annamayya district Latest News
-
పథకాల ప్రగతి సాధనలో లక్ష్యాలను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్‌నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి వీసీలో జిల్లా కలెక్టర్, డీఆర్ఓ మధుసూదనరావు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉచిత ఇసుక పథకంలో జిల్లా అవసరాలకు తగినంత ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపట్టిన ఎంఎస్ఎంఈల సర్వేను పటిష్టంగా నిర్వహించాలన్నారు. పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి జిల్లాలో పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, డీఎల్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రెవెన్యూ అంశాలు, నిత్యావర వస్తువుల పంపిణీ, పల్లె పండుగ పనులు, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పనులు, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. నిరుపయోగంగా, వ్యవసాయ వినియోగం లేని భూములను నేపియర్ గడ్డి పెంపకానికి గుర్తించిన ఏజెన్సీకి లీజుకు ఇస్తే ఎకరాకు వార్షికంగా రూ. 30 వేలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాలు లీజుకు ఇస్తే రైతులకు నికర ఆదాయం ఉంటుందన్నారు. పల్లె పండుగ క్రింద జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ ఈ మాసాంతంలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, డిఆర్ఓ మధుసూదనరావు, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వైవీయూకు రూ.10 కోట్ల ప్రాజెక్టు మంజూరు
కడప ఎడ్యుకేషన్: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకెళ్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయానికి మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘పార్టనర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (ఏ ఎన్ ఆర్ ఎఫ్–పి.ఎ.ఐ.ఆర్) పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ. 10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం యోగి వేమన విశ్వవిద్యాలయం లో రోగనిర్ధారణ, మెటబాలిక్, ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధుల చికిత్సలు, వ్యాధి నిఘా యంత్రాంగంపై దృష్టి సారించే మొత్తం 22 ప్రతిపాదనలను వివిధ విభాగాలలో కలసి 27 మంది అధ్యాపకులు సమర్పించారు. ప్రాజెక్టు నిధులతో పరిశోధనలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని స్పోక్ సంస్థగా ఎంపిక చేయడం, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఎఎన్ఆర్ఎఫ్–పీఏఐఆర్ గ్రాంట్‌ను అందించడం వెనక విశ్వవిద్యాలయంలో నాణ్యమైన బోధన, పరిశోధన ఉన్నత ప్రమాణాలే కారణమన్నారు. పరిశోధన నిధులతో నాణ్యమైన పరిశోధనలు చేస్తామన్నారు. పరిశోధనల కేంద్రంగా, పరి శోధన వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ప్రొఫె సర్ కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా. పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యంశర్మ పాల్గొన్నారు.వైవీయూ వీసీ ఆల్లం శ్రీనివాసరావు -
ధర లేక.. దిక్కుతోచక!
● పంట విక్రయించేందుకు అన్నదాత అగచాట్లు ● తగ్గుతున్న ధాన్యం ధరలు ● ఆందోళనలో రైతులు సుండుపల్లె: రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు మాత్రం లేవు. ఎకరం వరి పంట సాగు చేయాలంటే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధర ఉండటం లేదని.తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. ● జిల్లాలో 6,885 హెక్టార్లకు 2024–25 సంవత్సరం రబీ సీజన్లో 2,735 హెక్టార్లలో మాత్రమే రైతులు వరి పంటను సాగు చేశారు. సిద్దవటం మండలంలో 621 హెక్టార్లు, నందలూరు మండలంలో 300, రాజంపేట మండలంలో 260, కలికిరి మండలంలో 231, వాయల్పాడు మండలంలో 203, పీలేరు మండలంలో 147, సుండుపల్లె మండలంలో 133 హెక్టార్లలో వరి పంటను సాగు చేయగా మిగతా మండలాల్లో వరి సాగు తగ్గింది. వ్యవసాయ కూలీలు, రసాయనిక ఎరువులు, తెగుళ్లకు మందులు, సేద్యపు ఖర్చులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కౌలు రైతులకు అదనంగా ఖర్చు వస్తుంది. కూలీలు సమయానికి దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు పంట పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చి విక్రయించే వరకు భయం భయంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో 77 కేజీల వరి ధాన్యం బస్తా రూ.2 వేలు గత ప్రభుత్వంలో జిల్లాలో 77 కేజీల వరి ధాన్యం బస్తా రూ.2 వేల నుంచి గరిష్టంగా రూ.2,200 వరకు అమ్మినట్లు రైతులు తెలిపారు. కానీ ఈసారి రబీ సీజన్లో వరి ధాన్యం బస్తా రూ.1,400 రేటు పలికింది. దీంతో ఒక్కో బస్తాపై దాదాపు రూ.600 నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు దుక్కులు దున్నేందుకు ఎరువులు, వరి నాటు, కలుపు కూలీలు, వరికోత ఖర్చులు కలిపి దాదాపు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఒక ఎకరాకు పంట బాగా పండితే 38 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. వరి రైతుకు రూ.15.58 కోట్ల నష్టం జిల్లాలో ఎకరాకు 38 బస్తాలు దిగుబడి వస్తుంది. కానీ ఒక బస్తాకు రూ.600 రేటు తగ్గింది. జిల్లాలో 6,837 ఎకరాల్లో వరి సాగు చేయగా ఒక ఎకరాకు 38 బస్తాల సగటున 2,59,806 బస్తాల దిగుబడి అంచనా. ఒక బస్తాకు రూ.600 చొప్పున రూ.2,59,806 బస్తాలకు నష్టం రూ.15,58,83,600 ఈసారి రబీ రైతులు వరి ధాన్యంపై నష్టపోయారు. నియోజకవర్గాల వారీగా వరిసాగు హెక్టార్లలో.. గిట్టుబాటు ధర కల్పించాలి రెండు ఎకరాలలో వరి పంటను సాగు చేశాను. సాగు ఖర్చులు పెరగడంతో అప్పు చేసి పెట్టుబడి పెట్టినా పంట చేతికందే సమయంలో ధరలు ఉండటం లేదు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. – పోకల సిద్దయ్య, రైతు, సుండుపల్లె మండలంప్రభుత్వం ఆదుకోవాలి రబీ సీజన్లో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. ఎకరా పంట సాగుకు రూ.40 ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు ఐదున్నర పుట్టి వచ్చింది. అయితే పుట్టి వడ్లు రూ.11 వేలకు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టి వడ్లు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – నాగమునిరెడ్డి, రైతు, వంతాటిపల్లి, సిద్దవటం మండలం -
యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
కడప సెవెన్‌రోడ్స్: ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన, అలాగే ఎస్ఎస్సీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నామని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి.నారాయణయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉండాలన్నారు. విద్యార్థులు తమ బయోడేటా, మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, ఫోటోలను జతపరిచి పంపాలన్నారు. ఇతర వివరాలకు 94408 49234 , 94406 51405 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఉండాలి రాయచోటి టౌన్: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం తప్పక ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో డ్రోన్లు ఎలా ఉపయోగించాలో టెక్నీషియన్లకు అవగాహన కల్పించారు. అనంతరం చంద్రానాయక్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా ఒక ఎకరం పొలంలో పది నిమిషాలలో పురుగుమంది పిచికారీ చేయొచ్చన్నారు. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. జిల్లాకు 34 డ్రోన్లు 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఎండీ ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ సీనీయర్ మేనేజర్ పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినికి గోల్డ్‌మెడల్ ప్రదానం
పీలేరు: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదివి గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలో తెలుగు సబ్జెక్టులో 99 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని పి నందినికి ఇదే కళాశాల పూర్వ విద్యార్థి, పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిణి గురువారం గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ సుభాషిణి మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు ప్రతి ఏటా పతకాలు,సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం ఫౌజియాబేగం, ఉపాధ్యాయినులు సుజాత, గంగయ్య, శ్రీకళ, ఉమామహేశ్వరి, రెడ్డి దీపారాణి, ఇంద్రాణి, ప్రసన్నలక్ష్మీ, రాధారాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పనుల పరిశీలన రామాపురం: మండలంలోని హసనాపురం పంచాయతీలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను గురువారం పీడీ వెంకటరత్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజువారి వేతనం రూ.350 వచ్చేలా ఉపాధి కూలీలు పని చేయాలన్నారు. మండలంలో మంజూరైన ఫారంపాండ్స్, పశువుల నీటి తొట్టె పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కూలీలు 3 నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాలేదని పీడీ దృష్టికి తీసుకురాగా మూడురోజుల్లో వస్తాయని తెలియజేశారు. లక్ష్మినరసయ్య, ఏపీఓ పెంచలయ్య, టీఏ చంద్రశేఖర్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రవిశంకర్‌రెడ్డి, పక్కీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ
నిమ్మనపల్లె : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధమైన సంఘటన నిమ్మనపల్లిలో గురువారం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం కొత్త ఇండ్లు ప్రాంతానికి చెందిన వంశీ (28) తన తల్లి, కూతురితో కలసి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంపై మదనపల్లి నుంచి నిమ్మనపల్లె మండలం తవళం గ్రామానికి బయలుదేరాడు. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ గజ్జలవారిపల్లెకు చెందిన హరీష్ కుమార్ రెడ్డి(38), తన స్నేహితుడు మహబూబ్ బాషాతో కలిసి వ్యక్తిగత పనులపై నిమ్మనపల్లెకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో చల్లావారిపల్లె సమీపంలోని మలుపు మిట్ట వద్ద ద్విచక్ర వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, మహబూబ్ బాషా, మరో వాహనంలోని వంశీ, అతని కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డి నడుపుతున్న బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి రోడ్డుపైనే వాహనం దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను 108 వాహనం లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధం వ్యక్తికి తీవ్ర గాయాలు -
ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో... పీఎంఎన్ఆర్ఎఫ్ మంజూరు
మదనపల్లె : వైఎస్సార్ సీపీ లోక్‌సభపక్షనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చొరవతో, పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చరణ్‌కు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) మంజూరైంది. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చేతుల మీదుగా తలసేమియా బాధితుడు చరణ్, తాత, నానమ్మలకు రిలీఫ్‌ఫండ్ మంజూరుపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ...పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉండే గీతాంజలి, హరిబాబు దంపతుల కుమారుడు చరణ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడన్నారు. వైద్య చికిత్సకు రూ. 14లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. బాధిత కుటుంబ దయనీయ స్థితిని స్థానిక నాయకులు ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాయం చేయాల్సిందిగా కోరారన్నారు. దీంతో స్పందించిన ఆయన ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద రూ.3లక్షలు మంజూరు చేయించారన్నారు. ఈ మొత్తాన్ని చరణ్ చికిత్స పొందుతున్న బెంగళూరు భగవాన్ మహావీర్‌జైన్ హాస్పిటల్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జమచేశారన్నారు. ఈ సందర్భంగా చరణ్ కుటుంబ సభ్యులు.. ఎంపీ మిథున్‌రెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్‌నాయక్, కొత్తపల్లె మహేష్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జుననాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుడికి మంజూరుపత్రాన్ని అందించిన నిసార్ అహ్మద్ -
మళ్లీ టూ ట్వంటీ ఆక్రమణకు యత్నం !
కురబలకోట : మండలంలోని అంగళ్లు మిట్స్ కళాశాల సమీపంలోని సర్వే నంబరు టూట్వంటీ (220) భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం పుంగనూరుకు చెందిన కొందరు ఈ భూమిలో ప్రవేశించి రేకులు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో మొదటి నుంచి ఈ భూమిపై హక్కులతో పాటు స్వాధీన అనుభవంలో వి. వెంకటరమణ రాజు (రాజు), సుబహాన్ తదితరులతో పాటు ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వీరిని నిలువునా అడ్డుకున్నారు. భూ హక్కు పత్రాలు చూపాలని పట్టుబట్టారు. పుంగనూరుకు చెందిన వారు వినకుండా రేకులు వేస్తామని లారీలో వాటిని తెప్పించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల వారు పరస్పరం మోహరించారు. ఈ విషయం ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. ఇరువర్గాల వారితో చర్చించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుండడంతో ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేట్మెంట్లు రికార్డు చేసి వదిలి పెట్టారు. భూ వివాదాన్ని చర్చల ద్వారా లేదా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్ఐ సూచించారు. దాదాగిరిలా వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా టూట్వంటీ సర్వే నంబరులో ఐదున్నర ఎకరం ఉంది. ఇది హైవేకు ఆనుకుని ఉంది. రూ. 10 కోట్లకుపైగా విలువ చేసేదిగా ఉంది. గతంలో కూడా వివిధ ప్రాంతాల వారు ఈ భూమిపై కన్నేసి రాద్ధాంతం చేశారు. ఒకరైతే చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఆక్రమించారు. ఇక్కడ ప్లాట్లు కొన్న వారు స్థానికులు మూకుమ్మడిగా తరలి వచ్చి ఈ ఫెన్సింగ్‌ను ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో పాటు నిమిషాల్లో నేల మట్టం చేశారు. మదనపల్లెకు చెందిన వి. రాజు తదితరులు ఈ భూమిని 2016లో అంగళ్లుకు చెందిన ఇస్మాయిల్, ఖలీల్, సీకే మహమ్మద్ తదితరుల నుండి కొన్నారు. ప్లాట్లు వేసి 72 మందికి విక్రయించారు. కొందరు కట్టడాలు కూడా నిర్మించారు. రికార్డు కూడా వీరికి పక్కాగా ఉంది. అయినా ఎవరెవరో వచ్చి ఆక్రమించే యత్నం చేస్తున్నారు. గురువారం వచ్చిన వారికి కూడా ఈ భూమికి సంబంధించి కనీసం వన్‌బీ లేదా పట్టాదారు పాసుపుస్తకం కూడా లేదు. మాదే భూమంటూ చొరబడే యత్నం చేశారు. 1923లో సదరు భూమిని వీరు విక్రయించినట్లు రికార్డులు కూడా ఉన్నాయి. అయినా భూమి తమదేనంటూ ఆక్రమించే యత్నం చేయడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. అంగళ్లులోని టూ ట్వంటీ భూ వివాదం ఎనిమిదేళ్లుగా నడుస్తూనే ఉంది. అన్నమయ్య జిల్లాలోనే టూట్వంటీ భూ వివాదం హైటెన్షన్‌గా మారింది. జిల్లాలోనే అత్యంత వివాదాస్పద భూమిగా పేరు పొందింది అడ్డుకున్న హక్కుదారులు ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించిన ఎస్ఐ సడలిన ఉద్రిక్తత -
ఎస్ఐ ఇల్లు సహా నాలుగు ఇళ్లలో చోరీ
ప్రొద్దుటూరు క్రైం : కొన్ని రోజుల క్రితం వచ్చిన అల్లుఅర్జున్ పుష్ప–2 సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ పోలీసులకు దొరకకుండా వారికి చుక్కలు చూపిస్తాడు. కథలో భాగంగా పుష్ప చెప్పే ‘దమ్ముంటే పట్టుకో షెకావత్తు.. పట్టుకుంటె వదిలేస్త సిండికేట్టు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ప్రొద్దుటూరులో కూడా కొన్ని రోజుల నుంచి వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి వరుసగా చోరీలు చేస్తున్నా పోలీసులు వారిని పట్టులేకపోతున్నారు. ఇన్ని రోజులు ప్రజల ఇళ్లలో చోరీలు చేసిన దొంగలు ఈ సారి ఎస్ఐ ఇంటినే టార్గెట్ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ధనుంజయ ఇంట్లో చోరీ చేసి ‘దమ్ముంటె పట్టుకో ధనుంజయ..! పట్టుకుంటే వదిలేస్త దొంగతనాలు’ అంటూ ఎస్ఐకే సవాల్ విసురుతున్నారు. ఎస్ఐ అనే భయమే లేకుండా ఆయన ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. ఎస్ఐ ఇంట్లో చోరీ జరగడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రొద్దుటూరులో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఇళ్లల్లో చొరబడ్డారు. ఒక ఇంట్లో మాత్రం పెద్ద ఎత్తున బంగారు, వెండి, నగదును దొంగలు దోచుకెళ్లారు..ఎస్ఐ ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన రెండు ఇళ్లల్లో విలువైన వస్తువులేమీ దొంగలకు దొరకలేదు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న నరాల బాలిరెడ్డి కాలనీలో విలాసవంతమైన ఇళ్లను నిర్మించారు. ఈ కాలనీలోని నాలుగు ఇళ్లలో గురువారం అర్థరాత్రి 1.30 సమయంలో దొంగలు పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎనమల చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో సుమారు 60 తులాల బంగారు, 3 కిలోల వెండి, రూ. 12 లక్షల నగదును దోచుకెళ్లారు. వారి ఇంటి సమీపంలో ఉన్న టూ టౌన్ ఎస్ఐ ధనుంజయ ఇంట్లో హుండీని దోచుకెళ్లారు. ఎస్ఐ ఇంటి పక్కనే ఉన్న ఈశ్వరరెడ్డి, ఎల్లంశెట్టి రాజా ఇంట్లో విలువైన బంగారు నగలు ఏమీ దొరకలేదు. కనిపెట్టి కన్నేశారు..చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు చెన్నకేశవరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని వివాహం ఈ నెల 13,14 తేదీల్లో ప్రొద్దుటూరులోని వైవీఆర్ కల్యాణమండపంలో జరిగింది. ఇందులో భాగంగా ఇంటికి తాళం వేసి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులందరూ 16న కర్నూలుకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ ఇంట్లో చొరబడిన దొంగలు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ 60 తులాల బంగారు, రూ. 12 లక్షలు నగదు, 3 కిలోల వెండి అపహరణ శుభ కార్యానికి కర్నూలుకు వెళ్లిన ఓ కుటుంబం ఐదుగురు కలిసి చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో నిర్ధారణ ఎస్ఐ ఇంటిని వదలని పోలీసులు ఎస్ఐ ధనుంజయుడు ఇంట్లో దొంగతనం జరగడం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ఇళ్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఇళ్ల పరిస్థితి ఏంటని అంటున్నారు. ఎస్ఐ ధనుంజయుడు తన యూనిఫాంను సోఫాపై ఉంచారు. యూనిఫాంను చూసిన దొంగలు ఇది పోలీసు అధికారి ఇల్లని గ్రహించి ఉంటారు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఇంట్లో ఉన్న హుండీని ఎత్తుకొని వెళ్లారు. -
గురుకుల పాఠశాల విద్యార్థులకు పతకాలు
రామాపురం : విజయవాడకు చెందిన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ విభాగంలో రామాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారు. 30 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈనెల 5వ తేదీన ఫలితాలు ప్రకటించగా అందులో ఆరుగురు విద్యార్థులకు బంగారు పతకాలు, 8 మంది విద్యార్థుకు వెండి పతకాలు దక్కడంతో ఆర్ట్ టీచర్ ఆనందరాజును ప్రిన్సిపాల్ వి.వి. వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలి మదనపల్లె సిటీ : ఘన చరిత్ర కలిగిన బీటీ కళాశాలను ప్రభుత్వం యూనివర్సిటీగా ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లెలో విలేకర్లతో మాట్లాడారు. కాలేజీలో పూర్థిస్థాయిలో ఫ్యాకల్టీ, నాన్ టీచించ్ స్టాఫ్‌ను నియమించాలన్నారు. పీజీ కోర్సులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. మెడికల్ కాలేజీని పీపీఈ పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, జిల్లా అధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి రమణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
ఓబులవారిపల్లె : గాదెల వెంకటాపురం గ్రామానికి చెందిన టి.శంకరయ్య 15 రోజులుగా కనిపించడం లేదని, గురువారం కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిసినట్లయితే 9121100580 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ స్తంభం విరిగిపడి పాడి ఆవు మృతి రామసముద్రం : జోరుగా వీచిన ఈదురు గాలులకు చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ లైన్‌పై పడటంతో ఆ దెబ్బకు విద్యుత్ స్తంభం విరిగి పాడి ఆవుపై పడింది. ఈ ప్రమాదంలో పాడి ఆవు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి అరికెల పంచాయతీ దాసిరెడ్డిపల్లిలో జరిగింది. ఆవు యజమాని దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలుపుదల కోసం విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి ఆవు విలువ సుమారు. రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. వరకట్న వేధింపులపై కేసు నమోదు రామసముద్రం : వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాలేనత్తం పంచాయతీ ఎరపశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమార్తె లావణ్య (23) ను పెద్దపంజాణికి చెందిన సునీల్ ప్రతాప్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే భర్త సునీల్ ప్రతాప్, అత్త గంగులమ్మలు వరకట్నం తెమ్మని వేధిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిపై దాడిపెద్దతిప్పసముద్రం : మండలంలోని మల్లెల గ్రామ మసీదులో మౌజన్‌గా పని చేస్తున్న అజ్మత్‌పై అదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలో ఉన్న ఓ చింత చెట్టు ఫలసాయాన్ని మసీదు అవసరాలకు వినియోగించాలనేది మత పెద్దల నిర్ణయం. ఈ నేపథ్యంలో మౌజన్ చింత కాయలను కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి ఈ చింత చెట్టు తమ పూర్వీకులదని, ఇందులో తమకూ హక్కు ఉందని, కాయలు కోయడానికి నువ్వెవరు అని దూషిస్తూ అజ్మత్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రాయచోటి : జిల్లాలో పెట్రేగుతున్న అసాంఘిక శక్తులపట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి, పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు సంబంధిత పోలీసులు పాల్గొన్నారు. చంద్రబాబు పాలన అంతమే మాలల పంతం – మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మదనపల్లె : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం ఒక కులానికి మద్దతు తెలిపి, మిగిలిన వారిపై నిర్లక్ష్యం కనబరిచిన చంద్రబాబు పాలన అంతమే మాలల పంతమని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం తెలిపారు. గురువారం పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 2011 గణాంకాల ప్రకారం 2025లో వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాలలకు అన్యాయం చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని రానున్న స్థానిక సంస్థల్లో మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు యమలా చంద్రయ్య, గుండా మనోహర్, వీరనాల మాణిక్యం, ఎలక్ట్రిషియన్ మోహన్, పలమనేరు జయశంకర్, గంగరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు ఆత్మహత్య ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో అప్పుల బాధ భరించలేక మడక రామకృష్ణ(49) అనే కౌలు రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు కౌలు వ్యవసాయంలో ఆదాయం లేకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ పొలంలో వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
మదనపల్లె : వేటగాళ్ల ఉచ్చులో పడిన చిరుతపులిని కాపాడటంలో నిర్లక్ష్యం కనబరిచి, పులితో పాటు రెండు మగ కూనల మృతికి కారకులైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన(బీవైఎస్) అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. గురువారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను కలిసి చిరుత పులిని కాపాడటంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ చిరుత పులి మరణానికి కారణం ముమ్మాటికీ అటవీశాఖ అధికారులదేనన్నారు. ఎఫ్బీఓ పర్యవేక్షణ సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు జిలానిబాషా, ఆది, వినయ్, బాలకృష్ణ, ద్వారక, వంశీ, శంకర్, జగదీష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
రాయచోటి జగదాంబసెంటర్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీల వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.గౌస్‌బాషా బుధ వారం తెలిపారు. జిల్లా పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 8 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు గల క్రీడాకారులకు సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడా సంఘాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వివరాలను డీఎస్డీఓ కార్యాలయానికి తెలియజేయాలని ఆయన తెలియజేశారు. అసంపూర్తి ఇళ్లకు ఆర్థిక సాయం పెనగలూరు: గతంలో పక్కా ఇళ్లు మంజూరై, వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్నదని పీడీ సాంబ శివయ్య తెలిపారు. బుధవారం మండలంలోని కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ సముద్రం కాలనీలో హౌసింగ్ లబ్ధిదారులతో పీడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీకి గతంలో మంజూరైన పక్కా గృహాల లబ్ధిదారులకు పాత బిల్లుతో కలిపి అదనంగా రూ. 75 వేలు కలిపి ఇస్తున్నామని తెలిపారు. పురోగతిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75వేలు అదనంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ మురళీకృష్ణ, ఏఈ హరిప్రసాద్, సర్పంచ్ రామాంజులమ్మ పాల్గొన్నారు. -
సారూ.. తాగునీరేది?
● డీహైడ్రేషన్ ప్రమాదం ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దాహం ఎక్కువగా వేస్తుంది. అందుబాటులో నీరు లేకపోతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. ఇందుకోసం విద్యాశాఖ జలగంట కార్యక్రమం అమలు చేస్తుంది. ఇంటి నుంచి నీళ్ల సీసా తెచ్చుకుంటున్న చిన్నారులకు అది పూర్తయితే మళ్లీ పట్టుకునే వీలులేకుండా పోయింది. ఆర్ఓ ప్లాంట్లు వినియోగంలోకి తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల దాహం పెరుగుతోంది. తాగడానికి నీరు ఉండటం లేదు. అనేక స్కూళ్లలో ఇంటి నుంచి తాగేందుకు నీరు తెచ్చుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఉన్నా.. నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. మరికొన్ని స్కూళ్లలో తాగునీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మదనపల్లె సిటీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే గడప దాటని పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో గొంతులు తడారి పోతున్నాయి. సరైన సమయానికి మంచినీరు తాగకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉదయం 10, 11, 12 గంటలకు జల గంట మోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా.. సర్కారు పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ల మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటి బాటిళ్లు ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు శుద్ధ జలం అందేది. ఆర్ఓ ప్లాంట్లు విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. నాడు–నేడు మొదటి విడతలో 600 పాఠశాలలు, రెండో విడతలో 1016 పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో సుమారు 1000 వరకు ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తూతూ మంత్రంగా.. పాఠశాల్లో నీటి గంట(వాటర్‌బెల్) కన్పించడం లేదు. ఆర్ఓ ప్లాంట్లు పని చేయకపోవడంతో.. విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు మొదటి గంటకే పూర్తవుతున్నాయి. దీంతో వాటర్ బెల్ కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. అంత నీరు తాగాల్సిందే వైద్యనిపుణుల సూచనల ప్రకారం .. ఒకటి నుంచి మూడేళ్లలోపు పిల్లలు రోజుకు 1.3 లీటర్లు, 4 నుంచి ఆరేళ్లలోపు 1.7 లీటర్లు, ఐదు నుంచి 13 ఏళ్ల లోపు 2.4 లీటర్లు, 13 ఏళ్లు పైబడిన వారు 3 నుంచి 4 లీటర్లు తాగాలని చెబుతున్నారు. విద్యార్థులు కచ్చితంగా ప్రతి గంటన్నరకు ఒకసారి 100 ఎంఎల్ నీటిని తాగాలి. సరైన మోతుదులో నీరు శరీరంలో లేకుంటే అలసట, బాలికలకు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు రావడం, కాళ్లునొప్పి, ఇతర సమస్యలు తలెత్తడం, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు:1734 ప్రాథమికోన్నత పాఠశాలలు: 162 ఉన్నత పాఠశాలలు: 304 విద్యార్థులు: 1,54,784 ఆర్వో ప్లాంట్ల వివరాలు మొదటి విడత: 600 పాఠశాలలు రెండవ విడత: 1016 పాఠశాలలు ప్రస్తుతం పని చేయని ఆర్వో ప్లాంట్లు: సుమారు 1000 ఫిర్యాదు చేశాం ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన వారికి ఫిర్యాదు చేశాం. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పని చేయడం లేదు. సాంకేతిక సిబ్బంది రావడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –ప్రభాకర్‌రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి, మదనపల్లె పాఠశాలల్లో మోగని నీటి గంట పని చేయని ఆర్వో ప్లాంట్లు గంటకే ఖాళీ అవుతున్న సీసా నీరు దాహార్తితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు -
కందుల కొనుగోలు గడువు పెంపు
రాయచోటి జగదాంబసెంటర్: నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లాలో కంది పండించిన, ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి మద్దతు ధరపై ఒక క్వింటా రూ.7,550 కందులు కొనుగోలు చేసేందుకు గడువును ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ త్యాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు గడువు గతంలో ఈ నెల 15 వరకు ఉందని, ప్రస్తుతం 19వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు రూ.150 దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వన్నుట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయంలో కానీ సంబంధింత మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. విజయానికి అవగాహనే అస్త్రం కురబలకోట: ఏ రంగంలో నైనా విజయానికి అవగాహన అస్త్రం లాంటిదని, విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే లర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలీటీలు ఆవశ్యకమని బెంగళూరు మైక్రోసాఫ్ట్ అజురే ఏఐ ఎంవీపీ ఎస్. పూర్ణిమ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు తర్వాత మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారన్నారు. ఇందుకు తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ప్రాజెక్టులు, హ్యాక్‌ధాన్ ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం
సిద్దవటం: ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ సురేష్‌బాబు తెలిపారు. సిద్దవటంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని టక్కోలు, మాచుపల్లె గ్రామాల్లోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారం అంతా విషపూరితమే అని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై మహిళా సమాఖ్యలతో భాగస్వామ్యం , ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రైతు సాధికార సంస్థ.. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య సంఘాలతో సంప్రదించి ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్.వి. ప్రవీణ్, అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బద్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు నాగరాజ, మండల వ్యవసాయధికారి రమేష్‌రెడ్డి, ఏపిఎం సుజాత, మండల సమాఖ్య అధ్యక్షురాలు , వివోఏలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి....
ఐదు ఎకరాల మామిడి తోటలో కాయలు, చెట్లు, కొమ్మలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాపు, కోత దశలో ఉన్న అరటిచెట్లు గాలివానకు పడిపోయాయి. కోలుకోలేని విధంగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. –సుంకేసుల మస్తాన్, రైతు, చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం నష్టపరిహారం అందించాలి వై కోట, గాదెల గ్రామాల్లో గాలివానకు అరటి, మామిడి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికి అందిన పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. –మల్లెం ఈశ్వరయ్య, సర్పంచ్, వై కోట -
ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు వందశాతం రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2025–26లో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద ఏపీ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వైబ్‌సైట్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు అంశంపై బ్యాంకర్లతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 2025–26లో ఎస్సీ ప్రణాళిక కింద జిల్లాకు 563 యూనిట్లను కేటాయించారని కలెక్టర్ తెలిపారు. 563 యూనిట్లకు వివిధ సెక్టార్లలో రూ. 2341 లక్షల రుణాలు ఇవ్వాలని, ఇందులో రూ. 924 లక్షలు 40 శాతం మేర రాయితీగా పరిగణిస్తారని తెలిపారు. జిల్లాకు 34 డ్రోన్ యూనిట్లు..... వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను పొందేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతను అందిస్తోందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం పెంచడానికి కూడా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాకు 34 డ్రోన్లు యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు. 80 శాతం రాయితీతో డ్రోన్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ చంద్ర నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమ శిక్షణతో వాటిని సాధించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి గ్రాండ్ ప్రైజ్ (లాప్టాప్) టాబ్, ఫస్ట్ ప్రైజ్‌తోపాటు గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారు సాధించిన ల్యాప్‌టాప్, ట్యాబ్, గోల్డ్ మెఢల్, సర్టిఫికెట్లను బహూకరించి అభినందనలు తెలిపారు. -
స్కూటీని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
కమలాపురం : కమలాపురం రైల్వే గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రాం నగర్‌కు చెందిన మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాం నగర్‌కు చెందిన సరోజ(48) తన కూతురు మౌనికతో కలసి స్కూటీలో క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి వెళ్తుండగా రైల్వే గేటు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు స్కూటీని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సరోజ స్కూటీ నుంచి కింద పడింది. ట్రాక్టర్ టైర్ తలపై ఎక్కడంతో సరోజ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తె మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా సరోజ మృతి చెందిన విషయం తెలియడంతో రాం నగర్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై బుగ్గలేటిపల్లె గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లె మౌలాలి(19), వెంకట జగదీశ్వర్ (20) అనే ఇరువురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మూలవంక గ్రామానికి చెందిన వేంపల్లె మౌలాలి, అతని స్నేహితుడు వెంకట జగదీశ్వర్‌తో కలిసి మంగళవారం రాత్రి బుగ్గలేటిపల్లె వద్ద డాబాకు భోజనానికి వెళ్లి తిరిగి ఇంటికి బైకుపై వస్తుండగా విష్ణు విద్యామందిర్ స్కూల్‌కు వద్ద రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వేంపల్లె మౌలాలి, వెంకట జగదీశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వెంకట జగదీశ్వర్ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వేంపల్లె మౌలాలి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో మూలవంక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకట జగదీశ్వర్ బెంగళూరులో బీబీఏ చదువుతున్నాడు. తండ్రి కరోనా కాలంలో మృతి చెందాడు. ఏకై క కుమారుడు కావడంతో తల్లి, అక్క హృదయవిదారకంగా విలపించారు. మౌలాలి బీకాం చదువుతూ పారిశ్రామిక సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వక్ఫ్ పరిరక్షణ కమిటీ(జేఏసీ) జిల్లా కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్ పేర్కొన్నారు. బుధవారం ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల ప్రకారం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ జిల్లా మీడియా ఇన్చార్జి మగ్బూల్ బాషా మాట్లాడుతూ త్వరలో మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్కీ ఆవాజ్ నగర ఉపాధ్యక్షుడు ఆబిద్ హుస్సేన్. జేఏసీ కో కన్వీనర్లు రిజ్వానా, మెహనూర్, ఫాతిమా, నిరోఫర్, అక్కర్నిసా, హసీనా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు
రాయచోటి టౌన్ : ఒకప్పుడు రాయచోటిలో చిన్న పాటి చికిత్స చేయాలన్నా సరైన వైద్య నిపుణులు లేక తిరుపతి, కడప లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే రాయచోటిలో కూడా కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాయచోటి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని 100 గదుల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో దాదాపుగా రూ.25కోట్లు ఖర్చు చేసి పెద్ద భవనాలు నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే వైద్యులను నియమించడంతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో.. గాలివీడు మండలానికి చెందిన శృతి అనే పేద మహిళ మొదటి కాన్పు సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి శస్త్ర చికిత్స ద్వారా మొదటి కాన్పు జరుపుకొంది. ఆ సమయంలో ఆ సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ మలం, మూత్రం రెండు ఒకే దారిలో రావడం మొదలయ్యాయి. దీనిని రెక్టో వేజైనల్ ఫిస్టులా అంటారు. అసలే పేద కుటుంబం కావడంతో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోలేక తీవ్ర మనోవేదనను అనుభవించింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం రెండవ కాన్పు కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తన తల్లితో కలసి వచ్చింది. ఈ విషయం ఆస్పత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. సాధారణ కాన్పు చేసిన వైద్యులు తరువాత ఆమెకు ఉన్న పెద్ద సమస్యను కూడా గుర్తించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ జీనత్ బేగం, శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్, అనస్థీషియా డాక్టర్, ఇతర వైద్యులు కలిసి చర్చించారు. ఆమెకు ఉన్న సమస్యను పరిష్కరించాలంటే ఆపరేషన్ ఒక్కటే మార్గమని తీర్మానించారు. అందుకు ఆమె అంగీకారం తీసుకుని వెంటనే ఆమెకు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ జీనత్ బేగం, డాక్టర్ బండారు కిరణ్‌కుమార్, డాక్టర్ శివ, డాక్టర్ అజాజ్ అహమ్మద్‌తో కలసి ఆపరేషన్ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రిలో... రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో ఒకే రోజు రెండు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ప్రాణదానం చేశారు. గాలివీడుకు చెందిన బాలుడు నీటి కుంటలో పడిన సమయంలో ఊపిరి ఆడక పోవడంతో పాటు అదే సమయానికి గుండెకు ఆక్సిజన్ అందకపోవడంతో గుండె పోటు వచ్చింది. స్థానికులు గమనించి రాయచోటికి తరలించారు. శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి స్పందించి ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. అలాగే మంగళవారం రాత్రి ఒక మధ్య వయస్సు వ్యక్తి కంటి కింద దవడ భాగం తీవ్రంగా బాధిస్తోందని చెప్పడంతో స్కానింగ్ చేసి బ్లాక్ ఫాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే హైదరాబాద్‌కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల సలహా మేరకు వారి పర్యవేక్షణలో ఆపరేషన్ చేసి దవడ ఎముక తొలగించి దాని స్థానంలో మరొకటి అమర్చారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
– ఐదుగురిపై ఫిర్యాదు, కేసు నమోదు కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్టప్ సర్కిల్ వద్ద పులివెందుల రోడ్డులో మద్యం దుకాణం వద్ద అత్యంత కిరాతకంగా సాదిక్ వలి(30) అనే వ్యక్తిని మరియాపురానికి చెందిన రాయప్ప అలియాస్ పెద్దోడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజీలను సేకరించారు. హత్య చేసిన వారిలో రాయప్పతో పాటు, కాలియా, బాలస్వామి అలియాస్ బాలదాసులు, మరో ఇద్దరు ఉన్నట్లు సాదిక్‌వలీ భార్య యాస్మిన్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మహిళపై దాడి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి సుబ్బమ్మపై భూమి సమస్య విషయమై కె.క్రిష్ణారెడ్డి అనే వ్యక్తి దాడి చేసి బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు బుధవారం తెలిపారు. సుబ్బమ్మ, క్రిష్ణారెడ్డిల మధ్య భూ విషయంపై సమస్య ఉంది. సుబ్బమ్మ భర్త ఉషిరెడ్డి చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఇంటిలో సుబ్బమ్మ ఒంటరిగా ఉంటోంది. అయితే భూ సమస్య విషయంపై సుబ్బమ్మ ఇంటిపై క్రిష్ణారెడ్డి దాడి చేసి బెదిరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళ్లమాపురంలో చోరీ యత్నం – అడ్డు వచ్చిన యువతిపై దాడి చేసిన దుండగులు ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామంలో దుండగులు ఓ ఇంట్లో చోరీ యత్నం చేశారు. అయితే దుండగుల అ ్చటకిడిని గ్రహించి కుటుంబ సభ్యులు నిద్రలేవడంతో వారు పారిపోయారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లమాపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబ సభ్యులతో కలిసి అతను ప్రతిరోజు రాత్రి ఆరుబయట పడుకుంటాడు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి ప్రహరీ దూకారు. అక్కడే ఉన్న కుక్క వారిని చూసి మొరగడంతో సుబ్బారెడ్డి కుమార్తె వెంకటలక్ష్మి నిద్ర లేచింది. దుండగులను చూసి ఆమె దొంగా దొంగా అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో దుండగులు అక్కడే ఉన్న కట్టె తీసుకొని ఆమె తలపై కొట్టి పారిపోయారు. రూరల్ ఎస్ఐ అరుణ్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వెంకటలక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాలివానకు కూలిన విద్యుత్ స్తంభాలు కురబలకోట : మండలంలో బుధవారం రాత్రి గాలి వానకు దొమ్మన్నబావి ప్రాంతంలో లెవన్ కేవీ లైన్‌కు చెందిన మూడు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పరిసర ప్రాంతాలతో పాటు నాయనబావి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంగళ్లులో కూడా విద్యుత్ వైర్లపై కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. హుటాహుటిన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు. -
ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్టు
మైదుకూరు : వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో బైకులను దొంగతనం చేస్తున్న ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద గత నెల 21న ఓ విద్యార్థికి చెందిన స్కూటీ చోరీకి గురైంది. ఆ మేరకు చాపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రొబేషన్ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ జె.శివశంకర్, చాపాడు ఎస్ఐ కె.చిన్న పెద్దయ్యలకు అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం చాపాడు మండలం అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు, మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీని చేపట్టారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మోటారు బైక్‌లపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. విచారణలో పట్టుబడిన వారు జిల్లాలోని లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ పవన్ కుమార్ రెడ్డి, కర్ణ లోకనాథ్‌రెడ్డి, పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన గంగిరెడ్డి అశోక్‌రెడ్డిగా తేలారు. వీరు బైక్‌లను దొంగిలింస్తుంటారని తెలిసింది. మార్చి 21వ తేదీన సీబీఐటీ కాలేజీ వద్ద స్కూటీని తామే చోరీ చేసినట్లు వారు అంగీకరించారు. మరింత లోతుగా విచారించడంతో సత్యసాయి జిల్లా కదిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, తొండూరు, పులివెందుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 27 బైక్‌లను చోరీ చేసినట్లు వెల్లడించారు. చోరీ చేసిన బైకులను విక్రయించేందుకు వెలిగండ్ల గ్రామంలో దాచి ఉంచినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రొబేషన డీఎస్పీ టి.భవాని నిందితులను, బైకులను చూపించారు. మరో రెండు బైకులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ ఆదేశాల మేరకు బైక్ దొంగడలను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన చాపాడు పోలీసులు వి.బ్రహ్మేంద్ర, మధుసూదన్‌రెడ్డి, సబ్ డివిజన్ క్రైం పార్టీకి చెందిన పోలీసులు తిరుమలయ్య, నవీన్, గణేష్, ప్రసాద్, రాఘవరెడ్డిలను అభినందించి వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య పాల్గొన్నారు. 27 ౖబైకులు స్వాధీనం వివరాలను వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ -
అమృత్ భారత్ స్కీం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
రాజంపేట : రాజంపేట రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని గంతకల్లు డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్‌గుప్తా ఆదేశించారు. బుధవారం రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్ఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పనుల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పన దిశగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రైల్లో బోగీలకు సంబంధించి డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వెయిటింగ్ హాల్, స్టేషన్ బయట జరుగుతున్న పనుల నిర్మాణ దశలపై ఆరా తీశారు. డీఆర్ఎంతో పాటు సీనియర్ డీసీఎం మనోజ్, ఏడీఎన్ అహ్మదుల్లా, పలువురు డివిజన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీఆర్ఎం దృష్టికి పలు సమస్యలు.. రాజంపేట రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా పార్సిల్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని గంతకల్ డివిజనల్ రైల్వే యూజెస్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి కోరారు. డీఆర్ఎం రాజంపేటకు వచ్చిన సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేట రైల్వే స్టేషన్లో పార్సిల్ కేంద్రం ఉండటం వల్ల ఈ ప్రాంత రైతుల ఉద్యాన వన ఉత్పత్తులకు దోహద పడుతుందన్నారు. ఇందుకు డీఆర్ఎం సానుకూలంగా స్పందించారు. పలురైల్లు హాల్టింగ్ అంశాన్ని మరోసారి డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సీనియర్ డీఈఈ యల్లయ్య, సీనియర్ డీఈఎన్ అభిరామ్, కడప సీసీఐ జనార్దన్, రాజంపేట రైల్వే స్టేషన్ మేనేజర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్గుప్త -
ఆధునిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు
రాయచోటి : అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం ద్వారా కేసుల దర్యాప్తులో వేగం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులన ఆదేశించారు. బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ముఖ్య నేర సంఘటనలు, వాటిపై చేపట్టిన విచారణలు, పరిష్కారాల పురోగతి తదితర అంశాలపై సమగ్ర సమీక్ష చేశారు. నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మహిళల భద్రత, మైనర్లపై జరుగుతున్న అకృత్యాల నిరోధం, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వ్యాప్తి అడ్డుకోవడం, మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు, రౌడీషీటర్లపై నిఘా పెంచి కార్యకలాపాలను అణచివేయాలన్నారు. కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం, సైబర్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ల పనితీరుపై పరిశీలన చేపట్టి ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండే విధంగా ప్రజాసేవ దృక్పథంతో పనిచేయాలని సూచించారు. సమిష్టి కృషి, సమన్వయంతో పనిచేసి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రాయచోటి అర్బన్, రూరల్ సీఐలు బీవీ చలపతి, ఎన్.వరప్రసాద్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మర్రి తులసీరామ్, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
చిరుతను చంపింది ఎవరు.?
మదనపల్లె : మండలంలోని పొన్నూటిపాళ్యం అటవీ ప్రాంతంలో బుధవారం వేటగాళ్ల ఉచ్చులో చనిపోయిన చిరుత విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతను బతికించే అవకాశాలు కళ్ల ముందే ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి కనబరచడంతోనే వన్యప్రాణి చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పొన్నూటిపాళ్యం గ్రామస్తులు మాట్లాడుతూ...చిరుత ఉచ్చులో పడిన విషయం ఉదయం 6 గంటలకే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు ఉదయం 8 గంటలకే ఘటనా స్థలానికి చేరుకోగా, ఫారెస్ట్ అధికారులు మాత్రం 9 గంటలపైన వెటర్నరీ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. వచ్చిన వెంటనే చిరుతను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టకపోగా, అక్కడ ఉన్న జనాలను అదుపుచేయడం, ఏం చేయాలనే విషయమై చర్చించడంలోనే సమయం వృథా చేశారన్నారు. చిరుతను బంధించేందుకు వల, బోనును తీసుకువచ్చిన ఫారెస్ట్ అధికారులు డార్టింగ్ గన్ సహాయంతో ట్రాంక్విలైజర్స్ ద్వారా మత్తుమందు ఇంజెక్ట్ చేసి కాపాడాలని నిర్ణయించారు. అయితే ఫారెస్ట్ అధికారులు తెచ్చిన గన్‌కు మత్తు మందు ఎక్కించడం, దానిని ఉపయోగించడంపై అధికారులకు అవగాహన లేకపోవడం, సమయానికి అది కాస్తా పనిచేయకపోవడంతో మరింత సమయం వృథా అయింది. చిరుత ఉచ్చులో తగులుకుని విలవిలలాడటాన్ని చూసిన ప్రజల్లో నుంచి కొంతమంది, ఫారెస్ట్ అధికారులు సహకరిస్తే..తాము వలను తీసుకుని చిరుత వద్దకు వెళతామని, ఎలాగోలా విడిపించేందుకు సహకరిస్తామని చెప్పినా అధికారులు అంగీకరించలేదు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో దప్పికతో అల్లాడుతున్న చిరుతకు నీళ్లు అందిస్తామన్నా ఒప్పుకోలేదు. చిరుత భయపడుతోందని, దానికేమీ కాదని, తిరుపతి జూపార్కు చీఫ్ కన్జర్వేటర్‌కు సమాచారం అందించామని, వారు వచ్చి రక్షిస్తారని చెప్పుకొచ్చా రు. అయితే ఉచ్చులో బిగుసుకున్న చిరుత దాదాపు 8 గంటలకు పైగా నరకయాతన పడుతూ, ఒంటిపై ఉన్న గాయాల బాధను భరించలేక, ఊపిరాడక మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చనిపోయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆవేశం పట్టలేక ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో సబ్ డీఎఫ్ఓ...ఉచ్చులు వేసిన వారిదే తప్పని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించే బదులు.. అడవుల్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ ఎఫ్బీఓ, ఏబీఓ, సెక్షన్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయన్నారు. ఘటనలు జరిగిన ప్పుడు ఫారెస్ట్ అధికారులు స్పందిస్తున్నారే తప్ప జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వేటగాళ్ల ఉచ్చులో ప్రాణాలు కోల్పోయిన చిరుత గర్భిణి కావడం, రెండు మగకూనలు కడుపులోనే చనిపోవడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. అయ్యో..అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే చిరుత ప్రాణాలతో పాటు మరో రెండు చిరుతలు బతికేవన్నారు. ఎక్విప్మెంట్ లేకపోవడంతోనే.. ఫారెస్ట్ అధికారి సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు చిరుత మృతి ఘటనపై మాట్లాడుతూ... చిరుతను ఉచ్చు నుంచి తప్పించి, బోను సహాయంతో అడవిలోకి వదలిపెడదామని ప్రయత్నించామన్నారు. అయితే తమ వద్ద రెస్క్యూకు సంబంధించి సరైన ఎక్విప్మెంట్స్, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇదే విషయాన్ని తిరుపతి జూ చీఫ్ కన్జర్వేటర్‌కు విషయం తెలిపితే.. ఆయన సాయంత్రం 4 గంటల తర్వాత చిరుత ఇన్‌యాక్టివ్ అవుతుందని, తర్వాత రక్షించవచ్చని తెలిపి, తాము వస్తున్నట్లుగా తెలిపారన్నారు. ఈలోపు జరగాల్సిన అనర్థం జరిగిపోయిందన్నారు. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం, వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలిగించడం చట్టరీత్యానేరమని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొన్నూటిపాళ్యం అడవిలో ఉచ్చులు ఎవరు, ఎందుకు వేశారనే విషయమై సమగ్ర విచారణ చేస్తామన్నారు. వేటగాళ్లా.. అధికారులా.! ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న ప్రజలు గర్భిణి చిరుత కూనలతో సహా చనిపోవడంపై సర్వత్రా ఆవేదన ఉచ్చువేసిన వేటగాళ్లపై కఠినచర్యలు సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు చిరుత మరణించిన ఘటనపై విచారణ జరిపించాలి – సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మదనపల్లి మండలం, పొన్నూటిపాళ్యం సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించడంలో అటవీ అధికారులు తీవ్ర వైఫల్యం చెందారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఉచ్చుకు చిక్కుకుంటే దానిని కాపాడడంలో అధికారుల వైఫల్యం కళ్లకు కట్టినట్టు కనబడుతోందని ఆరోపించారు. ఉచ్చులో తగులుకున్న చిరుతను కాపాడలేకపోయిన అధికారులు, ఒకవేళ అదే చిరుత జనావాసాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీరబల్లి మండలంలో చిరుతపులి సంచారం – భయాందోళనలో ప్రజలు వీరబల్లి : మండలంలోని సుగాలి తాండా సమీపంలో గత వారం రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. చిరుతపులి మేకలను వెంటాడి ఎత్తుకెళ్లిన ఘటనలు జరిగాయి. మంగళవారం అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే రైతు పొలంలో వెళ్తుండగా చిరుతపులి కనిపించడంతో భయాందోళనకు గురై ఇంటిలోకి పరుగులు తీశాడు. ఇంత జరుగుతున్నా ఫారెస్టు సిబ్బంది మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పువ్వులు విరిసె.. సీతాపతి మురిసె
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో దాశరథిని అర్చించారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయత్వం పొందారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 5:30 గంటలకు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగళూరు, నాగర్‌కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 2.5 టన్నుల 14 రకాల పూలు, 6 రకాల పత్రాలు తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకువచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవం పత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.శ్రీ కోదండ రామాలయంలో నయనానందకరంగా పుష్పయాగం -
●నష్టపరిహారం అందించాలి
రామాపురం: గాలివాన ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రాంగారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో నష్టపోయిన పంటలను రైతు సంఘం నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో.. రైతాంగం మామిడి తోటలను బిడ్డల్లాగా పెంచుకుంటున్నారని తెలిపారు. అలాంటి తరుణంలో అకాల గాలివానతో చెట్లు వేర్లతో సహా నేలకు ఒరగడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. బోర్ల కింద సాగు చేసిన పొద్దుతిరుగుడు, వరి పంటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు షబ్బీర్‌బాషా, శివారెడ్డి, లక్ష్మిరెడ్డి, కిరణ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రామ్మోహన్, మదన్, యువరాజు, రైతులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి: అకాల వర్షాలు, ఈదురు గాలులతో రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం రాయచోటిలో పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందివ్వాలని కోరారు. మామిడి పంట ప్రారంభ దశలో మంచు ప్రభావంతో పూత రాలిపోయిందన్నారు. అంతో ఇంతో పూత నిలిచి పిందె పట్టినా ఎక్కువ ఎండలు వల్ల అవీ రాలిపోయాయన్నారు. మందులు కొట్టి అరకొరగా పిందెలు నిలబెట్టుకుని దిగుబడి వస్తున్న తరణంలో.. అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మామిడి పంటకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత భీమా పథకం ద్వారా ఎకరాకు ప్రీమియం రూ. 2250 చొప్పున కట్టించుకుందని తెలిపారు. మామిడి రైతులపై మానవతా దృక్పథంతో మామిడి పంటకు బీమా చేయని వారికి కూడా పరిహారం అందించాలన్నారు. ఖరీప్, రబీ సీజన్లలో పంటలు రాక తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతన్నలకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులతో మరిన్ని కష్టాలు తోడయ్యాయన్నారు. ఉద్యానవన శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న వివరాలను సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని కోరారు. -
రక్తమోడుతున్న రోడ్లు
సాక్షి రాయచోటి: ప్రయాణం ప్రమాదంగా మారుతోంది. ప్రతి నిత్యం రోడ్లు రక్తమోడుతున్నాయి. ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలకు తోడు నడిరోడ్డుపై జరుగుతున్న ప్రమాద ఘంటికలు వేడి పుట్టిస్తున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు సాధారణ రోడ్లపై కూడా ప్రమాదం నిత్యకృత్యమైంది. బయటికి వచ్చి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మత్తు ఏదైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దేవాలయాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు, విహార యాత్రలు, కర్మకాండలు, ఇతర బంధువులు, స్నేహితుల వద్దకు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా.. జాగ్రత్తగా ఉంటున్నా కూడా చిన్నపాటి పొరపాటు, గ్రహపాటు కారణంగా మృత్యువు కబళిస్తోంది. అంతేకాకుంగా వేగం కూడా ఒక్కోసారి అదుపు తప్పడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భయం.. భయం అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా కడప–రేణిగుంట రహదారితోపాటు కడప వయా రాయచోటి, పీలేరు, చిత్తూరు రహదారితోపాటు మదనపల్లె, పీలేరు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి కాకుండా అనేక రహదారులు ఉన్నాయి. అయితే ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిస్తోంది. ఇప్పటికే ఒక్క ఏడాదిలోనే సుమారు 380కి పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 1200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 635 మందికి పైగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కువ జాతీయ రహదారులపైనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో జాతీయ రహదారులపై అనేక చోట్ల అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోపోవడంతో, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలు రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడంతో సమస్య వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు -
‘గిన్నిస్’లో చోటు
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణానికి చెందిన జి.శివసాయి నాగేంద్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఆ యువకుడు మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. గతేడాది డిసెంబర్ 1న మిస్టర్ అగస్టిన్, దండిగి వేణుగోపాల్, హల్లెలూయ సంగీత పాఠశాలల ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డు వాయించే పోటీ ఏర్పాటు చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా 1046 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కీబోర్డు వాయించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయడంతో ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ నెల 14న సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని అందజేశారు. నృత్య ప్రదర్శనలో ప్రతిభ మదనపల్లె: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పట్టణానికి చెందిన శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్.జైత్రమాధుర్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన శాసీ్త్రయ నృత్యప్రదర్శనలో 4,218 మంది పాల్గొనగా, అందులో జైత్ర మాధుర్ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. శ్రీ లలిత కళా ఆర్ట్స్ ఆధ్వర్యంలో గురువు బాలాజీ పర్యవేక్షణలో ఐదేళ్లుగా నృత్యశిక్షణ పొందుతున్నాడు. కళాశాల విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడంపై కరస్పాండెంట్ డాక్టర్.ఆర్.గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, ప్రిన్సిపాల్ రాటకొండ వెంకటాచలపతి అభినందనలు తెలిపారు. ఉపాధిలో పండ్ల తోటలకు ప్రాధాన్యం కేవీపల్లె: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం మండలంలోని గ్యారంపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెట్టుకోవడానికి ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతి కూలీకి 100 రోజుల పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో కూలీలకు రూ. 300 దినసరి కూలీ కాగా ప్రస్తుతం రూ.307కు పెంచినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు
రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి అన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వ్యూహాలు, ప్రణాళికల అమలు గురించి చర్చించామని, జిల్లాలో మాదక ద్రవ్యాల సమస్య సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ బృందం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972 ద్వారా సమాచారం సేకరించడం, మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈగల్ టీమ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మందుల షాపుల్లో డాక్టర్ రసీదు లేకుండా మందులు ఇవ్వరాదని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణకు నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సుబ్రహ్మణ్యం, డీఎంఅండ్‌హెచ్‌ఓ జి.ఉషశ్రీ, రాయచోటి జైల్స్ సూపరిటెండెంట్ ఉమామహేశ్వర రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎస్.జయరాముడు, ఎకై ్సజ్ సూపరిటెండెంట్ జి.మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.మస్తాన్‌వలి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.తులసీరామ్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి -
ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ
నందలూరు : డబ్బు విషయమై మండలంలోని ఆడపూరు గ్రామంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. సంగీతం టీచర్ ఈశ్వరమ్మకు పార్ట్‌టైమ్ తెలుగు టీచర్ శ్రీదేవి కొంత నగదు ఇతరులతో ఇప్పించారు. ఆ డబ్బు అడగడంతో ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. ఐదు నెలలు తరువాత ఇస్తానని ఈశ్వరమ్మ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ప్రిన్సిపల్ ఎదుట ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ విషయం పోలీసుల వరకు వెళ్లినట్లు సమాచారం. మద్దతు ధరకే కందుల కొనుగోలు రాయచోటి జగదాంబ సెంటర్ : రైతుల నుంచి మద్ధతు ధరకే కంది కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ త్యాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో కంది పండించి... ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, నిమ్మనపల్లె, ములకలచెరువులోని కేంద్రాలలో క్వింటా రూ.7550కే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 144 మంది రైతుల నుంచి 55.90ఎంటీల కందులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.15లక్షలు 47 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని, మరో 73 మంది రైతులకు సంబంధించి రూ.17 లక్షలు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కందుల సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపారు. ఈత సరదా.. ప్రాణం తీసింది అట్లూరు : సోదరుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలిక తేజశ్విని(14) నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు.. బంధువుల వివరాల మేరకు.. అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన చిట్టిబోయిన సిద్దయ్య(శివప్రసాద్), సుబద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి ద్వితీయ కుమార్తె తేజశ్విని తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పొలాలకు వెళ్లింది. పొలం సమీపంలో ఉన్న కమలకూరు ఆనకట్ట వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో సరదాగా ఈత కొట్టాలని అనుకుంది. తమ్ముడు నానితో కలిసి ఆనకట్ట వద్దకు వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల సాయంతో నీటిలోకి దిగింది. ప్రమాదవశాత్తూ డబ్బా ఊడిపోయి అక్క నీట మునగడం చూసిన తమ్ముడు నాని కుటుంబీకుల వద్దకు వెళ్లి చెప్పారు. వారు హుటాహుటిని వచ్చి చూసేలోగా తేజశ్విని మృతిచెందిందని ఆమె బంధువులు తెలిపారు. అంతకుముందు అందరితో కలిసి సామూహికంగా బోజనం చేసి ఈతకు వెళ్లిన కుమార్తె ఇంతలోనే మృతిచెందడంతో తల్లి తండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని 111 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక బొలెరో క్యాంపర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఎవరైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మానవత్వం చాటుకున్న భారతి సిమెంట్ ప్రొద్దుటూరు : మండు వేసవిలో కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికులపై భారతి సిమెంట్ యాజమాన్యం మానవత్వం చూపింది. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పలు చోట్ల పనిచేస్తున్న తాపీ మేసీ్త్రలకు వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు శీతల పానీయాలు, రక్షణ కోసం టీషర్ట్లు, టోపీలు మంగళవారం అందించింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ కె.నాగేంద్ర తాపీ మేసీ్త్రలతో మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ను తయారు చేస్తున్నారని, శ్లాబ్‌ల నిర్మాణానికి తమ సిమెంట్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ టెక్నికల్ ఇంజినీరింగ్ ఛాయాపతి, చిన్న శ్రీకాంత్‌రెడ్డి, భవాని శంకర్, ఉదయ కిరణ్, సాయిప్రకాష్తోపాటు తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు
మదనపల్లె : ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. మదనపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, ముస్లిం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంపై ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. క్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీలు మిథున్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమకు మంచి చేస్తారని టీడీపీ, జనసేన పార్టీలకు ముస్లింలు ఓటువేస్తే ఇపుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేసేందుకు వక్ఫ్ చట్టానికి సవరణ చేసిందని ఆరోపించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించడంతోపాటు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముస్లింల పక్షపాతిగా నిలిచారన్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యులుగా ఉన్న నితీష్‌కుమార్, చంద్రబాబునాయుడు మద్దతు తెలపకుంటే బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. ఎల్లో మీడియాలో టీడీపీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్లు విపరీతంగా ప్రచారం చేయించి, ఆ పార్టీ ఎంపీలతో బిల్లుకు మద్దతు ప్రకటించి మైనార్టీలను దగా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్‌లో వక్ఫ్ బిల్లు అమలు చేయమని ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ బిఏ.ఖాజా, గుండ్లూరు రఫీ, ఎంఎస్.సలీం, రహీం, నూర్ మొహిద్ధీన్ ఖాన్, యూనస్‌ఖాన్, ముజీబుద్ధీన్, రహంతుల్లా, షఫీ, తాజ్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ -
ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదు
రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల ఓబులవారిపల్లె : చిట్వేలి మండలంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర అదికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రాచపల్లి గ్రామం వద్ద నీటి కుంటలో పడి మృతిచెందిన చిన్నారులు చొక్కారాజు దేవాన్స్, చొక్కారాజు విజయ్, రెడ్డిచర్ల యశ్వంత్రాజు కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రమాద విషయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు చనిపోతే కంటి చూపు చర్యగా కుటుంబ నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లారన్నారు. వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అనంతరం ఎంపీటీసీ బండారు గుండయ్య తల్లి ఇటీవల మృతి చెందారని తెలుసుకుని ఆయనను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, కనకరాజు, సిద్దు రాయల్, కోటిరెడ్డి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు
కేవీపల్లె : ఇరువర్గాల ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని తిమ్మాపురానికి చెందిన రెండు వర్గాలు సోమవారం ఇసుక విషయమై గొడవ పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వర్గానికి చెందిన భారతి, మరో వర్గానికి చెందిన తిమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు కింద పడి ఒకరు మృతి నందలూరు : నందలూరు రైల్వే కేంద్రంలో కలగట్ల సిద్ధయ్య(45) గూడ్స్ రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ సుభాన్ వివరాల మేరకు.. పోరుమావిళ్ల ప్రాంతానికి చెందిన సిద్దయ్య రైలు క్రిందపడి మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించడం జరిగిందన్నారు. ఓబులవారిపల్లెలో.. ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ రైలు క్రిందపడి షేక్ అహ్మద్ వలి(40) మృతి చెందారు. ముక్కవారిపల్లి తురకపల్లి గ్రామానికి చెందిన అహ్మద్వలి బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు రేణిగుంట సీఆర్పీఎస్ ఎస్ఐ శివ తెలిపారు. -
కడపలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్ : పాత కక్షలతో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి.. గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన మంగళవారం సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కడప నగరం రవీంద్రనగర్ మరాఠివీధికి చెందిన సాదిక్ వలి(30)ని బిల్డప్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం దారుణంగా హత్య చేశారు. కడపలోని మరాఠీ వీధిలో నివాసముంటున్న సాదిక్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పాత బస్టాండులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో ఇతడు బిల్టప్ సమీపంలోని పుత్తా ఎస్టేట్స్ సమీపంలో వెంకటేశ్వర్లు అనే యువకుడిని దారుణంగా మద్యం సీసాతో గొంతు కోసి చంపిన కేసులో నిందితుడిగా వున్నారు. ఆ హత్యకేసులో అరెస్టయిన ప్రస్తుత మృతుడు సాదిక్‌వలి బెయిల్‌పై ఇటీవల విడుదలై వచ్చాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారు నలుగురు లేదా ఐదుగురు వుండవచ్చని భావిస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు. మృత దేహం వద్ద బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. నిందితులకు సంబంధించిన పుటేజీని పోలీసులు సేకరించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పాత కక్షలతోనే ఈ హత్య జరిగి వుంటుందని భావిస్తున్నారు. పాత కక్షలతోనే కత్తితో గొంతుకోసి దారుణంగా చంపారు సంఘటన స్థలంలో పరిశీలించిన కడప తాలూకా పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు -
రాజధాని సెంటిమెట్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారం
మదనపల్లె : రాష్ట్ర రాజధాని అమరావతి సెంటిమెంట్‌తో ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు.. తాజాగా విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాల భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెర తీశారన్నారు. మూడు వాణిజ్యపంటలు పండే ఎంతో సారవంతమైన 34,568 ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలో చంద్రబాబు సేకరించారన్నారు. ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్‌లో బొమ్మలు చూపించి, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు మినహా ఎలాంటి ప్రగతి చూపలేదన్నారు. రైతులు ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కాలం గడిపేసి, నేడు మరోసారి రాజధాని విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు సిద్ధమయ్యారన్నారు. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కేటాయించి సొమ్ము చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయన్నారు. భూములు కోల్పోతున్న రైతుల్లో అధికభాగం ఎస్సీ, ఎస్టీ సామాజిక చెందిన వ్యక్తులు ఉండటంతో వారి జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ -
టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు..!
కురబలకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. హార్సిలీ హిల్స్‌లో ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ముందే ఈ నెల 13న టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతోపాటు పరస్పరం తన్నుకున్న విషయం తెలిసిందే. అది ఇంకా మరువక మునుపే కురబలకోట మండలంలో అన్నమయ్య జిల్లా టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్కు చెందిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చించివేయడం రోడ్డుపక్కన విసిరివేయడం లాంటివి చేశారు. ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన పురస్కరించుకుని ఆయనను స్వాగతిస్తూ ఇటీవల హైవే పొడవునా కంటేవారిపల్లె నుంచి చెన్నామర్రి మిట్ట, దొమ్మన్నబావి, విశ్వం కళాశాల సర్కిల్ తదితర ప్రాంతాలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అక్కసుతో వాటిని ఎక్కడికక్కడ చించి వేశారు. ఈ మార్గంలో సీసీ పుటేజీలు పరిశీలించి ఫ్లెక్సీల చించివేత, తొలగింపు కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సురేంద్ర యాదవ్ మంగళవారం ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడితో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలకు పార్టీలో ఓ వర్గం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది జీర్ణించుకోలేక అతని ప్రమేయంతోనే సురేంద్ర యాదవ్ ఫ్లెక్సీలను చించివేయడం, తొలగించడం లాంటివి చేసి ఉంటారని భావిస్తున్నారు. నియోజక వర్గంలోని టీడీపీ వర్గ పోరు రచ్చకెక్కడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది. రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడి ఫ్లెక్సీలు చించివేత సురేంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు -
ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు
గాలివీడు : ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నూలివీడుకు చెందిన యోగాంజులు, పార్వతి ద్విచక్ర వాహనంపై చాకిబండలోని దేవాలయానికి వెళ్లి వస్తున్నారు. గాలివీడు– రాయచోటి ప్రధాన రహదారిలో ఆటో వస్తోంది. స్థానిక పెట్రోల్ బంక్ వద్దకు రాగానే మేకలను తప్పించబోయే ఆటో అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వృద్ధ దంపతులకు.. మదనపల్లె : పొలం వద్ద పామును చూసి భయపడి వృద్ధ దంపతులు గాయాల పాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. కొండామర్రి పంచాయతీ కొటూరుకు చెందిన ఇబ్రహీం సాహెబ్ (75), అతడి భార్య మొరంబీ(70) గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అల్లనేరేడు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నపాటుగా చెట్టుపైకి చూడగా కొమ్మలపై పెద్ద పాము కన్పించింది. దీంతో కంగారుపడి ఇద్దరు పక్కకు దూకే క్రమంలో గుంతలో పడి గాయపడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కుమారుడిపై కత్తితో దాడి రైల్వేకోడూరు అర్బన్ : మద్యం తాగి రోజూ రచ్చ చేస్తున్నావంటూ.. కుమారుడు మందలించడంతో కోపోద్రిక్తుడైన తండ్రి మచ్చుకత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రైల్వే కోడూరు మండలం వీవీకండ్రిక పిట్టావాండ్ల గ్రామంలో నివాసముంటున్న చింతల వెంకటయ్య మంగళ వారం తెల్లవారు జామున ఫూటుగా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయనను రోజూ మద్యం తాగి రచ్చ చేస్తున్నావంటూ కొడుకు చింతల శివ మందలించాడు. తండ్రీ, కొడుకుల మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన తండ్రి వెంకటయ్య తన ఇంట్లో మచ్చుకత్తితో కొడుకుపై దాడి చేశాడు. శివ తలకు తీవ్రగాయమవడంతో హుటాహుటిన కోడూరు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం మదనపల్లె : రుణదాతల ఒత్తిడి అధికం అవడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లెకు చెందిన సాదిక్ బాషా, నసీజ్తాజ్ దంపతుల కుమారుడు నయాజ్(28) బాడుగ ఆటో నడుపుతూ తల్లిని పోషించుకుంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద రూ.1.5 లక్షలు అప్పుచేశాడు. ప్రతినెలా సక్రమంగా వడ్డీలు చెల్లిస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక అవసరాలు పెరిగి ఇబ్బందులు తలెత్తడంతో ఏడు నెలల నుంచి వడ్డీలు చెల్లించలేకపోయాడు. మంగళవారం రుణదాతలు అప్పు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఇంటి వద్దే సుసైడ్ నోట్ రాసి ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో అనారోగ్యంతో ఈ నెల 8న గుర్తుతెలియని వృద్ధురాలు(65) చికిత్స నిమిత్తం వార్డులో చేరారు. ఈ నెల 14న పరిస్థితి విషమించి మృతిచెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసినవారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
రేషన్ కార్డులున్నాయ్.. బియ్యం ఇవ్వరేం?
సిద్దవటం : ‘రేషన్ కార్డులున్నాయ్.. తాము తీసుకోకుండా బియ్యం ఎక్కడికి పోతాయ్.. ఎప్పుడు డీలర్ షాపునకు వెళ్లి అడిగినా లేవంటూ సమాధానం చెబుతున్నారు’. అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాధవరం–2 సచివాలయం వద్ద రేషన్ కార్డులు చేతపట్టుకొని మహిళలు మంగళ వారం ఆందోళన చేపట్టారు. స్థానిక వీఆర్వో రజనీకి సమస్యలను విన్నవించారు. వారు మాట్లాడుతూ మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్, బంగారుపేట గ్రామాలకు చెందిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన 15వ రేషన్ షాపునకు ఎప్పుడు వెళ్లినా బియ్యం లేవంటున్నారని, డీలర్ సరైన సమాధానం ఇవ్వడంలేదని ఆరోపించారు. చాలామంది పేదలు స్టోర్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్నారని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం అందేలా చూడాలని వారు కోరారు. -
దార్శనికుడు బాబా సాహెబ్ అంబేడ్కర్
రాయచోటి : సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం డాక్టర్ బాబా సాహెబ్ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడన్నారు. రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని, ఆయనను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంమలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.రాజారమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
రాములవారి ఊరేగింపులో యువకుడికి కత్తిపోట్లు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం పగడాలపల్లిలో రామాలయానికి సంబంధించిన సీతారాములవారి గ్రామోత్సవంలో సోమవారం ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. చిట్వేలి రోడ్డులో గ్రామోత్సవం జరుగుతుండగా స్థానికులైన కంబాల గౌరీ శంకర్, గోవింద్ చేతన్‌లు ఘర్షణకు దిగారు. దీంతో కంబాల గౌరీ శంకర్ గోవింద్ చేతన్‌పై కత్తితో దాడి చేశాడు. ఇందుకు పాత కక్షలే కారణమని పలువురు చెబుతున్నారు. హుటాహుటిన గాయపడిన వ్యక్తిని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సీఐ హేమసుందర్ రావు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆటో చోరీ కడప అర్బన్ : కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకరాపురంలో పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురైంది. మాసాపేటకు చెందిన నాగభూషణం అనే వ్యక్తి శంకరాపురంలో తన బంధువుల ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఆటోను పెట్టి అక్కడే పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆటో కనిపించలేదు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహనీయుడు అంబేడ్కర్
రాయచోటి : న్యాయవాదిగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ తెలిపారు. రాయచోటి మాసాపేటలోని సాయిశుభ కల్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యలో సోమవారం భారతరత్న అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మాండవ్యనది బ్రిడ్జి పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ మధుసూదన్‌రావు, ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అంబేడ్కర్ ఒక గొప్ప రచయిత, అనర్గళంగా మాట్లాడగలిగే ఒక వక్త, ఒక తత్వవేత్త, సీ్త్రల హక్కుల కోసం పోరాడిన సంస్కర్త అని అన్నారు. అనంతరం డీఆర్ఓ మధుసూదన్‌రావు మాట్లాడుతూ కుల వివక్ష పూర్తిగా పోలేదని, దానిని రూపుమాపేందుకు అందరం కృషి చేయాలన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు నరేంద్రబాబు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలు అభివృద్ధి చెందాయి అంటే దానికి కారణం అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జయప్రకాష్, భారతీయ అంబేడ్కర్ సేన నాయకుడు పల్లం తాతయ్య, డీవీఎంసీ సభ్యుడు శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఎంఆర్పీఎస్ నాయకులు, భారతీయ అంబేడ్కర్ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.● జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ ● ఘనంగా బాబా సాహెబ్ జయంతి -
దళారుల బారి నుంచి కాపాడాలి
రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు నిద్రలేకుండా సాగు చేసిన పంటకు మార్కెట్లో దళారుల కారణంగా దారుణంగా నష్టపోతున్నారు. రాయచోటి, కడప లాంటి మార్కెట్లో అర్ధరాత్రి వేళ కూరగాయలు వేలం వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు అక్కడున్న వ్యాపారులతో కుమ్మకై .. వారు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు ముందుకు రావాలి. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం, రాయచోటి ఏరియా ప్రధాన కార్యదర్శి -
ధర పతనం.. రైతుకు శోకం
రాయచోటి : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నలు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. ఇంకా టమాటా రైతు కోలుకోలేని స్థితిలో ఉండగా.. మరోవైపు వంగ తోటలు సాగు చేసిన వారు నిలువునా మునిగిపోతున్నారు. మార్కెట్లో వంగ ధర పడిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. గత రెండు నెలల వరకు గిరాకీ ఉండటంతో.. వంగ పంటను అధికంగా సాగు చేశారు. కాయలను కోసి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు 20 కిలోల ప్యాకెట్‌కు రూ.50 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.3 నుంచి 4 మాత్రమే పలుకుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ. 20 ఉండగా ఈ ఏడా రూ.3 నుంచి 4కు పడిపోయింది. దోచుకుంటున్న వ్యాపారులు జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో వంగ సాగయ్యేది. ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగులోకి తెచ్చారు. చైన్నె, ఏలూరు, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రోజుకు 20 నుంచి 30 టన్నుల పంట రవాణా అవుతుండేది. ఆయా ప్రాంతాల్లో కూడా వంగ సాగు పెరగడంతో.. నేడు బయటి ప్రాంతాల మార్కెట్ రవాణా 50 శాతానికి తగ్గింది. దీనిని ఆసరాగా చేసుకొని స్థానిక వ్యాపారాలు దోచుకుంటున్నారు. రైతుల వద్ద నిల్వ చేసుకొనే సామర్థ్యం లేకపోవడంతో.. అడిగిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటపై చేసిన అప్పులు, వడ్డీలు ఎలా తీర్చాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. వినియోగదారులకు.. కూరగాయల మార్కెట్, రైతు బజార్లో వినియోగదారులకు మాత్రం వంకాయలను రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. లాభాన్ని దళారులు, వ్యాపారులు కలిసి ఆర్జిస్తున్నారు. నిల్వ చేసుకునే సామర్థ్యం, వినియోగదారులకు అమ్మే అనుకూలత వ్యాపారులకు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. పంట సాగు చేసిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. పడిపోయిన వంకాయల రేట్లు పెట్టుబడి కూడా దక్కని వైనం అప్పుల పాలవుతున్న అన్నదాత -
ప్యాసింజర్ రైళ్లు తాత్కాలిక రద్దు
కలికిరి : తిరుపతి నుంచి పాకాల, ధర్మవరం మీదు గా గుంతకల్, కదిరిదేవరపల్లి వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా 35 రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. అలాగే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దుతో పాటు, కదిరి, మదనపల్లి రోడ్, పీలేరు, పాకాల మీదుగా నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి – గుంతకల్ ప్యాసింజర్(57403) మే నెల 18వ తేదీ వరకు, గుంతకల్ – తిరుపతి ప్యాసింజర్(57404) మే నెల 19వ తేదీ వరకు, తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్(57405) మే నెల 16వ తేదీ వరకు, కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్(57406) మే నెల 17వ తేదీ వరకు రద్దయ్యాయి. అలాగే తిరుపతి–అమరావతి ఎక్స్‌ప్రెస్(12765) మే నెల 6, 10, 13, 17 తేదీలలో రద్దు చేశారు. అమరావతి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (12766) మే నెల 5, 8, 12, 15 తేదీలలో రద్దు చేశారు. దారి మళ్లింపు ఇలా.. తిరుపతి–అకోలా వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(07605) పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా కాకుండా మే నెల 9, 16 తేదీలో తిరుపతి నుంచి రేణిగుంట, గుత్తి మీదుగా దారి మళ్లించారు. అకోలా–తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(07606) ధర్మవరం, కదిరి, పీలేరు, పాకాల మీదుగా కాకుండా మే నెల 4, 11 తేదీలలో గుత్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి దారి మళ్లించారు. తిరుపతి–సికింద్రాబాద్ సెవెన్‌హిల్స్(12769) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 5, 9, 12, 16 తేదీలలో పాకాల, పీలేరు, కలికిరి, కదిరి, ధర్మవరం మీదుగా కాకుండా తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, అలాగే సికింద్రాబాద్–తిరుపతి సెవెన్‌హిల్స్(12770) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 6, 9, 13, 16 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట మీదుగా తిరుపతి రూట్‌కు మార్చారు. పాకాల, కలికిరి, కదిరి మీదుగా నడిచే తిరుపతి–సికింద్రాబాద్(12731) సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ను మే నెల 8, 11, 15 తేదీలలో తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ, ధర్మవరం నుంచి కదిరి, కలికిరి, పీలేరు మీదుగా నడిచే సికింద్రాబాద్–తిరుపతి(12732) సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ను మే నెల 7, 10, 14 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్ కదిరి మీదుగా నడిచే మధురై–కాచిగూడ(07192) స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ మే నెల 5, 12 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగానూ, కాచిగూడ–మధురై(07191)స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ మే నెల 7, 14 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ దారి మళ్లించారు. పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా నడిచే నాగర్‌కోయిల్–ముంబై(16340) ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 5, 6, 7, 9, 12, 13, 14, 16 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, ముంబై–నాగర్‌కోయిల్(16339)ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 6, 7, 8,10,13, 14, 15 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా మళ్లించారు. మధురై–కాచిగూడ(22716) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 04, 11 తేదీలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, డోన్, గుత్తి మీదుగానూ, కాచిగూడ–మధురై(22715) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను మే నెల 10, 17 తేదీలలో డోన్, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా దారి మళ్లించారు. ధర్మవరం నుంచి రోజు నడిచే ధర్మవరం–నరసాపూర్(17248) ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి కదిరి నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. అలాగే నరసాపూర్–ధర్మవరం(17247) ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం నుంచి కదిరి వరకు మాత్రమే నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు. కాగా గత ఏడాది డిసెంబరు 28 నుంచి మహాకుంభమేళా కోసం గుంతకల్–తిరుపతి ప్యాసింజర్ రైళ్లను సుమారు రెండు నెలలకు పైగా రద్దు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. ఇప్పుడు ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం నెల రోజులకు పైగా ప్యాసిజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులపై మరో పిడుగు పడ్డట్లైంది. రైలు ప్రయాణికులపై మరో పిడుగు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు దారి మళ్లింపు ధర్మవరం రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో అధికారుల నిర్ణయం -
వైద్య ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ పద్ధతి తొలగించాలి
రాయచోటి అర్బన్ : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టం) పద్ధతిని తొలగించాలని పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ – 3194 రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉద్యోగుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ విధానం తీసివేయాలన్నారు. సరైన నెట్వర్క్ లేని కారణంగా మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న సమయంలో ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్‌ను నమోదు చేయలేరన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వై. శ్రీనివాసులు రెడ్డి, కార్యదర్శి మహబూబ్‌బాషా, జోనల్ ఉపాధ్యక్షుడు సుధాకర్ రాజు, జాయింట్ సెక్రటరీ రాఘవ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, లక్ష్మినారాయణతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. రాయచోటి తాలూకా కార్యవర్గం.. రాయచోటి తాలుకా యూనియన్ అధ్యక్షుడిగా సుదర్శనరాజు, ఉపాధ్యక్షురాలిగా చంద్రకళ, శివనాయక్, సదాశివరెడ్డి, శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా నూర్జహాన్, ఖదీర్, రాజేంద్ర, కోశాధికారిగా మహబూబ్‌బాషా, సెక్రటరీలుగా ప్రమీల, ధర్మారెడ్డి, రాజసులోచనలను ఎన్నుకున్నారు, ఎగ్జిక్యుటివ్ మెంబర్లుగా వెంకట్రామిరెడ్డి, వెంకటయ్య, రెడ్డెమ్మ, భాగ్యలను ఎంపిక చేశారు. -
విద్యార్థి అదృశ్యం
జమ్మలమడుగు : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన మంగపట్నం పవన్ అదృశ్యమైట్లు మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగపట్నం పవన్ జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతున్నాడు. అయితే ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిపోయాడు. ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తండ్రి లింగమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతికడప అర్బన్ : కడప నగరం రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యకిత రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రిమ్స్ పోలీసుల కథనం మేరకు.. వీరపునాయునిపల్లి మండలం పాలగిరి గ్రామానికి చెందిన మల్లెం కొండ జగదీష్ (42) కడప జెడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్లో పని చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 27న రిమ్స్ ఆసుపత్రి సమీపంలో పురుగుల మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటో నిలుపుదల స్థలం కోసం ఘర్షణ ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలయపల్లి గ్రామంలో ఆటో నిలుపుదల చేసుకునే స్థలం విషయమై సాయిరాం, రమేష్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ మరింత ముదిరి ఆదివారం అర్థరాత్రి సాయిరాం ఇంటిపైకి రమేష్ , సురేష్‌లతో పాటు మరికొంత మంది కలసి దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్, సురేష్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మేకలబాలయపల్లి గ్రామానికి చెందిన సాయిరాం, రమేష్, సురేష్‌ల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే వీరి మధ్య ఆటో నిలుపుదల స్థలంపై ఆదివారం ఘర్షణ జరిగింది. అయితే అర్థరాత్రి రమేష్, సురేష్‌లతో పాటు మరి కొందరు కలసి కర్రలు తీసుకుని సాయిరాం ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో సాయిరాం, జయరాం, రామచంద్రుడు, రామదేవి, నాగవేణి, తేజ్రాంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు రామచంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష, సురేష్‌లతో పాటు మరి కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించకుంటే సమ్మె చేస్తాం ప్రొద్దుటూరు క్రైం : ఠిలారీలపై వేస్తున్న గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించకుంటే సమ్మె చేయడానికై నా వెనుకాడేది లేదని ఏపీ న్యూ ఆంధ్రా మోటార్, ట్రక్కర్స్ అసోసియేషన్ (నమ్తా) జనరల్ సెక్రటరి టీవీ చలపతి తెలిపారు. స్థానిక లింగాపురంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం లారీ ఓనర్లు, డ్రైవర్లకు రవాణా చట్టాలు, సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీరో ఆక్సిడెంట్ సమాజం కోసం అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై గతంలో అనేక మార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. టోల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, గ్రీన్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరుగురికి తీవ్ర గాయాలు -
కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం
రామాపురం : పారిశుద్ధ్య కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం వికసించింది. మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఎగువదళితవాడకు చెందిన పూతోక రవణమ్మ, గంగులయ్య దంపతుల కుమారుతు శివశంకర్ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో 973/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. రవణమ్మ రాయచోటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తోంది. తన కుమారుడిని చదివించుకోవాలనే లక్ష్యంతో రాయచోటి పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో చేర్పించింది. తమ కష్టాలు కుమారుడికి గుర్తుకు రానివ్వకుండా చదివించింది. తల్లిదండ్రుల ఆశయానికి తగ్గట్టుగా శివశంకర్ కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉచితంగా ఇంటర్ విద్యకు అవకాశం రాయచోటి టౌన్ : అర్హత కలిగి ఉండి ప్రతిభావంతులైన బాలికలకు కడప ఆర్తి హోం ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ పీవీ సంధ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరాశ్రయులుగా ఉన్న బాలికలకు తమ సంస్థ ద్వారా ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఇంటర్ విద్యను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హత కలిగిన వారు ఆర్తి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు 8074717196/8331951098/8106123469లకు ఫోన్ చేయాలని కోరారు. 10వ తరగతి పూర్తి చేసి, ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద, తల్లిదండ్రులు లేని వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత వసతి, కెరీర్ మార్గదర్శనం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న సామర్థ్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. వీరభద్రుడికి పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో విహరించారు. సోమవారం రాత్రి మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి, పల్లకీలో కొలువు దీర్చారు. ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చేపట్టారు. స్థానిక భక్తులతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పాల్గొన్నారు. 16,17 తేదీల్లో పరీక్ష రాయచోటి అర్బన్ : రాయచోటి డైట్ (జిల్లా విద్యాశిక్షణా సంస్థ)లో అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించేందుకు ఉద్దేశించిన పరీక్షలు ఈ నెల 16,17 తేదీలలో నిర్వహించనున్నట్లు రాయచోటి డైట్ ప్రిన్సిపల్ అజయ్కుమార్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రంలో హాజరు కావాలన్నారు. తమ వెంట దరఖాస్తు ప్రతులు, గుర్తింపు కార్డులను తీసుకురావాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పరీక్షకు హాజరు కావాలన్నారు. జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాల నివారణ రాయచోటి టౌన్ : ముందు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మాసాపేట వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలిపే కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్ రావు, అగ్నిమాపక శాఖ అధికారులు పి.అనిల్‌కుమార్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.4 లక్షలు పోయాయి
రాత్రి 12 గంటలకు మార్కెట్‌కు కాయలు తెస్తే కొనేవారు లేక మరుసటి రోజు కూడా కూర్చుంటున్నా.. 20 కిలోల ప్యాకెట్లు రూ.50, 60కు ఇవ్వగలవా అంటూ బేరాలు ఆడుతున్నారు. మళ్లీ, మళ్లీ ఆటోలకు రవాణా చార్జీలు ఇవ్వలేక అడిగిన ధరకు ఇచ్చేస్తున్నాం. 2.5 ఎకరాల భూమిని లక్ష రూపాయలతో కౌలుకు తీసుకొని వంగ తోట సాగు చేశాను. సాగు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేసి పంట పండించాను. ఇప్పటికీ 80 శాతం పంట దిగుబడి వచ్చినా రూ.50 వేలు కూడా రావడం లేదు. మార్కెట్లో లభిస్తున్న ధరలను చూస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – సుబ్బారెడ్డి, రైతు, ఏపిలవంకపల్లి, రాయచోటి మండలం -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెద్దతిప్పసముద్రం : రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. మండలంలోని చిన్నపొంగుపల్లికి చెందిన చౌడప్ప (72) బస్సులో వెళ్లేందుకు టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి క్రాస్ రోడ్డులో వేచి ఉన్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి నిలబడి ఉన్న చౌడప్పను బలంగా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో పాస్టర్..పీలేరు రూరల్ : మండలానికి చెందిన చర్చి పాస్టర్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూ చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన నాంపల్లె బాబు అలియాస్ మహర్షిబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు చర్చిలలో పాస్టర్‌గా పనిచేశారు. ఆదివారం ఉదయం పీలేరు–చిత్తూరు మార్గంలోని హెబ్రోను ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం గుండెలో నొప్పిగా ఉందని తెలిపిన కొంత సమయానికే ప్రార్థన మందిలోనే స్పృహతప్పి పడిపోయారు. గమనించిన సహచరులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాస్టర్ మహర్షి బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు..కలకడ : కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ, ఆర్పెంటిదిన్నె (దాసిరెడ్డిగారిపల్లె) కు చెందిన నాగసిద్దారెడ్డి భార్య ఆదిలక్ష్మి (85) మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ సీఐ గురునాథ ఇంటిని పరిశీలించి ఆదిలక్ష్మి శరీరంపై కాలిన గాయాలు, రక్తగాయాలు ఉండటంతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు ద్వారకనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
టీడీపీలో కుమ్ములాట
● రైల్వేకోడూరులో తారా స్థాయికి విభేదాలు ● రాజంపేటలో నేతల మధ్య వర్గ పోరు ● రాయచోటిలో మంత్రి, సుగవాసిల మధ్య పెరిగిన దూరం ● తంబళ్లపల్లెలో కుదరని సమన్వయం ● ఇన్చార్జి మంత్రికి తప్పని తమ్ముళ్ల తలనొప్పి సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారులో ఆధిపత్య పోరు మొదలైంది. నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఇన్చార్జిగా ప్రకటించిన నేతకు బాగా పలుకుబడి ఉంటుందన్న కారణంతో పోరు సాగుతోంది. ఎన్నికల ముందు అంతంత మాత్రంగా ఉన్నా... అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు కోసం ఒకరిపై మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మరో పక్క ఆర్థికంగా బలపడేందుకు.. అధికారులతో పని చేయించుకునేందుకు పదవి అన్నది కీలకంగా మారింది. దీంతో ఇంతకు మునుపు వరకు కలిసికట్టుగా ఉన్న నేతల్లో.. ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. అఽధిష్టానం మాత్రం ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్చార్జిలను కూడా ప్రకటించలేని దుస్థితిలో ఉండగా.. తమ్ముళ్ల మధ్య తగువులాటలు యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రైల్వేకోడూరు, రాజంపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి ఎదుటే తమ్ముళ్లు యుద్ధ చేయడంతో ఆయన తల పట్టుకోవాల్సి వచ్చింది. రూపానందరెడ్డి తీరుపై ప్రత్యర్థి వర్గం బహిరంగ యుద్ధం జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ టీడీపీలో కుమ్మలాటలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడును పక్కనపెట్టి.. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన రూపానందరెడ్డికి టీడీపీ ఇన్చార్జిగా అధిష్టానం పట్టం కట్టింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే రూపానందరెడ్డికి అడ చైర్మన్‌గా అవకాశం ఇస్తూ పెద్దపీట వేశారు. మరోపక్క ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపు కోసం పని చేసిన విశ్వనాథనాయుడుతోపాటు మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులును పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కార్యకర్తలు రగలిపోతున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారంటూ వర్గాలు యుద్ధ వాతావరణం సృష్టించాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నా.. పెత్తనమంతా రూపానందరెడ్డి కుటుంబమే చేస్తున్నదని రగలిపోతున్న ప్రత్యర్థి వర్గాలు ఇన్చార్జి మంత్రిని చూడగానే రెచ్చిపోయాయి. మాజీ ఇన్చార్జితోపాటు మాజీ ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత తగ్గించడంపై పార్టీ శ్రేణులు మంత్రి ఎదుటే దాడికి దిగారు. టీడీపీ కార్యాలయంలోని అద్దాలతోపాటు కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ రావడాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రత్యర్థి వర్గాలు ఆక్షేపించాయి. రైల్వేకోడూరు టీడీపీలో మూడు వర్గాల మధ్య ప్రచ్చన్నయుద్ధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిిస్థితికి వచ్చింది. జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, తోపులాట పరిస్థితి చూసిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. తంబళ్లపల్లెలో ఇన్చార్జి రగడ జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఇన్చార్జి వ్యవహారం రగులుతోంది. ఒకపక్క మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి.. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాల మధ్య రచ్చ ముదిరింది. ఇటీవల ములకలచెరువు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట ప్రాంతాల్లో వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని మంత్రి లోకేష్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఒక వర్గం చింపివేసి కేకులను విసిరి కొట్టారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య ముష్టి యుద్ధం చోటుచేసుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటున్నా తంబళ్లపల్లెను మాత్రం అధిష్టానం గాలికి వదిలివేయడంపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీలోని కొన్ని వర్గాలు పని చేస్తున్నాయి. ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయి. రాయచోటిలో రగులుతున్న అసమ్మతి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కీలక నేతల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటిలో మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులకు ప్రాధాన్యత తగ్గించారని ఆ వర్గం రగిలిపోతోంది. రాజంపేటలో పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం తర్వాత మంత్రిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సుగవాసి, మండిపల్లి మధ్య దూరం పెరిగింది. అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి సంబేపల్లెకు వచ్చిన సందర్భంలోనూ బాలసుబ్రమణ్యం కలిసేందుకు ప్రొటోకాల్ లిస్టులో పేరు లేకుండా చేశారని ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కూడా ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది. మరోపక్క అన్నకు జరుగుతున్న అవమానాలపై టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న ప్రసాద్‌బాబు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. రాయచోటిలో కూడా అటు మండిపల్లి, ఇటు సుగవాసి కుటుంబాల మధ్య పొరపచ్చాలు రావడంతో కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఒకవైపు జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు, మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గాల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేటలో గత ఆగస్టులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా రిబ్బన్ కత్తిరించే విషయంలో కీలక నేతలైన జగన్మోహన్రాజు, బాలసుబ్రమణ్యంలు తోసుకోవడంతో .. అప్పటి నుంచి కార్యకర్తల్లో కూడా భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇన్చార్జి మంత్రి సమక్షంలో జరగాల్సిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు యుద్ధం చేశారు. ఒక పక్క టీడీపీ ఇన్చార్జిగా రాజంపేట నుంచి పోటీ చేసిన బాలసుబ్రమణ్యంకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. మరోపక్క జగన్మోహన్రాజు వర్గం నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యకర్తలు అందరూ లోపల ఉండాల్సిందేనంటూ ఒకరునొకరు తోసుకోవడంతో రాజంపేటలోనూ గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ ఇన్చార్జిని నియమించలేక అధిష్టానం సాగదీస్తోంది. -
కాళీయమర్దనుడిగా కోదండ రాముడు
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు గ్రామ వీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన కోదండ రామ ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనంపై ఒంటిమిట్ట విభుడు రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం ఉదయం 9 నుంచి 10:30 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణం ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
కలకడ : మదనపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన ఉపాధ్యాయురాలు శారద (40) మృతి చెందారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆమె భర్త వై.వెంకటరమణ, కుమార్తె కీర్తితో కలిసి మదనపల్లెకు కారులో వెళుతుండగా సుగాలిమిట్ట వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి శారద మృతి చెందారు. ఆమె భర్త వెంకటరమణ, కుమార్తె కీర్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయ దంపతులిద్దరూ గ్రామస్తులతో సన్నిహితంగా ఉండేవారు. ఆదివారం రాత్రి శారద మృతదేహం యర్రయ్యగారిపల్లెకు చేరుకోగానే గ్రామం శోకసంద్రమైంది.భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు -
హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం
మదనపల్లె : ఆటోలో ఎక్కిన వృద్ధురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోడ్రైవర్ హత్యచేసిన కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ను తప్పులతడకగా రూపొందించడమే కాకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో నిర్లక్ష్యం చూపడంపై బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని బెంగళూరు రోడ్డుపై బైఠాయించి వాహనాలను కదలనీయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రావాలంటూ నినాదాలు చేస్తూ, పోలీసులకు వ్యతిరేకంగా గళమెత్తారు. హత్యకేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హత్యకు గురైన వృద్ధురాలి మనవడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తక్షణమే యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాలు..శనివారం ఉదయం చంద్రాకాలనీ లక్ష్మీనగర్‌కు చెందిన వృద్ధురాలు గంగులమ్మ(73) వరుసకు కుమారుడైన వెంకటరమణ తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటడంతో, వైద్యచికిత్స నిమిత్తం అవసరమైన రూ.2లక్షలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి మెయిన్‌రోడ్డుకు చేరుకుంది. అదేసమయంలో ఎగువకురవంక భవానీ నగర్‌కు చెందిన విష్ణువర్దన్ ఆటోలో అటువైపుగా రావడంతో గంగులమ్మ ఆటోను ఆపింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలని, తన కొడుకు వైద్యచికిత్సకు డబ్బులు తీసుకెళుతున్నానని, తొందరగా తీసుకెళ్లాల్సిందిగా కోరింది. గంగులమ్మ వద్ద డబ్బులు ఉన్న విషయంతో పాటు ఆమె ఒంటిపై నగలు ఉండటంతో విష్ణువర్దన్ దుర్బుద్ధితో ఆమెను బైపాస్మీదుగా నిమ్మనపల్లె సర్కిల్ రామాచార్లపల్లె చెరువు మొరవ సమీపంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తుల సహాయంతో పథకం ప్రకారం గంగులమ్మను హత్యచేసి ఆమెవద్ద ఉన్న నగదు, నగలను కాజేసి, వారిద్దరినీ అక్కడి నుంచి పంపేశాడు. గంగులమ్మ ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడిపోయి చనిపోయిందంటూ ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ కట్టుకథ అల్లాడు. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు డ్రైవర్ విష్ణువర్దన్ ప్రవర్తనపై అనుమానం రావడం, గంగులమ్మ తల, ఒంటిపై తీవ్రగాయాలు, రక్తస్రావం ఉండటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ విష్ణువర్దన్‌ను పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే కేసు నమోదుకు సంబంధించి పోలీసులు రాత్రి వరకు తర్జనభర్జనలు పడటం, కేసులో ఎక్కడా నగలు, నగదు గురించి ప్రస్తావించకపోవడం, ఆటో డ్రైవర్‌తో ఐదురూపాయల చిల్లర కోసం జరిగిన గొడవలో హత్య జరిగిందని నిర్ధారించారు. ఈలోపు బాధితులు ఎమ్మెల్యే షాజహాన్‌బాషాను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆయన స్టేషన్‌కు వెళ్లండి. నేను ఫోన్ చేస్తానని చెప్పారు. దీంతో బాఽధితులు స్టేషన్‌కు చేరుకుంటే, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా పరుష పదజాలంతో తిట్టారు. ఎమ్మెల్యేకు చెబితే పనులు చకచకా జరిగిపోతాయా...స్టేషన్ నుంచి బయటకు వెళ్లండంటూ గదమాయించారు. ఉదయం 4 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు శవపంచనామా త్వరగా పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులను కోరితే, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భోజనం చేసుకుని రండంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసుల తీరును నిరసిస్తూ బెంగళూరు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రూరల్, టూటౌన్ సీఐలు సత్యనారాయణ, రామచంద్ర, ఎస్ఐలు అన్సర్‌బాషా, గాయత్రిలు అక్కడకు చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు వినకుండా ఎమ్మెల్యే వచ్చి సమస్యను పరిష్కరించాలని పోలీసులతో గొడవకు దిగారు. ఇంతలో గంగులమ్మ మనుమడు మనోహర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో, పోలీసులు తక్షణమే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చులకనగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, కేసు విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు పోస్టుమార్టం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో నిరసన విరమించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని గంగులమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. బాధితుల రాస్తారోకో ఎఫ్ఐఆర్ తప్పులతడకగా ఉందంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం మృతదేహాన్ని అప్పగించలేదని కుటుంబ సభ్యుల నిరసన ఎట్టకేలకు ఎమ్మెల్యే జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
వైభవంగా కమలాపురం ఉరుసు
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రధాన ఉరుసు మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో ఉరుసు మహోత్సవానికి తరలివచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా ఆవరణం కిటకిటలాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, తదితర రంగుల రాట్నాల వద్ద పిల్లల సందడి కనిపించింది. ● దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీ ఆద్యంతం అలరించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్బీ బ్రదర్స్, యూపీ కి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ ఉత్సాహ భరితంగా సాగింది. ఖవ్వాలి విన్న ఖవ్వాలి ప్రేమికులు పాటలను వింటూ, మజా చేస్తూ ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు. వైఎస్సార్సీపీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు కమలాపురంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం రాత్రి దర్గా కన్వీన ఇస్మాయిల్ ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారి మజార్లపై చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రసవత్తరంగా బండలాగుడు పోటీలు ఉరుసును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాడుగు పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన 11 కాండ్ల జతల ఎడ్లు పోటీలో తలపడ్డాయి. ప్రొద్దుటూరుకు చెందిన బీసీఎస్‌ఆర్ బుల్స్ అధినేత వెంకటసాయి భవిత్‌రెడ్డి ఎడ్లు 5107 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా పెద్ద కొట్టాలకు చెందిన నారాయణరెడ్డి ఎడ్లు 4694 అడుగులతో ద్వితీయ స్థానంలో, దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన టి.అశోక్ ఎడ్లు 4600 అడుగులతో తృతీయ స్థానంలో, కమలాపురం మండలం జంగంపల్లెకు చెందిన నాగ సుబ్బారెడ్డి ఎడ్లు 4470 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. భక్తులతో కళకళలాడినదర్గా ప్రాంగణం అలరించిన ఖవ్వాలీ పోటీ -
తన్నుకున్న తమ్ముళ్లు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని చల్లనికొండ హార్సిలీహిల్స్‌పై టీడీపీ తమ్ముళ్ల మధ్య డిష్యూం డిష్యూం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి సమావేశంలో ఉండగానే.. వెలుపల ఇరువర్గాలు ఉద్రిక్తత సృష్టించేలా వ్యవహరించడం మంత్రికి చిరాకు తెప్పించడంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఆదివారం రహదారి భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిర్వహించిన టీడీపీ నేతల సమావేశం సందర్భంగా.. మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రరెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎంపిక చేసిన నాయకులతో సమావేశం ఉంటుందని ముందుగా చెప్పిన నిర్ణయం మార్చుకుని.. మండలాల వారీగా అందరికీ అవకాశం కల్పించడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. కేఎస్‌ఎస్‌ల నియామకం పార్టీ చూసుకుంటుందని చెప్పిన మంత్రి హార్సిలీహిల్స్‌పై ఆరు మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్‌చార్జ్‌లు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన ఓ ప్రయివేటు సమావేశ హాలులో మంత్రి జనార్దన్‌రెడ్డి, జోన్ఫోర్ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, పరిశీలకుడు గురువారెడ్డి హాజరయ్యారు. దీనికి ముందు జయచంద్రారెడ్డి వర్గంతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. తర్వాత ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని ఈ సమావేశానికి దూరంగా పెట్టారు. తొలుత పెద్దమండ్యం మండల నేతల సమావేశంలో కన్వీనర్ బిల్డర్ రమణ పార్టీలో కష్టపడి పని చేసినా గుర్తింపులేదని, తమను ఇన్చార్జ్ పట్టించుకోవడం లేదంటూ ఏకరువు పెట్టారు. మిగిలిన కొందరు నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత తంబళ్లపల్లె మండల సమావేశంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ములకలచెరువు సమావేశంలో కన్వీనర్ పాలగిరి సిద్దా తమ ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. అందులో కేఎస్ఎస్ సభ్యుల ప్రస్తావన చేయడంతో.. ఈ నియామక ప్రక్రియను పార్టీ చూసుకుంటుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. శంకర్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఇలా సమావేశం జరుగుతుండగా వెలుపల భారీసంఖ్యలో రెండు వర్గాలు మోహరించి ఉన్నాయి. హాలు వద్ద రెండు వర్గాలు ఎదురెదురుగా ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా శంకర్ వర్గీయులు తాము పా ర్టీకి కష్టపడి పని చేశామని, గుర్తింపు లేదని దీపక్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. అంతలో రెండు వర్గాలు అరుపులు, కేకలు, ఈలలు వేయడంతో ఒక్కసారి రెండు వర్గాలకు తలపడే పరిస్థితి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిస్థితిపై అసహనానికి గురైన మంత్రి జనార్దన్‌రెడ్డి అందరిన్నీ ఆహ్వానిస్తే ఇలా వ్యవహరించడం తగదు అంటూ మిగిలిన బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం మండలాల సమావేశాలను రద్దు చేసుకుని బయటకు వచ్చేశారు. సమావేశం నుంచి మంత్రి బిరాబిరా వెళ్లిపోయారు. వెళ్తున్నట్టు కానీ, సమావేశాలు ముగించామని గానీ చెప్పలేదు. అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకోలేదు. ఆయనతోపాటు మిగిలిన నేతలు హార్సిలీహిల్స్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి సమక్షంలో జేసీఆర్, శంకర్ వర్గాల బలప్రదర్శన మంత్రి నిర్ణయమే కారణం తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి సమావేశానికి వచ్చే పార్టీ నాయకుల జాబితాను పోలీసులకు అందజేశారు. అందులో 26 మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. వీరిని మాత్రమే హార్సిలీహిల్స్‌కు పంపాల్సి ఉండగా పోలీసులు ఇదే పని చేశారు. కొండ కింద అను మతి లేని వారిని నిలిపివేశారు. అయితే మంత్రి జనార్దన్‌రెడ్డి అందర్నీ పంపండని, వారిని తనిఖీ కూడా చేయెద్దు అంటూ పోలీసులను ఆదేశించారు. దీనితో కొండ కింద నుంచి, సమావేశానికి హాజరయ్యే నేతల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఈ వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
రాయచోటి టౌన్: బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తమ వినతి పత్రాలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. జీఐపీకేఎల్లో రాయచోటి వాసి రాయచోటి జగదాంబసెంటర్: రాయచోటి పట్టణం బోస్‌నగర్‌కు చెందిన అలీ అహమ్మద్(22) ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించే కబడ్డీ జీఐపీకేఎల్(గ్లోబల్ ఇండియా ప్రవాసి కబడ్డీ లీగ్)లో లయన్స్ తమిళ్ టీం తరఫున ఆడనున్నారు. ఈయన రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అలీఅహమ్మద్ చిన్ననాటి నుంచే కబడ్డీ ఆట ఆడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లేవాడని అతని తండ్రి షబ్బీర్ తెలిపారు. విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించిన ఆ యువకుడికి రాయచోటి, జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు సిద్దవటం: సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, సిద్దవటం బీట్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కడప డీఎఫ్ఓ వినీత్‌కుమార్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. అనంతరం రోళ్లబోడు బేస్ క్యాంప్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపద తరలిపోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీలు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పట్ల వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి తొట్లలో తాగునీరు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ బి.కళావతి, డీఆర్ఓ ఓబులేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫెయిల్ అయ్యామని ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన ముగ్గురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి, స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని(16) పరీక్షలో గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయింది. మనస్తాపంతో విష ద్రావణం తాగింది. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగకు చెందిన విద్యార్థి(16) మదనపల్లెలో ఉంటూ జెడ్పీ హైస్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి(18) పరీక్షలో ఫెయిల్ కావడంతో నిద్రమాత్రలు మింగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెడికల్ ఏజెన్సీలో చోరీకడప అర్బన్ : కడప నగరం బీకేఎం వీధిలో ఈశ్వర్ మెడికల్ ఏజెన్సీలో గుర్తుతెలియని దొంగలు జొరబడి నగదును అపహరించినట్లు కడప టూ టౌన్ ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు కడపకు చెందిన శివకుమార్ ఈనెల 11వ తేదీ రాత్రి తమ ఏజెన్సీ మూసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి తమ ఏజెన్సీ షట్టర్ పగలగొట్టి దొంగలు చొరబడి రూ.1.21 లక్షల నగదును అపహరించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్బీఐలో చోరీవల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలంలోని కొత్త రోడ్డులోగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 30 వేల రూపాయలు నగదు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్‌ను దొంగిలించినట్లు సమాచారం. సీఐ కృష్ణారెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీకొని బాలుడికి గాయాలుబద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరు రోడ్డు నుంచి శివాలయంకు వెళ్లే రోడ్డులో ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. పట్టణంలోని గౌరీశంకర్ నగర్‌కు చెందిన రాజు, క్రిష్ణవేణిల కుమారుడైన గుర్రాల వెంకటనాగేష్ (11) శివాలయం రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వైపు వస్తుండగా ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ఎడమ కాలు విరిగింది. -
అధికార దర్పం ప్రదర్శిస్తే సహించేది లేదు
రాయచోటి : అధికార పార్టీ దర్పంతో మంత్రి హోదాలో ఏం మాట్లాడినా చెల్లుతుందన్నట్లుగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. ఆదివారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి పనికోసం నిల్వ ఉంచిన కంకర, సామగ్రిని దొంగిలించడంపై మందలించాల్సిన మంత్రి తన పేరు చెప్పుకొని ఎవరైనా తీసుకెళ్తే తాను దొంగతనం చేసినట్టా అని మాట్లాడడం దారుణమన్నారు. ఇలా ఇయితే మంత్రి పేరు చెప్పుకొని ఎవరైనా దర్జాగా దొంగతనాలు చేయొచ్చా? అని మంత్రిని నిలదీశారు. తాను ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు తీసుకొని వైఎస్సార్సీపీలోకి వచ్చినట్లు చేసిన ఆరోపణలపై వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు తనకు టికెట్టు ఇవ్వకుండా ద్రోహం చేశారని, అందుకే పార్టీలో ఉండనని ఆయనకే చెప్పి బయటకు వచ్చానన్నారు. కడపలో తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో ఉండి ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి వైఎస్సార్సీపీని ఓడించడానికి టీడీపీ నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసిన నీచ చరిత్ర మండిపల్లిది అని ధ్వజమెత్తారు. జాతీయ రహదారి పనులు నా పేరున లేదంటావా? పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్న ఒప్పంద పత్రం ఇదిగో చూడండని మంత్రికి సవాల్ విసిరారు. తనను రాయచోటిలో తిరగనివ్వకుండా చేస్తానన్న మంత్రి మాటలపై రమేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీలాంటి వారు వందమంది వచ్చినా తనను అడ్డుకోవడం సాధ్యం కాదంటూ హెచ్చరించారు. మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే రెండుసార్లు డిపాజిట్ కూడా దక్కించుకోలేని విషయాన్ని మరచిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం -
రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని ఉప్పరపల్లి రైల్వేగేటు వద్ద గుర్తు తెలియని యువకుడు(25) ఆదివారం రేణిగుంటవైపు వెళ్తున్న రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రేణిగుంట రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యమదనపల్లె : ఒంటరి జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. దేవళంవీధిలోని ఉమ్మర్ మసీదు సమీపంలో నివసిస్తున్న సయ్యద్ జాఫర్‌హుస్సేన్(70)కు భార్య ఫామిదా, కుమారులు జాకీర్ హుస్సేన్, షాకీర్ హుస్సేన్, జావీద్ హుస్సేన్‌లు ఉన్నారు. జాకీర్‌హుస్సేన్ కువైట్‌లో స్థిరపడగా, షాకీర్, జావీద్‌లు ముంబైలో ఉంటున్నారు. భార్య ఫామిదా ముంబైలో కుమారుల వద్దే ఉంటోంది. అయితే, జాఫర్‌హుస్సేన్ వారివద్ద ఉండేందుకు ఇష్టపడకుండా, మదనపల్లెలోని స్వగృహంలోని కింది పోర్షన్ అద్దెకు ఇచ్చి పై పోర్షన్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. వారంరోజుల క్రితం భార్య ఫామిదా ముంబై నుంచి మదనపల్లెకు వచ్చింది. తనతోపాటు పిల్లల వద్దకు వచ్చేయాలని భర్తను కోరింది. పోతబోలులోని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను చూసేందుకు ఆమె అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో జాఫర్‌హుస్సేన్ ఆదివారం తెల్లవారుజామున జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో తాను నివసిస్తున్న ఇంటిలోని గ్రిల్ ఫేమ్‌కు తాడుతో ఉరివేసుకుని వీధివైపుగా దూకాడు. ఇంటికి వేలాడుతూ ఉండగా, ఉదయాన్నే స్థానికులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అన్సర్‌బాషా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి ఆత్మహత్యకు గల కారణాలను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య ఫామిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యమంకడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాం. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. దీంతో ఆందోళన కార్యక్రమాలు, సమ్మె ద్వారా హక్కులను సాధించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు అన్నారు. ఆదివారం స్థానిక కింగ్స్ ఫంక్షన్ హాలులో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం (పీహెచ్‌ఎంఈయూ) జిల్లా, జోనల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్కార్‌రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇతర శాఖల విధులు ఆటంకంగా మారాయన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె ద్వారా హక్కులను సాధించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని తెలిపారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎర్రపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శిగా ఎస్ఎండీ మహబూబ్‌బాషా, కోశాధికారిగా జనార్దన్‌బాబు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్ బాబు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
పెద్దమండ్యం : స్నేహితుని ఊరిలో జరిగే జాతర కోసం వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని కలిచెర్లలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలిచెర్లకు చెందిన అరవింద్ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలు రాసి మదనపల్లెలోని ఓ కోచింగ్ సెంటర్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లె గ్రామం పిడుమువారిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భాస్కర (15), అలాగే తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన జయప్రకాష్‌రెడ్డితో అరవింద్‌కు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో కలిచెర్లలో శుక్రవారం నుంచి పోలేరమ్మతల్లి జాతర ఉండడంతో ముగ్గురు స్నేహితులు కలిచెర్లకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో బండకాడచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొడుతుండగా నీరు లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన భాస్కర హఠాత్తుగా నీటిలో మునిగి పోవడం గమనించిన స్నేహితులు కలిచెర్లలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. నీటిలో మునిగిపోయిన విద్యార్థిని యువకులు గుర్తించి బయటకు తీసి హుటాహుటిన కలిచెర్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆప్పటికే మృతి చెందినట్లు ఆర్ఎంపీ డాక్టర్ తెలిపారు. ఘటనపై మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి కాలువ పంచాయతీ సీతోరుపల్లె గ్రామానికి చెందిన పంగా రామయ్య (21)అనే యవకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వల్లూరు మండలానికి చెందిన పంగా వీరయ్య కుమారుడు పంగా రామయ్య కూలి పనులు చేసుకొనేవాడు. అయితే నందిపల్లి గ్రామ సమీపంలో కాలిన గాయాలతో రామకృష్ణారెడ్డి అరటి తోట వద్ద పడి ఉండడంతో అరటి తోట వద్దకు పనికి వెళ్లిన లక్ష్మిదేవి అనే మహిళ చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో కొన ఊపిరితో ఉన్న రామయ్యను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు నరసింహులు, చాంద్ బాషా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే మృతుని తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ విలేకరులతో మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లిన లక్ష్మిదేవి గమనించి రైతు రామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చిందన్నారు. ఆయనతోపాటు నందిపల్లె గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న యువకుడిని విచారించగా ముందు నీళ్లు ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పినట్లు తెలిపారు. అలాగే నీళ్లు తాగి మా నాన్న పేరు వీరయ్య అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు రామయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలంలో రామయ్యపై పెట్రోల్ కాని కిరోసిన్ కాని వేసి కాల్చిన ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. వేరే ప్రాంతంలో కాల్చి రాత్రి సమయంలో నందిపల్లె ప్రాంతానికి తీసుకొని వచ్చి పడేసినట్లు ఉందన్నారు. రామయ్యది హత్య కేసుగానే భావిస్తున్నామన్నారు. వల్లూరు మండలంలో సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెలో ఉన్న అక్క ఇంటికి భోజనానికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెకు వెళ్లలేదని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. హత్యగా భావిస్తున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ -
అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ఆదివారం ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. గంజాయి విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎర్రగుంట్ల రోడ్డు, పాల కేంద్రం, పెన్నానది పరివాహక ప్రాంతం, చిన్నశెట్టిపల్లె రోడ్డు, అమృతానగర్, పెద్దశెట్టిపల్లె గ్రామ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టి అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడికి గాయాలుముద్దనూరు : మండలంలోని డీయన్పల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు నందకిషోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కొసినేపల్లె గ్రామానికి చెందిన కిషోర్ ముద్దనూరుకు మోటార్‌బైక్‌పై వస్తుండగా ఎదరుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో కిషోర్ కాలికి తీవ్ర గాయం కాగా అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. -
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
రామాపురం : రామాపురం మండలం బండపల్లె గ్రామం వీఆర్ పాఠశాల సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు రామాపురం మండల వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్ గౌస్‌మొహిద్దీన్, అతని భార్య షేక్ గులాబ్జాన్, కుమారుడు మహమ్మద్ అనాస్‌లు రాయచోటికి వెళ్లి తిరిగి స్వగృహానికి ఏపీ04ఏబి 3151 ఎక్స్ఎల్ ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ బంక్ (వీఆర్ పాఠశాల) సమీపంలోకి రాగానే రాయచోటి వైపు నుంచి కడపకు వెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీ40 ఎఫ్‌సీ 7187 వాహనం అతి వేగంగా, అజాగ్రత్తగా, హారన్ కొట్టకుండా వచ్చి ముందు వెళ్తున్న ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న షేక్ గౌస్‌మొహిద్దీన్, గులాబ్జాన్, మహమ్మద్ అనాస్‌లు రోడ్డుపై పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ వెంకటసుధాకర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షేక్ గులాబ్జాన్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు -
తంబళ్లపల్లె టీడీపీలో ఉత్కంఠ
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో ఉప్పు–నిప్పుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారరెడ్డి వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. మంత్రులు నిర్వహించే సమావేశ నిర్వహణ తీరును పూర్తిగా మార్చేశారు. ఆదివారం ములకలచెరువు మార్కెట్ యార్డులో ఈ సమావేశం ఉందని, పార్టీ శ్రేణులు హాజరు కావాలని జయచంద్రారెడ్డి వీడియో సందేశంలో కోరారు. దీంతో సమావేశం రసాభాసగా మారే పరిస్థితులున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జోన్ఫోర్ ఇన్చార్జి దీపక్‌రెడ్డిలు నిర్వహించే ఈ సమావేశాన్ని.. 30 మందిలోపు ముఖ్యలతోనే నిర్వహించి ముగించేలా నిర్ణయించారు. సమావేశం ములకలచెరువు మార్కెట్లో నిర్వహిస్తే భారీ సంఖ్యలో రెండు వర్గాలు ఒకేచోటికి తరలివచ్చాక ఉద్రిక్తత నెలకొంటే పరిస్థితి చేయిదాటి పోతుందని భావించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. దీంతో కొద్ది మందితో జరిపే సమావేశాన్ని ములకలచెరువులో కాకుండా శనివారం రాత్రి మంత్రులు విడిదిచేసే బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి మార్చారు. శుక్రవారం రాత్రి తంబళ్లపల్లె పరిశీలకులు గురువారెడ్డి ముఖ్యులతో ఫోన్లో మాట్లాడి ఈ సమాచారం ఇచ్చారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి పదవి విషయంలో గత ఎనిమిది నెలలుగా రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇన్చార్జి బాధ్యతలను శంకర్‌కు అప్పగించాలని ఆయన వర్గం పట్టుపడుతుండగా.. ఇన్చార్జి మార్పు లేదని జయచంద్రారెడ్డి వర్గం గట్టిగా వాదిస్తోంది. దీనితో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ రెండు వర్గాలుగా మారిపోయారు. పరస్పర ఆరోపణలతో వివాదాలు తంబళ్లపల్లె టీడీపీలోని రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో మునిగిపోయారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. ‘శంకర్ వస్తున్నారు.. కార్యకర్తలకు అండగా ఉంటారు’ అంటూ పోస్టులు పెడితే దానికి కౌంటర్‌గా.. శంకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. విభేదాలపైనే దృష్టి హార్సిలీహిల్స్‌పై మంత్రులు నిర్వహించే పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యే స్థానిక నాయకుల ద్వారా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, వర్గ విభేదాలు, పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులపై వివరాలు సేకరిస్తారని తెలిసింది. ఇరువర్గాల వాదనలు వినే అవకాశం ఇచ్చాక వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని తెలిసింది. ఒకరిపై ఒకరు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారా లేక వారి మధ్య సమోధ్య కుదుర్చుతారా, రెండు వర్గాల వాదనలు విని అధిష్టానానికి నివేదిస్తారా అన్నది చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో బలప్రదర్శనకు తావులేకుండా మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్చార్జిలు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలను మాత్రమే ఆహ్వానించి వారి నుంచి అభిప్రాయాలు సేకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. వీరికి మాత్రమే పాసులు ఇస్తున్నారని తెలిసింది. దీంతో ఇతరులతో సంబంధం లేకుండా.. పార్టీ ముఖ్యల నుంచే వారి అభిప్రాయాలను తీసుకుంటారని తెలుస్తోంది. ● సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం ములకలచెరువు నుంచి హార్సిలీహిల్స్‌కు మారిన మంత్రుల భేటీ పార్టీ ముఖ్యలతోనే సమావేశం బలప్రదర్శనకు సిద్ధమవుతున్న జేసీఆర్, శంకర్ వర్గాలు హార్సిలీహిల్స్‌పై జరిగే పార్టీ సమావేశం సందర్భంగా తమ బలమెంతో చూపెట్టాలని రెండు వర్గాలు సిద్ధం కావడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తమ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమీకరణ మొ దలుపెట్టారు. శంకర్ వర్గం బలప్రదర్శనతో తమ వాదనను మంత్రులకు వినిపించి ఇన్చార్జి బాధ్యతలు శంకర్‌కు ఇ వ్వాలని డిమాండ్ చేసేందుకు, ఇక్కడి పరిస్థితులను వివరించేందుకు సిద్ధమ య్యారు. ఈ వాదనను జయచంద్రారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ గట్టిగా వాదించే పరిస్థితి ఉంది. దీంతో రెండు వర్గాలు ఒకే చోట ఉండి.. భిన్నవాదనలు తెరపైకి వచ్చాక అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలకు దారి తీస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య విమర్శలు, ఆరోపణల యు ద్ధమే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలు ఒకే చోట కలవడం అంటే ఏమి జరు గుతుందో చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై పోలీసు నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మండలాల నుంచి ఏ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఏ సంఖ్యలో వస్తారన్న వివరాలు సేకరిస్తున్నారు. -
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
రాయచోటి జగదాంబసెంటర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. జిల్లా ప్రజలు (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆంజనేయా.. ఆశీర్వదించవయా! సాక్షి రాయచోటి: ‘ఆంజనేయా.. ఆశీర్వదించవయా’.. అంటూ భక్తులు పెద్ద ఎత్తున హనుమంతుడికి పూజలు నిర్వహించారు. శనివారం హనుమద్ విజయం పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా హనుమంతుని ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే అంజనీపుత్రుడి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. పలువురు భక్తులు మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా స్వామి మూల విరాట్‌కు ఆకుపూజ, వడమాల సేవ నిర్వహించారు. అర్చకులు ఉదయం స్వామికి పంచామృతాభిషేకం, సింఽధూర అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేష అలంకారం చేసి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా సామూహికంగా భజనలు, భక్తిగీతాలాపనలు చేశారు. -
సమష్టి కృషితో విజయవంతం
కడప అర్బన్: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే కల్యాణ ఘట్టం విజయవంతంగా ముగిసిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా ముగిసేలా అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర ప్రత్యేక విభాగాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించిన టీటీడీ, అగ్నిమాపక, రెవెన్యూ, ఏపీ ట్రాన్న్స్కో, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇంటర్లో పెరిగిన ఉత్తీర్ణత
రాయచోటి: విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి అన్నమయ్య జిల్లా పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. అలాగే రాష్ట్రంలోనే రాయచోటి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మార్కుల సాధనలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 13108 మందికి గాను 7814 మంది పాసై 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. సెకండియర్‌లో 11486 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 9175 మంది ఉత్తీర్ణతతో 80 శాతం సాధించి 13వ స్థానంలో నిలిచారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, వెల్ఫేర్, వసతి గృహాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కృష్ణయ్య కొనియాడారు. అయితే.. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే.. ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా ప్రకటించారన్నారు. మొదటి సంవత్సరంలో 60 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానం ద్వితీయ సంవత్సరంలో80 శాతంతో 13వ స్థానం -
657 కేజీల చౌక బియ్యం సీజ్
పీలేరు రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 657 కేజీల చౌక బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. శనివారం మండలంలోని శివరామ్పురం నుంచి పీలేరుకు వస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో ఆరు బస్తాల చౌకబియ్యం ఉండడంతో ఆటోను అదుపులోకి తీసుకున్నారు. కలకడకు చెందిన అన్సారీ ,జోహర్లతోపాటు బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీట మునిగి ఉపాధ్యాయుడి మృతి పీలేరు : తన కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగింది. నందకుమార్(50) అనే ఉపాధ్యాయుడు కేవీపల్లె మండలం మారెళ్ల పడమట పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పీలేరు పట్టణంలో నివాసముంటున్నారు. శనివారం తన కుమారుడికి ఈత నేర్పించడానికి పట్టణ సమీపంలోని బోడుమల్లువారిపల్లెకు వెళ్లారు. అక్కడ పొలాల వద్ద ఉన్న చెక్‌డ్యామ్‌లో నీళ్లు ఉండడంతొ నీళ్లలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడే చనిపోయారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైరు పగిలి కారు బోల్తా – తప్పిన పెను ప్రమాదం నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిలోని నందలూరు వద్ద శుక్రవారం రాత్రి చెయ్యేరు బ్రిడ్జిపైన టైరు పగలడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి తిరుమలకు వెళ్తున్న తోటకూరి నరేష్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. -
సీఐపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
రాజంపేట : రాజంపేట అర్బన్ సీఐ రాజాపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఓ కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందే గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గీయులు కళ్యాణమండపం వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సమావేశంలో కేవలం 30 మందికి అనుమతి ఉందని, బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన సీఐ రాజా తెలిపారు. ఇందులో పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలే అని సుగవాసి వర్గీయులకు వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు తమను సమావేశానికి రానివ్వకుండా చేస్తున్న కుట్ర అని భావించిన సుగవాసి వర్గీయులు వీరంగం సృష్టించారు. వాగ్వాదానికి దిగారు. సీఐ మాటలను ఖాతరు చేయలేదు. ఇక చేసేదిలేక సీఐ వెనుదిరిగి వెళ్లిపోయారు. సమావేశానికి మంత్రితో పాటు సీడాప్ చైర్మన్, జోనల్ 4 ఇన్చార్జి దీపక్‌రెడ్డి హాజరయ్యారు. కాగా మరోసారి రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సమావేశంలో సుగవాసి వర్గీయుల రగడ -
మంత్రి కనుసన్నల్లో ఇసుక మాఫియా
రాయచోటి అర్బన్ : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కనుసన్నల్లో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా మంత్రి అండదండలతో పెద్దఎత్తున ఇసుకను తరలించుకు పోతోందన్నారు. సుండుపల్లె మండలం ఎర్రమనేనిపాళెం వద్ద బహుదానది నుంచి నెల్లూరు ప్రసాద్‌రెడ్డి, రాంబాబు తదితరులు ప్రతిరోజు లక్షల విలువ చేసే ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. విషయం తెలిసినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. సుండుపల్లె – పీలేరు రోడ్డు నుంచి సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు హిటాచీలతో రోడ్డు వేశారంటే ఇసుకారులు ఎంతకు బరితెగించారనేది అర్థమవుతుందన్నారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ దందాపై మంత్రి స్పందించాలని, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు -
ఇంటర్ ఫలితాల్లో ‘శ్రీధర్స్’ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్‌రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. విద్యార్థులను అభినందించారు. -
ఇది కథ కాదు.. అంతులేని వ్యఽథ.!
● ఆమె జీవితమంతా శోకమే ● తొమ్మిది మందిలో ఆరుగురు బిడ్డలు చనిపోయారు ● ఇక జీవితమెందుకుని మనస్తాపంతో ఆత్మహత్య కురబలకోట : కనిపెంచి పెద్ద చేసిన బిడ్డలు ఏడుగురు వివిధ కారణాలతో ఒకరి తర్వాత ఒకరుగా చనిపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. గ్రామస్తులతో పాటు ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు..మండలంలోని సింగన్నగారిపల్లెకు చెందిన కన్మెమడుగు ఈశ్వరమ్మ (80)కు తొమ్మిది మంది సంతానం. ఐదుగురు మగ బిడ్డలు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో గత 20 ఏళ్లుగా వివిధ కారణాలతో ఉన్న ఐదుగురు మగ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరుగా చనిపోయారు. మరో ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. భర్త కూడా మృతి చెందారు. అయినా గుండె రాయి చేసుకుని జీవితాన్ని వెళ్లదీయసాగింది. వీరిలో గత ఏడాది ముఖ్యంగా ఇద్దరు కుమారులు చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అయితే కన్నబిడ్డలు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు చనిపోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. పైగా వృద్ధాప్యం వెంటాడసాగింది. ఇటీవల ఉగాది పండుగకు చనిపోయిన బిడ్డల జ్ఞాపకార్థం కొత్త దుస్తులు నిలువుగా పెట్టింది. వారిని తలచుకుని ఎంతగానో బాధపడింది. బిడ్డలు వెళ్లిపోయారు.. నేను కూడా వారి చెంతకు వెళ్లిపోతానని స్థానికులకు చెప్పేది. జీవితంలో అల్లకల్లోలాన్ని చవి చూసింది. విధిరాతకు చింతించింది. బిడ్డలు లేని జీవితం వ్యర్థమనుకుంది. దీనికి తోడు జీవితం శోకమయమైంది. ఇక ఎవరి కోసం బతకాలి.. బతికుండి ఏం సాధించాలని ఇరుగుపొరుగువారితో చెబుతూ మథనపడినట్లు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో వారం క్రితం ఆమె స్వగ్రామం సింగన్నగారిపల్లె నుంచి పుట్టినిల్లయిన కుక్కరాజుపల్లెకు వెళుతున్నానని ఇంటి వద్ద నుంచి బయలు దేరింది. కుటుంబీకులు కూడా పుట్టినింటికి వెళ్లి ఉంటుందని భావించారు. అయితే ఆమె మార్గమధ్యంలోని కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కనున్న తేనెకొండ అటవీ ప్రాంతంలో కొంత దూరం వెళ్లింది. అక్కడ చీరతో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు మృత దేహాన్ని శనివారం కనుగొన్నారు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. ఆ తర్వాత సింగన్నగారిపల్లె గ్రామస్తులు ఈ విషయాన్ని తెలుసుకుని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ● డీఆర్సీలో పలు శాఖలపై సమీక్ష రాయచోటి : జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమన్వయంగా పని చేద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మంత్రి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ(డీఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా ఎన్నో విషయాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, జాబ్ మేళాల నిర్వహణ, రీ సర్వే, ఎన్టీఆర్ హౌసింగ్, ఇళ్ల నిర్మాణాలు, పల్లె పండుగ పనులు, సూక్ష్మ నీటిపారుదల తదితర అంశాలలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే అంశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ముందు ఉంచారని, వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్రమంతా దానిని అమలయ్యేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. విజన్–2047లో పేర్కొన్న విధంగా అన్నమయ్య జిల్లా 15 శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి పథంలో నిలుస్తుందని తెలియజేయడంలో సందేహం లేదన్నారు. జిల్లాలో పలు జాతీయ రహదారులు పనులు, మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచ సూత్రాలు, ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ జిల్లాలో టమాటా, మామిడి పంటలు ఎక్కువగా ఉన్నందున ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా చేయడానికి మీ సూచనలు, సలహాలు, సహకారం కోరుతున్నామన్నారు. సూక్ష్మనీటి పారుదలలో మూడో స్థానం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మనీటి పారదలలో అన్నమయ్య జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2025–26లో 15 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదలను అందించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పర్యాటక రంగంలో అభివృద్ధి పనులకు అవసరమయ్యే భూసేకరణపై తగిన నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గ్రామీణ నీటిపారుదల, గనులు–భూగర్భ, డ్వామా, విద్య, ఐసీడీఎస్, అటవీ, పరిశ్రమలు, డీఆర్డీఏ, పట్టణ ప్రజారోగ్యం తదితర శాఖలపై చర్చించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చైర్మన్ రూపానందరెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎం.రాచపల్లి.. చిన్నారుల మృతితో తల్లడిల్లి..
చిట్వేలి : మండల పరిధిలోని ఎం.రాచపల్లిలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చొక్కారాజు దేవాన్స్ (7) తండ్రి నరసింహారాజు, తల్లి చంద్రకళ. వీరికి ఇద్దరు కుమారులు కాగా దేవాన్స్ పెద్ద కుమారుడు. అలాగే చొక్కారాజు విజయ్ (7) తండ్రి శేఖర్ రాజు, తల్లి విజయలక్ష్మీ. వీరికి ముగ్గురు కుమారులు కాగా విజయ్ చిన్న కుమారుడు. అలాగే రెడ్డిచర్ల యశ్వంత్ (6) తండ్రి వెంకటేష్, తల్లి సుప్రజ. వీరికి ముగ్గురు కుమారులు కాగా యశ్వంత్ పెద్దకుమారుడు. విజయ్ తండ్రి శేఖర్ రాజు, యశ్వంత్ తండ్రి వెంకటేష్ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి ఉన్నారు. సంఘటన జరగడంతో శనివారం స్వగ్రామం చేరుకొని కుమారుల మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. మృతులు యశ్వంత్, విజయ్ చిట్వేలిలో ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుండగా దేవాన్స్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతునాడు. వీరి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
రాయచోటిలో రాజకీయ దొంగలు పడ్డారు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో రాజకీయ దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అతని అనుచరులు చేస్తున్న దోపిడీ, అరాచక పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణంలో పాల్గొంటే రాయచోటిలో మంత్రి అనుచరులు దొంగతనాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు నిర్మాణం సామగ్రిని దొంగిలించే టిప్పరు, జేసీబీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే గంట తిరగకముందే ఆ టిప్పర్, జేసీబీ కనబడటం లేదన్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దోపిడీ చేసుకెళ్తున్న సంఘటనపై మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదునే పట్టించుకోని పోలీసులు సామాన్య ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ఎంత వరకు విలువ ఇస్తారో అర్థమవుతోందన్నారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో చిల్లర నేతలకు ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోందన్నారు. తమ క్రషర్‌పై కేసు రాయించి రూ.12 కోట్లు అపరాధ రుసుము వేశారన్నారు. తన క్రషర్ కేసును చూపిస్తూ మిగిలిన క్రషర్ యజమానుల నుంచి గత నాలుగు నెలలుగా లక్షలాది రూపాయల మామూళ్లు వసూలు చేస్తున్నారని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలు తెస్తా, ఉపాధి కల్పిస్తా అంటూ చెబుతుండగా స్థానిక మంత్రి దాడులు, దోపిడీలతో వందల మందికి ఉపాధి కోల్పోయేలా జిల్లాలో పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. ఏ సమయంలో ఎవరి స్థలం కబ్జా చేస్తారో.. ఎవరి మీద దాడులు చేస్తారో.. అన్న భయంతో ప్రజలు జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తొలి ఏడాదిలోనే విపత్కర పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారన్నారు. గత పది నెలల కూటమి పాలనను చూసిన ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటోందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి 2.0 ఫార్ములా అందరి జీవితాలను ఉన్నత స్థానంలో ఉండేలా మారుస్తుందన్నారు. బీజేపీ, జనసేనలు కూటమిలో నామమాత్రమే అన్నారు. పవన్ కళ్యాణ్ సత్తా లేని మనిషిగా మిగిలిపోయారన్నారు. పోలీసులను వాడుకొని జూదం కేంద్రాలు నిర్వహించి తద్వారా లక్షల రూపాయలను మంత్రి మండిపల్లి, అతని అనుచరులు గడించారన్నారు. జిల్లా కేంద్రంలో తహసీల్దార్ స్థానంలో అర్హత లేని డీటీని నియమించి ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్‌రెడ్డి ఫైర్ -
మదనపల్లెలో వృద్ధురాలి హత్య
మదనపల్లె : మదనపల్లెలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఆమె వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై ఉన్న నగలు దోచుకుని హత్య చేశారని కుటుంబ సభ్యులు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాలు... మదనపల్లె పట్టణం చంద్రాకాలనీలోని లక్ష్మినగర్‌లో నివాసముంటున్న రెడ్డప్ప భార్య గంగులమ్మ (73) గాజుల వ్యాపారం, జాతరలో బొమ్మల వ్యాపారం చేస్తూ జీవిస్తుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికి వివాహమైంది. గంగులమ్మ సోదరి లక్షుమ్మ కుమారుడు వెంకటరమణ భవన నిర్మాణం పనులు చేస్తూ కొత్త ఇండ్లు రంగారెడ్డికాలనీలో నివాసమున్నాడు. శుక్రవారం ఇంటి వద్ద పనులు చేసే క్రమంలో ప్రమాదశాత్తు నీటి తొట్టెలో పడి గాయపడ్డాడు. వెంకటరమణ తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గంగులమ్మ వైద్య చికిత్స కోసం డబ్బు అవసరమవుతుందని భావించి, చీటీ ద్వారా తనకు వచ్చిన నగదు, కుమార్తె ఇచ్చిన నగదు మొత్తం రూ.2లక్షలు తీసుకుని శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతికి బయలుదేరింది .ఇంటి వద్ద నుంచి బైపాస్ మెయిన్‌రోడ్డులోకి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తుండగా పట్టణంలోని ఎగువ కురవంక భువనేశ్వరి నగర్‌కు చెందిన గంగరాజు కుమారుడు విష్ణువర్దన్ ఏపి03 టీవీ 4314 నంబరు గల ఆటోతో ఆటువైపుగా వచ్చాడు. గంగులమ్మను ఆటోలో ఎక్కించుకున్నాడు. తాను తిరుపతికి వెళ్లాలని, ఆస్పత్రిలోని బంధువులకు డబ్బులు ఇచ్చి రావాలని చెప్పింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాల్సిందిగా కోరింది. అయితే ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్టాండుకు రాకుండా వెంగమాంబ సర్కిల్ మీదుగా బైపాస్‌రోడ్డులోకి గంగులమ్మను తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఆమె దారి వెంట అతనితో పోట్లాడుతూ గట్టిగా అరవసాగింది. ఆటోను బైపాస్‌రోడ్డులోని నిమ్మనపల్లె సర్కిల్ వద్ద నిమ్మనపల్లె మార్గంలోని చెరువు మరవ వద్దకు మళ్లించాడు. అక్కడే ఆటోను నిలిపి ఉంచి ఆమైపె దాడి చేశాడు. ఆమె తల వెనుక భాగం, చెంపలు, భుజంపై గాయాలు కాగా నోటి నుండి రక్తం కారుతూ అక్కడే పడిపోయింది. ఆ సమయంలో ఆటోలో మరికొందరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె దగ్గరున్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై నగలు దోచుకుని కొందరు పరారయ్యారని స్థానికులు తెలిపారు. అయితే ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ అక్కడే ఉండగా ఆమె పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయానికి ఆమె బంధువులు మరొకరు ఆక్కడికి చేరుకుని ఆమెను గుర్తించారు. తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని గమనించగా గంగులమ్మ అప్పటికే మృతి చెంది ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ విష్ణువర్దన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు, నగలు కోసమే హత్య చేశారని గంగులమ్మ కుమార్తెలు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై గంగులమ్మ కుమారుడు అంజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై తాలూకా సీఐని విచారించగా ఘటనకు సంబంధించిన నిందితులను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఆటోడ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు రూ.2 లక్షలతో ఇంటి నుంచి బయలుదేరిన వృద్ధురాలు -
ప్రజా క్షేత్రంలో హుందాతనం ఉండాలి
రాయచోటి టౌన్ : ప్రజాక్షేత్రంలో హుందాతనం, జవాబుదారితనం ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా రాయచోటిలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డికి చెందిన కాంపౌండ్‌లో ఉన్న మెటీరియల్‌ను అక్రమంగా తరలించిన సంఘటన చాలా బాధాకరమన్నారు. రమేష్‌కుమార్‌రెడ్డి వీడియో క్లిప్పింగులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా వారిని అక్కడి నుంచి పంపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణల మేరకు రాయచోటి రింగ్ రోడ్డు గుండా అటు సుండుపల్లె, ఇటు బహుదా, వీరబల్లె నుంచి ఇసుక టిప్పర్లు వెళుతున్న విషయం వాస్తవం కాదా అన్ని ప్రశ్నించారు. వందలాది టిప్పర్లు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఇచ్చే అవకాశం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమేనన్నారు. రాచరికంలా వ్యవహరించకూడదని హితవు పలికారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సిద్దవటం : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి పంచాయతీలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దుకాణ దారులకు శుక్రవారం డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణదారులు చెత్తను చెత్తబుట్టల్లో వేసి ప్రతిరోజు గ్రామంలోకి వచ్చే హరిత రాయబారుల వాహనంలో చెత్తను వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి గ్రామాన్ని పరి శుభ్రంగా పెట్టుకోవాలని తెలిపారు. కాలుష్య నివారణ కోసం గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఒంటిమిట్టలోని కోందడ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జేఎంజే కాలేజీ నుంచి జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బద్వేల్ డీఎల్పీఓ రమణారెడ్డి, ఏఓ ఖాదర్‌బాషా, గ్రామ కార్యదర్శి రాజేష్ స్థానిక నాయకుడు తుర్రా ప్రతాప్ పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. డీపీఓ రాజ్యలక్ష్మి -
రిమ్స్‌లో ఫార్మసిస్ట్పోస్టు భర్తీకి పైరవీలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రిమ్స్)లో రెగ్యులర్ ఫార్మసిస్ట్– గ్రేడ్ –2ను, ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ పోస్టులో నియమించమని యూనియన్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారనీ అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకోసం యూనియన్ నాయకులు రూ. 5– 8 లక్షల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పోస్టులో ఉద్యోగిని నియమిస్తే జీతాలు సమస్య ఎదురవుతుందని తర్వాత భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగి జాయిన్ అయితే రెగ్యులర్ ఉద్యోగస్తుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం కాంట్రాక్టు ఫార్మసీ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగ్ లేదా బదిలీ ఇచ్చుట నిబంధనలకు విరుద్ధమని రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ వివరణతో యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. పైరవీలకు అలవాటు పడిన అధికార పార్టీ పేరుతో చలామణి అవుతున్న కొందరు యూనియన్ నాయకులు రిమ్స్ సిబ్బందిని చివరికి బెదిరింపు ధోరణికి పాల్పడిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈసంఘటన వివరాల్లోకెళితే ..ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడిసీ)సెంట్రల్ ట్రక్ స్టోర్‌లో వి.ఎన్పల్లి నుంచి డిప్యుటేషన్ లో ప్రస్తుతం ఓ రెగ్యులర్ ఉద్యోగి విధులను నిర్వహిస్తున్నారు.అతను తన మాతృశాఖకు వెళ్లుటకు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన ఉద్యోగి జిల్లా లోని ఏ పిహెచ్సీ లో పోస్టు ఖాళీగా ఉన్న కూడా పల్లెల్లో పోయి డ్యూటీ చేయుటకు ఇష్టం లేక రిమ్స్ జనరల్ హాస్పిటల్‌కు బదిలీ కావాలని ప్రయత్నించారు. యూనియన్ వారితో ఒక రేటు మాట్లాడుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. యూనియన్ నాయకులలో కొందరు సొంత లాభం ఆలోచించి రిమ్స్ సూపరింటెండెంట్ సంప్రదించారు. కాంట్రాక్ట్ పోస్ట్‌లో రెగ్యులర్ ఉద్యోగిని నియమించడం లేదా బదిలీ చేయడం డిపార్ట్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సదరు యూనియన్ లీడర్స్ సిబ్బందిని బెదిరించి జీతాలు విషయంలో మిగతా ఏ సమస్యలనైనా డీఎంఈ కార్యాలయం లో తమకు సహకరించు అధికారులు ఉన్నారు. డీఎంఈ ఇంకా పైస్థాయిలో మేం చూసుకుంటాము మీరు క్లారిఫికేషన్ రాయండి అని ఒత్తిడి చేశారు. అయినా రిమ్స్ సూపరింటెండెంట్ మొత్తం రిమ్స్ లో ఫార్మసిస్టులు పోస్టులు 11. రెగ్యులర్ ఉద్యోగులు 11 మంది పనిచేస్తున్నారని, 10 కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ పోస్టులకు 9 మంది పని చేస్తున్నారని ఇటీవల ఒక కాంట్రాక్టు ఉద్యోగి రిజైన్ చేయడం వల్ల ఒక ఖాళీ ఏర్పడిందిదని, ఆ పోస్టు కాంట్రాక్ట్ పోస్ట్ మాత్రమే అని క్లారిఫికేషన్ ఆర్డీకి లెటర్ పెట్టారు. ఈ విధానానికి యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. కోర్టును ఆశ్రయిస్తామని రిమ్స్‌లో అధికారులను, సిబ్బందిని బెదరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూనియన్ నాయకులు తమ స్వార్థాలకు సమూహంగా ఏర్పడి చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు వీరి బెదిరింపులకు లొంగవద్దని పలువురు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ సంఘటనలో జీజీహెచ్‌లోని ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ యూనియన్ నాయకుల బెదరింపులకు బెంబేలెత్తి పోయింది. మరోవైపు జీజీహెచ్(రిమ్స్)లో ఫార్మసీ విభాగంలోనే పనిచేస్తున్న రెగ్యులర్ మహిళా ఉద్యోగి ఈనెలలోనే రిటైర్డ్ కాబోతుందని సమాచారం. ఆమె స్థానంలో కూడా సదరు ‘ఫార్మసీ ఆఫీసర్’ను నియమించేందుకు కూటమి అధికారపార్టీకి సన్నిహితంగా వుంటున్న పై యూనియన్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి భర్తీకి యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్న పాలనా విభాగా సిబ్బందికి బెదిరింపులు ఇందుకోసం ‘పరిపాలనా విభాగం’లో కొందరి సహకారం? -
బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి
రాయచోటి అర్బన్ : సమాజంలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను కల్పించాలని బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం జాతీయస్థాయిలో బహుజన సమాజ్‌పార్టీ పోరాటం చేస్తోందన్నారు. కులగణన ద్వారా బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాగా కేంద్ర – రాష్ట్రప్రభుత్వాలు బీసీ ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మేలును చేకూర్చే కులగణన పట్ల నిర్లక్ష్య దోరణిని ప్రదర్శిస్తుండడం దారుణం అన్నారు. బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. బడుగు, బలహీనుల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావుపూలే, బాబు జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ల బాటలో బహుజన యువత నడవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్, ఉపాధ్యక్షుడు మహేష్, సెక్రటరీ నరసింహులు, జనరల్ సెక్రటరీ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది ఈశ్వర్, బహుజనవాది మల్లూరి రెడ్డిప్ర సాద్, రజకసంఘం నేతలు రమేష్‌బాబు, శ్రీనివాసులు, న్యాయవాది నాగముని, బీసీ నేతలు నరసింహాచారి, జీవానందం, జయరామయ్య, రామమోహన్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే కులగణను చేపట్టాలి రాయచోటి అర్బన్ : పాలకులు వెంటనే కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేతలుకె.వి.రమణ,ఈ.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీ కులసమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణనను చేపట్టాలన్న డిమాండ్‌తో ఆ సంఘం నేతలు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన జరపడం ద్వారా సమాజంలో ఏయే కులాల ప్రజలు ఎంత శాతం మేర ఉన్నారనేది గుర్తించవచ్చునన్నారు. తద్వారా అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు దువ్వూరు నరసింహాచారి, పల్లపు రమణ మ్మ, పాలగిరి హబీబుల్లా, వడ్డెరసంఘం నేతలు నాగముని, జీవానందం, సీనియర్ అడ్వకేట్ ఈశ్వర్, రమేష్‌బాబు, వీరబల్లి శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
పూలే ఆశయసాధనకు కృషి చేయాలి
రాయచోటి: అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాయచోటి కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, అధికారులు, బీసీ సంఘ నాయకులు, ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి, సీ్త్ర విద్యకు పాటుపడిన గొప్ప సంస్కర్తగా పూలే పేరొందారన్నారు. ఆ మహనీయుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమావేశంలో జేసి ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు. ● బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి నిమిత్తం 707 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 14.14 కోట్ల రాయితీ మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జయసింహ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ 16లోపు అభ్యంతరాలు తెలపాలి కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) తాత్కాలిక జాబితా వెబ్సైట్ https:/rjdsekadapa.blog spot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలి పారు. కావున ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో తగిన ఆధారాలతో ఈ నెల 16లోపు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. -
నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోముడు.. శ్రీరామచంద్రుడు.. కల్యాణ రామునిగా మారి.. సౌందర్య రాశి.. సుగుణాల తల్లి సీతమ్మను పరిణయమాడారు. నునుసిగ్గుల మొలకై న సీతమ్మకు నుదుటన కల్యాణ బొట్టు, బుగ్గన కాటుక పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలను అలంకరింపజే
● కమనీయంగా సీతారాముల కల్యాణం ● వైకుంఠాన్ని తలపించిన ఏకశిలానగరి ● పోటెత్తిన భక్తజనం ● మార్మోగిన రామనామం రాజంపేట/ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సీతారామ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఏకశిలానగరం రామనామంతో మార్మోగింది. దారులన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. జిల్లా నలు మూలల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా రామాలయంలోని సీతా,రామ,లక్ష్మణ మూర్తులను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయం ఆడిన వేల శిల్పకళాశోభితమైన కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచంద్రులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు దీర్చారు. ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా.. సీతమ్మ నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి.. అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నారు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కన్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టం చదివారు. హస్త నక్షత్రయుక్త శుభ లగ్నంలో 6:30 నుంచి 8:30 గంటల మధ్య సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతిదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానం చేసి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించారు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కల్యాణ ముర్తుల శిరస్సుపై వేసి కల్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. ● వేదిక.. సుందర దీపిక కల్యాణ వేదికను టీటీడీ ఉద్యానవ విభాగం ఆధ్వ ర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతా యుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా సుందరంగా ముస్తాబు చేశారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతరాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరిగింజలతో మండపం ఏర్పాటు చేశారు. రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం, ఆర్కిడ్, రెడ్ ఆంధూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పని చేశారు. -
బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ
ఓబులవారిపల్లె : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఫొటోలకు పోజులిస్తున్నారన్నారు. బీసీలకు, మైనార్టీల లబ్ధిదారులకు గుర్తించకుండా మేము బీసీలకు మైనార్టీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సీఎం, మంత్రులు అనడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించకుండా బీసీ, మైనార్టీ లబ్ధిదారులను గుర్తించకుండా ఏ విధంగా అభివృద్ధి చేసారని చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి ఎన్నికలలో అబద్ధపు హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో బీసీలు, మైనార్టీలు, మహిళలు, యువత వారికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. నేడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలు, మైనార్టీలను మోసగిస్తున్నారని విమర్శించారు. సంక్షేమానికి బడ్జెట్లో ఒకరూపాయి కేటాయించలేదు రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
దోపిడీ, దౌర్జన్యాలకు మంత్రి మండిపల్లి తెర
రాయచోటి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు రాయచోటి ప్రాంతంలో ఆయన అనుచరులు దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, దొంగతనాలకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మంత్రి సూచనల మేరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారని రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మేనల్లుడు మౌర్యారెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి కుట్రలో భాగంగా జాతీయ రహదారి పనులు నిర్మాణం కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర మెటీరియల్‌ను దొంగతనంగా జేసీబీలతో టిప్పర్లకు పోసి దోపిడీకి యత్నించడం సిగ్గుచేటన్నారు. సమాచారం తెలుసుకుని నిల్వ ప్రాంతానికి చేరుకునేటప్పటికి 15, 20 టిప్పర్లు అప్పటికే తరలించారన్నారు. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వస్తువులనే దోపిడీ చేస్తున్నారంటే ఇక సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంటుందని రమేష్‌రెడ్డి నిలదీశారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఎంతటి నీచమైన సంస్కృతితో ముందుకు వెళ్తున్నారో వారు పాల్పడిన దోపిడీని చూస్తే తెలుస్తోందన్నారు. దౌర్జన్యాలు, అరాచకాలే కాకుండా దొంగతనాలకు పాల్పడటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికే మట్టి, ఇసుక, కంకర మిషన్ల దగ్గర కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రతి పని దగ్గర టీడీపీ నాయకులు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దౌర్జన్యంగా ఎమ్మెల్యేకి చొరబడి డబ్బులు సంపాదించే దిగజారుడుతనానికి దిగారు. మరో పక్క ఎర్రచందనాన్ని మంత్రి అనుచరులు భారీగా తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారని వివరించారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్నదంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇదేనా గవర్నర్స్ అంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబునాయుడు ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇంతటి దురదృష్టకరమైన పాలన దౌర్జన్యకరమైన సంఘటన నా రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే పనులను ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు చేసుకుంటుంటే మంత్రి ఇంజినీర్లకు చెప్పి పనులు ప్రారంభం కాకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. అంతటితో ఆగక పనుల కోసం నిలువ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేయించే దౌర్భాగ్య స్థితిలో మంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కంకర, ఇతర సామగ్రిని దోచుకెళ్లడం జిల్లాలో మంత్రి ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఇంతటి దురదృష్టకరమైన పరిపాలనను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. మంత్రి అరాచకలపై చంద్రబాబునాయుడు, లోకేష్‌లు దృష్టి సారించాలన్నారు. లేకుంటే మండిపల్లి దోపిడీ, దౌర్జన్యాలు మీ అనుమతులతోనే జరుగుతున్నాయా అనేది స్పష్టం చేయాలన్నారు. మీరే అనుమతి ఇచ్చినట్లయితే నేరుగా మీకే టాక్స్‌లు కడతామని తెలిపారు. ఎక్కడ ఎవరు అరాచకం చేసిన తాట తీస్తానని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పిన రోజునే ఆయన అనుచరులు దొంగతనాలకు పాల్పడటంపై సమాధానం చెప్పాలన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరు పోలీసులను పంపారన్నారు. దౌర్జన్యంగా దొంగతనాలు చేస్తున్నారంటే ఇలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిపైన తక్షణం చర్యలు తీసుకొని అరాచకాలు ఆపుతారా లేదా వారిని రమేష్‌రెడ్డి డిమాండ చేశారు. 1999లో తాను ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. ఇది ప్రజాస్వామ్యమే కాదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమిలో ఉంటాయి, ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు వెళ్తాయన్నారు. ఈ అరాచకాలకు పాల్పడిన వారు ఏ బొక్కలో దాక్కున్న భవిష్యత్తులో బయటకు తెచ్చి ఏం చేయాలో అవి చేస్తామని హెచ్చరించారు. మాకు ప్రభుత్వం వస్తుంది.. మేము అధికారంలోకి వస్తాం.. ఇలాంటి వారి కథ చూస్తాం అని ఘాటుగా స్పందించారు. అంత సులభంగా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చేతులకు గాజులు తొడుక్కొని ఇక్కడ ఎవరూ లేరంటూ హెచ్చరించారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి మట్టి అమ్ముతూ ఒక్కొక్క లారీ నుంచి రూ.1200 వసూళ్లు చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా ఎర్రచందనం తరలించి సంపాదిస్తున్నట్లు చెప్పారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు మేము తీసుకెళ్తున్నామని వినోద్‌కుమార్‌రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని ప్రశ్నించారు. తాను టీడీపీలో 25 సంవత్సరాలు పనిచేశానన్నారు. ఎన్నికల ముందు నాకు నచ్చక పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. నా మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా.. కక్ష సాధింపు అంటే దొంగతనాలు చేయడమా అని ఆయన విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అయినా నా ఆస్థికే భద్రత లేదు అంటే సామాన్యుడి ఆస్థికి ఏం భద్రత ఉంటుందో పోలీసు అధికారులు చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డికి సంబంధించిన కంకర, సామగ్రి దోపిడీకి యత్నం మంత్రి అనుచరులను అడ్డుకున్న వైనం మట్టి, ఇసుక, కంకర, ఎర్రచందనం అక్రమ రవాణాలో మంత్రి, అతని అనుచరులు దోచుకుంటున్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలపై మీడియా ముందు మండిపడిన ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి సీఐకి ఫిర్యాదు రాయచోటి ఎస్పీ కార్యాలయం సమీపంలో స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన కంకర ఇతర సామగ్రిని దొంగలించుకు వెళ్తుండటంపై మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి రాయచోటి అర్బన సీఐ బివి చలపతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి రమేష్‌కుమార్‌రెడ్డి నేరుగా అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్వయంగా రాసిన ఫిర్యాదుపత్రాన్ని సీఐకు అందజేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దోపిడీకి పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని సీఐను కోరారు. అలాగే కంకర ఇతర సామగ్రిని తరలిస్తున్న జేసీబీ, టిప్పర్లను పోలీసులకు స్వాధీనం చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపాన పులివెందుల రోడ్డులో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు అరటి కాయలను లారీల లోడు నింపే కూలి పని చేసుకుంటూ పులివెందులలో నివాసముంటున్నాడు. వెంకట్రాముడు తన స్వగ్రామంలో జాతర ఉండటంతో శుక్రవారం కూలి పని తొందరగా ముగించుకొని తన స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా అంకాలమ్మ గూడూరు బలపనూరు గ్రామాల మధ్యలో ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్రాముడు(38) మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. -
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
చిట్వేలి : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడ ప రైల్వేస్టేషన్లో సాకేత్ (3), మల్లి (2) అనే చిన్నారు లు ఉన్నారని తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్, మహిళా పోలీసులు చిన్నారులు తీసుకుని సీడబ్ల్యుసీ ఎదుట హాజరు పరిచామని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే బాలల సంక్షేమ సమితిలో సంప్రదించి తీసుకు వెళ్లాలన్నారు. చౌకదుకాణం సీజ్ బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని శీలంవారిపల్లె గ్రామంలోని చౌకదుకాణాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ ఆధ్వర్యంలో రేషన్ షాపును తనిఖీ చేయగా అందులో 4897 కేజీల బియ్యం, 128 కేజీల చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించి సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేయడంతో పాటు రేషన్ షాపును సీజ్ చేసినట్లు డీటీ తెలిపారు. -
వీఆర్ఓ అవినీతిపై నివేదిక ఇవ్వండి
– సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మదనపల్లె : మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో లంచం వసూళ్లపై సోషల్‌మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్పందించారు. బీకే.పల్లె పంచాయతీలో ఓ భూమి భాగపరిష్కారాల్లో భాగంగా అన్నదమ్ములకు మ్యుటేషన్ చేసేందుకు రూ.5లక్షలు వీఆర్వో వసూలు చేశాడన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ ధనంజయులు, ఆర్ఐ భరత్‌ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై రెవెన్యూ సిబ్బందిని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అలాగే బాధిత రైతులను, పంచాయతీ వీఆర్వోలను క్షేత్రస్థాయిలో విచారించాలన్నారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేర్వేరు ఘటనలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడి స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు రమణ(48) కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. అదే విధంగా మదనపల్లె పట్టణం శేష్‌మహల్ ప్రాంతానికి చెందిన యువకుడు (18) తల్లిదండ్రులు మందలించారని లక్ష్మణరేఖ తిని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వజిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంఽధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. టాక్టర్ను ఢీకొన్న లారీ సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శుక్రవారం టాక్టర్ను లారీ ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీ ముదినేని వడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర టాక్టర్‌లో రాయచోటి వెళుతున్న క్రమంలో నారాణరెడ్డిపల్లె సమీపంలో పిలేరు నుంచి వస్తున్న లారీ ముందు వెళుతున్న టాక్టర్ను ఢీకొంది. ప్రమాదంలో టాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. 108 వాహనంలో అతడిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టమాటా లారీ బోల్తా.. సుండుపల్లి వాసి మృతి రాయచోటి : చిన్నమండ మండలం కేశాపురం చెక్‌పోస్టు వద్ద టమాటా లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి గుర్రంకొండ మండలం తరిగొండ నుంచి టమాటాల లోడుతో నంద్యాలకు వెళుతున్న వాహనం కేశవరం చెక్ పోస్ట్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుండుపల్లి మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణ (53) టమాటా లారీ కిందపడి మృతి చెందాడు. సుండుపల్లి నుంచి వివాహానికి వెళ్తున్న ఆయన చెక్ పోస్ట్ వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్న చిన్నమండెం పోలీసులు తెలిపారు. -
విద్యార్థులతో చెడుగుడు!
బి.కొత్తకోట: వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేస్తే..ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోజుకో మౌఖిక ఆదేశాలతో చదువుతో చెడుగుడు ఆడుకుంటోంది. ఈరోజు ఇచ్చిన ఆదేశాలు మరుసటిరోజు ఉండటం లేదు. స్పష్టమైన, సరైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మార్పును సరి చేస్తామంటూ విద్యాశాఖను గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకోవడమేకాక విద్యావ్యవస్థ ఎటు పోతోందని వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నంబర్ 117 ద్వారా ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేయడం ద్వారా మార్పు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఇది తప్పుడు నిర్ణయమని.. దీనిని సరిచేస్తామంటూ చేస్తున్న హడావిడి, అసంబద్ధ నిర్ణయాలతో విద్యాశాఖను బలహీనపర్చేలా ఉన్నాయని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఆదేశాల అమలు, తల్లిదండ్రుల కమిటీల నుంచి తీర్మాన ఆమోదాలను బలవంతంగా చేయించడం కోసం జిల్లాలో విద్యాశాఖ అధికారులు మునిగిపోయారు. వెనక్కి అంటే ఒక పాఠశాలకేనట జిల్లాలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో 3,4,5 తరగతుల వారిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీప హైస్కూళ్లలో విలీనం చేసింది. ఈ చర్య ఇక్కడికే పరిమితం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో విలీనమైన 3, 4,5 తరగతుల విద్యార్థులు ఏ పాఠశాల నుంచి వచ్చారో వారిని తిరిగి అక్కడికే పంపాలని అధికారులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే పనిలో ఉండగానే మళ్లీ వెనక్కు పంపాల్సిన విద్యార్థులను ఆయా పాఠశాలలకు కాకుండా ఏ స్కూలులో ఎక్కువ మంది ఉంటారో అక్కడికి పంపాలని, మిగిలిన పాఠశాలలను అలాగే ఉంచాలన్న ఆదేశం అందింది. దీంతో పాత విధానం ఎక్కడ అమలు చేసినట్టని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా గత ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతే ఉంటాయి. దీనికి ఒక ఉపాధ్యాయుడే ఉంటాడు. ఇలా చేయడం అంటే విద్యార్థులతో చెలగాటం అడటమే అవుతుంది. అంగన్వాడీలను కలిపేస్తారట: ప్రస్తుతం1,2 తరగతులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలకు ఏకో పాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలల సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను ఇందులో కలిపి అంగన్వాడీకి వచ్చే పిల్లలను పాఠశాలలో పెట్టి చదివిస్తే సంఖ్య పెరగడం, అంగన్వాడీ టీచర్ కూడా అక్కడే పని చేస్తారు కాబట్టి ఇద్దరు టీచర్లు అవుతారన్న అభిప్రాయం కల్పిస్తోంది ప్రభు త్వం. దీనివల్ల అంగన్వాడీలకు వచ్చే పసిపిల్లల ఇబ్బందులు అన్నిఇన్నీకావు. 30 మందిని చేర్పిస్తే ఐదో క్లాస్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,2 తరగతుల పాఠశాలలకు ఐదోతరగతి వరకు కొనసాగాలంటే ఒక్కో పాఠశాలకు ఈనెల 15లోగా 30 మంది విద్యార్థులను చేర్పించాలని విద్యాశాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది. హైస్కూళ్ల నుంచి తిరిగి వచ్చే 3,4,5 తరగతుల విద్యార్థులు ఒక పాఠశాలకే పంపిస్తారు కాబట్టి మిగిలిన 1,2 తరగతుల పాఠశాలకు పై తరగతుల నిర్వహణ ఉండదు. దీంతో ఇలాంటి పాఠశాలకు 30 మంది విద్యార్థులను చేర్పించే మెలికను పెట్టారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ విధానం తొలగించే అవకాశమూ ఉందని అంటున్నారు. ఇలాంటి నిబంధన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యతో చెలగాటం అడటమేనని వాపోతున్నారు. యూపీ స్కూల్‌ను పరిశీలిస్తే.. యూపీ స్కూళ్లలో 6,7,8 విద్యార్థుల సంఖ్య 30 లేదా ఆపై సంఖ్య ఉంటే ఆ స్కూలు అక్కడే ఉంటుంది. ఉదాహరణకు కురబలకోట మండలం ముదివేడు ఉర్దూ యూపీ స్కూలులో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 30 లోపలే ఉంది. ఈ నిబంధన అమలు చేస్తే ఇక్కడ పై తరగతుల నిర్వ హణ నిలిపివేస్తారు. ఈ విద్యార్థులంతా 15 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నియోజకవర్గానికి చెందిన మండల కేంద్రం గుర్రంకొండ లేదా 20 కిలోమీటర్ల దూరంలో మదనపల్లె యూపీ స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా విద్యా ర్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరుగుతారు. జిల్లాలో విద్యార్థులు, పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు: 1,711 విద్యార్థులు : 43,192ప్రాథమికొన్నత పాఠశాలలు: 162విద్యార్థులు: 11,202ఉన్నతపాఠశాలలు: 304విద్యార్థులు: 79,232మొత్తం పాఠశాలలు: 2,177విద్యార్థులు: 1,33,626 (కొత్త విధానాలతో ఈ పాఠశాలల సంఖ్య తారుమారు కాబోతోంది) ఒక స్కూలు ఖాళీ కొత్తగా ప్రతిపాదిస్తున్న విధానంపై ఒక సారి పరిశీలిస్తే..ఉదాహరణకు బి.కొత్తకోట మండలంలోని గట్టు జెడ్పీ హైస్కూలులో సమీపంలోని గుట్టపాళ్యం, గట్టు తెలుగు ప్రాథమి పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులను కలిపారు. ఇప్పుడు వీరిని ఈ రెండు పాఠశాలలకు తిరిగి పంపాలి. అయితే ఒక పాఠశాలకు మాత్రమే అందరినీ పంపుతారు. ఒక పాఠశాల ఖాళీగా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి స్కూలుకు వచ్చే విద్యార్థులను ఇబ్బంది తెచ్చిపెట్టడమే కాక కొత్త సమస్యను తీసుకొస్తుంది. 30కి తగ్గితే యూపీ స్కూళ్లు గోవిందా ఇప్పుడు జిల్లాలో యూపీ స్కూళ్ల మనుగడకు గండం పొంచి ఉంది. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న యూపీ స్కూళ్లలో 6, 7, 8 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 30కి మించాలి. ఇందులో ఒకరు తగ్గినా ఆ తరగతులను యూపీ స్కూళ్ల నుంచి తొలగించి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీనికోసం గురువారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు సంబంధిత హెచ్ఎంలు, తల్లిదండ్రుల కమిటీలు ఆమోదించిన తీర్మానం కోసం తంటాలు పడ్డారు. ఈ తీర్మానం ఆమోదమోగ్యం కాదని యూపీ స్కూళ్లు హెచ్ఎంలు, కమిటీలు వ్యతిరేకించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలు తీర్మానం ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు పట్టుబట్టి ఆమోదాలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎన్ని యూపీ స్కూళ్లు మూతపడతాయో లెక్క తేలనుంది. 3,4,5 తరగతులు మళ్లీ యథా స్కూళ్లకు పంపాలని సూచన ఇప్పుడు వీళ్లను ఒక పాఠశాలకే పంపాలని ఆదేశం రోజుకో ఆదేశాలతో విద్యాశాఖ అధికారుల్లో అలజడి, గందరగోళం -
సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం
● టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం సీతారామ కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశం హాల్లో చైర్మన్, ఈఓ జె. శ్యామలరావు, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేఈఓ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జేసీ అదితిసింగ్, ఎస్పీ ఈజీ అశోక్ కమార్, సీవీఎస్ఓ హర్షవర్దన్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సీతారాముల కల్యాణం సందర్బంగా శుక్రవారం సాయంత్రం రారష్ట్‌ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక వద్ద ఉన్న 147 గ్యాలరీల్లో 60 వేల మంది కూర్చొని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తలంబ్రాల పంపిణీకోసం తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.ఎస్వీబీసీ చానల్లో స్వామివారి కల్యాణం నేరుగా ఎల్ఈడీ స్క్రీన్ మీద ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు సిద్దవటం: మండలంలోని కనుమలోపల్లె,భాకరాపేట, శివునిపల్లె, బొగ్గిడివారిపల్లె, చాముండేశ్వరీపేట, మాధవరం–1 ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఒంటిమిట్టలో ఈ నెల 11న జరిగే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జేఎంజే కళాశాల నుంచి ఒంటిమిట్ట వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తకుప్పలు, కల్వర్టులు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశామని బాంబుస్క్వాడ్ పోలీసులు తెలిపారు. -
బ్రహ్మోత్సవం.. నయనమనోహరం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వ హించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి గరుడ సేవ ఘనంగా జరిగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కళాకరుల కోలాటాలు, చెక్కభజనల మధ్య కోదండ రాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమం టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. గురువారం సీతారాముల కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో దాశరథి దివ్యక్షేత్రాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శుక్రవారం ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు శివధనుర్భంగాలంకారం, 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం. సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 6:30 నుంచి 8:30 వరకు కల్యాణోత్సవం, 9:30 నుంచి 10:30 వరకు గజవాహనం, 11 నుంచి 11:15 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు వైభవంగా గరుడవాహసేవ -
రాయితీ పథకాలతో ఆర్థికాభివృద్ధి
కలెక్టర్ చామకూరి శ్రీధర్ బి.కొత్తకోట: భవిష్యత్ సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం ఆయన బి.కొత్తకోట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉద్యాన పంటల సాగు స్థితిగతులపై తెలుసుకునేందుకు స్వయంగా గులాబీ, టమాట సాగు చేస్తున్న పోలాల్లోకి వెళ్లారు. కూలీలతో ముచ్చటించారు. మొదట బీరంగి గ్రామం కర్ణాటక సరిహద్దులో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద రూ.40 లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న గులాబీతోటను పరిశీలించారు. తోటలో మొక్కలను పరిశీలించి మొగ్గలకు తొడిగిన కవర్లను పరిశీలించారు. తోటనిర్వహణ చూస్తున్న వారితో మాట్లాడారు. గులాబీ పంట దిగుబడితో సంబంధం లేకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పూలను ఎగుమతి చేస్తామని, ధరలు ఆశాజనకంగా ఉంటే ఏడాది పొడవునా పూలను మార్కెటింగ్ చేస్తున్నట్టు కలెక్టర్‌కు వివరించారు. దిగుబడికి సంబంధించి ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించడంతో పూల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని, దీనికితోడు మార్కెట్ లేకపోవడంతో మొగ్గులను తుంచేస్తున్నామని వివరించారు. ఎగుమతి చేస్తున్న గులాబీకి మంచి మార్కెటింగ్‌తో ఆదాయం లభిస్తుందని చెప్పగా కలెక్టర్ ఇక్కడ పని చేస్తున్న బిహారీ కూలీల జీవనంపై ఆరా తీశారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ వద్ద మల్చింగ్‌తో సాగవుతున్న టమాట, మిరప పంటలను కలెక్టర్ పరిశీలించారు. ● జిల్లాలో ఉద్యాన పంటల పెంపకం విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ మోహమ్మద్ అజారుద్దీన్, ఎంపీడీఓ దిలీప్‌కుమార్, ఆర్ఐ వీరాంజనేయులు, వీఆర్ఓల ఉన్నారు. ● ప్రజల నుంచి పీజీఆర్ఎస్కు అందే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ చ శ్రీధర్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అప్పటికప్పుడు వ్యవసాయ, హౌసింగ్, హార్టికల్చర్, సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. -
●గోటితో ఒలిచిన తలంబ్రాలు అందజేత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించారు.సూపరిటెండెంట్ హనుమంతయ్య అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో వీటిని అందించారు. తలంబ్రాల కోసం మూడునెలలపాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు భక్తిభావంతో మూడు నెలలపాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మదనపల్లె రెవెన్యూలో లంచాల జోరు
మదనపల్లె : మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచాల జోరు కొనసాగుతోంది. భూమి ఆన్లైన్ చేయించడం, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం, మ్యుటేషన్ తదితర సేవలకు సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా బుధవారం మండలంలోని బీకే.పల్లె పంచాయతీలో ఓ సర్వే నెంబర్లో మ్యుటేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో ఆ పంచాయతీకి సంబంధం లేని వీఆర్ఓ రూ.5లక్షలు తీసుకుని, అధికారికి మాత్రం కేవలం 20 వేలు ఇచ్చాడని, తహసీల్దార్ కార్యాలయంలో సదరు వీఆర్ఓ అవినీతి, అక్రమాలకు అడ్డే లేదంటూ పట్టణానికి చెందిన వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ వైరల్ అయింది. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమై జరిగిన పొరపాటును దిద్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. గురువారం మెసేజ్ వైరల్ విషయమై తహసీల్దార్ కార్యాలయానికి వెళితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీకే.పల్లె పంచాయతీకి మస్తాన్, ప్రసాద్‌లు వీఆర్ఓలుగా ఉన్నారు. వీరి పంచాయతీలోని సర్వే నెంబర్.448లోని 5.02 ఎకరాల భూమిని భాగ పరిష్కారాల్లో భాగంగా సానక వెంకటరమణారెడ్డి, సానక నాగరాజారెడ్డి, సానక సుధాకర్‌రెడ్డిల పేరుపై మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి వారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సమయంలో...వేరే పంచాయతీకి చెందిన వీఆర్ఓ వారితో మాటలు కలిపాడు. తహసీల్దార్ కొత్తగా వచ్చారని, ఇప్పుడిప్పుడే మ్యుటేషన్లు చేయడం లేదని, మీకు అత్యవసరమైతే తాను ఎలాగోలా నచ్చజెప్పి చేయిస్తానని ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. 15 రోజులకు ముందు ఒకరిపేరుమీద, బుధవారం రోజు మరొకరి పేరు మీద మ్యుటేషన్ జరిగింది. అయితే బీకే.పల్లె పంచాయతీకి చెందిన వీఆర్ఓలు తమ పరిధిలో మ్యుటేషన్‌కు తమతో సంబంధం లేకుండానే వేరే పంచాయతీకి చెందిన వీఆర్‌ఓతో చేయించుకోవడంపై రైతులను ప్రశ్నించారు. దీంతో వారు అసలు విషయం బయటపెట్టడంతో లంచం విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి గ్రూపుల వరకు చేరింది. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని ఎవరిని కదిలించినా, ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వీఆర్ఓ గతంలో పనిచేసిన తహసీల్దార్లను ఇలాగే వాడుకున్నాడని, ఓ తహసీల్దార్ అతడిని వద్దని సరెండర్ చేస్తే, మంత్రి వద్దకు వెళ్లి పలుకుబడి ఉపయోగించి మరీ పోస్టింగ్ తెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా మదనపల్లె మండలంలోనే పనిచేస్తూ, కోట్లకు పడగలెత్తాడని రెవెన్యూ సిబ్బంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మ్యుటేషన్‌కు రూ.5లక్షలు తీసుకున్న వీఆర్ఓ అధికారికి కేవలం రూ.20 వేలు అప్పగింత వాట్సప్ గ్రూపుల్లో హల్చల్, దిద్దుబాటలో అధికారులు -
ఇసుకను కొల్లగొట్టారు.. చెట్లను కూల్చేశారు
గుర్రంకొండ : ఇసుకాసురులు ఎంతకై నా తెగిస్తున్నారు. చెరువుల్లో ఇసుక కోసం అడ్డుగా ఉన్న చెట్లను జేసీబీలతో పెకలించేశారు. రూ. లక్ష విలువచేసే చెట్లను చెరువులో నుంచి మాయం చేసిన సంఘటన మండలంలోని తరిగొండ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో రామానాయిని చెరువు విస్తరించి ఉంది. మండలంలోని ఇది అతిపెద్ద ఇరిగేషన్ చెరువు. ఈ చెరువు నిండి మొరవ పోతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా చెరువు వద్ద నిర్వహిస్తారు. అంతటి ప్రాశస్త్యమున్న చెరువు ఇసుకాసురుల అక్రమ సంపాదనకు ఆవాసంగా మారింది. ఓవైపు వందలాది లోడ్ల ఇసుకను ఇప్పటికే అక్రమంగా తరలించకు పోగా చెరువులో ఉన్న చెట్ల పై కూడా ఇసుకాసురుల కన్ను పడింది. చెరువుల సువిశాలమైన ప్రాంతంలో పురాతన నల్లతుమ్మ, నీలగిరి చెట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటి మధ్యలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇసుకాసురులు ఇసుక తోడేందుకు అడ్డుగా ఉన్న నల్లతుమ్మ, నీలగిరి చెట్లను జేసీబీలతో పెకలించి వేశారు. చెరువులోనే మరికొన్నిచోట్ల ఇసుకను తరలించడానికి కొత్త దారుల ఏర్పాటు కోసం చెట్లను జేసీబీలతో పెకలించి పక్కన పడేశారు. కొంతమంది ఇసుకాసురులు వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బట్టీల యాజమానులకు సుమారు లక్ష విలువ చేసే నల్లతుమ్మ, నీలగిరి చెట్లను ఇప్పటికే ఇసుకాసురులు విక్రయించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మరికొన్ని చెట్లను వేళ్లతో సహా పెకలించి చెరువుల్లో అలాగే వదిలిపెట్టేశారు. చెరువుల్లో ఎక్కడ చూసినా నేలకొరిగిన చెట్లే దర్శనమిస్తుండడం గమనార్హం. ఓవైపు ఇసుక మరోవైపు చెట్లను అక్రమంగా విక్రయిస్తూ ఇసుకాసురులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా చెరువులను కాపాడుకునేందుకు ఇప్పటికే వీఆర్ఓ, వీఆర్ఏలను అక్కడ కాపలాగా ఉంచామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక కోసం జేసీబీలతో చెట్లను తొలగించిన వైనం రూ.లక్ష విలువ చేసే చెట్లు మాయం -
గ్యాంగ్‌ల భరతం పడతాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో గ్యాంగుల పేరుతో రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారి భరతం పడతామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శివాలయం వద్ద జరిగిన గ్యాంగ్ వార్ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలు, అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్ట పరిధి దాటిన వారిని ముందుగా హెచ్చరించడంతోపాటు వారికి అన్ని కోణాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ దారికి రాకపోతే వారిపై రౌడీషీట్ కేసులు ఓపెన్ చేసి అవసరమైతే జిల్లా బహిష్కరణ చేయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో జూద శాలలపై ఉక్కుపాదం మోపామన్నారు. కుల మతాలు, వర్గాల ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వారిపట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రధాన పట్టణాలలో నిరుద్యోగ యువకులు, మైనర్ విద్యార్థులు కొంతమంది మాయమాటలలో పడి మత్తుకు బానిసలై తప్పుదారిలో పయనిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కూడా తగు చర్యలు తీసుకోవడంతోపాటు గ్యాంగుల నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ మాసం సందర్భంగా జరిగిన సంఘటనపై కూడా ఇంకా విచారణ సాగుతోందన్నారు. అన్ని వీడియో పుటేజీలను పరిశీలించిన అనంతరం దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణం పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన పోలీసులను కూడా సిద్ధం చేశామన్నారు. పట్టణాల పరిధిలో రాత్రి సమయాలలో అదనపు బలగాలతో పోలీసులు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమన్నారు. మైనర్లతోపాటు బైక్‌లు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా పోలీస్ దండనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ తీవ్రంగా హెచ్చరించారు. తొమ్మిది మంది ముద్దాయిలు అరెస్టు.. అమ్మాయి విషయంపై ఒకరిపై మరొకరు మనస్పర్థలు పెంచుకొని దాడులు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ఈ కారణంగానే కక్షలు పెంచుకొని శివాలయం చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘర్షణ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గ్యాంగ్ వార్ దాడిలో ఇరువర్గాలకు చెందిన 24 మందిని గుర్తించి రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సయ్యద్ నూరుల్లా ఉరఫ్ నూర్ (21), సయ్యద్ బైతుల్లా (23), షేక్ ఖదీర్ అహ్మద్ ఉరఫ్ ఖాదర్ (24), షేక్ సుహైల్ ఉరఫ్ గుర్రం (21), షేక్ మన్సూర్ అలీ (22), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ షారుక్ (21), పఠాన్ రియాజ్ అలీఖాన్ ఉరఫ్ నాజుల్లా (22)లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పెడుతున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న 15 మందికోసం వేట సాగుతుందన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు దాడులకు ఉపయోగించిన ఐదు కట్టెలు, మూడు ఇనుప రాడ్లు, ఒక ఇనుప చైన్, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి పాల్గొన్నారు. అసాంఘిక కార్యక్రమాలు.. అరాచకాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం గ్యాంగ్‌వార్ ఘటనలో తొమ్మిది మంది అరెస్టు మిగిలిన వారికోసం వేట మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర స్థాయి జూనియర్స్ హాకీ పోటీలలో రాజు హాకీ అకాడమీ మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా హాకీ సెక్రటరీ ఇ.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ధర్మవరంలో జరిగాయన్నారు. పోటీలలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అన్నమయ్య జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా హాకీ జట్టును హాకీ ఫౌండర్ సి.చంద్రశేఖర్, కోచ్‌లు సుబ్బు, నారాయణ, రాజి, రాజు విద్యాసంస్థల అధ్యాపకులు అభినందించారు. అన్నమాచార్య యూనివర్సిటీలో టెక్‌ఫెస్ట్ విజయవంతం రాజంపేట : రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించిన రెండురోజుల సాంకేతిక సాంస్కృతిక మహోత్సవం (టెక్‌ఫెస్ట్–2025) గురువారం విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిథిగా జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కాలేజ్, పులివెందుల ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు సమకాలిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవచ్చన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఈ.సాయిబాబా రెడ్డి మాట్లాడారు. ముగింపు సందర్భంగా పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రోఛాన్సలర్ చొప్పా అభిషేక్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.మల్లికార్జున రావు, కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవి నారాయణ, బి.జయరామిరెడ్డి, డీన్ డాక్టర్ ఎం.సుబ్బారావు, పరిపాలన అధికారి ఎన్.సుబ్బారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కారులో మంటలు.. వ్యక్తికి తీవ్ర గాయాలు వీరబల్లి : మండలంలోని షికారుపాలెం వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో కారు దగ్ధం కావడంతో అందులోని వ్యక్తికి గాయాలయ్యాయి. రాయచోటి పట్టణంలోని బీరంసాబ్ వీధికి చెందిన మన్నూరు అలీ (53) రాజంపేట నుంచి రాయచోటికి కారులో వస్తుండగా షికారుపాలెం వద్ద ఉన్న మలుపువద్ద అదుపు తప్పడంతో కారు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వరప్రసాద్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మన్నూరు అలినీ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించినట్లు సమాచారం. -
గిట్టుబాటు ధర కరువై.. అప్పులు భారమై.!
ఓబులవారిపల్లె : తొలి నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గం ఉద్యాన పంటలకు ప్రసిద్థి. అయితే తక్కువ వ్యవధిలో ఆదాయం వస్తుండడంతో దశాబ్ద కాలంగా కర్బూజ, దోస పంటలను రైతులు సాగు చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి అప్పుచేసి పంట సాగు చేస్తే చేతికి అందే సమయంలో దళారుల సిండికేట్‌తో అమ్ముడుపోక తోటలోనే కాయలు వదిలేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కలత చెంది ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని వై.కోట గ్రామానికి చెందిన రామ జనార్దన్ (49) అనే రైతు సాగు చేస్తున్న దోస, కర్బూజ పంటలో తీవ్రంగా నష్టం రావడంతో కలత చెంది గుండెపోటుతో ఈనెల 4వ తేదీ మృతి చెందాడు. వ్యవసాయమే ఆధారంగా అప్పులు చేసి తనకున్న పది ఎకరాలలో అంతర పంటగా దోస, కర్బూజను సాగు చేశాడు. దళారులు సిండికేట్‌గా మారి టన్ను రూ. 4 వేలు నుంచి రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతు ఆందోళన చెందాడు. దళారులు రాకపోవడంతో తోటలోనే కాయలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రూ. 10 లక్షలలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో రోదించాడు. కాయలు తోటలోనే కుళ్లిపోగా మనస్తాపం చెంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. చివరకు రైతు కాయలు వదిలేసిన తోటలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబం.. రామ జనార్దన్ మృతి చెందడంతో పెద్దదిక్కు లేక వారి కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. జనార్దన్‌కు భార్య సులోచన, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయికి వివాహం కాగా, పెద్దబ్బాయి వెంకటేష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మృతి చెందడంతో వెంకటేష్ చదువు చాలించి తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు.. లక్షలు అప్పుచేసి సాగు చేసిన పంట చేతికి రాకపోవడంతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక వందల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం నష్టపోతున్న దోస, కర్బూజ రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు . దళారుల సిండికేట్‌తో దగాపడుతున్న రైతులు వందలాది ఎకరాల్లో దోస, కర్బూజ పంటను వదిలేస్తున్న వైనం గుండెపోటుతో దోస రైతు మృతి పట్టించుకోని ప్రభుత్వం -
ముదివేడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
రాయచోటి టౌన్ : ముదివేడు రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ కోసం రైతుల భూములు లాక్కొని వారికి పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పరిహారం ఇవ్వకపోతే భూములను వెనక్కి ఇవ్వాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాసులు, రాజేష్, వెంకటరెడ్డి, మారపరెడ్డి, తిమ్మారెడ్డి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. -
వరిపంటపై అడవి పందుల దాడి
సుండుపల్లె : మండల పరిధిలోని సుండుపల్లె గ్రా మ పంచాయతీ గుట్టకాడ బలిజపల్లెకు చెందిన నంద్యాల సిద్దయ్య వేరుశనగ పంట పొలంపై బుధవారం రాత్రి సమయంలో అడవి పందులు దాడి చేశాయి. ఈ సందర్భంగా రైతు సిద్దయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 105లో దాదాపు రెండు ఎకరాల వరిమడిని సాగు చేశానని తెలిపాడు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా అడవి పందులు దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. జిల్లాలోని 268 ఆలయాలకు అర్చకుల నియామకం రామాపురం : అన్నమయ్య జిల్లాలోని 268 దేవాలయాలకు అర్చకులను నియమించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. గురువారం మండల పరిధి బండపల్లె , సూర్యనారాయణపురంలో శ్రీ మల్లాలమ్మ తల్లి ఆలయం గువ్వలచెరువు, ఓబుల్‌రెడ్డిగారిపల్లె, యర్రమరెడ్డిగారిపల్లె, రాచపల్లె, వడ్డెపల్లె, పర్వతరెడ్డిగారిపల్లె, నల్లగుట్టపల్లె, పాతపల్లి, కర్ణపువాండ్లపల్లె గ్రామాలలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్చకులు దేవాలయంలో సక్రమంగా పూజలు చేయకుండా ఉంటే అలాంటి వారిపైన ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్నారు. చేబ్రోలు కిరణ్‌పై ఫిర్యాదు సుండుపల్లె : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై వైఎస్సార్సీపీ రాజంపేట నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్దుల్లా, మండల సోషల్ మీడియా విభాగం నాయకుడు సయ్యద్ సల్మాన్‌లు సుండుపల్లె ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. అతని వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
నలుగురు జూదరులపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని మద్దయ్యగారిపల్లి సమీపంలో జూదం జోరు అధికంగా సాగుతోందని పలువురు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ హరిహర ప్రసాద్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పట్టుబడిన నలుగురు జూదరులపై కేసు నమోదు చేసి వారి వద్ద లభించిన రూ.2,910ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయంపై కేసు నమోదుపెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం పంచాయతీ క్రిష్ణాపురంలో ఓ మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తోందని సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ ఇంట్లో ఉన్న 14 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. బైకు ఢీకొని మహిళకు గాయాలు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోదండ రామాలయం వెనుక వైపు పారిశుధ్యం పని చేస్తున్న కత్తి చిన్నక్క(55) అనే మహిళను బైకు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని 108 సాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లా రైల్వేలకు అన్యాయం రాజంపేట : రైల్వేశాఖ వైఎస్సార్, అన్నమయ్య జిల్లా రైల్వేలకు అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం డీఆర్‌యూసీసీ మీట్లో పాల్గొని మాట్లాడారు. కోవిడ్–19 ముందు ఉన్న వివిధ రైళ్లకు ఉన్న హాల్టింగ్స్‌ను ఇంతవరకు పునరుద్ధరించలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న స్టేషన్లలో కూడా రైళ్లు ఆగుతున్నాయన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లకు కనీసం తాత్కాలిక హాల్టింగ్స్ ఇవ్వమని, ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేబోర్డు, రైల్వేమంత్రిత్వ శాఖను కోరారన్నారు. నందలూరులో రైళ్లకు వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే, రైళ్లలో నీటి సమస్య తీరుతుందన్నారు. ఈ సమావేశంలో మరో సభ్యుడు తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.డీఆర్‌యూసీసీ మీట్లో తల్లెం భరత్‌రెడ్డి -
జిల్లాలో మార్చికి నీటిమట్టం వివరాలు
మండలం మీటర్లు గుర్రంకొండ 27.03 ఓబులవారిపల్లె 26.01 వీరబల్లి 25.16 చిట్వేలి 24.57 రామాపురం 22.91 రాజంపేట 21.70 పీలేరు 20.39 నిమ్మనపల్లె 20.02 మొలకలచెరువు 19.26 కేవిపల్లె 18.25 మదనపల్లె 18.20 కోడూరు 17.61 టి.సుండుపల్లె 17.40 తంబళ్లపల్లె 15.97 చిన్నమండెం 15.85 రాయచోటి 15.63 వాయల్పాడు 15.24 పుల్లంపేట 14.86 కలకడ 9.65 పెనగలూరు 9.38 పీటీసముద్రం 7.05 బి.కొత్తకోట : గత ఖరీఫ్‌లో 19 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని రైతాంగాన్ని తీవ్ర కష్టనష్టాలకు గురిచేసిన వర్షాభావ పరిస్థితులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీని ప్రభావం జిల్లాలో తాగునీటిపై చూపుతోంది. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భజలాల నీటి మట్టం లోతుకు పడిపోతోంది. అత్యంత ప్రమాదకర స్థితిలో గుర్రంకొండ మండలం ఉండగా మరో 23 మండలాల్లో నీటి మట్టాలు అధికంగా పడిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈనెలఖారులోగా నీటి మట్టాలు ఇంకా ఎన్ని మీటర్లలోతుకు పడిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు తాగునీటి కష్టాలు ఏడు మండలాల్లో నెలకొనగా.. ఇప్పుడా అప్పుడా అన్నట్టు మరో 260 పల్లెల్లో నీటి కష్టాలు కాచుకుని ఉన్నాయి. దీనితో వేసవి ప్రణాళిక అమలు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపింది. ఇదీ భూగర్భ జల మట్టం జిల్లాలో 30 మండలాలు ఉండగా అందులో ఆరు మండలాల్లో 20 మీటర్ల నుంచి 27 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. రెండు మండలాలు 20 మీటర్లలోతులో, 10 మండలాల్లో 14 నుంచి 20 మీటర్లలోపు లోతుకు తగ్గిపోయింది. మరో మూడు మండలాల్లో సాధారణ స్థితిలో ఉంది. మిగిలిన తొమ్మిది మండలాల్లో భూగర్భ జలమట్టం పరిస్థితి తారుమారైంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో లెక్కించిన భూగర్భ జలమట్టం లెక్కింపులో పడిపోయిన నీటిమట్టం మార్చిలో అమాంతం పైకి ఎగబాకడం విశేషంగా చెప్పుకోవాలి. సేద్యానికి కష్టం జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోవడం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. వ్యవసాయబోర్లపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఆ ప్రాంతంలో సాగయ్యే పంటల రకాలపై ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇటివల పంటలకు వినియోగిస్తున్న సాగునీటి బోర్లనుంచి నీరు అడుగండిపోతుండటంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పంటలను ఎండబెట్టుకోలేక కొత్తగా బోర్లు వేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. వెయ్యి అడుగులలోతులోనూ నీటి జాడలు కనిపించడం లేదు. ఇప్పుడు 79, ఇంకో 260 పల్లెలు జిల్లాలో వేసవి ఒకవైపు, పడిపోతున్న భూగర్బ జలాలతో ప్రజలు తాగునీటికి కటకటలాడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలోని చిన్నమండెం మండలంలో ఒకటి, రాయచోటిలో 20, సంబేపల్లెలో 5, లక్కిరెడ్డిపల్లెలో 28, రామాపురంలో 10, గాలివీడులో 13, ములకలచెరువు మండలంలో రెండు పల్లెలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రతిరోజూ ట్యాంకర్లతో 165 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికి ఈ పరిస్థితికాగా వచ్చే రోజుల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మరో 260 పల్లెల్లో నీటి సమస్య తలెత్తే ప్రమాదాన్ని నిర్దారించి దీనిపై వేసవి ప్రణాళిక ద్వారా తాగునీటిని ప్రజలకు అందించడం కోసం రూ.7.95 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వివిధ మార్గాల్లో నీటిని అందించడం కోసం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ నిధులు అవసరమని నివేదించారు. తగ్గి, పెరిగిన నీటిమట్టం (మీటర్లు) మండలం ఫిబ్రవరి మార్చి పెద్దమండ్యం 23.96 11.12 కురబలకోట 11.41 10.78 ఎల్‌ఆర్‌పల్లె 31,40 10.27 బి.కొత్తకోట 11.51 8.41 రామసముద్రం 8.85 6.70 గాలివీడు 12.80 6.66 సంబేపల్లె 11.39 6.45 కలికిరి 7.30 6.38 నందలూర్ 8.67 5.73 జిల్లాలో 21 మండలాల్లో పడిపోయిన భూగర్భ జలమట్టం గుర్రంకొండలో అత్యధికంగా 27 మీటర్లకు.. మరో 260 పల్లెల్లో తరుముతున్న నీటి సమస్య తాగునీటి కోసం రూ.7.95 కోట్లతో వేసవి ప్రణాళిక ఇదీ వేసవి ప్రణాళిక ప్రతిపాదన : రూ.7.95 కోట్లు టైఅప్‌కు : రూ.21.90 లక్షలు ట్యాంకర్లతో సరఫరా : రూ.7.69 కోట్లు బోర్లలోతు, రిపేర్లు : రూ.4.07 లక్షలు 8 మీటర్లలే లెక్క జిల్లాలో భూగర్భజల మట్టాలు పడిపోతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు భూగర్బ జలమట్టం 8 మీటర్లు దాటితే ప్రమాదకర సంకేతమని చెప్పింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 8 మీటర్లు, దానికంటే పైన నీటిమట్టం ఉంటే ఆ మండలాల్లో ఎలాంటి నీటి సమస్యలు తలెత్తవు. ఈ ప్రామాణికంగా చూస్తే జిల్లాలో అత్యధిక మండలాల్లో భూగర్భజలమట్టం పడిపోతోంది. జనవరి, ఫిబ్రవరిలో భారీగా పడిపోవడం, మళ్లీ పెరగడం జరిగినా మార్చిలో మాత్రం భారీగా తగ్గింది. – హమీదాబాను, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు -
అంజనీసుతపై కౌసల్యతనయ
● హనుమంతవాహనంపై రామయ్య విహారం ● తిలకించి..పులకించిన భక్తజనం ఒంటిమిట్ట : ఏకశిలానగరిలో వెలసిన కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రామయ్య నవనీతకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నేటి కార్యక్రమాలు: బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు. కల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన శ్రీ సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ● శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి సీఎం చంద్రబాబునాయుడు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే మార్గాలను, ఉండే ప్రాంతాలను వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. -
ఒంటిమిట్ట రామయ్యకు పదార్థాల సమర్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా బీఎంఆర్‌జీఎఫ్ తరపున ఒంటిమిట్ట రామయ్యకు రైతులు పండించిన పదార్థాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా బుధవారం బీఎంఆర్‌జీఎఫ్ చైర్మన్ సుమతి రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పండించిన తినుబాండారాలను అధిక సంఖ్యలో ఒంటిమిట్ట రామయ్యకు సమర్పించారు. ఇవి సమర్పించే సమయంలో రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా దర్శనానికి రావడంతో ఆయనతో కలిసి స్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేటకు చెందిన ప్రతాప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కడపకు చెందిన శివశంకర్‌రెడ్డి, రాచపల్లికి చెందిన మాజీ వీఎం సుబ్బారెడ్డి, మాధవరం, కడప కు చెందిన హ్యాపి కిడ్స్ పాఠశాల యాజమానులు అనిల్‌రెడ్డి, కడప, రాజంపేట లోని హరితా హోటల్ కు సంబంధించిన మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం
– ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రైల్వేకోడూరు అర్బన్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాఘవరాజపురంలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన శశికుమార్‌రెడ్డి (45) రెండురోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొన్న ఎంపీ మృతుడి నివాసానికి వెళ్లి తల్లి సునీతమ్మ, అన్న శ్రీకాంత్‌రెడ్డి, కుమారుడు యశ్వంత్రెడ్డిలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే రంగనాయకులపేట బూత్‌కన్వీనర్ గుత్తిసురేష్ గుండెపోటుతో మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి మృతుడి కుమారుడు పవన్‌కుమార్‌ను పరామర్శించారు.ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, మందలనాగేంద్ర, ముద్దా రామసుబ్బారెడ్డి, రత్తయ్య, రమేష్, నాగరాజ, అమర్; మందలశివయ్య, నందాబాల, మహేష్, చైతన్య, పురుషోత్తం, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ములకలచెరువు : ములకలచెరువు సర్కిల్ కార్యాలయాన్ని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... సర్కిల్ పరిధిలోని మండలాల్లో నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదు దారులతో గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. వారంలో ఒక్క రోజూ మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో మారకద్రవ్యాలు, బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శక్తియాప్‌ను డౌన్లోడ్ చేసుకొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు, సిబ్బంది ఉన్నారు. -
అడవిలో దారితప్పిన ఎకై ్సజ్ సీఐ, ఎస్ఐ సురక్షితం
ఓబులవారిపల్లె : మండలంలోని వై.కోట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ తులసి ఎస్ఐ వరుణ్ కుమార్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున అడవిలోకి వెళ్లారు. అడవిలో కాలినడకన కొద్దిదూరం వెళ్లగా దట్టమైన ప్రాంతం రావడంతో దారి తెలియక వారు తప్పిపోయారు. విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లి ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో కలిసి వై.కోట శేషాచలం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. సీఐ తులసి లొకేషన్ పంపించడంతో దాని ఆధారంగా వారిని గుర్తించి క్షేమంగా అడవి నుంచి బయటకు తీసుకువచ్చారు. వీరు తప్పిపోయిన ప్రాంతం ఇటీవల ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన ప్రదేశం ఒక్కటే కావడం గమనార్హం. సీఐ, ఎస్ఐ తప్పిపోయిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
అవినీతి జూనియర్ లైన్మెన్పై విచారణ
గాలివీడు : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ లైన్మెన్ రామేశ్వర్‌రెడ్డి అక్రమ వసూళ్లపై విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. ఏప్రిల్ 4 వ తేదీ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘విద్యుత్ శాఖలో మాయగాడు‘ అనే కథనంపై స్పందించిన జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా బుధవారం గాలివీడు మండలంలో ట్రాన్స్‌కో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో తన సిబ్బందితో కలిసి గాలివీడు పట్టణంలోని చిలకలూరిపేట, ఎగువగొట్టివీడు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం బాధితుల వద్ద నుంచి జూనియర్ లైన్మెన్ ఎంత డబ్బులు వసూలు చేశారన్న విషయంపై రాతపూర్వకంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్లు తెలిపారు. అయితే అధికారులు ఆకస్మికంగా విచారణకు రావడంతో కొందరు కూలి పనులకు వెళ్లడంతో అందుబాటులో ఉన్న వారు మాత్రమే తమ గోడును విన్నవించుకున్నారు. ఇదే విషయమై అధికారుల దృష్టికి తీసుకురాగా ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమ కార్యాలయంలో గానీ ఫోన్ ద్వారా గానీ సంప్రదించవచ్చని ట్రాన్స్‌కో ఎస్ఐ సూచించారు. -
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పటిష్ట భద్రత
కడప అర్బన్/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ తెలిపారు. రెండు వేల మందికి పైగా పోలీసులను నియమించామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారని తెలిపారు. బుధవారం కడప నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్.పి బందోబస్తు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఏ.ఆర్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అలాగే ఒంటిమిట్ట ఆలయం వద్ద కూడా పోలీసులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఏ.ఆర్. డీఎస్పీ కె.శ్రీనివాస రావు, ఎస్.బి. ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.ఐ లు ఆనంద్, వీరేష్, శివరాముడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు కల్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు కడప కోటిరెడ్డిసర్కిల్ : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి శుక్రవారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35 బస్సులు, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, మైదుకూరు 7, ప్రొద్దుటూరు 17, రాయచోటి, రాజంపేట, ఇతర డిపోల నుంచి 40 బస్సులు చొప్పున మొత్తం 145 బస్సులు నడుస్తాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి కల్యాణోత్సవం జరిగే ప్రాంతం వరకు 20 ఉచిత బస్సులను నడపనున్నామన్నారు.జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
శ్రీరాముడిని రోల్‌మాడల్‌గా తీసుకోవాలి
రామయ్యను దర్శించుకున్న కడప, రాజంపేట ఎంపీలు ఒంటిమిట్ట : శ్రీరాముడిని రోల్‌మాడల్‌గా తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒంటిమిట్ట రామయ్యను ఎంపీలు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. వీరికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అలయ ప్రదక్షణ గావించి, గర్భాలయంలోని మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ రంగ మండపంలో వీరికి అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, ఘనంగా సత్కరించారు. అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.శ్రీరాముడు రాజుగా సుభిక్ష మైన పాలన అందిచాడని చెప్పారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు సంబటూరు రాంప్రసాద్‌రెడ్డి, సౌమ్యనాథస్వామి ఆలయ మాజీ చైర్మన్ సౌమిత్రి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్‌రెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, పంచాయతీ రాజ్ మండల అధ్యక్షుడు మేరువ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
● స్నేహమంటే ఇదేరా!
ఈ సృష్టిలో స్నేహానికన్నా మిన్న మరేదీ లేదంటారు. స్నేహం చాలా స్వచ్ఛమైనది. మనకు మనమే సృష్టించుకున్న అతి మధురమైన బంధం. అయితే కొన్ని జాతుల మధ్య కేవలం శత్రుత్వం మాత్రమే ఉంటుంది. కుక్క, పిల్లి.. ఎలుక, పిల్లి.. కుక్క,కోతి ఇవి నిత్య శత్రువులు. ఇవి ఒకదానికి ఒకటి తారసపడితే చాలు కయ్యానికి కాలు దువ్వుతాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి కుక్కతో పిల్లి సరదాగా ఆడుకుంటున్న సంఘటన మదనపల్లె మండలం తట్టివారిపల్లెలో జరిగింది. ట్రక్ వెల్‌విషర్స్ సభ్యులు సెల్ఫోన్లో బంధించిన ఈ దృశ్యం వైరల్‌గా మారింది. – మదనపల్లె సిటీ -
మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు
రాయచోటి : మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవామా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో మంత్రి రాజంపేట మున్సిపాల్టీకి సీఎస్ఆర్ నిధులు రూ. 21 లక్షలతో కొనుగోలు చేసిన ఆరు చెత్తసేకరణ ఆటోలను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌ల సమక్షంలో రాజంపేట మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. ఎంప్రాడా మినరల్స్ ఎండీ ఆకేపాటి విక్రమ్ రెడ్డి ఆర్థికసాయంతో ఈ ఆటోలను కేటాయించారు. కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ శ్రీధర్ జిల్లాలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాలులో పేదలకు గృహనిర్మాణ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన గృహనిర్మాణ పురోగతిపై ఆశాఖ డీఈలు, ఏఈలు, మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఆగిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లను త్వరగా పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హతగల ప్రతి లబ్ధిదారును డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో నమోదు చేయాలని సూచించారు. గృహ నిర్మాణశాఖ జిల్లా అధికారి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల పన్నాగం
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బసవగారి వినయ్ కుమార్ రెడ్డి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 42 వేలు కాజేశారు. తమ కుమారుడి అకౌంట్ నుంచి అతనికి తెలియకుండా డబ్బులు డ్రా చేశారని బుధవారం వినయ్ కుమార్ తండ్రి బసవగారి రమణారెడ్డి మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును సంప్రదించారు. నాలుగు విడతలుగా రూ. 42 వేలు విత్ డ్రా చేశారని బ్యాంకు మేనేజర్ గుర్తించారు. తమ కుమారుడు చైన్నెలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడని రమణారెడ్డి తెలిపారు. కాలేజీ ఫీజుకు సంబంధించి డబ్బులు వేయగా మరుసటిరోజే విత్ డ్రా చేసినట్లు మేసేజ్‌లు రావడం గమనించి తమకు చెప్పడంతో బ్యాంకులో నిర్ధారించుకుని సైబర్ నేరగాల బారిన పడినట్లు తెలిసిందన్నారు. తమ ప్రమేయం లేకుండా అకౌంట్లో డబ్బులు డ్రా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు బ్యాంకు మేనేజర్‌ను కోరారు.రూ. 42 వేలు విద్యార్థి అకౌంట్ నుంచి స్వాహా -
13న గురుకుల విద్యాలయాల ప్రవేశానికి పరీక్ష
రాయచోటి జగదాంబసెంటర్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి (2025–26) ఈ నెల 13న పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎ.ఉదయశ్రీ బుధవారం తెలిపారు. జిల్లాలో 11 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 880 సీట్ల కోసం 776 మంది, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 800 సీట్లకు 1,226 మంది విద్యార్థులు దరఖాస్తుల చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు https://apbragcet. apcfss.in/ వెబ్సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్‌లో తప్పుగా ఉన్న వారు హెడ్ మాస్టర్ ధృవీకరించిన స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.లేకపోతే పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని జిల్లా గురుకులాల సమన్వయకర్త ఉదయశ్రీ పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక మదనపల్లె సిటీ : ఆంఽధ్ర పెన్షనర్స్ పార్టీ మదనపల్లె నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం స్థానిక బెంగళూరు రోడ్డులోని జీఆర్టీ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటై ర్డ్ ఎంఈఓ పోతబోలు రెడ్డప్ప వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా మణికంటె నారాయణ, సహాధ్యక్షుడిగా శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గురునారాయణచారి, సహ కార్యదర్శిగా ఎస్.కృష్ణమూర్తి, కోశాధికారిగా రెడ్డప్ప ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ పెన్షనర్స్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో పెన్షనర్స్ పార్టీ నాయకులు మునిగోపాలకృష్ణ, రాజన్న, జగన్మోహన్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని విజయవంతం చేయండి కడప సెవెన్‌రోడ్స్ : ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులకు ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగనుందన్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మహోత్సవంలో భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలో మండల పరిధిలోని ఐరిస్ హోటల్ సమీపంలో బుధవారం కారు, ద్విచక్రవాహనం ఢీ కొనడంతో వరుణ్‌కుమార్‌రెడ్డి(21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ వెంకట సుధాకర్‌రెడ్డి కథనం మేరకు మండలంలోని బండపల్లె పంచాయతీ వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన వరుణ్ కుమార్‌రెడ్డి ద్విచక్రవాహనంలో రాయచోటి నుంచి వస్తుండగా కడప వైపు నుంచి అరుణాచలం వెళ్తున్న ఏపీ39ఎస్క్యూ 5835 గల ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. -
వాల్మీకిపురి.. రథోత్సవ సిరి!
కలికిరి (వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టాభి రామాలయ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం విశేష అలంకరణలతో తీర్చిన దేవదేవుడి రథాన్ని స్వర్ణాభరణ శోభితులైన సీతారామచంద్రులు అధిరోహించగా... రామదండు రామనామ స్మరణలతో కదలిరాగా.. దేవదేవుడి రథచక్రాలు ముందుకు కదిలాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా ఇసుక పడినా రాలనంతగా భక్తజనం రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరాగా పట్టాభిరాముడి రథోత్సవం రమణీయంగా సాగింది. రామనామ స్మరణలతో వాల్మీకిపురం పట్టణ వీధులు హోరెత్తాయి. తెల్లవారుజాము నుంచి సుప్రభాతసేవ, అభిషేకం, అర్చన, విశేష పూజలు జరిగాయి. నూతన వధూవరులైన శ్రీ సీతారాములను తిరుచ్చిలో అలంకరణలు చేసి రథారోహణం గావించారు. హాజరైన వందలాది భక్తజనం రథంపై మిరియాలు, పూలు, పండ్లు చల్లుతూ మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం దాకా సాగిన రథోత్సవం స్థానిక హరిమందిరం వద్ద సేదతీరగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాముడి రథం యథాస్థలికి చేరుకుంది. భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులను మోతగాళ్లు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని పరుగుపరుగున పురవీధుల గుండా నిర్వహించిన ధూళి ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాత్రి స్నపన తిరుమంజనం, కై ంకర్యాలు, ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగిశాయి. రథోత్సవం సందర్భంగా సీఐ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ శ్రీవల్లి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు. వైభవంగా పట్టాభిరాముడి రథోత్సవం రామనామ స్మరణతో మార్మోగిన వాల్మీకిపురం -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
ప్రొద్దుటూరు క్రైం : ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్‌ల ద్వారా బెట్టింగ్ కొనసాగిస్తున్న ముఠా కార్యకలాపాల గుట్టు రట్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో 25 మందిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3.10 లక్షలు నగదు, 23 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన బుధవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే బుకీలకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ చేశారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరలోని రామేశ్వరం నీళ్లట్యాంకు వద్ద క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో 18 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2.05 లక్షలు నగదు, 18 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన దొరసానిపల్లెకు చెందిన పుత్తాగిరీష్ అనే వ్యక్తి గతంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో బిగ్బబూల్ 247.కామ్ అనే వెబ్సైట్లో కొంత మంది యువకులను యాప్‌లో చేర్చుకొని పందేలు నిర్వహించేవాడు. ఇలా సుమారు 40 మంది బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఖాతాలను పరిశీలించగా సుమారు రూ. 1 కోటి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఫ్రీజ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పుత్తా గిరీష్‌కుమార్‌తో పాటు సాధు వీరప్రసాద్, పాతకోట ప్రతాప్‌రెడ్డి, ఆవుల సుబ్బారెడ్డి, బీచెర్ల సుబ్బారెడ్డి, వరదా సుధాకర్, మార్తల గురుశేఖర్‌రెడ్డి, మైలాగిని శివచైతన్య, సాధు పన్కుమార్, నల్లమారు నాగేంద్ర, వరదా ఆంజనేయులు, చిన్నకొండగిరి సుబ్బయ్య, మేకల మదనబాబు, ఎర్రమాసు ప్రతాప్, పబ్బతి శివశంకర్, తాటికొండ శ్రీను, తాటికొండ జగన్, భరతికవి చిన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె, చౌటపల్లె తదితర ప్రాంతాలకు చెందిన వారు. ఇదే కేసులో 23 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మరో కేసులో ఐదుగురు అరెస్ట్ పట్టణంలోని ఇస్లాంపురం వీధిలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కోనేటికాల్వవీధికి చెందిన షేక్ మాబుషరీఫ్ అలియాస్ చుంచు, పిందాల జనార్దన్‌రెడ్డి, భూమిరెడ్డి నాగార్జునరెడ్డి, వేంపల్లి సుదర్శన్‌రెడ్డి, శ్రీరామ్ సుబ్బరాయుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1.05 లక్షలు నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోని 23 మంది నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్ వ్యవహారంలో బడా బుకీల ప్రమేయం బెట్టింగ్ వ్యవహారంలో ప్రొద్దుటూరులోని బడా బుకీలైన టీడీపీ నాయకులకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పలువురు టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. దొరసానిపల్లె సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ భర్త అరవ మునివర, షేక్ ఫారూక్, షేక్ గౌస్‌బాషా అలియాస్ బెంగళూరు బాషా, ప్రొద్దుటూరు మున్సిపాలిటి 25వ వార్డు కౌన్సిలర్ షేక్ హెహనూర్ భర్త ఖాదర్‌బాషాతో పాటు ఏలే నరసింహలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇస్లాంపురం వీఽధిలో పట్టుబడిన ఐదుగురు బుకీలు వీరి కనుసన్నల్లో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరిపై ప్రొద్దుటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ క్రికెట్ పందేల కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ప్రప్రథమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై బీఎన్ఎస్ 111 (2), 112 (2) అనే కొత్త సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో బీఎన్ఎస్ 111 (2) సెక్షన్ అనేది తీవ్రమైందని తెలిపారు. ఈ రెండు కూడా నాన్‌బెయిలబుల్ సెక్షన్లని, వ్యవస్థీకృత నేరం కింద 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటి వారైనా వదలే ప్రసక్తి లేదని డీఎస్పీ తెలిపారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు నమోదు అయితే బెయిల్ కూడా రాదన్నారు. చాలా మంది యువకులు కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోరాదన్నారు. ప్రతి యాప్, వెబ్సైట్ పైనా పోలీసుల నిఘా ఉందన్నారు. ఐడీలు, ఐపీ అడ్రస్ ఆధారంగా యాప్‌లు ఎక్కడ క్రియేట్ చేశారో తెలుసుకొని సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో శ్రమించిన సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది రఘు, రామ్మోహన్‌లను డీఎస్పీ భావన అభినందించారు. రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో సీఐలు సదాశివయ్య, గోవిందరెడ్డి, బాలమద్దిలేటి పాల్గొన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్టు రూ.3.10 లక్షలు నగదు, 23 సెల్ఫోన్లు స్వాధీనం ఆన్లైన్లో రూ. 1 కోటికి పైగా జరిగిన లావాదేవీలు బెట్టింగ్ కేసులో పలువురు టీడీపీ నాయకులు -
రూ. కోటి విలువ చేసే మందులు పంపిణీకి సిద్ధం
రాయచోటి టౌన్ : జిల్లాలోని 30 మండలాల్లో పశువులకు ఉచితంగా వేసేందుకు సుమారు రూ.కోటి విలువ చేసే మందులు సిద్ధంగా ఉన్నాయని అన్నమయ్య జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్లై తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలకు కావాల్సిన 200 రకాలకు పైగా పలు రకాల వ్యాధుల నివారణ మందులు అందజేశామన్నారు. ఈ మందులు ఆయా మండల పశువైద్యాధికారులు గ్రామ సచివాలయ పరిధిలోని పశువులకు, గొర్రెలకు, మేకలకు ఉచితంగా వేస్తారని తెలిపారు. 17 వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – కార్మిక శాఖ – ఈ శ్రమ పోర్టల్‌లో ప్లాట్‌ఫాం కార్మికులను, గిగ్ కార్మికుల సమీకరణ, పేర్ల నమోదు కోసం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ జిల్లా అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆన్లైన్లో లేదా సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్, గ్రామ/ వార్డు సచివాలయాలలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం సిద్దవటం : జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచే లోపు విద్యార్థులకు అందజేసేందుకు సర్వేపల్లి రాధాక్రిష్ణ విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పరిశీలకుడు పీవీకే ప్రసాద్ తెలిపారు. సిద్దవటంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్టాక్ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు బ్యాగులు, షూస్ వంటివి స్టాక్ పాయింటుకు చేరతాయన్నారు. జూన్ 12వ తేదీ నుంచి ఎంఈఓల ఆధ్వర్యంలో ఎంఆర్సీ సిబ్బంది మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మజ, ఎంఈఓ–2 అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నిగార్ సుల్తానామదనపల్లె : అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన నిగార్ సుల్తానా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్‌పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. -
యథేచ్ఛగా భూ కబ్జా
● దళితుల భూముల ఆక్రమణకు టీడీపీ నాయకుల యత్నం ● అడ్డుకున్న చిన్నంపల్లి దళితవాడ రైతులు ఓబులవారిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మంగళవారం పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని చిన్నంపల్లి గ్రామ సమీపంలో యంత్రాలతో భూ కబ్జాలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన దళితులు ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నారు. 1998–99 సంవత్సరంలో సర్వే నెంబరు. 21 99–98లో చిన్నంపల్లి దళిత రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు పట్టాలు ఇచ్చారు. పేద రైతులు భూమిసాగు చేసేందుకు డబ్బులు లేక చెట్లను తొలగిస్తూ వారి ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. తమ భూములు ఆక్రమించుకుంటున్నారని సోమ వారం దళిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా కూడా మంగళవారం సర్వే నెంబరు. 2202లో చిట్వేలి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు తన పేరుపై, తన బంధువుల పేరుపై ఆన్లైన్లో భూములు ఉన్నాయని జేసీబీలతో చదును చేసేందుకు కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న దళితవాడ రైతులు అడ్డుకున్నారు. చిట్వేలి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని తమ భూములు కబ్జా చేస్తున్నారని వారు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కాగా ఈ విషయమై తహశీల్దార్ శ్రీధర్ రావును వివరణ కోరగా సర్వే నెంబరు. 2202 రికార్డు పరంగా ప్రభుత్వ భూమి అని ఈ నివేదికలు పంపిస్తామని, ఆన్లైన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీచేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల భూ కబ్జాలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని చిన్నంపల్లి దళితవాడ రైతులు రెవెన్యూ అధికారులను కోరారు. -
కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ
ఒంటిమిట్ట: ఏప్రిల్ 11న ఒంటిమిట్టలో జరగబోవు సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేయు సందర్భంగా కల్యా ణ వేదిక ఏర్పాట్లను మంగళవారం కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వచ్చే మార్గాన్ని, ఆయన ఆశీనులు అయ్యే ప్రదేశాన్ని, వీవీఐపీ గ్యాలరీలను, భక్తులు ప్రవేశించే మార్గాన్ని, ముత్యాల తలంబ్రాల కౌంటర్లను పరిశీలించారు. పోలీస్ గస్తీ పర్యవేక్షణ రాయచోటి: రాత్రివేళ నిర్వహిస్తున్న పోలీస్ గస్తీని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షించారు. మంగళవారం రాత్రి 11 గంటల అనంతరం జిల్లా ఎస్పీ రాయచోటి పట్టణ పరిధిలోని వీధులలో తిరిగారు. అర్బన్ సీఐ వివి చలపతితో కలిసి పట్టణంలోని గస్తీని సమీక్షించి పట్టణంలోగల వివిధ ప్రదేశాలను సందర్శించారు. పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దొంగతనాల నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా అల్లరి మూకలు, అసాంఘిక కార్యక్రమాలను చేపట్టే వారిపట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు పుల్లంపేట: వెల్ఫేర్ అసిస్టెంట్లు విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి జయప్రకాష్ అన్నారు. మంగళవారం బాలుర సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు సెలవుకు సంబంధించి సమాచారం ముందుగా సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభం రోజునే కిట్లు ఇవ్వాలి రాయచోటి టౌన్: పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు ఇవ్వాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ పెంచలయ్య జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థికి ఈ కిట్లు అందజేయడానికి ఏర్పాట్లు చేయా లని సూచించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, షూ సాక్స్, బెల్టు వంటి 9 రకాల వస్తువులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాల సమన్వయ కర్త ఉలవల వెంకట్రామయ్య, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. వెలిగల్లు నుంచి రాయచోటికి తాగునీరు చిన్నమండెం: రూ.450 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి నియోజకవర్గానికి తాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నమండెం మండలం గొర్లముదివీడు క్రాస్ నుండి తూర్పుపల్లి వరకు కోటి రూపాయలతో నిర్మించిన తారురోడ్డును మంగళవారం మంత్రి ప్రారంభించారు. మారుమూల గ్రామాలకు బస్సు సర్వీసులు రాయచోటి అర్బన్: రాబోయే నాలుగేళ్లలో మరో 2వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని శివాలయం సెంటర్లో ఆయన 12 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 3 సూపర్ లగ్జరీ, 2 అల్ట్రా డీలక్స్ , 5 ఎక్స్‌ప్రెస్‌లు, 2 పల్లె వెలుగు సర్వీసులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ, ఆర్ఎం రాము, మదనపల్లె, పీలేరు, రాజంపేట డిపోల మేనేజర్లు, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు. -
వినతులు సరే.. అమలే ప్రశ్నార్థకం
రాజంపేట: రైలు ప్రయాణికుల సమస్యలపై డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు ప్రతిసారి జరిగే సమావేశాలలో విన్నవించడం, ప్రస్తావించడం జరుగుతూనే ఉంది. అమలులో ఏమాత్రం కదలిక లేకుండా పోతోంది. ప్రతిపాదనలన్నీ సమావేశానికే పరిమితం అవుతూ వస్తున్నాయి. కాగా బుధవారం గుంతకల్‌లో డీఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సారైనా విన్నవించే అంశాలు అమలుకు నోచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ● డివిజన్ కేంద్రమైన గుంతకల్ పరిధిలో ఉభయ వైఎస్సార్ జిల్లాలోని రైలుమార్గం ఉంది. ఈ మార్గంలో నిత్యం వేలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రధానంగా రైళ్ల హాల్టింగ్స్ ఇప్పుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. మొక్కుబడిగా సమావేశాలు.. నామినేటెడ్ కింద ఎంపీలు డీఆర్‌యూసీసీ పదవులకు పేర్లను ప్రతిపాదిస్తారు. వారే డీఆర్‌యూసీసీ సభ్యులుగా కొనసాగుతారు. డీఆర్‌యూసీసీ ఆవిర్భావం నుంచి రైల్వేబోర్డు నిబంధనల మేరకు సమావేశాలను నిర్వహిస్తున్నారు. డీఆర్‌యూసీసీ సభ్యులకు రానుపోను ఉచిత రైలు ప్రయాణంతోపాటు తదితర సౌకర్యాలను కల్పిస్తుంది. సభ్యుల వద్ద నుంచి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరిస్తుంటారు. ఈ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే అపవాదును రైల్వే మూటకట్టుకుంది. గుంతకల్‌లో సమావేశం డివిజన్ కేంద్రమైన గుంతకల్‌లో బుధవారం 156వ డీఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు డీఆర్ఎం న్యూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరుగుతుంది. ఈ మేరకు డీఆర్‌యూసీసీ సభ్యులకు సీనియర్ డీసీఎం మనోజ్ నుంచి ఆహ్వానాలు అందాయి. డీఆర్‌యూసీసీ సభ్యులు వీరే... ముత్యాల శివప్రసాద్, ఉదయ్‌కుమార్ యాదవ్, దినేష్ కుమార్ జైన్, ఎన్.రమేష్‌బాబు, శ్రీనువాసులు, విజయకుమార్‌రెడ్డి, సహదేవరెడ్డి, అరవింద్‌కుమార్ ఎం.గాంధీ, రాజా వేణుగోపాల్ నాయక్, టీ.రవి డా.కృష్ణమూర్తి, రాజారెడ్డి, కోటిరెడ్డి, తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, తల్లెం భరత్ రెడ్డి, జున్న ప్రసాద్‌రెడ్డిలు నియమితులయ్యారు. కర్నూలు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు చెందినవారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలి రైలు ప్రయాణికులు ఇప్పుడు అనేక సమస్య లను ఎదుర్కొంటున్నా రు. వాటన్నింటి గురించి సమావేశంలో ప్రస్తావించి పరిష్కరించే విధంగా అధికారులలో కదలిక తెప్పించాలి. రాజంపేట, నందలూరు, ఓబులవారిపల్లె లాంటి రైల్వేస్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి. –కేఎంఎల్ నరసింహా, న్యాయవాది, రాజంపేట ● రాష్ట్ర అధికారిక రామాలయం ఉన్న ఒంటిమిట్ట రైల్వేస్షేషన్ అభివృద్ధి చేయాలి. తిరుమల, వెంకటాద్రి, రాయలసీమ, గుంటూరు, చైన్నె రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఇటీవల ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కూడా ఒంటిమిట్టలో రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వేబోర్డును కోరిన సంగతి తెలిసిందే. ● ఇంటర్ సిటి, నంద్యాల డెమోకు బోగీలు అదనంగా పెంచాలి. బోగీల రద్దీతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. ● రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో కోవిడ్–19 ముందు అన్ని రైళ్లకు హాల్టింగ్ కొనసాగింది. ఇప్పుడు కేవలం ప్యాసింజర్ రైళ్లు, హరిప్రియ, తిరుమల రైళ్లు మాత్రమే ఆగుతు న్నాయి. వెంకటాద్రి, చైన్నె–ముంబాయి మధ్య నడిచే రైళ్లు హాల్టింగ్ ఎత్తివేశారు. కోవిడ్ ముందు ఏవిధంగా హాల్టింగ్ ఉందో అదే విధంగా హాల్టింగ్స్‌ను పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో ఎంపీలతోపాటు డీఆర్‌యుసీసీ సభ్యులు రైల్వేశాఖను కోరుతున్నారు. ● నందలూరు నీళ్లకు ఉన్న నాణ్యతను బట్టి రైళ్లకు వాటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతు న్నారు. కోవిడ్–19 ముందు రూ.30లక్షల వ్యయంతో వాటరింగ్ నిర్మితం చేయాలని సర్వే కూడా చేశారు. ఆ తర్వాత కోవిడ్ ప్రభావంతో అటకెక్కించేశారు. ఈ వాటరింగ్ సెంటర్ వుండటం వల్ల తిరుపతి, రేణిగుంటపై భారం తగ్గుతుంది. ఇదే విషయాన్ని రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ప్రస్తావించిన సంగతి విదితమే. ● జిల్లా మీదుగా మరో ప్యాసింజర్ రైలును నడిపించాలని కోరుతున్నారు. ● తిరుపతి –షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలును డైలీ తిప్పాలని, బెంగళూరుకు వెళ్లేందుకు తిరుపతి వరకు నడుస్తున్న రైళ్లలో ఏదో ఒకటిని కడప వరకు పొడిగిస్తే జిల్లా వాసులకు బెంగళూరుకు వెళ్లేందుకు సులభతరమవుతుందని ప్రయాణికులు కోరుతున్నారు. ● దేశ రాజధాని రైలు కేవలం కడపలో ఆగుతోందని, రాజంపేటలో కూడా ఆపాలని దశాబ్దాలుగా ఎంపీలు కోరుతూ వచ్చారు. ఇటీవల రైల్వేబోర్డు అనుమతి ఇచ్చింది. అయితే అమలు ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ● ఆర్‌యూబీలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నందలూరు ఆర్యూబీ నిర్మాణం వల్ల అనేక అభ్యంతరాలు వస్తున్నాయని, పుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ● వేసవిలో అనేక రైళ్లలో నీటి సమస్యను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు. ● గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పొడిగించాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. ● ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం రైలుమార్గంలో ప్యాసింజర్ రైలును నడిపించాలని, కడప–విజయవాడకు ఉదయం పూట నడిచే విధంగా రైలును వేయాలని, లేని పక్షంలో గూడూరు జంక్షన్ వరకు అయితే డెమో రైలును నడిపించాలని చిరకాలంగా జిల్లా వాసులు కోరుతున్నారు. నెల్లూరు–కడప మధ్య రైలు జర్నీ లేదు. ఈ మార్గంలో రైళ్లను నడిపిస్తే నెల్లూరు–కడప మధ్య రాకపోకలు పెరుగుతాయి. ఇది వ్యాపార, రైతు, విద్యార్ధి పరంగా ఉపయోగకరమని కోరుతున్నారు. సమావేశానికే పరిమితమా? డివిజన్ స్థాయిలో జరిగే డీఆర్‌యూసీసీ సమావేశంలో నియమితులైన సభ్యులు తమ తమ ప్రాంతాల పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తారు. అవి పరిష్కరించాలని లేఖ ద్వారా ముందుగానే డివిజన్ రైల్వే అధికారులకు పంపిస్తారు. అయితే ఆ సమస్యలకు అనేక సాంకేతిక కారణాలను చూపి చేతులు దులుపుకోవడం కొనసాగుతున్న ఆనవాయితీ అనే విమర్శలు ఉన్నాయి. వినతులు సరే, వాటి అమలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. సమస్యలు తీరి రైలు పట్టాలెక్కేనా.! ప్రతిపాదనలు సమావేశానికేపరిమితమా? డీఆర్‌యూసీసీ లక్ష్యాలను అధిగమించాలి నేడు గుంతకల్‌లో డీఆర్‌యూసీసీ సమావేశం డీఆర్‌యూసీసీ సభ్యులు: 16 వేదిక : గుంతకల్ డీఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్ సమయం: ఉదయం 11 గంటలు -
నీలమేఘశ్యామా..
కోదండ రామా.. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజు మంగళవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నేడు: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి హనుమంత వాహన సేవ ఉంటుంది. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశంలో ఈఓ మాట్లాడారు. సీతారాముల కల్యాణానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన వివరించారు. కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందజేస్తామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశామని, 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు హెచ్డీ క్వాలిటీతో ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం అందిస్తుందన్నారు. ● కడప కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పులు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కల్యా ణ వేదిక ఆలయ పరిసరాలలో 250 మరుగు దొడ్లు నిర్వహిస్తున్నామన్నారు. ● కడప జిల్లా ఎస్పీ మాట్లాడుతూ టీటీడీ విజిలెన్సు విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్ర తా సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. 130 సిసి కెమెరాలు, 20 డ్రోన్లను ఏర్పా టు చేసి 4 ఫైర్ ఇంజన్లు, అత్యవసర సేవలందించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ● అంతకుముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా, టీటీడీ అధికారులు పరిశీలించారు. సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈఓ -
అద్భుతమైన సందేశ కావ్యం రామాయణం
ఒంటిమిట్ట : సంస్కృతంలో ఆది కావ్యమైన రామాయణంలోని ప్రతిపాత్ర ఒక సమున్నతమైన సందేశాన్ని మానవజాతికి అందించిందని, అలాంటి అద్భుతమైన సందేశ కావ్యం రామాయణమని తిరుపతి–తిరుమల దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం ఆయన రామాయణంలోని తార, మండోదరీల మాటలు అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. కిష్కింధకాండలో కనిపించే తార పాత్ర తన భర్త అయిన వాలికి సుగ్రీవుడు శ్రీ రామచంద్రుల విషయంగా చెప్పిన నీతి బోధనలు ఎన్నటికీ శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు ముమ్మిడి నారాయణ రెడ్డి, సిద్ద లింగారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు
రాయచోటి టౌన్ : రాయచోటి ఏరియా ఆస్పత్రిలో రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి ఏరియా ఆస్పత్రిలో నూతన ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తమ తండ్రి మండిపల్లి నాగిరెడ్డి కూడా మృతి చెందారన్నారు. అలాంటి ప్రమాదాల్లో మరణాలు తగ్గించేందుకు ఈ క్రిటికల్ కేర్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, ఆస్పత్రి కమిటి చైర్మన్ ఖాదర్ బాషా, సభ్యులు లయన్ మహమ్మద్ పాల్గొన్నారు. -
ముస్లిమేతరులను వక్ఫ్ కమిటీల్లో ఎలా నియమిస్తారు?
మదనపల్లె : ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డు కమిటీల్లో ఎలా నియమిస్తారు? ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగించే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కుతీసుకోండి అంటూ విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే పార్టీ) ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా కూటమి పార్టీల నేతలు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, వీసీకే పార్టీ అధినేత డాక్టర్. తిరుమావళవన్, ఏప్రిల్ 8న నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో... మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టం – దుష్పరిణామాలు అంశంపై, వీసీకే రాష్ట్ర ప్రచార కార్యదర్శి టి.ఎ. పీర్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం శివప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్, సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు, సీపీఐ నాయకులు తోపు కృష్ణప్ప, కోటూరి మురళి, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్, న్యాయవాదులు సోమశేఖర్, సుహేల్, ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు ఫైజ్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు. పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన 2025 వక్ఫ్ (సవరణ) బిల్లు, జాతీయ ఐక్యతా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. బిల్లు ముస్లిం సమాజం, మత స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే విధంగా రూపొందించబడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇతర మత సమాజాల ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోనప్పుడు, వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో మాత్రం ఎందుకు ఈ దూకుడు చూపిస్తోందని ప్రశ్నించారు. ఈ సవరణలోని ఒక నిబంధన ప్రకారం, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించే అవకాశం కల్పించారని, దీన్ని బీజేపీ పరిపాలనా పారదర్శకత అని సమర్థించు కుంటోందని, కానీ ఇది ముస్లిం సమాజం స్వయం పరిపాలనా హక్కులపై దాడి తప్ప మరేమీ కాదని విమర్శించారు. ఈ చట్టం దేశ ప్రజల ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. భారత జాతి ఐక్యతకు, స్వేచ్ఛకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అందరం ఏకమై, ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ముస్లింలు, ప్రగతిశీల శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వీసీకే నేత శివప్రసాద్ కోరారు. బాస్ కోశాధికారి నీరుగట్టి రమణ, వీసీకే టౌన్ ప్రెసిడెంట్ బురుజు రెడ్డిప్రసాద్, బాస్ టౌన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ పఠాన్, స్థానిక నాయకులు చాట్ల బయన్న, సొన్నికంటి రెడ్డెప్ప, జి.వి. రమణ, గంగాధర్, ముస్లిం ప్రతినిధులు మన్సూర్, షాహిద్ బేగ్, ఇలియాజ్, రోషన్, అష్రఫ్ తదితరుల తోపాటు పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా కూటమి పార్టీల నేతలు -
ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి
మదనపల్లె : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి అమలుచేసే వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఇతర సహాయక కార్యక్రమాలు పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ తెలిపారు. మంగళవారం స్థానిక సీఎల్ఆర్సీ భవనంలో మదనపల్లె డివిజన్లోని వ్యవసాయాధికారులు, రైతుసేవా కేంద్రాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ.. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రైతులందరికీ 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లాలో 1,78,000 మంది పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు ఉంటే, అందులో 75శాతం మందికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తిచేశామన్నారు. 85శాతం పూర్తిచేస్తే కేంద్రప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు బడ్జెట్ వచ్చే అవకాశం ఉన్నందున ఈనెల 15లోపు పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు తప్పనిసరిగా రైతుసేవా కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, 1బీ అడంగల్, ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి 11 అంకెల విశిష్ట సంఖ్యను పొందాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ శివశంకర్, ఏఓలు రమేష్‌రాజు, చంద్రశేఖర్, మురళీ, మోహన్, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ ధర పెంచడం అమానుషం
రాయచోటి : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో గ్యాస్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారమైందని అభిప్రాయపడ్డారు. ఉజ్వల్ యోజన కింద అందజేసిన సిలిండర్‌పై కూడా రూ. 50లు భారాన్ని మోపారన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు సిలిండర్ ధర పెంచడం భారంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం–2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు చాలా మందికి అందడం లేదన్నారు. తొలి విడత కింద ఇప్పటి వరకు ముఫ్పై, నలభై శాతం మందికి సిలిండర్ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమ కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువ : పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.22, కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.92, తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉందన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా డీజీల్, పెట్రోల్ ధరలు రూ.10 తగ్గి ఉండేలా చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... బి.కొత్తకోట మండలం ఎగువ శీతివారిపల్లెకు చెందిన రమేష్(23) పనుల మీద బురకాయలకోటకు ద్విచక్రవాహనంలో వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బురకాయలకోట బైపాస్ వద్ద ఎదురుగా వస్తున్న కోటేశ్వర్‌రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రమేష్‌కి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరదయ్యగారిపల్లి ఆలయంలో చోరీరాజంపేట : మండలంలోని వరదయ్యగారిపల్లి అక్కమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఈ విషయాన్ని మన్నూరు సీఐ కులాయప్ప తెలిపారు. హుండీలు పగులకొట్టి అందులో నగదును తీసుకెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా రికార్డు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్ టీమ్ కూడా ఆలయాన్ని పరిశీలించిందన్నారు. మందుల కోసం వచ్చాడు.. బంగారు చైన్ లాక్కెళ్లాడు ప్రొద్దుటూరు క్రైం : వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హోమస్‌పేటలో సుభాషిణి అనే 70 ఏళ్ల వృద్ధురాలు కొన్నేళ్లుగా ఆయుర్వేద మందులను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మందులు తీసుకునేందుకు గుర్తు తెలియని భార్యాభర్తలు అక్కడికి వచ్చారు. భార్య బయట ఉండగా భర్త లోపలికి వెళ్లాడు. తన భార్యకు ఆరోగ్య సమస్య ఉందని మందులు ఇవ్వమని అడిగాడు. ఆమె మందులు ఇచ్చే క్రమంలో మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని ఆమెను తోసేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. దొంగ అక్కడి నుంచి బయటికి పరుగెత్తి భార్యతో కలిసి ఆటోలో పారిపోయాడు. -
ప్రశాంత్‌నగర్‌లో చోరీ
మదనపల్లె : పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో చోరీ జరిగింది. బాధితులు వారం తర్వాత చోరీని గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎర్రిస్వామి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మార్చి 31న భార్యతో కలిసి అరుణాచలం వెళ్లారు. దైవదర్శనం అనంతరం భార్య అనారోగ్యానికి గురికావడంతో అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొంది సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. తలుపులు తాళాలు పగలగొట్టి ఉండటం, వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో తనిఖీ చేసి 80 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి తీరని లోటురాయచోటి : విధులపట్ల ఎంతో నిబద్ధత కలిగిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమాను కోల్పోవడం జిల్లాకు తీరని లోటని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి అధికారిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆమె నిబద్ధత గురించి సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ చెప్పడంతోనే పీజీఆర్ఎస్కు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. ఈమె నియామకం తరువాత పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అన్నమయ్య జిల్లా ఎంతో వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన వ్యక్తి రమ అన్నారు. ఆమె ఎంతో మృదు స్వభావి, నిజాయితీగల అధికారిణి అని కొనియాడారు. సమావేశంలో డీఆర్ఓ మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సహదేవరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మైదుకూరు : మండలంలోని వనిపెంట శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.శ్రీకాంత్ (22) అనే యువకుడు మృతి చెందాడు. బ్రహ్మంగారిమఠంలోని తెలుగు గంగ కాలనీకి చెందిన శ్రీకాంత్ మోటార్ బైక్‌పై మైదుకూరు వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్రగాయాలతో ఉన్న అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న యువకుడిని కారు ఢీకొన్నట్టు పలువురు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నిలపకుండా వెళ్లినట్టు చెబుతున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.● వారం తర్వాత గుర్తించిన బాధితులు ● 80 గ్రాముల బంగారు అపహరించిన దొంగలుజిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం) : వేదపండితుల మత్రోచ్ఛాటన.. మంగళ వాయిద్యాల ఘోష.. పురోహితులు... వందిమాగధులు.. పరిచారకులు వెన్నంటి ఉండగా.. కల్యాణ వేదికపై పట్టు వస్త్రాలతో పెళ్లి కొడుకుగా ముస్తాబైన రామచంద్రుడు.. కుడివైపు పెళ్లి వస్త్రాలతో సిగ్గు లొలకబోస్తున్న సీతమ్మ తల్లి.. ఎడమ వైపు లక్ష్మణ స్వామి ఆశీనులయ్యారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన కల్యాణ వేదికపై సీతారాముల కల్యాణ వైభోగాన్ని వీక్షించిన భక్తజనం పరవశించి పోయారు. పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి అభిషేకం, అర్చన, స్నపన తిరుమంజనం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ఊంజల్‌సేవ విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. టీటీడీ అధికారులు, ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మోసుకు వచ్చి అందజేయగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులను విశేష రీతిలో అలంకరించి గరుడ వాహనంపై పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కోలాటలు, చెక్కభజనలు, హరికథా కాలక్షేపాలు, లంకాదహనం, బాణసంచా, బళ్లారి వాయిద్యాలు, మహి ళల చలిపిండి దీపారాధనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ శ్రీవల్లి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు. గరుడవాహనంపై ఊరేగిన శ్రీరామచంద్రుడు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
చింతచెట్టు కోసిన ఐదుగురిపై కేసు నమోదు
మదనపల్లె : పొలంలోకి అక్రమంగా ప్రవేశించి, చింతచెట్టును కోసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పట్టణంలోని దేవళంవీధికి చెందిన వెంకటరమణ భార్య జగదీశ్వరికి తన తల్లి రామలక్ష్మమ్మ పేరుపై సర్వేనెం.144, 145లో 25 సెంట్ల పొలం ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఈనెల 6న రామారావు కాలనీకి చెందిన మాదిన భాస్కర్, అతని భార్య మాదిన శాంతమ్మలు అంకిశెట్టిపల్లె మార్గంలో ఉన్న జగదీశ్వరి పొలంలోకి అక్రమంగా వెళ్లి అందులో ఉన్న రూ.లక్ష విలువచేసే చింతచెట్టును కోసివేశారు. జగదీశ్వరి కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి ప్రశ్నిస్తే..ఈ పొలం మీది కాదని, ఇంకా ఎక్కువ మాట్లాడితే..మీపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని వారిని బెదిరించి దౌర్జన్యం చేశారు. దీంతో జగదీశ్వరి సోమవా రం సాయంత్రం తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేరకు మాదిని భాస్కర్, అతడి భార్య శాంతమ్మ, చింతచెట్టు కోసేందుకు వచ్చిన మరో ముగ్గురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఉపాధ్యాయుని ఇంటిలో చోరీ
బి.కొత్తకోట : ప్రభుత్వ ఉపాధ్యాయులైన భార్యాభర్తలు రాయచోటిలో పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ కోసం వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన సోమవారం తెల్లవారుజాము బి.కొత్తకోట సంతబజారువీధిలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. స్థానిక సంతబజారులో నివాసం ఉంటూ బీరంగలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్‌కుమార్, పీటీఎం మండలంలో పనిచేస్తున్న ఆయన భార్య అనిత ఇద్దరూ ఈనెల 3వ తేదీనుంచి రాయచోటిలో పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దేందుకు వెళ్లారు. సోమవారం ఉదయం పక్కింటిలో ఉంటున్న మునీర్ నుంచి కిరణ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. దుండగులు ఇంటికి వేసిన తాళాలను గడ్డపారతో పగులగొట్టి లోపలికి వెళ్లారు. బీరువా, లాకర్‌ను పగులగొట్టి అందులోని బంగారు, వెండి నగలు, డాక్యుమెంట్ పత్రాలను దోచుకున్నారు. మార్కెట్లో ప్రస్తుత విలువ ప్రకారం రూ.22 లక్షల విలువజేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువజేసే ఐదు కిలోల వెండి ఆభరణాలు, దేవుడికి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. రూ.20 వేల నగదు చోరీ చేశారు. ఈమేరకు బాధితుడు కిరణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాయచోటి నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన ఇంటిలో దొంగల వేలిముద్రలను సేకరించారు. కాగా బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన విలువ మేరకు రూ.2.25 లక్షలు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఇంటి తాళం పగులగొట్టి.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ -
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
రాయచోటి : పేదోడికి పెద్దరోగం వస్తే రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రాయచోటిలో పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంగా పేరు మార్చారేగానీ పథక అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. సేవలు అందించే నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 3600 కోట్లు బకాయిలను చెల్లించ లేదన్నారు. దీంతో మరోసారి నెట్వర్క్ ఆసుపత్రులు ఈనెల 7వ తేదీ సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేయడంతో ఉచిత వైద్యంకోసం వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలను చెల్లించి ఆసుపత్రుల యాజమాన్యాల సమ్మెను విరవింపజేయాలని కోరారు. ఆరోగ్య ఆసరాకు మంగళం ఆరోగ్య ఆసరాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందన్నారు. 1059 జబ్బులకు చికిత్సలు, శస్త్ర చికిత్సలు ఉండగా జగన్ పాలనలో 3257కు పెంచారన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పథకం కోసం 17 ఏళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి -
ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యం
రాయచోటి : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ సిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలపై స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సబ్ డివిజన్, సర్కిల్ పరిధి, పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు. బాధితుల వద్దకు ఎస్పీ.. నడవలేని స్థితిలో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు, ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ మృతి మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ సోమవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. చౌడేపల్లి మండలం బయ్యప్పపల్లికి చెందిన టి.జయ ప్రకాష్ (పిసి నెంబర్ 3694) మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు పసినికొండలో నివాసం ఉంటూ, తాలూకా పోలీస్ స్టేషన్లో మూడేళ్లుగా కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు భవేష్(04) అనారోగ్యానికి గురి కావడంతో భార్య కిరణ్మయితో కలిసి శనివారం బెంగళూరుకు చికిత్స నిమిత్తం వెళ్లాడు. అక్కడ తన బంధువులకు చెందిన ద్విచక్ర వాహనంలో ఆసుపత్రి అవసరాలపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంధువులు బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం స్వల్పంగా కోలుకోవడంతో కుటుంబ సభ్యులు జయప్రకాష్‌ను తిరుపతి నారాయణాద్రి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. కానిస్టేబుల్ జయప్రకాష్ మృతి చెందిన సమాచారం తెలియడంతో తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ కళా వెంకటరమణతో పాటు ఎస్ఐలు చంద్రమోహన్, గాయత్రి, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసు క్యాంపులుమదనపల్లె సిటీ : కస్టమర్స్ సర్వీసు మాసం పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ డివిజన్ కేంద్రంలో కస్టమర్ సర్వీసు క్యాంపులు నిర్వహించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ డీఈ ఆబిద్అలీ తెలిపారు. మంగళవారం నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాంపుల ద్వారా కస్టమర్లు తమ సేవల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి క్యాంపు వద్ద బీఎస్ఎన్ఎల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రత్యేకంగా సిగ్నల్, ఫైబర్ కనెక్షన్ వంటి సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు. -
డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రస్థానం ప్రారంభమై..
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్ ఎస్.రమాదేవి కర్నూలులో డిప్యూటీ తహసీల్దార్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామం కావడంతో కర్నూలు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఆమె భర్త పోలీస్ అధికారిగా ఈ మధ్యకాలంలోనే పదవీ విరమణ పొందారు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. వీరు పీలేరులో స్థిరనివాసం చేసుకున్నారు. పదోన్నతిపై అదే జిల్లాలో తహసీల్ద్రా్గా పని చేసి తరువాత వైఎస్సార్ జిల్లా ముద్దనూరు, సీకే దిన్నెలో తహసీల్దార్‌గా పని చేశారు. అక్కడి నుంచి ఆర్డీఓగా పదోన్నతి పొంది హెచ్ఎన్ఎస్ (హంద్రీనీవా) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి పీలేరు నుంచి వస్తుండగా ఆమె సంబేపల్లె – రాయచోటి మార్గమధ్యంలో జరగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ సంతాపం రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిలు సంతాపాన్ని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్టీఓ శ్రీనివాసులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె మరణంతో జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణంతో అన్నమయ్య జిల్లా రెవెన్యూ శాఖలో విషాదం అలుముకుంది. -
కారు సహా రూ. 12 లక్షల ఎర్రచందనం స్వాధీనం
పీలేరు : కారుతో సహా రూ. 12 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో సోమల మండలం కందూరు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం కలికిరి వైపు నుంచి కందూరు వైపు అతివేగంగా వెళుతున్న కారును సిబ్బంది ఆపే ప్రయత్నం చేయగా వేగంగా ముందుకు వెళ్లిన కారును ఫారెస్ట్ సిబ్బంది వెంబడించారన్నారు. ఇరిగిపెంట గ్రామం ఎర్రనాగులపల్లె వద్ద పట్టుకుని కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన సయ్యద్ ఆరీఫ్ అహ్మద్‌ను అరెస్ట్ చేసి కారుతో పాటు 255 కేజీల బరువు గల ఎనిమిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చంద్రశేఖర్, ప్రతాప్, నరేష్, చరణ్, దేవేంద్ర పాల్గొన్నారు. -
కోదండరాముడి కల్యాణోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడి కల్యాణ మండపం సమీపంలోని పరిపాల భవన సమావేశ మందిరంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, టీడీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్దన్ రాజు, జేసీ అదితి సింగ్‌తో కలిసి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 11వ తేదీన సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు.ప్రజా భద్రత కోసం సుమారు 150కిపైగా సీసీ, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.మంత్రి సవిత మాట్లాడుతూ కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణవేదిక ప్రాంగణాన్ని భక్తులు శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, తాగునీటి వసతి కల్పించామన్నారు.108 వాహనాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్దన్ రాజు మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులను కోరారు. కల్యాణ వేదిక పరిశీలన అంతకుముందు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని కల్యాణ వేదికను వారు పరిశీలించారు.ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ నాగరాజు, డీపీఓ రాజ్యలక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణయ్య పాల్గొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత -
పనులు త్వరగా పూర్తిచేయాలి
సిద్దవటం : ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని సిద్దవటం మండలం లోని కడప– చైన్నె ప్రధాన రహదారికి ఇరువైపులా పారుశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆమె భాకరాపేట, కనుమలోపల్లె గ్రామాల్లో జరిగే పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ విజయ భాస్కర్, ఈఓపీఆర్డీ మోహతాబ్ యాస్మిన్, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సుండుపల్లె : ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈడీ ఊర్మిళ తెలిపారు. మండల కేంద్రంలోని చెత్త నుంచిసంపద తయారీ కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తడి చెత్త – పొడి చెత్తను వేరు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించాలని, సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని తెలిపారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్‌వల్లి, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ సురేష్‌బాబు, రీసోర్స్ పర్సన్ మధు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి.యామిని కడప అర్బన్ : వైఎస్సార్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సి.యామిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి. శ్రీదేవి అనంతపురంలోని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ లేబర్ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. కడపలోని ఆర వ అదనపు జిల్లా (ఫ్యామిలీ కోర్ట్) జడ్జిగా పనిచేస్తున్న షేక్ ఇంతియాజ్ అహ్మద్ విజయవాడ జిల్లా కోర్టులో 14 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా కోర్టులో పోక్సో కోర్టు జడ్జ్‌గా పని చేస్తున్న ఎన్.శాంతి కడపలోని ఆరవ అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్‌కు 19 స్లాట్ బుకింగ్‌లు కడప కోటిరెడ్డిసర్కిల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ సేవలను మరింత సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి దస్తావేజులను అందజేశారు. సోమవారం 19 స్లాట్ బుకింగ్చేసుకున్న వారికి దస్తావేజులను అందజేసినట్లు సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ తెలిపారు. కొత్త విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఎక్కువ సమయం వృథా కాదని, ప్రజలు నిరీక్షించే బాధ తగ్గుతుందన్నారు. అలాగే క్యూఆర్ కోడ్‌తోనూ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు తమ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. -
కందిపప్పు.. కరువే !
సాక్షి రాయచోటి : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకులకు కోత పడుతోంది. ప్రభుత్వం కుదిస్తుందో లేక కార్డుదారులకు నిత్యావసరాలు అవసరం లేదనుకున్నారో ఏమో తేలియదుగానీ నిత్యావసర సరుకుల విషయంలో మాత్రం వాత తప్పడం లేదు. వైఎస్సార్ సీపీ సర్కార్ హయాంలో ఎప్పుడూ సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి నాణ్యమైన సరుకులతోపాటు చక్కెర, కందిపప్పు, బియ్యం, జొన్నలు, రాగులు అందించే పరిస్థితి కనిపించేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కందిప్పు ధర పెరగడంతోపాటు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సబ్సిడీపై అందించకుండా కోత పెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 5,04,325 కార్డుదారులు ఉన్నారు. జిల్లాలో దాదాపు రెండు నెలలుగా కందిపప్పు కనిపించడం లేదు. అధికమొత్తంలో ధర పలుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరితోపాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో కందిపప్పు అందించలేదని చెబుతున్నారు. ఒకనెలకు సంబంధించి జిల్లాకు 495 మెట్రిక్ టన్నులకు పైగా అవసరం ఉంటుంది. సరుకు రవాణా కాకపోవడంతో వీటికి ప్రభుత్వం ఎసరు పెట్టింది.జిల్లాలోని కార్డుదారులకు పూర్తిగా నిలిపివేయగా, అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం కందిపప్పు అందించారు. జిల్లాలో అంతంత మాత్రంగానే చక్కెర జిల్లాలో చక్కెర కొంతమంది కార్డుదారులకు మాత్రమే అందింది. సబ్సిడీపై అందించే చక్కెరకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా పీలేరు నియోజకవర్గంలోని వాయల్పాడు ప్రాంతంలో డీలర్లు డీడీలు తీయకపోవడంతో చక్కెర అందలేదు. ఒక్క వాయల్పాడే కాకుండా మరికొన్నిచోట్ల కూడా చక్కెరకు సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ప్రస్తుతం చిత్రమైన పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కనిపించని సరుకులు మార్చి చివరిలో వచ్చిన ఉగాది, ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన శ్రీరామనవమి పండుగ సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులకు సంబంధించి పండుగ నేపఽథ్యంలో రంజాన్ తోఫా అందిస్తామని పేర్కొన్నా అదిఅమలుకు నోచుకోలేదు. ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణంతో పండుగ సందర్భంలోనూ సరుకులు అందించకపోవడంపై కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. పండుగ సందర్భలోనూ కనిపించని పూర్తి స్థాయి సరుకులు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రేషన్ సరుకుల్లో కోత -
మనోహరం.. మోహినీ స్వరూపం
కలికిరి(వాల్మీకిపురం) : పుష్పాలంకృతమైన వాలుజడ, నుదుటన బొట్టు, కాటుక తిలకం.. సాక్షాత్తూ మోహినీ స్వరూపంలో చూడచక్కని శ్రీరామచంద్రుడి దివ్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. వాల్మీకిపురం పట్టాభిరాముల వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం విశేష కార్యక్రమాలతో ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి మూలవర్లకు నిత్య కై ంకర్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భోగోత్సవ మూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణులను విశేష అలంకరణలతో తొలుత ఉదయం సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. విశేష భక్తజనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారి మండపంలో ఊంజల్ సేవ జరిగాయి. సాయంత్రం తిరిగి భోగోత్సవమూర్తులు చంద్రప్రభవాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అనంతరం రాత్రి విశేష పూలాలంకృతులతో తీర్చిన పుష్పపల్లకిలో సాక్షాత్తు మోహినీ స్వరూపుడైన పట్టాభిరాముడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చాడు. నాయీ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం.. గరుడ సేవ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, గరుడ సేవ కార్యక్రమాలు అలరించనున్నాయి. కాగా యావత్ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ రోజు కల్యాణ వేడుకలు జరుగుతుండగా, వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో అమ్మవారి నక్షత్రంలో కల్యాణ వేడుకలు జరుపనుండటం విశేషం. సూర్య, చంద్రప్రభ వాహనాలపై సీతారాములు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
సెకండ్ కార్స్ యజమాని మోసం..
మదనపల్లె : మీ పేరుపై కార్లు కొన్నానని, లక్షల్లో నగదు వసూలు చేసుకుని, సెకండ్ కార్స్ యజమాని మోసం చేయడంతో, మనస్థాపం చెందిన ఓ మహిళ కెమికల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుపట్ల గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య సునీత (45) తన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేందుకు, సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులో హరి కార్స్ యజమాని హరికృష్ణను సంప్రదించింది. ఆమె కుటుంబ సభ్యుల పేరుపై కార్లు కొంటానని నమ్మ పలకడంతో, విడతల వారీగా రూ. 15 లక్షల నగదు అతనికి ముట్టచెప్పింది. డబ్బు తీసుకున్న హరికృష్ణ కార్లు వారికి కొని ఇవ్వకుండా, మీ పేరు పై కార్లు కొన్నానని బాడుగలకు వెళుతున్నాయని నమ్మబలికాడు. కొన్ని రోజులు వేచి చూసిన సునీత తమ పేరుపై ఉన్న కార్లకు సంబంధించిన ఆర్సీ బుక్కులు చూపించాలని పట్టుబట్టింది. దీంతో హరికృష్ణ ఆర్సీలు పంపాడు. అయితే అవి సునీత కుటుంబ సభ్యుల పేరుపై లేకపోవడంతో తాము మోసపోయామని గుర్తించింది. ఆరు నెలలుగా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసింది. ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో, సోమవారం మధ్యాహ్నం నగదు వసూలుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మదనపల్లె లోని హరి కార్స్ వద్దకు వచ్చింది. డబ్బు చెల్లించాలని హరికృష్ణను గట్టిగా అడిగింది. అయితే హరికృష్ణ నగదు చెల్లించకపోగా తన అనుచరులతో కలిసి ఆమెను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అయినా ఆమె వినకుండా షాపు వద్దే రాత్రి వరకు కూర్చుంది. దీన్ని భరించలేని హరికృష్ణ ఆమెను తిడుతూ ఎక్కడికై నా వెళ్లి చావు అన్నాడు. దీంతో ఆమె అక్కడే ఉన్న కార్ కెమికల్ ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈలోపుగా సునీత ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించండిలక్కిరెడ్డిపల్లి: గ్రామాలలో తాగునీటి సమస్యపై పంచాయతీ అధికారులు దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ మైథిలి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చౌటపల్లి దళితవాడ, దప్పేపల్లి, కొండవాండ్లపల్లి గ్రామాలలో ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ కిషోర్ కుమార్, ఇన్చార్జి ఎంపీడీఓ ఉషారాణి, పంచాయతీరాజ్ ఏఈ సుబ్రమణ్యంలతో కలిసి జిల్లా పరిషత్ గ్రాంట్‌కు సంబంధించి తాగునీటి బోర్లను, పలు రికార్డులను పరిశీలించారు. జెడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.మహిళ ఆత్మహత్యాయత్నం -
రాయంచపై రామయ్య విహారం
ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 7 నుంచి 8:30 గంటలకు హంసవాహనసేవ వైభవంగా జరిగింది. రాములోరు రాయంచపై కొలువుదీరి మాఢవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామా..మము బ్రోవుమా అంటూ భక్తజనం ప్రణమిల్లారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసకు పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తుల్లో అహంభావం తొలగించి శ్రీదాసోహంశ్రీఅనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామి వారు అధిరోహిస్తారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు. వేలాది మంది తరలిరావడంతో రామయ్య క్షేత్రంలో భక్తజన సందడి నెలకొంది. అంతకు ముందు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాఢవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 11 నుంచి కల్యాణవేదిక వద్ద ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహించారు. ప్రణమిల్లిన భక్తజనం నేటి కార్యక్రమాలు... బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో శ్రీరాముడు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి సింహ వాహనంపై విహరిస్తారు. -
సమస్యలు ఆలకించండి సారూ.!
మదనపల్లె : ‘దూరప్రాంతాల నుంచి వచ్చాం..మా సమస్యలు పరిశీలించి న్యాయం చేయండి..సారూ’ అని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధికారులను వేడుకున్నారు. సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందజేసిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాన సెటిల్మెంట్ దస్తావేజు రద్దు చేయాలి పీలేరు నియోజకవర్గం, కే.వీ.పల్లె మండలం గ్యారంపల్లె సంకేతిగుట్టపల్లెకు చెందిన ఎగువపల్లె రాజారెడ్డి, తన మనవళ్లకు దాన సెటిల్మెంట్ కింద రాసిచ్చిన 7.49 ఎకరాల భూమికి చెందిన దస్తావేజులను రద్దుపరచాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో తనను ఎవ్వరూ చూడటం లేదని, ఇంటిలో కదలలేని స్థితిలో ఉన్న తనకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఆర్ఓ ప్లాంటుకు స్థలం కేటాయించండి నిమ్మనపల్లె మండలం అగ్రహారంలో తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో గ్రామస్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానించింది. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న గ్రామచావిడిలో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు సర్పంచ్ ఉషారాణి ఆధ్వర్యంలో పంచాయతీ సభ్యులు తీర్మానించి తహసీల్దార్ అమరనాథ్‌కు అర్జీ సమర్పించామన్నారు. అయితే నెల రోజులవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. దారికి అడ్డుగా అక్రమ నిర్మాణాలు మదనపల్లె మండలం పొన్నూటిపాలెంలో సర్వే నెంబర్ 420లో అక్రమ నిర్మాణాలు చేస్తూ, ఇతరులకు దారి లేకుండా చేస్తున్నారని బోయపాటి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా అర్జీ సమర్పించారు. వృద్ధాప్య పెన్షన్ ఇప్పించండి తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామం, రాగమానుదిన్నెపల్లెకు చెందిన వెంకటరమణమ్మ...తన భర్త వెంకటస్వామి రెండేళ్ల క్రితం మరణించారని, తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని చెప్పింది. వృద్ధాప్యంలో ఉన్న తన సంరక్షణ ఎవరూ చూడటం లేదని, తనకు వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని వేడుకుంది. సబ్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు స్వీకరించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ -
మనిషికి ఆరోగ్యం గొప్పవరం
రాయచోటి అర్బన్/రాయచోటి టౌన్ : మనిషికి ఆరోగ్యం గొప్ప వరం అని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజ అన్నారు. ప్రపంచ ఆరోగ్యదినోత్స వం సందర్భంగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది పురవీధులలో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజి సర్కిల్, డైట్‌కళాశాల, వైఎస్ ఆర్ సర్కిల్ల మీదుగా తిరిగి ఆసుపత్రి వద్దకు చేరింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికే ఆరోగ్యం విలువ తెలుస్తుందన్నారు. సరైన సమ యంలో వివాహం చేసుకోవడం సంతోషానికి నిలయం అని అన్నారు.ఆసుపత్రి ప్రసవాలు తల్లిబిడ్డలకు ఆనందకరమన్నారు. హైరిస్క్ గర్భిణులు తప్పనిసరిగా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పెద్దల మాటలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టు కోటేశ్వరి, డిప్యూటీడెమో దేవశిరోమణి, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్ నారాయణ, ఆరోగ్య పర్యవేక్షఖులు సుధాకర్, రవి,నాగమల్లయ్య, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలలో విజేతలు కావడం ప్రశంసనీయం
నందలూరు : ఎన్ఎస్ఐసి–2025 జాతీయ స్థాయి పోటీలలో విజేతలుగా నిలవడం ప్రశంసనీయమని మెడల్, రివార్డ్స్ పొందిన గొబ్బిళ్ల అక్షర స్కూల్ విద్యార్థులు లక్ష్మీ చైతన్య, షేక్ జైనబ్లను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం అభినందించారు. గొబ్బిళ్ల అక్షర స్కూల్ చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డీఈఓను కలిశారు. విద్యార్థులను ఎన్ఎస్ఐసీ మెడల్స్‌తో మరొకసారి సత్కరించారు. చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్, కరస్పాండెంట్ గొబ్బిళ్ల శ్రీనాథ్, మెంటర్ వరప్రసాద్, పుత్తా కోటేశ్వరరావులు డీఈఓను శాలువాతో సన్మానించారు. -
రామ మందిరం..సాహితీ సౌరభం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామయ్య సేవలో ఎందరో కవులు పుణీతులయ్యారు. అమూల్య ఆధ్యాత్మిక రచనలను రామయ్యకు అంకితం చేశారు. అయ్యలరాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక మకుటంతో ఆయన వెలువరించిన శతకం లభ్యమైంది. తొలుత రాచరిక పాలనలో తన పాండిత్యాన్ని సాగించినప్పటికీ తరువాత పూర్తిగా దాశరథి సేవకు అంకితమయ్యారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామయ్య సేవలో తరించిన కవులపై కథనం. చమత్కార శైలి.. విభిన్నం అయ్యలరాజు రామభద్రుడు ఒంటిమిట్టలో క్రీ.శ. 1550లో ఇక్కడ నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు రామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజుకు ఈ కావ్యాన్ని అంకితం చేశారు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాల గ్రంధం. రామభద్రుని కవిత్వంలో చమత్కారం తొణికిసలాడుతుంది. చరిత్రపుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. చరిత్ర పుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప.. వరకవి నల్లకాలువ అయ్యప్ప కోదండ పాణిని సేవించి వర కవి అయ్యారు. చంద్రగిరిని పాలించిన రెండో వెంకటపతి రాయల బావమరిది కుమారుడు ఓబరాజు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడిగా సేవలందిచారు. ఆయనను ప్రసన్నం చేసుకుని అయ్యప్ప కృతులు చెప్పారు. నెల్లూరు జిల్లా భీమవరం గ్రామాన్ని అగ్రహారంగా పొందారు. పూర్వం నెల్లూరు నుంచి తిరుపతి వరకు దాడులు జరిగాయి. బద్వేలు, నందలూరు, రాజంపేట, కోడూరు, మామండూరు ప్రాంతాల మీదుగా దాడులు చేశారు. ఈ ఘటనలన్నింటిని నిర్భయంగా శతక రూపంలో అద్భుతమైన పద్యాలతో ఆవిష్కరించారు. ఆ శతకమే ‘శతృసంహార వెంకటాచల విహార’ సాహితీ మణి మకుటం మట్లిరాజులు సిద్దవటం కేంద్రంగా పరిపాలన చేశారు. వీరు రామయ్య క్షేత్రాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు. గుడి నిర్మాణ సమయంలో ఉప్పు గొండూరు వెంకట కవి తరచూ సందర్శన నిమిత్తం ఇక్కడకి వచ్చేవారు. ఆ సమయంలోనే ఏకశిలానగరి రామయ్య మీద దశరథరామ అనే మకుటంతో శతకం రాశారు. రామయ్యను దర్శించిన అన్నమయ్యకోదండ రామస్వామిని పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. నేటికి ఈ ప్రాంత ప్రజలకు ఆ కీర్తనలు సుపరిచితం. కోదండపాణి సేవలో పునీతులైన కవులు భాగవతం రచించిన బమ్మెర పోతన వాసుదాసు వాల్మీకి రామాయణం అంకితం అపర భక్తుడు మాల ఓబన్న రాముడికే అంకితం చేశారు. వావిలి కొలను సుబ్బారావు వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) తన యావదాస్తిని రాముడికి అంకితం చేశారు. వా ల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం రాశారు. 1908 అక్టోబర్ 9, 10, 11 తేదీలలో రామాయణం గ్రంథాన్ని రాముడికి అంకితం ఇచ్చారు. అక్షర హాలికుడు పోతన వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన తెలుగులో రాశారు. మహావిష్ణువును శ్రీరాముడిగా ఆదరించి తరించిన అపర భక్తుడు. భాగవతం రచన చేసి జగదభిరాముడి చరణానికి అంకితం చేశారు. ఇక్కడి నేల తల్లితో మమేకమై అక్షర సేద్యం చేసి హాలికుడిగా ఆయన ప్రత్యేకతను చాటారు. అమూల్య సాహితీ గ్రంథాలను తనకు అంకితమివ్వమని రాజులు అడిగితే అందుకు ఆయన అంగీకరించ లేదు. ఆయనది సడలని భక్తి భావం రామాలయం తూర్పు దిశలో మాలకాటిపల్లె గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన భవనాసి మాల ఓబన్న జీవిత లక్ష్యం శ్రీరామచంద్రునిపై సడలని భక్తి భావం. ఆయన అమృత కంఠంతో నిరుపమాన రామకీర్తనలు పాడారు. పగటి పూట పనులు చేసుకుని రాత్రి పూట గుడికి ఎదురుగా ఉన్న సోపానాల ముందు కూర్చుని భజన పాటలు గానం చేసేవారు. బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లేవారు. ఒక రోజు సాయంత్రం రామయ్య దర్శనం కోసం తహసీల్దార్ వచ్చారు. ఆయన రావడాన్ని ఓబన్న గమనించలేదు. ఆధ్యాత్మికంగా అనురక్తితో లీనమై గానామృతం చేస్తూనే ఉన్నారు. దారికి అడ్డు తొలగలేదని తహసీల్దార్ ఆయనను దూషించారు. అదే రాజు రాత్రి తహసీల్దార్‌కు కలలో రాముడు కనిపించి భక్తుడిపై దూకుడు ప్రదర్శన మంచిది కాదని హితబోధ చేశారట. ఆ మరుసటి రోజు అధికారి ఓబన్న చెంతకు వచ్చి పొరపాటు జరిగిందని చింతించారు. భవనాసి పట్టుదల, భక్తిభావాన్ని చూసి మెచ్చుకున్నారు. నేటి పాలకులు మాల ఓబన్న సేవలను గుర్తించలేదు. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన. -
యువకుడి ఆత్మహత్య
బి.కొత్తకోట : అనారోగ్య కారణాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బి.కొత్తకోట పోకనాటి వీధిలో జరిగింది. ఆదివారం సీఐ జీవన్ గంగానాథ్బాబు వివరాలను వెల్లడించారు. బి.కొత్తకోటలో ఎలక్ట్రీషియన్‌గా పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్న మారెడ్డి ఉదయ్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఉదయ్ మృతితో పోకనాటివీధి రామాలయంలో జరగాల్సిన శ్రీరామనవమి వేడుకలను నిలిపివేశారు. పిల్లలపై తేనెటీగల దాడి మదనపల్లె సిటీ : స్థానిక బీటీ కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతున్న యువకులపై తేనెటీగలు దాడి చేశాయి. గౌసియావీధికి చెందిన మహమ్మద్గౌస్తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. గ్రౌండ్లో ఉన్న వ్యక్తులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. అదుపు తప్పి లగేజీ వాహనం బోల్తా సిద్దవటం : మండలంలోని భాకరాపేట సమీపంలోఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ వద్ద ఆదివారం లగేజీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కడపకు చెందిన షాహీదర్బార్ హోటల్ వారికి పోరుమామిళ్లలో భోజనాల తయారీ ఆర్డర్ ఉండటంతో వారు కడప నుంచి లగేజీ వాహనంలో భోజనాలకు సంబంధించి కూరగాయలు, నూనె బియ్యం మరికొన్ని వస్తువులను వేసుకుని పోరుమామిళ్లకు బయలుదేరారు. సిద్దవటం మండలంలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ వద్దకు రాగానే లగేజీ వాహనం డ్రైవర్ వినయ్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పడంతో లగేజీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. వివాహిత ఆత్మహత్య మదనపల్లె సిటీ : కుటుంబ సమస్యల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్ కాలనీకి చెందిన మహమ్మద్అలీ భార్య సుమియా(28) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులపై ఫిర్యాదు
సుండుపల్లె : వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామపంచాయతీ వంకబిడికి గ్రామానికి చెందిన మూడే లక్ష్మీదేవికి అదే గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వరకట్నం కోసం తన భర్త తనను కొట్టి గాయపరిచి వేధిస్తున్నాడని ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ – వ్యక్తికి తీవ్ర గాయాలు చిన్నమండెం : మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో చెర్లోపల్లి రామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చెరువుముందర కురవపల్లికి చెందిన చెర్లోపల్లి రామిరెడ్డి తన ద్విచక్రవాహనానికి భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని స్వగ్రామానికి వెళ్తున్నాడన్నారు. ఈ క్రమంలో చిన్నమండెం నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో రామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు లక్ష్మీప్రసాద్రెడ్డిలు తమ వాహనాలు ఆపి క్షతగాత్రుడిని పరామర్శించి అంబులెన్స్‌కు స్వయంగా ఫోన్ చేసి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వారు సూచించారు. రెడ్డెమ్మతల్లీ..చల్లంగా చూడమ్మా గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మా..చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి మొక్కుకొన్నారు.సంతాన ప్రదాయినిగా ప్రసిద్ధిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు తలనీలాలు సమర్పించారు. భక్తులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.హిందువులతోపాటు ముస్లీంలు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం గమనార్హం. చోరీకి యత్నించిన దొంగకు దేహశుద్ధి గాలివీడు : ఓ షాపు వద్ద ఉన్న ఫ్రిడ్జ్‌ను దొంగిలించేందుకు యత్నించిన దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో గేటు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఓ దుకాణం వద్ద ఉన్న ఫ్రిడ్జ్‌ను తరలించే యత్నం చేశాడు. చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు చూసి అతన్ని తాడుతో బంధించి పోలీసులకు అప్పజెప్పారు. బీహార్, రాజస్థాన్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చామంటూ సంచరించే కొత్త వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి పెద్దమండ్యం : పెద్దమండ్యం–గుర్రంకొండ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్ఐ ఇషాక్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సత్యసాయి జిల్లా కదిరి టౌన్‌కు చెందిన షేక్ బాబా (48) ఆటోలో గుర్రంకొండకు వెళ్లి తిరిగి కదిరికి వస్తుండగా కలిచెర్ల చెరువు కట్ట వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బాబాకు ఎడమచేతికి, ఎడమ కాలికి గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం మదనపల్లెకు తరలించారు. తీవ్ర గాయాలైన బాబాను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరటి తోట దగ్ధం రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం ఉప్పరపల్లి గ్రామంలో బోటూరు సుబ్రమణ్యంకు చెందిన ఒకటిన్నర ఎకరా అరటితోట ఆదివారం దగ్ధమైంది. విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగి తోటంతా కాలిపోయింది. సుమారు రూ. 4 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మేడా విజయశేఖర్ రెడ్డి ఓవరాక్షన్
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ధ్వజారోహణం కార్యక్రమంలో మేడా విజయశేఖర్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సాఫీగా జరుగుతున్న ధ్వజారోహణం కార్యక్రమంలో ఎలాంటి ప్రొటోకాల్ గానీ, అర్హతగానీ లేకుండానే మేడా విజయశేఖర్ రెడ్డి రామాలయంలో వీఐపీలకంటే ఎక్కువ హల్చల్ చేశారన్నారు. వేదపండితులతో సమానంగా కూర్చొని మంత్రోచ్చారణ చేయడంతో ఆయన ప్రవర్తనపై భక్తులు కూడా మండిపడ్డారన్నారు. ఇందులో భాగంగానే తమ అనుచరులతో పనిగట్టుకొని వాగ్వాదానికి దిగారని ఆకేపాటి తెలిపారు. టీడీపీలో క్యాడర్ లేకుండా పార్టీ పేరు చెప్పుకుంటూ దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతాలకు గురిచేస్తున్న ఇలాంటి వ్యక్తుల కారణంగా పార్టీ మనుగడకే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహించాలన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ధ్వజం