
పౌరసరఫరాల, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందే
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా పూర్తి చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనిచోట వెంటనే మొదలుపెట్టండి
మిగతా చోట్ల కోడ్ ముగియగానే కొత్త కార్డులు ఇవ్వాలని సూచన
కొత్త రేషన్‌కార్డుల కోసం రూపొందించిన డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి రేషన్‌కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్‌కార్డుల్లో కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మళ్లీ దరఖాస్తులు అవసరం లేదు..: ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా.. మీసేవ కేంద్రాల వద్ద రేషన్ దరఖాస్తుల కోసం రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటోందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే షురూ..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment