Radio transmitters
-
వోయేజర్–1 పునరుత్థానం!
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
ఆ తరంగాలు గ్రహాంతరవాసులవేనా?
⇒ సుదూర విశ్వం నుంచి భూమిని తాకుతున్న ఎఫ్ఆర్బీలు ⇒ వీటిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు ఉన్నారా? అత్యాధు నిక టెక్నాలజీ సాయంతో వారు అంతరిక్ష నౌకలనూ నడపగలుగుతున్నారా? దీనికి అవునంటున్నారు హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు. ఫాస్ట్ రేడియో బరస్ట్స్(ఎఫ్ఆర్బీ)లపై జరిపిన పరిశోధనలతో తామీ అంచనాకు వస్తున్నట్లు భారతీయ సంతతి శాస్త్రవేత్త మనస్వి లింగం అంటున్నారు. సుదూర విశ్వం నుంచి.. మీకు రేడియో తరంగాల గురించి తెలుసుకదా.. సెల్ఫోన్లు మొదలుకుని.. మిలిటరీ కమ్యూనికేషన్స్ వరకూ అనేక చోట్ల వీటిని వాడుతుంటాం. వీటిల్లో కొన్ని తక్కువ శక్తి కలిగి ఉంటే.. ఇంకొన్ని అత్యధిక శక్తి కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో.. ఎలా ప్రసారం చేయాలో.. తీవ్రతను ఎలా ని యంత్రించాలో మనకు తెలుసు. కానీ.. ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా అత్యంత శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిని తాకాయనుకోండి. ఎలా ఉంటుంది?. అది కూడా కేవలం 5 మిల్లీ సెకన్ల పాటు మాత్రమే ఈ తరంగాలు ప్రసారమవుతూంటే? ఆసక్తికరంగా ఉంటుంది కదూ.. ఈ రకమైన ఎఫ్ఆర్బీను ఆస్ట్రేలియాలోని పార్క్స్ వేదశాల శాస్త్రవేత్తలు 2007లో తొలిసారి గుర్తించారు. విశ్వం నుంచి వెలువడే అనేకానేక రకాల తరంగాల్లో ఇదీ ఒకటి కాబోలు అనుకున్నారు. అయితే 2007 తరువాత ఇప్పటివరకూ ఇలాంటి ఎఫ్ఆర్బీలు కొన్ని డజన్లు గుర్తించడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. 2015లో మెక్‌గిల్ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త ఇవన్నీ ఒకే దిక్కు నుంచి వస్తున్నట్లు గుర్తించడం.. గతేడాది ఇవన్నీ 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత నుంచి వస్తున్నట్లు గుర్తించడంతో విషయం కొంచెం సీరియస్ అయింది. ఎంతో దూరాన్ని దాటుకుని.. ఈ ఎఫ్ఆర్బీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజసిద్ధమైనవా? లేక ఎవరైనా సృష్టిస్తున్నారా? అన్న అంశాలను తెలుసుకునేందుకు అవి లోబ్, మనస్వీ లింగంల బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రహాంతర వాసులెవరో వీటిని సృష్టించేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వీరు ప్రతిపాదిస్తున్నారు. సౌర శక్తి ద్వారా భారీ సైజు ట్రాన్స్మిటర్ల (ఒక్కొక్కటీ గ్రహం సైజు)తో ఈ రేడియో తరంగాలను సృష్టిస్తున్నారని.. కాంతి వేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలను నడిపించేందుకు వీటిని ఉపయోగిస్తూండవచ్చని అంటున్నారు. ‘‘ఈ వ్యవస్థలో 2 భాగాలున్నాయి. సోలార్ ప్యానె ల్స్ వంటి వాటితో శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే.. రేడియో తరంగాలను ప్రసారం చేసేది రెండోది. ఈ తరంగాల సాయంతోనే లైట్ సెయిల్ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూంటాయి’’అని మనస్వి అంటున్నారు. కోట్ల దూరాన్ని దాటుకుని భూమిని చేరుతున్న ఎఫ్ఆర్బీల శక్తిని పరిశీలిస్తే ఆ రేడియో ట్రాన్స్మిటర్ల సైజు అంచనా వేయవచ్చని.. భూ మి వ్యాసార్థానికి రెట్టింపు సైజున్న ట్రాన్స్మిటర్లను వాడి ఉంటారంటున్నారు. అయితే.. ఎఫ్ఆర్బీలు గ్రహాంతరవాసుల సృష్టి అయ్యేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ ఇప్పటివరకూ పరిశీలించిన ఎఫ్ఆర్బీల సంఖ్య తక్కువ కాబట్టి అప్పు డే ఒక అంచనాకు రాలేమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్