radio
-
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్‌వర్క్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్‌వెల్ట్‌తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్‌లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్‌ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
అతి పే.....ద్ద రేడియో జెట్
ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్. కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి. వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) టెలిస్కోప్ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేడియో వ్యాపారం మూసివేత
ఇష్క్ 104.8 ఎఫ్ఎం(Ishq FM) బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్న రేడియో(Radio) వ్యాపారాన్ని వచ్చే ఆరు నెలల్లో మూసివేయనున్నట్లు టీవీ టుడే నెట్వర్క్(TV Today) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే మూసివేత నిర్ణయానికి కారణమని పేర్కొంది. టీవీ టుడే నెట్వర్క్ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మూడు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేడియో వ్యాపారం టర్నోవరు రూ.16.18 కోట్లుగాను, నష్టం రూ.19.53 కోట్లుగాను నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో రేడియో విభాగం వాటా 1.7 శాతంగా ఉంది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరువిస్తరణ బాటలో కామధేనుబ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై దృష్టి పెడుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను నెక్ట్స్’ తయారీ సామర్థ్యాన్ని 20 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. అలాగే చానల్ పార్ట్నర్ల నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వికసిత భారత్‌లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిక బారత్‌లో యువత పాత్ర కీలకమని అన్నారు.‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ .. మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని అన్నారు.'मन की बात' के 116वें एपिसोड में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है, जिनके पूरे परिवार की कोई राजनीतिक पृष्ठभूमि नहीं रही है। ऐसे एक लाख युवाओं को, नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई विशेष… pic.twitter.com/xcU1doulIi— ANI_HindiNews (@AHindinews) November 24, 2024ఈరోజు(ఆదివారం) చాలా ప్రత్యేకమైన రోజని, ఈరోజు ఎన్సీసీడీ అని ప్రధాని గుర్తుచేశారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని, నాడు తాను పొందిన అనుభవం అమూల్యమైనదని మోదీ పేర్కొన్నారు. ఎన్సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ప్రతీ విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువత ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఖచ్చితంగా అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందన్నారు.కార్యక్రమంలో స్వామి వివేకానందను స్మరించుకున్న ప్రధాని మోదీ 'వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నామని అన్నారు. జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘యంగ్ ఐడియాస్ మహాకుంభ్’ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారాల నుంచి తాను పిలుపునిచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: శంకర నేత్రాలయ అట్లాంటాలో శాస్త్రీయ నృత్య కార్యక్రమాలతో నిధుల సేకరణ -
యానిమేషన్ రంగంలో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిసారిలాగే ఈ కార్యక్రమంలోనూ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోని 115వ ఎపిసోడ్ నేడు ప్రసారమయ్యింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని చెబుతూ, నేటి మన్ కీ బాత్‌లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను. సర్దార్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరగనుంది. బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15న జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవి. అయినా వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు.నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపిందని మోదీ అన్నారు.ఛోటా భీమ్లాగా మన ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. భారతీయ క్రీడలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నాయి. భారత్‌లో సృజనాత్మక శక్తి ఉప్పొంగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.10 సంవత్సరాల క్రితం, భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని ఎవరైనా చెప్పినప్పుడు, చాలా మంది దానిని నమ్మలేదు. పైగా ఎగతాళి చేసేవారు. కానీ నేడు దేశం సాధించిన విజయాన్ని చూసి.. వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు వాటిని ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ -
పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులగా మారారు. వారి నుండి నేను ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ.. -
స్వరంతో గిన్నిస్ రికార్డు..ఏకంగా 72 గంటల 30 నిమిషాల..!
ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.కమ్యూనిటీ రేడియో !ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్!
సాక్షి, సిటీబ్యూరో: ‘గుడ్ మారి్నంగ్ హైదరాబాద్...’ త్వరలో నగర పోలీసుల నోటి వెంట ఇలాంటి మాట వినిపించనుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసు విభాగం ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేయనుండటమే దానికి కారణం. ఇతర ఎఫ్ఎం రేడియోలకు దీటుగా, అన్ని హంగులతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటించారు.నగర పోలీసు విభాగానికి ఇప్పటి వరకూ సొంతంగా ఎలాంటి రేడియో లేదు. అయితే కొన్నేళ్లుగా వివిధ ఎఫ్ఎం రేడియోలతో పాటు ఇతర మీడియా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు వంటి కీలక ఘట్టాలతో పాటు సున్నితాంశాల పైనా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి ఈ వేదికల్ని వాడుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలకు అందిస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ వివరాలను వారి ద్వారా శ్రోతలకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం వారికే..కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు 2019 అక్టోబర్‌లో ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేశారు. అందులో వినోద భరిత కార్యక్రమాలతో పాటు ఖైదీలకు ఉన్న హక్కులు, పెరోల్ నిబంధనలు తదితరాలను ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సెంట్రల్ జైలు అధికారులు సైతం 2021 డిసెంబర్లో ఓ రేడియోను ప్రారంభించారు. ఈ రెండూ ఖైదీల ఆధ్వర్యంలో నడిచేవే కావడం గమనార్హం. ఇండియన్ ఆర్మీ సైతం ఉత్తర కాశ్మీర్లో తొలి రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బారాముల్లా, ఉరి సెక్టార్లలో రెండింటికి విస్తరించింది.వినోదంతో పాటు అవగాహన..నగర పోలీసు విభాగం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ రేడియో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హెచ్సీఎస్సీతో కలిసి రూపుదిద్దుతున్నారు. ఈ రేడియోలు పాటలు వంటి వినోదభరిత కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నగరవాసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, స్థితిగతులు, రోడ్డు భద్రత అంశాలకు పెద్దపీట వేసేలా తమ కమ్యూనిటీ రేడియో ఉండనుందని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రేడియో నిర్వహణ బాధ్యతల్ని హెచ్సీఎస్సీ చేపట్టనుంది. -
అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్
అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారు. మరి వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్దాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ)రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి.దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలేబ్ మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండటం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుండి వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిగ్నల్కున్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకూ ఉన్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి.న్యూట్రాన్ నక్షత్రాలు, వైట్ డ్వార్ఫ్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి రెండూ భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం . వైట్ డ్వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాగా అంతరిక్షం నుంచి పునరావృతమయ్యే ఇటువంటి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరడచం ఇదేమీ మొదటిసారికాదు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్‌ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా, లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగిస్తున్నారని డాక్టర్ మనీషా కాలేబ్ తెలిపారు. -
Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..!
‘బెహనో.. ఔర్ భాయియో..’ ఈ గొంతుతో ప్రేమలో పడని రేడియో శ్రోత ఉండేవాడు కాదు. ‘బినాకా గీత్మాల’ టాప్ 13లో ఏ పాట నిలుస్తుందో చూద్దామని వారమంతా ఎదురుచూపులు. నవ్వుతూ నవ్విస్తూ గుంజిపారేసే ఆకర్షణీయమైన గొంతుతో దశాబ్దాల పాటు పాటలను పంచిన రేడియో ప్రెజెంటర్ అమిన్ సయానీ తన 91వ ఏట బుధవారం వీడ్కోలు తీసుకున్నాడు. ఇకపై భారతీయ సాంస్కృతిక ఆనవాలై అతను వెలగనున్నాడు. పాటలు విరబూస్తాయి. అదిగో అల్లంత దూరాన ఒక చామంతి పూస్తుంది. ముళ్లను వెనక్కు నెడుతూ ఒక రోజా మెడ నిక్కి చూస్తుంది. గుబురు చాటున మల్లెమొగ్గ ఒకటి సిగ్గుతో మొహం దాచుకుంటుంది. గరిక పచ్చతావులో గడ్డిపూవు వర్ణనకు అందని రంగుతో కాంతిలీనుతుంది. వాటి మానాన అవి ఉన్నప్పుడు మన చూపు పడకపోవచ్చు. పడినా వాటి సౌందర్యమేమిటో తెలియకపోవచ్చు. అప్పుడొక పూలమాలి వస్తాడు. ఒక పువ్వు సువాసన ఎంత ప్రత్యేకమైనదో చెబుతాడు. మరో పూలరెక్క వయ్యారాన్ని చూపి విస్మయపడతాడు. ఒక పువ్వును నాసిక దగ్గర చేర్చడమే భాగ్యమంటాడు. ఒక పువ్వునలా కొమ్మకు వదిలిపెట్టమని మారాము చేస్తాడు. అప్పుడా పూల మీద మనకు ప్రేమ కలుగుతుంది. మనమూ వాటికి మాలిగా మారాలనుకుంటాము. గుండెకు దగ్గరగా చేర్చుకుంటాము. హృదయంతో వాటి పోషణకు పూనుకుంటాము. అమిన్ సయానీ చేసింది అదే.. రేడియో సిలోన్లో హిందీ సినిమా పాటలను శ్రోతలకు చేర్చడం. వాటిపై ప్రేమను పంచడం. వాటిని పాడుకుంటూ, కూనిరాగాలు తీస్తూ, ఆ మనోహర మాయలో చిక్కుకుంటూ జనం తమ బతుకు బాదరబందీని కాసేపు మరచిపోయేలా చేయడం. 1952 డిసెంబర్లో మొదటి షోగా మొదలైన ‘బినాకా గీత్మాల’ బినాకా టూత్‌పేస్ట్ వారి స్పాన్సర్డ్ప్రోగ్రామ్. ప్రతి బుధవారం సాయంత్రం రేడియో సిలోన్లో ప్రసారమయ్యేది. టాప్ 13తో మొదలయ్యి టాప్ 1 వరకూ కౌంట్‌డౌన్‌గా పాటలు ప్రసారమయ్యే ఆ షో చివరలో తర్వాతి వారం కోసం ‘లిస్ట్’ అయిన పాటలను చెప్పి వాటిని శ్రోతలు ఏ వరుసలో మెచ్చుతారో రాసి పంపమనేవారు. టాప్ వన్‌గా నిలిచే పాటను ఎక్కువమంది దేనిని ఎంపిక చేస్తారో దానికి ఆ ర్యాంక్ ఇచ్చేవారు. టాప్ 1ను సూచించిన వారి పేర్ల నుంచి జాక్‌పాట్ తీసి ఒక శ్రోతకు 100 రూపాయల బహుమతి ఇచ్చేవారు. అమిన్ సయాని మొదటి షో చేసేసరికి ఎంత హిట్ అయ్యిందంటే మరుసటి వారానికి 9 వేల ఉత్తరాలు స్పందనగా అందాయి. సంవత్సరం గడిచే సరికి వారం వారం వచ్చే ఉత్తరాల సంఖ్య 65 వేలకు చేరుకుంది. పోస్టాఫీసు వాళ్లు, రేడియో స్టేషన్ వారూ పిచ్చెత్తి పోయేవారు. తర్వాత ఈ రెస్పాన్స్ తంతును ఆపేసి సయానీ ఎంపిక మీద, రికార్డుల అమ్మకాలను బట్టి టాప్ 1ను డిసైడ్ చేసేవారు. ఏ జందగీ ఉసీకి హై.. అమిన్ సయానీ చేసిన బినాకా గీత్ మాలాలో ఏ వారం ఏ సింగర్ పాడిన పాట టాప్ సాంగ్‌గా నిలుస్తుందో తెలుసుకోవడం శ్రోతలకే కాదు సినీ రంగ దిగ్గజాలకు కూడా పెద్ద ఆసక్తిగా ఉండేది. బినాకా చార్ట్‌లో చోటు చేసుకోవడం గౌరవంగా భావించేవారు. ఇక కొన్ని పాటలైతే వారాల తరబడి టాప్ 1గా నిలిచి ఆ గాయకులకు, సంగీత దర్శకులకు క్రేజ్‌ను సంపాదించి పెట్టేవి. సంవత్సరం చివరలో అమిన్ సయానీ ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ ఒక పాటను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో ‘ఏ జందగీ ఉసీకి హై’ (అనార్కలీ– 1953), ‘జాయెతో జాయె కహా’ (టాక్సీ డ్రైవర్ – 1954), ‘మేరా జూతా హై జపానీ’ (ఆవారా – 1955), ‘ఏ దిల్ ముష్కిల్ జీనా యహా’ (సి.ఐ.డి – 1956)... ఇలా పాటలు శ్రోతల మెచ్చుకోలుతో వెలిగేవి. బినాకా గీత్మాలాలో ఎక్కువసార్లు టాప్ ΄÷జిషన్‌లో నిల్చున్న గాయని లతా. ఆ తర్వాత రఫీ. ఆ మృదుత్వం.. ఆ దగ్గరితనం.. అమిన్ సయానీ గొంతు, వాడే సులభమైన భాష, ఉచ్చారణ, మధ్య మధ్య జోకులు, కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇవన్నీ కలిసి షోను విపరీతంగా హిట్ చేశాయి. అమిన్ రేడియో అనౌన్సర్లకు మార్గదర్శి అయ్యాడు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో’ అనిపించుకున్నాడు. జీవితాంతం ఫ్రీలాన్సర్‌గానే అమిన్ రేడియో సిలోన్లో, వివి«ద్ భారతిలో షోస్ చేశాడు. అలాగే ఎన్నో అడ్వర్టైజ్మెంట్లలో ఆయన గొంతు వినిపించేది. సినిమా వాళ్ల అవార్డు ఫంక్షన్లలో, మ్యూజిక్ ప్రోగ్రాముల్లో అమినే యాంకర్. అంటే ఇవాళ దేశంలో ఉన్న పాపులర్ అనౌన్సర్లకు, యాంకర్లకు సయానీ సిలబస్ సెట్ చేసి వదిలాడు. ‘సినిమా పాటలే మన దేశంలో సగటు ప్రజలందరినీ కలిపి ఉంచాయి’ అంటాడు అమిన్ సయానీ. బొంబాయిలో పుట్టి పెరిగి ముంబైలోనే తుదిశ్వాస వదిలిన అమిన్ సయాని ఆల్ ఇండియా రేడియో ఉజ్వల రోజులను, గోల్డెన్ ఎరా ఆఫ్ హిందీ మ్యూజిక్‌ను ప్రస్తావించినప్పుడల్లా తన ప్రియమైన గొంతుతో పునరుత్థానం చెందుతూనే ఉంటాడు. ఇకపై కూడా అందమైన పూలు ఎన్నో పూయవచ్చు. కాని వాటిని ఊరికూరికే చూస్తూ పదేపదే సంబరపడిపోయే ఒక మాలి మరి ఉండడు. అదంతా గతం. సుందరమైన గతం. ఎంతో శ్రావ్యంగా పదిలపరుచుకునే గతం. అది సినీ సంగీతాన్ని ఇష్టపడే వారి సొంతమైన జ్ఞాపకం. ఇవి చదవండి: Karishma Mehta: కథలు మార్చగలవు -
గళ మాంత్రికుడు, లెజెండ్, అమీన్ సయానీ: ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
"బెహెనోం..ఔర్ భాయియోం.. మై హూం ఆప్కా దోస్త్.. అంటూ శబ్ద తరంగాలపై తేలియాడుతూ కొంత గంభీరంగా మరింత శ్రావ్యంగా మోగిన ఆ స్వరం 70వ చివరిదాకా పరిచయం లేనివారు ఉంటారా అసలు. ప్రతి బుధవారం రాత్రి 8గం.లకు రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాలా లక్షలాది ఇళ్లలో మారుమోగిన సూపర్ హిట్ షో. అమీన్ సయానీ గొంతు వినటం ఒక మరపురాని జ్ఞాపకం. ఆహా..అంటూ హిందీ చిత్రగీతాలను పరిచయం చేస్తూ సాగిన ఆ స్వరం దశాబ్దాల తరబడి భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది. తన గాత్రంతో ప్రజల గుండె చప్పుడును పెంచిన ప్రపంచ స్వర మాంత్రికుడు. ఆకాశవాణిలో అమీన్ సయానీ గోల్డెన్ వాయస్ ఒక మ్యాజిక్. 91 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన మరణం తీరని లోటు.. ఒక స్వర్ణ యుగం ముగిసిందంటూ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. మైక్‌లో కూల్‌గా, సాధారణంగా మృదువైన టోన్‌తో 54,000కి పైగా రేడియో ప్రోగ్రామ్‌లు, జింగిల్స , స్పాట్లను అందించిన అద్భుతమైన వ్యక్తి అమీన్ సయానీ. 1952లో ప్రారంభమైన బినాకా గీత్మాల 70ల చివరినాటికి, వారానికోసారి 21 కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. వారానికి 65వేలకు పైగా సంచుల కొద్దీ ఉత్తరాలొచ్చేవంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. రేడియో సూపర్‌స్టార్ కేవలం 13 ఏళ్లకే బాంబేలో ఆల్ ఇండియా రేడియో (AIR)కి ఆంగ్ల భాషా వ్యాఖ్యాతగా పనిచేశారు. 1952లో, బాలకృష్ణ విశ్వనాథ్ కేస్కర్‌ను ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా నియమించారు. కేస్కర్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో హిందీ-భాషా సినిమా పాటల పట్ల మోజు చూపలేదు. హిందీ పాటల ప్రసార సమయాన్ని 10శాతం కోటాకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిషేధించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో పనిచేస్తున్న ఒక అమెరికన్ వ్యాపారవేత్త డేనియల్ మోలినా సయాని సోదరుడు హమీద్‌ను తన సిలోన్ రేడియో కార్యకలాపాలకోసం ఎంపిక చేశారు. ఇంతలో ఆల్ ఇండియా రేడియో హిందీ విభాగం ఆడిషన్ తర్వాత, ఇంగ్లీష్, గుజరాతీకి సంబంధించిన యాస ఉందంటూ అమీన్‌ను తిరస్కరించారు. దీంతో సిలోన్ రేడియోలో ఉద్యోగం కోసం సోదరుడిని అడిగాడు. ఆకాశవాణి తిరస్కరించి కదా అంటూ ఆయన కూడా నిరాకరించాడు. అయితే అంత తేలిగ్గా వదులుకునే వ్యక్తి కాదు సయానీ. పట్టు వీడ లేదు. ఆ సమయంలో అమీన్‌కి ‘ఓవల్టీన్ఫుల్వారీ’ కార్యక్రమంలో అనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చింది. తన మధురమైన గాత్రం, తనదైన శైలితో ప్రేక్షకులను కట్టి పడేసే వారు. తరువాత 1952లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని లెజెండ్‌గా అవతరించాడు. అలాగే తనను తిరస్కరించిన ఆల్ ఇండియా రేడియోలో అత్యంత ఇష్టపడే అనౌన్సర్‌గా నిలవడం విశేషం. 1952లో ‘బినాకాగీత్మాల’ సంచలనాలు నమోదు చేసింది. సయానీన షోను స్వీడిష్ కంపెనీ సిబా టూత్‌పేస్ట్ బ్రాండ్ బినాకా స్పాన్సర్ చేసింది. అదృష్టవశాత్తూ గీతమాల కార్యక్రమం 1989 - 1990ల మధ్య ఆల్ ఇండియా రేడియో (AIR)లోని వివిధ్ భారతికి మారింది. ఇటీవల హిందీ-భాషా సినిమా స్వర్ణయుగం సంగీత హక్కులను కలిగి ఉన్న సరేగామ, దశాబ్దాల ప్రోగ్రామ్ చరిత్రలోని ముఖ్యాంశాలను కవర్ చేసిన “అమీన్ సయానీ ప్రెజెంట్స్ గీత్‌మాలా కి ఛాన్ మే” పేరుతో 10 సంపుటాలను విడుదల చేసింది.ఈ పాటలతో పాటు, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ముఖేష్, మన్నా డే, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శశి కపూర్ , మరెంతో మంది గొప్ప వ్యక్తులతో సయానీ ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. అవార్డులు, రివార్డులు అమీన్సయానీని 2009లో పద్మశ్రీ అవార్డ్ వరించింది. 2006లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నుండి లివింగ్ లెజెండ్ అవార్డు 2003లో ఇండియా రేడియో ఫోరమ్, రేడియో మిర్చి నుంచి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో పాటు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. "బినాకా గీతమాల" కు అత్యుత్తమ రేడియో కార్యక్రమంగా 2000లో బొంబాయి అడ్వర్టైజింగ్ క్లబ్ గోల్డెన్ అబ్బి, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ట్ నుండి 1993లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, 1992లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 1991లో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ నుండి అప్పటి భారత ఉపరాష్ట్రపతి K.R. నారాయణన్ చేతుల మీదుగా బంగారు పతకాన్నిఅందుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి ఆయన గళం ఆసియా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 'బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఎత్నిక్ నెట్వర్క్'లో ప్రసారమయ్యే "మినీ ఇన్సర్షన్స్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూస్", బీబీసీవరల్డ్ సర్వీస్ రేడియోలో మిలియన్స్", లండన్‌లోని 'సన్‌రైజ్ రేడియో'లో ప్రసారమయ్యే "వీటీకా హంగామా"కు నాలుగున్నరేళ్లు, UAEలోని 'రేడియో ఉమ్ముల్క్వైన్'లో ప్రసారమవుతున్న "గీత్‌మాలా కి యాదీన్" నాలుగేళ్లుగా, "యే భీచంగావో భీఖూబ్" 'రేడియో ఆసియా',దుబాయ్‌లో ఎనిమిది నెలల పాటు, టొరంటో, వాషింగ్టన్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ బోస్టన్లలోని 'జాతి రేడియో స్టేషన్ల'లో మొత్తం రెండున్నర సంవత్సరాల పాటు, దక్షిణాఫ్రికా దేశం స్వాజిలాండ్ ఇలా మరెన్నో ఆయన కరియర్లో మైలు రాళ్లు. సినిమాల్లోనూ.. అమీన్ సయాని భూత్ బంగ్లా, బాక్సర్, తీన్ డెవియన్ , ఖత్ల్తో సహా సినిమాల్లో అనౌన్సర్‌గా కనిపించారు. 1960-62లో టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్‌లో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశాడు. ఆయన భార్య రమా మట్టు కూడా ప్రముఖ గాయని, వాయిస్ ఆర్టిస్ట్. ఎక్కడ పుట్టారు 1932 డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు అమీన్ సయానీ . ముంబైలోని న్యూ ఎరా స్కూల్లో అతని పాఠశాల విద్య పూర్తిగా ఇంగ్లీష్ , గుజరాతీలో సాగింది. తరువాత 1954లో గ్వాలియర్‌కు మారి సింధియా స్కూల్లో చదువుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత, ముంబైకి తిరిగి వచ్చేశారు. ప్రస్తుత FM రేడియో యుగంలో, రేడియో జాకీలు వస్తున్నారు. పాపులారిటీ సాధిస్తున్నారు. కానీ భారతదేశ రేడియో ప్రేమికులకు అమీన్ తేనెలూరు ఆ స్వరం అజరామరం. ఆయన భౌతికంగా లేకపోయినా ధ్వని తరంగాలపై ఆ గొంతు ఎప్పటికీ శాశ్వతమే. -
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. పాపులర్ 'బినాకా గీత్ మాలా' కార్యక్రమం వెనుక ఉండే వాయిస్ ఆయనేదే. ఈ కార్యక్రమం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆయనకు ప్రస్తుతం 90 ఏళ్ల వయసు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కుమారుడు రాజిల్ సయానీ తెలిపారు. రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. ఆయన రేడియోలో తనను తాను 'నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్' అనే డైలాగ్‌తో పరిచయం చేసుకునేవారు. ఇదే ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే గాక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన డిసెంబర్ 21, 1932న ముంబైలో సాహితివేత్తల కుటుంబంలో జన్మించారు. కాగా, ఆయన మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ టెలివిజన్ రాజ్‌దీప్ సర్దేశాయి అమీన్ సయానీని ఉద్దేశించి ఓ లెజెండర్ గాత్రం మన నుంచి దూరమయ్యింది. ఆయన 'బినాకా గీత్ మాలా', బోర్న్ విటా క్విజ్ వంటి కార్యక్రమాల్లో తన గాత్రంతో ప్రేకక్షులకు అలరించారు. అంతేగాక 50 వేలకు పైగా రేడియో షోలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన గొప్ప వ్యక్తి కనుమరుగవ్వడం బాధకరమైన విషయమంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. More sad news: A legend.. the melodious voice of radio, of Binaca Geetmala.. of Bournvita Quiz contest on radio and so much more.. Behno aur Bhaiyo.. the genius that was Ameen Sayani with more than 50,000 radio shows is no more.. RIP, Om Shanti 🙏🙏 pic.twitter.com/ufMQ586u6M — Rajdeep Sardesai (@sardesairajdeep) February 21, 2024 (చదవండి: ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా? నటుడు రితురాజ్ మృతికి ఇదే కారణమా?) -
దిగ్గజ ఎఫ్ఎమ్ సంస్థను కొనుగోలు చేయనున్న కంపెనీలు ఇవేనా..
ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ (ఈఎన్ఐఎల్)లో భాగంగా ఉన్న రేడియో మిర్చితో పాటు రేడియో ఆరెంజ్... బిగ్ ఎఫ్ఎమ్ రేడియో నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు రూ.251 కోట్ల చొప్పున బిడ్ వేశాయని సమాచారం. దివాలా ప్రక్రియలో ఉన్న బిగ్ ఎఫ్ఎమ్ రేసులో హర్యానాకు చెందిన సఫైర్ ఎఫ్ఎమ్ కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సఫైర్ ఎఫ్ఎమ్ కూడా బిగ్ ఎఫ్ఎమ్ కోసం రూ.251 కోట్ల రూపాయల బిడ్ వేసింది. రేడియో మిర్చి, ఆరెంజ్ ఎఫ్ఎమ్ , సఫైర్ ఎఫ్‌ఎమ్‌ల బిడ్ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని ప్రకటించాయి. తమ బిడ్ల విలువను మరింత పెంచాలని లెండర్లు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కంపెనీ ఖాతాల్లో ఉన్న రూ.60 కోట్ల నగదు కూడా లెండర్లకే వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిగ్ ఎఫ్ఎం ఖాతాల్లోని నగదును లెక్కలోకి తీసుకున్న తర్వాత, లెండర్లకు ఇంకా రూ. 578 కోట్లు రావాలి. ఇది దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్. 1,200 పట్టణాలకు, 50 వేలకుపైగా గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు దివాలా ప్రక్రియకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా బిగ్ఎఫ్ఎమ్ సంస్థ ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. -
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
నూరు మాసాల మాట
మాటలు మంచివే. అందులోనూ మాటల్లో మనసు పరిచి, ప్రజలతో పంచుకోవడం ప్రజాస్వామ్య లక్షణం. పాలకులకు వన్నె తెచ్చే విషయం. ప్రధాని మోదీ గడచిన తొమ్మిదేళ్ళ పాలనాకాలంలో ప్రతి నెలా రేడియో వేదికగా పంచుకున్న ‘మన్ కీ బాత్’ (ఎంకేబీ) విశిష్టమైనది అందుకే. 2014 అక్టోబర్ 3న మొదలైన ఈ నెలవారీ ప్రసంగాలు ఈ ఏప్రిల్ 30తో వరుసగా 100 నెలలు, 100 భాగాలు పూర్తి చేసుకున్నప్పుడు అదొక మహోత్సవమైంది. ఏకంగా 20 దేశాల్లో 200 చోట్ల, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా బీజేపీ ఏర్పాటు చేసిన 4 లక్షల వేదికల్లో ఈ వందో ఎపిసోడ్ వినే వసతులు కల్పించడమే అందుకు నిదర్శనం. రాజ్భవన్లలో ఎంకేబీ శతమాసోత్సవాన్ని ఆహ్వానితుల ముంగిట సంబరంగా చేసుకోవడం కనివిని ఎరుగని ఘట్టం. ఇది కోట్లాది భారతీయుల మనో వాణి అని అధికార పక్షం అంటుంటే, ప్రజాసమస్యలపై మోదీ మౌనం వహిస్తున్నందున ఇది వట్టి ‘మౌన్ కీ బాత్’ అని ప్రతిపక్షాల విమర్శ. అసలు నిజం ఈ రెంటికీ మధ్య ఉందనేది విశ్లేషణ. రాజకీయ రంగస్థలిపై ప్రత్యర్థుల్ని చిత్తుచేసే పాత్రలో పేరు తెచ్చుకున్న మోదీ తెలివిగా ఎంకేబీని జనంతో సంభాషణగానే మొదటి నుంచి మలిచారు. ‘స్వచ్ఛ భారత్’, ‘హర్ ఘర్ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లాంటి ఉద్యమాలను ఈ ప్రసంగాలతో ముందుకు నడిపారు. ఉన్నత లక్ష్యాలకు అంకితమైన ఉదాత్త పాలన, పాలకుడనే భావన కలిగించడంలో కృతకృత్యులయ్యారు. ఇది తొమ్మిదేళ్ళుగా ఆయన పెంచుకున్న పెట్టుబడి. పైకి రాజకీయ ప్రస్తావనలేమీ లేకుండానే సాగినా ఈ ప్రసంగ పరంపర ఇప్పుడు చేసుకున్న శతమాసోత్సవ ప్రచార పటాటోపంలో మాత్రం అస్సలు రాజకీయాలు లేవని అనలేం. వంద రూపాయల ప్రత్యేక నాణెం, సమాచార ప్రసారశాఖ సంపాదకీయ వ్యాఖ్యలు, ఎంకేబీ వింటున్న మంత్రుల ఫోటోలు – ఇలా దేశమంతా ఓ సంరంభం. తిరుగులేని నాయకుడి మనోధర్మ వాణి ఆసరాగా, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్న కమలనాథుల ఆశ అర్థం చేసుకోదగినదే. అధికారంలో ఎవరున్నా కాస్త హెచ్చుతగ్గులుగా ఇది చేసే పనే. అదే సమయంలో ఈ ప్రసంగ పరంపరతో సమాజంలో సానుకూల ఫలితాలే లేవనుకోవడమూ తప్పే. ఎంకేబీలో ప్రస్తావించిన అనేక అంశాలు, సామాన్యుల విజయగాథలు శ్రోతలకు విజ్ఞానాన్నీ, విశేషంగా స్ఫూర్తినీ అందించాయి. నెలకోసారి అలాంటి అంశాలనూ, వ్యక్తులనూ ఎంపిక చేయడా నికి ప్రభుత్వ శాఖలు, పార్టీ యంత్రాగం ఎంతటి శ్రమ, క్షేత్రపరిశీలన చేస్తున్నాయో ఊహించవచ్చు. నిజానికి, వార్తల నుంచి వ్యవసాయ సలహాల దాకా అన్నిటికీ రేడియోనే ఆధారమై, రచ్చబండ వద్ద ఊరంతా రేడియోల ముందు పోగైన రోజుల నుంచి ఇవాళ సమాజం చాలా మారింది. దూరదర్శన్, ప్రైవేట్ కేబుల్ టీవీలు, శాటిలైట్ టీవీ ఛానల్స్, ఇప్పుడు ఓటీటీ దాకా కొత్త వేదికలతో 1990ల నుంచి రేడియో ప్రాచుర్యం తగ్గుతూ వచ్చింది. అలాంటి వేళ 2014లో మోదీ రేడియో మాధ్యమాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంతో పాటు ఫలితంపై అనుమానాలూ పెంచింది. కానీ, 501 ప్రసార కేంద్రాలతో, 23 భాషల్లో కార్యక్రమాలతో దేశంలో భౌగోళికంగా 90 శాతాన్నీ, జనాభాలో 98 శాతాన్నీ చేరుతున్న రేడియోను బలంగా వినియోగించుకున్నారు. గ్రామీణ, దిగువ మధ్యతరగతి జనానికి దగ్గరవుతూ, వారిదైన భాషలో మోదీ సమాచార ప్రసారం చేయగలిగారు. లేఖలతో వారినీ ఇందులో భాగస్వా ముల్ని చేశారు. వెరసి, ఎంకేబీని కీలక ప్రసార, ప్రచారోద్యమంగా మలుచుకున్నారు. ఇది కేవలం బీజేపీ కార్యకర్తలు వినే కార్యక్రమమని విమర్శలు వచ్చాయి. కానీ, ఎంకేబీలోని అంశాలతో సామాన్య జనం మమేకమయ్యేలా, ఆకాశవాణి, దూరదర్శన్ సహా ప్రైవేట్ టీవీ ఛానళ్ళలో, మర్నాటి పత్రికల్లో అవి ప్రధాన వార్తలుగా మారేలా తీర్చిదిద్దిన రూపకర్తల దూరదృష్టినీ, వ్యూహ చతురతనూ కొట్టిపారేయలేం. ఇంటి పెద్ద మిగతా కుటుంబ సభ్యులతో తన భావాలు పంచుకుంటున్న పద్ధతిలో సాగడం ఎంకెబీ విజయసూత్రం. ప్రసారభారతి సీఈఓ విడుదల చేసిన ఐఐఎం–రోహ్ తక్ తాజా నివేదిక 10 వేల మందిని సర్వే చేసి, ఇప్పటికి 100 కోట్ల మంది ఈ కార్యక్రమం విన్నారని పేర్కొంది. 96 శాతానికి ఎంకేబీ గురించి తెలుసనీ, 23 కోట్ల మంది క్రమం తప్పక వింటున్నారనీ తెలిపింది. సదరు ఐఐఎం డైరెక్టర్ వివాదచరిత అటుంచితే, ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలున్న సీఎస్డీఎస్ సంస్థ నిరుడు నవంబర్‌లో విడుదల చేసిన నివేదిక మాత్రం దేశంలో అయిదింట మూడొంతులు ఎన్నడూ ఎంకేబీ వినలేదంటోంది. లెక్కలెలా ఉన్నా... సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి సైతం వదలకుండా ప్రతి నెలా ఎంకెబీ వింటానన్నారు. ఇలాంటి వీరవిధేయ శ్రోతలు తక్కువేమీ కాదు. మోదీ ‘ఆధ్యాత్మిక ప్రయాణం’గా పేర్కొన్న ఈ కార్యక్రమం ఎంతగా ప్రభుత్వ అండ ఉన్నా,ఇంతకాలం శ్రోతల ఆసక్తిని నిలబెట్టుకోవడం విశేషమే. రేడియో పునర్వైభవానికీ తోడ్పడుతున్న ఈ ప్రసార ఉద్యమం అక్కడి కన్నా ఆన్లైన్లో, టీవీలో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. దేశంలో పెరిగిన డిజిటలీకరణకు కొండగుర్తుగా నిలుస్తోంది. ప్రజల మనసుకు దగ్గరైన అంశాలతో, ‘బేటీ బచావో బేటీ పఢావో’ లాంటి నినాదాలతో మోదీ మంత్రముగ్ధం చేస్తున్నారు. ఇప్పటి దాకా ఒక్కసారైనా పూర్తిస్థాయి విలేఖరుల సమావేశం జరపని తొలి భారత ప్రధాని అన్న విమర్శలకు వెరవకుండా నిత్యం జనంలో ఉంటూ, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కమ్యూనికేషన్ కింగ్ అనిపించుకున్నారు. ఎంకేబీతో కొత్త వాతావరణం సృష్టించారు. మనోవాణిని తెలపడం మంచిదైనా, ఏకపాత్రాభినయ స్వగతం కన్నా స్వేచ్ఛాయుత మీడియా సంభాషణలు ప్రజాస్వామ్యానికి మరింత మేలు. మౌనం కన్నా మాట ప్రభావమే ఎక్కువని ‘మౌన్ కీ బాత్’ శతమాసోత్సవం సైతం నిరూపిస్తోంది. -
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
Mann ki Baat: 'మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు'
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాల గురించి మాట్లాడారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని పేర్కొన్నారు. అనేక మంది కళాకారులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించినట్లు వివరించారు. మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లు మోదీ తెలిపారు. యోగా, చిరుధాన్యాల దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. చిరుధాన్యాల గొప్పతనాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం -
ప్రయాణికుల ఆనందమే లక్ష్యం.. సిటీ బస్సుల్లో 'టీఎస్ఆర్టీసీ రేడియో’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో కూకట్పల్లి డిపోకు చెందిన బస్సులో ఈ రేడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కూకట్పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషియన్ కేవీఎస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ రేడియో ప్రయాణీకులను అలరించనుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్-సికింద్రాబాద్, గచ్చిబౌలి-మెహిదీపట్నం, సికింద్రాబాద్-పటాన్చెరువు, కూకట్పల్లి-శంకర్పల్లి, కొండాపూర్-సికింద్రాబాద్, కోఠి-పటాన్చెరువు, ఇబ్రహీంపట్నం-జేబీఎస్ మార్గాల్లో నడిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే, ఈ రేడియో ద్వారా మహిళల, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.. పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్లో స్కాన్ చేసి.. రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ సరికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని కోరారు. TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes. pic.twitter.com/RD5ddzQkEr — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 28, 2023 -
ప్రపంచ జనాభాలో అత్యధికం ‘జూమర్స్’.. ఇంతకూ మీది ఏ తరం?
దొడ్డ శ్రీనివాసరెడ్డి సరదా కోసమైనా, సమాచారం కోసమైనా రేడియోనే దిక్కయిన తరం ఒకటి.. అరచేతిలో స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచాన్నే చుట్టబెడుతున్న తరం మరొకటి..యుద్ధాలు, సంక్షోభాలు, మహమ్మారుల మధ్య భయంగా గడిపిన తరం ఇంకొకటి.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నది వేరొకటి.. ..దాదాపు ప్రతి తరం ఒక ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో ఎదిగింది. విభిన్నమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అనుభవించింది. ఈ ప్రతి తరం కూడా నాటి ఆ పరిస్థితులకు ప్రత్యేక గుర్తులే. ఆ గుర్తులకు అనుగుణంగానే ఒక్కో తరానికి ఒక్కో పేరు పెట్టారు. అమెరికాలో మొదలై.. తరాల అంతరాలను గుర్తించి, వాటికి నామకరణం చేయడం అమెరికాలో మొదలైంది. ఒక్కో తరానికి ఉన్న ఒక విలక్షణమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బూమర్స్, జూమర్స్, మిలీనియల్స్ అంటూ పేర్లను అమెరికా సామాజిక వేత్తలు, మేధావులు, రచయితలు ఖాయం చేశారు. అటుఇటుగా అలాంటి పరిస్థితులే ఉన్న పాశ్చాత్య దేశవాసులు కూడా అవే పేర్లు, వర్గీకరణను వాడకంలోకి తెచ్చారు. మరి ఇంతకీ ఈ తరాలు, వాటి ప్రత్యేకతలు, వాటి కాలమాన పరిస్థితులు ఏమిటి? సైలెంట్ జనరేషన్ (1928–1945): యవ్వనమంతా కష్టాల్లో గడిపి.. ఈ తరం వాళ్లు పసితనంలోనే 1930నాటి మçహా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశారు. యుక్త వయసు వచ్చే నాటికి రెండో ప్రపంచ యుద్ధం పాలినపడ్డారు. జీవితమంతా కష్టాలనోర్చుకొని సాగిన ఈ తరం వారు ఇప్పుడు 77 నుంచి 94 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. వయసు మీరిన తర్వాతే ఈ తరం ప్రపంచవ్యాప్తంగా సాగిన అభివృద్ధిని వీక్షించింది. యవ్వనమంతా అష్టకష్టాల్లో, భయంభయంగా గడిపిన ఈ తరానికి సైలెంట్ జనరేషన్ అని పేరు వచ్చింది. బేబీ బూమర్స్ (1946–1964): జనాభాను పెంచి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది ఈ తరం. యుద్ధంలో చెల్లాచెదురైన వారంతా మళ్లీ ఏకమై స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో ఒక్కసారిగా ప్రపంచ జనాభా పెరగడం మొదలైంది. అందుకే ఈ తరానికి బేబీ బూమర్స్గా నామకరణం చేశారు. మిగతా తరాలకు రచయితలో, సామాజికవేత్తలో పేర్లు పెడితే.. ఒక్క ఈ తరానికి మాత్రం అధికారికంగా అమెరికా జనాభా వివరాల సేకరణ బ్యూరో ‘బేబీ బూమర్స్’గా నామకరణం చేసింది. ఈ తరం వాళ్లు ప్రస్తుతం 58 నుంచి 76 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. ఉద్యోగ విరమణ చేసి మనవళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ తరం రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పుల్ని చవిచూసింది. చిన్నతనంలో కొరియా యుద్ధం, యవ్వనంలో వియత్నాం యుద్ధం, తర్వాత మొదలైన యుద్ధ వ్యతిరేక, పౌరహక్కుల ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు ఈ తరం వారు. అంతరిక్ష రంగంలో మానవుడి తొలి విజయాలకు సాక్షి ఈ తరం. అమెరికా, రష్యా విభేదాలతో రెండుగా చీలిన ప్రపంచంలో వీరు మనుగడ సాగించారు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలై వైఫైదాకా సాగిన సాంకేతిక విప్లవాన్ని ఆస్వాదించిందీ తరం. జనరేషన్ ఎక్స్ (1965–1980): విభిన్నమైన మార్పులు చూసి.. కెనడాకు చెందిన జర్నలిస్టు, రచయిత కాప్లాండ్ రచించిన ‘జనరేషన్ ఎక్స్.. టేల్ ఫర్ యాన్ యాక్సిలరేటెడ్ కల్చర్’అనే నవల ఆధారంగా ఈ తరానికి జనరేషన్ ఎక్స్ అని పేరు పెట్టారు. ప్రపంచం అనూహ్య రీతిలో పరిణామం చెందుతున్న దశలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మొదలైన ఈ తరంవారు ఇప్పుడు 42 నుంచి 57 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కంప్యూటర్ శకానికి ఆద్యులైన ఈ తరంలో ఇంకా అటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు చదివేవారి నుంచి ఇటు స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడుతున్న వారిదాకా ఉన్నారు. గత తరాల కంటే ఈ తరం విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. అలాగే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ కల్చర్‌కు సాక్షులు ఈ తరంవారు. స్నేహ హస్తాన్ని చాచి బెర్లిన్ వాల్‌ను కూల్చివేసిన ఘటన నుంచి విద్వేషం వెర్రితలలు వేసి న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను కూల్చివేసిన 9/11 ఘటన దాకా ఎన్నో చూసింది ఈ తరం. మిలీనియల్స్ (1981– 1996): సాంకేతిక విప్లవంతో ఎదిగి.. సహస్రాబ్దికి చేరువలో పుట్టిన ఈ తరాన్ని మిలీనియల్స్ అని పిలుస్తున్నారు. మొదట ఈ తరాన్ని జనరేషన్ వై అని పిలిచారు. కానీ అమెరికన్ రచయితలు విలియం స్ట్రాస్, నీల్ హోవే 1980 తర్వాత జన్మించిన వారిని మిలీనియల్స్ అని నామకరణం చేయడంలో ఈ తరానికి ఆ పేరేస్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచంలో గత తరాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యాకులు మిలీనియల్సే. దాదాపు 180 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం మంది ఈతరం వారే. ఆసియాలో వీరి సంఖ్య 25 శాతంపైనే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఈ మిలీనియల్సే. 25 శాతం పైగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నవారే. ఈ తరం వారి ప్రస్తుత వయసు 26 నుంచి 41 సంవత్సరాలు. సాంకేతిక విప్లవంతోపాటు ఎదిగిన ఈ తరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. రాజకీయాలు మొదలు అన్ని రంగాలను శాసించగల సత్తా ఉన్న తరం ఇది. జనరేషన్ జెడ్ (1997–2012): ఇంటర్నెట్తో ఆడుతూపాడుతూ.. ఇంటర్నెట్ను జూమ్ చేస్తూ ఎదిగిన ఈ తరం వారిని జూమర్స్ అని కూడా పిలుస్తారు. ఈ తరానికి చెందినవారు ప్రస్తుతం పదేళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు. మిలీనియల్స్ కంటే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచ జనాభాలో వీరే 26 శాతం ఉన్నారు. 2025 నాటికి ప్రపంచ ఉద్యోగ వర్గంలో 27 శాతం జూమర్సే ఉంటారు. ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో వినియోగించిన తొలితరం ఇదే. గూగుల్‌తోపాటు ఎదుగుతున్న ఈ తరం సమస్త దైనందిన కార్యక్రమాలను స్మార్ట్‌ఫోన్‌తో చేసుకుపోతోంది. ప్రపంచాన్నీ స్మార్ట్‌ఫోన్ నుంచే వీక్షిస్తోందీ తరం. జనరేషన్ ఆల్ఫా (2013 నుంచి మొదలు): మారిన జీవన శైలితో... ఇరవై ఒకటో శతాబ్దంలో పుట్టిన తరం ఇది. గ్రీక్ అక్షరమాలలో తొలి అక్షరమైన ఆల్ఫాను ఈ తరానికి పేరుగా పెట్టారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్–19 ఈ తరంలోనే విశ్వవ్యాప్తమైంది. ఈ కోవిడ్‌తో మారిన జీవన శైలిని అనుసరించబోతోంది ఆల్ఫా జనరేషన్. ఏటా 25లక్షల మంది ఈ తరానికి తోడవుతున్నారు. 2025 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరబోతోంది. జన జీవితంలో ప్రతి పదిహేను, ఇరవై సంవత్సరాలకోసారి స్పష్టమైన మార్పులు వస్తుంటాయి. ఆ కాలాన్నే తరంగా అభివర్ణిస్తున్నామని ప్రజల జీవన పోకడలను నిరంతరం పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఉండే ప్యూ రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. తరాలను వర్గీకరించడం, వాటికి పేర్లు పెట్టడం సైన్స్ ఏమీ కాదు. కేవలం ఆ తరం ఆలోచనలు, అభిరుచులను, పోకడలను అంచనా వేయడం కోసం ఒక సాధనం మాత్రమేనని ప్యూ సెంటర్ అభిప్రాయం. అసలు తరాల వర్గీకరణను గత శతాబ్ది మొదట్లోనే జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ట్ మన్హెమ్, స్పానిష్ తత్వవేత్త జోస్ ఒర్తెగా మొదలుపెట్టారు. ఇది ఒకే కాలమాన పరిస్థితుల్లో జీవించే వారి మధ్య ఉండే సామీప్యతలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని వారి వాదన. మన దగ్గర తరాల పరిస్థితి ఏమిటి? పాశ్చాత్య దేశాల్లో జరిగిన తరాల వర్గీకరణ వంటిది మన దగ్గర జరగలేదు. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒకేలాంటి పరిస్థితులు ఆవిర్భవించిన నేపథ్యంలో మిలీనియల్స్ నుంచి మనం కూడా పాశ్చాత్య వర్గీకరణను పాటిస్తున్నాం. అయితే విభిన్న పరిస్థితులున్న పాతతరాన్ని అంచనా వేసే ప్రయత్నం భారత్‌లో పెద్దగా జరగలేదు. కొందరు ఔత్సాహికులు భారతీయుల్ని దేశ విభజన తరం (1944–1963), పరివర్తన తరం (1964–1983) సంస్కరణల తరం (1984 నుంచి మొదలు)గా విభజించి విశ్లేషించే ప్రయత్నం చేశారు. మిలీనియల్స్‌ను మన దగ్గర సంస్కరణల తరంగా పరిగణించాలని, ఈ కాలంలోనే భారత సమాజం సమూల మార్పులను చవిచూసిందని అంటున్నారు భారతీయ సామాజిక వేత్తలు. రాజీవ్‌గాంధీ హయాంలో మొదలైన కంప్యూటరీకరణ నుంచి పీవీ నరసింహారావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయన్నది వీరి పరిశీలన. -
Children's Day 2022: పిల్లలవాణి.. స్కూల్ రేడియో! అంతా వాళ్లిష్టమే
బడి అంటే పాఠాల బట్టీ కాదు.. వినోదం.. విజ్ఞానం కూడా! వాటిని పంచే ఓ సాధనం రేడియో! ఎస్.. ఆకాశ వాణి! కాకపోతే ఇది పిల్లల వాణి.. దీనికి కేంద్రం స్కూల్! అనౌన్సర్లు, రైటర్లు, స్టోరీ టెల్లర్లు, ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ డిజైనర్లు.. స్టేషన్ డైరెక్టర్లు అందరూ పిల్లలే! అంటే విద్యార్థులే!! మరి శ్రోతలు..? www.schoolradio.in వెబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ కార్యక్రమాలను వినేవాళ్లంతా! అదే స్కూల్ రేడియో! 2015లో.. ఫిబ్రవరి 13న.. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా తన ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంది. దీనికి రూపకర్తలు.. కాట్రగడ్డ అరుణ, గాలి ఉదయ్ కుమార్! విశాఖపట్టణం వాస్తవ్యులు! స్కూల్ రేడియో స్థాపన.. దాని విధివిధానాలు, కార్యక్రమాల గురించి ఆ జంట మాటల్లోనే.. ‘మనం బాలలను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యాలేమిటో, వారేం కోరుకుంటున్నారో తెలుసుకోవటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని పిల్లలు, యువత కోసం స్కూల్ రేడియోను ప్రారంభించాం. ఇప్పటివరకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా మిగిలిపోయిన పిల్లలు, యువతకే పట్టం కడుతూ, వారే వక్తలుగా, కార్యక్రమ నిర్వాహకులుగా.. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ మొదలుపెట్టాం.. ఈ స్కూల్ రేడియో ద్వారానే! ప్రసారం చేయాలనుకొనే అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఎంచుకోవటం, సమాచారాన్ని సేకరించటం, స్క్రిప్ట్ రాయటం, రాసిన స్క్రిప్ట్‌ను సరిదిద్దటం వంటి పనులను విద్యార్థులే చేస్తారు. కార్యక్రమాలను రికార్డు చేస్తారు. రికార్డు చేసిన ఆడియో ఫైల్స్‌ను ఎడిట్ చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని జత చేస్తారు. ఇలా సిద్ధమైన కార్యక్రమాలను స్కూల్ రేడియోలో ప్రసారం చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లతో పాటు పలు భారతీయ భాషల్లోనూ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు చిన్నారులు. తాము నివసిస్తున్న గ్రామం లేదా నగరాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తారు. తమ ప్రాంతంలోని పర్యావరణ, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి, సమస్య మూలాలను అర్థం చేసుకొంటూ, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమూ ప్రజలూ ఏం చేయాలో సూచిస్తూ కూడా రేడియో కార్యక్రమాలను రూపొంది స్తున్నారు. ఇలా.. సామాజిక స్పృహæ కలిగిన పౌరులుగా వారు ఎదిగేందుకు స్కూల్ రేడియో చేయూత నిస్తోంది. వాళ్లిష్టమే.. స్కూల్ రేడియోలో చిన్నారులు ఏమైనా మాట్లాడవచ్చు. పాఠ్యాంశాలను చెప్పవచ్చు. పుస్తకాలను సమీక్షించవచ్చు. సినిమాలను విశ్లేషించవచ్చు. తాము ఆడే ఆటల గురించి మాట్లాడవచ్చు. పండుగలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, రాజకీయాలు, సామాజిక సమస్యలు, పర్యావరణ అంశాలు ఇలా ఏం మాట్లాడాలనేది వాళ్ళ ఇష్టం. సహ విద్యార్థులతో కలసి చర్చించి, తమకు నచ్చిన అంశాలను ఎంచుకొని కార్యక్రమాలను తయారు చేయవచ్చు. స్కూల్ రేడియో క్లబ్‌లు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ రేడియోను ప్రారంభించేందుకు ముందుగా స్కూల్ రేడియో క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రతి రేడియో క్లబ్లో పది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. ఇవి ప్రతినెల రేడియో కార్యక్రమాలను రూపొందిస్తాయి. ఈ కార్యక్రమాలను www.schoolradio.in వెబ్సైట్లో వినవచ్చు. స్కూల్ రేడియో క్లబ్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తారు. కరోనా తదనంతర పరిస్థితులలో ఆన్లైన్లో కూడ శిక్షణ మొదలైంది. చెప్పదలిచిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం రాయటం, కథలను చెప్పగలగటం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచటం, బహిరంగ సభలు, సమావేశాలలో ప్రసంగించటం, నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించడమెలాగో నేర్పడంతోపాటు వాయిస్ రికార్డింగ్, ఆడియో ఫైల్స్ ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలలోనూ పిల్లలకు తర్ఫీదు ఉంటుంది. టాక్ షోలు, రేడియో నాటికలు, చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పాటలు, పద్యాలతో పాఠశాల విద్యార్థులు తామే రేడియో కార్యక్రమాలను రూపొందించుకునేలా వారికి చేయూత ఉంటుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్నీ పంచుతూ పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ.. స్ఫూర్తి నింపే లక్ష్యంతో స్కూల్ రేడియో క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. పుస్తకాలు రేడియో కార్యక్రమాలను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించేందుకు స్కూల్ రేడియో ప్రత్యేకంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. అలాగే చిన్నారులు రాసిన కథలు, కవితలు, నాటికలకు స్థానం కల్పిస్తూ బాల, చిన్నారి, ప్రతిబింబం, ఆనందాల హరివిల్లు పుస్తకాలను అచ్చువేసింది. ఇది పబ్లిష్ చేసిన ‘చీమా చీమా ఎందుకు కుట్టావు?’ పుస్తకంలోని కథలను ‘పిపీలికే పిపీలికే కిమర్థం దంశసి?’ పేరిట సంస్కృతంలోకి అనువదించారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని సంస్కృత పాఠశాల విద్యార్థులు. దీన్నీ స్కూల్ రేడియో ప్రచురించింది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుగు నుంచి అనువదించిన తొలి సంస్కృత పుస్తకంగా ఇది గుర్తింపు పొందింది. చిన్నారుల భాగస్వామ్యంతో ఆడియో, వీడియో, టెక్ట్స్‌తో కూడిన మల్టీ మీడియా డిజిటల్ పుస్తకాలనూ రూపొందించి, అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ పాఠాలు కరోనా కంటే ముందు నుంచే స్కూల్ రేడియోలో ఆన్లైన్ పాఠాలున్నాయి. ఉపాధ్యాయులు తమకు నచ్చిన అంశాలను స్కూల్ రేడియోలో చెప్పవచ్చు. ఆన్లైన్ విధానంలో తరగతి గదుల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహించింది స్కూల్ రేడియో. కెరీర్‌కూ దోహదం మెరుగైన ఉపాధి అవకాశాలున్న కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ కెరీర్ ఎంపికల గురించి ప్రత్యేక కార్యక్రమాలను వారే రూపొందించేలా చూస్తోంది స్కూల్ రేడియో. ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్ లేదా ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన స్కూల్ రేడియో కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ, ఉన్నత ర్యాంకులను పొందుతున్నప్పటికీ, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. కారణం.. ఆత్మ విశ్వాసం కొరవడటమే. ఫలితంగా బహుళ జాతి సంస్థలలో వారు ఉద్యోగాలు సాధించటంలో వెనుకబడుతు న్నారు. కనుక వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొదించేలా ప్రత్యేక కార్యక్రమాలనూ రూపొందిస్తోందీ స్కూల్ రేడియో. ప్రత్యేక దినాలు, ప్రత్యేక కార్యక్రమాలు అంతర్జాతీయ, జాతీయ దినాలనెన్నింటినో జరుపుకొంటూంటాం. అయితే వీటిని మొక్కుబడిగా పాటించటమే తప్ప, వాటి ప్రత్యేకత ఏమిటో ఎక్కువ మందికి తెలియదు. విద్యార్థులకు చెప్పే వారూ ఉండరు. అందుకే ఇలాంటి ప్రత్యేక సందర్భాల కోసం స్కూల్ రేడియో స్లాట్స్‌ను కేటాయిస్తుంది. ఆయా దినాల ప్రత్యేకతను అర్థం చేసుకొనేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ను శోధిస్తారు. గ్రంథాలయాలలో పుస్తకాలను చదువుతారు. సంబంధిత నిపుణులతో మాట్లాడతారు. సంబంధిత సమస్యలు, పరిష్కార మార్గాల గురించి ఆలోచిస్తారు. ఫలితంగా వారిలో ఆసక్తితో పాటు అవగాహనా పెరుగుతుంది’ అంటూ స్కూల్ రేడియో ఏర్పాటు గురించి చెప్పింది అరుణ, ఉదయ్ కుమార్ జంట. తప్పిపోయిన కార్డు కథ! వ్యర్థాల నిర్వహణ అంశంపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న మాకు ఒక వింత అనుభవం ఎదురైంది. తడి, పొడి వ్యర్థాలు, జీవ వైద్య వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇలా రకరకాల వ్యర్థాలతో కూడిన ఫ్లాష్ కార్డులను విద్యార్థులకు ఇచ్చి, వాటి గురించి మాట్లాడమని అడిగే వాళ్ళం. ఆయా వ్యర్థాలను ఎలా తొలగించాలి, వ్యర్థాల నిర్వహణలో పాటించవలసిన విధివిధానాల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. ఈ కార్డులలో శానిటరీ నాప్కిన్ చిత్రంతో కూడిన కార్డు కూడా ఉండేది. కానీ విద్యార్థినీ విద్యార్థులలో ఎవరూ కూడ దీని గురించి అసలేమీ మాట్లాడేవారు కాదు. పైగా ఆ కార్డును మాకు తిరిగి ఇవ్వకుండా, డెస్క్‌ల కిందో, పుస్తకాల మధ్యనో దాచిపెట్టేసేవారు. మానవ జీవితంలోని ఒక సహజమైన ప్రక్రియ గురించి మాట్లాడేందుకు చిన్నారులు, యువత సిగ్గు పడుతున్నారని, వారిలో ఎన్నో అపోహలు ఉన్నాయని ఈ సంఘటన మాకు స్పష్టం చేసింది. దాంతో ది స్టోరీ ఆఫ్ మిస్సింగ్ కార్డ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్ చేశాం. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, నెలసరి లేదా పీరియడ్స్ గురించిన శాస్త్రీయమైన అవగాహనను విద్యార్థులలో కలిగించేందుకు, ఈ అంశం చుట్టూ నెలకొన్న అపోహలు, భయాలను తొలగించేందుకు స్కూల్ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాలకు చోటు కల్పించాం. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్‌లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్‌కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్‌ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
అడవి నుంచి రేడియో బాణాలు
947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం సిద్ధించినా, గోవా వంటి పోర్చుగీసు నియంత్రణ ప్రాంతం ఇంకోవైపు ఉంది. నాలుగు వందల యాభై ఏళ్లకు పైగా గోవా ప్రాంతం పోర్చుగీసు వారి కబంధ హస్తాలలో అతలాకుతలమైంది. అటువంటి చోట విముక్తి పోరాటానికి దన్నుగా ఒక సీక్రెట్ రేడియో కూడా నిలిచింది. అదే.. ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రహస్య రేడియో. అదొక ఉద్యమ చరిత్ర. విముక్తి లభించిన రోజు ఆ రోజు, ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రహస్య రేడియో కేంద్రం సిబ్బంది.. విమానానికి రేడియో ట్రా¯Œ ్సమీటర్ బిగించారు. లౌడ్ స్పీకర్ అమర్చారు. వారంతా ఆ విమానం ఎక్కారు. పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపురూపమైన వార్తను ప్రకటిస్తూ ఒక రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఆకాశయానం చేశారు. 1961 డిసెంబరు 19న స్వేచ్ఛ సిద్ధించి గోవా ప్రాంతం స్వతంత్ర భారతంలో కలసిన వేళ.. అలాంటి చారిత్రక సందర్భంలో రహస్య రేడియో కేంద్రం వేదిక కావడం విశేషం. గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’.. ఒక అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్. 1955 నవంబరు 25న మొదలైన ఈ రేడియో స్టేషన్ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆ రోజుతో నిలిపివేసి, విలువైన చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది! ఆర్థిక నిర్బంధంతో దారికి 1510లో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటీషువారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించినా పాండిచ్చెరి ఫ్రెంచి వారి చేతిలోకి వెళ్లిపోయినట్టు.. గోవా, డయ్యు, డమన్ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. గోవాకూ, మిగతా భారతదేశానికి పెద్దగా సంబంధాలు లేకుండా పోయాయి. 1932లో గోవా గవర్నర్ గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. భారత్ పోర్చుగల్ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి. 1940 వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్ బ్లాకేడ్’ ప్రకటించడంలో గోవా పరిస్థితి ఎలా ఉందంటే బంగాళ దుంపలు (నెదర్లాండ్); వైన్ (పోర్చుగీసు); కూరలు, బియ్యం (పాకిస్తాన్); టీ (శ్రీలంక), సిమెంట్ (జపాన్), ఉక్కు (బెల్జియం నుంచి) దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారస్థాయికి వచ్చింది. అనంతర పరిణామమే పోర్చుగీసు నంచి గోవా విముక్తి. అడవి నుంచి ప్రసారాలు! గోవా విముక్తి కోసం అంతకు ఐదేళ్ల ముందు.. 1955 నవంబరు 25న ఉదయం 7 గం.లకు ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే సీక్రెట్ రేడియో గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి అడవుల నుంచి మొదలైంది. 1947లో స్వాతంత్య్రం లభించి భారతదేశంలో వీచిన స్వేచ్ఛా పవనాల స్ఫూర్తితో వామన్ సర్దేశాయి, లిబియా లోబో అనేవారు కలసి ఈ సీక్రెట్ రేడియో సర్వీసును పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో ప్రారంభించారు. వారిరువురూ గోవా స్వాతంత్య్రం కోసం ప్రారంభించిన ‘ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో స్టేషన్ ట్రాన్స్‌మీటర్ ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసేవారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసపాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలు కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కలిగించి, ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని పెంచారు. వినోభా రేడియో ప్రసంగం ఈ రేడియో ఛానల్ ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబాభావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్లిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయం పై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెంబరులో విలీన కార్యక్రమం మొదలయ్యాక ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీ నుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ 1961 డిసెంబరు 15న ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబరు 17 న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయు, సముద్ర, భూ తలాలపై కూడా భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబరు 19 న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలసిపోయింది. ఆ రోజున... ఈ వ్యాసం మొదట్లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంపై వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో బృందం గోవా విముక్తి వార్తను ఆకాశమార్గం గుండా ప్రకటించింది. 1955 నవంబరు 25 నుంచి 1961 డిసెంబరు 19 దాకా ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ సీక్రెట్ రేడియోలో వామన్ దేశాయి, లిబియా లోబో జంట తమ బృందంతో అడవులలో పడిన ఇబ్బందులు ఎన్నో, అవి ఏమిటో మనకు తెలియవు. అయితే ఈ ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో ప్రసార కాలంలో వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ రేడియో ఘన చరిత్ర.. భారత స్వాతంత్య్ర సమరం లోనే కాకుండా, ప్రపంచ రేడియో ప్రసారాల చరిత్రలోనే ఒక అద్భుతమైన, స్ఫూర్తి వంతమైన ఘట్టం! – డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: స్వతంత్ర భారతి 1967/2022) -
అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్
ఖగోళంలో మరో మిస్టరీని చేధించే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. విశ్వంలోని మరో పాలపుంత నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భూమికి మూడు బిలియన్ల కాంతి సంవత్సరం దూరంలో ఉన్న పాలపుంత నుంచి ఈ రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ సిగ్నల్స్‌ను గుర్తించడం ఇది రెండోసారి. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్స్(FRB)కు FRB20190520Bగా నామకరణం చేశారు. ఎఫ్ఆర్బీలకు కారణమేంటన్నది ఖచ్చితంగా తెలియదు కానీ.. న్యూట్రాన్ నక్షత్రం వెనుక వదిలిపెట్టిన సూపర్నోవా పేలుడు ద్వారా వెలువడిన దట్టమైన పదార్థంగా భావిస్తున్నారు. ‘నవజాత’ సిద్ధాంతం ప్రకారం, ఎఫ్ఆర్బీ వయసు పెరిగేకొద్దీ సంకేతాలు క్రమంగా బలహీనపడతాయని అంచనా. మే 2019లో చైనాలోని గుయిజౌలో ఐదు వందల మీటర్ల గోళాకార ఎపర్చరు రేడియో టెలిస్కోప్ (FAST)ని ద్వారా FRBని ట్రేస్ చేశారు. అదనపు పరిశీలనలు 2020లో ఐదు నెలల వ్యవధిలోనే.. దాదాపు 75 FRBలను నమోదు చేశాయి. తర్వాత US నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన కార్ల్ G జాన్స్కీ వెరీ లార్జ్ అర్రే ఈ సిగ్నల్స్‌ని స్థానీకరించారు. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదన్న ఆయన వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆకాశవాణి మన్ కీ బాత్ 83వ సంచికలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు అధికారం అక్కర్లేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుడు ఒకరు మోదీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పగా ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు. ‘‘వాస్తవానికి నేను ఇప్పుడు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ప్రజా సేవలో ఉండాలన్నదే నా లక్ష్యం. ఒక ప్రధానమంత్రిగా నేను చెలాయిస్తున్నది అధికారం కాదు. ఇదంతా ప్రజాసేవే’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నది స్టార్టప్‌ల యుగమని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో స్టార్టప్ పరిశ్రమ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో 100 కోట్ల డాలర్ల విలువను కలిగిఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 70కి పైగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలోని పల్లెల్లో యువత కూడా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమస్యలకి పరి ష్కార మార్గాలు చూపిస్తున్నారని మోదీ అన్నా రు. కరోనాతో ప్రపంచ దేశాలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తల్లడిల్లుతూ ఉంటే మన స్టార్టప్ రంగం ఎంతో ఎత్తుకి ఎదిగిందని చెప్పారు. 1971 యుద్ధానికి గోల్డెన్ జూబ్లీ డిసెంబర్ మాసం వచ్చిందంటే తనకి వీర సైనికులు గుర్తుకు వస్తారని ప్రధాని అన్నారు. నేవీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ డేని ఇప్పటికే జరుపుకున్నామని 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజేతలుగా నిలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీర సైనికుల్ని కన్న తల్లులకు మోదీ జోహార్లు అర్పించారు. -
జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. జియోసావన్ ప్లాట్‌ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని క్రొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
రేడియో వినాలా.. మీ దగ్గర లైసెన్స్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: బైక్ లైసెన్స్, కారు లైసెన్స్ గురించి అందరికీ తెలుసు.. కానీ, రేడియో లైసెన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా! రేడియో వినాలన్నా పన్ను.. కొనాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రేడియో కొన్నవారు తొలుత రూ.15 చెల్లించి లైసెన్సు తీసుకునేవారు. అది క్రమంగా రూ.50కి పెరిగింది. అప్పట్లో నగరంలోని ఆజంపురా పోస్టాఫీసులో రేడియో లైసెన్సు దొరికేది. లైసెన్సుకు ఏడాది గడువు ముగిశాక రెన్యువల్ చేసుకోవాల్సిందే. లైసెన్సు లేకుండా రేడియో వింటున్నామన్న సంగతి వైర్లెస్ ఇన్స్పెక్టర్కు తెలిసిందో ఇక అంతే! రేడియోను జప్తు చేసేవారు. రూ.50 జరిమానా చెల్లిస్తేనే రేడియోను తిరిగి ఇచ్చేవారు. ఈ నిబంధనలు నిజాం కాలం నుంచి 1985 వరకు ఉండేవి. ఇక్కడ 1935లో దక్కన్ రేడియో ప్రారంభమైంది. ఇంతకంటే ముందే 1918లోనే షేక్ మహబూబ్ నగరానికి రేడియోను పరిచయం చేశారు. ముంబైలో ఉండే తన మిత్రుడు ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో తయారైన రేడియోలను విక్రయించేవాడు. అతడి సలహా మేరకు నగరంలోని చెత్తాబజార్లో ‘మహబూబ్ రేడియో’పేరిట దుకాణం తెరిచారు. నగరంలో మొదటి రేడియో షాప్ అదే. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ఆయన కొడుకులు మహ్మద్ ముజీబుద్దీన్, మహ్మద్ మొయినుద్దీన్ నడుపుతున్నారు. తొలినాళ్లలో ఉన్నత వర్గాలు, ధనికుల వద్ద మాత్రమే రేడియో ఉండేది. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు మాత్రం మహబూబ్ రేడియో దుకాణం దగ్గరికి వార్తలు వినేందుకు వచ్చేవారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఆ ప్రాంతం జనంతో నిండిపోయేది. ‘మార్కోనీ’తో మొదలై.. మార్కోనీ తయారు చేసిన రేడియో నుంచి చివరిసారిగా ఫిలిప్స్ తయారు చేసిన రేడియో దాకా ఆ షాపులో ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం తయారైన రేడియోలు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. తొలిసారి 1860లో మార్కోనీ తయారు చేసిన రేడియోకు ఒకే బ్యాండ్ ఉండేది. దాన్ని ‘లాంగ్ వే’అనేవారు. అనంతరం మీడియం వే, షార్ట్ వే.. ఇలా బ్యాండ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం సింగిల్, షార్టు వేపై 1–3 వరకు, మీడియం వేపై 1200 వరకు బ్యాండ్లు వస్తున్నాయి. -
సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్ హార్డింగ్, డెమోక్రాట్ల అభ్యర్థి జేమ్స్ కోక్స్పై అఖండ విజయం సాధించారు’ అనే వార్త అమెరికా రేడియోలో మారు మ్రోగిపోయింది. అధ్యక్ష అభ్యర్థుల పేర్లు మారిపోయాయంటూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా వందేళ్ల క్రితం 1920, నవంబర్ 2వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అమెరికాలోని తొలి వాణిజ్య బ్రాడ్ క్యాస్టింగ్ రేడియో స్టేషన్ ‘పిట్స్బర్గ్స్ కేడీకేఏ’ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలతోనే తొట్ట తొలి రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. (చదవండి : అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఎందుకు ఆసక్తి?) హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయని ‘ఫ్రాంక్ కొనార్డ్’ అనే వ్యక్తి రేడియో సాంకేతిక పరిజ్ఞానంలో అనేక పేటెంట్లు సాధించారు. ఆయనే ఆ రోజున తన గ్యారేజీలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ ప్రసారాలను బటన్ తిప్పడం ద్వారా ప్రారంభించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒహాయో నుంచి వెలువడుతున్న మారియన్ స్టార్ ఎడిటర్, పబ్లిషర్ వారెన్ హార్డింగ్ అఖండ విజయం సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనుసరించిన విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. ఆ పర్యవసానంగానే డెమోక్రాట్ల అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చింది’ అంటూ ఫ్రాంక్ కొనార్డే వార్తను విశ్లేషించారు. ఆయన టెలిఫోన్ అమెరికా ఎన్నికల ఫలితాలను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకున్నారు. (చదవండి : ‘ముందస్తు ఓటింగ్’తో నష్టమా, లాభమా?!) నాటి ఫలితాలను నవంబర్ రెండో తేదీ రాత్రి కొంత మంది శ్రోతలే తెలుసుకోగలిగారు. మిగతా అమెరికన్లు మరుసటి రోజు ఉదయం పత్రికలు వచ్చే వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త జార్జి వెస్టింగౌజ్ పెట్టుబడులతో ఫ్రాంక్ కొనార్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికా తొలి లైసెన్స్ వాణిజ్య రేడియో కల నెరవేరింది. వాస్తవానికి 1890 దశకం నుంచి రేడియో సిగ్నల్స్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. దూర ప్రాంతానికి రేడియో సిగ్నల్స్ ప్రసారం చేసిన ఇంజనీర్ జీ. మార్కోనికి నోబెల్ బహుమతి లభించింది. 1910 కొంత మంది ఔత్యాహిక రేడియో ఆపరేటర్లు పరిమిత దూరం వరకు తమ గొంతును, సంగీతాన్ని ప్రసారం చేయగలిగారు. తొలితరంలో రాజకీయ నాయకులు ఎంతో ఉపయోగపడిన రేడియో మాధ్యమం, టీవీల రూపంలో, సోషల్ మీడియా రూపంలో మరెంతగానో అభివృద్ధి చెందింది. -
మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?
సాక్షి, హైదరాబాద్: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగ్.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్‌ల వెతుకులాటకు పరుగులు పెట్టేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మీ ఇంట్లో పాత టీవీ, రేడియో ఉన్నాయా? అందులోని ఈ ఎర్రని వాల్వ్ తీసుకొస్తే మీకు రూ.కోటి ఇస్తాం..’అంటూ వాట్సాప్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 25–30 ఏళ్లనాటి టీవీలు, రేడియోల్లోనే ఇది ఉంటుందని, ఆ వాల్వ్ తెచ్చిన వారికి రూ.లక్షలు, కోట్లలో నజరానా ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో దీని గురించి సామాన్యులు బాగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి టీవీ మెకానిక్ షాపుల వారికి వీటికోసం వెతికే వారి తాకిడి పెరిగింది. పాత టీవీలు ఉన్నా యా? ఎంత రేటైనా సరే.. పెట్టి కొంటామం టూ చాలామంది వస్తున్నారు. దీంతో కొందరు టీవీ మెకానిక్‌లు సైతం వీటి ఆన్వేషణలో పడ్డారు. చాలా మంది అటకెక్కించిన టీవీలను కిందికి దించి చూస్తున్నారు. నిధులను గుర్తిస్తుందంటూ.. టీవీ, రేడియోల్లోని బోర్డుల్లో ఒకప్పుడు ఉపయోగించే ఎర్రటి వాల్వ్‌కు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే మోసగాళ్ల ముఠా సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఈ వాల్వ్ భూమిలో పూర్వీకులు దాచిన గుప్తనిధులు, బంగారాన్ని గుర్తిస్తుందని, ఇది ఉంటే శ్రీమంతులు కావొచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురు ఒకరితో మరొకరు గొలుసుకట్టులా వాల్వ్‌లు సేకరించే పనిలో పడ్డారే తప్ప.. ఎవరు డబ్బులు ఇస్తారు? ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు? అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు అప్పులు చేసి మరీ అడిగినకాడికి చెల్లించి ఇలాంటి వాల్వ్‌లను సొంతం చేసుకుంటున్నా రు. తర్వాత వాటిని ఎలా విక్రయించాలి.. ఎవరికి విక్రయించాలి అన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రచారాలు నమ్మవద్దు.. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, దీని వెనక భారీ మోసం దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా రైస్‌పుల్లింగ్ తరహా మోసమని స్పష్టం చేస్తున్నారు. వీటిని చూపి ఎవరు గుప్త నిధులు తవ్విస్తామని చెప్పినా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఇలాంటివి ప్రచారం చేసే ముఠాలు నిధుల తవ్వకం పేరిట డబ్బులు దోచుకుంటాయని హెచ్చరిస్తున్నారు. -
రేడియో పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి
న్యూఢిల్లీ: కోరోనా దెబ్బకు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేడియో పరిశ్రమ ప్రతినిధులు సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. రేడియో ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎమ్ చానెల్స్ ప్రతినిధులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖలో వివరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను సంవత్సరం పాటు మినహాయించాలని లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ లేఖపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను వడ్డీ లేకుండా మూడు నెలలు పొడిగించనున్నట్లు తెలిపింది. కోరోనా కారణంగా రేడియా పరిశ్రమ ఏప్రిల్‌లో 80శాతం నష్టపోగా.. మే నెలలో 90శాతం నష్టపోయిందని ప్రతినిధులు వాపోయారు. లక్షలాది మందికి ఉపాధి కల్సిస్తున్న రంగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పరిశ్రమ 200కోట్ల నష్టాలను చవిచూసిందని.. సెప్టెంబర్ నాటికి 600 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి -
వినిపించని ఆకాశ 'వాణి'
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.. అని రేడియో నుంచి మాటలు వినగానే నా మనస్సులో వార్తలు వినాలనే కుతూహలం పెరిగేది. కానీ నేడు ఈ రేడియోలు లేక టీవీలో వార్తలు సక్రమంగా వినలేకపోతున్నానంటూ తనకు రేడియోతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సిద్దిపేట పట్టణానికి చెందిన రాజయ్య. కేవలం రాజయ్య మాత్రమే కాదు అనేక మంది రేడియోతో అనుబంధం ఉన్నవారు అందరూ ఇదే విధంగా రేడియోను గుర్తు చేయగానే ఇలానే తమ అభిప్రాయాలు వెల్లడించారు. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గతంలో ఒక చోట నుంచి మరొక చోటుకు సందేశాలు, విషయాలు చేరాలంటే కేవలం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది, లేదంటే వ్యక్తి అక్కడికి వెళ్లడంతో మాత్రమే విషయం తెలిసేది. కాలక్రమంలో రేడియోల స్థానంలో టీవీలు వచ్చాయి. దీంతో అనేక సంవత్సరాల వైభవం పొందిన రేడియోలు నేడు ఎక్కడో ఒక చోట మాత్రమే దర్శనమిస్తున్నాయి. కేవలం ప్రధాని నరేంద్రమోడీ ప్రతీ నెలా దేశ ప్రజలకు అందించే సందేశాన్ని వినడానికి మాత్రమే అక్కడక్కడ రేడియోలు ఉన్నాయి. రేడియోలకు అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక యుద్ధాల విషయాలు, విశేషాల విషయాలను ప్రజలకు తెలియజేసిన చరిత్ర రేడియోలది. అదే విధంగా ప్రపంచంలోనే శాంతియుతంగా స్వాతంత్య్రం సాధించిన భారత్‌ను కదిలించిన నాయకుల ప్రసంగాలు, తదితర విషయాలను ఈ రేడియోలే నాడు ప్రజలకు ప్రచార మాద్యమాలుగా నిలిచి, ప్రజలను ఐక్యంగా చేశాయి. ఇంతటి విశిష్టత ఉన్న రేడియోలు నేడు కనుమరుగవుతుండటం చింతించవలిసిన విషయం. అయినా నేటికి కూడా రేడియోలో వార్తలు వినే వారు, అదేవిధంగా ఎఫ్ఎమ్ లో పాటలు వినే వారు ఉన్నారు. అదే విధంగా దూరవిద్య పాఠాలు ఈ రేడియో ద్వారానే నేటికి వింటున్నారు. నాడు కాలక్షేపం ఈ రేడియోలే... నేడు టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు లేని ఇళ్లు, వ్యక్తులు లేరంటే ఆశ్యర్యపోవాల్సిందే. కానీ నాడు ఇంటికో రేడియో ఉంటే అదే గొప్పని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ రేడియోలతోనే ప్రజల్లో చైతన్యం కలిగింది. వ్యవసాయం, పాడిపాంట, రైతే రాజ్యం తదితర పేర్లతో రేడియోలతో వ్యవసాయ సమాచారం, జానపదకథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, సినిమా పాటలు, క్రికెట్ కామెంట్రీలు ఈ రేడియోల ద్వారానే వినేవారమని అనేక మంది వృద్ధులు తమ అనుభవాలను తెలపడం విశేషం. షాప్‌లో సందడిగా ఉండేది.. 1977 నుంచి రేడియో మెకానిక్‌గా షాప్ నిర్వహిస్తున్నాను. అప్పుడు చేతి నిండా పనులు ఉండేవి. అనంతరం టేప్రికార్డ్లు వచ్చాయి. తర్వాత టీవీలు రంగప్రవేశం చేశాక వివిధ మోడళ్లలో టీవీలు రావడంతో పనులు పూర్తిగా తగ్గాయి. రేడియోలు ఉన్నతం కాలం షాప్ నిండా రేడియోలే ఉండేవి. షాప్‌లో ప్రజలతో సందడిగా ఉండేది, నేడు ఆ సందడి లేదు. –విజయ్‌కుమార్,రేడియో మెకానిక్, సిద్దిపేట సంవత్సరానికి వంద మాత్రమే విక్రయిస్తున్నాం సిద్దిపేట జిల్లాలో కేవలం మా షాప్‌లో మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. రేడియోలు అవసరం ఉన్నవారు ఖరీదు కోసం మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, తదితర జిల్లా వాసులు, పాఠశాలలకు మా దగ్గరి నుంచే రేడియోలు ఖరీదు చేస్తున్నారు. మేము ఢిల్లీ నుంచి ఈ రేడియోలను ఖరీదు చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి కేవలం 100 వరకు మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. టీవీలు రావడం ద్వారా వీటి విక్రయాలు పూర్తిగా తగ్గాయి. వీటి ధరలు రూ.750 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి –చంద్రశేఖర్, వ్యాపారస్తడు, సిద్దిపేట రేడియోలోనే విషయాలు తెలిసేవి చిన్నతనంలో ఏ వార్తలు అయిన కేవలం రేడియో ద్వారా మాత్రమే వినేవాళ్లం. ప్రతి రోజు మా గృహంలో వ్యవసాయ సంబంధిత వార్తలతో పాటుగా, ధాన్యం రేట్లు, తదితర రేట్లను ఈ రేడియోల ద్వారానే వినేవాళ్లం. వార్తల సమయాలను గుర్తుకు పెట్టుకుని ఆ సమాయల్లో తప్పని సరిగా వార్తలు వినేవాళ్లం. నేటికి కూడా అప్పడప్పడు టీవీలోనే ఎఫ్ఎమ్ ద్వారా ఆకాశవాణి ప్రసారాలను వింటున్నాను.–ఆత్మారాములు, సిద్దిపేట -
కోర్సు వారమే.. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆసక్తి
సాక్షి, సోమాజిగూడ: సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నివచ్చినా..హ్యామ్ రేడియోకి ఆదరణ తగ్గలేదని చెప్పొచ్చు. ఇప్పటి తరం వారిలో చాలా మందికి హ్యామ్ రేడియో గురించి అంతగా తెలియక పోయినా..తుపాను..వరదల సమయంలో హ్యామ్ రేడియో పాత్రను మనం మరవలేము. సెల్‌ఫోన్ సిగ్నల్ లేని చోట సైతం హ్యామ్ రేడియో ప్రతినిధులు సమాచారాన్ని చేరవేస్తారు. విద్యార్హతతో సంబంధం లేకుండా 12 ఏళ్లు పైబడిన వారు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొసీజర్‌పై వారం పాటు నిర్వహించే కోర్సుకు పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన వారికి భారత్ ప్రభుత్వం(డీఓటీ) లైసెన్స్ మంజూరు చేస్తుంది. నామమాత్రపు ఫీజు.. ఈ కోర్సు చేయాలను కున్న వారికి వయస్సుతో సంబంధం లేదు. 12 ఏళ్లు పైబడిన వారు కోర్సును పూర్తి చేసి అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ కావచ్చు. ఒకప్పుడు వీఐపీలు మాత్రమే అమెచ్యూర్ రేడియోను వినియోగించేవారు. సెల్పోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేని కాలంలో అత్యాధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతమున్న కమ్యూనికేషన్ రంగానికి హ్యామ్ రేడియో మూలమని చెప్పవచ్చు. పుస్తకం విడుదల.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ అమెచ్యూర్ రేడియో వ్యవస్థాపకుడు ఎస్.సూరి దీనిపై ఆల్ ఎబౌట్ అమెచ్యూర్ రేడియో అనే పుస్తకాన్ని రచించారు. అమెచ్యూర్ రేడియో కోర్సు పట్ల ఉన్న ఉపయోగాన్ని ఆయన తన రచన ద్వారా వివరించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో భారత్ ఉప రాష్ట్ర పతి దానిని ఆవిష్కరించినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్గా... ♦ ఇంజినీరింగ్ ఈసీఈ విద్యార్థులు హ్యామ్ రేడియో కోర్సును ప్రాజెక్టు వర్కుగా చేస్తున్నారు. ఆయా కళాశాలలు ఇంటర్నషిప్ కోసం నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెచ్చూర్ రేడియో కార్యాలయంలో శిక్షణ ఇపిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్డులోని ఈ కార్యాలయంలో ఎంతో మంది శిక్షణ పొంది లైసెన్సులు పొందినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎస్.సూరి తెలిపారు. ♦ కూర్చున్న చోటనుంచే ఏదేశంవారితోనైనా మాట్లాడొచ్చు ♦ అమెచ్యూర్ ఆపరేటర్ ఏదేశంలోనున్నా కూర్చున్న చోటనుంచే వారితో మాట్లాడొచ్చు. ఎటువంటి విద్యుత్, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతం నుంచి కూడా సమాచారం పంపొచ్చు. ♦ వరదలు, తుపాన్, భూకంపం వంటివి వచ్చినప్పుడు హ్యామ్ రేడియో ఎంతో ఉపయోగ పడుతోంది. ♦ అమెచ్యూర్ రేడియో అడ్వాన్స్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్లకు పైగా ఉన్న హ్యామర్స్‌తో మాట్లాడుతోవచ్చు. ♦ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ♦ అమెచ్యూర్ (హ్యామ్) రేడియో కోర్సు పట్ల యువత ఆసక్తి చూపుతోంది. కోర్సుతో వారికి అంతగా పనిలేకున్నా. హాబీగా చేసుకుంటున్నారు. వైర్లెస్ హ్యాండ్ సెట్లు చేతపట్టి అటుఇటుగా తిరగడం అదోఫ్యాషన్గా మారింది.పోలీసు స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్ల కంటే దీని ఫ్రీక్వెన్సీ అధికమని చెప్పవచ్చు. ఉత్తి రోజుల్లో అమెచ్యూర్ ఆమరేటర్లతో మాటాత్రమే మాట్లాడుకునే వారు.. ప్రకృతి విలయ తాండవం చేసినపుడు..సమాచార వ్యవస్థ చిన్నా భిన్నమైన సమయంలో తామున్నామంటూ అమెచ్యూర్ ఆపరేటర్లు ముందుకు వచ్చి దేశ సేవలో నిమగ్నమవుతున్నారు. -
రేడియో వెంకట్రామయ్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: గంభీరమైన గళం, స్పష్టమైన ఉచ్ఛారణ, సరళమైన భాషతో ‘ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య’అంటూ హైదరాబాద్ రేడియో స్టేషన్ కేంద్రంగా మూడున్నర దశాబ్దాలు వివిధ హోదాల్లో పనిచేసిన రేడియో న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య (78) కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా చూసి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. రేడియో అనౌన్సర్‌గా 1963 నవంబర్‌లో ఆకాశవాణిలో చేరిన ఆయన న్యూస్ రీడర్‌గా చాలా కాలం పనిచేశారు. నాటక రచయితగా, కథా రచయితగా మంచి పేరు సంపాదించారు. ఆయన రేడియో అనుభవాలు, వెంకట్రామయ్య కథల పేరుతో రెండు పుస్తకాలు వెలువరించారు. వెంకట్రామయ్య ఆకస్మిక మరణంపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు అమీర్‌పేట ఈఎస్ఐ స్మశానవాటికలో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాలలో ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. వెంకట్రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
క్విట్ ఇండియాకు ఊపిరులూదిన రేడియో
బ్రిటిష్ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. కోర్టులకెళ్ళడం పాపంగా పరిగణించాలి. విదేశీ వస్తువులు కొనవద్దు. ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి. న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్ చెయ్యండి. రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే ఉండనివ్వండి. ఇలాంటి పది విధులను ప్రతి భారతీయుడు తప్పకుండా నిర్వహించాలని 1942 అక్టోబరు 29వ తేదీన రహస్య ఆకాశవాణి కాంగ్రెస్ రేడియో హిందూస్తానీలో ఉద్బోధించింది. అవి క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిష్ ప్రభుత్వం నడిపే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చురాపల్లిలు మాత్రమే ఉన్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందననుగానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్ కాకుండా అచ్చు కావడంలేదు. దాంతో భాగ్యనగర్ రేడియో వంటి రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి. 1942 ఆగస్టు 27 నుంచి నవంబరు 12 వరకు 78 రోజులపాటు రామమనోహర్ లోహియా పర్యవేక్షణలో కాంగ్రెస్ రేడియో గొప్పగా సాగింది. మనదేశంలో 1927 జూలై 23న వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు మొదలయ్యాయనే కారణంతో ఆరోజును భారత ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విలువైన ప్రసారాలు చేసి గొప్ప చరిత్ర సృష్టించిన ఈ ఆజాద్ రేడియో గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం కన్నుగప్పడానికి కొన్నిరోజులకొకసారి ప్రసార ఫ్రీక్వెన్సీతోపాటు ట్రాన్స్‌మీటర్ స్థానం ఆరేడుచోట్లకు మార్చారు. విఠల్దాస్ కాకర్, ఉషా మెహతా, విఠల్దాస్ జవేరి, నానక్ మెత్వానివంటి మెరికల్లాంటి నలుగురు యువతీయువకులతో ఈ ప్రసారాలలో తోడ్పడ్డారు. ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్స్ ఆధారంగా ఈ కాంగ్రెస్ రేడియో లేదా ఆజాద్ రేడియో గురించి మరిన్ని విషయాలు ఇటీవలే బయల్పడ్డాయి. రోజుకు ఒకసారి ఇంగ్లిష్‌లో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు చేసిన ఈ రేడియో ఎటువంటి విషయాలు ఇచ్చిందనే అంశంపై అధ్యయనం ప్రారంభించినపుడు ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్న విషయాలు తారసపడ్డాయి. ఈ సమాచారంతో 2018లో ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డూరింగ్ క్విట్ఇండియా మూమెంట్’ అనే పుస్తకం వెలువడింది. ఈ 78 రోజుల ప్రసారాలు హిందూస్తాన్ హమారా అనే పాటతో మొదలై వందేమాతరం పాటతో ముగిసేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకుల ప్రసంగాలు, భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ అండ్ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు– ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో కార్యక్రమాలు ఉండేవి. భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గత 200 ఏళ్లలో జరిగిన విప్లవాలలో పోల్చి ఒక భారత్‌లోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు. వీరందరూ ధనికులే కానీ పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక ప్రత్యేకత. భారత్‌లో అనాదిగా ఉండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్య్రోద్యమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి. ఇటువంటి కారణాలతో భారత స్వాతంత్య్రోద్యమం విశేషమైంది, విలక్షణమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్మనోహర్ లోహియా సారథ్యంలో ఆనాటి ఆజాద్ రేడియో దేశానికందించింది. ఈ రేడియో సాగింది 78 రోజు లైనా ప్రసారం చేసిన సమాచారం, మార్గదర్శకత్వం మాత్రం విలువైనవి. డా.నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త వర్తమానాంశాల పరిశోధకులు, పత్రికా రచయిత, మొబైల్ : 94407 32392 -
ఐసీసీ వరల్డ్‌కప్ : ఆ వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్‌కప్ 2019ల మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆడియో ప్రసారం చేస్తున్న సుమారు 60 వెబ్సైట్లు, రేడియో ఛానెళ్లకు షాక్ ఇచ్చింది. ఛానెల్-2 గ్రూప్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీటి ఆడియో సేవలను ప్రసారం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఆర్ మిథా నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. అంతేకాదు దీనిపై సమాధానం ఇవ్వాలంటూ సంబంధిత వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు, ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సంబంధిత వెబ్సైట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సూచించింది. సన్నాహక మ్యాచ్‌లతో సహా మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసార హక్కులను పొందిన గ్రూప్ 2 ఛానల్ తమ ప్రత్యేకమైన, మేధో సంపత్తి హక్కులను కొన్ని వెబ్సైట్లు, రేడియో ఛానళ్లు దుర్వినియోగం చేశాయని ఆరోపించింది. తద్వారా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యూఏఈ ఆధారిత సంస్థ ఛానల్ 2 గ్రూప్ ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ నుంచి 2023 వరకు ప్రత్యేక గ్లోబల్ ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ప్రత్యేకమైన ఆడియో హక్కులను కలిగి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌కాస్టర్ హాట్‌స్టార్‌కి అధికారికపార్టనర్గా ఉంది. ఐసీసీ క్రికెట్ కౌన్సిల్‌కు చెందిన వాణిజ్య సంస్థ ఐసీసీ బిజినెస్ కార్పోరేషన్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆడియో హక్కుల ఒప్పందంపై సంతకాలు చేసింది. మే 30న మొదలైన ప్రపంచకప్ 2019 జులై 14 వరకు జరగనున్నసంగతి తెలిసిందే -
అమ్మకానికి అంబానీ రేడియో
ముంబై : తీవ్ర రుణ భారంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్న రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ (అడాగ్) గ్రూపు అధినేత అనిల్ అంబానీ, ఆ భారాన్ని తగ్గించుకునే దిశగా మరో ముందడుగు వేశారు. మ్యూచువల్ ఫండ్స్ సేవల సంస్థ రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్ కుదుర్చుకోగా, బిగ్ఎఫ్ఎం పేరుతో దేశవ్యాప్తంగా ఎఫ్ఎం చానళ్లను నిర్వహించే రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ (ఆర్బీఎన్ఎల్) విక్రయం విషయంలోనూ పురోగతి సాధించారు. జాగరణ్ ప్రకాశన్ గ్రూపునకు ఆర్‌బీఎన్‌ఎల్‌ను రూ.1,050 కోట్లకు విక్రయించనున్నట్టు రిలయన్స్ క్యాపిటల్ సోమవారం ప్రకటించింది. కీలకం కాని వ్యాపారాలను విక్రయించాలన్న తమ వ్యూహంలో భాగమే ఈ లావాదేవీ అని రిలయన్స్ క్యాపిటల్ సీఎఫ్‌వో అమిత్‌బప్నా పేర్కొన్నారు. నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్ క్యాపిటల్‌కు రూ.6,000 కోట్లు సమకూరనున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతుల రాకలో జాప్యం కారణంగా గతంలో ఆర్‌బీఎన్‌ఎల్‌ను జీ గ్రూపుకు విక్రయించాలనే ఒప్పందం విఫలమైన విషయం విదితమే. తొలుత 24 శాతం వాటా... దైనిక్ జాగరణ్ పేరుతో హిందీ దినపత్రికను ప్రచురించే జాగరణ్ ప్రకాశన్‌కు రేడియో సిటీ పేరుతో ఎఫ్ఎం చానళ్లను నిర్వహించే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ (ఎంబీఎల్) కంపెనీ ఉంది. దీని ద్వారా ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఆర్‌బీఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎంబీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఎన్‌ఎల్‌లో తొలుత 24 శాతం వాటాను రూ.202 కోట్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఎంబీఎల్ కొనుగోలు చేయనుంది. తర్వాత అన్ని నియంత్రణ సంస్థ ల అనుమతులకు లోబడి ఆర్‌బీఎన్‌ఎల్‌లో మిగిలిన వాటాను రూ.1,050 కోట్లకు సొంతం చేసుకోనుంచి. మొత్తం సంస్థ విలువ రూ.1,050 కోట్లు’’ అని రిలయన్స్ క్యాపిటల్ తన ప్రకటనలో పేర్కొంది. కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. బిగ్ఎఫ్ఎం నెట్వర్క్ కింద ఆర్‌బీఎన్‌ఎల్‌కు 58 ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 40 ఎఫ్ఎం స్టేషన్లు ఈ ఒప్పందంలో భాగంగా ఎంబీఎల్‌కు వెళ్లనున్నాయి. దీంతో మొత్తం 79 రేడియో స్టేషన్లతో అతిపెద్ద ఎఫ్ఎం రేడియో నెట్‌వర్క్‌గా ఎంబీఎల్ అవతరించనుంది. ఇక బిగ్ఎఫ్ఎం కింద మిగిలిన 18 ఎఫ్ఎం స్టేషన్లను రెండో దశ లావాదేవీ కింద మరో రూ.150 కోట్లకు ఎంబీఎల్‌కు కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఆర్‌బీఎన్‌ఎల్‌కు లోగడ జీ గ్రూపు రూ.1,872 కోట్లను ఆఫర్ చేయగా, దాంతో పోలిస్తే జాగరణ్ ఇవ్వచూపిన రూ.1,200 కోట్లు తక్కువేనని తెలుస్తోంది. -
ఎర్రగులాబి
‘‘గుడ్ మార్నింగ్... నమస్తే.. ఆదాబ్.. నేను సూపర్ కూల్.. మీరు వింటున్నారు రేడియో నీమ్.. ఇది చాలా చేదు బాస్. యే డైట్ అయినా షుగర్‌కి నో అంటోంది కాని బిట్టర్కి కాదు. బిట్టర్ ఎంత బెస్టో తెలుసా! చేదుకు అలవాటు పడితే.. ఎంతటి కషాయాన్నయినా.. ఐ మీన్ ఎంతటి కష్టాన్నయినా ఇట్టే మింగేయొచ్చు’’ సాగుతోంది నాన్‌స్టాప్‌గా!మొబైల్ ఫోన్లో మెసేజెస్ బ్లింక్ అవుతూన్నాయి. ఆసక్తి..అనాసక్తి..వంటివేవీ ప్రదర్శించకుండా తన పనిలో నిమగ్నమైంది ఆ గొంతు. షో తర్వాత ఫోన్ చూసుకుంటే... ‘‘హేయ్..! వెన్ విల్ వి మీట్’’ మెసేజే రిపీటెడ్‌గా ఉంది. డయల్ చేయబోతుండగానే.. రింగ్ అయింది.. ‘‘భైరవా..’’‘‘హాయ్.. ’’ ఆత్రం, ప్రేమ, మార్దవంగా భైరవ. ‘‘సారీ.. ఇందాక షోలో ఉండి రిప్లయ్ ఇవ్వలేదు’’‘‘ఓహ్.. సారీ డిస్టర్బ్ చేసినందుకు.. ’’నొచ్చుకుంటూ భైరవ. ‘‘కమాన్ మ్యాన్.. డోంట్ బీ ఫార్మల్’’‘‘అయితే.. చెప్పు.. ఎప్పుడు కలుస్తున్నావ్?’’‘‘అప్పుడే ఎందుకంత తొందర? కలుద్దాం’’ నింపాదిగా!‘‘ హే.. ఇట్స్ బీన్ ఎ మంత్.. డార్లింగ్?’’ భైరవ‘‘అందుకే అంత తొందరా అంటున్నా..’’‘‘హలో బేబీ.. ఇది మిలేనియల్స్ ఏజ్. నిన్న కలిసి.. ఈ రోజు ప్రేమించుకుని.. రేపు బ్రేకప్ చేసుకునేంత స్పీడ్..’’‘‘ఆహా... ’’‘‘యెస్ బేబీ!చచ్చిపోతున్నా.. నరకం కనపడుతోంది.. వినిపించడం తప్ప కనిపించవు’’. ‘‘కమా...న్ డియర్’’ మత్తుగా!అంతే ఆ స్వరంలోని హస్కీనెస్కు నోటమాట రాలేదు భైరవకు. ‘‘బై.. విల్ మీట్ సూన్..’’ ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ ‘‘పిన్నీ..ప్లీజ్.. ఏడిస్తే పోయిన ఆత్మిక మళ్లీ రాదు కదా! చూడూ.. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో?’’ ‘‘ నా వల్ల కావట్లేదు. ఆరోజు దాన్ని ఒంటరిగా వదిలి ఉండాల్సింది కాదు. పాపిష్టిదాన్ని!‘మమ్మీ తలనొప్పిగా ఉంది.. కాసేపు పడుకుంటా’ అంటే.. పడుకోనీ అని నా చేతులతోనే తలుపేసి హాల్లోకి వచ్చా. దాంతోపాటే ఉన్నా అదిలా చేసుండేది కాదు. అది ఉరేసుకొని నా ఊపిరి తీసింది. నేను, మీ బాబాయ్ ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి?’’ రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది చిత్ర. ఆ దుర్ఘటనను అలా ఆమె గుర్తు చేసుకోవడం లక్షా ఎనభయ్యోసారి.‘‘ఊరుకో పిన్నీ.. ప్లీజ్’’ అంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఆత్మిక చనిపోయి ఏడు నెలలు అవుతోంది. ఆకలి, నిద్ర ఆమె దరిదాపుల్లోకి రాక ఏడునెల్లవుతోంది. కాలం చిత్ర గాయాన్ని ఏమాత్రం మాన్పలేకపోతోంది. ఆత్మిక ఆత్మహత్య కంటే కూడా చిత్ర క్షోభే ఆ ఇంట్లో వాళ్లను కలత పెడ్తోంది. కౌన్సెలింగ్,సైకియాట్రి, ఆధ్యాత్మికత.. ఏమీ చేయలేకపోతున్నాయి. ‘‘ఆత్మిక ఆత్మ వచ్చి చెబితే గానీ మీ పిన్నీ మనుషుల్లోపడదు’’ జనాంతికంగా అన్నాడు సురేష్.. భార్య మానసిక స్థితి చూడలేక. ‘‘నేనొస్తేనన్నా.. కాస్త తేరుకొని మనుషుల్లో పడ్తుందని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా బాబాయ్! ప్చ్..నేనూ ఏం చేయలేక పోతున్నా..’’ బాధగా.‘‘ఛ..ఛ! అలా అనకురా.. నువ్వు రావడం నిజంగా మంచిదే అయింది. నేను కాస్తయినా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా’’ భుజమ్మీద చేయివేస్తూ అనునయంగా అన్నాడు సురేష్. ఆత్మీక, తను కజిన్సే కాని సిబ్లింగ్స్ కన్నా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికే కాదు.. ఆ ఇద్దరన్నదమ్ముల కుటుంబాలకూ ప్రాణం. ‘‘ఆత్మికా.. మై సిస్టర్.. నిన్ను మాకు కాకుండా చేసినవాడిని.. పిన్నిని ఇలా పిచ్చిదానిలా మార్చిన వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు..’’ అంటుంటే.. గోడ మీద ఉన్న ఆత్మిక ఫోటోకి వేలాడ దీసిన దండలోంచి ఎర్ర గులాబీ కింద పడింది. ∙∙ ‘‘హలో... మళ్లీ డిస్టర్బ్ చేస్తున్నానా?’’ భైరవ‘‘ఏం లేదు.. చెప్పు’’‘‘నిన్ను కలవకుండానే పోతానేమో’’ భైరవ‘‘అబ్బా..అంత నిరాశా?’’ ‘మరేంచేయను? నీ వాయిస్.. పెక్యూలియర్ వాయిస్ వినే భాగ్యం దొరికింది ఈ జన్మకిది చాలు అనుకుంటా’’ ‘‘ఆహా..’’‘‘నిజం.. ఐ మీన్ ఇట్. గమ్మత్తయిన వాయిస్. నిన్ను చూడకుండా నీతో లవ్‌లో పడ్డానంటే నీ వాయిసే కారణం. యు షుడ్ థ్యాంక్ ఫుల్ టు గాడ్.. అలాంటి గొంతునిచ్చినందుకు’’ భైరవ‘‘సరేగాని..ఎందుకు కాల్ చేశావో చెప్పు’’‘‘ ఈ ఈవెనింగ్ కలవ్వా... ప్లీజ్’’ బతిమాలాడు భైరవ. ‘‘హూ.. ’’నిట్టూరుస్తూ.. ‘‘ఈ ఈవెనింగ్ కుదరకపోవచ్చు. సిక్స్ థర్టీకి రికార్డింగ్ ఉంది. ఆఫ్టర్ టెన్ అయితే ఓకే.. ’’‘‘ నైట్? నీకు ఓకే అయితే నాకూ ఓకే’’ కొంటెగా భైరవ. ‘‘వెన్యూ...?’’‘‘అదీ నువ్వే చెప్పు..’’ అన్నాడు అదే కొంటెతనంతో భైరవ‘‘వాట్సప్ చేస్తా...’’ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ∙∙ రాత్రి.. ‘‘హేయ్.. నీ వాయిస్‌కి తగ్గట్టే నీ టేస్ట్ కూడా పెక్యూలియర్’’ ‘‘ఆహా..’’‘‘కాకపోతే.. ఫస్ట్ టైమ్ నిన్ను చూడబోతుంటే వెన్యూ పెట్టేది ఈ ఊరి శ్మశానంలోనా?’’ వెటకారం భైరవలో.‘‘యే.. భయమేస్తోందా?’’ ‘‘అంతలేదు బేబీ.. త్వరగా రా.. వెయిటింగ్’’ అన్నాడు. ‘‘ వస్తున్నా’’సరిగ్గా పది గంటల పది నిమిషాలకు.. ఫోన్లో సూచించిన ప్రకారం.. ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు సమాధి వెపు మొహం చేసి!సరిగ్గా అతని వెనకాల.. సన్నగా.. భుజాల వరకు జుట్టు.. జీన్స్.. షూ.. క్యాప్ స్వెట్టర్‌తో ఓ ఆకారం. క్యాప్‌తో తలంతా కవర్ చేసుకుని చేతులను జీన్స్ పాకెట్స్‌లో పెట్టుకుని మెడ వంచి ముందున్న ఓ రాయిని బలంగా తన్నింది ఆకారం. రాయి వెళ్లి సరాసరి భైరవ పిరుదుకు తగిలింది. అసంకల్పితంగా దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ వెనక్కి తిరిగాడు చటుక్కున.‘‘హాయ్..’’ అంటూ జేబుల్లోంచి చేతులు తీసి తల మీదున్న క్యాప్‌ను వెనక్కి తోస్తూ మొహాన్ని పైకెత్తింది ఆ ఆకారం. షాక్.. భైరవకు. గొంతు సుపరిచితం.. ఫేస్ ఏంటీ.. మీసాలతో?‘‘నువ్వు.. నువ్వు... అబ్బాయివా?’’ విస్మయం.‘‘యెస్.. ఆత్మిక అన్నను. నువ్వు నిలబడ్డది ఆత్మిక సమాధి దగ్గరే’’ చెప్పాడు.‘‘ఎంత మోసం’’ భైరవ. ‘‘నువ్వు నా చెల్లికి చేసిన దాని కంటేనా? ఏరా..ఒకరోజు పరిచయం.. రెండో రోజు ప్రేమ.. మూడో రోజు బ్రేకప్ ఆ... నా చెల్లిని చీట్ చేసింది ఇలాగే కదా?’’ అంటుంటే.. ‘‘అన్నయ్యా.. నువ్వాగు’’ అని వినిపించింది సమాధి వైపు నుంచి. ఇంకో షాక్ భైరవకి. అది ఆత్మిక గొంతు. వినిపించిన వైపు తిరిగాడు భయంగానే. నవ్వుతోంది ఆత్మిక.. నల్లటి చుడీ దార్లో తెల్లగా మెరిసిపోతూ.. పెద్ద జడను మెడకు చుట్టుకుని.. దోసిళ్ల కొద్దీ ఎర్ర గులాబీలను భైరవ మీదకు విసురుతూ. చూస్తుండగానే ఆ గులాబీలన్నీ భైరవను ముంచెత్తాయి శ్వాస తీసుకోనివ్వకుండా.‘‘ఇవన్నీ నువ్వు నాకిచ్చినవే.. తీసుకో.. తీసుకో’’ విరగబడి నవ్వుతూ భైరవ మీదకు వేస్తూనే ఉంది ఆత్మిక.వెనక్కి తిరిగాడు ఆత్మిక అన్న..క్యాప్ తల మీదకు జరుపుకొని చేతులు జేబుల్లోకి దూర్చుకుంటూ! సరస్వతి రమ -
స్వాతంత్య్ర పోరాటంలో కీలకం ఆజాద్ రేడియో
ఐక్యరాజ్యసమితి రేడియో 1846 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది రేడియో దినోత్సవం సందర్భంగా ‘సంభాషణ, సహిష్ణుత, శాంతి’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్దేశించారు. అయితే, సంభాషణ మృగ్యమై, సహిష్ణుత లుప్తమై, శాంతి కరువైన క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్య వాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్ పాలకులు దీనిని ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘ఆజాద్ రేడియో’ అన్నారు. ఈ రహస్యవాణికి వ్యూహకర్త రామ్ మనోహర్ లోహియా కాగా, నిర్వహించినది 20 నుంచి 40 ఏళ్ల మధ్యగల ఏడుగురు ధీశాలులు. అతి త్వరలో ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో, పాఠశాల విద్యార్థుల పుస్తకాల్లో అంతర్భాగం కానుంది. 1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్‌వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరెంగే యా మారేంగే’అని పిలుపునిచ్చారు. అది మంత్రమై దేశం ఎల్లడెలా పాకింది. బ్రిటిష్ అధికారులు నాయకులను అగ్రస్థాయి నుంచి, బ్లాకు స్థాయి వరకూ చెరసాలల్లో బంధించారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని, రహస్యంగా ఉద్యమంలోకి సాగారు. 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘ఆజాద్ రేడియో’. 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం కైవశం చేసుకునే వరకు నవంబర్ 12 వరకు గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక సాధనలో సోషలిస్టు నాయకుడు మధులిమాయే రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్ రేడియో పరికరాలను విఠలరావ్ పట్వర్థన్ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని గోదావరి నదిలో పడేశారని పేర్కొన్నారు. ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్’అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్‌ఫర్ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్ చటర్జీ 1984 నుంచి నేషనల్ ఆర్కైవ్స్‌లో గాలించి పరిశోధన చేస్తున్నారు. వీరికి ‘పోలీస్ మానిటరీ రిపోర్ట్’ అనే పోలీసు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్ తారసపడింది. అప్పట్లో ఆజాద్ రేడియో ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబర్ 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించిన అంశాలు. వీటిని గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్ నుంచి బెంగాల్ దాకా, బిహార్ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్ నుంచీ మహారాష్ట్ర దాకా సమాచారాన్ని చేరవేశారని అర్థమవుతుంది. ‘‘..స్కౌట్ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించిన కాంగ్రెస్ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం రామ్ మనోహర్ లోహియా అని తెలి సింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబర్ 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబర్ 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది బీదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఈ ఆజాద్ రేడియో ప్రసారాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్ రేడియో. అంతరాయం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71 రోజులు) ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్మీటర్లను వేర్వేరు ప్రాంతాలకు బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి తరలించేవారు. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్లపై ప్రసారాలు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసా రాలు సాగేవి. హిందుస్తానీ హమారా అనే పాటతో మొదలై, వందేమాతరంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసార శక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఈ ప్రసారాలు వినడానికి 225 రూపాయలు వెచ్చించి రేడియో సెట్టు కూడా నిర్వాహకులు కొన్నారు. ఈ ప్రసారాలు నిర్వహించినవారిలో గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల బాబూ భాయ్ విఠల్దాస్ మాథవి ఖక్కడ్ అనే పేరుగల యువకుడు ముఖ్యుడు. ముంబ యిలో ఫోర్త్ స్టాండర్డ్ మాత్రమే చదివిన ఈ కుర్రాడు కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం కేరో గ్యాస్ తయారీ వ్యాపారంలో ఉండేవాడు. లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఇతనిదే. ఈ రేడియో ప్రసారాలు నిర్వహించినందుకు 1943 మే తీర్పు ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. సూరత్‌కు చెందిన 22 ఏళ్ల కుమారి ఉషామెహతా ఈ రేడియో ప్రసారాల విషయంలో బాబూ భాయ్‌కి కుడిభుజంగా ఉండేవారు. ట్రాన్స్‌మీటర్ వాడటం, మైక్రోఫోన్ ద్వారా లోహియా రాసిన ప్రసంగాలు రేడియోలో చదవడంవంటి పనులు చేసేవారు. ఎంఏ చదువుతున్న సమయంలో ఈమె ఈ ప్రసార సేవలు అందించారు. చివర్లో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన మెహతా స్వాతంత్య్రం వచ్చాక ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇక నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ కూడా వీరితో చేతులు కలిపాడు. దాంతో బాబూభాయ్ కేరోగ్యాస్ వ్యాపారంతో చేతులు కలిపారు. దీన్ని నిషేధించాక, ఆజాద్ రేడియో ట్రాన్స్‌మీటర్ తయారు చేసి ఇచ్చాడు ప్రింటర్. ఈ ముగ్గురుతోపాటు గుజరాత్ భావనగర్ ప్రాంతా నికి చెందిన 28 సంవత్సరాల విఠల్ దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్ చంద్ మోత్వానీ, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 ఏళ్ల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్ కూడా రేడియో ప్రసారాల్లో కీలకపాత్ర పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజెన్స్ రికార్డులలో ఉన్నాయి. అందువల్ల వారి పేర్లే ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇలా స్వాతంత్య్ర పోరాట సమయంలో రేడియో జర్నలిజానికి గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచింది ఆజాద్ రేడియో. (రేపు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా) -డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్ ‘ మొబైల్ : 94407 32392 -
టీవీ వచ్చిందోయ్ సీరియల్ తెచ్చిందోయ్
ఒక ఇంట్లో... ‘దీపను కార్తీక్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో సీరియల్ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా అనుకుంది వంట చేస్తున్న శ్రావణి.మరో ఇంట్లో...‘అసలా సమీర్ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్ కోకిల జోడీ మాత్రం సూపర్ కదా..’ చాటింగ్‌లో ఫ్రెండ్‌ను అడుగుతోంది కాలేజీ అమ్మాయి కోమలి.వేరే ఇంట్లో...‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలే... తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ కళ్లజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకుంటూ అంది మనవారిలితో బామ్మ అన్నపూర్ణమ్మ. టీవీ సీరియల్స్‌లో వచ్చే కథలు తమవే అయినట్టు, అందులోని పాత్రలు తమ మధ్యే తిరుగుతున్నట్టు, తమలోనే ఉన్నట్టు ఆవాహన చేసుకుంటోంది. నిన్నటి, నేటి తరం.నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్థరాత్రి వరకు వరుసపెట్టి చూస్తూ, వాటి గురించి మాట్లాడుకునే బామ్మలు, భామలు ఇటు అనకాపల్లి నుంచి అటు అమెరికా దాకా ఉన్నారు. ‘ఆ సీరియళ్ల ధ్యాసలో పడి మొగుడికి వేళకింత తిండిపెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఈ ఆడాళ్లకు’ అంటూ మగవాళ్లు కస్సుబుస్సుమన్నా ‘ప్రకటనల గ్యాప్‌లో కాపురాలను కానిచ్చేస్తున్నారు..’ అని కామెడీ మతాబులు పేల్చినా.. సీరియళ్ల ప్రవాహానికి అడ్డుగా నిలిచే శక్తి ఎవ్వరికీ లేదన్నది నేటి టీవీ సీరియళ్ల టీఆర్పి రేటింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. జీళ్లపాకం సీరియల్స్ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్ మిస్సవ్వకుండా చూస్తున్నవారే ఎక్కువ. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలయ్యింది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం. రేడియో నుంచి టీవీకి ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్ లైట్’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగుతూ ఉంటుంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్ 30, 1952 నుంచి సెప్టెంబర్ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారం అయ్యింది. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ డ్రామాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్ అమెరికా బ్రాడ్కాస్ట్ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది. అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్ ట్రెండ్ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్) తయారీదారులు స్పాన్సర్ చేసేవారు. అందుకే వీటికి సోప్ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత్తర్వాత ‘సోప్ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది. మన నట్టింట్లో మొదటి అడుగు ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. 1980ల నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబనియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం .. వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని రూపుదిద్దారు. ఈ కథను మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో (V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకొని మనవారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 1982లో నాటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి వసంత్ సాథే మెక్సికన్ పర్యటనకు వెళ్లి అక్కడ ‘వెన్ కన్‌మిగో’ చూసి ఇండియాలోనూ ఈ తరహా కార్యక్రమం ప్రసారం చేయాలనే ఆలోచన చేశారట. దీంతో రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ వచ్చిన 17 నెలల్లో నటుడు అశోక్‌కుమార్‌కు ‘మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామ’ని 4 లక్షల మంది అమ్మాయిలు ఉత్తరాలు రాశారు. దానిని బట్టి ఈ సీరియల్ ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. రెండవ అడుగు ‘ఏ జో హై జిందగీ’ పేరుతో 1984లో కేవలం 67 ఎపిసోడ్స్‌తో హాస్య ధారావాహిక రూపొందింది. భార్యాభర్తలైన రంజిత్‌వర్మ, రేణు వర్మల మధ్య చోటు చేసుకునే ఫన్నీ సందర్భాలను దీంట్లో చూపించారు. ‘హమ్‌లోగ్’ ముగిసిన ఐదు నెలలకు (మే 1986) ‘బునియాద్’ సీరియల్ ప్రారంభమైంది. 1947లో ఇండియా–పాకిస్తాన్ విభజన నాటి సామాజిక స్థితిగతుల ఆధారంగా ఈ కథను నడిపించారు రచయిత కమల్సైగల్. దానికి అందమైన దృశ్యరూపం ఇచ్చారు దర్శకులు రమేష్ సిప్పి, జ్యోతీ స్వరూప్. ఉద్యోగాలు చేసుకునే ఒంటరి మహిళలు ఒకింట్లో పెయింగ్గెస్ట్గా చేరడం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సరదా విషయాలను ‘ఇధర్ ఉధర్’ (1985) లో చూపించారు. ఇదే సీరియల్‌ను తిరిగి 1998లో రెండవ సీజన్‌గా ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్స్ ట్రెండ్‌ను ఓ ఊపు ఊపినవి.. అశేష జనాన్ని టీవీల ముందు కట్టిపడేసినవి ఇతిహాసాలైన రామాయణ్ (1987–1988), మహాభారత్ (1989–1990)లు. ఒక ఆధ్యాత్మిక భావనను ఈ రెండు సీరియళ్లు ప్రతి మదిని తట్టిలేపాయి. దేవతలే తమ నట్టింటికి వచ్చి అలనాటి కథను చూపుతున్నట్టు ఫీలయ్యారు జనం. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, హారతలు పట్టారు. 1980 నుంచి 90ల కాలంలో బుల్లితెర పై దూరదర్శన్ సీరియల్స్‌కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి వరుస క్రైమ్ థ్రిల్లర్ది. ‘కరమ్‌చంద్’, ‘బ్యోంకేశ్ బక్షీ’, జాన్కీ జాసూస్’తో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న చంద్రకాంత, చాణక్య, జనం నాడితో ఫీట్లు చేయించిన సర్కస్ .. వంటి సీరియల్స్‌తో ప్రతి ఇంటా బుల్లితెర ఓ అనివార్యమైన వస్తువయ్యింది. మూడవ అడుగు అప్పటివరకు సామాజిక పరిస్థితులు, చారిత్రకాంశాలమీద ఫోకస్‌పెట్టిన సీరియళ్ల కన్ను ఆటపాటలు, పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లల వైపు మళ్లింది. ఇది బుల్లితెర వామనుడి మూడవ అడుగుగా చెప్పవచ్చు. బామ్మలు చెప్పిన కథలకు దృశ్యరూపం బుల్లితెర ఆకాశమే హద్ధయ్యింది. మాల్గుడి డేస్, విక్రమ్ బేతాల్, తెనాలి రామకృష్ణ.. వంటి సీరియల్స్ పిల్లలు ఎక్కడున్నా సమయానికి లాక్కొచ్చి కూర్చోబెట్టేవి. పెద్దలనూ టీవీల ముందు నుంచి కదలనిచ్చేవి కావు. ఈ మూడవ అడుగుతో సీరియల్ అన్ని తరాలనూ తన వైపు తిప్పుకుంది. హిందీ సీరియల్స్‌తో నార్త్ టు సౌత్‌ను ఆకట్టుకుంటున్న మన బుల్లితెర ఆ తర్వాత మరాఠీ, గుజారాతీ, బెంగాలి, తమిళ, కన్నడ, ఒడియా, తెలుగు, మలయాళం.. ఇతర అన్ని భాషలలో సీరియళ్లని చూపించడం మొదలుపెట్టింది. (వచ్చేవారం మరికొంత) – నిర్వహణ: నిర్మలారెడ్డి -
'స్మార్ట్' పాయిసన్...!
తూర్పుగోదావరి, కె.గంగవరం: రాత్రి వేళ కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడా అని ఇప్పుడు ఇంట్లో వెతకడం లేదు.. పక్క వ్యక్తి టైం ఎంత? అంటే ఎవరూ ముంజేతిని చూసుకోడం లేదు. ఈవేళ ఏ వారమని అనుమానం వస్తే ప్యాకెట్ క్యాలెండర్ చూడడం లేదు. ఆడుకునే ఆటబొమ్మలు మాయం అయ్యాయి. బంధువుల యోగక్షేమాలు తెలిపే ఉత్తరాలు దాదాపు శుభలేఖలకే పరిమితమైపోయాయి. సుందర దృశ్యాలు బంధించే కెమేరాలు, జ్ఞాపకాలను పదిలంగా ఉంచే ఫొటో ఆల్బమ్‌లు అరుదుగా కనిపిస్తున్నాయి. సుప్రభాతం వినిపించే రేడియోలు మాయమయ్యాయి. సంగీతంతో ఉత్సాహాన్ని నింపే టేప్ రికార్డులు చూద్దామన్నా లేవు. కాలక్షేపంగా ఎవరి చేతిలోనూ పుస్తకాలు కనిపించడం లేదు. వీటన్నిటికీ ఒకటే కారణంస్మార్టు ఫోన్..! ♦ పై అవసరాలన్నీ తీర్చే అద్భుత సాధనం స్మార్ట్ ఫోన్. స్మార్టుగా ఇంట్లోకి దూరి ఎన్నో వస్తువులను దూరం చేసింది. ♦ అవి 1983 వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతున్న రోజులు.. భారత్, వెస్డెండీస్ జట్లు ఫైనల్లో తలబడుతున్నాయి. అందరూ ఆట గురించి రేడియోలో వచ్చే కామెంట్రీ వింటూ ఆస్వాదిస్తున్నారు. కేవలం ధనవంతులు ♦ మాత్రమే అప్పుడే వచ్చిన టెలివిజన్‌లో ఆటను చూస్తూ ఆనందం పొందేవారు. ప్రస్తుతం ఆదే మ్యాచ్‌ను అధిక శాతం ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లో నేరుగా వీక్షిస్తున్నారు. ♦ గతంలో ఏమైనా పుస్తకాలు, నవలు, కథలు చదవాలంటే గ్రంథాలయానికో, లేక అద్దెకు ఇచ్చే దుకాణాలకు వేళ్లేవారు. రోజుకింత అద్దె చెల్లించి పుస్తకాన్ని తెచ్చుకుని చదివి తిరిగి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పుస్తకాలు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఆన్లైన్లో ఏ పుస్తకం కావాలన్నా పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది. దాన్ని ఎంచక్కా డౌన్లోడ్ చేసుకుని చదివేసుకోచ్చు. ♦ జీవన శైలిని మార్చడమే కాదు.. సాంప్రదాయ భారతీయుల జీవితంతో పెనవేసుకున్న ఎన్నో మధురానుభూతులను దూరం చేసింది స్మార్ట్ ఫోన్. యువతే కాదు.. గృహిణులు, ఉద్యోగులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ధనిక, పేద వర్గాలు ఈ అద్భుతాన్ని స్మార్ట్‌గా వినియోగించేస్తున్నారు. ♦ టార్చ్‌లైట్, వాచ్, అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, కెమెరా, రేడియో, ఆడియో ప్లేయర్, రికార్డర్, డిక్షనరీ, పుస్తకాలు, గేమ్స్, లేఖలు ఇలా ఎన్నో వస్తువుల అవసరాన్ని స్మార్ట్ ఫోన్ తీరుస్తోంది. ♦ జిల్లాలో సుమారుగా 52 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో సుమారు 60 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారని ఓ అంచనా.. ఇందులోనూ 4జీ నెట్‌వర్క్‌తో కూడిన స్మార్టుఫోన్ వినియోగించే వారు 20 శాతానికి పైగానే ఉన్నారు. అంటే జిల్లాలో 9 నుంచి 10 లక్షల మంది స్మార్టు ఫోన్లను ఉపయోగిస్తున్నారని అంచనా.. నెట్వర్క్ వేగాలు పెరిగాకా, చౌక అయ్యాకా స్మార్టు ఫోన్ వాడే వారి సంఖ్య బాగా ♦పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో 6వ తరగతి విద్యార్థి నుంచి వృద్ధుల వరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు సైతం స్మార్టుఫోన్లో యాప్‌లను ఓపెన్ చేసి వాడుతుండడం మన ఇళ్లలో అనుభవైకమే. వ్యాపారం మార్చేస్తున్నారు.. స్మార్ట్‌ఫోన్ ప్రభంజనంలో కొందరు వ్యాపారులు, మెకానిక్‌లు జీవనోపాధిని కోల్పోయారు. వారిలో మొట్టమొదట చెప్పుకోవలసినది రేడియే సంబంధ వ్యాపార, మెకానిక్‌లే. సెల్‌ఫోన్ వస్తూనే ఎఫ్ఎం రేడియోను మోసుకొచ్చేసింది. దీంతో రేడియోల వ్యాపారం అమాంతం పడిపోయింది. దీంతో పాటు వాక్మెన్లు, టేప్రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు ఒకదాని తరువాత ఒకటి ఉనికిని కోల్పోయాయి. ఒకప్పుడు కొత్త సినిమా ఆడియో వేడుకలు బ్రహ్మాండంగా చేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో ప్రీరిలీజ్ ఫంక్షన్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు కొన్ని రోజుల ముందుగానే పాటలను ఆన్లైన్ ద్వారా జనంలోనికి పంపించేస్తున్నారు. దీంతో గతంలో రేడియాలు, టేప్ రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు, విక్రయించే దుకాణాలు ఇప్పుడు ఆధునిక ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు విక్రయిస్తూ వ్యాపార సరళిని మార్చుకున్నారు. వాచ్ వ్యాపారులపై ప్రభావం తక్కువే.. స్మార్ట్ ఫోన్ల రాకతో వాచ్‌ల వినియోగం తగ్గిన మాట వాస్తవమే అయినా.. వాచ్ ధరించడం హోదాకు, గౌరవానికి గుర్తుగా భావిస్తున్నవారూ అధికంగానే ఉన్నారు. పుస్తకాలు సైతం ఆన్లైన్లోనే.. ఒకప్పుడు పుస్తకం హస్తాభరణం అనేవారు. కానీ ఇప్పుడు స్మార్టు ఫోన్ ఆ అవసరాన్ని భర్తీ చేసింది. యువతీ యువకుల వద్ద స్మార్టుఫోన్ లేకపోతే అవమానంగా భావిస్తున్నారు. ఇప్పుడు వారికి అవసరమైన పుస్తకాలను సైతం ఆన్లైన్లోనే చూసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు ఎవరైనా బాగా చదువుతున్నాడంటే అతని ఆచూకీ కోసం ముందుగా లైబ్రరీకి వెళ్లేవారు. ఇప్పుడు తలవంచుకుని స్మార్టు ఫోన్‌వైపు చూస్తున్నారు. చిన్నపిల్లలకు ఎదైనా ఇంగ్లీష్ పదం అర్థం కాకపోతే డిక్షనరీలో వెతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంటనే మొబైల్ డిక్షనరీ చూసుకుంటున్నారు. వాచీలు కొనేవారే లేరు ఐదేళ్ల క్రితం వాచీలు కొనేవారితో షాపులు కిటకిటలాడేవి. రాను రాను విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. పెద్ద వయసు ఉన్న వారు కొంత మంది మాత్రమే వాచీలను కొనుగోలు చేస్తున్నారు. యువత మాత్రం వాచీలు కొనడం లేదు. – సుంకర వెంకటేశ్వరరావు, వాచీ షాపు యజమాని గ్రీటింగ్ కార్డులకీ తగ్గిన ఆదరణ.. గతంలో నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, పుట్టిన రోజులకి పలు రకాల గ్రీటింగ్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేవారు. కానీ రాను రాను స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో గ్రీటింగ్ కార్డ్‌కు పూర్తిగా ఆదరణ తగ్గింది. నూతన సంవత్సరం వస్తోందంటే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల గ్రీటింగ్ షాపులు ఏర్పాటు చేసి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం వాట్సప్, హైక్, టెలిగ్రాం వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను ఉపయోగించుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆటలకు దూరమవుతున్నచిన్నారులు.. గతంలో చిన్నపిల్లలు రోజంతా స్నేహితులతో కలసి ఉల్లాసంగా ఆటలాడుకునే వారు. ఈ ఆటలతో వారికి శారీరక వ్యాయామంలా మారి ఆరోగ్యకరంగా ఉండేవారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు ఆటలకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఒక మూలన కూర్చుని గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. పెద్దవారు ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఇప్పుడు పక్కన ఎవరున్నారన్న విషయం గుర్తించక స్మార్ట్‌ఫోన్ యాప్‌లతో గడిపేస్తున్నారు. -
తెలంగాణ మాండలికంతో పేరొచ్చింది...
శ్రీమంజునాథ చిత్రంలో ‘‘నాన్నా! సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు’’ అని పలికే ఆనంద్ వర్థన్ (అర్జున్ కుమారుడు) నటించిన పాత్రకు తన గాత్రంతో ప్రాణం పోశారు తిరుమల తేజస్వి. హైదరాబాద్‌లో ఉంటున్న తేజస్వి రేడియో మిర్చి ఎఫ్ఎం లో ‘ఆర్జె టిజె’గా ప్రేక్షకులకు సుపరిచితులు. ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చే శాక ‘ది హిందూ పత్రిక’లో ఇంటర్న్ షిప్ చేసి తను తీసిన ఫొటోలను ఆ పత్రికలో చూసుకున్నారు. ‘కందిరీగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి సాక్షితో తన అనుభవాలు పంచుకున్నారు... ‘‘నన్ను అందరూ టీజే ఆచార్య అంటారు. నా అసలు పేరు తిరుమల తేజస్వి అనే విషయం మర్చిపోయారు. ‘మిర్చి లవ్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రేడియో జాకీగా ‘నేను మీ టీజే’ అంటూ అందరికీ వినిపిస్తాను’’ అంటున్న తేజస్వి తన మూడవ ఏట నుంచే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. తండ్రి విజయకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ ఫౌండర్‌లో ఒకరు కావడం వల్ల ఇంట్లో అందరూ డబ్బింగ్ ఆర్టిస్టులు అయ్యారు. ‘‘చిన్నప్పటి నుంచి నాన్నతో శబ్దాలయ, ప్రసాద్ ల్యాబ్స్, రామానాయుడు స్టూడియోలకి వెళ్తుండేదాన్ని. అక్కడ నేను కూడా చెప్తానని వచ్చీరాని మాటలతో అన్నానుట. 1994లో మొట్టమొదటగా నా చేత చిన్న పిల్లలకు డబ్బింగ్ చెప్పించారు. సినిమా పేరు‡ అస్సలు గుర్తు లేదు’’ అంటున్న తేజస్వి ‘ఆక్రందన’ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. ఆ సీరియల్‌కు తన డబ్బింగ్ తానే చెప్పుకున్నారు. చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా... శ్రీభాగవతం సీరియల్లో కౌశిక్‌కి, శివలీలలు సీరియల్లో తనీష్‌కు డబ్బింగ్ చెప్పారు. ‘‘నాన్నగారు దూరదర్శన్‌లో టెలీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయనతో పాటు స్టూడియోకి వెళ్లి, అవసరమైన చోట పిల్లలకు డబ్బింగ్ చెప్పేదాన్ని’’ అని బాల్యస్మృతులు వివరించారు. శ్రీమంజునాథ చిత్రంలో ఆనంద్‌వర్థన్ వేసిన పాత్రకు ఇచ్చిన డబ్బింగ్‌కు దర్శకులు కె. రాఘవేంద్రరావు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రం ప్రీమియర్‌కి ఆనంద్‌వర్థన్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ‘‘తేజస్వి చాలా బాగా డబ్బింగ్ చెప్పిందని వారంతా ప్రశంసించారని అమ్మ నాతో చెప్పారు’’ అంటారు తేజస్వి. కందిరీగతో బ్రేక్ ‘‘డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ప్రసాద్, సుబ్బారావు, కాంచనబాబు... వంటి వారు నాకు డబ్బింగ్లో బాగా అవకాశాలు ఇచ్చారు. చదువుకి ఆటంకం వస్తుందని మధ్యలో మానేశాను. కొంతకాలం తరవాత ‘కందిరీగ’ చిత్రంలో చిన్న బిట్‌కి డబ్బింగ్ చెప్పడానికి నాకు పిలుపు వచ్చింది’’ అంటున్న తేజస్వికి ఆ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రంలో నటించిన అక్షకు తెలంగాణ మాండలికంలో తన గొంతు ఇచ్చింది తేజస్వి. ‘‘అనిల్ రావిపూడి నా గొంతు విని, చాలా పెక్యులియర్‌గా ఉందన్నారు. ఒక పెద్ద డైలాగు ఇచ్చి చెప్పమన్నారు. ఆ చిత్రంలో అది నా మొదటి డైలాగు. తప్పులు లేకుండా చెప్పేశాను. సినిమా విడుదలయ్యాక, ఎలా ఉంటుందో అని టెన్షన్ పట్టుకుంది. ఆ రోజున అనిల్‌రావిపూడి ఫోన్ చేసి, ‘ఏంటి ఇలా చేశావు?’ అన్నారు. బెదిరిపోయాను. ఎక్కడో తప్పు చేసేసి ఉంటాను, కెరీర్ పోయింది అనుకున్నాను. ఆయన నవ్వుతూ, డైలాగులు చాలా బాగా చెప్పావు’ అనేసరికి నా గుండె తేలికపడింది’’ అంటున్న తేజస్వి... మోహన్‌బాబు, రామానాయుడు, బెల్లంకొండ సురేశ్ వంటి పెద్దల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన రామ్, స్వయంగా తన అసిస్టెంట్‌తో తేజస్వికి పెద్ద పూల బొకే పంపారు. తెలంగాణ మాండలికం స్పెషలిస్ట్ బిఏ (సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్) పూర్తి చేశాక, ఫొటోగ్రఫీలో పిజి డిప్లొమా చేయడానికి బెంగళూరు వెళ్లిన తేజస్వి ‘రేసుగుర్రం’ చిత్రంలో డబ్బింగ్ కోసం సురేంద్రరెడ్డి నుంచి ఫోన్ అందుకున్నారు. ‘‘నన్ను వాయిస్ టెస్ట్‌కి పిలిచారనుకున్నాను. ఒక వీకెండ్‌కి వచ్చి రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్పాను. . అందులో అల్లు అర్జున్‌కి వదినగా వేసిన సలోనీ పాత్రకు తెలంగాణ మాండలికంలో నా చేత డబ్బింగ్ చెప్పించారు. తెలంగాణ అనగానే నన్ను పిలుస్తున్నారు. ఇది నాకొక మార్క్. చాలా సంతోషంగా ఉంటుంది’’ అంటున్న తేజస్వి ఎక్కడకు వెళ్లినా ఆమెను కందిరీగ, రేసుగుర్రం చిత్రాల డైలాగులతో పలకరిస్తారు. ఇప్పటివరకు సుమారు 400 చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు తేజస్వి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా 75, మిగిలినవి పెద్ద వాళ్లకి చెప్పారు. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాలకు డబ్బింగ్ చెబుతున్నారు. ‘‘డబ్బింగ్‌తో పాటు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం నా ఫొటోగ్రఫీ. కొందరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాను. కొన్ని మాక్ షూట్స్ చేశాను’’ అన్నారు తేజస్వి. గుమ్మం బయటే వదిలేయాలి... ‘‘మనకు ఎన్ని చికాకులు ఉన్నా, మైకు ముందుకి వచ్చాక, పాత్ర గురించి మాత్రమే ఆలోచించాలి. మన వ్యక్తిగత విషయాలను స్టూడియో గుమ్మంలో విడిచిపెట్టేసి లోపలకు ప్రవేశించాలి అని నాన్న అంటుంటారు. నటీనటులు స్క్రీన్ ముందర పనిచేస్తే, మనం మైక్ ముందరే చేయాలి అని చెప్పేవారు నాన్న. కందిరీగ చిత్రం టైమ్‌లో నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. అప్పుడు నేను బాగా నవ్వే సీన్‌కి డబ్బింగ్ చెప్పాలి. నాన్నకి ఎలా ఉందోనని మనసు అటు వైపే లాగింది. ఇక్కడ డైలాగులు చెప్పాలి. ఎన్నిసార్లు నవ్వుతున్నా అందులో చిన్న బాధ వినిపిస్తోంది. దాంతో అనిల్ రావిపూడి నన్ను బయటకు పిలిచి ఐదు నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందాం అన్నారు. బయటకు వచ్చాక ఏమైందని అడిగారు. విషయం చెప్పాను. ఆయన తనకు ఎదురైన అనుభవాలు చెప్పి. నన్ను పని మీద దృష్టి పెట్టమని, వాతావరణం హ్యాపీగా ఉంచమని బుజ్జగించారు. ఆయన మాటలకు నా మనసుకి చేరాయి. బ్రేక్ అయ్యాక డైలాగు చెప్పాను. సింగిల్ టేక్‌లో అయిపోయింది’’ అంటున్న తేజస్వి తల్లి రజనీకాంత,,, మణిశర్మ, కీరవాణి వంటి సంగీత దర్శకుల దగ్గర కోరస్ పాడేవారు. ఆమె వీణ వాయిస్తారు, రచయిత కూడా. ఇంటర్వ్యూ: వైజయంతి డైలాగులు కందిరీగ: చల్ (ఆ సినిమా తరవాత చల్ ఊతపదంగా మారింది), గంటేంది... మోగుడేంది, నాయనా టీవీ కే బులాణ్ని పిలు. రేసు గుర్రం: (చంద్రమోహన్ కాళ్లకు మొక్కమన్న సందర్భంలో) ఛత్ గీపొట్టి సాలెగానికా... నే పెట్టపో... కందిరీగ నాకొక మంచి మెమరీ ‘స్వరాభిషేకం’ షూటింగ్‌కి అక్కతో పాటు నేను కూడా వచ్చాను. అక్కడ ఒకాయన కందిరీగ చిత్రంలో నా డైలాగుని రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. అది విని నాకు చెప్పరాని సంతోషం వేసింది. – తేజస్వి -
విజయవాడ ఆకాశవాణికి జాతీయ పురస్కారం
విజయవాడ: విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి 2016 సంవత్సరానికిగానూ జాతీయ వార్షిక పోటీల్లో ప్రశంసా పురస్కారం లభించింది. ఆకాశవాణి సీనియర్ గ్రేడ్ అనౌన్సర్ జయప్రకాష్ దర్శకత్వంలో రూపొందించిన ఆత్మ దీపోభవ డాక్యుమెంటరీకి ప్రత్యేక అంశం విభాగంలో ఈ ప్రశంసా పురస్కారం లభించింది. ప్రస్తుత సామాజిక మాథ్యమం నేపథ్యంలో పుస్తకం మనుగడపై ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి రాజీవ్ బొకనాల, అనిల్ డానీ రచనా సహకారం, సీహెచ్.సుబ్రహ్మణ్యం, పి.విద్యాసాగర్ సాంకేతిక సహకారం అందించారు. -
ఆకాశవాణి
హ్యూమర్ ప్లస్ ఇప్పుడైతే పాట చెవుల్లోకి దూరి వీధుల్లో మాయలైంది కానీ, ఒకప్పుడు పాట కుళాయి నీళ్ళలా ఎక్కడ చూసినా ప్రవహించేది. ఘంటసాల ఇంటింటి గాయకుడే. రేడియోలు గురగురమని, గడగడమని, స్టేషన్ మార్చినప్పుడల్లా సౌండ్ చేసేవి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్‌లా ఆగకుండా విజిల్ వేసేవి. హోటళ్ళలో హార్మోనియం పెట్టె సైజ్‌లో కరెంట్ రేడియోలుండేవి. ఈ రేడియో చేసే సౌండ్‌కి ఒక్కోసారి కస్టమర్లు తింటున్న ఇడ్లీలు కూడా వదిలేసి పారిపోయేవాళ్ళు. భక్తిగీతాల దగ్గర నుంచి కార్మికుల కార్యక్రమం వరకూ రేడియో గొంతు వినిపిస్తూనే వుండేది. దేవుడి దయవల్ల ఆకాశవాణి కేంద్రాలకి మధ్యలో విరామం కూడా వుండేది. కరెంట్ రేడియోకి సిస్టర్ ట్రాన్సిస్టర్. దాని పొట్టనిండా బ్యాటరీలు కూరిస్తే తప్ప అది మాట్లాడదు. బుష్, మర్ఫీ అని రెండు కంపెనీలుండేవి. మా ఇంట్లో ఉన్న బుష్ రేడియో నెత్తిమీద నాలుగైదు మొత్తితే తప్ప మూలిగేది కాదు. కడప స్టేషన్ రావాలంటే తూర్పుకి, హైదరాబాద్ రావాలంటే దక్షిణానికి తిప్పాలి. సిలోన్ మాత్రం తొందరగానే తగులుకునేది, కాకపోతే ‘గీక్గుటగుట’ అని గ్యాస్ట్రబుల్ వచ్చినోడి లాగా శబ్దతరంగాలు చేసేది. శ్రీలంక స్టేషన్లో మీనాక్షి పొన్నుదురై అనే అనౌన్సర్ ఒక సెలబ్రిటీ. ఆమె గొంతు వినడం ఒక ఫ్యాషన్. గంటసేపు ప్రోగ్రాంలో భక్తి కార్యక్రమాలు, ప్రకటనలు పోగా గట్టిగా ఐదు పాటలొచ్చేవి. వాటికోసం చెవుల్ని కోసి, రేడియోకి అతికించి వినేవాళ్ళం. అందరిళ్ళలో ఒకేసారి రేడియో మోగడం వల్ల వీధంతా మైక్ పెట్టినట్టుండేది. రేడియోకి లైసెన్స్‌లు కూడా వుండేవి. ఒక పాస్ పుస్తకంలో రకరకాల స్టాంపులుండేవి. పోస్టాఫీస్‌లో డబ్బు కడితే వాటిమీద ముద్రలేసి ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత గవర్నమెంట్ లైసెన్స్‌ని రద్దు చేసింది. జనం రేడియోని రద్దు చేశారు. మావూళ్ళో చెన్నకేశవులు అని ఒకాయనుండేవాడు. ఆయనకి రేడియో అంటే ఇష్టం. కొనుక్కునే స్థోమతుండేది కాదు. రేడియో వినడానికి ఇళ్ళముందు తచ్చాడేవాడు. ప్రాణాన్ని చెవుల్లోకి తెచ్చుకుని వినేవాడు. ఆయన కొడుకు మిలట్రీలో చేరిన తరువాత తండ్రికి ఒక రేడియో, సైకిల్ కొనిపెట్టాడు. చెన్నకేశవులు పూలరంగడు తిరిగినట్టు చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఒక రౌండేశాడు. సైకిల్‌కి ముందు ఒక బుట్ట, దాంట్లో రేడియో పెట్టుకుని, అట్లాస్ సైకిల్ తొక్కుతుంటే ఆ కతే వేరు. కానీ ఒకరోజు తన చేతుల్తోనే రేడియో పగలగొట్టాడు. మిలట్రీలో కొడుకు చనిపోయిన దుఃఖం అలాంటిది. క్రికెట్ పిచ్చి ఎక్కువయ్యేసరికి పాకెట్ రేడియోలు పుట్టాయి. అర్థమైనా కాకపోయినా కామెంట్రీ వింటూ, గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తే వికెట్ పడిందని డిసైడ్ అయ్యేవాళ్ళు. బెల్‌బాటం ప్యాంట్ వేసుకోకపోయినా, క్రికెట్ కామెంట్రీ వినకపోయినా అనాగరికుడని భావించే కాలం. బ్లాక్ అండ్ వైట్ టీవీ దొంగలా ఇంట్లోకి ప్రవేశించింది. అప్పటివరకూ దొరలా జీవించిన రేడియోకి కష్టకాలం మొదలైంది. చెవులకి పనితగ్గి, కళ్ళు యాక్టివ్ అయ్యాయి. వస్తుందో రాదో తెలియని తెలుగు పాటకోసం ఇల్లంతా ‘చిత్రలహరి’ ముందు కూర్చునేవాళ్ళు. ఈలోగా జపాన్ వాళ్ళు పగబట్టి డొక్కు టేప్రికార్డర్లను తయారుచేసి జనం మీదికి వదిలారు. ఖాళీ క్యాసెట్ ఇస్తే పాటలు రికార్డు చేసేవాళ్ళు వీధుల్లో పుట్టుకొచ్చారు. గ్రామ్‌ఫోన్ రికార్డులు బ్రేక్ కావడం కూడా మొదలైంది. పాట సామూహికంగా మాయమై వ్యక్తిగతంగా మారింది. మార్నింగ్ వాక్‌లో అందరి చెవుల్లోనూ వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి కానీ, ఎవరేం పాట వింటున్నారో తెలియదు. అసలు వినాలనిపించే పాటలు వస్తున్నాయో లేదో కూడా తెలియదు. పాటల వల్ల హిట్టయ్యే సినిమాలూ లేవు, పాటలకోసం సినిమాలు చూసేవాళ్ళూ లేరు. తమాషా ఏమంటే ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లు గురించి కూడా పాతికేళ్ళ తరువాత నాలాంటి వాడొకడు కాలమ్ రాస్తాడు. రాయడం అనే మాట తప్పేమో, అప్పటికి పేపర్లు ఉండకపోవచ్చు. – జి.ఆర్. మహర్షి -
డేటామెయిల్ నుంచి ‘డేటారేడియో’
న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీ సేవలు అందించే డేటామెయిల్ సంస్థ తాజాగా వాయిస్ ఆధారిత సోషల్ మీడియా మెసేజింగ్ ఫీచర్ డేటారేడియోను ప్రవేశపెట్టింది. విపరీత కామెంట్లు, ఆన్లైన్ వేధింపులు మొదలైన వాటి గురించి భయపడనక్కర్లేకుండా యూజర్లు తమ ఫాలోయర్లకు ఆడియో సందేశాలను ప్రసారం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. డేటామెయిల్ యూజర్లు.. తమ పేర్లతో తమకంటూ ఓ రేడియో చానల్ రూపొందించుకోవచ్చని, దాని గురించి తెలిసిన వారు సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చని డేటా ఎక్స్జెన్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో అజయ్ డేటా తెలిపారు. -
వైర్లెస్ రూపకర్త ఎవరు?
వైర్‌లెస్‌ను కనుగొన్న గూగ్లీమో మార్కోనీ 1874 ఏప్రిల్ 25న ఇటలీలో జన్మించారు. ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రైవేట్‌గానే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్న కోరిక బాగా ఉండేది. ఆ దృష్టితోనే మార్కోనీ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించేవాడు. వివోర్నో టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్షించింది. ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది ఆ వ్యాసం. అప్పటికి (1894) టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కోనీ ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకు తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు. తన పరిశోధనని ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో దానిని బ్రిటిష్ వారికి ఇచ్చాడు. మార్కోనీ రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు. క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు మార్కోనీ. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్నిదాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్లెస్ వ్యవస్థ ఫలితంగా ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కోనీ 1909లో భౌతిక శాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందారు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కోనీ. -
నేడు ఆకాశవాణిలో ప్రత్యేక కార్యక్రమాలు
ఆదిలాబాద్ కల్చరల్ : ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు కార్యక్రమ నిర్వహణాధికారి రామేశ్వర్ కేంద్రె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతినెల దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో చేసిన ముచ్చట్లు మన్ కీ భాత్ కార్యక్రమం ప్రసారం అవుతుందని, తిరిగి 8గంటలకు తెలుగులో అనువాదం ఉంటుందని చెప్పారు. ఉదయం 7.15 గంటల నుంచి శణనామ సంస్కతం –సంస్కతాన్ని విందాం అనే కార్యక్రమంలో మహాపండితులు దోర్బల ప్రభాకరశాస్త్రి వాయిపూజ గురించి వివరిస్తారని తెలియజేశారు. సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షురాలు కోటోజు సౌజన్య, ఆమె భర్త కోటోజు చంద్రశేఖర్‌తో ఓ పాటన మధ్య ముచ్చట్లు ఉంటాయని పేర్కొన్నారు. రాత్రి 7.15 గంటల నుంచి 7.45 వరకు ప్రసారం అయ్యే కిసాన్‌వాణి కార్యక్రమంలో జామలో ప్రవర్ధనం అనే అంశంపై ఆదిలాబాద్ ఉద్యానవన పాలిటెక్నిక్ అధ్యాపకుడు రవితో ముచ్చట్లు ఉంటాయని తెలిపారు. -
నేడు రేడియో ద్వారా సర్వశిక్ష అభియాన్ అదనపు సంచాలకుల ప్రసంగం
నల్లగొండ టూటౌన్ : స్వచ్ఛ విద్యాలయ పురస్కారం – 2016లో భాగంగా సోమవారం ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో ద్వారా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అదనపు సంచాలకులు ప్రసంగిస్తారని జిల్లా ప్రాజెక్టు అధికారి కిరణ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండల ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు రేడియో ద్వారా సందేశాన్ని వినాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే 040–23234834, 23232836 నెంబర్లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. -
అతడే నాకు ‘సరైనోడు’..
బంజారాహిల్స్: అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రేడియో సిటీలో సందడి చేసింది. తాజాగా తాను నటించిన ‘సరైనోడు’ చిత్ర విశేషాలను శ్రోతలతో పంచుకుంది. సినిమాలో తన పాత్ర, అల్లు అర్జున్ అద్భుత నటన గురించి వివరించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించింది. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే.. ‘హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో చార్మినార్ దగ్గర దొరికే హలీం అంటే ఇంకా ఇష్టం. నాకు హైదరాబాద్ లైఫ్‌నిచ్చింది. విదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు హైదరాబాద్‌ను మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నా జీవితంలో ఇంత వరకు ‘సరైనోడు’ తగల్లేదు. నేను నాలుగు ఇంచెస్ హీల్ వేసుకున్నా నాకన్నా అతడు హైట్ ఉండాలి. దీంతో పాటు మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్నోడే నాకు సరైనోడు’.. అని పేర్కొంది. తాను హైదరాబాద్‌లో ఇల్లు కొన్నానని, త్వరలోనే గృహ ప్రవేశం ఉంటుందని చెప్పింది. తన మొదటి చిత్రం నుంచి చివరి సినిమా వరకు ఏం నేర్చుకున్నానన్నదే తన అచీవ్‌మెంట్‌గా భావిస్తానంది. హిందీలో ‘సరైనోడు’ సినిమా తీస్తే రణవీర్ సింగ్ హీరోగా ఉండి, తాను హీరోయిన్గా ఉండాలని కోరుకుంటానంది. -
కెమెరాల్లేకుండానే నిఘా వ్యవస్థ..
ఇప్పుడు ఇంట్లో నిఘా కెమెరాల్లేకుండానే ఇంటికి భద్రత కల్పించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. మీ ఇంట్లో ఎవరు సంచరిస్తున్నారు అన్న విషయాన్ని ఓ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 'గ్జాండెమ్ హోమ్' పేరిట రానున్న ఈ కొత్త ఉత్పత్తి... ఇంట్లోని ప్రతి కదలికలనూ హ్యారీ పాటర్ మాయా మరుడర్స్ మ్యాప్ వంటి ఓ చిన్న డిజిటల్ పరికరంద్వారా గుర్తిస్తుంది. కెమెరాలకు బదులుగా ప్లగ్ ఇన్ నోడ్స్ ను ఉపయోగించి ఓ సాలెగూడులా ఇంల్లంతా రేడియో తరంగాలు వ్యాపింపచేయడం వల్ల ఇంట్లోని ప్రతి కదలికనూ ఈ వ్యవస్థ శులభంగా గుర్తించగల్గుతుంది. ట్రెడిషనల్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్ తో వచ్చే తప్పుడు అలారాలు, పరిమిత కవరేజ్ వంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఇల్లంతా నిఘా వ్యవస్థను అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు హోం ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి నిర్వహించిన పరిశోధనల అనంతరం ఉత్సత్తి చేశారు. ఇది ఇన్ స్టాల్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది. 10 నుంచి 15 నోడ్స్ ఉండే ఈ కిట్ ను... వాల్ సాకెట్ కు ప్లగ్ అమర్చుకునేలా రూపొందించారు. గేట్ వే ను రూటర్ కు పెట్టి... ఇల్లంతా గుర్తించగలిగేట్లుగా ముందుగా వినియోగదారులు ఓ మ్యాప్ ను యాప్ లో డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత వ్యవస్థ ప్రారంభమౌతుంది. గూడులా ఉన్న ఇన్విజిబుల్ సెన్సార్ల ద్వారా ఇంట్లో రేడియో తరంగాలు ప్రసరిస్తాయి. అయితే ఎవరైనా ఈ గూడువంటి వ్యవస్థను కదిపితే మాత్రం రేడియో తరంగాలకు భంగం కలిగే అవకాశం ఉంది. అయితే ఇంట్లో ఒక్కసారి కదలికలను యాప్ గుర్తించగలిగిందంటే అవి డైరెక్ట్ గా మ్యాప్ లోని ఏ స్థానంలో జరుగుతోందో వినియోగదాలుల స్మార్ట్ ఫోన్ కు హెచ్చరికలు పంపిస్తుంది. లైట్లు, అలారం వంటి హెచ్చరికలతో వినియోగదారులు అవసరాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి కాదని, కేవలం కొత్త సాంకేతికతలు కలిగిన పరికరం అని... దీని వ్యవస్థాపకుడు సాల్ట్ లేక్ సిటీలో నివసించే 35 ఏళ్ళ జో విల్సన్ అంటున్నాడు. 'గ్జాండెమ్ హోమ్' తో ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తులను ఎటువంటి అనుమానం రాకుండా... శులభంగా గుర్తించవచ్చని చెప్తున్నాడు. రెండు సైజుల్లో దొరికే ఈ గ్జాండెమ్ హోమ్ కిట్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు ఆన్ లైన్ (Indiegogo) ద్వారా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. సుమారుగా ముఫై వేల రూపాయలతోపాటు షిప్పింగ్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించి బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేవలం పదిహేడు రోజుల్లో అనుకున్న టార్గెట్ కు అమ్మకాలు చేరాయని.. తమ ప్రచారం లక్ష్యాన్ని చేరుకుంటే 2016 ఆగస్టు నాటికి ఈ నిఘా పరికరం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. -
భారీ టెలిస్కోప్‌ను సిద్ధం చేస్తున్న చైనా
ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోపును చైనా సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణానికి మొత్తం 1,244 కోట్ల రూపాయల ఖర్చవుతోంది. 500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గుజ్హౌ రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది. ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది. 2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి. సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇప్పటివరకూ టెలిస్కోప్‌లోని ముఖ్యమైన దశలు పూర్తయ్యాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ లీ డి వెల్లడించారు. ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుందని ఆయన చెప్పారు. సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని స్కాన్ చేస్తుందన్నారు. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీంతో.. పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు. -
విచక్షణ ప్రధానం
జెన్ పథ్ ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. ఇంతలో ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ‘‘ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘‘లేదు...ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ‘‘ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన చుక్క లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు. అప్పుడు గురువుగారు ‘‘ఐతేనేం...? ఆయన గొంతు అద్భుతం. మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?’’ అన్నారు. ‘‘మీరు ఎన్నయినా అనండి... నాకైతే ఆయన తీరు నచ్చదు’’ అంటూ విసవిసా వెళ్ళిపోయాడా సాధువు. కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడిని పొగిడాడు. ఆయన గాత్రమధురిమ అమోఘం. ఆయన ఏ పాటైనా భావానికి తగ్గట్టు పాడటమే కాకుండా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘మీరు చెప్పేదంతా పక్కనపెట్టండి... ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంఉండలేడంటారు అందరూ...’’ అని గురువుగారు అన్నారు. దాంతో ఆ సాధువు కాస్తా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును అక్కడే ఉండి గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. ఎవరూ లేని సమయం చూసుకుని ‘‘గురువుగారూ, ముందొచ్చిన సాధువు ఆ గాయకుడిని తాగుబోతు అని విమర్శిస్తే మీరు గాయకుడి సామర్థ్యాన్ని పొగిడారు. మరో సాధువు వచ్చి గాయకుడిని పొగిడితే మీరు ఆ గాయకుడిని కించపరచినట్లు మాట్లాడారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు. గురువుగారు ఇలా అన్నారు - ‘‘ఎవరు ఎవర్ని ఏమన్నా, నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఏవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ . - యామిజాల జగదీశ్ -
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్నా...
ఎవరికీ ఆ సినిమా తెలియదు. ఎవరూ దానిని చూడలేదు. కాని ఈ పాట మాత్రం కొన్ని వేల లక్షల సార్లు రేడియోలో ప్లే అయ్యింది. ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాట వెనుక ఇద్దరు ఉన్నారు. ఒకరు బప్పి లాహిరి. రెండు అమిత్ ఖన్నా. ఆ రోజుల్లో ఇద్దరూ కొత్తవాళ్లే. దేవ్ ఆనంద్ కుటుంబంలో అతడిలాగే ఉండే కొంచెం దూరపు బంధువు విశాల్ ఆనంద్ తీసిన సినిమా ‘చల్తే చల్తే’ (1976). ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసి ఆ తర్వాత దేవ్ ఆనంద్ సినిమాల వ్యూహకర్తగా పని చేసిన అమిత్ ఖన్నా చేత ఇందులో పాటలు రాయించాడు. ఈ అమిత్ ఖన్నా ఆ తర్వాత దూర దర్శన్‌లో, రిలయన్స్‌లో చాలా కీలక బాధ్యతతలు పోషించాడు. ‘బాలీవుడ్’ అనే పేరు కాయిన్ చేసింది కూడా ఇతనే అంటారు. అప్పటికి సంగీత దర్శకుడిగా ఇంకా బ్రేక్ దక్కని బప్పి లాహిరి ఈ సినిమాతోనే హిట్ మ్యూజిక్ డెరైక్టర్‌గా జనం దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత డిస్కో డాన్సర్ అతణ్ణి ఎక్కడికో తీసుకెళ్లింది. అన్నట్టు ‘చల్తే చల్తే’... అనే పాటను మీరు తెలుగులో విన్నారా? లేదా? విన్నారు. 1980లో వచ్చిన ‘పున్నమినాగు’ సినిమాలో ‘పున్నమి రాత్రి’... పాట వినండి. అది ఇదే. హిట్ సాంగ్ -
‘నేతాజీ మాట్లాడాలనుకుంటున్నారు..’
- 1949లో రేడియోలో పదేపదే ప్రసారమైన వాక్యం కోల్‌కతా: ‘నేతా సుభాష్ చంద్ర ప్రసారం.. మాట్లాడాలనుకుంటున్నారు.. అనే ఒకే ఒక వాక్యం గత నెల రోజులుగా రేడియోలో పదేపదే వినిపిస్తోంది’ అని నేతాజీ అన్న కుమారుడు అమియానాథ్ బోస్ లండన్‌లో నివసిస్తున్న తన సోదరుడు శిశిర్ బోస్‌కు 1949 నవంబర్‌లో రాసిన లేఖలో ఉంది. 1945లో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయాడన్నది నిజం కాదంటున్న ఆయన కుటుంబ సభ్యుల వాదనకు ఊతమిచ్చే ఈ లేఖ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తాజాగా బహిర్గత పరిచిన నేతాజీ రహస్య ఫైళ్లలో ఉంది. ‘ రేడియోలో 16ఎంఎం షార్ట్వేవ్ ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఇది వినిపిస్తోంది. గంటల తరబడి అదే వాక్యం మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. అయితే, అది ఎక్కడినుంచి వస్తుందో కచ్చితంగా తెలియరాలేదు’ అని ఆ లేఖలో అమియా రాశారు. యూరప్ నుంచి వచ్చిన సమాచారంతో.. నేతాజీ చైనాలో క్షేమంగా ఉన్నట్లు ఆయన సోదరుడు శరత్ భావిస్తున్నారని కోల్‌కతాలోని కేంద్ర నిఘా విభాగం పశ్చిమబెంగాల్ డీఐజీకి 1949 జనవరిలో పంపిన నివేదికలో పేర్కొన్నట్లు ఓ ఫైల్లో ఉంది. -
ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది
పదేళ్ల క్రితం వరకు రేడియో నాటకాల్లో ఓ గంభీరమైన గాత్రం శ్రోతలందర్నీ ఎంతగానో అలరించింది. గుక్క తిప్పుకోకుండా ఎంత పెద్ద డైలాగునైనా అనర్గళంగా చెప్పగల సత్తా ఆ స్వరానికే సొంతం. రేడియోలోనే కాక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన ఆ కళాకారుడే కోకా సంజీవరావు. నాటకాల్లో చెంఘిజ్‌ఖాన్, ఖడ్గ తిక్కన, రాముడు, భీష్ముడు, దుర్యోధనుడు అలా ఎన్నో పాత్రల్లో ఇమిడిపోయారాయన. నటనే కాకుండా నాటికలూ రచించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ కోసం సంజీవరావును ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆయన ప్రస్థానంలోని విశేషాలు ఆయన మాటల్లోనే... జనం మెచ్చిన ‘జనరంజని’ విజయవాడలో పని చేస్తుండగా కోకా సంజీవరావు... శోభన్‌బాబు, సూపర్ స్టార్ కృష్ణ, బాలయ్య, కాంచన వంటి ఎంతో మంది నటీనటులతో ‘జనరంజని’ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత 1994లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో చివరి అయిదు ఏళ్లు ఎన్నో నాటకాలు ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆకాశవాణి తరఫున ఆయన ఢిల్లీలో చేసిన ‘మరో మొహెంజొదారో’, ‘సుడిగాలి’ నాటకాలకు అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ‘బళ్లారి రాఘవ’ పురస్కారం అందుకున్నారు. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో. 1949లో నేను మా స్కూల్లో ఓ నాటకం వేశాను. అదీ సంస్కృతంలో. భాష రాకపోయినా స్క్రిప్ట్‌ను బట్టీకొట్టి చేశాను. తర్వాత్తర్వాత రంగస్థల నాటకాలు వేయడం ప్రారంభించాను. అలా మొదలైంది నా నాటక జీవితం. నా సర్వీసులో ఓ రిక్షావాడి నుంచి జమీందారు వరకు అన్ని రకాల పాత్రలూ పోషించాను. శోభన్‌బాబుతో సావాసం గుంటూరులోని ఏసీ కాలేజీలో నేను బీఏలో చేరాను. ఓ ఏడాది కళాశాల యాజమాన్యం నాటకాలు నిర్వహించడానికి ఆసక్తిగల వారిని ఆహ్వానించింది. అప్పుడు నేను, సినీనటుడు ‘శోభన్‌బాబు’ ఆ సెలక్షన్స్‌కు వెళ్లాం. ‘పునర్జన్మ’ నాటకంలో శోభన్‌బాబు హీరోగా, నేను విలన్‌గా నటించాం. తర్వాత స్నేహితులమయ్యాం. రేడియోలోకి... 1957లో నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడే విజయవాడ స్టేషన్లో ‘ఖైదీ’ అనే లైవ్ నాటకం వేశాను. ఆకాశవాణిలో అడుగుపెట్టక ముందే ఎన్నో రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాను. కానీ ఉద్యోగం లేకుండా ఇంకెన్నాళ్లు తిరగాలి అనుకొని అప్పుడే హైదరాబాద్ స్టేషన్లో ప్రకటన పడితే అనౌన్సర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూ ప్యానల్లో బాలగురుమూర్తి, స్థానం నరసింహారావు లాంటి దిగ్గజాలున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు నేను ముందు వేసిన నాటకంలోంచి ఓ డైలాగును చెప్పేసరికి నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది. వివిధ స్టేషన్లలో.. ఓ నాలుగేళ్లు హైదరాబాద్‌లో పనిచేసి 1968లో వైజాగ్‌కు వచ్చేశా. అక్కడ చేస్తూనే ఎన్నో వీధి నాటకాలు వేశాను. అప్పట్లో మాకూ సినిమా తారలకున్నంత క్రేజ్ ఉండేది. 1971లో నేను విజయవాడ స్టేషన్‌కు బదిలీ అయ్యాక అక్కడ ఎన్నో రేడియో నాటకాలు చేశాను. పాత్రాభినయం విజయవాడలో ఎన్నో నాటకాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూనే, చాలా వాటిని ప్రొడ్యూస్ చేశాను. రాముడు మొదలుకొని భీముడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణికాలతో పాటు అల్లావుద్దీన్, ఖడ్గతిక్కన, శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలు చేశాను. ఎస్.బి.శ్రీరామమూర్తి స్వయంగా ప్రొడ్యూస్ చేసిన ‘చెంఘిజ్‌ఖాన్’ నాటకంలో ముఖ్యపాత్రను నన్ను పోషించమన్నారు. అది నేను రిటైర్ అయ్యాక చేశాను. అలా మరచిపోలేని ఎన్నో నాటకాలు చేశాను. దీనికంతటికీ కారణం తల్లిలాంటి ఆకాశవాణే. ఆదరణ పొందిన సీరియళ్లు రేడియోలో సీరియళ్లను అప్పట్లో శ్రోతలు ఎంతో అభిమానించేవారు. నేను చేసిన ‘మీర్జాన్ పుల్లయ్య’ సీరియల్ దాదాపు 28 ఎపిసోడ్లు నడిచింది. అలాగే ‘సమస్యల మజిలీలు’, ‘ఎవరు బాధ్యులు’ లాంటి సీరియళ్లను శ్రోతలు బాగా ఆదరించారు. నేను చేసిన నాటకాల్లో సన్నివేశాన్ని శ్రోతల కళ్లకు కట్టినట్టు ఉండాలనే జిజ్ఞాసతో విభిన్న ప్రయోగాలు చేశాను. ఉదాహరణకు నాటకంలో భీష్ముడిపాత్రను పోషించిన లింగరాజుశర్మగారిని అంపశయ్య మీద పడుకున్నట్టు తెలియజెప్పడానికి ఆయనను నేల మీద పడుకోబెట్టి డైలాగులు చెప్పించాను. సినిమాల్లోనూ... సినీ నిర్మాత డి.రామానాయుడు, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆయన చాలా సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’తో మొదలు పెట్టి, ‘శుక్రవారం మహాలక్ష్మి’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘విప్లవ శంఖం’, ‘అంగడి బొమ్మ’, హిందీలో జితేందర్‌తో కలిసి ‘దిల్దార్’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నాను. - నిఖితా నెల్లుట్ల, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
సుధా పూర్ణోదయం
రేడియో అంతరంగాలు ఆకాశవాణిలోకి అడుగుపెట్టక ముందే రేడియోతో అనుబంధం పెంచుకున్న వ్యక్తి ‘సుధామ’. ఆయన అసలు పేరు అల్లంరాజు వెంకట్రావు. గుక్క తీసుకోకుండా అనర్గళంగా, తెలుగులో తియ్యగా మాట్లాడే స్వభావం సుధామది. 30 ఏళ్లు రేడియోలో పని చేసినప్పుడు నిర్వహించిన కార్యక్రమాలు, బాధ్యతలు, అనుభవాలను తనను ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో పంచుకున్నారు 63 ఏళ్ల సుధామ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నా విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే సాహిత్యంలోకి అడుగుపెట్టాను. స్కూల్లో ఉన్నప్పుడే రేడియోలో ప్రసారమయ్యే ‘బాలానందం’లో బాలనటుడిగా నాటకాలు వేసేవాణ్ణి. రేడియో రంగప్రవేశం... ఆకాశవాణిలో రెగ్యులర్ ఉద్యోగిగా చేరకముందే ‘మాటా మంతీ’కార్యక్రమానికి స్క్రిప్ట్‌లు రాసేవాణ్ణి. అలా అప్పుడప్పుడు రేడియోలో చేస్తూనే కరీంనగర్‌లోని ఓ జూనియర్ కాలేజీలో రెండేళ్లపాటు లెక్చరర్‌గా పని చేశాను. తర్వాత 1978లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్)గా ఆకాశవాణిలో శాశ్వత ఉద్యోగంలో చేరాను. నేను చేరింది పేరుకు డ్యూటీ ఆఫీసర్‌గా అయినా అన్ని విభాగాల్లోనూ నా ఆసక్తి మేరకు కార్యక్రమాలు చేశాను. తర్వాత 1995లో నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడకు బదిలీ, పదోన్నతి ఒకేసారి వచ్చాయి. అలా అక్కడ ఓ అయిదేళ్లు పని చేసి, తిరిగి హైదరాబాద్ స్టేషన్‌కు వచ్చేశాను. అలా 30 ఏళ్లు రేడియోలో పని చేసి 2008లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను. నెరవేరిన కళ... చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని రేడియో వింటుంటే నేనెప్పుడైనా అక్కడ రచనలు చేయగలనా అనుకునేవాణ్ణి. కానీ స్వయంగా చేరాక నన్ను, నా రచనలను అందరూ అభినందిస్తూ ప్రోత్సహించేవారు. కార్యక్రమాల్లో నా గళాన్ని విని ప్రొడ్యూసర్ వేలూరి సహజానందగారు అభినందించి ‘కవితా ్రసవంతి’లో అవకాశం ఇచ్చారు. అలా నేను రూపకాలు, నాటకాలు, సంభాషణలు రాశానంటే అది రేడియో వల్ల దొరికిన అదృష్టమే. ఢిల్లీలో తెలుగు కవిగా ... 1983లో రేడియోలో పని చేస్తూ జాతీయ కవిసమ్మేళనంలో జాతీయ కవిగా ఎన్నికవడం అప్పట్లో గొప్ప విషయంగా మారింది. ఎన్నికల సమయంలో రాసిన ‘’ఎండలో సామాన్యుడు’ అనే నా కవితకు నాకు ఆ అవార్డు లభించింది. అంతకు ముందు తెలుగు రాష్ట్రం నుంచి ఎంతోమంది కవులు వెళ్లారు కానీ రేడియోలో ఉద్యోగం చేస్తున్న నేను వెళ్లడం ప్రత్యేకత సంతరించుకుంది. నా కవిత దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదమైందంటే ఎంతో ఆనందంగా, గర్వంగానూ అనిపించింది. తర్వాత ఆ అనువాదాలు చేయించే బాధ్యతలను నేను తీసుకున్నాను. రాయడమే లోకం... ఉద్యోగం డ్యూటీ ఆఫీసర్‌గా అయినా రచనపై ఉన్న ఆసక్తితో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ‘ఉదయ తరంగిణి’కి స్క్రిప్ట్ రాశాను. మీరు (శారదా శ్రీనివాసన్) నటించే నాటకాలకు స్క్రిప్ట్ రాయాలంటే చాలా జాగ్రత్త పడేవాణ్ణి. సినిమాపై పిచ్చితో ఎన్నో చిత్రాల సమీక్షా కార్యక్రమాలు నడిపాను. ప్రతి శుక్రవారం రాత్రి సినిమా చూడడం, శనివారం నాడు దానిపై రేడియోలో సమీక్ష నిర్వహించాను. విజయవాడలో అయిదేళ్లు.... నాకు పదోన్నతి వచ్చి విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ కూడా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడ 1990 నుంచి 1995వరకు పని చేశాను. నేను రేడియోలోకి రాకముందు ‘యువమిత్ర’ అనే లిఖిత పత్రికను ఓ ఎనిమిదేళ్లు నడిపాను. అప్పుడు అందులో ‘రేడియో ఏమంటోంది’ అనే కాలమ్ నిర్వహించాను. తర్వాత ఆకాశవాణిలో చేరాక విజయవాడలో ‘పత్రికలో ఈ నెల’ అనే కార్యక్రమం చేశాను. అలాగే విశ్వనాధ సత్యనారాయణగారి శతజయంతి సందర్భంగా వారం రోజులపాటు ‘విశ్వనాధ వైభవం’ అనే కార్యక్రమం నిర్వహించాను. ఇలా విభిన్న కార్యక్రమాలు చేసే అవకాశం కేవలం రేడియోలోనే ఉంటుందేమోనని నా అభిప్రాయం. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఠాకూర్ మరువలేని అనుభవాలు... 1982లో నేను నిర్వహించిన ‘నూరేళ్ల తెలుగు వెలుగు’ కార్యక్రమంలో శ్రీశ్రీ గారిని గంటన్నరపాటు ఇంటర్వ్యూ చేశాను. అది మరచిపోలేని అనుభవం. నాకెంతో ఇష్టమైన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారి దగ్గర రెండేళ్లు తెలుగు ‘ప్రసంగాల’ విభాగంలో సహాయకుడిగా పని చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ‘కుటుంబ సంక్షేమం’ విభాగంలో నేను, ఉమాపతి వర్మ, గోపల్లె శివరాం పని చేసేవాళ్లం. ఈ రేడియో వల్లే మేం ముగ్గురం మంచి స్నేహితులమయ్యాం. -
మన్‌బోలే తంబోలా
వినసొంపైన పాటలు.. అంతకుమించిన మాటలతో సిటీ శ్రోతలను అలరిస్తున్న రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం ‘రేడియో సిటీ తంబోలా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాక్షి దినపత్రిక భాగస్వామ్యంతో ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్‌ని కండక్ట్ చేస్తోంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాక్షి పత్రికలో కొన్ని పాటలతో లిస్ట్ ప్రచురితమవుతుంది. ఆ లిస్ట్‌లో ఇచ్చిన పాటలు ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య రేడియో సిటీలో ప్రసారమవుతాయి. పాట విన్న శ్రోతలు పాటల లిస్ట్‌లో ఏవైనా 5 పాటలను సీక్వెన్స్ మిస్ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో టైప్ చేసి 56060 నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. కరెక్ట్‌గా ఎస్సెమ్మెస్ పంపిన వారు రూ.2,000 విలువ చేసే ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. సో.. ఆ లక్కీ విన్నర్ మీరే ఎందుకు కాకూడదు. -
రామం... నా సంతోషం
రేడియో అంతరంగాలు విజయవాడలో జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఆకాశవాణిలో రచయితగా, కళాకారుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ... తన సుదీర్ఘ రేడియో ప్రస్థానం గురించి ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ అడిగిన అనేక ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... రేడియోతో అనుబంధం ఆకాశవాణిలో ఉద్యోగం రాకముందు నుంచే నేను రేడియోలో ఔట్‌సైడ్ ఆర్టిస్ట్‌గా కార్యక్రమాలు చేసేవాణ్ణి. 1976లో విజయవాడ కేంద్రంలో రెగ్యులర్ స్టాఫర్‌గా నేను నా శాశ్వత రేడియో జీవితాన్ని ప్రారంభించాను. తీసుకోవడానికి నన్ను రచయితగా తీసుకున్నా ఓ వైపు స్క్రిప్ట్, పాటలు రాస్తూ మరో వైపు నాటకాల్లోనూ నటించేవాణ్ని. ఏనాడూ ఓ ఉద్యోగంలో కష్టపడుతున్నాననే భావన నాకు కలగలేదు. ఇరవై ఏళ్లు ఆకాశవాణిలో పని చేసి నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను. రేడియో నాటకాలు 1970లో ప్రసారమైన ‘వాయులీనం’ నా తొలి రేడియో నాటకం.. అదే ఏడాదిలో నా తొలి గేయకథాకావ్యం ‘శిలామురళి’ ప్రచురితమయింది. తర్వాత దాన్ని రేడియోలో మీరు (శారదాశ్రీనివాసన్), సుత్తివేలు గారు కలిసి నాటకం వేశారు. నేను, శ్రీరామమూర్తి కలిసి సుమారు యాభై కార్యక్రమాలు చేశాం. ఎప్పుడూ ఇద్దరం ఇంకెలాంటి సృజనాత్మక కార్యక్రమాలు చేద్దామా అని చర్చించుకునే వాళ్లం. నా ఇరవై ఏళ్ల రేడియో జీవితంలో రామంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎన్నో విజయాలను తెచ్చి పెట్టింది. మొత్తం నేను పాలుపంచుకున్న రేడియో కార్యక్రమాల్లో పదిహేను ప్రోగ్రామ్స్‌కు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలు వచ్చాయి. అందులో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు మరికొన్నింటికి యోగ్యతా పత్రాలు అందుకున్నాం. ప్రథమ బహుమతి అందుకున్న వాటిలో వర్షానందిని (సంగీతరూపకం), మెట్లు (సృజనాత్మకం), అమరారామం (డాక్యుమెంటరీ)లాంటి విభిన్న కార్యక్రమాలున్నాయి. అమరారామం ఈ డాక్యుమెంటరీ కోసం అమరావతి వెళ్లాను. దళితుడి దానం, కలశం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడి దేవుడు అమరేశ్వరుడి పైనా చేశాను. నా డాక్యుమెంటరీ కోసం ఓవైపు పరిశోధన, రచన చేస్తూ సత్యంగారి ‘అమరావతి కథలు’లో నుంచి కొన్ని కథా భాగాలను నాటకీకరించి ఈ ‘అమరారామం’ పూర్తి చేశాను. 1982లో జాతీయస్థాయిలో ఇచ్చే ఆకాశవాణి పురస్కారాలలో దీనికి ప్రథమ బహుమతి వచ్చింది. ‘తిలక్’పై లైవ్ డాక్యుమెంటరీ తణుకులో నేనూ ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తరచూ కలిసే వాళ్లం. అలా ఆయనపై ఉన్న అభిమానమే నన్నీ డాక్యుమెంటరీ చేసేలా చేసింది. ఆయన రాసిన పద్యాలు, నాటకాలు, పాటలు సేకరించి వాటితో దీన్ని తయారు చేశాను. తణుకులోని ఆయన ఇంట్లోనే ఓ గదిలో తిలక్ పాటలు పాడుకుంటూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ‘శిఖరావరోహణ’ పేరుతో చేశా. ఓ వ్యక్తిపై నేను చేసిన మొదటి డాక్యుమెంటరీ అది. తిలక్ నా మనసుకు అర్థమైన మనిషి, ఆత్మీయుడు. ‘కబుర్లు’ పెట్టుకున్నాం నేను, రామ్మోహనరావు, నండూరి సుబ్బారావు కలసి రేడియోలో ఓ పదిహేనేళ్లు ‘కబుర్లు’ అనే కార్యక్రమం చేశాం. ఇందులో ఇద్దరిద్దరం వర్తమాన అంశాల్లోంచి ఏదో ఒక దానిపై ముచ్చటించే వాళ్లం. దానికి నేను స్క్రిప్ట్ రాస్తూ, నటించే వాణ్ణి. ఈ కార్యక్రమానికి శ్రోతల ఆదరణ బాగా లభించింది. అలాగే ‘కిటికీ’ అనే పదిహేను నిమిషాల కార్యక్రమం నిర్వహించాం. ఇందులో మూడు పాత్రలుండేవి. ఇది నలభై వారాల పాటు విజయవంతంగా నడిచింది. నాలుగు పాత్రలుండే ‘ఇరుగుపొరుగు’ అనే కార్యక్రమం నలభై ఏడు వారాలు నిర్వహించాం. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫోటోలు: నోముల రాజేశ్‌రెడ్డి దేశభక్తిగీతాలు రాయనన్నా నాకు విజయవాడ స్టేషన్ డెరైక్టర్ శ్రీనివాసన్‌గారితో ఉన్న చనువుతో ‘‘దేశభక్తి గీతాలు, ప్రచార కార్యక్రమాలకు పాటలు మాత్రం రాయమనకండి’’ అన్నాను. ఆయన నా అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశభక్తి గీతాలు రాయక తప్పలేదు. నేను రాసిన ‘‘తేనెల తేటల మాటలతో... మన దేశమాతనే కొలిచెదమా...’’ పాట నాకు పేరుతో పాటు ఆత్మసంతృప్తినీ ఇచ్చింది. మ్యూజిక్ కంపోజర్ ఎమ్మెస్ శ్రీరాంగారు అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉండేది. ఆయన నన్ను అడగ్గానే రాత్రికి రాత్రి రెండు పాటలు రాసిచ్చాను. -
ఇట్లు.. ఇలియాస్ -జ్యోత్స్న
ఆకాశవాణిలో అనౌన్సర్లుగా ప్రారంభమైన ఇలియాస్, జ్యోత్స్నల జీవితం దాంపత్యబంధంగా మారింది. మతాలు వేరైనా తమ మనసులనొక్కటి చేసింది రేడియోనే అంటున్న ఈ దంపతులు... రిటైర్ అయ్యాక కూడా ఇప్పటికీ సీరియళ్లకు డబ్బింగ్ చేయిస్తూ, లైఫ్‌ను బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో వారి సంభాషణ... నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగింది. ఆ ముచ్చట్లు ఈ వారం ‘రేడియో తరంగాలు’లో మీ కోసం.. 1972 బ్యాచ్... ఇలియాస్: అప్పట్లో నేను ఐఏఎస్, ఐపీఎస్‌కు అప్పియర్ అవ్వాలనుకునేవాణ్ణి. కానీ ఉద్యోగావసరం నన్ను రేడియోలోకి లాగింది. అందులో అడుగుపెట్టాక కూడా ఎప్పటికైనా వెళ్లిపోవాలి అనుకునేవాణ్ణి కానీ ఇలా శాశ్వతంగా ఆకాశవాణిలో పని చేసి రిటైర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. జోత్స్న: నేనూ ఇలియాస్ బ్యాచ్‌మేట్స్. నేను 2008లో, ఇలియాస్ 2000లో పదవీ విరమణ చేశాం. ఇద్దరం కలసి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆకాశవాణికి వచ్చే వరకు రచనపై మాకు ఆసక్తిలేదు. వారసత్వంగా... జ్యోత్స్న: అమ్మ ‘రేడియో భానుమతి’ నుంచి వారసత్వంగా ఇందులోకి వచ్చాను. కాబట్టే ఇక్కడ త్వరగా ఒదిగిపోగలిగాను. అప్పట్లో బాలానందం కార్యక్రమానికి తరచూ వెళ్లేదాన్ని. దూరదర్శన్‌లో వార్తలు కూడా చదివాను. దాని కోసం డి.వెంకట్రామయ్య గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. నాటకాలపై నాకు ఎక్కువ ఆసక్తి. రంగనాయకమ్మగారు రాసిన ‘స్వీట్‌హోం’ కథ నచ్చి ఆమె దగ్గర నాటకం వేయడానికి అనుమతి తీసుకొని అందులో ‘విమల’ పాత్రలో నటించాను. ఇలా రేడియో నా జీవితంలో ముఖ్య భూమిక పోషించింది. మా ఇద్దరి పేర్ల్లే ‘మధూలత’... ఇలియాస్: నేను ‘రేడియో క్లబ్’ అనే కార్యక్రమం చేశాను. అందులో శ్రోతలకు మెంబర్షిప్ ఉండేది. అంటే వారి నంబర్లు తీసుకొని మేమే ఫోన్ చేసేవాళ్లం.ఆ కార్యక్రమం మాకూ శ్రోతలకు మధ్య బాంధవ్యాన్ని పెంచింది. 1975లో చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుందనిపించింది. అలా నేను, జోత్స్న కలసి ‘పూలజల్లు’ అనే అయిదు నిమిషాల కార్యక్రమం ఏడాదిన్నర పాటు చేశాం. దాంట్లో మా ఇద్దరి పేర్లు ‘మధూలత’. అందులో రోజుకో అంశంపై ముచ్చటించే వాళ్లం. రెండేళ్ల క్రితం నేను ఆస్పత్రికి వెళ్లినప్పుడు మా పేర్లు విని ఓ అమ్మాయి మీరు పూలజల్లులోని మధూలత కదా అని అడిగింది. ఎప్పటి మధూలత అనిపించింది కానీ చాలా ఆనందం కలిగింది. రచనా ప్రస్థానం... ఇలియాస్: నేను రాయడం రేడియోకు వచ్చాకే మొదలెట్టాను. ఏ కథ గురించి అయినా జోత్స్నతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటా. అలా ఇద్దరం కలసి ఎన్నో పత్రికలకు, మ్యాగజీన్లకు ఇలియాస్ జ్యోత్స్న పేరుతో కథానికలు రాశాం . తర్వాత సీరియల్స్ రాయడమూ ప్రారంభించాం. 1988-89లో ఎయిడ్స్ మనం దేశంలో వ్యాపించసాగింది. అప్పుడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థవారు ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమం చేయాలని మాకు చెప్పారు. అప్పుడు హెచ్.ఐ.వి వైరస్‌ను గుర్తించిన సైంటిస్ట్ రాబర్ట్ గాల్లోను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కలసి ఇంటర్వ్యూ చేసి ‘మీ నేస్తం’ పేరుతో ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించాం. మొదటిసారి రికార్డింగులడిగారు... నేను మీతో (శారదా శ్రీనివాసన్) కలసి చేసిన ‘మెదియా’ నాటకం శ్రోతలందరికీ ఎంతగానో నచ్చింది. ఎంతోమంది స్టూడియోకు వచ్చి రికార్డింగ్స్ అడిగి మరీ తీసుకెళ్లారు. అలాగే ‘లైఫ్ టానిక్’ లో మృత్యు దేవతగా మీరు (శారదా శ్రీనివాసన్) చేసిన పాత్ర అద్భుతం. అది విన్నాక అందరూ మృత్యుదేవతను సైతం ఇష్టపడ్డారు (నవ్వుతూ). టీవీ రంగప్రవేశం... ఇలియాస్: ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ కథతో సీరియల్స్ ప్రస్థానం ప్రారంభించా. అది 100 ఎపిసోడ్లు నడిచింది. ‘అలౌకిక’ సీరియల్ తీశా! అది విజయవంతం అయింది. తర్వాత ‘అన్వేషిత’ సీరియల్ చేశాను. అది ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఆ సీరియల్‌కు 8 నంది అవార్డులు వచ్చాయి. అలాగే నేను తీసిన పొగమంచు, చిరుదివ్వెలు (బాలల చిత్రం), శ్వేత గులాబీలు లాంటి వాటికీ నందులు అందుకున్నాను. ఇంట్లోనే స్టూడియో... (జ్యోత్స్న) మైక్రోఫోన్ మీదున్న ప్రేమ తగ్గకే ఇంట్లో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ కంపెనీలకు కంటెంట్ తయారు చేసిస్తాం. మా దగ్గర కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. కొన్ని చానళ్లకు హిందీ నుంచి తెలుగు సీరియళ్లకు స్క్రిప్ట్ రాసి ఇంట్లోనే డబ్బింగ్ చేసి ఇస్తాం. రిటైర్ అయ్యాకే ఇంకా ఎక్కువ బిజీ అయ్యాం. అయినా ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో తిరగడమంటే మామూలు విషయమా... ప్రస్తుతం మా చేతుల్లో ఉన్న కొన్ని డబ్బింగ్ సీరియళ్లతో బిజీబిజీగా ఉన్నాం. నాన్నగారి వల్లే... జ్యోత్స్న: నాన్నే మా పెళ్లి జరిపించారు. ఆయన బ్రహ్మసమాజ సిద్ధాంతాలను పాటించేవారు. ఆ తర్వాత మా కూతురు స్వప్న (టీవీ యాంకర్)కూ బ్రహ్మసమాజం పద్ధతిలోనే దగ్గరుండి వివాహం చేయించారు. మా అమ్మను ఆయనెప్పుడూ కట్టడి చేయలేదు. అలా మా పెళ్ల్లయ్యాక మా అమ్మ(భానుమతి), అత్తయ్య (షాహీన్ ఫాతీమా) చాలా సన్నిహితంగా ఉండేవారు. ఉదాహరణకు వరలక్ష్మీ పూజ వచ్చిందంటే మా అత్తయ్యే అమ్మకు పండ్లు, పూలు, మట్టి కుందులు పంపించేవారు. మనల్ని అర్థం చేసుకోదని సమాజాన్ని తిడుతుంటాం కానీ నిజాయితీ ఉంటే తప్పకుండా మన పనిని స్వీకరిస్తుంది. సమాజానికి విశాల హృదయం ఉంది. మా ఇద్దరి మీద ప్రేమతోనే అందరూ మా ఇంటికి వస్తారు. -
శ్రోతాభిరామం
రేడియో అంతరంగాలు నేడు వరల్డ్ రేడియో డే ‘రేడియో రామం’ గా ఎస్.బి. శ్రీరామమూర్తి శ్రోతలందరికీ సుపరిచితం! రేడియోలో ఆయన ఎంత వినూత్నంగా కార్యక్రమాలను రూపొందించగలరో.. మాండలిన్తో సరిగమలనూ అంతే హృదయ రంజకంగా వినిపించగలరు. కాన్వాస్ మీద అంత సృజనాత్మకంగాను చిత్రాలను గీయగలరు! ఇలా తనకు తెలిసిన అన్ని విద్యలతో తెలుగు రేడియోకి విలక్షణ కళాకారుడైన రామం... ఈవారం ‘రేడియో అంతరంగాలు’ కు శారదా శ్రీనివాసన్ ఎంచుకున్న ఆత్మీయ అతిథి. (శ్రీరామమూర్తినిశారదా శ్రీనివాసన్ కూడా ఆప్యాయంగా రామం అనే పిలుస్తారు. ఆయన కూడా శారద అత్తా, శ్రీనివాసన్ మామా అంటూ వాళ్లని అంతే ఆప్యాయంగా పిలుస్తారు. విజయవాడ ఆకాశవాణి నుంచి రామం రిటైరై పన్నెండేళ్లవుతోంది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శారదా శ్రీనివాసన్.. రామంను మళ్లీ ఒకసారి కలుసుకున్నారు. వారి సంభాషణ అలా.. ఆ పాత జ్ఞాపకాలతోనే మొదలైంది). మహామహులు పనిచేసిన విజయవాడ రేడియోస్టేషన్లో నువ్వూ పనిచేశావు. అప్పటి నీ అనుభవాలు, అనుభూతులు తెలుసుకోవాలని వచ్చాను రామం.... నిజంగానే అది నా అదృష్టం అత్తా! 1972లో విజయవాడ కేంద్రానికి పర్మినెంట్ అనౌన్సర్‌గా వెళ్లినా 1968 నుంచే రేడియోతో నాకు సంబంధాలున్నాయి. దానికన్నా ముందు.. డిగ్రీ అయిపోగానే మద్రాసు వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ, సౌండ్, ప్రాసెసింగ్ విభాగాల్లో మూడేళ్లు కోర్సు చేశాను. మరి సినిమాలకు వెళ్లకుండా రేడియో వైపు వచ్చావేం? ఈ ప్రశ్నే రేడియో ఉద్యోగం కోసం చేసిన ఇంటర్వ్యూలోనూ అడిగారత్తా! ‘ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడివి.. రేడియోలోకొస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. ఉద్యోగం ఇవ్వం’ అని కూడా అన్నారు. అప్పుడు నేను చెప్పా.. ‘ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవుతుందండి, డిస్ క్వాలిఫికేషన్ కాదు. నేను అక్కడ నేర్చుకున్న రికార్డింగ్, ఎడిటింగ్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తాను. ప్రూవ్ చేస్తాను ఉద్యోగం ఇస్తే’అని! ఇచ్చారు. యువవాణితో మొదలు 1968లో ఆల్ ఇండియా రేడియోలో యువతను ప్రోత్సహించడానికి యువవాణిని మొదలుపెట్టారు. అప్పుడే మద్రాస్ నుంచి కాకినాడ వచ్చేశాను. ఈ యువవాణిని వింటుండేవాడిని. ‘అరే.. బాగుందే.. మనం కూడా ఏదైనా రాయొచ్చు, చేయొచ్చు’ అనిపించింది. విజయవాడ వెళ్లి ఎవరినైనా కలుసుకుని వద్దాం అని బయలుదేరి వెళ్లా. ‘ఏంచేస్తావేంటీ’ అని అడిగారు. ‘మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్’ అని చెప్పాను. ‘ప్రతి శుక్రవారం మార్నింగ్ ఒక అరగంట ఫిల్మ్ రికార్డులు వేసే కార్యక్రమం ఉంది. ముందది చేయండి. తర్వాత మీరేమైనా రాసుకొని పట్టుకొస్తే అప్పుడు చూద్దాం’ అన్నారు. అలా రేడియోలో సినిమారికార్డులు వేసే పనితో నేను ఉద్యోగానికి ముందే ఎంటర్ అయ్యానన్నమాట. స్టేషన్‌కే కొత్త ఐడియా కొన్ని రోజులకి నేనే ఓ ప్రోగ్రామ్ రూపొందించా. మూడ్ మ్యూజిక్ కాన్సెప్ట్‌తో. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఓ షార్ట్‌ఫిల్మ్ కోసమని రాసుకున్న స్క్రిప్టునే ఇక్కడ ప్రోగ్రామ్‌గా మలిచా. ప్రకృతిలోని చక్కటి దృశ్యాన్ని చూస్తుంటే చక్కటి సంగీతాన్ని వింటున్న అనుభూతి కూడా కలుగుతుంది. అనాహత శబ్దం అంటామే అది. దీన్ని నేను రివర్స్‌లో చెప్పటానికి ట్రై చేశా ఆ ప్రోగ్రామ్‌లో. ఎలాగంటే ముందుగా ఓ ప్రభాత దృశ్యాన్ని వర్ణించి.. వెంటనే పండిట్ రవిశంకర్ సితార్ మీద మీటిన ఆహిర్భైరవి రాగాన్ని వినిపించేవాడిని. తర్వాత రెండిటినీ సమన్వయం చేస్తూ కామెంట్ చెప్పేవాడిని. అలా ఏడెనిమిది దృశ్యాలు వర్ణించేవాడిని. దశ్యాన్ని శబ్దీకరించడమన్నమాట. దీనికి నన్ను ప్రోత్సహించిందెవరనుకున్నారు? మహా విద్యాంసులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు. చిన్నకుర్రాడిని వెళ్లి.. శాస్త్రీయ సంగీతాన్ని బేస్ చేసుకొని ఓ ప్రోగ్రామ్ చేస్తానంటే.. ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ‘నాతో రా, సాయంకాలం మాట్లాడుకుందాం’ అన్నారు. విజయవాడలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన ఈవినింగ్వాక్కి వెళ్లేవారు. అలా నన్నూ తీసుకెళ్లి నేను చెప్పింది చక్కగా ఓపిగ్గా విని ‘ఐడియా చాలా బాగుందండీ.. మా స్టేషన్‌కే కొత్త ఐడియా’అన్నారు. నాకొచ్చిన ఎన్నో రేడియో జాతీయ అవార్డులన్నిటికంటే గొప్ప అవార్డు ఆ మాట. నేను రూపొందించిన ప్రోగ్రామ్ విని బాగా ఇంప్రెస్ అయ్యి ఓ చక్కటి ఇంట్రడక్షనూ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు ‘భావనా సంగీతం’! ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. దీనికి నాకందిన పారితోషికం 20 రూపాయలు. పుట్టినరోజు గిఫ్ట్ అలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే రేడియోలోనే పర్మినెంట్ ఉద్యోగంలో చేరే అవకాశం కోసం చూస్తుండే వాడిని. అప్పట్లో ‘వాణి’ అనే రేడియో పక్షపత్రికొచ్చేది. అందులో ఆకాశవాణికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్సూ వేసేవారు. ప్రోగ్రామ్స్ హడావిడిలో ఉండి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. వైజాగ్‌లో ఓ ఖాళీ ఉందని తెలిసివెళ్లాను. ఆడిషన్లో పాసయ్యాను. అందులో నా నంబర్ 11. ముగ్గురికి అవకాశమిచ్చి మిగతావాళ్లను ఆపారు. అలా నేను పెండింగ్ లిస్ట్‌లో ఉన్నాను. అప్పుడే అదృష్టవశాత్తు వివిధభారతిలో కొత్తగా తెలుగు సర్వీస్ మొదలయింది హైదరాబాద్, విజయవాడలో. ఆ సర్వీస్‌ని సీబీఎస్ అనిపిలిచేవాళ్లు అంటే కమర్షియల్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్. దానికి అనౌన్సర్స్ని తీసుకుంటున్నారని తెలిసి వెళ్లాను. అప్పటికే నేను పెండింగ్లిస్ట్లో ఉన్నాను కాబట్టి వీళ్లు నన్ను తీసుకునే ఛాన్స్ ఉంటుందని విజయవాడకు వెళ్లాను. అక్కడ అవకాశం దొరకలేదు. ఓలేటి వెంకటేశ్వర్లుగారి సలహా మేరకు హైదరాబాద్ వచ్చాను. శ్రీనివాసన్ మామను కలిశాను. కొంత టైమ్ పట్టినా హైదరాబాద్ వివిధభారతిలో అనౌన్సర్‌గా చేరాను. అది 1971, జూన్ 3న. ఆ రోజు నా పుట్టినరోజు. గుర్తుందా.. అత్తా.. ఆ కాంట్రాక్ట్‌ను మీరే పట్టుకొచ్చి ఇచ్చారు.. నా పుట్టినరోజు గిఫ్ట్‌గా!’. ఎందుకు గుర్తులేదూ.. గుర్తుంది రామం... తర్వాత ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది. కాకపోతే విజయవాడ పోస్టింగ్. యేడాదిగా హైదరాబాద్‌లో అందరూ క్లోజ్ అయ్యేసరికి విజయవాడ వెళ్లడానికి మనసొప్పలేదు. సీనియర్ ఎనౌన్సర్లు డి.వెంకటరామయ్యగారు, శమంతకమణిగారు, రత్నప్రసాద్గారు.. ‘విజయవాడలో కన్సోల్ దగ్గర కాళ్లు పెట్టుకోవడానికి పీటలాంటిది తయారుచేశారట శ్రీరామ్మూర్తీ.. హాయిగా అక్కడికి వెళ్లు’అంటూ నా మీద జోక్స్ వేశారు. ఇక్కడే ఉంటానని స్టేషన్ డెరైక్టర్ కందస్వామిని రిక్వెస్ట్ చేశాను కూడా. ఆయన నన్ను సముదాయించి విజయవాడ పంపించారు. బాలాంత్రపు రజనీకాంతరావుగారు మొట్టమొదటి మా స్టేషన్ డెరైక్టర్. ఆయన మాకు గురువు, దైవం అన్నీ! ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్, టెక్నికల్ విషయాల పట్ల ఆసక్తి, అవగాహన నా రేడియో కెరీర్‌కి ప్లస్పాయింట్స్ అయ్యాయి. అందుకే నా ప్రోగ్రామ్స్‌ని శబ్దచిత్రాలు అని పేరుపెట్టుకున్నాను. అంటే శబ్దం ద్వారా చిత్రాన్ని చూపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామ్‌కి నేను సరిపోవడం, నాకు మంచి ప్రోగ్రామ్ రావడం.. రెండూ కుదిరాయి అత్తా. ఒక్కో కార్యక్రమం ఒక్కో జ్ఞాపకం. గొప్ప అనుభూతి. ప్రశంసలు, నేర్చుకునేలా చేసిన విమర్శలు,పెద్దపెద్ద వాళ్ల సాంగత్యం, విడదీయలేని అనుబంధం.. ఇవన్నీ రేడియో ఇచ్చిన సంపదలే! చెప్పాలంటే రోజైనా పడుతుంది! ప్రెజెంటేషన్: సరస్వతి రమ ఫొటో: గోదాసు రాజేష్ ‘ఒక పాటపుట్టింది’ ప్రోగ్రామ్ చేశా కదా ఆ ఐడియా ఎలా వచ్చిందంటే..? రేడియో స్టేషన్లో ఓ పాట ఎలా రికార్డ్ అవుతుందో అనుకునే ఓ సగటు శ్రోత కుతూహలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రూపొందించాను. ప్రసారం అయ్యాక ఎంత రెస్పాన్స్ వచ్చిందో. నా ఫస్ట్ ప్రోగ్రామ్ నీలినీడలు కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమమే. ఆ మాటకొస్తే ఒక పాట పుట్టింది ప్రోగ్రామ్ చేసేటప్పటికే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కింద నాకు నాలుగైదు అవార్డులు వచ్చి ఉన్నాయి. ఈ ప్రోగామ్కీ అవార్డు వచ్చింది. ఇలాంటివి చాలా చేశాను. ‘మెట్లు’ అనే కాన్సెప్ట్ తీసుకొని జీవితంలో మెట్లకున్న ప్రాధాన్యాన్ని చెప్పడానికి రకరకాల థీమ్స్‌తో ప్రోగ్రామ్ చేశాను. ఒకసారి విజయం, పరాజయాలకి చిహ్నంగా, ఇంకోసారి బుద్ధుడి భాగస్వామి యశోధర ప్రధానపాత్రగా శ్రవణనాటకాన్ని రూపొందించాను. ఒకరకంగా ఇది స్త్రీవాద ధోరణిలో సాగే నాటకం. ఇలా చాలా ప్రయోగాలు చేశాను... కేవలం శబ్దాన్ని మాత్రమే ఓరియెంటేషన్‌గా తీసుకుంటూ! జీవితంలో పెరిగిన వేగం మీదా కామెడీ ప్రోగ్రామ్ రూపొందించాను.. ‘చూసిందే మళ్లీ చూడు’ అనే పేరుతో. ఇలాంటి నా కార్యక్రమాలకు పదీపన్నెండు రేడియో జాతీయ అవార్డులు వచ్చాయి. -
మేధస్సు అలసిపోదు
గొల్లపూడి మారుతీరావు, ప్రసిద్ధ రచయిత - నటుడు - కాలమిస్టు కిందటి శతాబ్దపు అయిదో దశకం తెలుగు దేశానికి మరపురాని దశ. కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం. ముఖ్యంగా ‘భక్తి రంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం ఆ వైభవానికి మూలపురుషులు బాలాంత్రపు రజనీకాంతరావుగారు కావడం. నాకప్పుడు ఇరవయ్యేళ్లు. తెల్లవారితే ప్రతీ ఇంట్లో ‘భక్తిరంజని’ పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి. తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి - ఇలాగ. ఇవన్నీ మధురమయిన జ్ఞాపకాలు. బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, ఎమ్.వి. రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, పాకాల సావిత్రీ దేవి, నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్యులు - వీరంతా గానం చేసిన పాటలవి. అన్నమాచార్య కీర్తనలు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన ఆ కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు. అయితే ‘‘ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది’’ అన్న కీర్తన బాలమురళీ కృష్ణ పాడగా విన్న గుర్తు. అప్పటికి టీవీలు లేవు. ఆనాటి రేడియో ప్రాచుర్యాన్ని పూర్తిగా అనుభవించిన తరం మాది. కానడలో వోలేటిగారి హనుమాన్ చాలీసా, చరిత్రగా నిలిచిపోయిన బిళహరి, కాంభోజీ, జౌన్పురీ, నాట మొదలైన రాగాలలో బాలమురళి నారాయణ తీర్థ తరంగాలు, రజని సూర్య స్తుతి - ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. ‘మాది’ అని నన్నూ కలుపుకోడానికో కారణం ఉంది. నా జీవితంలో - ఆ మాటకి వస్తే మా ఇంట్లో మొదటి రేడియో నేను కొన్నదే. 1959లో నేను అంతర్జాతీయ రేడియో నాటికోత్సవాల పోటీలలో నా నాటిక ‘అనంతం’కు మొదటి బహుమతిగా పుచ్చుకున్న వంద రూపాయలతో, నేను రేడియోకి రాసిన ‘శాఫో’ అనే నాటికకి దక్కిన పదిహేను రూపాయలు, ‘అనంతం’లో నటించినందుకు దక్కిన మరో పాతిక కలపగా, మా నాన్నగారు మరో ఇరవై రూపాయలు ఇచ్చిన గుర్తు. ఆ పైకంతో చిన్న ‘మర్ఫీ’ రేడియో కొన్నాను. అది ఆ తర్వాతి 57 సంవత్సరాల జీవితానికి పెట్టుబడి అయింది. ఆ విధంగా రజనీకాంతరావుగారు, బాలమురళీకృష్ణ, మిగతా గాయకులంతా నా డ్రాయింగు రూములో కొలువుతీరారు. ఓ చిన్న రచయితకి అదొక దేవలోకం. ఎప్పుడయినా ఈ గంధర్వుల్ని చూడగలుగుతానా అనుకొని రేడియోలో తలదూర్చి మరీ లలిత సంగీతం వినేవాడిని. అది 1959. మరో నాలుగేళ్లకు (1963) వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. రేడియోలో ఉద్యోగం వచ్చింది! అంతే. అదే జీవితంలో పెద్ద మలుపు. నా జీవితంలో గొప్ప అదృష్టాన్ని చెప్పమంటే నా ప్రవృత్తి- వృత్తి మమేకయి జీవితమంతా కొనసాగడం. అడుగడుగునా ఎందరో పెద్దలతో భుజం కలిపి పనిచేయడం. ఏనాడూ అహంకారానికి తావివ్వని ప్రతిభావంతుల, పెద్దలతో సాంగత్యం, ఆ మలుపులో నా అభిరుచిని సంధించినవారిలో రజనీకాంతరావుగారి పాత్ర ఉంది. 1959 నాటి మరో ప్రత్యేకమైన జ్ఞాపకం - విజయవాడ మొగల్రాజపురంలో మహీధర రామమోహనరావు గారింట్లో సాహితీ సమావేశం. ఆ రోజుల్లో నా ఆనర్స్ చదువు పూర్తి చేసుకుని ‘ఆంధ్రప్రభ’లో ఉద్యోగానికి వారం వారం నీలంరాజు వేంకట శేషయ్యగారిని కలుస్తూండేవాడిని. విజయవాడలో మహీధర రామ మోహనరావుగారు సాహితీ సమావేశాలకు సంధానకర్త. సైకిలు మీద వచ్చి అందరి ఇళ్లకీ వెళ్లి మమ్మల్నందరినీ పేరు పేరునా సమావేశాలకు ఆహ్వానించేవారు. ఆ రోజు కొడవటిగంటి, శ్రీశ్రీ వచ్చారు. ఆనాటి సభలో నేనూ, ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు, అంగర సత్యనారాయణ రావు ప్రభృతులు ఉన్న జ్ఞాపకం. రజనీగారు అప్పుడు విజయవాడ రేడియోలో చేస్తున్నారు. వచ్చారు. అనర్గళంగా ‘మహాప్రస్థానం’లో కవితల్ని గానం చేశారు. 1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి - ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి - ఇలాగ. నా జీవితంలో అదృష్టం - తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను. వోలేటి పాడిన ద్విజావంతి రాగంలో రజని గీతం ‘మనసౌనే రాధా, మరల వేణువూద!’’ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాట వినగానే నా జ్ఞాపకాలు 55 ఏళ్లు వెనక్కి దూకుతాయి. రజని పాట ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ అన్నపాట ఇప్పటికీ పాడగలను. రేడియోలో ఎస్. వరలక్ష్మిగారు పాడారు. ఆవిడ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద. నిజానికి నా ముందుతరం హీరోయిన్. 35 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కనీసం నాలుగు చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించాం! ‘శ్రీవారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆవిడకి ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ పాటని గుర్తు చేశాను. ఆవిడకి జ్ఞాపకం రాలేదు. నాకు గుర్తున్నట్టు పాడి వినిపించాను. అది విని ఆమె నాకు మళ్లీ పాడారు. మంచి పాట, మంచి బాణీ, రజని సంగీతంలో జీవలక్షణం చిరంజీవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రజనిగారు 1940లో రేడియోలో ఆర్టిస్టుగా చేరారు. 1943లో ఆయన ఉద్యోగం రెగ్యులరైజ్ అయింది. 1978 వరకూ పనిచేసి స్టేషన్ డెరైక్టరుగా పదవీ విరమణ చేశారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదు. ఉద్యమం. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మద్రాసు కమాం డరన్ చీఫ్ రోడ్డులోఉన్న ఆకాశవాణి కేంద్రంలో దాదాపు అందరూ ఉన్నారు. పార్లమెంటులో నెహ్రూ ప్రసంగాన్ని వారూ పులకించిపోతూ విన్నారు. ఆనాడు రజని టంగుటూరి సూర్యకుమారి చేత ‘మాదీ స్వతంత్ర దేశం’ పాడించారు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రసారమైన మొదటి దేశభక్తిగేయం ఇది. ఎంతటి గౌరవం! అప్పుడు కేంద్రంలో బుచ్చిబాబు, అనౌన్సరు మల్లంపల్లి ఉమామహే శ్వరరావు మొదలైనవారంతా ఉన్నారు. ఏం రోజులవి? రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది. ఆ స్ఫూర్తితోనే మా తరం వారంతా పనిచేశాం. నాకు ఏనాడూ రేడియోలో నా జీతమెంతో తెలి సేది కాదు. తెల్లవారితే ఏ కొత్త పనిచెయ్యాలా అని ఆఫీసుకి దూకే వాళ్లం. 1963-68 మధ్య హైదరాబాదులో రేడియోలో ఉద్యోగం. నా పని డ్యూటీ ఆఫీసరు. ఒక సంఘటన బాగా గుర్తు. ఆ రోజు అయిదు గంటలకి ఇంటికి బయలుదేరుతున్నాను. స్టూడియోలో రజనిగారు, వేణుగాన విద్వాంసులు ఎన్.ఎన్. శ్రీనివాసన్గారూ - అంతా హడావిడి పడుతూ పరుగులు తీస్తున్నారు. పాటల రికార్డింగు మరో పక్క జరుగుతోంది. ‘బావొచ్చాడు’ నాటిక గ్రామస్తుల కార్యక్రమంలో (సాయంత్రం 6-20కి) ప్రసారం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వెళ్తున్న నన్ను ఆపారు. అప్పటికే ఆయన కంఠం మూగపోయింది. నన్ను పిలిచి కాగితం మీద రాశారు. ‘‘నీ మొహం రాగి చెంబులాగ ఉంటుంది. నా నాటికలో వేస్తావా?’’ అని. చేసేది రేడియో నాటిక. మొహానికీ దానికీ సంబంధం లేదు. ఆయన చమత్కారమది. ఏం వేషం? అందులో నా పాత్ర ‘బావ’. అంటే ప్రధాన పాత్ర. సంగీత రూపకానికి సంగీతం సమకూర్చినది రజనీకాంతరావుగారు. ఆశగా కూర్చున్నాను. కార్యక్రమం పాటతో ప్రారంభమైంది. అవుతూనే మరో పాట. పండగకి బావ ఇంటికి రావడం సందర్భం. పాటలు వేడివేడిగా వస్తున్నాయి. కాలం జరిగిపోతోంది.7 గంటలకి తెలుగులో వార్తలు. 6-55 అయిపోయింది. ఈ బావ ఎప్పుడొస్తాడు? దేవులపల్లివారిని అడిగాను. సన్నని చిరునవ్వు సమాధానం. 6-57 అయింది. నా చేతికి ఓ కాగితం మీద ఒక మాట రాసిచ్చారు దేవులపల్లి. ‘‘ఏమర్రా పిల్లలూ!’’ అన్నాను. అంతా ‘‘బావొచ్చాడు బావొచ్చాడు’’ అన్నారు. నాటిక అయిపోయింది! ఆ విధంగా రజని గారి సంగీత రూపకంలో ఒకే ఒక్కసారి నటించాను. నా షష్ఠిపూర్తికి ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ రజని గారు ప్రత్యేక సంచికలో వ్యాసం రాశారు. అంతటి మహానుభావులతో 50 ఏళ్లు నిలిచిన మధురమైన జ్ఞాపకం ఇది. నేను విజయవాడలో పనిచేసే నాటికి రజనీగారు ఉత్తర దేశంలో పనిచేసేవారు. నాకు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చి శంబల్పూర్ బదిలీ చేసేనాటికి విజయవాడ స్టేషన్ డెరైక్టరుగా వచ్చారు. అప్పటికి నేను సినీమాల్లో ముమ్మరంగా రచనలు చేస్తున్నా. సినీరంగ మిత్రులు నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని రజనీగారి గదిలోకి వెళ్లాను. కాగితం తీసుకు చదివారు. ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి కాగితాన్ని అడ్డంగా చింపేశారు. ‘‘శంబల్పూరు వెళ్లు. అక్కడి నుంచే రచనలు చెయ్యవచ్చు. నేను డిఫికల్టు స్టేషన్లలో పనిచేయబట్టే ఇక్కడికి రాగలిగాను. మరేం ఆలోచించకు. వెళ్లు’’అంటూ హితవు చెప్పారు. ఆయన కారణంగా వెళ్లాను. మరో పదేళ్లు రేడియోలో పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డెరైక్టరుగా ప్రమోషన్ తీసుకుని, కడప రేడియో స్టేషన్‌కి హెడ్డునయి, ఊహించని రీతిలో సినిమాల్లో నటించి, తొలి సినిమాకే స్టార్నై- అప్పుడు తప్పక రాజీనామా చేశా. మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలిసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితం. ఒక శతాబ్ద కాలం సంగీత సాహిత్యాలకు తనదయిన ప్రత్యేకతలను సంతరించిన వాగ్గేయకారులు రజనీగారు. ఆయన నూరేళ్ల జీవితం ఒక ఉద్యమం. ఆయన తరానికి దక్కిన అవకాశాలు మరే తరానికీ దక్కవు. ఓ మాధ్యమానికి ఊపిరి పోసి, ఓ దేశ స్వాతంత్య్రాన్ని చిరస్మరణీయం చేసి, సంగీతానికి నూరేళ్ల ఆయుష్షును పోసిన నిండు జీవితం రజనీగారిది. తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం. -
పాటకి రెక్కలొచ్చిన వేళ
ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ‘ఫ్యామిలీ’ ప్రత్యేకంగా అందిస్తున్న ఆత్మీయ వ్యాసాలివి. బాలాంత్రపు రజనీకాంతరావు పేరు చెబితే... ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే... రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణి కి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి... సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం కిందట విశాఖలో కె.రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది... ‘క్షితిజరేఖలపై వ్యాపిస్తూ...’ (ఎక్స్‌టెండింగ్ హొరైజన్స్) అనే శీర్షిక కింద నా గురించి నన్నే చెప్పమని ప్రప్రథమంగా ఇంగ్లండ్‌కు ఆహ్వానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. టంగుటూరి సూర్యకుమారిగారి భర్త హెరాల్డ్ కూడా ఇక్కడే ఉన్నారు. నాకెంతో ఆనందం కలిగించే విషయం ఇది. మా స్వగ్రామం పిఠాపురం చిన్న ఊరు. పక్కనే పెరుగుతున్న నగరంగా కాకినాడ ఉంది. అక్కడి నుండి నేను వాల్తేరు విశ్వవిద్యాలయం చదువులకు వెళ్లేసరికి క్షితిజ రేఖలు వ్యాపించినట్లు తోచింది. తరువాత జీవితంలో అనేక పెద్ద నగరాలలో పని చేశాను. పుట్టిన ఊరు, ఇంటిపట్టు పై బెంగలూ అవీ పోయి పరస్థలంలో జీవించడానికీ, కొత్త దినచర్యకీ అలవాటు పడ్డాను. జీవిక కోసం మద్రాసు వెళ్లాను. రేడియో స్టేషను పరిచయమయింది. విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ఈ స్థాయిలో పాడగలిగే స్థాయి నాకుండేది. నా చిన్నతనంలో ఎవరో పాడుతుంటే తాళం వేయడం - పాతకాలపు ‘కండక్టింగ్’ అంటారే - అది తెలుసు. 1941లో కాంట్రాక్టు పద్ధతిపై మద్రాసులో రేడియోలో కొన్ని సంగీత కార్యక్రమాలు చేశాను. రేడియోకి నా మొదటి నాటకం శ్రీశ్రీ రాసినదీ, ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించినదీ దాంట్లో పాల్గొన్నాను. తర్వాత ‘చండీదాసు’ అనే సంగీత నాటకం పూర్తిగా నేనే రాసి, సంగీతం సమకూర్చి నేనూ పాల్గొన్నాను. అందులో చండీదాసు పాత్ర వేసినది నేనే. దీనికి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు. అంటే పాటల్లో పాటకీ పాటకీ మధ్యలో ఉండే నేపథ్య సంగీతం ఆయన ఇచ్చాడు. బి.జి.ఎమ్ చేశాడన్నమాట. ఇది 1941 ఫిబ్రవరిలో. ఆ తరువాత కృష్ణశాస్త్రిగారి నాటకాలు ఒకటి, రెండు ఆ సంవత్సరంలోనే చేశాను. శర్మిష్ఠ అని ఒకటి. శర్మిష్ఠలో కొమ్మూరి పద్మావతి ఒక పాత్ర - దేవయాని పాత్ర - వేసింది. 1941 మార్చి 21 నాడు ఉగాది నాడు అది. అప్పట్లో బళ్ళారి రాఘవ గారితో ఆవిడ నాటకాలు వేస్తూ ఉండేవారు. ఈ నాటకంలో కృష్ణశాస్త్రిగారు యయాతిమహారాజు. దేవయాని వయోధికురాలైన రాజపత్ని. శర్మిష్ఠ -రాజు యొక్క యువపత్ని పాత్ర. టంగుటూరి సూర్యకుమారి వేశారు. గుర్తుందా, సూర్యకుమారిగారూ! (మీరు పాడితే గుర్తుకొస్తుంది అంటారు ఎదురుగా ఉన్న సూర్యకుమారి గారు. రజని ‘నవ నవ వసంత చలనముల లాస్యముల భవదమృత లావణ్యచరణ విలసమ్ము’ అంటూ పాడతారు). స్టూడియోలో వాద్య బందాన్ని నిర్వహించడం, 1-2-3 అని నేను చెప్పడం, వారు వాయించడం - ఈ ధోరణి అంతా ఒక వ్యసనంలా మనసుకి పట్టేసింది. మళ్లీ నేను రేడియోకి పోవాలి పోవాలి అని మనసు చెప్పినపుడు తపన కొద్దీ నేను రేడియోలో ఉద్యోగంలో చేరాను. అక్కడ లలిత సంగీతశాఖలో కార్యక్రమాల్లో ఈవిడ (సూర్యకుమారి) చేత అప్పుడప్పుడూ, ఒకొక్కసారి ఏడెనిమిది పాటలు, లేకపోతే రాజేశ్వరరావు చేత, అలాగే బాలసరస్వతి చేత కొన్ని పాటలు పాడించేవాడిని. నా పాటల్లో ఈవిడ (సూర్యకుమారి) పాడినన్ని పాటలు ఇంకెవరూ పాడలేదు. ఈవిడ ఇక్కడికి రావడం, పాడే ‘పెర్ఫార్మింగ్ సొసైటీ’ అని స్థాపించి సృజనాత్మక కార్యక్రమం చేస్తూండడం ఎంతో బావుంది. ఆవిడ చెప్పినట్లు ఈ కార్యక్రమాలకి నేను తప్పక సహకరిస్తాను. క్షితిజరేఖలు వ్యాపించటం అన్నారు కదా! ఉద్యోగ రీత్యా రేడియో స్టేషన్లు కర్సియాంగ్, డార్జిలింగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు - ఇలా దేశం అంతా తిరిగాను. ఇప్పుడు ఇక్కడ, కొన్ని వారాలలో అమెరికాలోనూ తెలుగు సోదరులను కలుస్తూ సంస్కృతీసంపర్క సమావేశాలలో పాటలు పాడుతుంటే వాళ్లకు తెలుస్తుంది. గుర్రం కళ్లేలు పట్టుకొని అల్లల్లాడి సవారీ చేస్తున్న వాడికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వాళ్లకు. మీరు వింటూ ఉంటే, మీ కళ్లకేసి చూస్తూ నేను సంగతులు వేస్తూ పాడుతుంటే, ఆ కళ్లెం లాటిది నా చేతుల్లో నా హృదయానికి తగుల్తూంటుంది. నా పాటల ద్వారా నా పాడడం ద్వారా గేలప్పింగ్ చేస్తూ పోతున్నట్లుంటుంది. (1984లో బ్రిమింగ్ హామ్ (లండన్)లో రజని తన పాటలు పాడిన సభలో యథాలాపంగా చెప్పిన రికార్డింగ్ నుండి) -
జింగిల్స్..జిల్జిల్ జిలా!
రికార్డు చేసిన సందేశాలతో ఓటర్లను ఆకట్టుకోనున్న బీజేపీ - ఫోన్లు, రేడియోల్లో ప్రసారానికి ఏర్పాట్లు - సుపరిపాలన ఇతివృత్తంగా సందేశాల ప్రచారం - సోషల్ మీడియా ప్రచారంలో తామే ముందున్నట్లు ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్ ఖేర్, హేమమాలిని, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో ఢిల్లీవాసులతో ఫోన్లో, రేడియోలో మాట్లాడనున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేసే జనాకర్షణ గల నేతల సందేశాలను రికార్డు చేసి ఢిల్లీలో ఓటర్లకు వినిపించడానికి ఢిల్లీ బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సుపరిపాలన అంశంపై ఢిల్లీవాసులకు ఈ నేతల సందేశాలను వినిపించి ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంపీలతో జరుపుతోన్న ప్రచారం ఈ నెల 20న ముగియనుండడంతో మరో తరహాలో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటోన్న బీజేపీ రేడియోలో, ఫోన్లో ముందే రికార్డు చేసిన సందే శాలు, జింగిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారంపై దృష్టి సారించనుంది. ఈ ప్రచారంలో తాము అసత్య వాగ్ధానాలు చేయబోమని, మోడీ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచుతామని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ చెప్పారు. ప్రచారం కోసం సుపరిపాలనను ఇతివృత్తంగా ఎంచుకున్న బీజేపీ గత ఆరు నెలల్లో కేంద్రం చేపట్టిన జన్‌ధన్ యోజన, స్మార్ట్ సిటీస్, వై-ఫై కనెక్టివిటీ ఇత్యాది అంశాలను ప్రచారం కోసం ఉపయోగించుకోనుంది. సోషల్ మీడియా ప్రచారంలో తమ పార్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందుందని ఉపాధ్యాయ చెప్పారు. ఆప్ ఫేస్ బుక్ పేజీకి రోజుకు 3 వేల లైక్స్ వస్తుండగా, తమకు పది వేల లైక్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం చేపట్టిన కార్యకమాన్ని డిసెంబర్ 20 తర్వాత మరింత ముమ్మరం చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంగళవారం వరకు కొత్తగా 16 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారని పార్టీ తెలిపింది. -
ఆ రేడియో అందరికీ కావాలి!
బాలీవుడ్ భామ అనుష్కశర్మ ఓ రేడియోపై మనసు పడ్డారు. ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనం ఏంటి? అదంటే అనుష్కకు ఎందుకంత ఇష్టం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌కు జోడీగా అనుష్క ‘పీకే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా రేడియోను అడ్డుపెట్టుకొని ఆమిర్ నగ్నంగా నిలబడ్డ స్టిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ స్టిల్ పుణ్యమా అనీ, ఆమిర్‌కు దీటుగా ఆ రేడియో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. కథలో ఆ రేడియోది కీలక పాత్ర అట. ప్రచారంలో కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమదే. ఒక జ్ఞాపకంగా ఆ రేడియోను తన వద్దే దాచుకోవాలని భావించారట ఈ ముద్దుగుమ్మ. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, కథానాయ కుడు ఆమీర్ఖాన్ల ముందు తన కోరిక చెప్పారట అనుష్క. అయితే... వాళ్లిద్దరూ ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ హిరానీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అనుష్క ఆ రేడియా అడిగిన మాట నిజం. అయితే... ఆమెలాగే... మేము కూడా దానిపై మమకారం పెంచుకున్నాం. దాన్ని గుర్తుగా దాచుకోవాలని ఆమిర్‌కీ, నాకూ కూడా ఉంది’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్. ఇంతమంది మనసు దోచిన ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే... ‘పీకే’ వచ్చేదాకా ఆగాలి. -
జానీ బామ్మకు జోహారు
నివాళి ఆకాశవాణి ఉద్యోగులకు, శ్రోతలకు ‘రేడియో అక్కయ్య’గానూ మా పిల్లలకు ‘జానీబామ్మ’గానూ ఎంతో ఆత్మీయురాలైన తురగా జానకీరాణిని తలచుకుంటే మిగిలేవన్నీ అందమైన జ్ఞాపకాలే. చిరునవ్వుల సంభాషణలే. 1977లో తెలుగు యువవాణిలో తాత్కాలిక అనౌన్సర్‌గా చేరిన నాటి నుంచి నాకు ఆమెతో పరిచయం. అలుపెరగని శ్రమజీవి, అపారమైన మనోనిబ్బరం ఉన్న వ్యక్తి ఆమె. భర్త తురగా కృష్ణమోహనరావుగారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కూడగట్టుకున్న ధైర్యం, మొన్నటికి మొన్న తన పెద్దమ్మాయి ఉషారమణి భర్త నరేందర్ చనిపోయేవరకూ ఆమెను వీడలేదు. ఎన్నో అనారోగ్యాలున్నా మనసుకు మరెన్నో గాయాలున్నా హుషారుకు మారుపేరుగా అందరికీ కనిపించారంటే అదంతా ఆమె సంకల్ప బలమే. జానకీరాణి గురించి ఎక్కువమందికి తెలిసింది ఆమె మంచి కథారచయిత్రి అని. మంచి రేడియో ప్రయోక్త అని. కాని ఆమెకు ఇంగ్లిష్‌లో అపారమైన పాండిత్యం ఉందనీ ఆమె చక్కని నర్తకి అని చాలామందికి తెలీదు. ఆమెకు నాయకత్వ లక్షణాలు మెండు. ఆ రోజుల్లోనే హైదరాబాద్‌లో ఏర్పడిన రచయిత్రుల సంఘం ‘సఖ్యసాహితి’కి ఆమె అధ్యక్షురాలిగా పని చేశారు. రచయిత్రులను కూడగట్టి చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించారు. చలం మనమరాలిగా పుట్టినందుకు ఆనందించినా, ‘మా తాతయ్య చలం’ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా రాసుకున్నా తనను వేదికపై పరిచయం చేసేటప్పుడు ‘చలం మనమరాలు’ అని అభివర్ణిస్తే చిరాకు పడేవారు. తన అస్తిత్వం తనదే. దానికి మరొకరి ‘గోడ చేర్పు’ అవసరం లేదని ఆమె భావన. అయితే పిల్లల కోసం ఎక్కువ పని చేయడం వల్లనో ఏమో అపుడపుడూ ఆవిడలోనూ ఇంకా పసితనం పోలేదని అనిపించేది. పిల్లలంటే ఆమెకు ఎంత ఇష్టమంటే వారి హక్కుల కోసం ‘బాలవాదం’ రావాలని గట్టిగా వాదించేవారు. ‘బంగారు పిలక’, ‘బి.నందంగారి ఆస్పత్రి’, ‘మిఠాయి పొట్లం’ వంటి పుస్తకాలను పిల్లల కోసం వెలువరించడం ఎంత నిజమో నిజ జీవితంలో కూడా అలగడం, మారాం చెయ్యడం, చిన్న చిన్న కోరికలను కనడం, పెంకిగా ప్రవర్తించడం- అంతే నిజం. జానకీరాణిగారి సన్నిహితులు ఆమె కంటే చిన్నవారైనా ఆమె బాల్యాన్ని ‘చూడ’గలిగారు. అయితే కథలు రాసేటప్పుడు ఈ పసితనం మాయమయ్యి ఆమెలోని చైతన్యమూర్తి అందునా చైతన్యంతో నిండిన స్త్రీమూర్తి కనిపించేది. ఆమె కథాశిల్పం చాలా వేగవంతమైనది. చదివించే గుణం కలిగినది. మధ్యతరగతి జీవితాల్లోని స్త్రీల నలుగుబాటును ఆమె చాలా సూక్ష్మపరిశీలనతో చేశారనిపిస్తుంది. కథలు రాసినా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి యూనిసెఫ్ వరకూ పని చేసినా జానకీరాణి తాను చేపట్టిన ప్రతి పనినీ చక్కని ప్రతిభతో పట్టుదలతో చేసి చూపించారు. తనకు తెలిసిన కళలలో అంటే రచన ద్వారా, ఆడియో మాధ్యమం ద్వారా పిల్లల కోసం, స్త్రీల కోసం తను చేయగలిగినదంతా చేశారు. లోక్‌సత్తా పార్టీ సభ్యత్వం ద్వారా తన రాజకీయ సత్తాను కూడా నిరూపించుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని విషాదాలకు ఆమెకు కొరతేమీ లేదు. కానీ అవేవీ ఆమె ఆలోచనలకు ఆటంకాలు కాలేదు. ఆమెలోని సెన్సాఫ్ హ్యూమర్ తన కష్టాలనూ తనను చుట్టుముట్టిన సంఘటనలనూ నిర్లిప్తతతో చూసేలా చేసేది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఆమెకు సహజలక్షణం. జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించాలనీ అనారోగ్యం అసౌకర్యం పేరిట తనకిష్టమైన పనులేవీ మానుకోకూడదనీ చెప్పడమే కాదు చేసి చూపించిన అపురూప వ్యక్తిత్వం ఆమెది. పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు, పుస్తకావిష్కరణ కావచ్చు, ఊరికనే రచయితలు కలిసే సభ కావచ్చు, తనకు అందులో ఏ పాత్రా ఏ ప్రాముఖ్యమూ లేకపోవచ్చు. అయినా ఆమె హాజరైపోయేవారు. మిత్రులను కలుసుకోవాలన్నా పది మందితో మంచీ చెడ్డా మాట్లాడుకోవాలన్నా ఆమెకెంత ఇష్టమో. జీవితాన్ని ప్రతిక్షణమూ తనకిష్టమైన విధంగా గడపడానికి ప్రయత్నించడం అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం. దానికి ఆవిడ ఆరోగ్యం సహకరించకపోయినా ఇంటి పరిస్థితులు అనుకూలించకపోయినా ఆమెలో తడబాటు లేదు. నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదు. నాకూ జానకీరాణిగారికీ మధ్య ఉన్నది ఒక విలక్షణమైన అనుబంధం. యువవాణి అనౌన్సర్‌గా నన్ను, నా కంఠస్వరాన్ని మెచ్చుకుంటూనే ‘ఆ వేగం ఏమిటి? కాస్త నెమ్మదిగా మాట్లాడలేవూ. శ్రోతలు చస్తారు నిన్ను అర్థం చేసుకోవడానికి’ అని తొలిరోజుల్లో మందలించినా ఆ తర్వాత 20 ఏళ్లకు కాబోలు ‘మా ఆయన పేరు మీద పెట్టిన అవార్డుకు నీ కంటే అర్హులు లేరు’ అంటూ తురగా కృష్ణమోహనరావుగారి అవార్డు నాకు ఇచ్చినా, కొన్ని నెలల క్రితం ఒక పెళ్లిలో నేను ఆమెకు ప్లేటులో భోజనం తెచ్చి ఇచ్చి తినేవరకూ పక్కనే కూర్చున్నప్పుడు ‘నువ్వు నాకుతెచ్చి పెట్టడమేమిటి? నేను తెచ్చుకోగలను’ అని నన్ను కసురుకున్నా నెలకోసారి తప్పక నాకు ఫోన్ చేసి, పలకరించి, నా పిల్లల గురించి ముచ్చటించినా మా మధ్య ఒక ఆత్మీయబంధం. నెలరోజుల క్రితం అనుకుంటా జానకీరాణిగారు నాకు ఫోన్ చేసి ‘నా కథలన్నీ కలిపి సంపుటం వేశాను. నీకు పంపానా?’ అని అడిగారు. లేదన్నాను. ఆవిష్కరణ సభ జరిగినట్టు పేపర్లో చూశానన్నాను. ‘ఆ సభకు నిన్ను పిలవాల్సింది. అందరూ బాగానే మాట్లాడారుగాని నా పుస్తకం గురించి కాదు. నాకు కావలసింది నా కథలు ఎలా ఉన్నాయని. నువ్వయితే విశ్లేషణ బాగా చేసేదానివి. నీకు నా పుస్తకం పంపుతాను. చదివి తెలుగులో కాదు ఇంగ్లిష్‌లో రివ్యూ రాయి. ఇండియన్ లిటరేచర్‌కు పంపు’ అని ఆదేశించారు. తప్పక చేస్తానని అన్నాను. నేనే పుస్తకం కొనుక్కుంటానని రెండు సార్లయినా అనుంటాను. ‘నువ్వ కొనుక్కోవడమేమిటి? నేను పంపుతాను’ అన్నారు. ఇంతవరకూ ఆమె పంపలేదు. పంపలేకపోయారు. నేను రివ్యూ ఇంకా రాయలేదు. మన్నించు జానీ బామ్మా. ఇప్పటికి నేను రివ్యూ రాయొచ్చు. రాస్తాను కూడా. కానీ మీరు చదవరుగా? - మృణాళిని -
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...
తురగా జానకీరాణి... ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త... ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి... చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు... బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం... ప్రొడ్యూసర్‌గా పదవీ విరమణ... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు... జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ... ఆ స్పర్శ చల్లగా ఉంది... నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు. వివాహ బంధం... నా 12వ ఏట తురగా కృష్ణమోహన్‌గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్‌మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో చేరి పదిహేనేళ్లు పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను. మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా ... 1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్‌కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్‌తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు. వందేమాతరం... ‘ఆనంద్‌మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78. అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు. - డా॥వైజయంతి తాతగారి ఆశీస్సులే కారణం... చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది. కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు. మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి. ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’ అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు. -
సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!
గ్రంథపు చెక్క మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా. ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం. సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు. ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది.. - ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’ పుస్తకం నుంచి. -
జీవితం నేర్పే పాఠాలు
ఆకాశవాణి, దూరదర్శన్లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ అనంతరం మాత్రం పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్ని రోజులు తెల్లవారుఝామునే తయారు కావాల్సి వస్తోంది. నేనైతే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నా కాని, నన్ను స్టూడియోలకు తీసుకువెళ్లడానికి వచ్చే ఛానెల్ కారుడ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి, ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. వీళ్లలో రకరకాల వయస్సు వాళ్లు ఉంటారు. పొరుగుజిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి, స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని, బతుకుబండి లాగించేవాళ్లే ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను అనుకోలేదు. వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. కొందరు ‘‘ఎందుకు సార్, మా డ్యూటీ మేం చేస్తున్నాం’’ అని మృదువుగా అనేవారు. కొంతకాలం క్రితం ఓ స్టూడియో నుంచి తిరిగొస్తూ, కూడలి వద్ద సిగ్నల్ పడ్డప్పుడు పర్స్ తీసి డ్రైవర్‌కు పది నోటు తీసిచ్చాను. అతగాడు ఆ నోటు జేబులో పెట్టుకోకుండా, ఒకచోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ముసలి బిచ్చగత్తె చేతిలో పెట్టాడు. అది చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా ‘మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచైనా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే నీకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడమే కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకో కండి’’ అన్నాడు. అనుకోవడానికి ఏముంది, ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను. - భండారు శ్రీనివాసరావు హైదరాబాద్ -
చైతన్యం ఇలా..
ఓ మహిళ చేతిలో కెమెరా ఉంటే... ఊళ్లోకి నీళ్లొస్తాయి. ఓ మహిళ రేడియో మైకు ముందు నిలబడితే... బడి మానేసిన పిల్లలు బడిబాట పడతారు. ఓ మహిళ చేతిలో కాగితం, కలం ఉంటే... నాలుగ్గోడల మధ్య నలిగే మహిళ కడగండ్లకు ఊరట కలుగుతుంది. ఇది నిజమా! అంటే... నిజంగా నిజమేనని ఆధారాలు చూపిస్తారు గుజరాత్ మహిళలు. అది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరాన ఉన్న మణిపూర్ గ్రామం. అక్కడ ‘రుడి నో రేడియో’ అనే కమ్యూనిటీ రేడియో కేంద్రం ఉంది. వర్ష, జైమిని, విద్య, జల్పలతోపాటు అనేక మంది మహిళలు అక్కడ తమ తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వర్ష ఆ రేడియో ప్రసారాలకు వ్యాఖ్యాత. జల్ప స్థానిక జానపదాలను గానం చేసే గాయని. విద్య ఈ కార్యక్రమాలను రూపొందిస్తారు. జైమిని ఈ ప్రసారాలకు కావల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. వీరందరి కంటే ఎక్కువగా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న మహిళ దమయంతి. ఆమె జాతీయ మహిళా పాత్రికేయుల సదస్సును (ఎన్డబ్ల్యుఎమ్ఐ) వీడియో కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఒక జాతీయస్థాయి కార్యక్రమాన్ని సామాన్య గ్రామీణ మహిళ అధునాతనమైన కెమెరాతో సమర్థవంతంగా చిత్రీకరిస్తున్నారు. వీడియో కూర్పులో కూడా ఆమె నేర్పరి. అందరూ మహిళలే! ‘రుడి నో రేడియో’ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ అంతా మహిళలే చూసుకుంటారు. అయితే... అసలు విషయం ఇది మాత్రమే కాదు. ఈ మహిళల్లో ఎవరూ పెద్ద చదువులు చదవలేదు. ఇంటి పనులు, వ్యవసాయ పనులను యథావిధిగా కొనసాగిస్తూ, రేడియో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారెంచుకున్న మాధ్యమే ఈ కమ్యూనిటీ రేడియో, వీడియో కార్యక్రమాలు. ‘పది వాక్యాల్లో చెప్పలేని ఓ విషయాన్ని ఒక్క బొమ్మ ఇట్టే వివరిస్తుంది’- అంటున్నారు. శక్తిమంతమైన మాధ్యమం! మణిపూర్ గ్రామంతోపాటు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించింది ఈ కెమెరానే అంటారు కెమెరా ఉమన్ దమయంతి. ‘‘ ఊరి చివరన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని మోయాల్సి వచ్చేది. నీటి సౌకర్యం కల్పించమని గ్రామపెద్దను కోరాం. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో ఒక రోజు నా కెమెరాకు పని చెప్పాను. అంతే! మా గ్రామానికి కుళాయిలు వచ్చేశాయి’’ అన్నారామె నవ్వుతూ. ఇంతకీ వారు ఏం చేశారంటే... తెల్లవారు జాము నుంచి మహిళలు నీటిని మోయడాన్ని చిత్రీకరించి స్థానిక కేబుల్ ద్వారా ప్రసారం చేశారు. ఆ ప్రసారాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరడంతో సమస్య తీరింది. సంఘటితంగా పని చేస్తే... ఇలా భట్ అనే సామాజిక సంస్కర్త ‘సేవ’ అనే వేదిక ద్వారా ఇచ్చిన ఆసరాతో ఈ మహిళలు చైతన్యవంతమయ్యారు. ఆ ఆసరాతో తమ జీవితాలకు ఒక రూపు తెచ్చుకుంటున్నారు. ‘ఇలా’ సేవకు గుర్తింపు! పద్మభూషణ్ (1986), పద్మశ్రీ(1985) రైట్ టు లైవ్లీ హుడ్ అవార్డు(1984) పార్లమెంట్ సభ్యురాలు (1986 - 1989) హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్, ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ( 2001) కుటుంబం... భర్త రమేశ్‌భట్, అమ్మాయి అమిమాయి, అబ్బాయి మిహిర్. అహ్మదాబాద్‌లో నివాసం .ఆమె రాసిన పుస్తకం...‘వియ్ ఆర్ పూర్ బట్ సో మెనీ...’. ఇది సేవా సంస్థలో స్వయంసాధికారత సాధించిన మహిళల జీవితాల ఆధారంగా సాగిన కథనం. -
ఆకాశవాణిలో.. మోడీ వాణి..!
-
తొలిసారి రేడియోలో మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించారు. 'మన్ కీ బాత్' (మనసులో మాట) పేరుతో ఆయన ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజుగా ఆయన అభివర్ణించారు. నెలకోసారి, లేదా రెండుసార్లు ఆదివారం రేడియోలో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. మన శక్తి సామర్థ్యాలు అపారమైనవని మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో లో అందరూ పాల్గొనాలని, ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే ఖాదీ ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే పేదల ఇళ్లల్లో ప్రగతి దీపం వెలిగించినట్లేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రేడియో కేంద్రాల్లో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం కానుంది. -
భలే ఆప్స్
బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్... బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎక్కువకాలం పనిచేయించేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ బ్యాటరీ మరింత ఎక్కువ కాలం మన్నేలా చేయలేవు. కానీ పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఛార్లీ హూ అభివృద్ధి చేసిన ఎస్టార్ అప్లికేషన్ మాత్రం బ్యాటరీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న, లేదా చేసుకోబోతున్న అప్లికేషన్లు ఎంత మేరకు విద్యుత్తు ఖర్చు చేస్తాయో ఎప్పటికప్పుడు లెక్కకట్టి మీకు తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఛార్లీ. ఈ సమాచారం ఆధారంగా మీరు ఎక్కువ విద్యుత్తును వాడుకునే అప్లికేషన్లను తొలగించుకోవచ్చు. ఎస్టార్ సూచించే పొదుపైన ఆప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేసి, బ్యాటరీ ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చునన్నమాట. ఇవన్నీ చేస్తే బ్యాటరీ జీవితకాలం కూడా పెరిగిపోతుందన్నది తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఎస్టార్లో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను పోలిన కోడింగ్ ఉంటుంది. ఆన్లైన్ మ్యూజిక్, రేడియో కోసం వింక్స్.. ప్రముఖ సెల్‌ఫోన్ క్యారియర్ సంస్థ ఎయిర్టెల్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. వింక్స్ పేరుతో ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఐఫోన్లలో ఈ అప్ ద్వారా సంగీతాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్టెల్ కనెక్షన్ లేకున్నా ఉచితంగా పాటలను వినే అవకాశం ఉండటం విశేషం. ఈ సర్వీసులో దాదాపు ఎనిమిది భాషలకు సంబంధించిన 17 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వినే పాటల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారికి ప్రస్తుతం రెండు రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. వింక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా, వింక్ ఫ్రీడమ్ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఆర్టిస్ట్, మూడ్స్, జెనెర్ విభాగాల్లో లభ్యమయ్యే పాటలను 32, 64, 128 కేబీపీఎస్ నాణ్యత ప్రమాణాల్లో వినే అవకాశం ఉంది. -
గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. స్వరమే అసలైన పెట్టుబడి టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి. అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే. వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది. వాయిస్, డిక్షన్‌తో రాణింపు ‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్లో ఎదిగేందుకు వీలుంటుంది’’ -రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే -
మూడు దేశాల ముద్దుబిడ్డ
బాల్యంలో తల్లి చెప్పే రామాయణ భారత గాథలు విన్నారు ఆనందాదేవి.. పెద్దయ్యాక కూడా వాటిని మర్చిపోలేదు...వాటినుంచి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు...ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తన జ్ఞానపరిధిని పెంచుకున్నారు... మనిషికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలను తన కథలకు ప్రధానాంశంగా చేసుకున్నారు... రచనలలో భిన్న సంస్కృతులను చూపారు... భావవ్యక్తీకరణలో కొత్తకోణం ఆవిష్కరించారు...విమర్శకుల ప్రశంసలనందుకుంటూనే అనేక అవార్డులను గెలుచుకున్న ఆనందాదేవిమారిషస్లో పుట్టి, ఫ్రెంచ్‌లో రచనలు చేసిన అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఆశ్చర్యమే! మారిషస్‌లోని ఆనందాదేవి ఇల్లు, చెరుకుతోట మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె ఇంకా ఆహ్లాదకరమైన పుస్తకాలెన్నో చదివారు. ఆడుకోవడానికి చెల్లి తప్ప ఆ రోజుల్లో రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు లేవు. అయితే ఆ ఇంటి లైబ్రరీలో ఆర్థర్ కోనన్డోయ్లే, అగాథా క్రిస్టీ వంటి రచయితల రచనలు, 1001 నైట్స్ అండ్ బౌడేలైర్... వంటి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లితండ్రులకు పుస్తకాలే ప్రాణం! బహుశ పుస్తకాలు చదివే అలవాటు వారి దగ్గర నుంచే అబ్బి ఉంటుంది. మనసుతోనే ప్రయాణం... భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పెరిగిన ఆనందాదేవి, తన ఏడవ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. 15 వ ఏట రచించిన చిన్న కథకు, ‘రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్నారు. ‘‘ప్రపంచంలో ఏయే ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి టైమ్ అట్లాస్ చూసేదానిని. నేను రాసే కథలలో అట్లాస్ చూస్తూ ఆయా ప్రాంతాలకు నా మనసుతో ప్రయాణిస్తుంటాను. నేను ఫ్రెంచ్‌లో రాస్తున్నప్పటికీ నాలో, నా రచనలలో భారతీయత ఉంటుంది. ఇప్పటికే నా రచనలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి... ’’ అంటారు. భాషల మాటకారి... దేవి రచనలు ఫ్రెంచిభాషలో ఉంటాయి కాని, ఆమె పలు భాషలు మాట్లాడగలరు. ‘‘నాకు తెలుగు, క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురి, హిందీ భాషలు వచ్చు. ఎవరైనా నన్ను ‘మీరు ఏ భాషలో ఆలోచిస్తారు?’ అని ప్రశ్నిస్తే, ‘‘ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో ఆలోచిస్తాను. ’’ అంటారు ఆమె. రచనలు... ఆనందాదేవి రచనలలో అనేక సామాజిక అంశాలు ప్రతిబింబిస్తాయి. స్త్రీల గురించి, అనేక సామాజిక రుగ్మతల గురించి, అంగవైకల్యం, వ్యభిచారం, వృద్ధాప్యం, స్వలింగ సంపర్కం... వంటి ఎన్నో అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. ఇంకా... చిన్నకథలు, నవలలు రాస్తూ, అనువాదాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. సాహిత్యం అనేది భాషాభేదం లేకుండా, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువైనదనే విషయాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలకత్తాలో... కలకత్తాలో ఉన్నప్పుడు కొన్నిరోజులపాటు కొందరు వేశ్యలను దగ్గరగా గమనించారు ఆనంద. ఈ విషయం చెబుతూ, ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాల మీద వారికి స్వేచ్ఛ ఉండదనిపించింది. ఈ విషయంలో ఆడపిల్లల కంటె మగపిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలనిపించింది. వారికి స్త్రీలను గౌరవించడం నేర్పాలని నేను చెప్పినప్పుడు, చాలామంది న్యాయమూర్తులు, రాజకీయనాయకులు నన్ను విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు ఆనందాదేవి. ముగింపు పాఠకులకే! ‘‘రచయిత పురుషుడైతే, ఇంటికి వెళ్లగానే, తనను డిస్టర్బ్ చేయవద్దని, తాను రాసుకోవాలని చెప్పగలుగుతాడు. స్త్రీకి అలా కుదరదు. ఇంటికి వెళ్లి అన్ని పనులూ చేసుకుని, పిల్లలకు కావలసినవన్నీ చూసి, ఆ తరువాత సమయం, ఓపిక... ఉంటేనే రాసుకుంటారు. అంతేగాని, ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను రాసుకుంటున్నాను’ అనే అర్హత ఆమెకు ఉండదు కదా!’’ అంటారు ఆనంద. ఇంకా... ‘‘రచనలు చేయడమంటే పాఠకులను చాలెంజ్ చేయడమే. ఒక రచన చేస్తే, అందులోకి పాఠకుడు ప్రవేశించాలి. పాఠకులతో సున్నితంగా ఆడుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే ముగింపు ఒక్కోసారి పాఠకులకే వదిలేస్తుంటాను. నా తాజా నవల ‘లెస్ జోర్స్ వివంత్స్ (ద లివింగ్ డేస్), నవల ముగింపును పాఠకులకే వదిలేశాను’’ అన్నారు, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆనందాదేవి. అయితే సమస్యలను మాత్రం ఆమె అలా గాలికి వదిలేయలేదు. తనకు చేతనైన పరిష్కారాలను సూచిస్తుంటారు. బహుశ ఆ అలవాటే ఆమె పురస్కారాలు అందుకోవడానికి అర్హురాలిని చేసి ఉండవచ్చు! గుర్తింపు లేకపోవడమే మంచిది... నన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది మారిషస్. అయినప్పటికీ నేను నా రచనలు చేసేటప్పుడు నేను మారిషస్ స్త్రీని అనుకోను. నేను కంప్యూటర్ ముందు కూర్చునే ఒక ప్రాణిని. ఒక్కోసారి పెన్ పేపరు పుచ్చుకునే ప్రాణిని. కథలు రాస్తూ, నాకు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాను. రచయితగా నాకొక గుర్తింపు లేకపోవడాన్ని, లేదనుకోవడాన్ని నేను ఇష్టపడతాను. కొత్తకొత్త వ్యక్తుల మస్తిష్కంలో నన్ను నేను ఆవిష్కరించుకోగలను... వారిలాగ ఆలోచిస్తూ, వారిలాగ ఉంటూ... - ఆనందాదేవి -
సంగీత, సాహితీ దిగ్గజాల వాణి
కొత్త పుస్తకం ఇన్ని పత్రికలు, టీవీ చానళ్ళు లేని రోజుల్లో నిరక్షరాస్యులకు సైతం విజ్ఞానానికీ, వినోదానికీ రేడియోనే ఏకైక సాధనం. స్వతంత్ర భారతావని తొలినాళ్ళకు చెందిన తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రముఖులందరికీ ఆకాశవాణి కేంద్రమే చలువ పందిరి. ఆ కార్యక్రమాలన్నీ కొన్ని తరాలను ప్రభావితం చేసినవే. అయిదు దశాబ్దాలుగా రేడియోతో అనుబంధమున్న అనంత పద్మనాభరావు అక్షర రూపమిచ్చిన ‘అలనాటి ఆకాశవాణి’ కబుర్ల నుంచి కొన్ని జ్ఞాపకాలు... తెలుగు ప్రసారాలు ప్రారంభమై 76 సంవత్సరాలైంది. ఆకాశవాణి మదరాసు కేంద్రం 1938 జూన్ 1న మొదలైంది. అవిభక్త మదరాసు రాష్ట్ర రాజధాని నగరం చెన్నపట్టణం. అందువల్ల తెలుగు ప్రసారాలు అక్కడి నుండి జరిగేవి. ఎగ్మూర్‌లోని మార్షల్ రోడ్లో ఈస్ట్నూక్స్ మేడపై డాబా గదుల్లో రేడియో స్టేషన్ పెట్టడానికి వడ్రంగి పనులు, తాపీ పనులు చేసి స్టూడియో నిర్మాణం చేసి ఆస్బెస్టాస్ షీట్లు అమర్చారు. అది చూసిన వ్యక్తి డా॥బాలాంత్రపు రజనీకాంతరావు మనకు సజీవ సాక్షి. అప్పట్లో విద్యార్థి అయిన ఆయన తర్వాత అదే కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరడం చరిత్రలో భాగం. జూన్ 1న మదరాసు కేంద్రం నుండి ప్రసారమైన తొలి తెలుగు రేడియో నాటకం అనార్కలి. మొగలాయి వాతావరణం సృష్టించడానికి (శ్రవ్యమే అయినా) ఆ డాబా మీద గుండ్రని దిండ్లు, హుక్కాగొట్టాలను పెట్టుకొని దేవులపల్లి కృష్ణశాస్త్రి సలీంగా నటించారు. నలుగురు రచయితల నాటకాల ఆధారంగా ఆచంట జానకీరామ్ రేడియో స్క్రిప్టు ఏర్చికూర్చారు. మదరాసు కేంద్రం ప్రారంభించిన సరిగ్గా 10 సంవత్సరాలకు 1948 డిసెంబర్1న విజయవాడ స్టేషన్ ప్రారంభించారు. ప్రసారాలు అప్పట్లో సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు మొదలయ్యేవి. విజయవాడ కేంద్ర విశిష్టత పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు వంటివారు పనిచేయడం. ‘రజని’ డెరైక్టర్‌గా పనిచేసిన 1971-76 మధ్యకాలం స్వర్ణయుగం. అప్పుడు విజయవాడ కేంద్రంలో ఎందరో సంగీత మూర్తులు. అక్కడ పనిచేసిన మల్లిక్ ‘అదిగో అల్లదివో..’, ‘తందనాన అహి..’ అనే అన్నమయ్య కీర్తనలకు స్వరరచన చేశారని చాలామందికి తెలియదు. భద్రాద్రి రామయ్య కల్యాణం తెలుగునాట ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేసే ప్రత్యక్ష వ్యాఖ్యాన కార్యక్రమాలలో భద్రాచలం నుండి శ్రీరామనవమినాడు ప్రసారమయ్యే సీతారామచంద్ర కల్యాణం ప్రధానం. 1970 దశకంలో ఈ వ్యాఖ్యానాల కోసం శ్రోతలు ఉవ్విళ్లూరేవారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ పండితుడు రైలు దిగి రిక్షా వ్యక్తిని తమ ఇంటికి రమ్మని పిలిచారు. అతడు ఆ పండితుణ్ణి రిక్షా ఎక్కించుకొని మాటలు కలుపుతూ ఇరవై నిమిషాల్లో వారి ఇంటి వద్ద దించాడు. ఆ వ్యక్తి పది రూపాయలు తీసి రిక్షావాడి చేతుల్లో పెట్టారు. ‘వద్దు స్వామీ! భద్రాచల సీతారాముల్ని మా కళ్ల ముందు కనిపించేలా మీరు మాటలు చెప్పారు. డబ్బులు ఉంచండి స్వామీ!’ అని వెళ్లిపోయాడు. ఆ పండితుడెవరో కాదు - జమ్మలమడక మాధవరామశర్మ. కడప జ్ఞాపకాలు కడపలో కవి సమ్మేళనానికి ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, దాశరథి, పురిపండా, పుట్టపర్తి వంటి ప్రసిద్ధుల్ని ఆహ్వానించాం. ఎమర్జెన్సీ రోజులు. అందుకని ముందుగానే కవుల కవితల్ని చిత్రిక పట్టాము. ప్రభుత్వ వ్యతిరేక పదజాలాన్ని జల్లెడపట్టాం. శ్రీశ్రీ కవితలల్లలేదు. ‘‘ఇదుగో! అదుగో!’’ అంటూ హోటల్ గదిలోనే కాలక్షేపం చేస్తూ ఊరించారు. మాస్ అపీల్ కోసం సభలో శ్రీశ్రీని చివరి కవిగా వుంచాం. 10 నిమిషాల ముందు వారి వెనుకగా నుంచొని ‘‘కవిత!’’ అన్నాను మంద్ర స్వరంలో. ‘చెప్తాగా!’ అంటూ దాటవేశారు శ్రీశ్రీ. చివరిగా లేచి,‘మనదేమో నంబర్ వన్ డెమోక్రసీ/ఇదంతా హిపోక్రసీ’ అంటూ తూటాలు పేల్చారు. సభ చప్పట్లతో మారుమ్రోగింది. అలనాటి ఆకాశవాణి డా. ఆర్. అనంతపద్మనాభరావు, ప్రతులకు: రచయిత, బి 408, సాయికృపా రెసిడెన్సీ, మోతీనగర్, హైదరాబాద్. ఫోన్: 040-23831112 పేజీలు: 200, వెల: రూ. 180. -
చెన్నపట్నం తొలి తెలుగు ‘వాణి’
మద్రాసు ఆకాశవాణి తెలుగువారి తొలినాటి రేడియో ప్రసారాలను వెలువరించిన కేంద్రం. తెలుగునాట సరళమైన వార్తా భాష స్థిరపడటానికి మద్రాసు ఆకాశవాణి కేంద్రం చేసిన కృషి ఎనలేనిది. ‘‘నేనిప్పుడు చెన్నపట్టణం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడి నుంచి వినుచున్నరో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వినుచున్నారని తలచుచున్నాను’’ అంటూ 1938 జూన్ 16 వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కుర్మా వెంకటరెడ్డి ‘భారతదేశం - రేడియో’ అనే అం శంపై ప్రసంగించారు. అది మద్రాసు రేడియో కేంద్రం మొదలైన రోజు. అవి అక్కడి నుంచి వినిపించిన తొలి తెలుగు పలుకులు. వెంకటరెడ్డి 1937 ఏప్రిల్ 1 నుంచి జూలై 14 దాకా నాటి మద్రాసు రాష్ట్ర ప్రధానిగా అంటే ముఖ్యమంత్రిగా పని చేసినవారు. త్యాగరాజుల వారి తెలుగు కృతిని వెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా ఈ కేంద్రం ప్రసారాలను ప్రారంభించింది. పిమ్మట అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి ఆంగ్లంలో ప్రా రంభోపన్యాసం చేశారు. అప్పటికి ఆకాశవాణి అనే మాటను అధికారికంగా వాడ లేదు, రేడియోకు పర్యాయపదంగా వాడారు. రాజాజీ తన ఉపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రసార వాహికగా మద్రాసు రేడియో పుట్టుకతోనే తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగువాడైన సి.వి. కృష్ణస్వామిసెట్టి ప్రారంభించిన మద్రాసు ప్రెసిడెన్సీ క్లబ్ 1924 జూలై 31 నుంచి కొంత కాలం ప్రసారాలను నిర్వహించింది. అది మూతపడ్డాక 1930లో మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కానీ అవీ ఎంతో కాలం సాగలేదు. ఇంతలో 1933లో హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో మహబూబ్ ఆలీ అనే తపాలా శాఖ ఉద్యోగి 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రం ప్రారంభించారు. 1935 నుంచి నిజాం నిర్వహణలోకి పోయిన ఆ కేంద్రం కార్యక్రమాలు ఉర్దూలో ఉండేవి. ఆ కేంద్రమే 1939 జూలై నుంచి దక్కన్ రేడియోగా మారింది. కనుక 1938 జూన్ 16వ తేదీని తెలుగు ఆకాశవాణి జన్మదినంగా పరిగణించాల్సి ఉంటుంది. మద్రాసు కేంద్రం నుంచి తెలుగు ప్రసారాలే ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తొలి రోజులనాటి ఆ ప్రసారాలను గురించి ఆచంట జానకిరామ్ ఆత్మకథ ‘సాగుతున్నయాత్ర’లో కళాత్మకంగా, సవివ రంగా వర్ణించారు. ఆచంట జానకిరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణమూర్తి మద్రాసు ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలకు చాలా దోహదం చేశారు. ఈ ముగ్గురిని ‘మూర్తి త్రయం’గా పేర్కొనేవారు. ఈ ముగ్గురు పాల్గొన్న ‘అనార్కలి’ తొలి తెలుగు రేడియో నాటకం. అది 1938 జూన్ 24న లైవ్‌గా మద్రాసు కేంద్రం ద్వారా ప్రసారమైందని డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ అంటారు. అనార్కలి పాత్రను భానుమతి చేశారు. నాటక రచయిత ‘వైతాళికులు’ ముద్దుకృష్ణ. చారిత్రక విషయాల పరిశోధక రచయిత, నాటి ‘భారతి’ పత్రిక ఉపసంపాదకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ చేసిన‘మయ నాగరికత’ అనే ప్రసంగం రేడియో తెలుగు ఎలా ఉండాలో విశదం చేసింది. ‘‘ఈ యుగం ఎంత చిత్రమైనదో? ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోనూ పరిశోధనే! నిప్పు, నీరు, గాలి, ధూళి ఇం తెందుకు...’’ అనే వాక్యాలను పరిశీలిస్తే రేడియో వచన ధర్మాలు సులువుగా బోధపడతాయి. జానకిరామ్ ‘ఇతర గ్రహాలలో మానవులున్నారా?’ అనే అంశంపై జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా పేరుపొందిన సర్ వేపా రామేశముతో ప్రసంగం చే యించారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు మద్రాసు ఆకాశవాణి నుంచి తొలి తెలుగు రేడియో పుస్తక సమీక్షను చేశారు. 1948 డిసెంబర్ 1న విజయవాడ కేంద్రం ప్రారంభమయ్యాక మద్రాసు తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. 1950 ఏప్రిల్ 1న నైజాం రేడియోను భారత ప్రభుత్వం స్వీకరించి, ఆకాశవాణిగా ప్రసారాలను కొనసాగించింది. 1963లో కడప, విశాఖపట్నం కేంద్రాలు మొదలయ్యాయి. పాతికేళ్ల క్రితం మరో ఎనిమిది జిల్లా స్థాయి రేడియో కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం మొదలైంది. నేటి వ్యాపార టీవీ చానళ్లు, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో చానళ్ల ముందు ఆకాశవాణి వెలతెల పోతున్నట్టనిపించవచ్చు. కానీ టీవీ న్యూస్ చానళ్లు అరగంటలో ఇవ్వలేని వార్తా సమాచారాన్ని ఆకాశవాణి ఐదు నిమిషాల బులెటిన్లు ఇవ్వగలవు. సరళమైన వార్తా భాష స్థిరపడటానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. నాటి ప్రసారాల ఒరవడిని అనుసరిస్తే తెలుగు చానళ్లలో పరిశుభ్రమైన తెలుగు వినే భాగ్యం కలుగుతుంది. జూన్ 16 ఆకాశవాణి మద్రాసు కేంద్రం 76వ జన్మదినం (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ ప్రయోక్త) - నాగసురి వేణుగోపాల్ -
పద్యానవనం: జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును...
వార్త యందు జగము వర్ధిల్లుచున్నది.. అదియు లేనినాడు అఖిల జనులు.. అంధకార మగ్ను లగుదురు గావున వార్త నిర్వహింప వలయునధిపా! సమాచార నిర్వహణ ఇటీవలి ప్రక్రియ అనుకుంటారు చాలా మంది. ఇటీవల అంటే.... కొన్ని వందల సంవత్సరాలని. మానవేతిహాసం మొదలైన నుంచీ ఏదో రూపంలో వార్తా నిర్వహణ ప్రక్రియ ఉండనే ఉంది. ట్విట్టర్లు, బ్లాగ్లు, ఫేస్బుక్, లింక్డిన్, వాట్సాప్, ఇంటర్నెట్ వంటివి పుట్టుకురాకముందు టెలివిజన్, రేడియో, పత్రికలే ప్రసారమాధ్యమాలుగా రాజ్యమేలాయి. అందులోనూ పత్రికలు అత్యంత పురాతనమైనవి కాగా వాటికి మాతృకలయిన ఉత్తరాలూ చారిత్రక పాత్రనే పోషించాయి. ప్రణయ వ్యవహారాల నుంచి పాలనా సమాచారం వరకు పావురాలతో ఉత్తరాలు పంపించడాలు మన పురాణేతిహాసాల్లో మొదలై ఇటీవలి కాలం వరకూ సాగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు నిర్వహించే వారో తెలియదు కానీ, పురాణ కాలంలో ఆకాశవాణి, అశరీరవాణి లాంటివి చాలా ముఖ్యమైన సమాచారం అందించేవి. ‘నీ సోదరి దేవకి అష్టమ సంతానమే నీ పాలిట మృత్యువ’ంటూ కంసునికి సమాచరమిచ్చింది ఇటువంటి అశరీరవాణియే! రాజరిక వ్యవస్థల్లో సమాచారం మోసేందుకు, చేరవేసేందుకు ప్రత్యేకంగా వార్తాహారులు ఉండేవారు. దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట అశోక చక్రవర్తి కీలకమైన సమాచారాన్ని రాతి శిలలపైన, స్థంబాలపైన, స్థూపాలపైన చెక్కించాడని ప్రసిద్ధి. దాదాపు వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే ఈ రాళ్లపై రాయించే శాసనాల పద్ధతి సాగింది. తర్వాతి కాలంలో తాటి ఆకులపైన, అదే తాళపత్రాల పై రాతలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. శాశ్వతత్వం కోసం రాగిరేకులపైనా ఈ రాతలు సాగేవి. ఆంధ్ర పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ చాలావరకు రాగిరేకులపైనే ఉండేవనీ, అందులో కొన్ని మాత్రమే లభ్యమయ్యాయనీ పరిశోధకులు చెబుతుంటారు. మొగలాయి రాజులు కూడ వార్తా నిర్వహణ బాగా చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. వారిలో దాదాపు కడపటి వాడైన ఔరంగజేబు కూడా ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాల్ని, వార్తా విశేషాల్ని ఉదయం కల్లా గోడలపై రాయించేవాడని ప్రతీతి. పాశ్చాత్య దేశాల్లో అచ్చు యంత్రం వినియోగంలోకి వచ్చాక వార్తా నిర్వహణ స్వరూమే మారిపోయింది. ఈస్టిండియా కంపెనీ వారు బెంగాల్ నుంచి వెలువరించిన గెజెట్‌ను దేశంలో తొలి వార్తాపత్రికగా చెబుతుంటారు. తవ్వుకుంటూ పోతే అదో పెద్ద చరిత్ర. కాకపోతే, ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, ఎప్పుడో అయిదారు వేల ఏండ్ల కిందట జరిగిందని చెబుతున్న మహాభారత కాలం నాటికే వార్తల నిర్వహణపై పాలకులకు అంతటి స్పృహ ఉండటమే విశేషం! అది కూడా సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తీకరణను ఈ పద్యంలో చూడొచ్చు. వార్త ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు నిర్వహించాలి? దాని వల్ల కలుగుతున్న ప్రయోజనమేంటి? అది లేకుంటే జరిగే అనర్థమేమిటి? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానమిస్తూ నారదుడు యుదిష్ఠిరునికి విన్నవించే సందర్భం. రాజసూయ యాగానికి వచ్చిన నారదుడీ వివరణ ఇచ్చినట్టు మహాభారత సభాపర్వంలో నన్నయ చెప్పాడీ పద్యం. సమాచార వ్యాప్తి తోడినే యావత్ ప్రపంచము ప్రగతి సాధిస్తోందని చెబుతాడు. అదే లేకపోతే జనులంతా అంధకారంలో కొట్టుకుపోతారంటాడు. అలా కాకుండా ఉండటానికి వార్తను నిర్వహించాలనీ, అది పాలకుల బాధ్యతనీ వివరిస్తాడు. వార్త అంటే సమాచారం మాత్రమే కాదు. సమాచార రూపంలో వచ్చే జ్ఞానం. జ్ఞాన వ్యాప్తికి దోహదపడే సమాచార వెల్లువ ప్రగతికి కారణమే కాకుండా, అసమానతల నివారణకు, అక్రమాల నియంత్రణకు కూడా హేతువవుతోంది. గోప్యత అనే చీకటి పొరల్లో మగ్గిన సమాచారం ప్రజా బాహుళ్యంలోకి వస్తే... గ్రామ, పట్టణ స్థాయిలో నోరులేని బడుగు బలహీనవర్గాలు, అల్ప జీవులకు జరిగే చిన్న చిన్న అవకతవకలు, అన్యాయాల నుంచి రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకునే అవినీతి, అక్రమాలు, ఆశ్రీత పక్షపాతం, బంధు జన ప్రీతి వంటి అనర్థాలన్నీ బట్టబయలు కావాల్సిందే! జాతీయ స్థాయిలో జరిగే కామన్వెల్త్ గోల్మాళ్లు, బొగ్గుగనులు, త్రి-జి కేటాయింపులు, ఆదర్శ్ వంటి కుంభకోణాల గుట్టుమట్లను మన మీడియా వెలికితీయడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో సామ్రాజ్యవాదుల దురాగతాలను, కుట్ర-కుతంత్రాలను వికీలీక్స్ బహిర్గతం చేయడం వరకు... ఈ సమాచార వ్యాప్తి పాత్ర ఎంత కీలకమైందో మనందరికీ తెలిసిందే! అందుకే ‘వార్త నిర్వహింప వలయు’నన్నారు పెద్దలు. - దిలీప్‌రెడ్డి -
రేడియో రెడీ..!
న్యూఢిల్లీ: పరుగు పరుగున వెళ్లి మెట్రోరైలు ఎక్కిన మీకు వికసించిన కమలం చిత్రాలున్న బిల్‌బోర్డులు దర్శనమిస్తాయి. అదే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడి గ్రీన్ లైట్ కోసం ఎదురుచూసే మీకు ఆకాశమంత ఎత్తున్న ‘హస్తం’ దర్శనమిస్తుంది. అలా బైక్‌పై దూసుకుపోతుంటే ‘మార్పు కోసం మాకు మద్దతు పలకండి’ అంటూ చీపురు అడుగుతుంది. ‘మాకు మద్దతు పలికితే పేదలకు మంచి రోజుల’ంటూ ఏనుగు బతిమాలుతుంది. లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి నగరంలో ఇలాంటి పోస్టర్లు, కటౌట్లు, బిల్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. సంప్రదాయ ప్రచార వ్యూహాలుగా వీటిని ఉపయోగించుకునే రాజకీయ పార్టీలు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల రంగప్రవేశంతో వీటినుంచి కొంతమేర దృష్టిమరల్చాయి. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో కూడా ఇలా పోస్టర్లు, జెండాలు, బిల్ బోర్డులు ఏర్పాటు చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఓటర్ల వద్దకు వెళ్లే సాధనమైన రేడియోపై ఇప్పుడు అన్ని పార్టీలు దృష్టిసారించాయి. ఔట్‌డోర్ మీడియా, టెలివిజన్‌లో ప్రకటనల వంటివి భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారడంతో రేడియో ప్రచారంవైపు పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. అలరిస్తున్న రేడియో జింగిల్స్... రోడ్డుపై నడుస్తున్నా.., బస్సులో ప్రయాణిస్తున్నా..., రైల్లో ఆఫీసుకెళ్తున్నా.. జేబులో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పసందైన పాటలు ఎఫ్ఎం స్టేషన్లలో వస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నగరజనం ఇప్పుడు ఎఫ్ఎం రేడియోకు బానిసలైపోయారు. ఇటువంటి పరిస్థితిని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రకరకాల జింగిల్స్ రూపంలో తమ పార్టీ తరఫున ఎఫ్ఎం రేడియోలో ప్రచారం చేస్తున్నాయి. రేడియోల్లో ప్రసారమవుతున్న ఈ జింగిల్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండడమేగాకుండా ఆలోచించే విధంగా కూడా ఉంటున్నాయని చెబుతున్నారు శ్రోతలు. జింగిల్స్ రూపకల్పనలో ప్రైవేటు కంపెనీలు బిజీ... దేశవ్యాప్తంగా 158 మిలియన్ల మంది రేడియో శ్రోతలుండగా వారిలో 106 మిలియన్ల మంది ఎఫ్ఎం రేడియో వినేవారే. భారతదేశంలోని 86 నగరాల్లో దాదాపు 245కి పైగా ఎఫ్ఎం చానల్స్ ఉన్నాయి. దీంతో ప్రాంతాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి నచ్చే రీతిలో, ఆయ ప్రాంతాల యాసలు, భాషల్లో జింగిల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ జింగిల్స్ రూపకల్పన కోసం ఏర్పాటైన వివిధ ప్రైవేటు కంపెనీలను రాజకీయ పార్టీలు ఆశ్రయించడంతో వారికి చేతినిండా పనిదొరికింది. సదరు కంపెనీలు జింగిల్స్ రూపకల్పనలో బిజీగా ఉంటున్నాయి. రేటూ.. సెపరేటు..! ఎఫ్ఎం రేడియోలో పార్టీ తరఫున ప్రచారం చేయాలంటే గంపగుత్తగా ఒకే మొత్తం చెల్లిస్తే సరిపోదు. ఎందుకంటే ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం వినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా స్టేషన్లు ఈ సమయాల్లో పార్టీల జింగిల్స్ ప్రచారం చేయాలంటే ఒకరేటు, మిగతా సమయాల్లో ప్రసారం చేయాలంటే మరో రేటు చొప్పున వసూలు చేస్తున్నాయి. దాదాపు 30 సెకన్ల నుంచి 3 నిమిషాల నిడివితో ప్రసారమయ్యే ఈ జింగిల్స్‌కు ప్రసారమయ్యే సమయం ఆధారంగా కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని చానళ్లు వినియోగదారులు కోరితే విరామ సమయంలో కాకుండా పాటల మధ్యలో కూడా ఈ జింగిల్స్‌ను ప్రచారం చేస్తున్నాయి. ఇలా వ్యూహాత్మకంగా ప్రసారం చేసే జింగిల్స్‌కు మరికొంత అదనంగా వసూలు చేస్తున్నాయి. కేవలం ఆ ప్రాంతానికే పరిమితమయ్యే జింగిల్స్‌కు ఒక రేటు, ప్రసార పరిధి విస్తరించేకొద్దీ మరో రేటు కూడా వసూలు చేస్తున్నాయి. దూసుకుపోతున్న కమలం... ప్రచారంలో ముందున్న కమలం రేడియో ప్రచారంలో కూడా మిగతా పార్టీలకంటే ముందే కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ఎఫ్ఎం రేడియో చానళ్లలో ఆ పార్టీ గీతం ప్రసారమవుతోంది. ఇది ఎంతో ఆకట్టుకునేలా ఉందంటూ తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
'పై-లిన్ భారీ నుంచి రేడియోనే కాపాడింది'
రేడియోనే తనను,తన కుటుంబాన్ని పై లిన్ తుఫాన్ భారీ నుంచి రక్షించిందని ఒడిశాలోని పూరీ నివాసి గజేంద్ర జేనా ఆదివారం వెల్లడించారు.పై లిన్ తుపాన్‌పై రేడియోలో ఎప్పటికప్పుడు ప్రసారం అయిన బులిటెన్లతో తాము అప్రమత్తమైయ్యామని చెప్పారు.సముద్ర తీరానికి 5 కిలోమీటర్లలోపు నివసించేవారు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని రేడియో ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. పై లిన్ తుపాన్ వల్ల ప్రచండవేగంతో ఈదురుగాలులు వీచాయి,భారీ వర్షాలు కురిశాయి.దాంతో తాను నివసించే ఇంటిపై కప్పు సిమెంట్ రేకులు గాలికి కొట్టుకుపోయాయి.దాంతో తమ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.రేడియోలో పై లిన్ తుపాన్‌పై వచ్చిన బులిటెన్ వినకుంటే ఇంటి సమీపంలోనే తలదాచుకుని ఉండేవారమని చెప్పారు. దీంతో తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయేవని తెలిపారు.రేడియోలో పై లిన్ తుపాన్ తీవ్రతను ప్రసారం చేయడం ద్వారా తాను తన భార్య ఇద్దరు పిల్లలతోపాటు రేడియో తీసుకుని పునరావాస కేంద్రానికి తరలినట్లు గజేంద్ర జేనా వెల్లడించారు.పై లిన్ తుపాన్ నుంచి తమ ప్రాణాలు రేడియోనే కాపాడిందని గజేంద్ర జేనా తెలిపారు.