న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులగా మారారు. వారి నుండి నేను ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.
‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
Comments
Please login to add a commentAdd a comment