జింగిల్స్..జిల్‌జిల్ జిలా!
రికార్డు చేసిన సందేశాలతో ఓటర్లను ఆకట్టుకోనున్న బీజేపీ
- ఫోన్లు, రేడియోల్లో ప్రసారానికి ఏర్పాట్లు
- సుపరిపాలన ఇతివృత్తంగా సందేశాల ప్రచారం
- సోషల్ మీడియా ప్రచారంలో తామే ముందున్నట్లు ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్ ఖేర్, హేమమాలిని, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో ఢిల్లీవాసులతో ఫోన్లో, రేడియోలో మాట్లాడనున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేసే జనాకర్షణ గల నేతల సందేశాలను రికార్డు చేసి ఢిల్లీలో ఓటర్లకు వినిపించడానికి ఢిల్లీ బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సుపరిపాలన అంశంపై ఢిల్లీవాసులకు ఈ నేతల సందేశాలను వినిపించి ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంపీలతో జరుపుతోన్న ప్రచారం ఈ నెల 20న ముగియనుండడంతో మరో తరహాలో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటోన్న బీజేపీ రేడియోలో, ఫోన్లో ముందే రికార్డు చేసిన సందే శాలు, జింగిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారంపై దృష్టి సారించనుంది.
ఈ ప్రచారంలో తాము అసత్య వాగ్ధానాలు చేయబోమని, మోడీ అభివృద్ధి నమూనాను ప్రజల ముందుంచుతామని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ చెప్పారు. ప్రచారం కోసం సుపరిపాలనను ఇతివృత్తంగా ఎంచుకున్న బీజేపీ గత ఆరు నెలల్లో కేంద్రం చేపట్టిన జన్‌ధన్ యోజన, స్మార్ట్ సిటీస్, వై-ఫై కనెక్టివిటీ ఇత్యాది అంశాలను ప్రచారం కోసం ఉపయోగించుకోనుంది. సోషల్ మీడియా ప్రచారంలో తమ పార్టీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందుందని ఉపాధ్యాయ చెప్పారు.
ఆప్ ఫేస్ బుక్ పేజీకి రోజుకు 3 వేల లైక్స్ వస్తుండగా, తమకు పది వేల లైక్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం చేపట్టిన కార్యకమాన్ని డిసెంబర్ 20 తర్వాత మరింత ముమ్మరం చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిన నియోజకవర్గాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంగళవారం వరకు కొత్తగా 16 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారని పార్టీ తెలిపింది.