క్రాస్ రోడ్స్ | Cross Roads | Sakshi
Sakshi News home page

క్రాస్ రోడ్స్

Published Tue, Jul 19 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

క్రాస్ రోడ్స్

క్రాస్ రోడ్స్

హ్యూమర్ ఫ్లస్
 
మౌనానికి మించిన ఆయుధం, సిద్ధాంతం, వేదాంతం లేనేలేదని ఒకాయన ఎలాగో గ్రహించాడు. అందుకే భోంచేయడానికి తప్ప ఇక దేనికీ నోరు తెరిచేవాడు కాదు. ఎప్పుడైనా ఒకసారి ‘మన వీపు మనకు కనపడదు’ అనేవాడు. దాని అర్థమేంటో ఎవరికీ తెలియదు.
 ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి వచ్చిపోయేవాళ్లని గమనిస్తూ ఉండేవాడు. కుడికి వెళ్లాల్సినవాళ్లు ఎడమకి, ఎడమకి వెళ్లాల్సినవాళ్లు కుడివైపు ఎందుకు వెళుతున్నారా అని పరిశీలించేవాడు. కొంతమందికి ఎటు వెళ్లాలో దిక్కు తెలియక మౌనిని దారి అడిగేవాళ్లు. ఆయన నవ్వేవాడు. ‘ఎవడి దారి వాడే వెతుక్కోవాలి’ అనే అర్థముండేది ఆ నవ్వులో.  లోకంలో రెండు రకాల వాళ్లుంటారు. తెలిసినా తెలియనట్టు ఉండేవాళ్లు. తెలియకపోయినా తెలిసిందనుకునేవాళ్లు. మూడోరకం కూడా వుంటారు. వాళ్లకెంత తెలుసో వాళ్లకే తెలియదు. సాధారణంగా వీళ్లు పుస్తకాలు రాస్తుంటారు.

 ఒకసారి ఒక రచయిత ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాడు. ఎవడు ఎవణ్ని తిడుతున్నారో, ఎందుకు హారన్లు కొడుతున్నారో తెలియడం లేదు. జ్ఞానం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు అజ్ఞానం ఫ్లై ఓవర్‌పై వెళుతుంది. ఇది గ్రహించిన రచయితకి కోపమొచ్చింది. ఎన్ని పుస్తకాలు అచ్చేసి వదిలినా జనం జ్ఞానులు కావడం లేదని ఆవేదన చెందాడు.  మౌని దగ్గరికి వచ్చి, ‘‘ఈ లోకం ఇట్లా ఎందుకుందో తెలుసా?’’ అన్నాడు.    రచయితని ఎగాదిగా చూసి, ‘‘మన వీపు మనకి కనపడదు’’ అన్నాడు మౌని. ‘‘కనపడకపోయినా పర్వాలేదు. దురద పుడితే గోకడానికి బోలెడంత మంది ఉంటారు’’ అన్నాడు రచయిత. మౌని చిరునవ్వు నవ్వాడు.

‘‘ఇప్పట్లో ట్రాఫిక్ క్లియర్ కాదు కాబట్టి, జనం ఎక్కడికీ వెళ్లలేరు. తెలియకుండా ఎంతోమంది ఎన్నో ఉపన్యాసాలిస్తున్నప్పుడు, తెలిసి కూడా నేను ఉపన్యసించకుండా వుండడం నేరం. ఎటూ పోలేని వాళ్లకి తొందరగా తత్వం తలకెక్కుతుంది’’ అంటూ రచయిత ప్రజలని ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టాడు. ‘‘ప్రజలారా, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నందుకు బాధపడకండి. ఈ ప్రపంచమే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంది. ఎవడికి ఎక్కడికెళ్లాలో తెలియదు. ఏ దేశం వెళ్లి జీవించాలో తెలియదు. మానవ సంబంధాలు చిరిగిపోతున్నాయి. ఇప్పుడు కావాల్సింది కంప్యూటర్లు కాదు, కుట్టు మిషన్లు. పేలికలైనవాటిని అతికించుకోవాలి. చేపకు ఈత నేర్పించడం, పక్షులకి ఎగరడం నేర్పించడం లివింగ్ స్కిల్స్ కాదు. కట్టుకథలు అక్కరలేదు, గాయాలకి కట్లు కట్టేవాడు కావాలి. కన్నీళ్లు కార్చినంత మాత్రాన మొసలి మానవతావాది కాలేదు. జింకలకు జింక చర్మాలు అమ్ముతున్న ఈ ప్రపంచాన్ని కళ్లు తెరిచి చూడండి’’ అని రచయిత అరిచాడు.
 జనం చప్పట్లకు బదులు హారన్లు కొట్టారు.

ఇంతలో రచయిత మెడ పట్టుకుని ఎవరో లాగారు. ఎదురుగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్. ‘‘నీవల్లే ట్రాఫిక్ జామయ్యింది’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఇరుక్కున్నవాళ్లకు ఉపన్యాసం ఇచ్చానే కానీ ఉపన్యాసంతో ఇరుకున పెట్టలేదు’’ అన్నాడు రచయిత. ‘‘ఇంతకూ జనాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు?’’‘‘జ్ఞానుల్ని చేద్దామని!’’ ‘‘తమ ఓటుని ఎంతకు అమ్ముకోవాలో తెలిసినవాళ్లకి జ్ఞానం అవసరమా? అయినా జ్ఞానం రాజ్యమేలలేదు, రాజ్యానికి జ్ఞానంతో అవసరం లేదు. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా?’’ అని ఇన్‌స్పెక్టర్ కొరడా తీశాడు.
 ‘‘నా లక్కీ నంబర్ తొమ్మిది’’ అన్నాడు రచయిత. లక్కీ నంబర్‌కి అదనంగా ఇంకో మూడు కలిపి డజన్ వడ్డించాడు. వీపు చిరిగిపోయింది. ఇది చూసి, ‘‘మన వీపు మనకి కనపడదు’’ అని నవ్వాడుమౌని. రచయిత కంగారుపడి, ‘‘అంటే?’’ అని అడిగాడు భయంగా.  మౌని చొక్కా విప్పి వీపు చూపించాడు. కొరడా దెబ్బల గుర్తులు కనిపించాయి.  ‘‘దుడ్డుకర్ర వల్ల విజ్ఞత, విజ్ఞత వల్ల మౌనం సంభవిస్తాయని శ్రీకృష్ణుడు సంస్కృతంలో చెప్పాడు. అది సరిగా అర్థంకాక, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు అనువాదం చేసుకున్నారు’’ అన్నాడు మౌని.

 - జి.ఆర్.మహర్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement