త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో హెచ్ఎంపీవీ దూరం | Preventive Measures and Treatment of HMPV | Sakshi
Sakshi News home page

త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో హెచ్ఎంపీవీ దూరం

Published Fri, Jan 10 2025 9:28 PM | Last Updated on Fri, Jan 10 2025 9:30 PM

Preventive Measures and Treatment of HMPV
  • యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియ‌న్‌లో ట్రైనీ పోలీసుల‌కు అవ‌గాహ‌న‌
  • చేతులు త‌రచు శుభ్రం చేసుకోవాలి
  • చేతుల‌తో క‌ళ్లు, ముక్కు, చెవులు ముట్టుకోవ‌ద్దు
  • చాలావ‌ర‌కు కొద్దిపాటి ల‌క్ష‌ణాలే.. కొంత‌మందిలో తీవ్రం
  • పిల్ల‌లు, వృద్ధులు, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌వారికే ముప్పు
  • ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి ప‌ల్మ‌నాల‌జిస్టు డాక్ట‌ర్ ర‌త్న‌బాబు కొల్లాబ‌త్తుల‌

హైద‌రాబాద్: హెచ్ఎంపీవీ గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదని, కాస్త అప్ర‌మ‌త్తంగా ఉంటే స‌రిపోతుంద‌ని అమీర్‌పేట‌లోని ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన ఇంట‌ర్వెన్ష‌న‌ల్ ప‌ల్మ‌నాల‌జిస్టు, ఇంటెన్సివిస్టు డాక్ట‌ర్ ర‌త్న‌బాబు కొల్లాబ‌త్తుల తెలిపారు. ఈ వైర‌స్ గురించి స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. యూసుఫ్‌గూడ‌లోని పోలీసు బెటాలియ‌న్‌లో శిక్ష‌ణ పొందుతున్న 300 మంది పోలీసుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు.

“హెచ్ఎంపీవీ అనేది సాధార‌ణంగా అప్ప‌ర్ రెస్పిరేట‌రీ ట్రాక్ట్ లోనే వ‌స్తుంది. గొంతులో ఇబ్బంది ఉండొచ్చు, ద‌గ్గు, జ‌లుబు రావ‌చ్చు. కొద్దిపాటి జ్వ‌రం ఉండే అవ‌కాశం ఉంది. అది బాగా ఎక్కువైతే అప్పుడు శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది అయ్యి, పిల్లికూత‌ల్లా వ‌చ్చి ఆయాసం రావ‌చ్చు. కొంద‌రిలో బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి కూడా ఉంటాయి. చాలావ‌ర‌కు ఇది సాధార‌ణంగానే ఉంటుంది. అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి, చిన్న పిల్ల‌ల‌కు స‌మ‌స్య ఎక్కువ కావ‌చ్చు. ఒక‌టి రెండు రోజులైనా త‌గ్గ‌క‌పోతే అప్పుడు వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి త‌గిన సూచ‌న‌లు తీసుకోవాలి. దీని ల‌క్ష‌ణాల్లో ప్ర‌ధానంగా ముక్కు దిబ్బ‌డ‌, ముక్కు కార‌డం, గొంతులో గ‌ర‌గ‌ర‌, ఆయాసం, ఛాతీలో నొప్పి లాంటివి ఉంటాయి. కొంద‌రికి మాత్రం ఒంటిమీద ద‌ద్దుర్లు కూడా వ‌స్తాయి.

కొత్త వైర‌స్ కాదు
ఇదేమీ కొత్త‌ది కాదు.. ఎప్పుడో 2001లోనే నెద‌ర్లాండ్స్‌లో దీన్ని క‌నుగొన్నారు. చిన్న‌పిల్లల్లో చాలావ‌ర‌కు ఇన్ఫెక్ష‌న్ల‌కు ఇది కార‌ణం అవుతుంది. 10-15% మందిలో మాత్ర‌మే దీని ల‌క్ష‌ణాలు తీవ్రంగా క‌నిపిస్తాయి. వ్యాధి ఉన్నవారికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారికి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇది 2-5 రోజులే ఉంటాయి. త‌ర్వాత దానంత‌ట అదే త‌గ్గుతుంది. కొద్దిమందికి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. 

అది ముదిరిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్, న్యుమోనియాల‌కు దారితీస్తుంది. చాలావ‌ర‌కు ద‌గ్గు, జ‌లుబు లాంటి సాధార‌ణ ల‌క్ష‌ణాలే ఉంటాయి. ఇది సాధార‌ణంగా ఒకరి నుంచి మ‌రొక‌రికే వ‌స్తుంది. లేదా అప్ప‌టికే వ్యాధి ఉన్న‌వారికి ద‌గ్గ‌ర‌గా వెళ్లినా, ద‌గ్గు.. తుమ్ముల నుంచి వ‌చ్చే తుంప‌ర‌ల ద్వారా సోకుతుంది. అప్ప‌టికే వ్యాధి ఉన్న‌వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగ‌లించుకున్నా, ముద్దుపెట్టుకున్నా కూడా అది వ‌స్తుంది. త‌లుపు హ్యాండిళ్లు, బొమ్మ‌లు, ఫోన్లు, ఇత‌ర ఉప‌రిత‌లాలను వ్యాధి ఉన్న‌వాళ్లు ముట్టుకుని, వాళ్ల తుంప‌ర‌లు వాటిమీద ప‌డిన‌ప్పుడు వేరేవాళ్లు ముట్టుకుంటే అప్పుడు సోకే అవకాశం ఉంది.

ఎవ‌రికి రావ‌చ్చు
ఐదేళ్ల‌లోపు పిల్ల‌లు దీని బారిన పడే అవ‌కాశాలు ఎక్కువ‌. ఆస్థ‌మా, సీఓపీడీ, దీర్ఘ‌కాలికంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి సోకితే దాని తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర‌చు ఏదో ఒక వ్యాధి బారిన ప‌డుతున్న‌వారు, కీమోథెర‌పీ తీసుకుంటున్న‌వారు, అవ‌య‌వ‌మార్పిడి చేయించుకున్న‌వాళ్లు ఈ వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీనివ‌ల్ల బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, న్యుమోనియా, చెవిలో ఇన్ఫెక్ష‌న్లు కూడా ఉంటాయి.

గుర్తింపు.. చికిత్స‌
కొవిడ్ త‌ర‌హాలోనే శ్వాబ్ ప‌రీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తాం. కొంద‌రికి ఆక్సిజ‌న్ స‌పోర్ట్ ఇస్తాం. మ‌రికొంద‌రికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంత‌మందిలో ల‌క్ష‌ణాలు త‌గ్గ‌క‌పోతే కార్టికో స్టెరాయిడ్స్ అవ‌స‌రం అవుతాయి. ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టే చికిత్స చేస్తాం త‌ప్ప‌, దీనికి ప్ర‌త్యేకంగా వైర‌స్‌ను త‌గ్గించే మందులంటూ ఏమీ ఉండ‌వు.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
చేతులు త‌ర‌చు స‌రిగా శుభ్రం చేసుకోవాలి. స‌బ్బు లేదా శానిటైజ‌ర్‌తో క‌డుక్కోవాలి. ముక్కు, నోరు, చెవులు.. వీటిని జాగ్ర‌త్త‌గా క‌వ‌ర్ చేసుకోవాలి. వీలైనంత వ‌ర‌కు త‌ప్ప‌కుండా మాస్క్ వాడాలి. అనారోగ్యం ఉన్నా, లేక‌పోయినా ఇది మంచిది. అప్ప‌టికే అనారోగ్యంగా ఉన్న‌వారికి దూరంగా ఉండాలి. క‌ళ్లు, ముక్కు, నోరు.. వీటిని అస్స‌లు చేతుల‌తో ముట్టుకోకూడ‌దు. ఒక‌వేళ ముట్టుకోవాల్సి వ‌స్తే, త‌ప్ప‌నిస‌రిగా ముందే చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం, పాత్ర‌ల‌ను వేరే ఎవ‌రితోనూ షేర్ చేసుకోవ‌ద్దు. డీహైడ్రేషన్ అవుతున్న‌ప్పుడు నీళ్లు, ఇత‌ర ఫ్లూయిడ్స్ ఎక్కువ‌గా తాగుతుండాలి. ల‌క్ష‌ణాలు బాగా ఎక్కువ అవుతున్నాయ‌నుకున్న‌ప్పుడు ద‌గ్గ‌ర‌లో ఉన్న వైద్యుల‌ను సంప్ర‌దించాలి” అని డాక్ట‌ర్ ర‌త్న‌బాబు వివ‌రించారు.

కార్య‌క్ర‌మంలో ఇంకా ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ క‌ళ్యాణి, క‌మాండెంట్ ముర‌ళీకృష్ణ‌, అడిష‌న‌ల్ క‌మాండెంట్ న‌రేంద్ర‌సింగ్‌, బెటాలియ‌న్‌కు చెందిన సివిల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మ‌హ‌మూద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement