Tech Revolution Has Reshaped Radio And FM Says Prime Minister Modi - Sakshi
Sakshi News home page

సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా

Published Sat, Apr 29 2023 5:19 AM | Last Updated on Sat, Apr 29 2023 8:34 AM

Tech revolution has reshaped radio, FM Says Prime Minister Mod - Sakshi

న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌(ఎఫ్‌ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు.

సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్‌ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు.  

అందరికీ ఆధునిక టెక్నాలజీ  
స్వచ్ఛ భారత్‌ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్‌ ఘర్‌ తిరంగా వంటి కార్యక్రమాలు మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు.

డిజిటల్‌ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్‌ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు.  

డిజిటల్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణతో మొబైల్‌ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్‌ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు.

ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్‌ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్‌ దీవుల్లో ఎఫ్‌ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.   

రికమండేషన్లకు చరమగీతం  
ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్‌ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్‌ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement