సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు చిటపటలాడుతున్నట్లు కనిపిస్తారు. ఆమెకు ముక్కు మీద కోపం అని సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఆమెకు ఇప్పుడు ఎన్నికల వేడి, అటు ఎండ వేడి తోడైందంటే ఆమె కోపం కాస్త ప్రచండమై ఎంతటి వారినైనా దుమ్ము దులుపుతారనడంలో సందేహం లేదు. సరదా కోసమో, రాజకీయ దురుద్దేశంతోనోగానీ బీజేపీ నాయకుడు ప్రియాంక శర్మ శుక్రవారం మార్ఫింగ్ చేసిన మమతా బెనర్జీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతవారం న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గలా’ ఫ్యాషన్ షోలో విచిత్ర దుస్తులు ధరించి కెమేరాల ముందు ఫోజులిచ్చిన బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా ఫొటోలో ముఖాన్ని మమతా బెనర్జీ ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమతా బెనర్జీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో బీజేపీ నేత ప్రియాంక శర్మపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్ (పరువు నష్టం), 66 ఏ సెక్షన్ (అభ్యంతరకరం), 67ఏ సెక్షన్ (అసభ్యకరం) కింద కేసులు నమోదు చేశారు. ఆ మధ్య అంటే, ఫిబ్రవరి నెలలో బెంగాల్ రాజకీయాలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘భోబిష్యోతర్ బూత్’ విడుదలైంది. దాని గురించి తెలిసి మమతా బెనర్జీ కన్నెర్ర చేశారు. అంతే విడుదలయిన మరుసటి రోజే అన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా అదృశ్యమైంది. దాంతో ఆ సినిమా నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అరికడతారా? అంటూ మమతా బెనర్జీకి చీవాట్లు పెట్టిన కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 20 లక్షలు మమతా మంత్రివర్గం నుంచి ఓ లక్ష రూపాయలను నిర్మాతకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది.
2013లో మమతా బెనర్జీ నాయకత్వాన రైతులు జరిపిన ఆందోళన కారణంగా టాటా మోటార్ కంపెనీ బెంగాల్ నుంచి నిష్క్రమించిన విషయం తెల్సిందే. ఆ పరిణామంపై వ్యంగోక్తులు ఉన్నాయన్న కారణంగా ‘కంగల్ మల్సాత్’ అనే సినిమాను కూడా నాడు మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించింది. అంతుముందు 2012లో ఆమె ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింల దుస్థితిపై ఐపీఎస్ అధికారి నజ్రుల్ ఇస్లాం రాసిన ‘ముసల్‌మాండర్‌కీ కరనియా’ పుస్తకాన్ని నిషేధించింది. మమతా బెనర్జీ అసహనం సినిమాలకు, పుస్తకాలకు, కళలకే పరిమితం కాలేదు. రోజువారి రాజకీయాల్లోనూ ఆమె అసహనం కనిపిస్తోంది.
2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అది స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థులను నామినేషన్ వేసేందుకు తృణమూల్ పార్టీ కార్యకర్తలు అనుమతించక పోవడం వల్ల నాటి ఎన్నికల్లో 34 శాతం మంది తృణమూల్ సర్పంచ్‌లు పోటీ లేకుండా విజయం సాధించారు. ‘పొరిబొర్తన్ (పరివర్తన)’ నినాదం ద్వారా 34 ఏళ్ల సీపీఎం పాలనకు చరమ గీతం పాడుతూ 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అసమ్మతిని అణచివేయడంలో మాత్రం ఆమె ‘పరివర్తన’ కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment