Social Media News
-
సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇదేందిది అనిపించిన వంటకాలు!
2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్‌గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.చాక్లెట్ పాస్తాఇన్స్టాగ్రామ్లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.చాక్లెట్ గ్రీన్ పీస్ఇన్స్టాగ్రామ్లో ఫుడ్మేకేస్కల్హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్‌ను మైక్రోవేవ్ బౌల్లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్‌లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.మటన్ కీమా కేక్ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్‌స్కాచ్ వంటి కేక్‌లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్‌ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్‌ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్‌పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్క్రీమ్తో పాటు మటన్ మిన్స్‌ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.గుడ్డు హల్వాసోషల్ మీడియాలో హల్చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్‌పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.గులాబ్ జామున్ చాట్చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది: కుటుంబ సభ్యులు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం: Govardhanreddy
-
YS Jagan: గోరుముద్ద అటకెక్కింది...అమ్మ ఒడి గాలికెగిరింది
-
YSRCP సోషల్ మీడియా సైన్యానికి అంబటి భరోసా
-
తాడేపల్లిలో నాగిరెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
సోషల్ మీడియా కార్యకర్తలకు YSRCP ໑໐໕ జగన్ కీలక ఆదేశాలు
-
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్‌ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్‌ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..ఇన్‌స్టాగ్రామ్‌లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.ఈ కూలర్‌ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్‌తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్‌ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Sharp Fact Mind (@sharpfactmind) -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్‌స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్‌లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్‌పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్‌ను కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్‌కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ దరాబ్‌జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్‌కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్‌లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్!
ఖమ్మం: వ్యవసాయ క్షేత్రంలో బోరు బావి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయడానికి దమ్మపేట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు చేసిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మండలంలోని మందలపల్లికి చెందిన మడిపల్లి వెంకటేశ్వరరావు మల్లారంలోని మట్టా ధనదుర్గకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో పాత బోరు బావి ఉండగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు ఆర్ఐ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్‌ఐకు ఇరవై రోజుల కిందట వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు అంత డబ్బు ఇవ్వలేనని బదులివ్వగా రూ.6 వేలైనా ఇవ్వాలని సూచించాడు. ఇదంతా ఫోన్లో రికార్డు చేయడంతోపాటు వీడియో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం ఆర్ఐ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఆడియో, వీడియోలు తొలగించాలని కోరాడు. ఈ విషయమై ఆర్ఐని వివరణ కోరగా వాయిస్ రికార్డు చేస్తారని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందంటూ బదులివ్వడం గమనార్హం. ఇక తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ మాట్లాడుతూ ఆర్ఐ డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసిందని, రైతు నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇవి చదవండి: వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక! -
అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్బీఐ
రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్బీఐ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది. -
‘ట్రోలింగ్’ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు. పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్‌లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్‌లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్ మీడి యా టీమ్‌లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు నేతలను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
'స్మార్ట్‌గా సోషల్ వార్..' రాజకీయ పార్టీల ప్రచారం..!
సాక్షి, నిజామాబాద్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్మార్ట్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ప్రజల నుంచి సైతం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ఆసక్తి కనిపించడం విశేషం. దీంతో గతానికి భిన్నంగా విచ్చలవిడిగా కరపత్రాలు పంచడం, ప్రెస్మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు తగ్గించారు. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ అపరిమితంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డుల వారీగా, కులాలు, సంఘాల వారీగా, యువజన సంఘాల పేరిట ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం చేసినా ఆయా ప్రచారం అన్ని గ్రూపుల్లో వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఫేస్బుక్ లైవ్‌లు, యూట్యూబ్ లైవ్‌లు సైతం పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం చేస్తూనే స్థానిక అంశాలనూ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. కరపత్రాలను పరిమిత సంఖ్యలో ముద్రించి, వాటిని పీడీఎఫ్ ఫైల్ తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీగా వైరల్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లకు సైతం మరింత ప్రాధాన్యత పెరగడం గమనార్హం. వ్యక్తుల వాట్సాప్ స్టేటస్‌లను బట్టి సదరు వ్యక్తి ఆలోచనలను అంచనా వేసుకుంటూ అందుకు అనుగుణంగా అలాంటి వ్యక్తులను కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 'కొందరు యువకులు మాత్రం జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఫల్యాలు, అపరిష్కృత సమస్యలు, పోటీ పరీక్షల విషయమై ప్రభుత్వం వైఫల్యాలు, పేపర్ లీక్‌లు తదితర అంశాలను వైరల్ చేస్తుండగా, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నందిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ధ్వంసమైన రోడ్ల గురించి ఎమ్మెల్యేను విమర్శిస్తూ సైటెరికల్‌గా చేసిన వీడియో వైరల్ అయింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆర్మూర్‌కు చెందిన యువకులు చేసిన వీడియోలు బాగా వైరల్అయ్యాయి. ఇలా సోషల్ వార్ మరింత విస్తరిస్తోంది.' -
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్‌టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్‌మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్‌పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్‌లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్‌ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్‌కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆర్థిక కష్టాలతో ట్విటర్‌ను గట్టెక్కించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ నుంచి ట్విటర్ బాస్‌గా మస్క్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నాటి నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు సుమారు 500 కంపెనీలు ట్విటర్‌కు ఇచ్చే యాడ్స్‌ను నిలిపివేసినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ఆఫీస్ 1,36,250 డాలర్ల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. శాలరీ పెంచాలని డిమాండ్ చేసిన పారిశుధ్య కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆఫీస్‌ను శుభ్రం చేయకపోవడంతో వాష్ రూమ్‌ల నుంచి వెదజల్లుతున్న కంపు భరించలేమంటూ ట్విటర్ ఉద్యోగులు వాపోయినట్లు న్యూయార్స్ టైమ్స్ హైలెట్ చేసింది ఈ తరుణంలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు. తాజాగా, ట్విటర్ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ట్విటర్లో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తుంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ యాడ్స్ ఇకపై కనిపించవు. ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ ఆదాయం పెరగవచ్చనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. -
బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt — ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022