
జాక్‌పాట్ పేరుతో మోసం
గుర్రంకొండ : జాక్‌పాట్ పేరుతో తమను దగా చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులకు టమాట రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట మార్కెట్ యార్డులో జరిగే అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాయచోటి మార్కెటింగ్ శాఖ ఏడీఏ త్యాగరాజు గుర్రంకొండ యార్డులో విచారణ చేపట్టారు. పలువురు రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జాక్‌పాట్ పేరుతో వందకు పది నుంచి 12 క్రీట్ల టమాటాలను బలవంతంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. దానికితోడు టమాటాలను క్రీట్‌లపై రాశులుగా పోస్తున్నారని, కమీషన్లు పది శాతం తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. వేలం పాట పాడుకొనే ధరల కంటే క్రీట్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు కోత విధిస్తున్నారని వాపోయారు. 25 కిలోల క్రీట్లకు బదులుగా 15 కిలోల క్రీట్లు మండీల్లో ఏర్పాటు చేస్తామని వ్యాపారులు చెబుతున్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు పేర్కొన్నారు. అనంతరం రైతుల వద్ద లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఏడీఏ స్వీకరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిఫురం మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్‌రెడ్డి, సిబ్బంది. రైతులు పాల్గొన్నారు.