వ్యర్థానికి అర్థం.. పర్యావరణ హితం | Power generation from garbage | Sakshi
Sakshi News home page

వ్యర్థానికి అర్థం.. పర్యావరణ హితం

Published Sat, May 15 2021 3:45 AM | Last Updated on Sat, May 15 2021 3:45 AM

Power generation from garbage - Sakshi

గుంటూరు జిల్లా నాయుడు పేటలో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్లాంటు

సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి హానిలేకుండా ఉండేలా.. చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ పనులు గుంటూరు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. నెలరోజుల్లో ఈ ప్లాంటును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,200 టన్నుల చెత్తను (నగరాలు, పట్టణాల్లో సేకరించే వ్యర్థాలను) ఉపయోగించి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్‌ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు, విశాఖపట్నంలలో రోజుకు 1,200 టన్నుల చెత్త సామర్థ్యం గల ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నాయుడుపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ డంప్‌ యార్డు కోసం 51.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీన్లో 15.50 ఎకరాల్లో రూ.340 కోట్లతో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు. 600 టన్నుల చెత్తను మండించే సామర్థ్యంగల రెండు బాయిలర్‌లు (మొత్తం 1,200 టన్నులు) ఏర్పాటు చేశారు.

ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 1,650 టన్నులకు విస్తరించే అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు కోసం 10 శాతం మార్కెట్‌ విలువతో భూమిని జిందాల్‌ సంస్థకు లీజుకు ఇచ్చారు. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు, బయో కెమికల్‌ వ్యర్థాలు కలవకుండా చెత్తను వేరుచేసి ఉచితంగా ప్లాంటుకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్లాంటుకు మూడు నగరాలు, ఐదు మునిసిపాలిటీల నుంచి చెత్తను సరఫరా చేయనున్నారు. చెత్త నుంచి వచ్చే విద్యుత్తుకు ఒక యూనిట్‌కు రూ.6 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాతన యూరప్‌ సాంకేతికతతో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మండించేటప్పుడు వచ్చే పొగతో పర్యావరణానికి హానిలేకుండా ట్రీట్‌ చేస్తారు. 25 సంవత్సరాల తరువాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 70 మందికి, పరోక్షంగా 60 మందికి ఉపాధి కలుగుతుంది. 

పర్యావరణానికి ఎంతో మేలు
ఈ ప్లాంటు నిర్మాణంతో పర్యావరణానికి ఎంతో మేలు కలగనుంది. ఒక టన్ను చెత్త నుంచి 2,250 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతుంది. దీనికంటే 23 రెట్లు హానికలిగించే మిథేన్‌ 150 కిలోలు ఉత్పత్తి అవుతుంది. వీటితోపాటు లీచెడ్‌ ద్రావణం 50 లీటర్లు వస్తుంది. ఈ ద్రావణం భూమిలో ఇంకితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతోపాటు బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది. ఈ ప్లాంటు నిర్మాణంతో ఈ సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. ఈ ప్లాంటులో భాగంగా వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పనులు పూర్తికావాల్సి ఉంది. వెంగళాయపాలెం నుంచి ప్లాంటుకు నీటిని తరలించే పైపులైను పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. కొందరు కార్మికులు కరోనా బారినపడ్డారు.

ప్రారంభించేందుకు సన్నాహాలు
ప్లాంటు నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక బాయిలర్‌ ద్వారా 15 రోజులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. చెత్తను 15 రోజుల పాటు గుంటూరు కార్పొరేషన్‌ నుంచి ప్లాంటుకు పంపాం. కోవిడ్‌ నుంచి ఉపశమనం కలుగగానే ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఈ ప్లాంటు పూర్తయితే గుంటూరుతో పాటు చుట్టుపక్కల నగరాలు, పట్టణాలకు ఉపయోగం. ప్రధానంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది.
– చల్లా అనురాధ,నగర కమిషనర్, గుంటూరు

ప్లాంటు పనులు పూర్తయ్యాయి..
ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటర్‌ పైపులైను, సబ్‌స్టేషన్‌ పనులు కొద్దిగా పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తోంది. పలువురు కార్మికులు కోవిడ్‌ బారిన పడ్డారు. కోవిడ్‌ పరిస్థితులు అనుకూలిస్తే నెలరోజుల్లోపు ప్లాంటును ప్రారంభిస్తాం. ఈ ప్లాంటు ప్రారంభమైతే పర్యావరణానికి హానికలగకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.
– ఎంవీ చారి, ప్రెసిడెంట్, ఏపీ ప్రాజెక్ట్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement