అబ్బురం.. వించ్‌ వే | Machhakund Hydro Electric Project Build Winch Way | Sakshi
Sakshi News home page

అబ్బురం.. వించ్‌ వే

Published Sun, Jun 12 2022 11:40 PM | Last Updated on Sun, Jun 12 2022 11:40 PM

Machhakund Hydro Electric Project Build Winch Way - Sakshi

ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో వేల అడుగుల ఎత్తులో కొండల మధ్యనున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణం చారిత్రాత్మకం. ఇక్కడికి ఉద్యోగులు, కార్మికులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వించ్‌ వేకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1948లో ఏర్పాటుచేసిన నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిదిగా చెబుతుంటారు. 

ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణ సమయంలో అవసరమైన సామగ్రి, యంత్రాలను తరలించేందుకు 2,750 అడుగుల ఎత్తులో వించ్‌ హౌస్‌ను నిర్మించారు. ఇందుకు అప్పటిలో ప్రభుత్వం రూ.60 లక్షలు వెచ్చించినట్టు అధికారవర్గాలు చెబుతుంటాయి. 1955 ఆగస్టు 19న విద్యుత్‌ కేంద్రానికి అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్‌ ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వించ్‌ ద్వారా చేరుకుంటున్నారు.రెండుకొండల నడుమ లోయలో ఉండే మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి దిగేందుకు 18 నిమిషాలు, పైకి వచ్చేందుకు 13 నిమిషాలు సమయం పడుతోంది. 

ఆరోజుల్లోనే జీపీఎస్‌.. 
వించ్‌ ఏర్పాటు చేసినప్పుడే రోప్‌వేలో ఎక్కడుందో తెలుసుకునేలా జీపీఎస్‌ను ఏర్పాటు చేయడం విశేషం. వించ్‌ కదలిక బట్టి జీపీఎస్‌ సూచిక కదులుతూ ఉంటుంది. వించ్‌ ఎక్కడుందో సూచించే ముల్లు మలుపుల దగ్గరకు చేరుకోగానే కంట్రోల్‌రూమ్‌లోని డ్రైవర్‌ వేగాన్ని నియంత్రిస్తుంటారు. గతంలో పర్యాటకులు, సిబ్బంది వించ్‌లో ప్రయాణించేవారు.అప్పుడు అధికారులు పర్యాటకుల వించ్‌ ప్రయాణానికి అనుమతి ఇచ్చేవారు.  

సందర్శకుల నిరాశ 
గత కొన్నేళ్లుగా వించ్‌ ప్రయాణానికి అనుమతులు ప్రాజెక్టు అధికారులు ఇవ్వడం లేదు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు వించ్‌ను చూసి ఆనందపడుతున్నారు తప్ప ప్రమాణించేందుకు అవకాశం లేకపోవడం తీవ్ర నిరాశ చెందుతున్నారు. వించ్‌ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. వించ్‌ ప్రయాణ విషయాన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, ఉన్నతాధికారుల అదేశాలతో అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు. 

దేశంలో రెండే.. 
దేశంలో రెండే రెండు చోట్ల వించ్‌వేలు ఉన్నాయి. ఇక్కడి వించ్‌వే మొదటిది కాగా, రెండోది తమిళనాడు రాష్ట్రంలోని పళని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ఉంది. భారీ సామర్థ్యం ఉన్న  మోటార్‌ సాయంతో స్టీల్‌ రోప్‌ ద్వారా వించ్‌ని లోయలోకి దించడం, ఎక్కించడం జరుగుతుంది. స్టీల్‌ రోప్‌ను ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తుంటారు. దీనికి సంబంధించిన డ్రైవర్‌ కంట్రోల్‌ రూంలో ఉండి వించ్‌ను నడుపుతుంటారు.

ట్రాలీగార్డు మలుపుల దగ్గర వించ్‌ పట్టాలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వించ్‌ ఏర్పాటు చేసి ఇప్పటికి 74 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి వించ్‌ అదుపుతప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిబ్బంది కేవలం గాయాలతోనే బయటపడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement