గెలిచి చూపించా.. | i showed to all my winning, says Suma Kanakala | Sakshi
Sakshi News home page

గెలిచి చూపించా..

Published Sat, Jul 26 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

గెలిచి చూపించా..

గెలిచి చూపించా..

మీ.. సుమ...
మహానగరంలో మలయాళీ అమ్మాయి తెలుగు మాట్లాడితే నవ్వొస్తుంది కదా... పదాల ఉచ్ఛారణ వింటే ఈ భాషేంటిరా బాబూ! అని అనుకుంటాం కదా.. బుల్లితెరపై యాంకర్‌గా పేరుతెచ్చుకున్న సుమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కాకపోతే తెలుగుపై ఉన్న మమకారంతో ఆమె వాటిని లెక్కజేయలేదు. ఆ వెక్కిరింతల మధ్యే పట్టుదల పెంచుకుని పదసంపదను పెంచుకుంది. ‘పలుకు’బడినీ మెరుగుపరచుకుంది. తడబడ్డ భాషలోనే మాటకారిగా గుర్తింపు తెచ్చుకున్న సుమ అనుభవాలు ఆమె మాటల్లోనే...
 
 సిటీ నాకు భాష నేర్పింది
 ‘తెలుగులో మాట్లాడటానికి పదాల కోసం తడబడే నువ్వు... ఇప్పుడు ఎడాపెడా యాంకరింగ్ చేస్తున్నావేంటి?’ అని నా చిన్ననాటి ఫ్రెండ్స్ అంటుంటారు. వాటికి నాలో నేనే అనుకుంటుంటాను.. ‘అప్పుడు వెక్కిరించారు... ఇప్పుడు కుళ్లుకుంటున్నారు కదా’ అని! ఈ సిటీ నాకు భాష నేర్పింది. సొసైటీలో ఒక హోదాలో నిలబడేందుకు దారి చూపింది.
 
 ట్యాంక్‌బండ్‌కు అవతల... ఇవతల
 ట్యాంక్‌బండ్ సెంటర్ పాయింట్ అనుకుంటే... బాల్యమంతా మెట్టుగూడలో గడిచింది. వివాహం తర్వాత ట్యాంక్‌బండ్‌కు ఈ పక్క ఉంటున్నాం. మాది కేరళ. నాన్న రైల్వే ఉద్యోగి. సికింద్రాబాద్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నా. రైల్వే డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఓయూలో పీజీ పూర్తి చేశా. తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నా... మాట్లాడటం ఇబ్బందిగా ఉండేది. నా ఉచ్చారణకు అందరికీ నవ్వొచ్చేది. కొందరు గేలి చేసేవాళ్లు. అప్పుడే నాలో పట్టుదల పెరిగింది.
 
 ఓనం ఆటతో మైమరపు
 ఓనం పండగంటే భలే సరదాగా ఉండేది. రైల్వే క్వార్టర్స్‌లో తమిళులు, మళయాళీలు, కన్నడిగులు, మార్వాడీలు... ఇలా అందరూ ఉండేవాళ్లు. ఓనం మా ఫేవరెట్. దాన్ని మేమే స్టార్ట్ చేసేవాళ్లం. మిగతావారిని ఇన్వాల్వ్ చేసేవాళ్లం. కాలనీ మొత్తం తిరగడం, పూలు ఏరుకొచ్చి రాశులు పోయడం... దీంతో వాళ్లతోనూ మంచి అనుబంధం పెరిగేది. అనేక భాషలు నేర్చుకోవడానికి ఇది కూడా తోడ్పడింది.
 
 ఏడు రాళ్లాట భలే..
 రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లినప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చే ఆటలు కొన్ని ఉన్నాయి. మారం పీటీ, ఖోఖో, పరుగు పందాలు... ఇలా ఎన్నో. కాకపోతే నాకు బాగా నచ్చిన ఆట ఏడు రాళ్లాట. రాళ్లను గిరిలో పోసి, సూటిగా రాయితో కొడితే... వావ్... కేరింతలు కొట్టేదాన్ని. గెలిచినంత ఫీలింగ్ వచ్చేది.
 
 అయ్యప్ప టెంపుల్ మరిచిపోలేని జ్ఞాపకం...
 మెట్టుగూడా అయ్యప్ప టెంపుల్‌కు రోజూ వెళ్లేదాన్ని. ఇక్కడే డాన్స్ క్లాస్ కూడా నేర్చుకున్నాను. కూచిపూడి డాన్స్ చేస్తుంటే మా చుట్టుపక్కల వాళ్లంతా కన్నార్పకుండా చూసేవాళ్లు. ఇప్పటికీ ఎప్పుడైనా ఒకసారి అటు వెళ్లాలన్పిస్తుంది.
 
 దీపావళి అంటే భయం
 దీపావళి వస్తే చాలు నాకు చచ్చేంత భయమేసేది. పెద్ద పెద్ద బాంబులు.. సౌండ్లు.. అమ్మో! చెవులకు దూదులు పెట్టుకుని ఇంట్లో దాక్కునేదాన్ని. సీమ టపాకాయ కాల్చాలన్నా భయమేసేది...
 
 రన్నింగ్ రేస్‌కు సై..
 ఆగస్టు 15, నవంబర్ 14... జాతీయ పండుగలంటే నాకు భలే ఇష్టం. అప్పుడు పరేడ్ గ్రౌండ్‌ను ముస్తాబు చేస్తారే... అదింకా ఇష్టం. ఇక స్కూల్‌లో అయితే రన్నింగ్ రేస్‌లో మొదటి పేరు నాదే. ఎందుకంటే కప్ నాకు గ్యారెంటీ అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని.
 
 ఓయ్.. ఎక్కడా..
 గోల్కొండ కెళ్లడం... అక్కడ చప్పట్లు కొట్టి అరవడం భలే సరదాగా ఉండేది. మొన్నటి దాకా అక్కడికెళ్లి ఓయ్... ఎక్కడా అని అరుస్తుంటే.. ప్రతిధ్వని వస్తుంటే థ్రిల్‌గా ఫీలయ్యేదాన్ని. ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్.. సిటీలో ఉన్న ప్రతీదీ గొప్పగానే అనిపిస్తుంది. ఏడాదికోసారి నాంపల్లిలో పెట్టే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కు వెళ్లకుండా ఉండలేను.
 
 పానీపూరీ స్పెషల్

 సిటీలో దొరికే పానీపూరీ భలే ఇష్టం. చిన్నప్పటి నుంచీ అంతే. ఇంకా మిర్చిబజ్జీ అన్నా అంతే ప్రాణం. సిటీలో ఎక్కడైనా ఈ రెండు ఐటమ్స్ బాగా నచ్చుతాయి. మళ్లీ వేరే సిటీలకు వెళ్తే ఇంత టేస్ట్ రాదు. ఇంకా హైదరాబాదీ బిర్యానీ అన్నా చాలా చాలా ఇష్టం.
 
 నగరం చుట్టేస్తే..
 ఓల్డ్ సిటీలో బ్యాంగిల్స్ కొనడం సరదా. అప్పుడప్పుడు బిర్లామందిర్‌ను అలా చూస్తూ మెట్లెక్కడం ఇష్టం. హుస్సేన్‌సాగర్‌లో భగీరథి ఎక్కడం మరో థ్రిల్. బతుకమ్మ పండుగ ఆడుతుంటే పూల సజ్జాలు చూడటం మరీమరీ ఇష్టం.
 
 ట్రాఫిక్ జామ్ ఒక్కటే నచ్చని పాయింట్...
 భిన్న రాష్ట్రాల వాళ్లున్న సిటీ ఇది. విభిన్న సంస్కృతుల మేళవింపు ఉన్న నగరం మనది. ఈ సిటీ ఇమేజ్ ఇంకా పెరగాలనేది నా కోరిక. అయితే ఇక్కడ ట్రాఫిక్ కొంత నచ్చని విషయమే. దానికి కారణం మనమేనని, ఏమీ చేయలేమని కూడా తెలుసు. అయినా ఎందుకో అదొక్కటే నాకు నచ్చని పాయింట్. ఈ అందమైన నగరంలో ఇంకెన్నో అనుభూతులున్నాయి. ఏదేమైనా తెలుగు రాదని గేలిచేసిన చోటే గెలిచి చూపించా! ఇదే నాకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం.
 
 కాలేజీ నుంచే కేరీర్ స్టార్ట్
 కూచిపూడి నేర్చుకున్నాను కదా. సరదాగా ప్రదర్శనలిచ్చా. అలా దూరదర్శన్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటికే తెలుగు బాగా నేర్చేసుకున్నాను. ఏ పదం మాట్లాడితే వెక్కిరించే వాళ్లో, దాన్ని ఎలా పలకాలో తెలుసుకునేదాన్ని. కాలేజీకి వచ్చే సరికే పర్‌ఫెక్ట్ అయ్యాననుకోండి. సిటీ గురించి, ఇక్కడి కల్చర్ గురించి పుస్తకాలు కొని చదివాను. మొత్తం మీద అలా... అలా... యాంకర్ అయ్యాను.
 - వనం దుర్గాప్రసాద్
 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement