జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాల సమన్వయంతో కాంట్రాక్టు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. వాహనాల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు సదుపాయంగా 104 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. స్టడీ, డిజైన్, సప్లై ఏర్పాటు, నిర్వహణలన్నీ కాంట్రాక్టు సంస్థే చేయాల్సిఉంటుంది. మూడేళ్ల కాలానికి నిర్వహణతోసహా అంచనా వ్యయం దాదాపు రూ.60 కోట్లు.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు త్వరలో కొత్తగా అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ (ఏటీఎస్‌సీ)తో జంక్షన్లలోని సిగ్నళ్లను నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్లోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహిస్తున్న సంస్థ కాంట్రాక్టు వచ్చే ఆగస్ట్ నెలతో ముగియనుండటంతోఇప్పటికే ఉన్న 231 జంక్షన్ల నిర్వహణతో పాటు కొత్తగా మరో 150 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టు కోసం టెండర్లకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)గా ఆహ్వానించారు.
సులువుగా ప్రయాణం..
రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను, భవిష్యత్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని సాఫీ ప్రయాణం కోసం ఆటోమేటిక్‌గా పనిచేసే ఏటీఎస్‌సీ సాంకేతికతతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ట్రాఫిక్ సిగ్నళ్లు అల్ఫా న్యూమరిక్ టైమర్లను కలిగి ఉంటాయి. ట్రాఫిక్ సెంట్రల్ కమాండ్ సెంటర్ (టీసీసీసీ) నుంచి వీటిని పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం తదితర విషయాలను తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ విధానంలో ఉంటాయి. ఒక సమయంలో ఒక కారిడార్‌లో ఉండే అన్ని జంక్షన్ల వద్ద కూడా రెడ్ లేదా గ్రీన్ లైట్ మాత్రమే ఉండే ఏర్పాట్లు సైతం కొత్త విధానంలో ఉంటాయని సమాచారం. తద్వారా ఒక కారిడార్‌లో ఒక జంక్షన్ దాటగానే దగ్గరలోని మరో జంక్షన్ వద్ద ఆగిపోకుండా వెళ్లేందుకు వీలవుతుంది. 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌డెస్క్ కూడా ఉంటుంది. భువనేశ్వర్ తదితర నగరాల్లో ఈ విధానం ఉంది.
ఏటీఎస్‌సీతో ప్రయోజనాలు..
♦ టీసీసీసీ నుంచే ప్రతి సిగ్నల్ పనితీరును పర్యవేక్షించవచ్చు.
♦ ఏవైనా లోటుపాట్లున్నా, పనిచేయకున్నా తెలుసుకోవచ్చు.
♦ ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది.
♦ సందర్భాన్ని బట్టి ట్రాఫిక్ పరిస్థితులపై వాహనదారులకు సమాచారం
♦ రహదారుల ప్రమాదాల నివారణ
♦ రియల్ టైమ్‌తో ట్రాఫిక్ రద్దీ విశ్లేషణ
♦ ప్రయాణ భద్రత మెరుగు.
ఇతరత్రా పనులతో సహా కొత్తగా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ చేయాల్సిన పనులు
♦ ప్రస్తుతం ఉన్న 231 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ
♦ 3 పాదచారుల సిగ్నల్స్ ఆపరేషన్, నిర్వహణ
♦ 17 వేరియబుల్ మెసేజ్ బోర్డుల నిర్వహణ
♦ 150 జంక్షన్లలో కొత్త సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ
♦ 104 పెలికాన్ సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ
♦ అన్నీ కలిపి యూనిఫైడ్ సిగ్నల్ సిస్టమ్‌గా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment