డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడి
సుల్తాన్‌బజార్: హ్యూమన్ మెటాప్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వైరస్ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ వైరస్ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్ అన్నారు. హెచ్‌ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్ కాదన్నారు.
అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్‌ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్‌ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్ పరీక్ష, యాంటిజెన్ డిటెక్షన్, సిరాలజికల్ పరీక్షలు చేయవచ్చన్నారు.
దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment