గ్రామస్తుల అభిప్రాయం మేరకే ఆలయాల నిర్మాణం
ఓబులవారిపల్లె : మంగంపేట పునరావాస కాలనీ ఆర్‌ఆర్–5లో గ్రామస్తుల అభిప్రాయం మేరకే ఆలయాల నిర్మాణం జరుగుతుందని దేవదాయ అధికారి దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పునరావాస కాలనీలో ఆలయ నిర్మాణంపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మంగంపేట, కాపుపల్లె హరిజనవాడ, అరుంధతివాడ మూడు గ్రామాల ప్రజల పునరావాసం కోసం ఆర్‌ఆర్–5లో ఏర్పాటు చేయనున్న గుడులు, ఆలయాల నిర్మాణంపై గ్రామస్తుల అభిప్రాయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పీర్‌మున్నీ, ఎంపీడీఓ విజయారావు, రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పి.మహేష్, మంగంపేట పునరావాస గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నగలు చోరీ జరిగినా పోలీసులు పట్టించుకోలేదు
కడప అర్బన్ : ప్రొద్దుటూరు టౌన్ శ్రీనివాసనగర్ వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇబ్రహీం కుమారుడు షేక్ జిలానీ బాషా, తన భార్య, కుటుంబ సభ్యులతో మంగళవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఈ ఫిర్యాదునుజిల్లా ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు స్వీకరించారు. తగిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు టూటౌన్ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితుడు జిలానీ బాషా విలేకరులతో మాట్లాడారు. తాను గత 30 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు టౌన్‌లోని పార్వతి ఆర్కేడ్ కాంప్లెక్స్. శేషుగారి వీధిలోని గ్రౌండ్‌ఫ్లోర్ రూం నంబర్ 3లో బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఈ ఆర్కేడ్‌లో నాలుగు రూములున్నాయన్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నారు. ఈ ఆర్కేడ్‌లోకి వచ్చే దారిలో సీసీ కెమెరాలు మాత్రం పనిచేస్తున్నాయన్నారు. ఆగస్టు 25వ తేదీన రాత్రి 7:50 గంటల సమయంలో తన స్నేహితుడు వై.జయశంకర్‌తో కలిసి టిఫిన్‌ను పార్సిల్ కట్టించుకుని తిరిగి వచ్చానన్నారు. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే తాను అంగడిలో పొట్లాలలో దాచి ఉంచిన దాదాపు 309 గ్రాముల బంగారు ఆభరణాలు పూలహారం (107 గ్రాములు), నల్లల దండ (30 గ్రాములు), మినీ హారం (20 గ్రాములు), రెండు పొరల భారత్ చైన్ (45 గ్రాములు), ప్యూర్ బంగారం (50 గ్రాములు), లేడీస్ బ్రాస్‌లెట్ (7 గ్రాములు) చైన్ (8 గ్రాములు), కుదువపెట్టుకున్న వస్తువులు (12గ్రాములు), చిల్లర బంగారు (30 గ్రాములు) దొంగిలించారన్నారు. ఈ పని స్వర్ణకారునికి తప్ప ఎవరికీ సాధ్యంకాదన్నారు. ఈ సంఘటనపై ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోగా తననే సీఐ యుగంధర్ తప్పులు పడుతున్నారని వాపోయారు. కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయమని ఎన్నిసార్లు బతిమలాడినా ప్రయోజనం లేదన్నారు. ఈ చోరీపై పోలీసు ఉన్నతాధికారులు విచారించి తమ బంగారు ఆభరణాలను దొంగిలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment