ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు.. కరోనాకు ముందే.. | Except Corona, Here's The List Of 10 Most Dangerous And Deadliest Virus In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు.. కరోనాకు ముందే..

Published Tue, Jan 7 2025 9:13 AM | Last Updated on Tue, Jan 7 2025 9:49 AM

Except Corona Most Dangerous and Deadliest Virus in the World

చైనాలో పుట్టిన హ్యూమన్‌ మెటా నిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్‌ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు  ఆ వైరస్‌ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.

ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్‌లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్‌లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..

రోటా వైరస్
రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

స్మాల్ పాక్స్
దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్‌లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్  పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్‌ సోకుతుంది. ఈ వైరస్‌ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్‌ను సమూలంగా నిర్మూలించారు.

తట్టు
దీనిని మీజిల్స్‌ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్‌ 18 మందికి సోకే అవకాశముంది.

డెంగ్యూ
దోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.

ఎల్లో ఫీవర్‌(Yellow fever)
ఈ వైరస్‌ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు.  ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్‌ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్‌ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.

ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.

రేబిస్
పురాతన కాలం నుండి రాబిస్‌ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్‌ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.

హెపటైటిస్-బీ అండ్‌ సీ
హెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్‌ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.

ఎబోలా- మార్బర్గ్ వైరస్
ఎబోలా- మార్బర్గ్ వైరస్‌లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా గుర్తించారు. ఈ వైరస్‌ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్‌ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్‌ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్‌ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్‌ఐవి వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది  ఎయిడ్స్‌ కారణంగా మృతిచెందారు.

ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement