![Traffic Signals Open in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/9/signals.jpg.webp?itok=l-BVTYR_)
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం ప్రారంభించాయి. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మార్చి 22 నుంచి వీటికి బ్రేక్ పడింది. మధ్య మధ్యలో అక్కడక్కడా కొన్ని పని చేసినా పూర్తి స్థాయిలో కాదు. ఇప్పటి వరకు దాదాపు అన్ని జంక్షన్లూ రెడ్ లైట్ బ్లింకింగ్‌తోనే నడుస్తూ వచ్చాయి. అయితే లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు అమలులోకి రావడంతో నగరంలో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో శుక్రవారం నుంచి అన్ని సిగ్నల్స్ పని చేయడం ప్రారంభించాయి.
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి నగరంలోని ఫ్లైఓవర్లు సైతం మూతపడ్డాయి. కేవలం ప్రత్యామ్నాయం లేని బేగంపేట, డబీర్‌పుర వంటి ఫ్లైఓవర్లు మాత్రమే పని చేశాయి. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న జీహెచ్‌ఎంసీ వీటిపై రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. శుక్రవారం నుంచి అనేక ఫ్లైఓవర్లు కూడా తెరుచుకున్నాయి. మరమ్మతులు, రోడ్డు నిర్మాణం పూర్తికాని వాటిని మాత్రమే మూసి ఉంచారు. మరోపక్క పోలీసు విభాగం ప్రధాన రహదారులపై ఉన్న చెక్‌పాయింట్ల వద్ద తనిఖీలు కొనసాగించింది. ద్విచక్ర వాహనంపై ఇద్దరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణిస్తున్న వారిని ఆపి చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment