లక్నో: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంకును దెబ్బతీయడానికి తాము ఉత్తరప్రదేశ్‌లోని పలుచోట్ల బలహీన అభ్యర్ధులను బరిలోకి దింపామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలను ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కొట్టిపారేశారు. బలహీన అభ్యర్థుల్ని బరిలోకి దింపామన్న ప్రియాంక వాదనను తాము నమ్మబోమని ఆయన తేల్చిచెప్పారు. ఏ పార్టీ కూడా బలహీన అభ్యర్థులను పోటీకి దింపబోదని, వారి వద్ద ప్రజాబలం లేనందునే ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమి కాంగ్రెస్ బీ-టీమ్ అంటూ వస్తున్న విశ్లేషణలను కూడా ఆయన ఖండించారు. కాంగ్రెస్- బీజేపీ రెండూ ఒక్కటేనని, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్షాల మీద ఉసిగొలిపే ప్రక్రియకు మొదట తెరలేపిందెవరని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిని బీజేపీ కంట్రోల్ చేస్తుందన్న రాహుల్‌గాంధీ విమర్శలను కూడా ఆయన కొట్టిపారేశారు. తమను ఎవరు నియంత్రించడం లేదని, యూపీలో అధికార బీజేపీని గట్టి దెబ్బతీసేందుకే తాము కూటమిగా చేతులు కలిపామని ఆయన తెలిపారు. తదుపరి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచే వస్తారని అఖిలేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అది ములాయం సింగేనా అంటే.. ఫలితాలు వచ్చాక పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, నేతాజీకి ప్రధాని గౌరవం లభించడం కంటే ఆనందం తనకేమీ ఉండదని, అయితే, ములాయం ప్రధాని రేసులో ఉన్నారని వ్యక్తిగతంగా తాను భావించడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment