సాక్షి, హైదరాబాద్: గోదావరినది మీద కొత్త జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ జెన్‌కో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కంతనపల్లి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంల వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ముసాయిదాను సిద్ధం చేసింది. కంతనపల్లిలో 280 మెగావాట్లు, దుమ్ముగూడెంలో 320 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు.. అంచనా వ్యయాన్ని జెన్‌కో సిద్ధం చేసింది.
గోదావరిపై నిజామాబాద్‌లోని పోచంపాడు మినహా ఎక్కడా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు లేవు. వరద నీరు వచ్చినప్పుడే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కంతనపల్లి, దుమ్ముగూడెంలవద్ద ప్లాంట్లు నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. కానీ.. ఈ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవటంతో విద్యుత్ ప్లాంట్లు ప్రతిపాదనల్లోనే ఉండిపోయాయి. నాలుగేళ్ల కిందట ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులు సైతం నీటి పారుదల విభాగమే చేపడుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించే ప్రణాళికల్లో భాగంగా ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. దీంతో నీటిపారుదల విభాగం ఇటీవలే సంబంధిత ముసాయిదాలను సిద్ధం చేయాలని టీఎస్ జెన్‌కో అధికారులను కోరినట్లు తెలిసింది. నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఈ రెండు ప్రాజెక్టులతో పాటు.. అందులో అంతర్భాగమైన విద్యుత్ ప్లాంట్లపై ఈ వారంలోనే సమీక్ష జరపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దుమ్ముగూడెం ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కంతనపల్లి ప్రాజెక్టు టెండర్ల దశలోనే ఉంది. దీంతో ప్లాంట్ల నిర్మాణాన్ని నీటిపారుదల విభాగం చేపడుతుందా.. లేక టీఎస్ జెన్‌కోకు అప్పగిస్తుందా అనేది ఈ సమీక్ష సందర్భంగా వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగూడెం ప్లాంట్ ఏడో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్ చేపట్టిన 800 మెగావాట్ల ప్లాంటుకు కేంద్ర అటవీ శాఖ లైన్ క్లియర్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
గోదావరిపై కొత్త జల విద్యుత్ కేంద్రాలు
Published Fri, Jan 23 2015 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM
Advertisement
Advertisement