వ్యక్తీకరణ | On Mamata Banerjee Priyanka Sharma created Mim | Sakshi
Sakshi News home page

వ్యక్తీకరణ

Published Mon, May 20 2019 1:09 AM | Last Updated on Mon, May 20 2019 1:09 AM

On Mamata Banerjee Priyanka Sharma created Mim - Sakshi

‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని. స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతా బెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్‌ చేసిన మీమ్‌.

మాధవ్‌ శింగరాజు
ప్రియాంక చోప్రా, ప్రియాంక గాంధీ.. వీళ్లలా ప్రియాంక శర్మ పెద్ద పేరున్న వ్యక్తి కాదు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక ‘మీమ్‌’ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి, షేర్‌ చేసిందన్న ఆరోపణపై ఈ నెల పదవ తేదీన దాస్‌నగర్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశాక కానీ.. ప్రియాంక శర్మ అనే ఒకరు బీజేపీ యువ మోర్చాలో కార్యకర్తగా ఉన్నారన్న సంగతి దేశానికి తెలియరాలేదు. మే ఆరున న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్‌ గాలా’ ఫ్యాషన్‌ ప్రదర్శనలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా విచిత్ర వేషధారణలో కనిపించారు. ఆ వేషాన్ని ప్రియాంక శర్మ మమతకు వేసి, ఆ ఫొటోను నెట్‌లో పెట్టడమే పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి కారణం. ఆమెను తక్షణం బెయిలు మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు గత మంగళవారం ఆదేశించింది.

ఆ సందర్భంలోనే కోర్టు ఒక వ్యాఖ్య కూడా చేసింది. మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకూడదని. అంతేకాదు, మమతకు క్షమాపణ చెప్పాలని కూడా ప్రియాంక శర్మకు ఆదేశించింది. అయితే తనేం క్షమాపణ చెప్పబోవడం లేదని జైలు నుంచి బయటికి వచ్చీరాగానే పెట్టిన ప్రెస్‌ మీట్‌లో ప్రియాంక ప్రకటించారు! మొత్తం ఐదు రోజులు జైల్లో ఉన్నారు ప్రియాంక. ఈ ఐదు రోజులూ జైలు అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని, కనీసం తాగడానికి కూడా నీళ్లివ్వకుండా ప్రతిరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారనీ ఆరోపించారు. అయితే ఇదంతా కూడా ప్రియాంక కోరి తెచ్చుకున్నదే.ఏదైనా ఒక సామాజిక మార్పును ఆశించిగానీ, ప్రజల్లో ఏదైనా ఒక ప్రగతిశీల ఆలోచనను రేకెత్తించేందుకు గానీ మమత ఫొటోను ఆమె మార్ఫింగ్‌ చేయలేదు.

రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా కించపరచడానికి.. ఏమీ తోచక చేసిన పని మాత్రమే అది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్‌ లీడర్స్‌ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్‌ల కన్నా తక్కువైనదేమీ కాదు ఈ మార్ఫింగ్‌ మీమ్‌. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! స్త్రీని స్త్రీ పరిహసించడంలో అసాధారణత ఏమీ లేదనుకున్నా.. మమత సాధారణమైన వ్యక్తేం కాదు. పోరాట పటిమగల రాజనీతిజ్ఞురాలు. ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేయడం  పిల్ల చేష్ట కూడా కాదు. పని లేని చేష్ట.మమతను సాటి మహిళగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ప్రియాంక శర్మ చూసినప్పటికీ.. ప్రియాంకను బీజేపీ యూత్‌ లీడర్‌లా కాకుండా సాటి మహిళగా మమత చూశారని.. 2012 నాటి పాత కేసునొకదాన్ని గుర్తు చేసుకుంటే.. పోలిక తెలుస్తుంది.

అదీ ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ కేసే. మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది.. ఆమెను, రైల్వే మంత్రి ముకుల్‌ రాయ్‌ని, మాజీ రైల్వే మంత్రి దినేశ్‌ త్రివేదీలను కలిపి కార్టూన్‌గా వేసి, ఆ కార్టూన్‌ని ఈ–మెయిల్‌గా పార్వర్డ్‌ చేసిన జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ అంబికేశ్‌ మహాపాత్ర పైన, ఆ  ఈ–మెయిల్‌ను అందుకున్న సుబ్రతాసేన్‌ గుప్తా అనే ఆయనపైన రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పరువునష్టం కేసు. ఇంకోటి ఒక స్త్రీ శీలప్రతిష్టకు భంగం కలిగించిన కేసు. ఈ రెండు కేసులూ ఇప్పటికీ నడుస్తున్నాయి! బెయిల్‌ మీద ఉన్న మహాపాత్ర నేటికీ విచారణకు హాజరవుతున్నారు. సుబ్రతా సేన్‌గుప్తా గతవారమే తన 79 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రియాంక శర్మ పోస్ట్‌ చేసిన మీమ్‌తో పోలిస్తే, అప్పట్లో మహాపాత్ర ఫార్వర్డ్‌ చేసిన కార్టూన్‌ ఎంతో అర్థవంతమైనది.

శుభ్రమైన ఒక పొలిటికల్‌ సెటైర్‌.  అయినప్పటికీ ‘గౌరవనీయులపై చేసిన ఆక్షేపణీయమైన వ్యాఖ్య’గా పరిగణించి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రైల్వే మంత్రిగా ఉన్న దినేశ్‌ని తప్పించి, ఆ పదవిని మమత.. ముకుల్‌కి ఇప్పించారని మహాపాత్ర కార్టూన్‌ వేశారు. మమత ముకుల్‌తో అంటున్నట్లుగా ఉన్న ఆ కార్టూన్‌లోని కామెంట్‌లను 1974 నాటి సత్యజిత్‌ రే మిస్టరీ మూవీ ‘సోనా కెల్లా’లోని డైలాగులతో మహాపాత్ర సంకేతపరిచారు. ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ప్రియాంక విషయంలో మమత మరీ అంతగా గట్టిగా ఉండకపోవచ్చు.సెటైర్‌కి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ప్రభుత్వం ఒకలా స్పందిస్తుంది. తీవ్రవాదులు ఒకలా స్పందిస్తారు. అసలు ఏ విధంగానూ స్పందించకుండా ఇగ్నోర్‌ చేసేవారూ ఉంటారు. గత ఏడాది ఆరంభంలో కశ్మీర్‌లో జరిగిన ఒక అత్యాచార ఘటనతో లింక్‌ చేస్తూ సీతమ్మవారిని సీన్‌లోకి తెచ్చి ఆమె చేత రామభక్తులపై కామెంట్‌ చేయించిన కార్టూన్‌ ఒకటి హైదరాబాద్‌ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అయింది.

దాన్నెవరూ పట్టించుకోలేదు. జైల్లో పడేయడం కన్నా పెద్ద శిక్ష ఇగ్నోర్‌ చేసి పడేయడం. ఫ్రీడమ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేయాలనుకునేవారు ఒక్క హైదరాబాద్‌లోనే, ఒక్క బెంగుళూరులోనే, ఒక్క పశ్చిమబెంగాల్‌లోనే ఉండరు. ఫ్రాన్స్‌లోనూ ఉంటారు. అక్కడొక పెద్ద గుంపే ఉంది. ఆ గుంపు ఒక పత్రికనే నడుపుతోంది. ఆ పత్రిక పేరు ‘చార్లీ హెబ్డో’. వ్యంగ్య రచనల వారపత్రిక.గవర్నమెంటు మీద కార్టూన్లు వేసినన్నాళ్లూ ఏమీ కాలేదు కానీ.. ఒక మతం మీద సెటైర్‌లు వేసినందుకు ఆ పత్రిక ముఖ్య సంపాదకుడిని, ముగ్గురు కార్టూనిస్టులను పత్రికా కార్యాలయంలోకి వెళ్లి మరీ కాల్చి చంపారు తీవ్రవాదులు.2015లో జరిగింది ఈ ఘటన.  

ప్రజల్లో ఇస్లాం ఫోబియాను కలిగించే విధంగా ఫ్రెంచ్‌ రచయిత మిషెల్‌ వెల్బెక్‌ రాసిన వివాదాస్పద వ్యంగ్య నవల ‘సబ్‌మిషన్‌’ (ఆ ఘటనకు రెండ్రోజుల క్రితమే మార్కెట్‌లోకి వచ్చింది) లోని అంశాలపై వెల్బెక్‌ని సమర్థిస్తూ సెటైర్‌లు ఉన్నాయి.ఆ సెటైర్‌లే తీవ్రవాదులకు ఆగ్రహం తెప్పించాయి.‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని.స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతాబెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్‌ చేసిన మీమ్‌. జైల్లో తననెంతో మానసిక క్షోభకు గురిచేశారని అంటున్న ప్రియాంకకు.. తన చేష్ట ద్వారా మమతను అభిమానించేవాళ్లను తను ఎంతటి క్షోభకు గురి చేసి ఉంటుందోనన్న ఆలోచన వచ్చి ఉంటుందా? కేసు జూలైకి వాయిదా పడింది. ఆలోపు వస్తుందేమో మరి.. ఆలోచన!         

ప్రియాంక శర్మ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్‌ లీడర్స్‌ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్‌ల కన్నా తక్కువైనదేమీ కాదు ప్రియాంక శర్మ మార్ఫింగ్‌ మీమ్‌. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం!


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement