
పొంగుతున్న ప్రాజెక్టులు
తంబళ్లపల్లె మండలంలో బుధవారం రాత్రి కురిసిన 86.2 మి.మీ భారీ వర్షానికి ప్రాజెక్టులు నిండి మొరవ పారుతున్నాయి. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి కృషి ఫలితంగా చిన్నేరు, దబ్బలగుట్ట ప్రాజెక్టులు నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది మళ్లీ మొరవ పోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వైపు ఇరిగేషన్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని, అభివృద్ధి చర్యలు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా కాలువల నిర్మాణాలు చేయలేదు. కాలువలకు తీసుకున్న భూములకు సైతం నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూర్తయివుంటే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టులలో పలు రకాల చేపలు అభివృద్ధి చెందాయి. రెండు ప్రాజెక్టుల కట్టలపై కంపచెట్లు కమ్ముకుపోయి కట్టలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. –తంబళ్లపల్లె