లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు పొత్తు రాజకీయాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఎస్పీలతో పొత్తు ఉండదని ముందే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్వర్యంలో ఏర్పడబోయే రాజకీయ కూటమిలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం అఖిలేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.
(చదవండి: యూపీలో ‘పొత్తు’ పొడుపులు!)
ఝాన్సీలో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దీదీకి సాదర స్వాగతం పలుకుతున్నాను. బెంగాల్‌లో ఆమె ఏవిధంగా బీజేపీని తుడిచిపెట్టిందో.. అలానే యూపీ ప్రజలు ఇక్కడ బీజేపీని తుడిచి పెట్టాలి’’ అని పిలుపునిచ్చారు. మమతతో జట్టు కట్టడం గురించి ప్రశ్నించగా.. సరైన సమయంలో దాని గురించి మాట్లాడతాను అన్నారు.
(చదవండి: ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ సీట్ల చర్చ)
అలానే కాంగ్రెస్‌పార్టీపై ఘాటు విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్. ముఖ్యంగా ప్రియాంక గాంధీ చేస్తోన్న విమర్శల్ని ఈ వేదిక మీదుగా తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘జనాలు వారిని(కాంగ్రెస్ పార్టీ) తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో వారు సున్నా సీట్లు సాధిస్తారు’’ అని ఎద్దేవా చేశారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే ఇరువురికి ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అఖిలేష్ ‘ఇంద్రధనస్సు’ కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అనగా కాంగ్రెస్, బీఎస్పీ మినహా మిగతా అన్ని పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక అఖిలేష్, దీదీతో జట్టు కట్టి.. దేశ రాజకీయాల్లో నుంచి కాంగ్రెస్‌ను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ, ఎస్పీ ఒకరికొకరు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: యూపీ పీఠం మళ్లీ బీజేపీదే
Comments
Please login to add a commentAdd a comment