Traffic Signals
-
కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా..?
మెదక్ మున్సిపాలిటీ: ‘మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా?’అంటూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ నిలిపివేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న ట్రిపుల్ రైడ్‌గా వెళ్తున్న ఓ బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ‘మేం కరెంటోళ్లం. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం’అని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాత పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్లను సరిచేస్తామని చెప్పినప్పటికీ విద్యుత్ లైన్ తొలగించారని సీఐ నాగరాజు తెలిపారు. అనంతరం ట్రాన్స్‌కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇదే విషయమై ఏఈ నవీన్‌ను వివరణ కోరగా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విద్యుత్ మీటర్లు లేవని, వాటిని బిగించుకోవాలని సూచిస్తూ సరఫరాను నిలిపివేసి.. తర్వాత పునరుద్ధరించినట్లు చెప్పారు. -
HYDRAA: హైడ్రా ఫోకస్ ఇక అక్కడ కూడా!
హైదరాబాద్, సాక్షి: హైడ్రా.. ఈ పేరు వినబడగానే ఓ ఉలిక్కిపాటు కనిపిస్తోంది తెలంగాణ అంతటా. ఎక్కడ తమ ఇళ్లు, బిల్డింగులపై బుల్డోజర్లు దూసుకొస్తాయో అని బెంబేలెత్తిపోతున్నారు కొందరు. అయితే..హైడ్రా విధులు కేవలం కట్టడాల కూల్చివేత మాత్రమే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. చెరువుల సుందరీకరణతో విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకారం వంటి కార్యక్రమాల్లో భాగం కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా వలంటీర్లు తెరపైకి వచ్చారు.హైడ్రా వలంటీర్లు ఇకపై హైదరాబాద్‌లోని ముఖ్యమైన జంక్షన్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వీళ్లు సహాయకులుగా పని చేయనున్నారు. ఇప్పటికే గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలో హైడ్రా రేడియం జాకెట్లతో వీళ్లు సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు.హైడ్రా ట్రాఫిక్ వలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందించనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఇది వరకే ప్రకటించారు. ఇదీ చదవండి: రండి బాబూ రండి..హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు కొనండి! -
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్‌ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
గజిబిజిగా హనుమాన్ జంక్షన్
నిజామాబాద్ సిటీ : నగరంలో ముఖ్యమైన జంక్షన్లలో హనుమాన్ జంక్షన్(వినాయక్‌నగర్) ఒకటి. హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న ఈ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ చౌరస్తాలో ఏడాది క్రితం ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాని దీనిని నేటికి ప్రారంభించకపోవటంతో ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళలో చౌరస్తా దాటి ముందుకెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు.. వారంరోజుల క్రితం చౌరస్తాలో ఓ ఆటో బైక్‌ను ఢీకొనటంతో బైక్ ఉన్న ఇద్దరిలో ఒకరికి త్రీవంగా, మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అలాగే గతంలో డిచ్పల్లి వైపునుంచి వచ్చిన ఓ లారీ ఈ చౌరస్తా నుంచి వంద ఫీట్ల రోడ్డువైపు మలుగింది. ఆ సమయంలో చౌరస్తాలో ఓ వైపు టీవీఎస్ వాహనంపై ఉన్న ఒకరిని లారీ వెనుకవైపు నుంచి ఢీకొన్న ఘటనలో అతనికి కాలు విరిగింది. మరో ఘటనలో బ్యాంక్‌కాలనీకి చెందిన ఒకరు వాకింగ్ చేస్తూ చౌరస్తా వైపు రాగా అదే సమయంలో ఓ బైక్ స్పీడ్‌గా వచ్చి అతడిని ఢీకొట్టగా అతని కాలు విరిగింది. రెండేళ్ల క్రితం డిచ్పల్లికి చెందిన ఒకరు టీవీఎస్పై చౌరస్తా దాటుతుండగా ఓ ఆటో ఇతడిని ఢీకొట్టడంతో అక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా మరికొన్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సిగ్నల్ లైట్లు అమర్చినా.. హనుమాన్ జంక్షన్లో ప్రమాదాలు నిరోధించేందుకు మున్సిపల్, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కాని కారణం ఏమిటోగాని ఇప్పటికీ వీటిని ప్రారంభించలేదు. నిత్యం వేలాది సంఖ్యలో తిరుగుతున్న ఈ మార్గంపై ఉన్న చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను వెంటనే ప్రారంభించాలని చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు అరికట్టాలి హనుమాన్ జంక్షన్లో ట్రా ఫిక్ సిగ్నల్ మొదలుపెట్టక పోవటంతో తరుచుగా జరు గుతున్న ప్రమాదాలను అరి కట్టాలి. ఈ చౌరస్తా మీదుగా 24 గంటలపాటు వాహనా ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – సుబ్బారావు, వినాయక్‌నగర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి హనుమాన్ చౌరస్తా మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య గత ఐదేళ్లుగా ఎంతో పెరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకపోవటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయాలి. -
Hyderabad: హిజ్రాల ఆగడాలు.. సిగ్నల్ పడిందా.. డబ్బు గుంజుడే!
సాక్షి, హైదరాబాద్(వనస్థలిపురం): పలు ప్రాంతాలలో హిజ్రాలు (థర్డ్ జెండర్స్) ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటి వరకు వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లకు వచ్చి డబ్బులు వసూలు చేసే థర్డ్ జెండర్స్ నేడు రోడ్లపై తిరుగుతూ వాహనదారులను సైతం వదలిపెట్టడం లేదు. హస్తినాపురం సెంట్రల్లో నిత్యం తిష్టవేస్తున్న హిజ్రాలు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే అతని బండి తాళం చెవి లాక్కుని సిగ్నల్ పడినా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇదేమని ఎవరైనా అడిగితే వారిని హేళన చేస్తున్నారు. హస్తినాపురంలో చౌరస్తాలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నా వారిని అడ్డుకున్న పాపాన పోవడం లేదు. హిజ్రాల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, హస్తినాపురం సెంట్రల్ దాటాలంటే టోల్గేట్ పన్ను లాగా వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ జోక్యం చేసుకుని హిజ్రాల నుంచి తమను రక్షించాలని వాహనదారులు కోరుతున్నారు. చదవండి: (అందుకే ఢిల్లీకి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి) -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
ఆగండి.. చూడండి.. వెళ్లండి
జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల సమన్వయంతో కాంట్రాక్టు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. వాహనాల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు సదుపాయంగా 104 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. స్టడీ, డిజైన్, సప్లై ఏర్పాటు, నిర్వహణలన్నీ కాంట్రాక్టు సంస్థే చేయాల్సిఉంటుంది. మూడేళ్ల కాలానికి నిర్వహణతోసహా అంచనా వ్యయం దాదాపు రూ.60 కోట్లు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు త్వరలో కొత్తగా అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ (ఏటీఎస్సీ)తో జంక్షన్లలోని సిగ్నళ్లను నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహిస్తున్న సంస్థ కాంట్రాక్టు వచ్చే ఆగస్ట్ నెలతో ముగియనుండటంతోఇప్పటికే ఉన్న 231 జంక్షన్ల నిర్వహణతో పాటు కొత్తగా మరో 150 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టు కోసం టెండర్లకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)గా ఆహ్వానించారు. సులువుగా ప్రయాణం.. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను, భవిష్యత్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని సాఫీ ప్రయాణం కోసం ఆటోమేటిక్‌గా పనిచేసే ఏటీఎస్సీ సాంకేతికతతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ట్రాఫిక్ సిగ్నళ్లు అల్ఫా న్యూమరిక్ టైమర్లను కలిగి ఉంటాయి. ట్రాఫిక్ సెంట్రల్ కమాండ్ సెంటర్ (టీసీసీసీ) నుంచి వీటిని పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం తదితర విషయాలను తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ విధానంలో ఉంటాయి. ఒక సమయంలో ఒక కారిడార్‌లో ఉండే అన్ని జంక్షన్ల వద్ద కూడా రెడ్ లేదా గ్రీన్ లైట్ మాత్రమే ఉండే ఏర్పాట్లు సైతం కొత్త విధానంలో ఉంటాయని సమాచారం. తద్వారా ఒక కారిడార్‌లో ఒక జంక్షన్ దాటగానే దగ్గరలోని మరో జంక్షన్ వద్ద ఆగిపోకుండా వెళ్లేందుకు వీలవుతుంది. 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌డెస్క్ కూడా ఉంటుంది. భువనేశ్వర్ తదితర నగరాల్లో ఈ విధానం ఉంది. ఏటీఎస్సీతో ప్రయోజనాలు.. ♦ టీసీసీసీ నుంచే ప్రతి సిగ్నల్ పనితీరును పర్యవేక్షించవచ్చు. ♦ ఏవైనా లోటుపాట్లున్నా, పనిచేయకున్నా తెలుసుకోవచ్చు. ♦ ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ♦ సందర్భాన్ని బట్టి ట్రాఫిక్ పరిస్థితులపై వాహనదారులకు సమాచారం ♦ రహదారుల ప్రమాదాల నివారణ ♦ రియల్ టైమ్‌తో ట్రాఫిక్ రద్దీ విశ్లేషణ ♦ ప్రయాణ భద్రత మెరుగు. ఇతరత్రా పనులతో సహా కొత్తగా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ చేయాల్సిన పనులు ♦ ప్రస్తుతం ఉన్న 231 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ ♦ 3 పాదచారుల సిగ్నల్స్ ఆపరేషన్, నిర్వహణ ♦ 17 వేరియబుల్ మెసేజ్ బోర్డుల నిర్వహణ ♦ 150 జంక్షన్లలో కొత్త సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ ♦ 104 పెలికాన్ సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ ♦ అన్నీ కలిపి యూనిఫైడ్ సిగ్నల్ సిస్టమ్‌గా వ్యవహరిస్తారు. -
మళ్లీ 'సిగ్నల్స్'
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం ప్రారంభించాయి. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ల నేపథ్యంలో మార్చి 22 నుంచి వీటికి బ్రేక్ పడింది. మధ్య మధ్యలో అక్కడక్కడా కొన్ని పని చేసినా పూర్తి స్థాయిలో కాదు. ఇప్పటి వరకు దాదాపు అన్ని జంక్షన్లూ రెడ్ లైట్ బ్లింకింగ్‌తోనే నడుస్తూ వచ్చాయి. అయితే లాక్డౌన్లో కొన్ని సడలింపులు అమలులోకి రావడంతో నగరంలో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో శుక్రవారం నుంచి అన్ని సిగ్నల్స్ పని చేయడం ప్రారంభించాయి. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నగరంలోని ఫ్లైఓవర్లు సైతం మూతపడ్డాయి. కేవలం ప్రత్యామ్నాయం లేని బేగంపేట, డబీర్‌పుర వంటి ఫ్లైఓవర్లు మాత్రమే పని చేశాయి. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న జీహెచ్ఎంసీ వీటిపై రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. శుక్రవారం నుంచి అనేక ఫ్లైఓవర్లు కూడా తెరుచుకున్నాయి. మరమ్మతులు, రోడ్డు నిర్మాణం పూర్తికాని వాటిని మాత్రమే మూసి ఉంచారు. మరోపక్క పోలీసు విభాగం ప్రధాన రహదారులపై ఉన్న చెక్పాయింట్ల వద్ద తనిఖీలు కొనసాగించింది. ద్విచక్ర వాహనంపై ఇద్దరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణిస్తున్న వారిని ఆపి చర్యలు తీసుకుంది. -
ట్రాఫిక్ సిగ్నళ్లకు కొత్తందాలు
బంజారాహిల్స్: రహదారులకు, కూడళ్లకు కొత్తందాలు తీసుకొచ్చే క్రమంలో ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు పలు రహదారులు, జంక్షన్లలో స్ట్రీట్ లైట్స్ స్తంభాలకు లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ప్రయోగాత్మకంగా సెక్రటేరియట్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నళ్లకు కూడా ఎరుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో లైటింగ్ ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆ స్తంభం మొత్తం రెడ్ లైటింగ్‌తో, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు గ్రీన్ లైటింగ్‌లతో ఇలా సిగ్నల్ మారిన ప్రతిసారీ రంగులు మారుస్తూ వాహనదారులను ఆకట్టుకుంటోంది. దీంతో అదనపు ఆకర్షణ చేకూరింది. దూరంగా ఉన్న వాహనదారులకు కూడా ముందున్న జంక్షన్లో సిగ్నల్ పడిందన్న విషయం తెలుస్తుంది. -
‘బీ–ట్రాక్’@ గ్రేటర్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణపై అధ్యయనానికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ నేతృత్వంలో జరిగిన ‘నగర ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే కేవలం ఒక్క ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ మాత్రమే కాకుండా, అక్కడి ట్రాఫిక్ పోలీసులకు వరంగా మారిన ‘బీ–ట్రాక్’ను సిటీలో అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రహదారులపై ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే, రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధులు ట్రాఫిక్ పోలీసులవైతే... అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. వీరిద్దరి మధ్యా సమన్వయ లోపం బెంగళూరులోనూ వాహనచోదకులను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం అమలులోకి తెచ్చిందే ‘బీ–ట్రాక్’ పథకం. 2006–07ల్లో ఐదేళ్ల కాలానికంటూ అమలులోకి వచ్చిన ఇది ఆ తర్వాత కొనసాగుతోంది. బీ–ట్రాక్‌గా పిలిచే ‘బెంగ ళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్’ అక్కడ మంచి ఫలితాలను సాధిస్తూ రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. నగరంతో ఎన్నో సారూప్యతలు... బెంగళూరుతో హైదరాబాద్‌కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. హైదరాబాద్ తరహాలోనే అది కూడా ఎంతో పాత నగరం. దీంతో అనేక రహదారులు చిన్నవిగా, బాటిల్‌నెక్స్‌తో నిండి ఉంటాయి. వినియోగంలో ఉన్న వాహనాల్లో అత్యధిక శాతం ద్విచక్ర వాహనాలే. పీక్ అవర్స్‌లో రోడ్లపై అడుగుపెట్టాలంటే నగరకమే. వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉండవు. ఇక్కడి మాదిరిగానే సాఫ్ట్వేర్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ కారణాల నేప థ్యంలో అక్కడి ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చవిచూడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు, వాటిలో క్షతగాత్రులు, మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. కొన్ని చిన్న చిన్న మౌలికవసతుల కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీపై ఆధారపడినట్లే అక్కడి అధికారులు బీఎంసీ అనుమతికోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ‘బీ–ట్రాక్’తో మారిన పరిస్థితులు... ఈ నేపథ్యంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం బీ–ట్రాక్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. సాధారణ మౌలికవసతుల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇందుకుగాను 2006–07లో రూ.350 కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం నాలుగేళ్లలో ఈ నిధులను వినియోగించుకోవా లని నిబంధన పెట్టింది. అయితే అక్కడి ట్రాఫిక్ పోలీసులు చేసిన విన్నపాల్ని పరిగణలోకి తీసు కున్న ప్రభుత్వం కాలపరిమితిని ఎత్తివేసింది. ఏటా ట్రాఫిక్ పోలీసులు సమర్పించే యాక్షన్ ప్లాన్ ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. 2019 –20కి గాను రూ.139 కోట్లు కేటాయించింది. పరిజ్ఞానం, మౌలికవసతులకు వినియోగం... బీ–ట్రాక్ నిధులను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు మౌలికవసతుల అభివృద్ధికీ వినియోగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం 379 ప్రాంతాల్లో సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్‌ను అధ్యయనం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాంతాల వారీగా ఏరియా ట్రాఫిక్ సెంటర్లతో పాటు ఇన్ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ హెడ్–క్వార్టర్స్‌లో భారీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ (టీఎంసీ) ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉల్లంఘనులకు కౌన్సిలింగ్ కోసం అత్యాధునిక వసతులతో ట్రాఫిక్ ట్రైనింగ్ అండ్ రోడ్ సేఫ్టీఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. గణాంకాలివీ... నగర పరిధి : 369 చదరపు కిమీ వాహనాల సంఖ్య : 43,85,343 ద్విచక్ర వాహనాలు : 69.09 శాతం పెరుగుదల రేటు : 4 శాతం ట్రాఫిక్ పోలీసుల సంఖ్య: 2800 బీ–ట్రాక్ ద్వారా సమకూరినవి ♦ 379 సర్వైలెన్స్, 15 ఎన్ఫోర్స్మెంట్ కెమెరా లు, 29 ఇంటర్సెప్ట్ వాహనాలు ♦ నగరంలోని 428 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు/ఉన్నవి అప్–గ్రేడ్ చేయడం. ♦ 625 ప్రాంతాల్లో వార్నింగ్ సిగ్నల్స్, 56 చోట్ల పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు. ♦ క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల్ని నమోదు చేయడానికి ప్రింటర్‌తో కనెక్టివిటీ ఉన్న 650 బ్లాక్‌బెర్రీ ఫోన్లు. ♦ కీలక, అవసరమైన ప్రాంతాల్లో 30 వేల రోడ్ సైనేజస్, వెయ్యి ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటు. ♦ 85 జంక్షన్లను సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడంతో పాటు రెండు లక్షల చదరపు మీటర్ల రోడ్ మార్కింగ్స్. ♦ బ్రీత్ అనలైజర్ల సమీకరణ. ♦ భారీగా అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా వాణిజ్య సముదాయాలు చిన్న వర్టికల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రోత్సహించారు. -
‘ట్రాఫిక్’ పందిరి
వరంగల్ క్రైం: సాధారణంగా మనం వాహనాలపై రహదారి మీదుగా వెళ్తుంటే ఎక్కడా నీడ కనిపించదు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరైతే పరిస్థితి మరీ దారుణం. పైన ఎండ సుర్రుమంటున్నా గ్రీన్‌సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సిందే.. ఈ విష యమై వాహనచోదకుల ఇబ్బందులను గుర్తించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఓ ఉపాయం తట్టింది. దీంతో వెంటనే హన్మకొండలోని అదాలత్ సర్కిల్‌తోపాటు పలు కూడళ్ల వద్ద గురువారం గ్రీన్ నెట్ ఏర్పాటు చేయించారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కూడళ్ల వద్ద ఆగే వాహనదారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. దీనికితోడు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా నీడ పట్టున ఉంటున్నట్లవుతోంది. -
ఉల్లంఘనులు
సాక్షి, అమరావతి బ్యూరో : పటమటకు చెందిన విశాల్ తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ 73 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను బేఖాతరు చేసిన ప్రతిసారీ అతనికి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలు పంపుతానే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అపరాధ రుసుం చెల్లించలేదు.సత్యనారాయణపురంలో ఉండే సురేష్ 63 సార్లు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించకుండా కారు నడుపుతూ నిబంధనలను బేఖాతరు చేశాడు. పోలీసులు ఈ–చలానాలను పంపారు. కానీ ఒక్క సారీ అపరాధ రుసుం కట్టలేదు. ఇలాంటి విశాల్, సురేష్‌లు నగరంలో మరో పది వేల మందికి పైడి ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత నూతన రాజధానిలో భాగమైన బెజవాడలో నాలుగేళ్లుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘనులపై కొరడా ఝళిపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా వాహనాలను ఇష్టానుసారం నడుపుతున్న వాహనచోదకులను కట్టడి చేయనున్నారు. విజయదశమి తర్వాత స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టి అప్పటికీ దారికి రాని వాహనచోదకుల వాహనాలను సీజ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దసరా తర్వాత చిక్కులు తప్పవంటున్నారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు. నాలుగేళ్లలో 23 లక్షల మందిపై కేసులు.. రాజధానిగాలో అంతర్భాగమయ్యాక బెజవాడలో 2014 నుంచి 2018 సెప్టెంబరు నెల వరకు 23,07,318 మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించారు. దీంతో వీరందరిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలను పంపుతూ వచ్చారు. ఇందులో 12,83,998 మంది స్పందించి ఈ–చలానాల్లో పేర్కొన్నట్లుగా దాదాపు రూ.20 కోట్లకుపైగా అపరాధ రుసుం చెల్లించారు. మిగిలిన 10,23,320 మంది వాహనచోదకుల నుంచి స్పందన లేకుండా పోయింది. వీరిలో 200 మందికిపైగా వాహనచోదకులు తరచూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఒక్కొక్కరూ 10 నుంచి 70 సార్లుకుపైగా నిబంధల్ని ఉల్లంఘించడం గమనార్హం. మిగిలిన వారు మాత్రం ఎక్కువ సార్లు నిబంధనల్ని బేఖాతరు చేయకపోయినా అపరాధ రుసుం మాత్రం కట్టకుండా మిన్నకుండిపోయారు. వీరంతా కూడా దాదాపు రూ.20 కోట్ల వరకు ఫైన్ కట్టాల్సిఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారం రోజులు స్పెషల్ డ్రైవ్.. ఒకరికంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్నా.. అతివేగంగా వాహనాన్ని నడుపుతున్నా.. హెల్మెట్ లేకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా.. ఇప్పటి వరకు చూసీచూడనట్లు వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై కొరడా ఝళిపించనున్నారు. అయితే దసరా పండుగ వరకు వారందరికీ ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటిలోగా ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినా వాహనదారులు అపరాధ రుసుం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామని.. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విజయదశమి తర్వాత ఒక వారం రోజులపాటు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారులు తస్మాత్ జాగ్రత్త. -
సిగ్నల్ రెడ్, గ్రీన్ లైట్లు ఒకేసారి వెలగడంతో..
సికింద్రాబాద్ :అసలే ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న సిటీజనులు...సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలతోనూ పాట్లు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద సిగ్నల్ రెడ్, గ్రీన్ లైట్లు ఒకేసారి వెలగడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ఇలా అయితే అన్ని వైపుల వాహనదారులు కదిలి... ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
జిగేల్ సిగ్నల్స్
సాక్షి, సిటీబ్యూరో: ‘సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్ద ఓ బస్సు వెనుక ఉండి డ్రైవ్ చేస్తున్నాడు. దీంతో ఇతడికి సిగ్నల్ స్తంభం తప్ప దానికి ఉండే రెండు సిగ్నల్స్ కనిపించలేదు. అప్పటి వరకు ‘గ్రీన్’గా ఉన్న సిగ్నల్ హఠాత్తుగా ‘రెడ్’గా మారింది. ముందు బస్సుతో పాటే వెళ్తున్న ఇతడికి జంక్షన్ అవతల వైపు ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలానాతో పాటు పెనాల్టీ పాయింట్ సైతం విధించారు.’ సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్‌తో అనేక మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా జరిమానాతో పాటుపెనాల్టీ పాయింట్ తప్పట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఆ ఉల్లంఘన ప్రమాదకరం కావడంతో... సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రాణాంతకమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రాణాంతకమైనవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. సిగ్నల్ జంపింగ్ అనేది ఈ మూడో కేటగిరీ కిందికి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఓ వాహనచోదకుడు చేసిన తప్పువల్ల నిబంధనలు పాటించే ఎదుటి వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఇలాంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిటీలో ఉన్న సిగ్నల్ స్తంభాల్లో రెండు చోట్ల మాత్రమే సిగ్నల్ లైట్లు ఉంటున్నాయి. రోడ్డుకు కుడి పక్కన ఉండే స్తంభం మధ్య భాగంలో, దానికి పైన రోడ్డు మధ్యలోకి వచ్చే విధంగా మరోటి (థర్సర్ సిగ్నల్) మాత్రమే ఉంటున్నాయి. దీంతో ముందు వరుసలో పెద్ద వాహనాలు ఉండే వెనుక వారికి ఆ సిగ్నల్స్ కనిపించవు. ఫలితంగా వారి తప్పు లేకుండానే ఉల్లంఘనులుగా మారిపోతున్నారు. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి... ఈ తరహా ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్తంభం కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్తంభాన్ని చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహన చోదకులు నిర్ధారించుకోవచ్చని ఓ ఆలోచన చేశారు. సిగ్నల్ స్తంభానికి రెండు ప్రాంతాల్లో ఉండే లైట్ల మధ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు వీటిని సిగ్నల్‌తో అనుసంధానిస్తున్నారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్ పడితే ఆ రంగులోకి మారతాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఆయకార్ భవన్ నుంచి కమిషనరేట్‌కు వెళ్లే సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్ కనిపిస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో సెటైర్.. వైరల్..
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో నవదీప్ సెటైర్ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్ బ్లేమింగ్ మి ఫర్ నాట్ హవింగ్ ఎ డైరెక్షన్ ఇన్ లైఫ్’ అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. నవదీప్ పెట్టిన పిక్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్, లెఫ్ట్ సిగ్నల్స్‌ను కూడా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా సరదా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఏ ప్రాంతం’ అని ఒకరు.. ‘భయంకరం’ అని మరొకరు సరదాగా ఆ ఫొటోపై స్పందించారు. -
ఒక్క క్షణం ఆగండి..
సాక్షి, హైదరాబాద్ : ఒక్క క్షణం ఆగండి. మీ బండి ఇంజన్ ఆపేయండి. మరో 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయండి. ఇం‘ధనం’ ఆదా చేసుకోండి. నిజమే నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా పెట్రోల్, డీజిల్ భారీగా దుర్వినియోగమవుతున్నాయి. సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ఆఫ్ చేయకపోవడం వల్ల ప్రతి రోజు వేలాది లీటర్ల ఇంధనం అనవసరంగా ఖర్చవుతోంది. అంతేకాదు. ప్రమాదకరమైన కాలుష్య ఉద్గారాలు నగర పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే సిగ్నల్ పడిన వెంటనే ఇంజన్ ఆఫ్ చేస్తే చాలు. కనీసం 50 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. ఏసీ వాహనాల్లో అయితే 200 ఎం.ఎల్ వరకు కూడా ఇంధనాన్ని మిగుల్చుకోవచ్చు. అంతేకాదు, ఒక లీటర్ పెట్రోల్ పైన 60 కిలోమీటర్లు వెళ్లే బైక్ మరో 2 కిలోమీటర్లు అదనంగా ముందుకు వెళ్తుంది. ఒక లీటర్ డీజిల్‌పైన కనీసం 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచే కారు మరో కిలోమీటర్ అదనంగా ముందుకు నడుస్తుంది.ఒక్క సిగ్నల్ వద్ద ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల 1 నుంచి 2 కిలోమీటర్ల అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఒక్కసారి బండి బయటకు తీస్తే కనీసం 4 నుంచి 6 సార్లయినా సిగ్నల్ వద్ద బ్రేకులు పడుతాయి. ఆ సమయంలో ఇంజన్ ఆఫ్ చేస్తే అదనంగా 10 కిలోమీటర్ల ప్రయాణం కలిసి వస్తుంది. కార్లు, ఇతర వాహనాలు సైతం సిగ్నల్స్ వద్ద ఇంజన్‌ను ఆపేయడం వల్ల రోజుకు 250 ఎంఎల్ నుంచి 300ఎంఎల్ వరకు ఆదా చేసేందుకు అవకాశంఉంటుంది. ఇంధనం పొదుపు చేయడం వల్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా వాహనాల సామర్ధ్యం కూడా పెరుగుతుంది. -
మేమింతే..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఏటా అనూహ్యంగా పెరుగుతోంది... నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి ఫలితాలు దక్కడం లేదు. ఓ పక్క ఉల్లంఘనులను చలాన్లతో చావబాదుతూ దొరికినకాడికి వసూలు చేస్తున్నా మార్పు శూన్యం... నిబంధనలు మనకోసమే అన్న సామాజిక స్పృహ వాహనచోదకుల్లో, మౌలిక వసతులు కల్పించాలిన్న భావన జీహెచ్ఎంసీకి, ఎన్ఫోర్స్మెంట్కు, చైతన్యం చేయాలన్న స్ఫృహ ట్రాఫిక్ అధికారుల్లో పెరిగే వరకు ఈ పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. ఇదీ పెరుగుదల స్థితి... నగరంలో వాహనాల సంఖ్యను తలదన్నే రీతిలో ఉల్లంఘనులు పెరుగుతున్నారు. సిటీలో ఏటా వాహనాల సంఖ్య రెండు లక్షల చొప్పున పెరుగుతుండగా... ఉల్లంఘనులు దీనికి రెట్టింపుస్థాయిలో పెరుగుతున్నారు. సిటీలో 106 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలాన్లు విధిస్తున్నారు. నగరంలో 2005లో 15.27 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య 2017 నాటికి 50 లక్షలు దాటింది. ఇక ఉల్లంఘనుల విషయానికి వస్తే 2015లో వారి సంఖ్య 32.24 లక్షలు ఉండగా... 2017 నాటికి 38.82 లక్షలు దాటింది. ట్రాఫిక్ అధికారులకు ఉల్లంఘనలకు పాల్పడిన సిటిజన్లకు 2015లో రూ.61.42 కోట్లు జరిమానా విధించగా... ఇది గత ఏడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ.66.60 కోట్లుగా నమోదైంది. వారికి రెడ్ కూడా ‘గ్రీనే’... ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖాతరు చేయని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏ జంక్షన్లో చూసినా వీరు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కొన్ని సెకన్ల వేచి చూడలేక ముందుకు ‘ఉరుకుతూ’ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి వారితో పాటు ఎదుటి వారి చావుకూ కారణమవుతున్నారు. నిబంధనలు పాటించాలన్న స్ఫృహ లేనందునే అనేక జంక్షన్లు జామ్ కావడానికీ ప్రధాన కారణమవుతోంది. వీటికితోడు స్టాప్‌లైన్ క్రాసింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ ఉల్లంఘనులకు జరిమానా విధిస్తున్నా... ఎక్కడా స్టాప్‌లైన్లు పూర్తిస్థాయిలో స్పష్టంగా కనిపించే పరిస్థితి లేదు. హెల్మెట్ కేసులే అత్యధికం ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నది ప్రాథమిక నిబంధన. రోడ్డు ప్రమాదాల బారినపడుతున్న ద్విచక్ర వాహనచోదకుల్లో 80 శాతం తలపై గాయాలతోనే మరణిస్తుంటారు. మరెందరో క్షతగాత్రులు తలలోని కీలక భాగాలు దెబ్బతిని జీవశ్ఛవాలుగా మారుతుంటారు. గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా అత్యధికంగా ఈ కేసులో నమోదవుతున్నాయి. సీట్ బెల్ట్ లేకుండా తేలికపాటి, భారీ వాహనాల్లో ప్రయాణమూ ప్రమాదహేతువే అయినా ఎవరికీ పట్టదు. ఈ ఉల్లంఘనులకు జరిమానా సైతం పక్కాగా ఉండటం లేదు. -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
సాక్షి, టెక్నాలజీ : ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు పడినా వాహనదారులు ఒక్కోసారి దూసుకుపోవటం.. లేదా వాహనాల మధ్య నుంచే రోడ్డును దాటాలని పాదాచారులు చేసే ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయటం చూస్తున్నాం. అయితే సాంకేతికతకు మరింత ఆధునీకరణ తోడైతే అలాంటి ఘటనలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సెన్సార్ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. దీని ప్రకారం సిగ్నల్ వద్ద ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం వెళ్తుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు నిరభ్యరంతంగా రోడ్డును దాటేయొచ్చు. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించగా.. అది సత్ఫలితాన్ని ఇస్తోంది. త్వరలో దీనిని వివిధ దేశాలకు విస్తరించాలని ప్రాజెక్టును చేపట్టిన యూ-కోరీచన్ సంస్థ ఆలోచన చేస్తోంది. -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
-
ఫొటో చలానాలపై నిరసన
శంషాబాద్: ట్రాఫిక్ పోలీసులు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీస్తూ చలానాలు వేయడంతో బతుకు బండి లాగలేకపోతున్నామని భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో గురువారం శంషాబాద్ పట్టణంలో ఆటో, ట్యాక్సీ, డీసీఎం, వ్యాన్ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సామా ఎన్క్లేవ్ నుంచి ఆర్జీఐ పోలీస్‌స్టేషన్ మీదుగా తొండిపల్లి ఆటో స్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీఎంఎస్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్స్ జిల్లా నాయకుడు చింతల నందకిషోర్ మాట్లాడుతూ పోలీసులు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీయడంతో ఒక నెలలోనే శంషాబాద్ పట్టణంలో ఆటోలు నడుపుకుని జీవించే డ్రైవర్లు మూడు లక్షల రూపాయల వరకు చలానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం రోడ్డుపై ఆటో ఆపినా వెనుక నుంచి ఫొటో తీస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో స్టాండ్, పార్కింగ్ స్థలాలను ఖరారు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని పెద్ద పెద్ద హోటళ్ల ముందు విచ్చలవిడిగా వాహనాలు నిలిపినా పట్టించుకోని పోలీసులు.. ప్రయాణికుల కోసం రోడ్డుపై అనివార్య పరిస్థితుల్లో వాహనాలను ఆపితే చలానాలు వేయడంతో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో, ట్యాక్సీ, డీసీఎం డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకుని ఫోటో చలానాలను నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా నాయకులు జనార్దన్, భానుప్రకాష్, రామిరెడ్డి, కె.శ్రీనివాస్, ఎం.డి.సయ్యద్, కె.రాజా, జగన్, ఆజామ్, సురేష్, బాలకృష్ణ, రమేష్, మల్లేష్, దేవేందర్, కృష్ణ, సిద్దు, నిరంజన్, శేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి వేళల్లోనూ ఆగాల్సిందే!
- ట్రాఫిక్ సిగ్నల్స్‌కు వీఏసీ మోడ్ యాక్టివేషన్ - జంక్షన్లలో జరిగే ప్రమాదాలు నిరోధించేందుకే.. - వాహనాలను బట్టి పనిచేస్తున్న సిగ్నలింగ్ వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉండే రోడ్లు వాహనచోదకుల్లో ‘వేగాన్ని’పెంచుతున్నాయి. దీని కితోడు ఆ సమయాల్లో జంక్షన్స్‌లో ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం కేవలం ‘బ్లింకింగ్’మినహా పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో దూసుకువచ్చేస్తున్నారు. జంక్షన్‌కు అన్ని వైపుల ఉన్న మార్గాల నుంచి వచ్చే వాహనచోదకులది ఇదే ధోరణి అవు తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. దీనికి పరిష్కారంగా నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కీలక మార్పు చేర్పులు చేశారు. రాత్రివేళల్లో సిగ్న ల్స్‌కు వెహికిల్ యాక్టివేటెడ్ కం ట్రోల్ (వీఏసీ) మోడ్ యాక్టి వేట్ చేయడంతో పాటు కొన్ని జంక్షన్లను మూసేస్తు న్నారు. ఈ చర్యలు ఫలితా లనిచ్చాయని, జంక్షన్లలో రాత్రి వేళల్లో జరిగే ప్రమా దాలు గణనీయంగా తగ్గాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా అదే ‘సీన్’... కేంద్ర అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) ఇటీవల 2016కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న మొత్తం రోడ్డు ప్రమా దాల్లో 37 శాతం జంక్షన్లలోనే జరిగాయి. హైదరాబాద్ లోనూ ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రాంతాల్లో (బ్లాక్‌స్పాట్స్) అత్యధికం జంక్షన్లలోనే ఉంటున్నాయి. ఈ ప్రమాదాల్లోనూ రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ పోలీసులు సిగ్నలింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చారు. జంక్షన్ల మూసివేతకు నిర్ణయం... రాత్రి వేళల్లో జంక్షన్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను నిరోధించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ఆయా సమయాల్లో జంక్షన్ల మూసివేత అంశానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు సచివాలయం సమీపంలో ఉన్న తెలుగుతల్లి చౌరస్తాను తీసుకుంటే... అటు ట్యాంక్‌బండ్, ఇటు ఇక్బాల్ మీనార్ వైపు నుంచి వచ్చే రెండు మార్గాలూ ప్రధాన రహదారులు. ఆదర్శ్‌నగర్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి వచ్చే మార్గాలు ఆస్థాయిలో ప్రధానమైనవి కాదు. రాత్రి 11 గంటల తర్వాత ఆ చౌరస్తాను పోలీసులు మూసే స్తున్నారు. ఫలితంగా అక్కడ జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసుల ఇలాంటి ప్రయోగానికి అనువుగా ఉన్న ఇతర జంక్షన్లను పరిశీలిస్తున్నారు. సమయం వృథా కాకుండా... నగరంలో సాధారణంగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మాన్యువల్ మోడ్‌లో ఆపరేట్ చేస్తారు. రాత్రివేళల్లో మాన్యువల్ మోడ్ సాధ్యంకాదు. అలాగని ఆటోమేటిక్ మోడ్‌లో పనిచేస్తే వాహనాల రద్దీ లేని చోట సమయం వృథా అవుతుంది. అందుకే ట్రాఫిక్ విభాగం అధికారులు రాత్రి వేళల్లో వీఏసీ మోడ్‌ను వినియోగిస్తున్నారు. వీఏసీ అంటే.. ఓ జంక్షన్‌లోని ఆయా మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీని బట్టి రెడ్, గ్రీన్ లైట్లు వెలిగే సమయాన్ని ఇదే నిర్దేశించు కుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ పక్కనే ఉండే వర్చువల్ లూప్ కెమెరాలు జంక్షన్‌లోని ప్రతి మార్గాన్నీ ఫోకస్ చేసి ఉంటా యి. దీని నుంచి వెలువడే ప్రత్యేక తరంగాలు రహదారిని కొన్ని లూప్స్‌గా విభజించి పరిశీలి స్తుంటాయి. అన్ని రూట్లలోనూ ఉన్న కెమెరాలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో (టీ–సీసీసీ) ఉన్న సర్వర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా ఆయా రహదారుల్లోని సిగ్నల్స్ వద్ద ఆగిఉన్న వాహనాలను ఈ కెమెరాల ద్వారా కంప్యూటర్ అధ్యయనం చేస్తుంది. ఎక్కువ వాహనాలున్న వైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ... తక్కువ వాహనాలున్న వైపు రెడ్ సిగ్నల్ ఇస్తుంది. -
ఇది ఫ్లైఓవర్ బడి!
ఆదర్శం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు అడుక్కొనే దృశ్యం, ఏవో వస్తువులు అమ్ముకునే దృశ్యాలు చూస్తూనే ఉంటాం. మరోవైపు స్కూలు బస్సుల్లో టిప్‌టాప్‌గా బడికి వెళ్లే పిల్లల్ని కూడా చూస్తూనే ఉంటాం. ‘ఇది సహజమే’ అనుకుంటే సమస్య ఏమీ ఉండదు. సమస్య అనుకుంటే మాత్రం...సమాధానం ఎక్కడో ఒకచోట కనిపిస్తుంది. దారి చూపిస్తుంది. ముంబైలో ‘సిగ్నల్ శాల’ కూడా అలాంటిదే. ఇది మన దేశంలో తొలి రిజిస్టర్డ్ ట్రాఫిక్ సిగ్నల్ స్కూల్. సమర్థ్ భారత్ వ్యాసపీఠ్ (యస్బీవీ) అనే స్వచ్ఛంద సంస్థ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాచించే పిల్లలు, రకరకాల వస్తువులు అమ్ముకునే పిల్లల స్థితిగతులపై కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం నిర్వహించింది. ముంబైలోని నాలుగు మేజర్ సిగ్నల్స్ దగ్గర సర్వేలు చేసింది. ఈ సర్వే వల్ల ‘ఎంత మంది పిల్లలు సిగ్నల్స్ దగ్గర గడుపుతున్నారు’... మొదలైన విషయాలపై స్పష్టత వచ్చింది. తరువాత పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. అందులో చాలామంది కరువును తట్టుకోలేక మహారాష్ట్రలోని మారుమూల గ్రామాల నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారే. పల్లెల్లో కంటే పట్టణాల్లో మెరుగైన జీవితం గడుపుదామని వచ్చిన వారి జీవితం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే తెల్లారిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... చదువుకోవడం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తల్లిదండ్రులకు చెప్పడం మొదలుపెట్టారు. వారు కూడా అనుకూలంగా స్పందించారు. షిప్పింగ్ కంటైనర్‌ను థానేలోని ఫ్లైవోవర్ కింద అందమైన క్లాస్‌రూమ్‌గా మలిచారు. ఇందులో టీచర్స్ రూమ్, టాయిలెట్లు కూడా ఉంటాయి. ఫ్యాన్, ప్రొటెక్టర్లు ఉంటాయి. ‘ఎయిర్ టైట్’ చేయడం వల్ల బయటి నుంచి వాహనాల రణగొణధ్వనులేవీ వినిపించవు. మొదట్లో ‘ప్లే స్కూలు’గానే దీన్ని ప్రారంభించారు. పిల్లలు తమ ఇష్టం ఉన్నంతసేపు క్లాసులో కూర్చోవచ్చు. తొలి రోజుల్లో పదిహేను నిమిషాల నుంచి అర్ధగంట వరకు కూర్చునేవారు. మొదట్లో సిగ్నల్స్ దగ్గర పిల్లల్ని వెదికి, వారిని బుజ్జగించి స్కూలుకు తీసుకువచ్చేవారు. ఆ తరువాత మాత్రం పిల్లలే ఉత్సాహంగా రావడం మొదలైంది. ‘సిగ్నల్ శాల’లో నలుగురు ఫుల్ టైం టీచర్లు, ఒక అటెండర్లతో పాటు ఇంకా చాలామంది వాటంటీర్లు ఈ స్కూలు కోసం పనిచేస్తున్నారు. కేవలం చదువు మాత్రమే కాదు...శుభ్రత, క్రమశిక్షణ... ఇలా జీవితానికి అవసరమైన అనేక విషయాలను బోధిస్తున్నారు. ఈ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లలో... చదువు రాని వాళ్లతో పాటు స్కూలు మధ్యలో మానేసిన పిల్లలు కూడా ఉన్నారు. 7వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి బోర్డ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ చేయిస్తున్నారు. ‘‘పిల్లలను డాక్టరో, ఇంజనీరో చేయాలనే పెద్ద పెద్ద కోరిలేవి మాకు లేవు. హుందాగా బతకడానికి అవసరమైన పునాదిని చదువు చెప్పడం ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అంటున్నారు యస్బీవి సీయివో బటు సావంత్. పిల్లల అభిరుచులను బట్టి వొకేషనల్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్రాలు, సంగీతంతో పిల్లలను ఆకట్టుకోవడానికి టాటా టెక్నాలజీని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పాఠాలు చెప్పడం మాత్రమే కాదు...పిల్లల కోసం హెల్త్‌క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ‘‘పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. తినే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని చెబుతుంటాం. ఇది మాత్రమే కాదు... వారికి సంబంధించి... ఇది మంచి అలవాటు కాదు... అని ఏది అనిపించినా వెంటనే చెబుతాం. ఇలా జాగ్రత్తలు చెప్పడం వల్ల... స్కూలు అనేది కేవలం పాఠాలు నేర్పేది మాత్రమే కాదు... తమ క్షేమం గురించి ఆలోచించేది అనే విషయం అర్థమవుతుంది’’ అంటున్నారు బటు సావంత్. పిల్లలకు శుభ్రమైన దుస్తులు సమకూర్చడం కోసం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యోగా క్లాసులు నిర్వహించడం, ఆటలు ఆడించడం, ఆర్ట్-క్రాఫ్ట్ పాఠాలు బోధిస్తున్నారు. ‘‘చదువుకోవడం ద్వారా తమ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం వారిలో కనిపిస్తుంది. తోటి పిల్లల్లో ఎవరైనా స్కూల్ తరువాత యాచన చేస్తే మరుసటి రోజు... ఫిర్యాదు చేస్తున్నారు’’ అని చెబుతున్నారు సావంత్. సిగ్నల్ అనేది దారి చూపుతుంది. మన క్షేమం కోరుతుంది. సిగ్నల్ దగ్గర ఉన్న ‘సిగ్నల్ శాల’ కూడా పిల్లల విషయంలో అదే చేస్తుంది. -
స్మార్ట్ చేంజెస్
కూడళ్ల కుదింపుపై దృష్టి తెరపైకి ట్రాఫిక్ సిగ్నల్స్ నో పోలీస్..నో సిగ్నల్ లేనట్లే కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని కూడళ్ల కుదింపుపై అధికారులు దృష్టిసారించారు. ఆర్అండ్బీ రహదారుల పునరుద్ధరణలో భాగంగా కూడళ్లను అభివృద్ధి చేశారు. అయితే వీటిని శాస్త్రీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ట్రాఫిక్ సమస్య నుంచి నగరానికి విముక్తి కలిగించేందుకు అప్పటి అధికారులు కూడళ్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వాహనదారులు ఈ కూడళ్ల వద్దకు చేరుకున్నాక వేగం తగ్గించి వెళ్లేలా వెడల్పాటి ఐలాండ్లను నిర్మించి చుట్టూ డివైడర్లు ఏర్పాటు చేశారు. వాహనాలు చౌరస్తాల్లోకి రాగానే ఆటోమెటిక్‌గా స్లోకావడం ఒకటి తర్వాత ఒకటి వెళ్లడం జరగుతోంది. సుందర కూడళ్లపై దృష్టి ఆర్అండ్బీ రహదారులకు నిధుల వరద వస్తుండడంతో కూడళ్లను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కూడళ్ల చుట్టూ ఫెన్సింగ్, వాటర్ ఫౌంటేన్, పూలమొక్కల ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కూడళ్లను కుదించి, చుట్టూ ఉన్న రోడ్లను వెడల్పు చేయాలన్నది ఈ ప్రతిపాదనల్లో భాగంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే మళ్లీ చుట్టూ పార్కింగ్‌లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాతల సహకారంతో జంక్షన్లు ‘మన నగరం... కరీంనగరం’ పేరుతో నాలుగేళ్ల క్రితం కూడళ్లను అభివృద్ధి చేశారు. అప్పటి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రజల సహకారంతో కూడళ్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దాతలను వెతికి వారికి జంక్షన్ల సుందరీకరణ పనులు అప్పగించారు. కమాన్‌చౌరాస్తాకు రూ.10 లక్షలు, చొక్కారావు చౌరస్తాకు రూ.15 లక్షలు, బస్టాండ్ జంక్షన్‌కు రూ.25 లక్షలు, తెలంగాణచౌక్ జంక్షన్‌కు రూ.25 లక్షలు, కోర్టు జంక్షన్‌కు రూ.25 లక్షలు, మంచిర్యాలచౌరస్తాకు రూ.10 లక్షలు, ఐబీ జంక్షన్‌కు రూ.10 లక్షలు మొత్తం రూ.1.2 కోట్లు ఖర్చుపెట్టారు. భవిష్యత్ ప్రణాళిక నగంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఇన్నాళ్లు సజావుగానే సాగింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కూడళ్లు లేవని ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిర్మించిన ఈ ఐలాండ్లు మార్పు చేయాలనే ఆలోచన అధికారుల్లో మొదలైంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో కూడళ్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఇప్పటి వరకు ‘నో సిగ్నిల్... నో పోలీస్’ వ్యవస్థతో నడుస్తున్న విధానం సిగ్నల్ వ్యవస్థకు మారనుంది. ప్రధాన రహదారుల్లో ఉన్న అన్ని జంక్షన్ల కుదింపుతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. -
క్రాస్ రోడ్స్
హ్యూమర్ ఫ్లస్ మౌనానికి మించిన ఆయుధం, సిద్ధాంతం, వేదాంతం లేనేలేదని ఒకాయన ఎలాగో గ్రహించాడు. అందుకే భోంచేయడానికి తప్ప ఇక దేనికీ నోరు తెరిచేవాడు కాదు. ఎప్పుడైనా ఒకసారి ‘మన వీపు మనకు కనపడదు’ అనేవాడు. దాని అర్థమేంటో ఎవరికీ తెలియదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి వచ్చిపోయేవాళ్లని గమనిస్తూ ఉండేవాడు. కుడికి వెళ్లాల్సినవాళ్లు ఎడమకి, ఎడమకి వెళ్లాల్సినవాళ్లు కుడివైపు ఎందుకు వెళుతున్నారా అని పరిశీలించేవాడు. కొంతమందికి ఎటు వెళ్లాలో దిక్కు తెలియక మౌనిని దారి అడిగేవాళ్లు. ఆయన నవ్వేవాడు. ‘ఎవడి దారి వాడే వెతుక్కోవాలి’ అనే అర్థముండేది ఆ నవ్వులో. లోకంలో రెండు రకాల వాళ్లుంటారు. తెలిసినా తెలియనట్టు ఉండేవాళ్లు. తెలియకపోయినా తెలిసిందనుకునేవాళ్లు. మూడోరకం కూడా వుంటారు. వాళ్లకెంత తెలుసో వాళ్లకే తెలియదు. సాధారణంగా వీళ్లు పుస్తకాలు రాస్తుంటారు. ఒకసారి ఒక రచయిత ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. ఎవడు ఎవణ్ని తిడుతున్నారో, ఎందుకు హారన్లు కొడుతున్నారో తెలియడం లేదు. జ్ఞానం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు అజ్ఞానం ఫ్లై ఓవర్‌పై వెళుతుంది. ఇది గ్రహించిన రచయితకి కోపమొచ్చింది. ఎన్ని పుస్తకాలు అచ్చేసి వదిలినా జనం జ్ఞానులు కావడం లేదని ఆవేదన చెందాడు. మౌని దగ్గరికి వచ్చి, ‘‘ఈ లోకం ఇట్లా ఎందుకుందో తెలుసా?’’ అన్నాడు. రచయితని ఎగాదిగా చూసి, ‘‘మన వీపు మనకి కనపడదు’’ అన్నాడు మౌని. ‘‘కనపడకపోయినా పర్వాలేదు. దురద పుడితే గోకడానికి బోలెడంత మంది ఉంటారు’’ అన్నాడు రచయిత. మౌని చిరునవ్వు నవ్వాడు. ‘‘ఇప్పట్లో ట్రాఫిక్ క్లియర్ కాదు కాబట్టి, జనం ఎక్కడికీ వెళ్లలేరు. తెలియకుండా ఎంతోమంది ఎన్నో ఉపన్యాసాలిస్తున్నప్పుడు, తెలిసి కూడా నేను ఉపన్యసించకుండా వుండడం నేరం. ఎటూ పోలేని వాళ్లకి తొందరగా తత్వం తలకెక్కుతుంది’’ అంటూ రచయిత ప్రజలని ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టాడు. ‘‘ప్రజలారా, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నందుకు బాధపడకండి. ఈ ప్రపంచమే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంది. ఎవడికి ఎక్కడికెళ్లాలో తెలియదు. ఏ దేశం వెళ్లి జీవించాలో తెలియదు. మానవ సంబంధాలు చిరిగిపోతున్నాయి. ఇప్పుడు కావాల్సింది కంప్యూటర్లు కాదు, కుట్టు మిషన్లు. పేలికలైనవాటిని అతికించుకోవాలి. చేపకు ఈత నేర్పించడం, పక్షులకి ఎగరడం నేర్పించడం లివింగ్ స్కిల్స్ కాదు. కట్టుకథలు అక్కరలేదు, గాయాలకి కట్లు కట్టేవాడు కావాలి. కన్నీళ్లు కార్చినంత మాత్రాన మొసలి మానవతావాది కాలేదు. జింకలకు జింక చర్మాలు అమ్ముతున్న ఈ ప్రపంచాన్ని కళ్లు తెరిచి చూడండి’’ అని రచయిత అరిచాడు. జనం చప్పట్లకు బదులు హారన్లు కొట్టారు. ఇంతలో రచయిత మెడ పట్టుకుని ఎవరో లాగారు. ఎదురుగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ‘‘నీవల్లే ట్రాఫిక్ జామయ్యింది’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఇరుక్కున్నవాళ్లకు ఉపన్యాసం ఇచ్చానే కానీ ఉపన్యాసంతో ఇరుకున పెట్టలేదు’’ అన్నాడు రచయిత. ‘‘ఇంతకూ జనాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు?’’‘‘జ్ఞానుల్ని చేద్దామని!’’ ‘‘తమ ఓటుని ఎంతకు అమ్ముకోవాలో తెలిసినవాళ్లకి జ్ఞానం అవసరమా? అయినా జ్ఞానం రాజ్యమేలలేదు, రాజ్యానికి జ్ఞానంతో అవసరం లేదు. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా?’’ అని ఇన్స్పెక్టర్ కొరడా తీశాడు. ‘‘నా లక్కీ నంబర్ తొమ్మిది’’ అన్నాడు రచయిత. లక్కీ నంబర్‌కి అదనంగా ఇంకో మూడు కలిపి డజన్ వడ్డించాడు. వీపు చిరిగిపోయింది. ఇది చూసి, ‘‘మన వీపు మనకి కనపడదు’’ అని నవ్వాడుమౌని. రచయిత కంగారుపడి, ‘‘అంటే?’’ అని అడిగాడు భయంగా. మౌని చొక్కా విప్పి వీపు చూపించాడు. కొరడా దెబ్బల గుర్తులు కనిపించాయి. ‘‘దుడ్డుకర్ర వల్ల విజ్ఞత, విజ్ఞత వల్ల మౌనం సంభవిస్తాయని శ్రీకృష్ణుడు సంస్కృతంలో చెప్పాడు. అది సరిగా అర్థంకాక, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు అనువాదం చేసుకున్నారు’’ అన్నాడు మౌని. - జి.ఆర్.మహర్షి -
సీపీతో మాట్లాడితే శిక్షే!
ట్రాఫిక్ సిగ్నల్ సమస్యపై కమిషనర్‌కు ఫోన్ చేసిన కానిస్టేబుల్ నేరుగా దొరగారికి ఫోన్ చేస్తావా.. అంటూ ఉన్నతాధికారుల వేధింపులు అర్థంతరంగా ఏఆర్‌కు బదిలీ వచ్చే ఏడాది రిటైర్ కానున్న ఆ కానిస్టేబుల్ ‘పోలీసుల పరంగా ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా ఫోన్ చేయండి.. ఏ క్షణంలోైనైనా సమాచారం ఇవ్వండి.. తక్షణం స్పందిస్తాం.. సమస్య పరిష్కరిస్తాం’.. కొత్తగా వచ్చే ఏ పోలీసు అధికారి అయినా చేసే ప్రకటన.. ఇచ్చే హామీ ఇదే. ఇటీవలే నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగానంద్ కూడా ఇటువంటి హామీనే ఇచ్చారు. దీనికి సామాన్య ప్రజల సంగతేమో గానీ.. ముందుగా ఓ పోలీసాయనే స్పందించారు. సీపీకి ఫోన్ చేశారు. ఫలితం.. ఆయన హఠాత్తుగా లూప్లైన్కు బదలీ అయ్యారు. పై అధికారుల నుంచి వేధింపులకు గురయ్యారు. సరిగ్గా మరో ఏడాదిలో రిటైర్ కానున్న ఆ పోలీసాయనకు ఖాకీ బాస్‌లు చుక్కలు చూపిస్తున్నారు. వివరాలేమిటో మీరే చూడండి. విశాఖపట్నం : పరవాడ ట్రాఫిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ పెద్దాయన విధి నిర్వహణలో కొన్నాళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లంకెలపాలెం జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టసాధ్యంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న వందలాది ఫార్మా కంపెనీలకు చెందిన వాహనాలు, జాతీయ రహదారి జంక్షన్ మీదుగా ప్రయాణించే వేలాది లారీల ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ అవసరం అనివార్యమైంది. ఈ విషయమై ఆయన పలుమార్లు తనపై అధికారులకు విన్నవించుకున్నారు. ముందుగా ఎస్ఐకి చెప్పుకున్నారు. ఆ తర్వాత సీఐకు మొరపెట్టుకున్నారు. ఫలితం కానరాకపోవడంతో ఆయనకు సీపీ యోగానంద్ మాటలు గుర్తొచ్చాయి. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నేరుగా కమిషనర్‌కు ఫోన్ చేశారు. సార్.. చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదని విన్నవించుకున్నారు. స్పందించిన సీపీ అయ్యో అలాగా.. పక్కనే ట్రాఫిక్ అధికారి ఉన్నారు.. మాట్లాడండి.. అని ఆ ఫోన్ సదరు ట్రాఫిక్ అధికారికి ఇచ్చారు. సమస్య మొత్తం మళ్లీ సదరు ట్రాఫిక్ అధికారికి ఏకరువు పెట్టారు. దొరగారికే చెబుతావా.. నీ సంగతి చూస్తాం.. పెద్ద బాస్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో హమ్మయ్య.. ఇక సమస్య పరిష్కారమైపోతుందని ట్రాఫిక్ కానిస్టేబుల్ భావించాడు. కానీ అప్పటి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. 9వ తేదీ ఉదయం ఎస్సై ఫోన్ చేసి వెంటనే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. ఏం జరిగిందోనని ఆదుర్దాగా వెళ్లిన ఆ కానిస్టేబుల్‌పై అధికారులు తిట్ల దండకం అందుకున్నారు. ‘నువ్వేంటి.. నీస్థాయి ఏమిటి.. నేరుగా దొరగారికే ఫోన్ చేస్తావా.. వెంటనే నీ పాస్‌పోర్టు సరెండర్ చేయి.. స్టేషన్ రికార్డులన్నీ ఇవ్వు .. ఇవాళ నుంచి ఇక్కడొద్దు.. ఏఆర్‌కు పో’.. అని ఈసడించుకున్నారు. సర్.. నేను చేసిన తప్పేంటి దొరగారికి ఫోన్ చేయడమే తప్పయితే తొలి తప్పుగా క్షమించండి.. 59 ఏళ్ల వయసులో ఉన్న నేను ఏఆర్‌లో ఏం చేస్తాను.. వచ్చే జూన్‌లో రిటైర్మెంట్ ఉంది.. అప్పటివరకు ఇక్కడే ఉంచండి.. అని పలుమార్లు ప్రాధేయపడ్డా ఆ అధికారులు కనికరించలేదు. పైగా అతనితో సీపీకి ఫోన్ చేయడం తప్పని లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న సమస్య మీద తమ శాఖకే చెందిన ఓ సీనియర్ ఉద్యోగి సీపీకి ఫోన్ చేయడమే నేరమన్నట్టు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
వింతైన ట్రాఫిక్ సిగ్నల్స్
-
నల్లకలువల నజరానా!
ఓసారి ఆఫీసులో ముగ్గురు వ్యక్తులం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మూడో వ్యక్తి గది నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరమే ఉన్నాం. ‘ ఓ పొట్టాకు కుచ్‌భీ నై మాలూం (ఆ పిలగాడికి ఏమీ తెలీదు)’ అన్నాడు వెళ్లిన వ్యక్తి గురించి! ఏ పిల్లవాడికి? వెళ్లిన వాడు పిల్లవాడు కాదు కదా! నలభైల వాడే. ‘పొట్టా’ అని అన్న వ్యక్తీ దాదాపు అదే ఈడు వాడు. కాకపోతే ఒకటి రెండేళ్లు పెద్ద! తన కంటే చిన్న వాడు అతడి వయసుతో సంబంధం లేకుండా చిన్నవాడేనన్నమాట! కాలాన్ని సరళీకృతం చేసినట్లే వయసునూ హైద్రాబాదీలు సింప్లిఫై చేశారు. మహిళలు తమ సంభాషణలో సరదాగా ‘ఓ పొట్టీ క్యా (ఆ పిల్లా)’ అంటారు! ఆ అమ్మాయికి 50 సంవత్సరాలుండవచ్చు. దక్కనీ తెలుగులో కూడా ఈ వాడుక ఉంది. ‘వాడా బచ్చాగాడు’ వినే ఉంటారు. ట్రాఫిక్‌లో గమనించండి. సిగ్నల్స్ పడినప్పుడు ముందున్న వెహికల్ నడిపే వ్యక్తికి తల నెరవకపోయినా సరే, ‘చిచ్చా థోడా ఆగే చలోనా (చిన్నాయనా కొంచెం ముందుకు పోనియ్యి) అనే యువకులు మీకు తారసపడుతూనే ఉంటారు! హైద్రాబాద్‌కే ప్రత్యేకమైన యువకుల తుళ్లింత ఇది! ఓ సారి ఇంట్లో ఉన్నాను. మా శ్రీమతి ఫలానా ఆవిడ మివ్ముల్ని కలిసేందుకు డ్రాయింగ్ రూంలో వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. పేరేమిటి అని అడిగాను. ‘ఫలానా’ అన్నది శ్రీమతి. అదేమిటి? మగపేరు కదా! వచ్చింది పురుషుడేనేమో, ఓ సారి సరిగ్గా చూసిరా అన్నాను. వెళ్లి చూసి, పేరు అడిగి మరీ తాను చెప్పింది కరెక్టే అని నిర్ధారించింది. మహిళలకు మగ పేరేమిటి? కుతూహలం కొంచెం చరిత్రను ముందుకు తెచ్చింది! రెండవ అసఫ్‌జా తన సైన్యంలో మహిళా దళం ఏర్పరచాడు. అంతఃపుర మహిళలను రక్షించేందుకు అవసరమైతే పురుషులతోనైనా తలపడేందుకు వీలుగా ‘జఫర్ ప్లటూన్ (విజయదళం)’ ఏర్పరచారు. ఈ విభాగం పేరుకు తగ్గట్లు వ్యవహరించిందని చెప్పలేం! క్రీ.శ. 1795లో నిజాం మరాఠాలపై యుద్ధానికి వెళ్లాడు. విహారానికి వెళుతున్నావుని భావించిన రాణి పట్టుబట్టి వురీ వుహిళా సైన్యంతో సురక్షితంకాని ప్రదేశానికి వెళ్లారు. రాత్రివేళ వురాఠాల కాగడాల దాడికి వుహిళా సైన్యం ఠారెత్తింది. రాణి చర్యతో అనూహ్యమైన ఓటమి చవిచూసిన నిజాం ఔరంగాబాద్ తదితర ప్రాంతాలను వురాఠాలకు అప్పగించాడు. తదనంతర కాలంలో ఆరవ నిజాం ఆఫ్రికా సైనికులను తన వ్యక్తిగత భద్రతకోసం నియమించుకున్నాడు. హైద్రాబాద్ సంస్థానానికి మిత్రుడైన వనపర్తి రాజా పర్యవేక్షణలో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాకు చెందిన బాడీగార్డ్స్ ఉండేవారు. నిజాం కోరిక మేరకు 300 మంది టాంజానియన్స్ను పంపారు. ప్రస్తుత ఎ.సి.గార్డ్స్‌లో (ఆఫ్రికన్ కావలరీ గార్డ్స్) వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. వేర్వేరు ఆఫ్రికా దేశాల నుంచి, ప్రాంతాల నుంచి, భాషా సమూహాల నుంచి వచ్చిన ఆఫ్రికన్స్ ఇక్కడ కలసిపోయారు. అబిసీనియన్ల నెలవు కాబట్టి ‘హబ్సిగూడ’ ఏర్పడింది. ఆఫ్రికా మూలాలున్న ముస్లింలను ‘సిద్ది’లు అంటారు. సిద్ది అంబర్ బజార్, సిద్దిపేట అలా ఏర్పడినవే! స్థానికులతో మమేకమై గంగా-జమునా తెహజీబ్‌కు ఉదాహరణగా నిలిచారు!. ఆఫ్రికన్ సంగీత నృత్యాలను ఇక్కడి సంస్కృతిలో మేళవించారు. నిజాం పుట్టిన రోజున రాజ్యంలోని ప్రముఖులందరూ ఆయనకు బహుమతులు ఇస్తే, నిజాం అంగరక్షకులకు బహుమతులు ఇచ్చేవారు. రాజుగారి పుట్టిన రోజున ‘ఏసీ గార్డ్స్ ఊరేగింపుగా వెళ్లిన వైభవానికి ప్రత్యక్షసాక్షులు ఇప్పటికీ ఉన్నారు. ఆఫ్రికన్ మహిళలు నిజాం అంతఃపురంలో ప్రత్యేక హోదాతో ఉండేవారు. నిజాం పిల్లలను చెంపదెబ్బ కొట్టే అధికారమూ వారికి ఉండేది. పల్లకీ హోదా ఉండేది! నిజాం మహిళా దళంలో ఇద్దరు సుప్రసిద్ధుల గురించి చరిత్రకారులు వేర్వేరు సందర్భాల్లో రాశారు. ఒకరు ‘మామా చంపా’ మరొకరు ‘మామా బరూన్’! -
సిగ్నల్ కష్టాలకు చెక్
అల్ఫాన్యూమరికల్ టైమర్ల ఏర్పాటు దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అమలు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రైల్ రన్ సక్సెస్ 221 జంక్షన్లలో ఏర్పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కష్టాలకు చెక్ పడనుంది. అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు ద్వారా వాహనదారుల అవస్థలు తప్పనున్నాయి. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో నెలరోజుల్లో నగరంలోని 221 జంక్షన్ల వద్ద వీటిని అమర్చనున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కసరత్తు ప్రారంభించారు. హెచ్‌ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. సిగ్నల్ పాయింట్ల వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసిన ఆల్ఫాన్యూమరికల్ లైట్లను ఏర్పాచేయనున్నారు. వీటి ద్వారా సిగ్నల్స్ దగ్గర నిరీక్షణ తప్పనుంది. వాహనాలు లేని వైపు రెడ్ సిగ్నల్.. రద్దీ ఉన్న వైపు గ్రీన్‌సిగ్నల్ పడనుంది. నగరంలో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్-ట్రిమ్స్)ను గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నగరంలో సుమారు 221 జంక్షన్లలో దీనిని ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా సదుపాయం కల్పించారు. నాలుగు రూట్లలో ఉన్న ట్రాఫిక్‌ను ఒకేసారి ఆపేసి నాలుగు వైపుల ఉన్న పాదచారులు ఒకేసారి రోడ్డు దాటేందుకు అనువుగా సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించారు. సోలార్ పవర్‌తో ఇవి పనిచేస్తాయి. తాజాగా సిగ్నల్స్ వద్ద అల్ఫాన్యూమరికల్ టైమర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ఫాన్యూమెరికల్ టైమర్లు.... రెడ్..గ్రీన్..ఎల్లో లైట్ల మాదిరిగానే అల్ఫాన్యూమరికల్ టైమర్‌కు కూడా ప్రత్యేక లైట్‌ను కేటాయించారు. ఈ లైట్లో ఇంగ్లిష్ పదాలతో పాటు అంకెలను కూడా చూపడం ప్రత్యేకం. ఉదాహరణకు పాదచారులు దాటేటప్పుడు ‘జీవో’ అనే ఇంగ్లిష్ అక్షరాన్ని చూసిస్తుంది. వాహనాలు ఆగాల్సి వస్తే ‘స్టాప్’ అనే పదం కనిపిస్తుంది. దీంతో పాటు వాహనాలు ఎప్పుడు వెళ్లాలి..ఎప్పుడు ఆపాలి అనేవి సెకన్లలో చూపిస్తుంది. ఇలా పనిచేస్తుంది... హెచ్-ట్రీమ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఉన్న చోట అల్ఫా న్యూమరికల్ టైమర్లను అమర్చుతారు. టైమర్ల పక్కనే చిన్నపాటి కెమెరాను అమరుస్తారు. ఇది చౌరస్తాలోని నాలుగు వైపుల రహదారులను కనిపెడుతుంది. మూడు సెకన్లకు మించి వాహనం చౌరస్తా లైన్ (వర్చువల్) దాటక పోతే వెంటనే రెడ్ సిగ్నల్ పడుతుంది. అలాగే రద్దీ ఉన్న వైపు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇదంతా కెమెరా సహాయంతో జరుగుతుంది. ట్రైల్న్ సక్సెస్ అల్ఫాన్యూమరికల్ టైమర్లను పదిరోజుల కిందట తెలుగుతల్లి జంక్షన్లో ఏర్పాటు చేశారు. పనితీరును నిశితంగా పరిశీలించారు. ఈ చౌరస్తాలో వాహనాల రద్దీ..టైమర్ పనిచేస్తున్న విధానంపై అధికారులు ఆరా తీశారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఇది విజయవంతం కావడంతో నగరంలోని 221 చౌరస్తాల్లో వీటిని అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ టైమర్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కంపెనీ తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా నగరంలో వీటిని ఏర్పాటు చేయడం, దాని పనితీరు విజయవంతం కావడంపై బీఈఎల్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. -
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని బందరు ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఆది వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్లతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ రఘునందనరావు, ఎస్పీ ప్రభాకరరావు పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. కొనకళ్ల మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు తనను సంప్రదించిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశానన్నారు. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసేం దుకు కృషి చేస్తానన్నారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో సీసీ కెమేరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. అయితే గతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చేలా ఉన్నతాధికారులు కృషి చేస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించేలా విధులు నిర్వర్తించాలన్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను అవసరమైన మేరకు తాము వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుందన్నారు. నేరాలు నియంత్రిం చేందుకు దోహదపడుతుందన్నారు. నేరస్థులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలోని జగ్గయ్యపేట, పామర్రు పట్టణాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లయిన మూడు స్తంభాలసెంటర్, కోనేరుసెంటర్, బస్‌స్టాండ్‌సెంటర్, ప్రభుత్వాస్పత్రి, చేపల మార్కెట్, రైతు బజార్, కాలేఖాన్పేటతో మరో 32 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన కొనకళ్లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ మోటమర్రి బాబా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్, బందరు డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, పట్టణ ప్రముఖలు, జనమైత్రి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
పద్మవ్యూహం
సాక్షి, కడప : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. కడప, ప్రొద్దుటూరులాంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌కు నియంత్రణే లేకుండా పోతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, రహదారుల విస్తరణ చేపట్టకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పార్కింగ్ స్థలాలను చూపించడంలో కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కడపలోని బీకేఎం, వైవీ స్ట్రీట్, ప్రొద్దుటూరులోని మెయిన్ బజారు, బంగారు అంగళ్ల వీధిలో కనీసం నడిచి వెళ్లాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. విద్యా సంస్థలు ఉన్నచోట జీబ్రా క్రాసింగ్‌లు లేవు. కడపలో ట్రాఫిక్ ఐలాండ్ ఉన్నప్పటికీ దిష్టిబొమ్మలా దర్శనిమిస్తోంది. పదేళ్ల కిందట ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో, జనాభా, వాహనాల సంఖ్య పెరిగినా సిబ్బంది సంఖ్య మాత్రం పెరగకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరులో ఏడాదిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేకపోయినా పట్టించుకునేవారు లేరు. కడపలో ముఖ్యంగా అప్సర, కృష్ణా సర్కిళ్లు, ఏడురోడ్ల కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. బద్వేలులో ఆటోలకు సంబంధించి స్టాండు లేకపోవడంతో రోడ్లపైన నిలుపుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి మార్కెట్, నాలుగురోడ్ల కూడలిలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. మైదుకూరుకు వెళ్లే హైవే రోడ్డుపైనే ప్రతి శుక్రవారం సంత నిర్వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు చూపడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీసుల సంఖ్య నామమాత్రంగా ఉంది. రైల్వేకోడూరులో పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో వాహనాలను హైవే రోడ్డుపైనే నిలుపుతున్నారు. కూల్‌డ్రింక్ షాపుల వారు బస్సు డ్రైవర్లకు మామూళ్లు ఇచ్చి రోడ్డుపైనే వాహనాలు నిలిపేలా చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలను రెండు, మూడు రోజులు నిలిపి ఉంచినా పట్టించుకునే నాథుడు లేడు. రాజంపేటలో మార్కెట్ నుంచి పాత బస్టాండు వరకు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. కొన్ని ప్రదేశాలలో ఆటోలు, తోపుడు బండ్ల కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరులో శివాలయం, రాజీవ్ సర్కిల్లో ఏడాదిగా సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు. మెయిన్ బజారు, బంగారు అంగళ్ల వీధి తదితర ప్రాంతాలు ఇరుకుగా ఉండటంతో ద్విచక్రవాహనాలు నిలిపితే ఆటోలు వెళ్లలేని పరిస్థితి. దీంతో ప్రయాణికులు నడిచి వెళుతున్నారు. మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో అన్ని వైపులా నుంచి వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డుపైనే తోపుడుబండ్లు, వాహనాలను నిలుపుతుండటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. రాయచోటిలో రోడ్లు వెడల్పులేవు. వేలసంఖ్యలో ఉన్న ఆటోలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షకు పైగా జనాభా దాటినా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లేకపోవడం గమనార్హం. కమలాపురంలో రైల్వే గేటు వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు 20కి పైగా రైళ్లు నడుస్తుండడంతో గేటు వేసినపుడు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడుతోంది. జమ్మలమడుగులోని పాత బస్టాండు ప్రాంతంలో ఆటోలు, తోపుడుబండ్లను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. -
మొరాయిస్తున్న ట్రాఫిక్ సిగ్నళ్లు
న్యూఢిల్లీ: ట్రాఫిక్ సిగ్నళ్లు తరచూ మొరాయిస్తుండడంతో వాహనదారులు నానాఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలమేర నిధులను వెచ్చించినప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఈ సమస్యను జటిలం చేస్తోంది. నగరంలో మొత్తం 800 ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి. అయితే వర ్షం కురిస్తే ఇవి మొండికేస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జాం సర్వసాధారణమైపోయింది. ఈ కారణంగా వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవిధంగా ఎందుకు జరుగుతోందంటూ ఓ ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ని ప్రశ్నించగా నగరంలోని అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు అత్యంత పురాతనమైనవని తెలిపారు. కేబుళ్లలోకి వాన నీరు చొరబడుతోందని, ఇది కూడా సిగ్నళ్లు పనిచేయకపోవడానికి ఓ కారణమని అన్నారు. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ జీవితకాలం ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలని, అయితే తరచూ మరమ్మతులు చేయిస్తుండడంవల్ల అవి దాదాపు 15 సంవత్సరాలదాకా పనిచేస్తాయన్నారు. ఇదే విషయమై మరో అధికారి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సిగ్నళ్లు అంతగా మొరాయించడం లేదన్నారు. ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ శుక్లా మాట్లాడుతూ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో ఏడు నుంచి ఎనిమిది శాతం మేర మాత్రమే వర్షాకాల సమయంలో మొండికేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఏయే ప్రాంతాల్లోగల ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగా పనిచేయడం లేదో ఆయన సవివరంగా తెలియజేశారు. ఇదిలాఉండగా ఆయా సిగ్నళ్లకు బ్యాటరీ వెసులుబాటు కల్పించాలని ట్రాఫిక్ విభాగం యోచిస్తోంది. ‘బెంగళూర్ నగరంలో ఈ వెసులుబాటు ఉంది. ఇదే వ్యవస్థను నగరంలోకూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. ఈవిధంగా చేయడం వల్ల ఒకవేళ వర్షం కురిసిన సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పటికీ సిగ్నళ్లు మాత్రం ఎప్పటిమాదిరిగానే పనిచేస్తాయన్నారు. కాగా వర్షాలు కురిసినపుడు సిగ్నళ్లు మొరాయిస్తాయి. ఈ సమాచారం అందగానే కార్పొరేషన్‌కు చెందిన మెకానిక్ సిబ్బంది మరమ్మతు పనులు చేపడతారు. ఇదే విషయమై కొందరు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే మొరాయిస్తున్న సిగ్నళ్ల సంఖ్య ఈ ఏడాది బాగా తగ్గిపోయిందని వివరించారు.