intolarence
-
మమతకు కోపం వస్తే అంతేమరి!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు చిటపటలాడుతున్నట్లు కనిపిస్తారు. ఆమెకు ముక్కు మీద కోపం అని సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఆమెకు ఇప్పుడు ఎన్నికల వేడి, అటు ఎండ వేడి తోడైందంటే ఆమె కోపం కాస్త ప్రచండమై ఎంతటి వారినైనా దుమ్ము దులుపుతారనడంలో సందేహం లేదు. సరదా కోసమో, రాజకీయ దురుద్దేశంతోనోగానీ బీజేపీ నాయకుడు ప్రియాంక శర్మ శుక్రవారం మార్ఫింగ్ చేసిన మమతా బెనర్జీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతవారం న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గలా’ ఫ్యాషన్ షోలో విచిత్ర దుస్తులు ధరించి కెమేరాల ముందు ఫోజులిచ్చిన బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా ఫొటోలో ముఖాన్ని మమతా బెనర్జీ ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మమతా బెనర్జీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ నేత ప్రియాంక శర్మపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్ (పరువు నష్టం), 66 ఏ సెక్షన్ (అభ్యంతరకరం), 67ఏ సెక్షన్ (అసభ్యకరం) కింద కేసులు నమోదు చేశారు. ఆ మధ్య అంటే, ఫిబ్రవరి నెలలో బెంగాల్ రాజకీయాలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘భోబిష్యోతర్ బూత్’ విడుదలైంది. దాని గురించి తెలిసి మమతా బెనర్జీ కన్నెర్ర చేశారు. అంతే విడుదలయిన మరుసటి రోజే అన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా అదృశ్యమైంది. దాంతో ఆ సినిమా నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అరికడతారా? అంటూ మమతా బెనర్జీకి చీవాట్లు పెట్టిన కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 20 లక్షలు మమతా మంత్రివర్గం నుంచి ఓ లక్ష రూపాయలను నిర్మాతకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది. 2013లో మమతా బెనర్జీ నాయకత్వాన రైతులు జరిపిన ఆందోళన కారణంగా టాటా మోటార్ కంపెనీ బెంగాల్ నుంచి నిష్క్రమించిన విషయం తెల్సిందే. ఆ పరిణామంపై వ్యంగోక్తులు ఉన్నాయన్న కారణంగా ‘కంగల్ మల్సాత్’ అనే సినిమాను కూడా నాడు మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధించింది. అంతుముందు 2012లో ఆమె ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లింల దుస్థితిపై ఐపీఎస్ అధికారి నజ్రుల్ ఇస్లాం రాసిన ‘ముసల్మాండర్కీ కరనియా’ పుస్తకాన్ని నిషేధించింది. మమతా బెనర్జీ అసహనం సినిమాలకు, పుస్తకాలకు, కళలకే పరిమితం కాలేదు. రోజువారి రాజకీయాల్లోనూ ఆమె అసహనం కనిపిస్తోంది. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అది స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థులను నామినేషన్ వేసేందుకు తృణమూల్ పార్టీ కార్యకర్తలు అనుమతించక పోవడం వల్ల నాటి ఎన్నికల్లో 34 శాతం మంది తృణమూల్ సర్పంచ్‌లు పోటీ లేకుండా విజయం సాధించారు. ‘పొరిబొర్తన్ (పరివర్తన)’ నినాదం ద్వారా 34 ఏళ్ల సీపీఎం పాలనకు చరమ గీతం పాడుతూ 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అసమ్మతిని అణచివేయడంలో మాత్రం ఆమె ‘పరివర్తన’ కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఆ నటుడికి బుద్ధి చెప్పారు
ఆమిర్‌పై పరీకర్ పరోక్ష వ్యాఖ్య న్యూఢిల్లీ: ‘దేశం విడిచి వెళ్లాలనుకున్నాం’ అన్న నటుడికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘దేశం గురించి చెడుగా చెప్పడానికి ఎవరైనా ఎలా సాహసిస్తారు? దేశం విడిచివెళ్లిపోవాలని భార్య కిరణ్‌రావు తనతో చర్చించినట్లు ఆమిర్ మీడియాతో చెప్పారు. ఆ తర్వాత ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆన్లైన్ సంస్థకు ప్రజలు దూరంగా జరిగార’ని పరీకర్ వ్యాఖ్యానించారు. పరీకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది. దళితులు, మైనారిటీలు, రచయితలు, నటులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఆరెస్సెస్‌లు దాడులు చేస్తున్నాయంది. ‘విద్వేషమనేది పిరికివాడి పని అని. ఇది ఎన్నటికీ విజయం సాధించదు. ఇది మీకు గుణపాఠం అవుతుంది’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై పరీకర్ వివరణ ఇస్తూ తాను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. -
అవధులు దాటిన అసహనం
త్రికాలమ్ అసమ్మతిని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను పలక రించడానికి వెళ్ళేవారిని రాజమండ్రి విమా నాశ్రయంలోనే అరెస్టు చేయడం, నిరాహార దీక్ష దృశ్యాలను చూపించే సాక్షి టీవీని ఆపు చేయవలసిందిగా ఎంఎస్వోలపైన అక్రమంగా ఒత్తిడి తీసుకురావడం రాష్ట్రంలో నిరంకుశ ధోరణి ప్రబలుతున్నదనడానికి నిదర్శనం. ముద్రగడ దీక్ష విరమించే వరకూ సాక్షి చానెల్‌ను ఆపుచేస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముద్రగడ పద్మనాభం కొరకరాని కొయ్యగా పరిణమించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాన్ని అమలు పరచాలని కోరుతూ ముద్రగడ జనవరి 31న ఉద్యమం ప్రారంభించిన రోజు తుని స్టేషన్లో రైలును దుండగులు కాల్చివేసిన దుర్ఘటనను కూడా రాజకీయంగా వినియోగించు కోవాలని చూడటం దారుణం. గంటలకొద్దీ తగలబడుతున్న రైలు దగ్గరికి పోలీసులు కానీ, అగ్నిమాపకదళం కానీ వెళ్ళలేదు. మంటలు ఆర్పే ప్రయత్నం జరగనేలేదు. అది ప్రభుత్వ వైఫల్యమో, ఎత్తుగడో తెలియదు. రైలు తగలబడు తుండగానే ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టి, ‘నేర స్వభావం కలిగిన ప్రతిపక్ష నాయకుడే ఈ పని చేయించాడు. కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన రౌడీమూకలు రైలు తగులబెట్టారు’ అంటూ భయంకరమైన నిందా రోపణ చేశారు. నిరాధారమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఇంతవరకూ క్షమాపణ చెప్పలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ మాత్రం విచక్షణ లేకుండా దారుణమైన ఆరోపణ చేయడం ఏ రాష్ట్రంలోనూ, ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు చేసిన పని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నామంటూ చెప్పుకుంటున్నవారు ఎవ్వరూ ఖండించలేదు. ఉభ యగోదావరి జిల్లా ప్రజలు సౌమ్యులనీ, ఇటువంటి నేరాలు చేయరనీ చంద్ర బాబు అప్పుడు ప్రశంసించారు. తుని ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 13 మందిలో గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వ్యక్తి మినహా తక్కినవారంతా తూర్పుగోదావరి వారేనంటు న్నారు. శుక్రవారంనాడు కిర్లంపూడిలో అరెస్టయిన ఆకుల రామకృష్ణ 1994 నాటి కాపు ఉద్యమం నుంచి ముద్రగడకు కుడిభుజం అనదగిన అనుచరుడు. నెరవేరని హామీ ముద్రగడ ముక్కుసూటి మనిషి. లౌక్యం తెలిసిన రాజకీయ నేత కాదు. నిరాహారదీక్ష అంటే పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఆ రోజు అనూ హ్యంగా రైలు తగలబడటంతో ఆవేదన చెంది దీక్షను విరమించారు. అప్పుడు ముద్రగడతో సమాలోచనలు జరిపిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి తరఫున కొన్ని హామీలు ఇచ్చారు. మంజునాథ కమిషన్ నివే దికను మూడు లేదా నాలుగు మాసాలలో తెప్పించుకొని కాపుల రిజర్వేషన్ కోరుతూ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు పంపుతామని చెప్పారు. రైలు దహనం విషయంలో ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని హామీ ఇచ్చినట్టు ముద్రగడ అర్థం చేసుకున్నారు. ముద్రగడ నివాసం నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లా డుతూ అచ్చెన్నాయుడు మాట కొద్దిగా మార్చారు. రైల్వేలు కేంద్ర ప్రభుత్వ ఆస్తి కనుక కేసులు పెట్టకుండా ఉండటం సాధ్యం కాదనీ, అమాయకులపైన కేసులు పెట్టబోమని మాత్రం హామీ ఇవ్వగలమనీ చెప్పారు. అమాయకులపైన కేసులు పెడతామని ఎవరు చెబుతారు? మంజునాథ్ ఇంతవరకూ పని ప్రారంభించిన దాఖలా లేదు. ఇప్పటి ముద్రగడ నిరాహార దీక్షకూ, కాపుల రిజర్వేషన్లకూ సంబంధం లేదు. మంజునాథ కమిషన్ నివేదిక ఆగస్టులో వచ్చిన తర్వాత, కృష్ణా పుష్కరాల హడావిడి అనంతరమే రిజర్వేషన్ల గురించి మాట్లాడతానని ముద్రగడ లోగడ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పి తన అనుచరులను అరెస్టు చేసినం దుకే ఆగ్రహం. ముద్రగడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టు కోవడం కష్టం. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి దూతలు హామీ ఇవ్వగానే చంద్రబాబు చాలా గొప్పవారంటూ పొగిడేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే పళ్ళెంలో కాళ్ళు కడుగుతానన్నారు. ఇప్పుడు తన అనుచరులను అరెస్టు చేయగానే అమలాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తనను కూడా అరెస్టు చేయాలంటూ వాదించారు. గతంలో చంద్రబాబుపైన చేసిన ఆరోప ణలన్నింటినీ తిరిగి తాజాగా ఏకరువుపెట్టారు. పరిటాల రవి హత్య అనంతరం బస్సులు తగలబెట్టాలంటూ, విధ్వంసం సృష్టించాలంటూ తనతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేశారంటూ ఆరోపించారు. అలవికాని వాగ్దానాలు అంతా చంద్రబాబు స్వయంకృతం. ఎన్నికల ముందు ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయంతో అలవికాని హామీలు ఇవ్వడం, గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదలడం, ముద్రగడ వంటి నాయకులు పట్టుబడితే హామీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నట్టు నమ్మించడం ఆయన రాజకీయ శైలి. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత హామీలు ఇవ్వాలన్న పట్టింపు లేదు. పైగా యనమల రామకృష్ణుడు వంటి మిత్రుడు ఉన్నప్పుడు చంద్రబాబునాయుడికి వేరే శ త్రువు అక్కరలేదు. యనమలకూ, చంద్రబాబుకీ 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పటి నుంచి బలమైన స్నేహం. అప్పుడు శాసనసభాపతిగా యనమల చక్రం తిప్పిన కారణంగానే ఎన్టీఆర్ చేతుల్లోనుంచి పగ్గాలు లాగివేయగలిగారు చంద్రబాబు. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడనీయ కుండా, తన వాదన వినిపించనీయకుండా అమానుషంగా అవమానించిన సభా పతి యనమల. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం యనమలకు మంత్రివర్గంలో స్థానం, ముఖ్యమైన శాఖలు ఇచ్చినప్పటికీ ఆయన రాజకీయ ప్రాబల్యం తుని నియోజకవర్గం పరిధి దాటలేదు. 2014 ఎన్నికలలో గెలుపుపై అనుమానంతోనే ఒక సంవత్సరం ముందే శాసనమండలి సభ్యత్వం తీసు కున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తమ్ముడు యనమల కృష్ణుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు కానీ గెలిపించుకోలేకపోయారు. నియోజవర్గంలో పట్టు లేకపోయినా జిల్లాలో మరొకరు పైకి వచ్చి స్థిరపడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతూ వచ్చారు. మంత్రివర్గం నుంచి వైదొలుగుతూ ముద్రగడ సమ ర్పించిన రాజీనామా పత్రాన్ని ఎన్టీఆర్ నెలరోజుల వరకూ ఆమోదించకుండా పక్కన పెట్టారు. అప్పుడు యనమల సలహా మేరకే ఎన్టీఆర్ రాజీనామాను ఆమోదించారని ముద్రగడ అనుమానం. ఇప్పుడు కూడా ముద్రగడ తెలుగు దేశం పార్టీలోకి వచ్చే అవకాశం లేకుండా చేసేందుకే ఆయనపైన అధికారుల చేత నిఘా పెట్టించి ఆరా తీయించడం వంటి పనులు యనమల చేశారని ముద్రగడ అనుయాయుల ఆరోపణ. జ్యోతుల నెహ్రూకు లోగడ మంత్రిపదవి రాకపోవ డానికి కూడా యనమల రాజకీయమే కారణమని వారి అభిప్రాయం. మొత్తం మీద కాపు ఉద్యమాన్ని పునరుద్ధరించాలని ముద్రగడ నిర్ణయించడానికి యన మల వైఖరి కూడా కారణమనే వాదన ఉంది. గతంలో యనమల వల్ల చంద్ర బాబుకి మేలు జరిగింది. కానీ ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవు తున్నాయి. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు రోజా విషయంలో తప్పుడు నిబం ధనను పేర్కొని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం విశేషానుభవం ఉన్న యనమల చేయవలసిన పని కాదు. సాక్షి మీడియా గ్రూపును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ బహిరంగ సభలలో చెబుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన కొత్త చట్టం పరిధిలోకి సాక్షి మీడియా రాదనే విషయం తెలియని అమాయకుడు కాదు యనమల. మీడియా సంస్థను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వం వల్ల కాదు. ఒక వేళ రామకృష్ణుడి సలహా పాటించి చంద్రబాబు అటువంటి దుస్సాహసం చేస్తే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుంది. మీడియా గొంతునొక్కే యత్నం ఇప్పటికే మీడియాను నియంత్రించడానికి అప్రజాస్వామ్యంగా, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. నిరాహారదీక్షను రాజకీయ సాధనంగా వినియోగించు కోవడం కొత్త కాదు. గాంధీ నుంచి ముద్రగడ దాకా అందరూ నిరాహారదీక్ష చేసినవారే. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నిరాహారదీక్ష చేశారు. వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నిరశన దీక్ష చేశారు. నాబోటి జర్నలిస్టులం ఇద్దరినీ పరామర్శించి సంఘీభావం చెప్పాం. పత్రికలలో సచిత్ర కథనాలు విరివిగా ప్రచురించాం. టీవీ చానళ్ళలో సవివరంగా చూపించాం. బ్రిటిష్ వలస పాలకులు సైతం గాంధీ నిరాహారదీక్షపైన పత్రికలలో వార్తలూ, వ్యాఖ్యలూ వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పలేదు. అసమ్మతిని అణచివేసేందుకు చంద్ర బాబు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను పలకరించడానికి వెళ్ళేవారిని రాజమండ్రి విమానాశ్రయంలోనే అరెస్టు చేయడం, నిరాహార దృశ్యాలను చూపించే సాక్షి టీవీని ఆపుచేయ వలసిందిగా ఎంఎస్వోలపైన అక్రమంగా ఒత్తిడి తీసుకురావడం రాష్ట్రంలో నిరంకుశ ధోరణి ప్రబలుతున్నదనడానికి నిదర్శనం. ముద్రగడ దీక్ష విరమించే వరకూ సాక్షి చానెల్‌ను ఆపు చేస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇదివరకు చంద్రబాబు తప్పు చేసేటప్పుడు అప్రతిష్ఠపాలు అవుతానేమోననే భయం ఉండేది. వెరపు కనిపిం చేది. ఇప్పుడు బరితెగింపు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. మీడియాలో వాస్తవాలు ప్రచరించకపోయినా, ప్రసారం చేయకపోయినా సోషల్ మీడియాలో కాల్పనిక వార్తలు స్వైరవిహారం చేసే ప్రమాదం ఉంది. మీడియా శక్తి చంద్రబాబుకి తెలుసు. 1995 ఆగస్టు తిరుగుబాటులో పత్రికలను సుముఖం చేసుకొని విజయం సాధించాడు. మీడియాను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్ర బాబుకి సాక్షి మీడియా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అసహనం పెరిగిన కొద్దీ అభద్రతాభావం పెరుగుతుంది. అది ఆధిక్య ప్రదర్శనకూ, నియంతృత్వ వైఖరికీ దారి తీస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న అప్రజాస్వామిక దృశ్యాలు ఈ ధోరణిని ప్రతిబింబించేవే. - కె.రామచంద్రమూర్తి -
పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు
-
పాక్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు
- అసహనంపై చర్చలో సర్కారుపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ: అసహనం అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని.. ఇటీవలి సంఘటనలతో కలత చెందిన వారు ఏం చెప్తున్నారో వినాలని హితవు పలికారు. అసహనంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నిరసన తెలుపుతున్న ఎంతోమందిలో నారాయణమూర్తి, రఘురామ్‌రాజన్, పి.ఎం.భార్గవ వంటి వారు ఉన్నారు. లక్షలాది మంది ఇతర జనం లాగానే వారు కూడా కలత చెందారు. వారిని గౌరవించండి.. వారిని కలతకు గురిచేస్తోందేమిటో అర్థంచేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వెళ్లి వారు చెప్తున్నది వినండి’’ అని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. హరియాణాలో సజీవదహనమైన ఇద్దరు దళిత చిన్నారుల మరణాన్ని.. కుక్కపై రాయి వేయటంతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్ అంశాన్ని రాహుల్ ప్రస్తావించినపుడు అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి సింగ్ ఆ సమయంలో సభలో లేరు. ‘మన ప్రధానమంత్రి ఈ మనిషిని మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరు చిన్నారులూ సజీవదహనం కాకుండా ఉండాలని.. అంబేడ్కర్ తన జీవితాన్నంతా వెచ్చించి రాజ్యాంగాన్ని రచించారు. ప్రధాని ఈ వైరుధ్యాన్ని చూడలేకపోయారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించగా.. ప్రతిపక్ష సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు’ అని నినాదాలు చేశారు. ‘‘పాకిస్తాన్ నుంచి తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సహనంతో ఉండండి. మీ ప్రజల మాటలు వినండి. మీ సొంత ప్రజలను ఆలింగనం చేసుకోండి. ప్రజలకు మహాత్మా గాంధీ గళాన్ని అందించారు. పాకిస్తాన్ విఫలమైంది ఎందుకంటే.. వారి నాయకులు ప్రజల గొంతును అణచివేశారు.. హింసాత్మకంగా ప్రవర్తించారు. మనం తప్పుడు పాఠాలు నేర్చుకోకూడదు’’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం... అమీర్‌ఖాన్ అంశంపై బీజేపీ నేతలపై రాహుల్ విమర్శలు ఎక్కుపెడుతూ.. ‘‘ప్రధానమంత్రి ఆర్థిక ప్రగతి, పురోభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. అదే సమయంలో ఆయన సహచరులు కొంతమంది బాలీవుడ్ నటులను పాకిస్తాన్‌కు పంపించటం గురించి మాట్లాడుతుంటారు. మనం ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాం. వారిని చర్చలో భాగస్వాములను కానివ్వండి. మనం తప్పుడు పాఠం నేర్చుకోవద్దు (పాకిస్తాన్ నుంచి). వారి అతి పెద్ద బలహీనత అసహనం’’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్టీఐఐ విద్యార్థుల ఆందోళన గురించి ప్రస్తావిస్తూ.. ఎఫ్టీఐఐ విద్యార్థులు అడిగిందల్లా.. ఒక సాధారణ వ్యక్తిని సంస్థ అధిపతిగా చేయటంపై తమ అభిప్రాయం వినాలని మాత్రమే. అయినాకూడా ప్రభుత్వం వారి గొంతు నొక్కేసింది. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి వంటి హేతువాదులు హత్యకు గురయ్యాక కూడా ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్‌శౌరీని.. ట్విటర్లో ప్రధానమంత్రిని అనుసరించే వాళ్లు అనుచిత విమర్శలతో వేధించటాన్నీ రాహుల్ విమర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న శౌరీ కుమారుడిని కూడా వాళ్లు వదిలిపెట్టలేదని నిరసించారు. ఇది స్వప్నం కాదు.. వాస్తవం... ‘‘దాద్రీలో బీఫ్ తిన్నారన్న వదంతులపై ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ.. హతుడి కుమారుడు వైమానిక దళ సిబ్బంది అయినా కూడా ప్రధానమంత్రి మౌనంగానే ఉండిపోయారు. అతడికి రక్షణ కల్పించే బాధ్యత తుదిగా.. మౌనంగా ఉండిపోయిన ప్రధాని పైనే ఉంది’’ అని తీవ్రంగా విమర్శించారు. రచయితలు, కళాకారుల నిరసనలను కల్పిత విప్లవంగా ప్రభుత్వం కొట్టివేయడాన్ని తప్పుపడుతూ.. వారితో మాట్లాడేందుకు ప్రభుత్వం ఇష్టపడలేదని విమర్శించారు. ‘‘వారు దీనిని ఎందుకు కల్పిస్తారు? అరుణ్‌జైట్లీ గారూ.. ఇది మీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లాగా స్వప్నం కాదు.. ఇది వాస్తవం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మీపై నిరసనలను సృష్టించటం కన్నా నారాయణమూర్తి, రాజన్, భార్గవలకు వేరే పని లేదా?’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం... రాజ్యాంగంపై అవగాహన పెంచేందుకు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగాన్ని ఒక ఏనుగుపై ఉంచి దానితో కలిసి నడిచానని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన అలా నడవాలని మేం కోరుకోవటం లేదు.. (రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు) పని చేయాలని మేం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సేను దేశభక్తుడని బీజేపీ సభ్యుడు సాక్షి మహరాజ్ కీర్తించారని రాహుల్ పేర్కొనగా.. సభలోనే ఉన్న సదరు సభ్యుడు విభేదించారు. -
‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేసిన రచయిత్రి
మత అసహనంపై కొనసాగుతున్న రచయితల ఆగ్రహం ♦ అకాడమీ అవార్డ్‌ను వాపస్ చేసిన మరికొందరు సాహిత్యకారులు ♦ రచయితలపై మండిపడ్డ ఆరెస్సెస్; లౌకిక వ్యాధి గ్రస్తులని వ్యాఖ్య న్యూఢిల్లీ: సమాజంలో పెరుగుతున్న మతపరమైన అసహనం, భావప్రకటన స్వేచ్ఛపై దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ సాహిత్యకారుల నిరసనల పర్వం కొనసాగుతోంది. దాద్రీ ఘటన, హేతువాదులు కల్బుర్గి, ధబోల్కర్, పన్సారేల హత్య, తాజాగా సుధీంద్ర కులకర్ణిపై శివసైనికుల దాడి.. తదితర హింసాత్మక ఘటనలపై నిరసనగా తామందుకున్న సాహిత్య పురస్కారాలను తిరిగివ్వడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మంగళవారం ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి దాలిప్ కౌర్ తివానా 2004లో తానందుకున్న పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేశారు. ముస్లింలపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. భావ ప్రకటనపై దాడిని ఖండిస్తూ.. కార్ల్ మార్క్స్ రచనల ప్రభావం రష్యా విప్లవంపై గణనీయంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డ్‌ను తిరిగిస్తున్న వారి జాబితాలో కన్నడ రచయిత, హంపీ వర్సిటీ ప్రొఫెసర్ రహమత్ తరికెరి, మరాఠీ రచయిత్రి ప్రాధన్య పవార్, హిందీ అనువాదకుడు చమన్‌లాల్, అస్సాం రచయితలు నిరుపమ బోర్గొహెన్, హోమెన్ బోర్గొహెన్ కూడా చేరారు. కల్బుర్గి, దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్య, ఘర్‌వాపసీ, దాద్రీ ఘటన, చర్చ్‌లపై దాడులు, సుధీంద్రపై శివసేన దాడి.. మొదలైన ఘటనలకు నిరసనగా అవార్డ్‌ను తిరిగివ్వాలని నిర్ణయించుకున్నట్లు తరికెరి తెలిపారు. ఈ ఘటనలు అసహన సమాజాన్ని రూపొందించే క్రమంలో జరిగినవన్నారు. గత సంవత్సరంన్నరగా సమాజంలో పెరుగుతున్న అసహనం, నియంతృత్వ ధోరణులకు నిరసనగా అవార్డ్‌ను తిరిగిస్తున్నట్లు పవార్ అన్నారు. అకాడమీ అవార్డ్‌తో పాటు తానందుకున్న అన్ని సాహిత్య పురస్కారాలను తిరిగిచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తక్షణమే అకాడమీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒరియా రచయిత రాజేంద్ర పాండా డిమాండ్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 28 మంది రచయితలు తమ అవార్డ్‌లను వెనక్కివ్వగా, సాహిత్య అకాడమీ అధికార పదవుల నుంచి ఐదుగురు రచయితలు వైదొలగారు. మోదీ మాట్లాడాలి.. రష్దీ: అకాడమీ పురస్కారాలను వెనక్కిచ్చేస్తున్న రచయితలకు మద్దతిచ్చిన రచయిత, బుకర్ అవార్డ్ గ్రహీత సల్మాన్ రష్దీని దారుణంగా దూషిస్తూ ట్వీటర్లో సందేశాలు వెల్లువెత్తాయి. వాటిపై.. ‘మోదీ మూర్ఖ అభిమానులారా.. మీకో విషయం స్పష్టం చేయాలి. నేను ఏ పార్టీకీ మద్దతివ్వను. భావప్రకటన స్వేచ్ఛను హరించే ఏ చర్యనైనా నిరసిస్తాను. స్వేచ్ఛే నా పార్టీ. మునుపెన్నడూ చూడని క్రూర హింస భారత సమాజంలోకి చొచ్చుకువస్తోంది. ప్రధాని దేనిపైనైనా మాట్లాడగలరు. ఈ ఘటనలపైనా మాట్లాడితే బావుంటుంది’ అని అన్నారు. వారు లౌకిక వ్యాధిగ్రస్తులు.. అకాడమీ అవార్డులను రచయితలు తిరిగివ్వడంపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ విమర్శించింది. ‘సెక్యులర్ వ్యాధిగ్రస్తులైన కొందరు రోగులు దేశాన్ని, హిందూత్వాన్ని నాశనం చేసేందుకు చేతులు కలిపారు’ అని పేర్కొంది. ‘సిక్కులను ఊచకోత కోసినవారి నుంచి అవార్డులు అందుకోవడంలో వారికి ఏ సమస్యా లేదం’టూ ఎద్దేవా చేసింది. ఈ లౌకికవాదుల దృష్టిలో హిందువులకు ఎలాంటి మానవహక్కులు ఉండవంటూ ధ్వజమెత్తింది. అకాడమీ అవార్డ్‌లను తిరిగివ్వడంపై మరో ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పందిస్తూ.. అవార్డు స్వీకరించి, తర్వాత తిరిగిచ్చేయడం అవార్డును, న్యాయనిర్ణేతలను అవమానించడమేనన్నారు. ఇదీ రాజకీయమేనని, ప్రచార యావేనని ఘాటుగా విమర్శించారు. పురస్కారాలను తిరిగిస్తున్న రచయితలు రచనలు చేయడం ఆపేయాలన్న సాంస్కృతిక శమంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమయింది. ఆయన అహంభావానికి అది అద్దంపడుతోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దాంతో, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తానెవరినీ నిరోధించలేనంటూ శర్మ చెప్పారు. పాక్ పాఠాలు అవసరం లేదు: భారత్ బహుళత్వ సంస్కృతిపై పాకిస్తాన్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని భారత్ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలంటే ఉగ్రవాదానికి దూరంగా ఉండడమే కీలకమంది. కసూరి పుస్తకావిష్కరణకు అడ్డంకులు, పాక్ గాయకుడు గులాం అలీ కచేరీ రద్దు వంటివి పునరావృతం కావొద్దని పాక్ పేర్కొన్న నేపథ్యంలో భారత్ పై వ్యాఖ్యలు చేసింది. దాద్రీ స్వల్ప ఘటన: బీజేపీ ఎంపీ ‘దాద్రీ స్వల్ప ఘటన’ అని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారు. దాద్రీ వంటి చిన్న ఘటనలను భారత్ చక్కగా హ్యాండిల్ చేయగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లింలతో పాటు ఇతర మతాల వారి అభిప్రాయాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ స్వభావాన్ని తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ తదితర విపక్షాలు మండిపడ్డాయి. దాద్రీ చిన్న ఘటన అయితే ఇంకేది పెద్ద ఘటన అని సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్నించింది. దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలంది. కులకర్ణి మరో కసబ్: శివసేన మాతో సమస్య ఉంటే అధికారం నుంచి తప్పుకోవచ్చంటూ బీజేపీకి సలహా ముంబై: పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీంద్ర కులకర్ణిని పాక్ ఉగ్రవాదితో పోలుస్తూ ‘మరో కసబ్’గా శివసేన అభివర్ణించింది. సుధీంద్రపై దాడి విషయంలో సేనను విమర్శించిన సీఎం ఫడ్నవిస్ మహారాష్ట్రను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారంది. ‘కులకర్ణి లాంటి వాళ్లు ఉగ్రవాదులకంటే ప్రమాదం. దేశాన్ని నాశనం చేయడమే అలాంటివారి లక్ష్యం. అలాంటివారు దేశంలో ఉంటే కసబ్‌లాంటి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాల్సిన అవసరం పాక్‌కు ఉండదు’ అని తన పత్రిక ‘సామ్నా’లో విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాదులను ఒక్కటి చేసింది కసూరీనేనంది. పాక్ నుంచి వచ్చిన కసూరికి భద్రత కల్పించి 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులను ఫడ్నవిస్ అవమానించారని సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆన్నారు. ‘శివసేన జాతీయవాదం, దేశభక్తితో సమస్య ఉంటే మహారాష్ట్రలో అధికారంలో నుంచి బీజేపీ తప్పుకోవచ్చ’న్నారు. రాష్ట్రంలో బీజేపీ, సేనల సంకీర్ణం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సేన విమర్శలపై స్పందిస్తూ.. తాను పాక్ ఏజెంట్‌ను కాదని, శాంతికి ప్రతినిధినని సుధీంద్ర పేర్కొన్నారు. సుధీంద్రపై సిరా దాడి చేసిన ఆరుగురు శివసైనికులను ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్మానించారు.