Annamayya District News
-
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం
తంబళ్లపల్లె : ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సంఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని సాలివీధికి చెందిన కిషోర్ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గత సోమవారం తల్లి సరస్వతితో కలిసి సంక్రాంతి పండుగకు రాయచోటిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తెరవగా వస్తువులన్నీ కాలిబూడిదయినట్లు గుర్తించారు. ఇంటిలోని ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, బట్టలు, ఫర్నీచర్ కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగివుండవచ్చునని బాధితులు తెలిపారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిలినట్లు వారు వాపోయారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ హరికుమార్, వీఆర్ఓ నాగరాజు పరిశీలించారు. బాఽధితులను పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
పూర్వ వైభవం తీసుకురావాలి
ప్రభుత్వం రంగ సంస్థనే ఆల్విన్ ఫ్యాక్టరీలో నెలకొల్పాలి. ఈ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆల్విన్‌లో ప్రత్యామ్నాయ పరిశ్రమకు ఉద్యమించాల్సిన సమయం ఆస్నమైంది. ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే మళ్లీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. మాజీ సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన కర్మాగారానికి కూటమి సర్కారు ఊపిరిపోయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. –మల్లెల విజయుడు, ఆల్విన్ మాజీ కార్మికుడు, వైపీపల్లె, నందలూరు -
ఆర్టీసీ బస్సులో మంటలు
సిద్దవటం : కడప– చైన్నె జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం పులివెందుల నుంచి చైన్నెకి వెళతుండగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలోకి వచ్చే సరికి.. ఒక్కసారిగా రేడియేటర్ వద్ద పొగతో కూడిన మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపేశారు. స్థానికులు హుటాహుటిన బస్సులోని మంటలపై బిందెలతో నీళ్లు పోయడంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనాలు దాదాపు 20 నిమిషాలు ఆగిపోయాయి. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని సురక్షితంగా వేరే బస్సులో ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించామని ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.● తప్పిన ప్రమాదం ● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు -
‘ఆల్విన్’ కథ.. ఇక అంతేనా..!
రాయలసీమకే తలమానికంగా నిలిచిన ఆల్విన్ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి గ్రహణం పట్టింది. ఆది నుంచి ఆటంకాలు ఎదుర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలైన ఓల్టాస్, ఎలక్ట్రోలెక్స్ చేతుల్లోకి మారి చివరికి మూతపడింది. పర్యవసానంగా జిల్లాలో భారీ పరిశ్రమ ఉన్నా.. లేనట్టుగానే మారింది. రాజంపేట : అన్నమయ్య జిల్లాలో నందలూరు సమీపంలో వెలసియున్న ఆల్విన్ రిఫ్రిజిరేటర్ల కర్మాగారానికి 1987 ఏప్రిల్ 3న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కర్మాగారం ప్రారంభోత్సవానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. 1987 మార్చి 27న జరగాల్సి ఉండగా ఏప్రిల్ 3కి వాయిదా పడింది. అనంతరం కేవలం 15 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని భావించగా.. ఏడాది కాలం టెండర్లతోనే గడిచిపోయింది. నిర్మాణం పూర్తయై 1989 నవంబరులో ఆనాటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంది. అప్పట్లో ఎన్నికలు రావడంతో పరిస్థితి తారుమారైంది. 1990లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డితో మార్చిలో ఒక సారి ప్రయత్నం చేశారు. ఇలా ప్రారంభోత్సవానికి పురిటి కష్టాలు పడింది. చేతులు మారుతూ.. ప్రైవేటు పరం దిశగా.. నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని 1992లో ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆల్విన్‌లో 700 మంది కార్మికులు, 150 మంది హెల్పర్లు, 60 మంది ఇంజినీర్లు, సూపర్వైజర్లు 1200 మంది ఉన్నారు. హైదరాబాద్ ఆల్విన్‌కు రెండేళ్లుగా నష్టం సంభవించడంతో అక్కడి నుంచి నందలూరుకు ముడిసరుకుల రవాణా ఆగిపోయింది. 2001లో ఉత్పత్తి ఆగిపోయింది. రెండేళ్లు కార్మికులను కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు. 2003లో కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. 21 ఏళ్లుగా తెరుచుకోని.. నందలూరు ఆల్విన్ మూతపడి 21 ఏళ్లయినా తెరుచుకోని పరిస్థితి. ప్రభుత్వాలు, పాలకులు భారీ పరిశ్రమను మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడం.. వారు నష్టాల సాకుతో అమ్మివేయడం.. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ బిల్డరు తీసుకోవడం జరిగింది. భూములు, క్వార్టర్స్, భవనాలు నిరుపయోగంగా మారాయి. జిల్లాకు చెందిన పలువురు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినా.. బిల్డరు చెప్పే రేటుకు ఒప్పుకోక, అలాగే వాస్తు సరిగ్గా లేదనే భావనతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికై నా భారీ పరిశ్రమ దిశగా పెద్ద సంస్థలు ముందుకొస్తేనే ఆల్విన్ కర్మాగారానికి పూర్వవైభవం సంతరించుకుంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఆల్విన్ ఫ్యాక్టరీని పరిశ్రమల చట్టం ప్రకారం ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. నవ్యాంధ్రలో జిల్లా వరకు భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ అనుకూలమనే ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పాలకులదే. ‘కల’గానే ప్రభుత్వ పరిశ్రమ నిరుద్యోగుల ఎదురుచూపులు 21 ఏళ్లయినా తెరుచుకోని ఫ్యాక్టరీ కూటమి దృష్టి సారించాలంటున్న జనం -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని మిట్టమీదపల్లె గ్రామ సమీపంలో శనివారం ఆటోను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన బాదుల్లా(50) ఆటో నడుపుకొంటూ, గ్రామాల్లో పరుపులు కుట్టుకుంటూ ఉండేవాడు. జంగంరెడ్డిపల్లె, రంపతాడు గ్రామాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మిట్టమీదపల్లె సమీపంలో పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో రోడ్డు డివైడర్‌పై బోల్తా పడింది. ఆటో నడుపుతున్న బాదుల్లాకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు మృతుడి బంధువులు తెలిపారు. బాదుల్లాకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉత్కంఠ భరితంగా హాకీ పోటీలు
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో 14వ ఏపీ సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి బాలుర హాకీ పోటీలు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జట్లు పాల్గొన్నాయి. మొదటి సెమీ ఫైనల్స్‌లో తిరుపతి–కడప జిల్లా జట్లు పోటీ పడ్డాయి. ఇందులో 5–1 స్కోరుతో కడప జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. కడప జట్టు నుంచి జాకీర్‌హుస్సేన్ రెండు గోల్స్, సాయిమోహన్ ఒక గోల్, బాలాజీ ఒక గోల్, మిథుల్కౌశిక్ ఒక గోల్ చేశారు. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ ఒక గోల్ చేశారు. రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో అన్నమయ్య– అనకాపల్లి జట్లు పోటీ పడ్డాయి. 6–0 స్కోరుతో అనకాపల్లి జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్స్ మ్యాచ్ ఆదివారం కడప–అనకాపల్లి జట్ల మధ్య జరగనున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి పి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉదయం లీగ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఉదయం నుంచి హాకీ మైదానంలో క్రీడాకారులతో సందడి నెలకొంది. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు, కోశాధికారి థామస్, కోచ్ నౌషాద్, కన్వీనర్ హితేష్రావు, పీడీలు శివప్రసాద్, జలజ తదితరులు పర్యవేక్షించారు.ఫైనల్స్‌కు చేరిన కడప, అనకాపల్లి జట్లు -
ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమ
సీమలో ఎందరికో ఉపాధినిచ్చిన పరిశ్రమను సిక్ ఇండ్రస్టీగా మార్చేశారు. భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆల్విన్ ఫ్యాక్టరీ అనుకూలమని పాలకులకు తెలుసు. మూతపడి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఆల్విన్ విషయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి. మా లాంటి వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆల్విన్ దుస్థితి మమ్మల్ని కలిచివేస్తుంది. పాలకులు పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ సమస్య తీర్చాలి. – ముక దుర్గయ్య, ఆల్విన్ ఐఎన్టీయూసీ మాజీ కార్మిక నేత, నందలూరు -
రెచ్చిపోయిన అధికార పార్టీ రౌడీ మూకలు
రాయచోటి : రాయచోటిలో టీడీపీకి చెందిన రౌడీమూకల దాడులతో పట్టణ ప్రజలు భీతిల్లిపోతున్నారు. జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో టీడీపీ వర్గీయుల గ్యాంగ్ దాష్టికానికి శనివారం తెల్లవారుజామున కారు దగ్ధమైంది. పట్టణ పరిధి కొత్తపల్లిలోని లాల్ మసీదు సమీపంలో నిలిపిన కారుకు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు, వారి అనుచరులు నిప్పు పెట్టారు. తెల్లవారుజామున రెండు గంటల సమీపంలో కొంతమంది గ్యాంగ్ సభ్యులు కొత్తపల్లి వీధుల్లో తిరుగుతూ.. నిలబెట్టిన బైకులను పడదోస్తూ వీరంగం సృష్టించారు. అనంతరం కొద్దిసేపటికి మసీదు సమీపంలో నిలిపిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఖాదర్ బాషా అనుచరుల వీరంగం అధికమైందని స్థానిక మైనార్టీలు వాపోతున్నారు. కారు దగ్ధం ప్రమాదం కూడా ఖాదర్ బాషా అనుచరులు సయ్యద్, డాకు అనే గ్యాంగ్ సభ్యుల కారణంగానే సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాంగ్ సభ్యులు వీధులలో వీరంగం సృష్టిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. నెల రోజుల కిందట చార్మినార్ హోటల్‌కు, పది రోజుల క్రితం కొత్తపేటలోని ఓ షాపునకు టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు నిప్పంటించి దౌర్జన్యాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సంఘటనపై అర్బన్ సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో వీరంగం సృష్టిస్తూ.. కారుకు నిప్పు వరుస సంఘటనలతో భీతిల్లుతున్న ప్రజలు -
జగనన్న కాలనీలో టీడీపీ దౌర్జన్యం
● జేసీబీతో పేదల ఇంటి పునాదులు ధ్వంసం ● జియోట్యాగింగ్, బిల్లులు పడినా వదలని వైనంమదనపల్లె : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజురోజుకీ టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. అధికార బలంతో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ పేదలు, అమాయకులపై తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. మదనపల్లె మండలం సీటీఎం దళితవాడ జగనన్న కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జేసీబీని తీసుకెళ్లి.. పేదలు కష్టపడి నిర్మించుకున్న పునాదులను పెకిలించి బయటపడేశారు. తమకు గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు, జియోట్యాగింగ్ ద్వారా తమ ఖాతాలో పడిన బిల్లు మొత్తానికి సంబంధించిన రశీదులను లబ్ధిదారులు చూపించినా కూటమి నాయకుల మనస్సు కరగలేదు. తమ ప్రభుత్వంలో తాము చెప్పిందే చట్టమన్నట్లుగా వ్యవహరించారు. అయితే ప్రభుత్వ కాలనీలో టీడీపీ వర్గీయులు ఇంత రాద్ధాంతం చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. కనీసం అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. మదనపల్లె మండలం సీటీఎం దళితవాడలో జగనన్న కాలనీ లేఔట్ కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వే నంబర్ 354లో స్థానికులైన బోయకొండ, గెడ్డం శ్రీనివాసులు వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసింది. 54 మంది పేదలకు అందులో ఇంటి పట్టాలు మంజూరు చేసింది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు పునాదులు వేసుకున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి జియో ట్యాగింగ్‌తోపాటు వారి బ్యాంకు ఖాతాలకు బిల్లులు పడ్డాయి. అయితే పునాదులు నిర్మించుకున్న వారిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఉండటంతో టీడీపీ నాయకుల కన్ను వాటిపై పడింది. ఎలాగైనా వాటిని ఆక్రమించుకోవాలనే నెపంతో అవకాశం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీటీఎంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పాల్గొన్నారు. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత...స్థానిక టీడీపీ నాయకులు పగడాల నాగేంద్ర, గౌర కృష్ణమూర్తి, గౌర రఘు, లలిత, రెడ్డినీల, మచ్చాశివ తదితరులు జేసీబీని తీసుకెళ్లి ఉన్నపళంగా నాలుగు ఇంటి పునాదులను పెకిలించారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడకు వెళ్లి కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా, కనికరించకపోగా, అధికార దర్పం ప్రదర్శించారు. దీనిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు సకాలంలో స్పందించకపోవడంతో పేదలు తమ కలల ఇంటిని కోల్పోయారు. అధికారులు స్పందించి, తమ కు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
సమాజ సేవే ‘రెడ్ల’ ధ్యేయం
కడప కల్చరల్ : సమాజానికి అవసరమైనపుడు తన సేవలను ప్రాణాలకు తెగించి, త్యాగాలు చేసి మనిషిగా తన బాధ్యతను చాటుకున్నవాడు నిజమైన రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. రెడ్డి సేవా సమితి సంస్థ కడప శాఖ ఆధ్వర్యంలో శనివారం నగర పరిధిలోని డీఎస్ఆర్ కల్యాణ మండపంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రోలయ వేమారెడ్డి నుంచి నేటి వరకు అనేక మంది రెడ్లు దేశానికి అనేక రంగాల్లో సేవలందించారన్నారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలుకొని తెలుగునేలపై 11 మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా సేవలందించారన్నారు. కార్యక్రమంలో ముందుగా ‘మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను ఆయన అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పుత్తా పుల్లారెడ్డి రచించిన ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ నాలుగు సంపుటాలను ఆవిష్కరించి, రచయితకు ‘సాహిత్య రత్నాకర’ బిరుదు ప్రదానం చేశారు. విశిష్ట అతిథి, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రెడ్లలో అనేక తెగలు ఉన్నా.. రెడ్లందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం పేరు పెట్టడం గర్వకారణమన్నారు. సభాధ్యక్షులు, రెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆచార్య కుప్పిరెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావ వికాసాలను సభకు పరిచయం చేశారు. ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి నివేదిక సమర్పిస్తూ సంస్థ పుట్టిన 25 ఏళ్లుగా వరద, కరోనా బాధితులు, పేద రైతులు, విద్యార్థులకు చేసిన అనేక సేవా కార్యక్రమాలను సభకు తెలియజేశారు. ఆత్మీయ అతిథి, శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పది మందికి అన్నం పెట్టే గుణం రెడ్లకుంటుందని, ఆ దిశగా సేవలందిస్తూ రెడ్డి సేవాసమితి ఏర్పాటు కావడం వారికి ఎంతో సహకారాన్ని అందించినట్లయిందన్నారు. ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం ప్రత్యేక అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు కొవ్వూరు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా విద్య, వసతిని కల్పించి ఎందరో విద్యార్థినులకు ఆశ్రయం కల్పిస్తున్న రెడ్డి సేవాసమితి సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రతి రెడ్డికి ఆత్మాభిమానంతోపాటు వినయం కూడా ఉండటం అవసరమన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి మాట్లాడుతూ గతంలో తనను గండపెండేర సత్కారంతో సత్కరించిన సందర్భాన్ని గుర్తుకు చేశారు. రెడ్డి సేవాసమితి అభ్యుదయం దిశగా సేవలందించడం వెనుక నిర్వాహకుల కృషిని కొనియాడారు. వేమన పద్యం మార్గదర్శకం ప్రత్యేక ఆహ్వానితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వేమన పద్యాలు నాటి, నేటి, రేపటి సమాజానికి మార్గదర్శకాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, ప్రముఖ జానపద పరిశోధకులు ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి రాయలసీమ జానపద గేయాలను ఆలపించి సభను అలరింపజేశారు. ప్రత్యేక ఆహ్వానితులు కొండా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సేవా సమితి ఆవిర్భావం వెనుక సహకరించిన దాతలను సభకు తెలియజేశారు. యలమర్తి మధుసూదన్వేమన పద్యాలను గానం చేశారు. వేమన పద్యపఠన పోటీల్లో విజేతలైన విద్యార్థులను నగదు బహుమతి, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అతిథులను, ‘మేలుకొలుపు’ సంచిక సంపాదకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, డాక్టర్ అనుగూరు చంద్రశేఖరరెడ్డి, కొండూరు జనార్దనరాజు, చదలవాడ వెంకటేశ్‌లను, రెడ్డి సేవా సమితి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గుడ్ల ఆదినారాయణరెడ్డి వందన సమర్పణ చేశారు. వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి సభాసమన్వయం చేశారు. కార్యక్రమంలో పద్మప్రియ చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు, రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఘనంగా రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకలు ‘మేలుకొలుపు’ సంచిక ఆవిష్కరణ -
●పరిశుభ్రంగా ఉంచడమే సమాజసేవ
రైల్వేకోడూరు అర్బన్: మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మనం సమాజానికి చేసే సేవ అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌తో కలిసి పాల్గొన్నారు. ఎర్రచందనం పార్కులో మానవహారం ఏర్పాటు చేసి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చీపురుతో శుభ్రం చేసి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ దివస్‌ను పాటించి స్వచ్ఛ కోడూరుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న జేసీ, విప్ -
ఎన్టీఆర్ వర్థ్ధంతి సాక్షిగా.. వర్గపోరు బహిర్గతం
వేర్వేరుగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు మదనపల్లె: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా శనివారం టీడీపీలో వర్గపోరు బహిర్గతమైంది. పట్టణంలోని కదిరిరోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా తన వర్గంతో కలిసి నిమ్మనపల్లె సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సీటీఎం క్రాస్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తామే టీడీపీకి అసలైన వారసులమంటూ...తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, దొమ్మలపాటి యశస్విరాజ్, యాలగిరి దొరస్వామినాయుడు, జనసేన నాయకులు గంగారపు రామదాస్‌చౌదరి, జంగాల శివరాం తదితరులు మరో జట్టుగా ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని నమ్మిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ..పార్టీలో కొత్తగా వచ్చిన వారి మాటలు విని పనిచేస్తే ఒప్పుకునేది లేదని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే ట్రాన్స్ఫర్లు చేయించేందుకు వెనుకాడమని అధికారులను హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
హార్సిలీహిల్స్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
ఏపీ టీడీసీ చైర్మన్ బాలాజీ బి.కొత్తకోట: నిర్వహణలో రాష్ట్రంలోనే ఉత్తమ యూనిట్‌గా నిలిచిన హార్సిలీహిల్స్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. శనివారం ఆయన హార్సిలీహిల్స్ పై పర్యాటకశాఖ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. అతిథి గృహాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించి బార్, రెస్టారెంట్ నిర్వహణ, వాటి విస్తరణ పనులపై సమీక్షించారు. రూ.10 కోట్లతో ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆయన తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఐదు శాతం కూడా పూర్తి చేయించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే పర్యాటకశాఖకు ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే భారీ ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. యాత్రి నివాస్ వద్ద నిర్మాణ పనులు చేపట్టవద్దని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ స్థలంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కేటాయించాలని సూచించారు. రెవెన్యూ అతిథి గృహాన్ని టూరిజంకు అప్పగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పట్టు శాఖ భవనాలను సద్వినియోగం చేసుకుంటే మరింత ఆదాయం వస్తుందని మేనేజర్ నేదురుమల్లి సాల్విన్ రెడ్డి ఆయన దృష్టికి తెచ్చారు. అధికారుల తీరుతో పర్యాటకశాఖ నాశనం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నాశనమైందని నూకసాని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్సిలీహిల్స్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్డుకు తెలియకుండా యూనిట్లను ప్రైవేటుకు ఇస్తామని స్టెర్లింగ్ సంస్థను పర్యాటక కేంద్రాల్లో ఎవరు తిప్పుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడితే.. సంస్థకు నష్టం జరగాలని పనులు పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని అన్నారు. పర్యాటకశాఖకు టీటీడీ కేటాయించిన వెయ్యి దర్శన టికెట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు. చైర్మన్ దృష్టికి సాక్షి కథనం హార్సిలీహిల్స్‌ను ప్రైవేటుకు ఇచ్చే ప్రయత్నాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని టూరిజం సిబ్బంది బాలాజీ దృష్టికి తెచ్చారు. స్పందించిన బాలాజీ ఉద్యోగులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, మంచి ఆదాయం వస్తోంది. ఇలాంటి యూనిట్ ప్రైవేట్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
● నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయండి
మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబు రిక్తహస్తం ● అభివృద్ధి చేస్తామంటూనే గల్లా పెట్టే ఖాళీ అని వ్యాఖ్యలు ● మైదుకూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా విజ్ఞప్తులను తోసిపుచ్చిన సీఎం రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే టీడీపీ మూడో తరం నాయకుడు మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరులో ఎన్టీ రామారావు వర్థంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై పవన్ కల్యాణ్ ఓపెన్‌గా మాట్లాడుతుండటంపై టీడీపీలో ఒకింత అసహనం మొదలైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాసు వ్యాఖ్యలు ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
రాయచోటి: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం అన్నమయ్య జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 5058 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో 4242 మంది విద్యార్థులు హాజరుకాగా 816 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరిశీలించారు. గణతంత్ర వేడుకలకు నూలివీడు విద్యార్థులు గాలివీడు: విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర వేడుకల పెరేడ్లో నూలివీడు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ హైస్కూల్ స్కౌట్ మాస్టర్ కరకోటి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 76వ భారత గణతంత్ర రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో రాయలసీమ జోన్ (8 జిల్లాలు) నుంచి నూలివీడు జిల్లాపరిషత్ హైస్కూల్ 9వ తరగతి ఇద్దరు గైడ్ విద్యార్థులు కె.వైష్ణవి, పి.గీతామాధురి, ఇద్దరు స్కౌట్ విద్యార్థులు డి.నరసింహా, పి.గణేష్ ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్‌కు మారుమూల ప్రాంతమైన నూలివీడు హైస్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, చైర్మన్ జనార్దన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. హుండీ ఆదాయం రూ.7 లక్షల 21వేలుగుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,21,112 ఆదాయం సమకూరింది. శనివారం స్థానిక ఆలయంలో రాయచోటి దేవదాయశాఖ అధికారి శశికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మూడు నెలల కాలానికి సంబంధించి వివిధ కానుకలు, నగదు రూపంలో రూ.7,21,112, బంగారు ఆభరణాలు 29 గ్రాములు, వెండి 425 గ్రాములు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శశికుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 23న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు కడప ఎడ్యుకేషన్: ఈ నెల 23న ఉదయం పది గంటలకు కడప రిమ్స్ వద్దగల కేంద్రీయ విద్యాలయంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. పోటీల్లో పాల్గొనే 9, 10వ తరగతి విద్యార్థులు 23న ఉదయం 8.30 గంటలకు రిమ్స్ వద్ద కేంద్రీయ విద్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని డీఈఓ మీనాక్షి తెలిపారు. వివరాలకు 9490633934 నెంబర్లో సంప్రదించాలని ఆమె తెలిపారు. మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయం కడప సెవెన్‌రోడ్స్: సుస్థిర వ్యవసాయం, ఆగ్రో ఫారెస్ట్రీ, మొక్కల సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో టీఓఎఫ్ మాస్టర్ ట్రైనర్ల కృషి ప్రశంసనీయమని జిల్లా అటవీ అధికారి ఎన్.శివకుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఓ–బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతనెల 8న వ్యవసాయ, ఉద్యాన, డీఆర్డీఏ, ఎఫ్‌పీఓ శాఖల నుంచి ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనర్లు ఐదు రోజులపాటు ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల సాగుపై శిక్షణ పొందారన్నారు. వీరు జిల్లాలోని 58 గ్రామాల్లో 6141 మంది రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించారన్నారు. ప్రభుత్వం నిర్దశించిన లక్ష్యాలను సాధించడంలో మాస్టర్ ట్రైనర్ల కృషి మరువలేనిదన్నారు. -
లే అవుట్లలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ప్రభుత్వ గృహ నిర్మాణ లే అవుట్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి మండలం, దిగువ అబ్బవరం పరిధిలోని ప్రభుత్వ లే అవుట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అబ్బవరం లే అవుట్, ఏపీ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న లే అవుట్లలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతి, విద్యుత్ స్తంభాలు, లైన్ల ఏర్పాటు, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల కల్పన, ఆర్చీ నిర్మాణం తదితర అంశాంలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ దయాకర్ రెడ్డి, హౌసింగ్, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసన్న కుమార్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, హౌసింగ్ డీఈ సుబ్బరామయ్య, ఏఈ రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ పుల్లారెడ్డి, ఎంపీడీఓ వెంకటేష్, విద్యుత్, హౌసింగ్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అగ్గిపుల్లే.. అగ్గి పుల్లే!
కురబలకోట: సినీ హీరో కిరణ్ అబ్బవరం శనివారం రాత్రి అంగళ్లులో సందడి చేశారు. వచ్చే నెల 14న విడుదల కానున్న దిల్ రూబా సినిమాలోని అగ్గిపుల్లే అనే పాటను అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అట్టహాసంగా విద్యార్థుల హర్షధ్వానాల మధ్య విడుదల చేశారు. అంతకు ముందు ప్రదర్శించిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ విశ్వకరుణ్ దర్శకత్వంలో హీరోయిన్గా రుక్సానా ధిల్లాన్ నటిస్తున్న దిల్ రూబా సినిమాను వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నామన్నారు. లవ్, రొమాంటిక్, యాక్షన్, ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను చిత్రీకరించామన్నారు. ఈ సినిమాను ఆదరించాలని హీరోయిన్ రుక్సాన్ ధిల్లాన్ కోరారు. కిరణ్ అబ్బవరం చిత్ర యూనిట్, విద్యార్థులతో కలసి స్టెప్పులేశారు. ఆర్ఆర్ఆర్ అకాడమి ప్రెసిడెంట్ నాదేళ్ల ద్వారకానాథ్ పాల్గొన్నారు. అంగళ్లులో అల్లరి చేసిన కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ తొలి పాట విడుదల -
చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
రాయచోటి అర్బన్: అన్నమయ్య జిల్లాను చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్ది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర –స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి స్ధానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మన ఇంటిని, మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే మనం సమాజానికి అందిస్తున్న సేవ అన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ● జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఇక నుంచి నెలలో మూడవ శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రహదారుల పక్కన, కాలువలు, చెరువులు, కుంటల వద్ద శ్రమదానం చేసి చెత్తాచెదారాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం చీపురు చేత పట్టుకుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరిసరాలను శుభ్రం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మానవహారం నిర్వహించి ప్రజలచే స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సుండుపల్లె: మండల పరిధిలోని మడితాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎల్పీఓ మస్తాన్ వలీ, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
●మైదుకూరులో సీఎం చంద్రబాబు గ్రీన్ వాక్
మైదుకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు మరోసారి మొండిచేయి చూపించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన బాబు ఈ ప్రాంత అభివృద్ధికి వరాలు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. జిల్లా సంగతి దేవుడెరుగు.. చివరికి తాను పర్యటించిన మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా మాట్లాడకుండా ‘గల్లా పెట్టె ఖాళీ’ అంటూ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. మైదుకూరులో శనివారం జరిగిన ఎన్టీఆర్ వర్థంతి సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అంతకు ముందుకు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. కడప జిల్లా రైతాంగానికి మేలు చేసే రాజోలి ఆనకట్టను పూర్తి చేయాలని, మైదుకూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. మైదుకూరు మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ.50కోట్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.50కోట్ల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైదుకూరులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, ఉర్దూ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. ఎగుమతి రకం కేపీ ఉల్లి అభివృద్ధి కోసం కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయాలని, ఇంటింటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసే బృహత్తర నీటి పథకం కోసం రూ.90కోట్లను మంజూరు చేయాలని, చేనేతలకు పనులు కల్పించాలని, మైదుకూరులో క్రీడల అభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మించాలని కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. పుట్టా సుధాకర్ యాదవ్ చేంతాడంత కోరికల జాబితా ఇచ్చాడని అవన్నీ తీర్చడానికి.. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. చేయలేనని సభాముఖంగానే తోసిపుచ్చారు. దాంతో కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, ప్రజలు నిరాశకు గురయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం.. సంపదను సృష్టిస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబుకు ఈ జిల్లాకొచ్చేసరికి ‘గల్లాపెట్టె ఖాళీ’ విషయం గుర్తుకొచ్చిందా అని జనం మండిపడుతున్నారు. సీమపై.. కడపపై ఎప్పుడూ కడుపుమంటేనని పలువురు విమర్శిస్తున్నారు. ● స్థానిక జెడ్పీ హైస్కూల్లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మైదుకూరు మున్సిపాలిటీలో 12 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీల విషయంలో మైదుకూరును మోడల్‌గా తీసుకుని మురికి నీటిని శుద్ధిచేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా మైదుకూరులో శనివారం ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. స్థానిక కేఎస్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తాను చేసిన ప్రసంగంలో ఎప్పుడూ చెప్పే పాత విషయాలనే వల్లె వేశారు. పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధులకు రూ.35లు పింఛను అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు తీసుకొచ్చారంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. కడప జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం.. రాబోవు రోజుల్లో జిల్లాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాం.. అంటూ పాత డైలాగులే చెప్పారు. ఈ ఏడాది 4వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని ‘నీటి మాటలు’ చెప్పారు. పోలవరం నీటిని బనకచర్లకు తీసుకురావడమే తన జీవితాశయం అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి కేంద్రం రూ.2300 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో కడప ఎయిర్‌పోర్టు నుంచి అనేక నగరాలకు విమానాలు నడిపేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.80 కోట్లతో గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజోలిని పూర్తి చేసి 90వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి రామప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్, వరదరాజులరెడ్డి, ఆర్.మాధవి, ఆదినారాయణరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈమె పేరు లావణ్య. మైదుకూరులోని పార్వతీనగర్. భర్త రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. పెద్ద కొడుకేమో ఇదిగో ఇలా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దివ్యాంగుల పింఛన్ కోసం ఆర్నెళ్లుగా తిరుగుతూనే ఉంది. సీఎంకు విన్నవించుకుందామని ఆశగా ఇక్కడికి వచ్చింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అర్జీ తీసుకుని పంపించారు. ఈసారైనా పింఛన్ మంజూరవుతుందో లేదో చూడాలి మరి. ‘పాపం హరి’...పట్టించుకునేవారేరి!స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర.. కార్యక్రమంలో భాగంగా శనివారం మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ వాక్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మైదుకూరులో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మైదుకూరు పట్టణంలోని రాయల కూడలి నుంచి మంత్రి సవితా, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్థులతో కలసి స్థానిక జెడ్పీ హైస్కూల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్ వద్ద పారిశుధ్య వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం హైస్కూల్లో జరిగిన స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదికలో మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు చెన్నమ్మ, అమ్ముళ్లమ్మ, కంపాక్టర్ వాహన డ్రైవర్ గంగాధర్‌లను సీఎం చంద్రబాబు సత్కరించారు. కేంద్రం పారిశుధ్యకార్మికులకు అవార్డులు ఇస్తున్న తరహాలోనే రాష్ట్రంలో కూడా వారికి అవార్డులు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ మేరకు మైదుకూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు రూ.లక్ష నగదు బహుమతులను ప్రకటించారు. అనంతరం ‘స్వచ్ఛ ఆంధ్ర ’ ప్రతిజ్ఞ చేయించారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు... ఇదివరకు చంద్రబాబు పాల్గొన్న వేదికలపై చాలాసార్లు ఆశీనులయ్యాడు. తాజాగా మైదుకూరు సభలోనూ వేదికపైకి వచ్చాడు. ఏమైందో ఏమో.. ప్రొటోకాల్‌లో పేరు లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో ఇదిగో ఇలా వెనుదిరిగాడు. -
గల్లంతైన యువకుడు మృతి
గుర్రంకొండ : క్వారీ నీటి గుంతల్లో ఈత కొడుతూ.. గల్లంతైన యువ ఇంజినీర్ మృత్యువాత పడ్డాడు. మూడు రోజుల నుంచి రెస్క్యూ టీమ్ సభ్యులు గాలిస్తూ.. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటికి తీశారు. కలకడ మండలం గుడిబండ పంచాయతీ చొక్కనవారిపల్లెకు చెందిన బి.సూరి కుమారుడు బి.వెంకటరత్నం(24) లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసుకొని ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. లండన్‌లోనే ఉద్యోగం రావడంతో మరో 15 రోజుల్లో చేరడానికి సన్నాహాలు చేసుకొన్నాడు. ఈ నెల 15న సంక్రాంతి సందర్భంగా స్నేహితులతో కలసి క్రికెట్ ఆడిన తర్వాత.. ఈతకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. చుట్టుపక్కల బావులు లేకపోవడంతో గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె సమీపంలోని క్వారీ నీటి గుంతల్లోకి వచ్చారు. ఈత కొడుతూ ఉన్నట్టుండి నీటి గుంతల్లో మునిగిపోయాడు. స్నేహితులు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు రోజుల పాటు వాల్మీకిపురం, పీలేరు, రాయచోటి రెస్క్యూ టీమ్ సభ్యులతో క్వారీ గుంతల్లోని నీటిలో యువ ఇంజినీర్ కోసం గాలించారు. ఫలితం లేక పోవడంతో శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి ఎస్డీఎస్ టీమ్‌ను పిలిపించారు. రెస్క్యూ టీమ్ సభ్యులు ఉదయం క్వారీ నీటి గుంతల్లో తమ సామగ్రితో వెళ్లి యువ ఇంజినీర్ మృతదేహాన్ని ఎట్టకేలకూ బయటకు తీశారు. అప్పటికే క్వారీ వద్దకు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు చేరుకొన్నారు. మృతదేహం బయటకు రాగానే కుటుంబ సభ్యులు బోరున రోదిస్తూ కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ మధురామచంద్రుడు వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా యువ ఇంజనీర్మృతితో చొక్కనవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల తరువాత మృతదేహం వెలికితీత ఈత కోసం క్వారీ గుంతల్లోకి వెళ్లి మృత్యువాత -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెద్దతిప్పసముద్రం : ఒక వైపు అప్పులు, మరో వైపు మద్యానికి బానిసైన సీతక జయదేవ్ (53) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు భానుప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ కాయలవాండ్లపల్లికి చెందిన జయదేవ్ తిరుపతిలో పండ్ల వ్యాపారం చేస్తుండే వాడు. కట్టుకున్న భార్యను 10 ఏళ్ల క్రితం వదిలేసి మరో వితంతు మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలాగే అప్పుల కారణంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ కోసం ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని లోలోపలే కుమిలిపోతూ పలువురికి తన గోడు చెప్పుకొన్నాడు. తనకు చావే శరణ్యం అని నిర్ధారించుకుని గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గ్రామస్తులు అడ్డుకుని అతనిలో మనోధైర్యం నింపారు. అయినా శుక్రవారం వేకువజామున కాయలవాండ్లపల్లి సమీపంలోని చింతచెట్టుకు డ్రిప్ పైపుతో గొంతుకు బిగించి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం మదనపల్లె : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ రామాచార్లపల్లెకు చెందిన జయప్ప కుమారుడు శంకర(38) భవననిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడి భార్య లక్ష్మి, కుటుంబ సమస్యలతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పలుమార్లు కాపురానికి రావాల్సిందిగా కోరినా, ఆమె రాకపోవడంతో శంకర తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బేల్దారి కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి
రాజంపేట : రాజంపేట మండలం ఉప్పరపల్లెలో టీడీపీ వర్గీయులు.. గ్రామస్తుడు, బేల్దారి పని చేసుకునే మీసాల వెంకటేశు ఇంటిపై దాడి చేసిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ గొడవకు మురికినీటి నిల్వలపై మట్టిపోసి పూడ్చడమే కారణంగా చూపుతున్నా.. టీడీపీ వర్గీయులు పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని దౌర్జన్యానికి దిగినట్లు గ్రామస్తులు చెప్పుకొంటున్నారు. బేల్దారి కూలి మీసాల వెంకటేశుకు సంబంధించిన వారిపై దొంతం ఈశ్వరయ్యకు చెందిన సుమారు 24 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తనను రక్షించుకునేందుకు బాధితుడు తమ వారితో తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. వీరంతా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఉప్పరపల్లెలో ఉద్రిక్తత ఉప్పరపల్లెలో ఉద్రిక్తతగా పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లాఠీలతో చెదరగొట్టారు. కాగా గతంలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ అదేమి లెక్క చేయకుండా ఘర్షణకు దిగారంటే, వీరి వెనుక టీడీపీ స్థానిక నేత హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రపు కేసుతో.. మీసాల వెంకటేష్ సంబంధీకులపై 25 మంది టీడీపీ వర్గీయులు దాడి చేస్తే మన్నూరు పోలీసులు నామమాత్రపు కేసు కట్టి చేతులు దులుపుకొన్నారని బాధిత వర్గీయులు వాపోతున్నారు. పైగా మన్నూరు పోలీసుస్టేషన్ వద్ద మకాం వేసి టీడీపీ నేత గంపశివ తమపై దాడి చేసిన వారితో రాజీ కావాలని ఒత్తిడి చేస్తున్నారని మీసాల వెంకటేశు మీడియాకు తెలిపారు. టీడీపీ నేత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని విమర్శలు వెలువడ్డాయి.నామమాత్రపు కేసు పెట్టారంటూ బాధితుల ఆవేదన -
వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం
కడప ఎడ్యుకేషన్ : అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వైవీయూకు కాంస్య పతకం లభించింది. యోగివేమన క్రీడా బోర్డు కార్యదర్శి, వ్యాయాయ విద్య విభాగ అధిపతి కొవ్వూరు రామసుబ్బారెడ్డి శుక్రవారం క్రీడాకారుడిని అభినందించి, వివరాలు వెల్లడించారు. జలందర్‌లో జనవరి 15 నుంచి 21వ తేదీ వరకు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలలో యోగివేమన విశ్వ విద్యాలయ చాంపియన్ లిఫ్టర్ పోటీలలో దేవరకొండ ప్రేమ్‌సాగర్ 81 కేజీల విభాగంలో సత్తా చాటి వేమన విశ్వ విద్యాలయానికి కాంస్య పతకం సాధించి పెట్టారని తెలిపారు. ఈ క్రీడాకారుడు సీఎస్ఎస్ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలల్లో విద్యను అభ్యసించారని చెప్పారు. ఈయన స్నాచ్నందు 140 కేజీలు, క్లీన్ అండ్ జర్క్స్థాయిలో 166 కేజీల బరువును ఎత్తి మొత్తం 306 కేజీలతో జాతీయ స్థాయిలో బ్రాంజి మెడల్ సాధించాడని చెప్పారు. ఇదే క్రీడాకారుడు దక్షణ, పశ్చిమ మండల విశ్వ విద్యాలయాల పోటీలలో విశ్వవిద్యాలయానికి కాంస్య పతకం సాధించి అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు అర్హత సాధించాడన్నారు. ఈ సందర్భంగా వైవీయూ ఉపకులపతి, క్రీడాబోర్డు చైర్మన్ అచార్య కృష్ణారెడ్డి క్రీడాకారుడిని అభినందించి రాబోయే ఖేలో ఇండియా పోటీలకు వైవీయూ తరఫున భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. వైవీయూ కుల సచివులు ఆచార్య పుత్తపద్మ, ప్రధానాచార్యులు రఘనాధరెడ్డిలు క్రీడాబోర్డు, శిక్షకులు, టీమ్ మేనేజర్ ప్రసాద్‌రెడ్డిని అభినందించారు. -
‘నా పంటను దున్నేశారు’
బ్రహ్మంగారిమఠం : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత పంచాయతీ పలుగురాళ్ళపల్లె సమీపంలోని బొగ్గులవారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయుడు శీలం సిద్దారెడ్డికి చెందిన పైరు ఉన్న భూమిని శుక్రవారం ఎర్రంపల్లెకు చెందిన సిద్దయ్య యాదవ్ మేకల పుల్లయ్య యాదవ్‌లు దున్నినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం సిద్దారెడ్డి విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. పలుగురాళ్ళపల్లె పొలం సర్వే నంబర్ 825లో 2.50 ఎకరాలు తమ పిత్రాజితం భూమి అని పేర్కొన్నారు. సర్వే నంబర్ 826లో 2 ఎకరాలు ఎర్రంపల్లెకు చెందిన లగసాని వీరయ్య దగ్గర అదే గ్రామానికి చెందిన మేకల పోలయ్య కొనుగోలు చేశాడన్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి తనకు ఉన్న భూమిలో అర్ధం ఆయన భూమి ఉందంటూ.. తనపై దౌర్జన్యం చేస్తూ వస్తుంటే అడ్డుకుంటూ వస్తున్నామన్నారు. సర్వే చేయించుకోవాలని తెలిపినా వినడం లేదని, ఇప్పటికే సర్వే కోసం మేకల పుల్లయ్యకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. అయినా రాకుండా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను పంటను వేశానన్నారు. టీడీపీ అధికారంలో ఉందని, ఎమ్మెల్యే తమ్ముడు పుట్టా ఆనంద్ చెప్పాడని శుక్రవారం ఉదయం.. తాము లేని సమయంలో పైరు ఉన్న పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి అడ్డుకోవడానికి తాము అక్కడికి వెళ్లే లోపు కొంత దున్నేసి వెళ్లిపోయారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పొలం ఎవరిది ఎంత వరకు అనేది సర్వే చేయించుకోవాలని సిద్దారెడ్డి కోరారు. -
ఎట్టకేలకు కురబలకోట మండల మీట్
కురబలకోట : కురబలకోట మండల మీట్ ఎట్టకేలకు శుక్రవారం జరిగింది. మూడు సార్లు వాయిదా పడిన తర్వాత నాలుగో సారి ఉత్కంఠ మధ్య జరిగింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా ముగియడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో మెజారిటీగా 11 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, ఒక ఇండిపెండెంట్ ఎంపీటీసీ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండల మీట్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గతేడాది జూలై 12న మండల మీట్ జరగాల్సి ఉండగా.. కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో వాయిదా పడింది. మళ్లీ అదే నెల 19న మండల మీట్‌కు కోరం సభ్యులు హాజరైనా కోరం లేదని వాయిదా వేశారు. అయితే మెజారిటీ సభ్యులతో కోరం ఉండటం, ఆపై రిజిస్టర్లో సభ్యులు సంతకాలు కూడా చేసి ఉండటంతో కోరం ఉన్నట్లు ఆ తర్వాత నిర్ధారించి నివేదికలు పంపారు. తిరిగి అక్టోబరు 18న మండల మీట్ నిర్వహించాల్సి ఉండగా.. మళ్లీ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో కోరం లేక వాయిదా పడింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అభివృద్ధి కోసం కలిసి సాగుదాం : ఎంపీపీ హైకోర్టు ఆదేశాలతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల మీట్‌కు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల నుంచి 150 మందికి పైగా సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. సభ్యులు, అధికార ఉద్యోగులను మాత్రమే మండల మీట్‌కు అనుమతించారు. వైఎస్సార్సీపీకి చెందిన పది మంది సభ్యులతో పాటు ఇండిపెండెంట్ సభ్యుడు వైజీ సురేంద్ర హాజరయ్యారు. సంపూర్ణ కోరం లభించింది. చింతమాకులపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ మాత్రం హాజరు కాలేదు. ఐదుగురు కూటమి నాయకులు మాత్రం ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంపీపీ బి.దస్తగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజా సంక్షేమాన్ని వివిధ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని సమావేశాలకు ఆటంకం కల్గించరాదని ఎంపీపీ బి.దస్తగిరి అన్నారు. మండల అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక కృషి చేశారన్నారు. ఊరూరా రోడ్లు వేయించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించారన్నారు. అదే విధంగా మండల ప్రగతిలో భాగంగా కూటమి నాయకులు మండల మీట్ నిర్వహణకు సహకరించడం శుభపరిణామమన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజకీయాలు చూడరాదన్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుదామన్నారు. మండల మీట్ఽ సజావుగా జరగడానికి సహకరించిన నాయకులు, అధికార యంత్రాంగం మరో వైపు పోలీసులతోపాటు ప్రతి ఒక్కరికీ ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మండల మీట్లో కనసానివారిపల్ల్లె వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ముదివేటి ఆనందరెడ్డి వివిధ సమస్యలపై సభలో గళమెత్తారు. ఆ గ్రామ సర్పంచ్ ఆర్కే కృష్ణారెడ్డి కూడా సమస్యల పరిష్కారం కోసం సభ దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ బైసాని జ్యోతి పాల్గొన్నారు. డీఎస్పీ కొండయ్య ఆదేశాలతో రూరల్ సర్కిల్ సీఐ రమేష్ పర్యవేక్షణలో ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. మూడు సార్లు వాయిదా తర్వాత విజయవంతం హైకోర్టు ఆదేశాలతో పటిష్ట బందోబస్తు