
నీటికుంటలో పడి హిజ్రా మృతి
సంబేపల్లె : నీటికుంటలో పడి హిజ్రా శిరీష (20) ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బండకాడమాలపల్లెకు చెందిన హిజ్రా గ్రామ సమీపంలోని నీటికుంట వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి మృతిచెందారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కట్టా పుట్టాలమ్మ గుడిలో చోరీ
ఓబులవారిపల్లె : మండలంలోని మంగంపేట కట్టాపుట్టాలమ్మ గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఉదయం గుడి తెరిచి చూడగా గుడిలో బీరువా, హుండీ పగలకొట్టి చీరలు, నగదు దొంగతనానికి పాల్పడ్డారు. జాతీయ రహదారి సమీపంలో కట్టా పుట్టాలమ్మ గుడి ఉండడంతో సీసీ కెమేరాలు ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వేతనాలు విడుదల చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో కెజీబీవీ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి కోరారు. కడప సీపీఐ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 మంది మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్‌కు 11 నెలల వేతనం ఇవ్వకపోవడంతో అర్ధకాలితో అలమటిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి కేంద్రీకరించి వేతనాల విడుదలకు కృషిచేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వేతనాల విడుదలకు కృషిచేయాలని, లేకపోతే రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అజిత, మౌనిక, నాగమణి, కృష్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు.

నీటికుంటలో పడి హిజ్రా మృతి