
కేంద్రం సన్నబియ్యం ఇస్తుందనేది అవాస్తవం.. అక్కడి నుంచి వచ్చేది దొడ్డుబియ్యమే
అది కూడా కొందరికే... దుష్ప్రచారాన్ని ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలి
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు.. ప్రతి ధాన్యం గింజా కొంటాం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పేదలకు సన్నబియ్యం ఇస్తోంది కూడా తామేనని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ అవుతాయన్నది అవాస్తవమని, కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే వస్తాయని, అది కూడా కొందరికే పరిమితమని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో జలసౌధ నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేంద్రం సరఫరా చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు సన్నబియ్యం ఇస్తోందని, ఇందుకు 20 శాతం నిధులను అదనంగా వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా కూడా ఉందనే దుష్ప్రచారాన్ని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్‌కార్డులు త్వరలోనే పంపిణీ చేస్తామని ఉత్తమ్ ప్రజాప్రతినిధులకు భరోసా ఇచ్చారు. రేషన్‌కార్డులు కొత్తగా ఇస్తే సన్నబియ్యం లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని, ఆ మేరకు పంపిణీకి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.
రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి
బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి.. మేడిగడ్డ పనిచేయకపోయినా ఖరీఫ్, రబీ సీజన్‌లలో కలిపి 123.27 లక్షల ఎకరాల్లో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఖరీఫ్‌లో 66.78 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, రబీలో 56.49 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 8,209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నబియ్యానికి రూ.500 బోనస్ కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 1,199 కోట్లు రైతులకు చెల్లించామని చెప్పారు.