మూడు నెలలుగా జీతాల్లేవ్‌ | Grievances of employment guarantee staff and employees | Sakshi
Sakshi News home page

మూడు నెలలుగా జీతాల్లేవ్‌

Apr 16 2025 6:15 AM | Updated on Apr 16 2025 6:15 AM

Grievances of employment guarantee staff and employees

ఉపాధి హామీ సిబ్బంది,ఉద్యోగుల ఆవేదన 

స్పర్శ్‌లో సాఫ్ట్‌వేర్లు అనుసంధానం అవ్వక అందని వేతనాలు  

సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారుల తంటాలు

సాక్షి, హైదరాబాద్‌: నెల జీతం నాలుగు రోజుఉపాధి హామీ సిబ్బంది,ఉద్యోగుల ఆవేదన స్పర్శ్‌లో సాఫ్ట్‌వేర్లు అనుసంధానం అవ్వక అందని వేతనాలు సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారుల తంటాలు ఆలస్యమైనా బతుకు బండి గాడితప్పే ఈ రోజుల్లో.. ప్రభుత్వ సేవలో ఉన్న 14 వేలమంది మూడు నెలలుగా వేతనాలు లేక విలవిలలాడుతున్నారు. వేతనాలకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నా.. సాంకేతిక సమస్య కారణంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రావటం లేదు. వీరిలో 3,800 మంది ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఉద్యోగులు (టీఏలు, ఏపీవోలు, ఈసీలు, సీవోలు), 2,000 మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 7,600 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లతోపాటు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో (డీఆర్‌డీవోలు, అదనపు పీడీలు, ఏపీడీలు, హెడ్‌ ఆఫీస్‌లో పనిచేసే సీఎఫ్‌వోలు,ఇతర ఉద్యోగులు, సిబ్బంది) పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.  

ఇదీ సమస్య.. 
వివిధ పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధులను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కేంద్రం స్పర్శ్‌ అనే ఏజెన్సీని తీసుకొచి్చంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ ప్రాసెసింగ్‌ ఏజెన్సీ. నిజానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఆన్‌లైన్‌ విధానం కోసం ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఐఎఫ్‌ఎంఐఎస్‌), కేంద్ర ప్రభుత్వం వద్ద పబ్లిక్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌) ఉంటాయి. ఉపాధి హామీకి సంబంధించి ఎన్‌ఐసీ సాఫ్ట్‌ విధానం, ఆర్‌బీఐకి ఈ–కుబేర్‌ సిస్టమ్‌ ఉన్నాయి. 

స్పర్శ్‌లో భాగంగా ఈ నాలుగు సాఫ్ట్‌వేర్లను అనుసంధానించాలని కేంద్రం ఆదేశించింది. ఇక్కడే సమస్య వచి్చంది. ఈ నాలుగు సాఫ్ట్‌వేర్ల అనుసంధానంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఉపాధి హామీ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం నెలకు రూ. 22 కోట్ల దాకా బడ్జెట్‌ అవసరం. నిధులు అందుబాటులో ఉన్నా సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో జీతాలు చెల్లించలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

జనవరి నుంచి జీతాలు లేవు 
మా జిల్లాలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు జనవరి నుంచి వేతనాలు రావడం లేదు. బడ్జెట్‌ కేటాయింపులు లేవనే సాకుతో ప్రభుత్వం వేతనాలు పెండింగ్‌లో పెట్టింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవటంతో కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణం పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి. 
– బాల్‌రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు, జనగామ జిల్లా.  

పెండింగ్‌ వేతనాలివ్వాలి 
వెంటనే మూడునెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి. మా వేతనం
పెంచుతామని, ఉద్యోగభద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీని ప్రభుత్వం నెరవేర్చాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రతి గ్రామపంచాయతీలో పది మందికి తగ్గకుండా కూలీలను తీసుకురావాలంటూ రాష్ట్రస్థాయి అధికారులు టార్గెట్‌ పెడుతున్నారు. ఈ పని చేయకపోతే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్లకు ఆర్డర్లు వేస్తున్నారు. మాకు హక్కులు లేకుండా పోయాయి.

నారాయణ గౌడ్‌
ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement