
రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌షాపుల ద్వారా పేదలకు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోటా కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ, తర్వాత హుజూర్‌నగర్‌ను ఖరారు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ గోడౌన్ (స్టేజ్–1 స్టాక్ పాయింట్)ల నుంచి మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లకు సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ఒక్కో యూనిట్‌కు (ఒక్కరికి) 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు.
ఏటా 24 ఎల్‌ఎంటీల బియ్యం అవసరం
రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు దొడ్డు బియ్యమే అందుతు న్నాయి. రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రతా కార్డులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు (ఐఎఫ్‌ఎస్‌సీ) 54.48 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.62 లక్షల కార్డులు ఉండగా, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి.
మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 90.14 లక్షల కార్డుల్లోని 2.83 కోట్ల యూనిట్లకు (మందికి) ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి 90.14 లక్షల కార్డులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. వీటికి తోడు ఇప్పటికే అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, విద్యా సంస్థలకు కేటాయిస్తున్న బియ్యం కూడా కలిపి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) చొప్పున సన్నబియ్యం అవసరం ఉంది. అంటే సంవత్సరానికి 24 ఎల్‌ఎంటీలు అవసరమన్నమాట.
వానాకాలం సీఎంఆర్ సిద్ధం
వానాకాలంలో సేకరించిన సుమారు 55 ఎల్‌ఎంటీల ధాన్యంలో 24 ఎల్‌ఎంటీల మేర సన్న ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిన ప్రభుత్వం గత నవంబర్ నెలాఖరు నుంచే సన్న బియ్యాన్ని సేకరించే పనిలో ఉంది. తొలుత జనవరి (సంక్రాంతి) నుంచే సన్న బియ్యం ఇవ్వాలని భావించినప్పటికీ, కొత్తగా వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తే అన్నం ముద్దగా అవడం, అడుగంటడం వంటి పరిణామాలు ఉంటాయనే భావనతో రెండు మూడు నెలలు మాగపెట్టాలని ప్రభుత్వం భావించింది.
ఈ మేరకు మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్‌లలో భద్రపరుస్తూ కొత్త బియ్యం పాతబడేలా చూశారు. ఈ నేపథ్యంలో జనవరి వరకు మిల్లింగ్ చేసి సేకరించిన సుమారు 5 ఎల్‌ఎంటీల బియ్యాన్ని ఉగాది నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ కోటా కింద సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని పేర్కొంటూ మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బియ్యం అక్రమ దందాకు కళ్లెం!
రేషన్ షాపుల ద్వారా ఇప్పటివరకు అందుకుంటున్న దొడ్డు బియ్యంలో 60 నుంచి 70 శాతం వరకు దురి్వనియోగం అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని ఉచితంగా తీసుకుంటూ రూ.10కి కిలో చొప్పున రేషన్‌షాపుల్లోనే విక్రయించే పద్ధతి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది.
ఇక ఇంటికి తీసుకెళ్లినా వంటకు వినియోగించకుండా దళారులకు కిలో రూ.10 నుంచి రూ.13 చొప్పున విక్రయించడం, దాన్ని దళారులు రాష్ట్రాలు దాటించడమో లేక రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు విక్రయించడమో చేయడం పరిపాటిగా మారింది. అయితే పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment