నల్లకలువల నజరానా!
ఓసారి ఆఫీసులో ముగ్గురు వ్యక్తులం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మూడో వ్యక్తి గది నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరమే ఉన్నాం.
‘ ఓ పొట్టాకు కుచ్‌భీ నై మాలూం (ఆ పిలగాడికి ఏమీ తెలీదు)’ అన్నాడు వెళ్లిన వ్యక్తి గురించి! ఏ పిల్లవాడికి? వెళ్లిన వాడు పిల్లవాడు కాదు కదా! నలభైల వాడే. ‘పొట్టా’ అని అన్న వ్యక్తీ దాదాపు అదే ఈడు వాడు.
కాకపోతే ఒకటి రెండేళ్లు పెద్ద! తన కంటే చిన్న వాడు అతడి వయసుతో సంబంధం లేకుండా చిన్నవాడేనన్నమాట! కాలాన్ని సరళీకృతం చేసినట్లే వయసునూ హైద్రాబాదీలు సింప్లిఫై చేశారు. మహిళలు తమ సంభాషణలో సరదాగా ‘ఓ పొట్టీ క్యా (ఆ పిల్లా)’ అంటారు! ఆ అమ్మాయికి 50 సంవత్సరాలుండవచ్చు. దక్కనీ తెలుగులో కూడా ఈ వాడుక ఉంది. ‘వాడా బచ్చాగాడు’ వినే ఉంటారు.
ట్రాఫిక్‌లో గమనించండి. సిగ్నల్స్ పడినప్పుడు ముందున్న వెహికల్ నడిపే వ్యక్తికి తల నెరవకపోయినా సరే, ‘చిచ్చా థోడా ఆగే చలోనా (చిన్నాయనా కొంచెం ముందుకు పోనియ్యి) అనే యువకులు మీకు తారసపడుతూనే ఉంటారు! హైద్రాబాద్‌కే ప్రత్యేకమైన యువకుల తుళ్లింత ఇది!
ఓ సారి ఇంట్లో ఉన్నాను. మా శ్రీమతి ఫలానా ఆవిడ మివ్ముల్ని కలిసేందుకు డ్రాయింగ్ రూంలో వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. పేరేమిటి అని అడిగాను. ‘ఫలానా’ అన్నది శ్రీమతి. అదేమిటి? మగపేరు కదా! వచ్చింది పురుషుడేనేమో, ఓ సారి సరిగ్గా చూసిరా అన్నాను. వెళ్లి చూసి, పేరు అడిగి మరీ తాను చెప్పింది కరెక్టే అని నిర్ధారించింది. మహిళలకు మగ పేరేమిటి? కుతూహలం కొంచెం చరిత్రను ముందుకు తెచ్చింది! రెండవ అసఫ్‌జా తన సైన్యంలో మహిళా దళం ఏర్పరచాడు.
అంతఃపుర మహిళలను రక్షించేందుకు అవసరమైతే పురుషులతోనైనా తలపడేందుకు వీలుగా ‘జఫర్ ప్లటూన్ (విజయదళం)’ ఏర్పరచారు. ఈ విభాగం పేరుకు తగ్గట్లు వ్యవహరించిందని చెప్పలేం! క్రీ.శ. 1795లో నిజాం మరాఠాలపై యుద్ధానికి వెళ్లాడు. విహారానికి వెళుతున్నావుని భావించిన రాణి పట్టుబట్టి వురీ వుహిళా సైన్యంతో సురక్షితంకాని ప్రదేశానికి వెళ్లారు. రాత్రివేళ వురాఠాల కాగడాల దాడికి వుహిళా సైన్యం ఠారెత్తింది. రాణి చర్యతో అనూహ్యమైన ఓటమి చవిచూసిన నిజాం ఔరంగాబాద్ తదితర ప్రాంతాలను వురాఠాలకు అప్పగించాడు.
తదనంతర కాలంలో ఆరవ నిజాం ఆఫ్రికా సైనికులను తన వ్యక్తిగత భద్రతకోసం నియమించుకున్నాడు. హైద్రాబాద్ సంస్థానానికి మిత్రుడైన వనపర్తి రాజా పర్యవేక్షణలో తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాకు చెందిన బాడీగార్డ్స్ ఉండేవారు. నిజాం కోరిక మేరకు 300 మంది టాంజానియన్స్‌ను పంపారు. ప్రస్తుత ఎ.సి.గార్డ్స్‌లో (ఆఫ్రికన్ కావలరీ గార్డ్స్) వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. వేర్వేరు ఆఫ్రికా దేశాల నుంచి, ప్రాంతాల నుంచి, భాషా సమూహాల నుంచి వచ్చిన ఆఫ్రికన్స్ ఇక్కడ కలసిపోయారు. అబిసీనియన్ల నెలవు కాబట్టి ‘హబ్సిగూడ’ ఏర్పడింది. ఆఫ్రికా మూలాలున్న ముస్లింలను ‘సిద్ది’లు అంటారు. సిద్ది అంబర్ బజార్, సిద్దిపేట అలా ఏర్పడినవే! స్థానికులతో మమేకమై గంగా-జమునా తెహజీబ్‌కు ఉదాహరణగా నిలిచారు!. ఆఫ్రికన్ సంగీత నృత్యాలను ఇక్కడి సంస్కృతిలో మేళవించారు.
నిజాం పుట్టిన రోజున రాజ్యంలోని ప్రముఖులందరూ ఆయనకు బహుమతులు ఇస్తే, నిజాం అంగరక్షకులకు బహుమతులు ఇచ్చేవారు. రాజుగారి పుట్టిన రోజున ‘ఏసీ గార్డ్స్ ఊరేగింపుగా వెళ్లిన వైభవానికి ప్రత్యక్షసాక్షులు ఇప్పటికీ ఉన్నారు. ఆఫ్రికన్ మహిళలు నిజాం అంతఃపురంలో ప్రత్యేక హోదాతో ఉండేవారు. నిజాం పిల్లలను చెంపదెబ్బ కొట్టే అధికారమూ వారికి ఉండేది. పల్లకీ హోదా ఉండేది! నిజాం మహిళా దళంలో ఇద్దరు సుప్రసిద్ధుల గురించి చరిత్రకారులు వేర్వేరు సందర్భాల్లో రాశారు. ఒకరు ‘మామా చంపా’ మరొకరు ‘మామా బరూన్’!