గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్.
స్వరమే అసలైన పెట్టుబడి
టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్‌టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్‌ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి.
పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా
మనదేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి.
అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్‌పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్‌లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే.
వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది.
వాయిస్, డిక్షన్‌తో రాణింపు
‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్‌ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్‌లో ఎదిగేందుకు వీలుంటుంది’’
-రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే