
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్‌కుమార్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా మరో రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. హెచ్‌ఆర్‌సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషోర్‌లను ప్రభుత్వం నియమించింది.
దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 5 తేదీన (శనివారం) సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరి పేర్లను ఖరారు చేశారు.
జస్టిస్ ఏ.రాజశేఖర్‌రెడ్డి ప్రొఫైల్
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం పొందారు. 1985, ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలెట్టారు.
2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం (హెచ్‌సీఏఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ టాక్స్‌కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పని చేశారు. 2013, ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022, ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రొఫైల్
1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్ మహమ్మద్‌కు జన్మించారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ చదివారు. నాగ్‌పూర్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996లో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2022 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.