నూరు మాసాల మాట | Sakshi Editorial On Pm Narendra Modi Mann Ki Baat | Sakshi
Sakshi News home page

నూరు మాసాల మాట

Published Tue, May 2 2023 3:16 AM | Last Updated on Tue, May 2 2023 3:16 AM

Sakshi Editorial On Pm Narendra Modi Mann Ki Baat

మాటలు మంచివే. అందులోనూ మాటల్లో మనసు పరిచి, ప్రజలతో పంచుకోవడం ప్రజాస్వామ్య లక్షణం. పాలకులకు వన్నె తెచ్చే విషయం. ప్రధాని మోదీ గడచిన తొమ్మిదేళ్ళ పాలనాకాలంలో ప్రతి నెలా రేడియో వేదికగా పంచుకున్న ‘మన్‌ కీ బాత్‌’ (ఎంకేబీ) విశిష్టమైనది అందుకే. 2014 అక్టోబర్‌ 3న మొదలైన ఈ నెలవారీ ప్రసంగాలు ఈ ఏప్రిల్‌ 30తో వరుసగా 100 నెలలు, 100 భాగాలు పూర్తి చేసుకున్నప్పుడు అదొక మహోత్సవమైంది. ఏకంగా 20 దేశాల్లో 200 చోట్ల, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా బీజేపీ ఏర్పాటు చేసిన 4 లక్షల వేదికల్లో ఈ వందో ఎపిసోడ్‌ వినే వసతులు కల్పించడమే అందుకు నిదర్శనం.

రాజ్‌భవన్లలో ఎంకేబీ శతమాసోత్సవాన్ని ఆహ్వానితుల ముంగిట సంబరంగా చేసుకోవడం కనివిని ఎరుగని ఘట్టం. ఇది కోట్లాది భారతీయుల మనో వాణి అని అధికార పక్షం అంటుంటే, ప్రజాసమస్యలపై మోదీ మౌనం వహిస్తున్నందున ఇది వట్టి ‘మౌన్‌ కీ బాత్‌’ అని ప్రతిపక్షాల విమర్శ. అసలు నిజం ఈ రెంటికీ మధ్య ఉందనేది విశ్లేషణ. 

రాజకీయ రంగస్థలిపై ప్రత్యర్థుల్ని చిత్తుచేసే పాత్రలో పేరు తెచ్చుకున్న మోదీ తెలివిగా ఎంకేబీని జనంతో సంభాషణగానే మొదటి నుంచి మలిచారు. ‘స్వచ్ఛ భారత్‌’, ‘హర్‌ ఘర్‌ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ లాంటి ఉద్యమాలను ఈ ప్రసంగాలతో ముందుకు నడిపారు. ఉన్నత లక్ష్యాలకు అంకితమైన ఉదాత్త పాలన, పాలకుడనే భావన కలిగించడంలో కృతకృత్యులయ్యారు. ఇది తొమ్మిదేళ్ళుగా ఆయన పెంచుకున్న పెట్టుబడి.

పైకి రాజకీయ ప్రస్తావనలేమీ లేకుండానే సాగినా ఈ ప్రసంగ పరంపర ఇప్పుడు చేసుకున్న శతమాసోత్సవ ప్రచార పటాటోపంలో మాత్రం అస్సలు రాజకీయాలు లేవని అనలేం. వంద రూపాయల ప్రత్యేక నాణెం, సమాచార ప్రసారశాఖ సంపాదకీయ వ్యాఖ్యలు, ఎంకేబీ వింటున్న మంత్రుల ఫోటోలు – ఇలా దేశమంతా ఓ సంరంభం.

తిరుగులేని నాయకుడి మనోధర్మ వాణి ఆసరాగా, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్న కమలనాథుల ఆశ అర్థం చేసుకోదగినదే. అధికారంలో ఎవరున్నా కాస్త హెచ్చుతగ్గులుగా ఇది చేసే పనే. అదే సమయంలో ఈ ప్రసంగ పరంపరతో సమాజంలో సానుకూల ఫలితాలే లేవనుకోవడమూ తప్పే. 

ఎంకేబీలో ప్రస్తావించిన అనేక అంశాలు, సామాన్యుల విజయగాథలు శ్రోతలకు విజ్ఞానాన్నీ, విశేషంగా స్ఫూర్తినీ అందించాయి. నెలకోసారి అలాంటి అంశాలనూ, వ్యక్తులనూ ఎంపిక చేయడా నికి ప్రభుత్వ శాఖలు, పార్టీ యంత్రాగం ఎంతటి శ్రమ, క్షేత్రపరిశీలన చేస్తున్నాయో ఊహించవచ్చు. నిజానికి, వార్తల నుంచి వ్యవసాయ సలహాల దాకా అన్నిటికీ రేడియోనే ఆధారమై, రచ్చబండ వద్ద ఊరంతా రేడియోల ముందు పోగైన రోజుల నుంచి ఇవాళ సమాజం చాలా మారింది.

దూరదర్శన్, ప్రైవేట్‌ కేబుల్‌ టీవీలు, శాటిలైట్‌ టీవీ ఛానల్స్, ఇప్పుడు ఓటీటీ దాకా కొత్త వేదికలతో 1990ల నుంచి రేడియో ప్రాచుర్యం తగ్గుతూ వచ్చింది. అలాంటి వేళ 2014లో మోదీ రేడియో మాధ్యమాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంతో పాటు ఫలితంపై అనుమానాలూ పెంచింది. కానీ, 501 ప్రసార కేంద్రాలతో, 23 భాషల్లో కార్యక్రమాలతో దేశంలో భౌగోళికంగా 90 శాతాన్నీ, జనాభాలో 98 శాతాన్నీ చేరుతున్న రేడియోను బలంగా వినియోగించుకున్నారు.

గ్రామీణ, దిగువ మధ్యతరగతి జనానికి దగ్గరవుతూ, వారిదైన భాషలో మోదీ సమాచార ప్రసారం చేయగలిగారు. లేఖలతో వారినీ ఇందులో భాగస్వా ముల్ని చేశారు. వెరసి, ఎంకేబీని కీలక ప్రసార, ప్రచారోద్యమంగా మలుచుకున్నారు.  

ఇది కేవలం బీజేపీ కార్యకర్తలు వినే కార్యక్రమమని విమర్శలు వచ్చాయి. కానీ, ఎంకేబీలోని అంశాలతో సామాన్య జనం మమేకమయ్యేలా, ఆకాశవాణి, దూరదర్శన్‌ సహా ప్రైవేట్‌ టీవీ ఛానళ్ళలో, మర్నాటి పత్రికల్లో అవి ప్రధాన వార్తలుగా మారేలా తీర్చిదిద్దిన రూపకర్తల దూరదృష్టినీ, వ్యూహ చతురతనూ కొట్టిపారేయలేం. ఇంటి పెద్ద మిగతా కుటుంబ సభ్యులతో తన భావాలు పంచుకుంటున్న పద్ధతిలో సాగడం ఎంకెబీ విజయసూత్రం.

ప్రసారభారతి సీఈఓ విడుదల చేసిన ఐఐఎం–రోహ్‌ తక్‌ తాజా నివేదిక 10 వేల మందిని సర్వే చేసి, ఇప్పటికి 100 కోట్ల మంది ఈ కార్యక్రమం విన్నారని పేర్కొంది. 96 శాతానికి ఎంకేబీ గురించి తెలుసనీ, 23 కోట్ల మంది క్రమం తప్పక వింటున్నారనీ తెలిపింది.

సదరు ఐఐఎం డైరెక్టర్‌ వివాదచరిత అటుంచితే, ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలున్న సీఎస్‌డీఎస్‌ సంస్థ నిరుడు నవంబర్‌లో విడుదల చేసిన నివేదిక మాత్రం దేశంలో అయిదింట మూడొంతులు ఎన్నడూ ఎంకేబీ వినలేదంటోంది. లెక్కలెలా ఉన్నా... సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి సైతం వదలకుండా ప్రతి నెలా ఎంకెబీ వింటానన్నారు. ఇలాంటి వీరవిధేయ శ్రోతలు తక్కువేమీ కాదు.  

మోదీ ‘ఆధ్యాత్మిక ప్రయాణం’గా పేర్కొన్న ఈ కార్యక్రమం ఎంతగా ప్రభుత్వ అండ ఉన్నా,ఇంతకాలం శ్రోతల ఆసక్తిని నిలబెట్టుకోవడం విశేషమే. రేడియో పునర్వైభవానికీ తోడ్పడుతున్న ఈ ప్రసార ఉద్యమం అక్కడి కన్నా ఆన్‌లైన్‌లో, టీవీలో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. దేశంలో పెరిగిన డిజిటలీకరణకు కొండగుర్తుగా నిలుస్తోంది. ప్రజల మనసుకు దగ్గరైన అంశాలతో, ‘బేటీ బచావో బేటీ పఢావో’ లాంటి నినాదాలతో మోదీ మంత్రముగ్ధం చేస్తున్నారు.

ఇప్పటి దాకా ఒక్కసారైనా పూర్తిస్థాయి విలేఖరుల సమావేశం జరపని తొలి భారత ప్రధాని అన్న విమర్శలకు వెరవకుండా నిత్యం జనంలో ఉంటూ, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కమ్యూనికేషన్‌ కింగ్‌ అనిపించుకున్నారు. ఎంకేబీతో కొత్త వాతావరణం సృష్టించారు. మనోవాణిని తెలపడం మంచిదైనా, ఏకపాత్రాభినయ స్వగతం కన్నా స్వేచ్ఛాయుత మీడియా సంభాషణలు ప్రజాస్వామ్యానికి మరింత మేలు. మౌనం కన్నా మాట ప్రభావమే ఎక్కువని ‘మౌన్‌ కీ బాత్‌’ శతమాసోత్సవం సైతం నిరూపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement