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది, ఇందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశాలను పరిశీలిస్తాం. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇలా చేసే విద్యుత్ ఉత్పత్తికి ఇంధనం ఖర్చు ఉండదు. కాలుష్య సమస్య కూడా ఉండదు. – కేకే రాజు, చైర్మన్, నెడ్‌క్యాప్ -
వ్యర్థానికి అర్థం.. పర్యావరణ హితం
సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి హానిలేకుండా ఉండేలా.. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు గుంటూరు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. నెలరోజుల్లో ఈ ప్లాంటును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,200 టన్నుల చెత్తను (నగరాలు, పట్టణాల్లో సేకరించే వ్యర్థాలను) ఉపయోగించి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు, విశాఖపట్నంలలో రోజుకు 1,200 టన్నుల చెత్త సామర్థ్యం గల ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నాయుడుపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ డంప్ యార్డు కోసం 51.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీన్లో 15.50 ఎకరాల్లో రూ.340 కోట్లతో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు. 600 టన్నుల చెత్తను మండించే సామర్థ్యంగల రెండు బాయిలర్లు (మొత్తం 1,200 టన్నులు) ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 1,650 టన్నులకు విస్తరించే అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు కోసం 10 శాతం మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు, బయో కెమికల్ వ్యర్థాలు కలవకుండా చెత్తను వేరుచేసి ఉచితంగా ప్లాంటుకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్లాంటుకు మూడు నగరాలు, ఐదు మునిసిపాలిటీల నుంచి చెత్తను సరఫరా చేయనున్నారు. చెత్త నుంచి వచ్చే విద్యుత్తుకు ఒక యూనిట్‌కు రూ.6 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాతన యూరప్ సాంకేతికతతో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మండించేటప్పుడు వచ్చే పొగతో పర్యావరణానికి హానిలేకుండా ట్రీట్ చేస్తారు. 25 సంవత్సరాల తరువాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 70 మందికి, పరోక్షంగా 60 మందికి ఉపాధి కలుగుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు ఈ ప్లాంటు నిర్మాణంతో పర్యావరణానికి ఎంతో మేలు కలగనుంది. ఒక టన్ను చెత్త నుంచి 2,250 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనికంటే 23 రెట్లు హానికలిగించే మిథేన్ 150 కిలోలు ఉత్పత్తి అవుతుంది. వీటితోపాటు లీచెడ్ ద్రావణం 50 లీటర్లు వస్తుంది. ఈ ద్రావణం భూమిలో ఇంకితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతోపాటు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ ప్లాంటు నిర్మాణంతో ఈ సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. ఈ ప్లాంటులో భాగంగా వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు పూర్తికావాల్సి ఉంది. వెంగళాయపాలెం నుంచి ప్లాంటుకు నీటిని తరలించే పైపులైను పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. కొందరు కార్మికులు కరోనా బారినపడ్డారు. ప్రారంభించేందుకు సన్నాహాలు ప్లాంటు నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక బాయిలర్ ద్వారా 15 రోజులు ట్రయల్ రన్ నిర్వహించారు. చెత్తను 15 రోజుల పాటు గుంటూరు కార్పొరేషన్ నుంచి ప్లాంటుకు పంపాం. కోవిడ్ నుంచి ఉపశమనం కలుగగానే ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఈ ప్లాంటు పూర్తయితే గుంటూరుతో పాటు చుట్టుపక్కల నగరాలు, పట్టణాలకు ఉపయోగం. ప్రధానంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది. – చల్లా అనురాధ,నగర కమిషనర్, గుంటూరు ప్లాంటు పనులు పూర్తయ్యాయి.. ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటర్ పైపులైను, సబ్‌స్టేషన్ పనులు కొద్దిగా పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తోంది. పలువురు కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పరిస్థితులు అనుకూలిస్తే నెలరోజుల్లోపు ప్లాంటును ప్రారంభిస్తాం. ఈ ప్లాంటు ప్రారంభమైతే పర్యావరణానికి హానికలగకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎంవీ చారి, ప్రెసిడెంట్, ఏపీ ప్రాజెక్ట్స్ -
గోదావరిపై కొత్త జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరినది మీద కొత్త జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ జెన్కో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కంతనపల్లి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంల వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ముసాయిదాను సిద్ధం చేసింది. కంతనపల్లిలో 280 మెగావాట్లు, దుమ్ముగూడెంలో 320 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన డిజైన్లు.. అంచనా వ్యయాన్ని జెన్కో సిద్ధం చేసింది. గోదావరిపై నిజామాబాద్‌లోని పోచంపాడు మినహా ఎక్కడా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు లేవు. వరద నీరు వచ్చినప్పుడే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కంతనపల్లి, దుమ్ముగూడెంలవద్ద ప్లాంట్లు నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. కానీ.. ఈ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటంతో విద్యుత్ ప్లాంట్లు ప్రతిపాదనల్లోనే ఉండిపోయాయి. నాలుగేళ్ల కిందట ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులు సైతం నీటి పారుదల విభాగమే చేపడుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించే ప్రణాళికల్లో భాగంగా ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. దీంతో నీటిపారుదల విభాగం ఇటీవలే సంబంధిత ముసాయిదాలను సిద్ధం చేయాలని టీఎస్ జెన్కో అధికారులను కోరినట్లు తెలిసింది. నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ రెండు ప్రాజెక్టులతో పాటు.. అందులో అంతర్భాగమైన విద్యుత్ ప్లాంట్లపై ఈ వారంలోనే సమీక్ష జరపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కంతనపల్లి ప్రాజెక్టు టెండర్ల దశలోనే ఉంది. దీంతో ప్లాంట్ల నిర్మాణాన్ని నీటిపారుదల విభాగం చేపడుతుందా.. లేక టీఎస్ జెన్కోకు అప్పగిస్తుందా అనేది ఈ సమీక్ష సందర్భంగా వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగూడెం ప్లాంట్ ఏడో దశలో భాగంగా బీహెచ్ఈఎల్ చేపట్టిన 800 మెగావాట్ల ప్లాంటుకు కేంద్ర అటవీ శాఖ లైన్ క్లియర్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ఎన్టీపీసీ.. స్థలాన్వేషణ
4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అంతర్గాంలో వేరుు ఎకరాల ప్రభుత్వ భూమి సింగరేణిభూమి వినియోగంపై అనుమానాలు గోదావరిఖని : రామగుండంలో కొత్తగా నిర్మించనున్న 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి కలిసి రామగుండంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. తొలి ప్లాంట్‌ను 39 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలనే విషయమై ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ కోసం అన్వేషణ ప్రారంభించింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు వందల ఎకరాల స్థలం అవసరమవుతుంది. రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ ప్లాంట్‌కు సమీపంలోనే ఈ స్థలాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. మండలంలోని అంతర్గాంలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. అందులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలనే ఆలోచన తో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ స్థలంలో ఎన్టీపీసీ ప్లాంట్లు పెడితే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది కుదరని పక్షంలో సింగరేణి స్థలాన్ని ఇందుకు వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వపరంగా సింగరేణి స్థలాన్ని ఇప్పించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ఎన్టీపీసీ అధికారులకు హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ అవసరం వస్తే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు వెలికితీసిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఓసీపీ జీవితకాలం మరో ఆరేళ్లుంది. దానిని కేటాయించేందుకు ఇప్పుడే హామీ ఇస్తారా అన్న అనుమానంగా ఉంది. సదరు స్థలాన్ని కేటాయించినట్లయితే.. ఓసీపీలో భూగర్భంలో మట్టిని వెలిసితీసేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో భూమి పొరల్లో గట్టితనం ఉండదు. మందుగుండు పేలుడు ధాటికి మట్టి పలుచగా మారిపోతుంది. బొగ్గును వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో మట్టిని నింపినప్పటికీ గట్టితనం ఉండదు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఇలాంటి భూమిలో చేపట్టడం సాధ్యపడదు. విద్యుత్ ప్లాంట్‌లో చిమ్నీలు, బాయిలర్లు, ఇతర ఎత్తై కట్టడాలను నిర్మించాలంటే భూమి గట్టితనంతో ఉండాలి. దీంతో ఎన్టీపీసీ అధికారులు మేడిపల్లి ప్రాంతంలోని భూమిని తిరస్కరించే అవకాశాలున్నాయి. ఒకవేళ సింగరేణి సంస్థ ద్వారా మైనింగ్ జరిగిన ప్రాంతంలో కాకుండా కొత్త ప్రాంతంలో భూసేకరణ జరిపించి ఎన్టీపీసీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే భూసేకరణ సింగరేణికి సమస్యగా మారింది. భూగర్భంలో బొగ్గునిక్షేపాలున్న చాలాచోట్ల భూసేకరణకు స్థానిక ప్రజలకు అడ్డుచెప్పడంతో బొగ్గుగనులు, ఓసీపీలను యాజమాన్యం ప్రారంభించలేకపోతోంది. ఈ తరుణంలో సింగరేణి సంస్థకు 400 ఎకరాలు సేకరించడం తలనొప్పిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలో ఎన్టీపీసీ యాజమాన్యమే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం ఇప్పటినుంచే రహస్యంగా అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
చెత్త సమస్యకు చెక్
దేశంలోని 500 నగరాల్లో ‘బయో మెథానేషన్’ వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు బెంగళూరు కేఆర్ మార్కెట్లో ఏర్పాటుకు శంకుస్థాపన కేంద్ర మంత్రి అనంత కుమార్ బెంగళూరు : దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి కేఆర్ మార్కెట్లో రూ. 102 కోట్లతో ఆ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేఆర్ మార్కెట్ నుంచి రోజూ ఐదు వేల కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయన్నారు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టే సత్యనారాయణ, బెంగళూరు నగరంలోని ఎంపీలు, శాసన సభ్యులు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సూచిం చామన్నారు.