సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్. చిత్రంలో దత్తాత్రేయ, మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి 20 ఏళ్ల సమగ్ర ప్రణాళికను రూపొందించి దానినే బీజేపీ మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా మేనిఫెస్టోను రూపొందించడంతో పాటుగా నియోజకవర్గ స్థాయి సమస్యలపైనా ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో విద్యా, వైద్యం, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ప్రజల అవసరాలు–బీజేపీ ఆవశ్యకత, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలన, మజ్లిస్‌తో ఆ పార్టీల దోస్తీ తదితర అంశాలను కూడా ప్రస్తావించనుంది.
దీనిని రూపొందించే పనిలో భాగంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. రైతులకు ఉచిత బోరు, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు, రైతు రుణాల వడ్డీని ప్రభుత్వమే భరించేలా చర్యలు, పంటలపై ఎంఎస్‌పీకి అదనంగా బోనస్ ఇవ్వడం, నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాల పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ఇందులో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా దీనిని రూపొందించి ప్రజల్లోకి తేవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తాజామాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వైకుంఠం, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా సభ తరువాత ప్రకంపనలే: లక్ష్మణ్
అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా మేనిఫె స్టోను రూపొందిస్తున్నామని ఇది విజనరీ డాక్యుమెంట్‌లా ఉంటుందని లక్ష్మణ్ వెల్లడించారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో అమిత్‌షా సమావేశం అనంతరం ఇతర పార్టీల్లో ప్రకంపనలు పుట్టించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులు తమపార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment