
మెదక్‌లో ట్రాఫిక్ సిగ్నళ్లకు కరెంట్ కట్
చలాన్ వేశారని విద్యుత్ ఉద్యోగుల కన్నెర్ర
మెదక్ మున్సిపాలిటీ: ‘మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా?’అంటూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ నిలిపివేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న ట్రిపుల్ రైడ్‌గా వెళ్తున్న ఓ బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ‘మేం కరెంటోళ్లం. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం’అని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాత పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్‌లను సరిచేస్తామని చెప్పినప్పటికీ విద్యుత్ లైన్ తొలగించారని సీఐ నాగరాజు తెలిపారు. అనంతరం ట్రాన్స్‌కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇదే విషయమై ఏఈ నవీన్‌ను వివరణ కోరగా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విద్యుత్ మీటర్లు లేవని, వాటిని బిగించుకోవాలని సూచిస్తూ సరఫరాను నిలిపివేసి.. తర్వాత పునరుద్ధరించినట్లు చెప్పారు.