
వైద్య కళాశాలలకు మంగళం పాడిన ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూటమి ష్ట్రప్రభుత్వం మంగళం పాడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పాడె కట్టి శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో వ్యాపారానికి పెట్టిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడంతో పాటు వైద్యవిద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తోందన్నారు. ప్రైవేటీకరించకుంటే ఆయా కళాశాలల్లో ఓపీ, మెడికల్ టెస్టులు, మందులకు ఎలాంటి ఫీజులు వసూలుచేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీ–4 పేరుతో కార్పొరేటైజేషన్, కమర్షిలైజేషన్, కమ్యూనలైజేషన్, సెంట్రలైజేషన్ అమలు చేస్తోందన్నారు. బనకచర్లకు రూ.81వేల కోట్లరూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చుపెట్టలేకపోతోందని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలో కొనసాగించేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, తీర్మానం చేసి ఆమోదం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, రెడ్డి, నరేష్, ఏఐఎస్‌ఎఫ్ మాధవ్, దేవా, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.