రూ.1,891 కోట్ల బియ్యం బకాయిలివ్వండి | CM Revanth Reddy and Uttam requested Union Minister Pralhad Joshi | Sakshi
Sakshi News home page

రూ.1,891 కోట్ల బియ్యం బకాయిలివ్వండి

Published Wed, Mar 5 2025 4:04 AM | Last Updated on Wed, Mar 5 2025 4:04 AM

CM Revanth Reddy and Uttam requested Union Minister Pralhad Joshi

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌

సీఎంఆర్‌ డెలివరీ గడువును మరికొంత పొడిగించాలి 

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషిని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు రావాల్సిన బియ్యం బకాయిలు రూ.1,891 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌తోపాటు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  కలిశారు.  

ఎఫ్‌సీఐకి 2014–15 ఖరీఫ్‌ కాలంలో రాష్ట్రంనుంచి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అప్పుడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు.  

⇒ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.  

⇒ 2021 జూన్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకు నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  

⇒ సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) గడువును నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని, అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్రమంత్రికి తెలియజేశారు.  

4,000 మెగావాట్ల మంజూరును పునరుద్ధరించండి  
తెలంగాణకు పీఎం కుసుమ్‌ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందంటూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. 

రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుదుత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామంటూ కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.  

పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని కోరాం: మంత్రి ఉత్తమ్‌  
తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో భేటీ అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. 

‘ఉదయం, సాయంత్రం రెండుసార్లు కేంద్రమంత్రిని కలిశాం. తెలంగాణకు గత పదేళ్ల నుంచి పౌరసరఫరాల విషయంలో కొన్ని బకాయిలున్నాయి. గతంలో కొన్ని డాక్యుమెంటేషన్‌ పెండింగ్‌ వల్ల ఆ నిధులు రాలేదు. సుమారు రూ.2వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలని కోరాం. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క నాయకత్వంలో మహిళా సంఘాలకు కూడా సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, ‘పీఎం కుసుమ్‌’పథకం కింద వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 4వేల మెగావాట్ల సబ్బిడీ ఇవ్వాలని కోరాం. 

గిరిజన, మారు ప్రాంతాలకు సబ్సిడీతో సహా అదనంగా సోలార్‌ పంప్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సానుకూలంగా స్పందించారు. అన్ని విజ్ఞప్తులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు’అని ఉత్తమ్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement