అవధులు దాటిన అసహనం
త్రికాలమ్
అసమ్మతిని అణచివేసేందుకు చంద్రబాబు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను పలక రించడానికి వెళ్ళేవారిని రాజమండ్రి విమా నాశ్రయంలోనే అరెస్టు చేయడం, నిరాహార దీక్ష దృశ్యాలను చూపించే సాక్షి టీవీని ఆపు చేయవలసిందిగా ఎంఎస్‌వోలపైన అక్రమంగా ఒత్తిడి తీసుకురావడం రాష్ట్రంలో నిరంకుశ ధోరణి ప్రబలుతున్నదనడానికి నిదర్శనం. ముద్రగడ దీక్ష విరమించే వరకూ సాక్షి చానెల్‌ను ఆపుచేస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముద్రగడ పద్మనాభం కొరకరాని కొయ్యగా పరిణమించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాన్ని అమలు పరచాలని కోరుతూ ముద్రగడ జనవరి 31న ఉద్యమం ప్రారంభించిన రోజు తుని స్టేషన్‌లో రైలును దుండగులు కాల్చివేసిన దుర్ఘటనను కూడా రాజకీయంగా వినియోగించు కోవాలని చూడటం దారుణం. గంటలకొద్దీ తగలబడుతున్న రైలు దగ్గరికి పోలీసులు కానీ, అగ్నిమాపకదళం కానీ వెళ్ళలేదు. మంటలు ఆర్పే ప్రయత్నం జరగనేలేదు. అది ప్రభుత్వ వైఫల్యమో, ఎత్తుగడో తెలియదు. రైలు తగలబడు తుండగానే ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టి, ‘నేర స్వభావం కలిగిన ప్రతిపక్ష నాయకుడే ఈ పని చేయించాడు. కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన రౌడీమూకలు రైలు తగులబెట్టారు’ అంటూ భయంకరమైన నిందా రోపణ చేశారు. నిరాధారమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఇంతవరకూ క్షమాపణ చెప్పలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ మాత్రం విచక్షణ లేకుండా దారుణమైన ఆరోపణ చేయడం ఏ రాష్ట్రంలోనూ, ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు చేసిన పని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నామంటూ చెప్పుకుంటున్నవారు ఎవ్వరూ ఖండించలేదు. ఉభ యగోదావరి జిల్లా ప్రజలు సౌమ్యులనీ, ఇటువంటి నేరాలు చేయరనీ చంద్ర బాబు అప్పుడు ప్రశంసించారు. తుని ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 13 మందిలో గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వ్యక్తి మినహా తక్కినవారంతా తూర్పుగోదావరి వారేనంటు న్నారు. శుక్రవారంనాడు కిర్లంపూడిలో అరెస్టయిన ఆకుల రామకృష్ణ 1994 నాటి కాపు ఉద్యమం నుంచి ముద్రగడకు కుడిభుజం అనదగిన అనుచరుడు.
నెరవేరని హామీ
ముద్రగడ ముక్కుసూటి మనిషి. లౌక్యం తెలిసిన రాజకీయ నేత కాదు. నిరాహారదీక్ష అంటే పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఆ రోజు అనూ హ్యంగా రైలు తగలబడటంతో ఆవేదన చెంది దీక్షను విరమించారు. అప్పుడు ముద్రగడతో సమాలోచనలు జరిపిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి తరఫున కొన్ని హామీలు ఇచ్చారు. మంజునాథ కమిషన్ నివే దికను మూడు లేదా నాలుగు మాసాలలో తెప్పించుకొని కాపుల రిజర్వేషన్ కోరుతూ కేంద్రప్రభుత్వానికి సిఫార్సు పంపుతామని చెప్పారు. రైలు దహనం విషయంలో ఎవ్వరిపైనా కేసులు పెట్టబోమని హామీ ఇచ్చినట్టు ముద్రగడ అర్థం చేసుకున్నారు. ముద్రగడ నివాసం నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లా డుతూ అచ్చెన్నాయుడు మాట కొద్దిగా మార్చారు. రైల్వేలు కేంద్ర ప్రభుత్వ ఆస్తి కనుక కేసులు పెట్టకుండా ఉండటం సాధ్యం కాదనీ, అమాయకులపైన కేసులు పెట్టబోమని మాత్రం హామీ ఇవ్వగలమనీ చెప్పారు. అమాయకులపైన కేసులు పెడతామని ఎవరు చెబుతారు? మంజునాథ్ ఇంతవరకూ పని ప్రారంభించిన దాఖలా లేదు.
ఇప్పటి ముద్రగడ నిరాహార దీక్షకూ, కాపుల రిజర్వేషన్లకూ సంబంధం లేదు. మంజునాథ కమిషన్ నివేదిక ఆగస్టులో వచ్చిన తర్వాత, కృష్ణా పుష్కరాల హడావిడి అనంతరమే రిజర్వేషన్ల గురించి మాట్లాడతానని ముద్రగడ లోగడ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పి తన అనుచరులను అరెస్టు చేసినం దుకే ఆగ్రహం. ముద్రగడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టు కోవడం కష్టం. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి దూతలు హామీ ఇవ్వగానే చంద్రబాబు చాలా గొప్పవారంటూ పొగిడేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే పళ్ళెంలో కాళ్ళు కడుగుతానన్నారు. ఇప్పుడు తన అనుచరులను అరెస్టు చేయగానే అమలాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్ళి తనను కూడా అరెస్టు చేయాలంటూ వాదించారు. గతంలో చంద్రబాబుపైన చేసిన ఆరోప ణలన్నింటినీ తిరిగి తాజాగా ఏకరువుపెట్టారు. పరిటాల రవి హత్య అనంతరం బస్సులు తగలబెట్టాలంటూ, విధ్వంసం సృష్టించాలంటూ తనతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేశారంటూ ఆరోపించారు.
అలవికాని వాగ్దానాలు
అంతా చంద్రబాబు స్వయంకృతం. ఎన్నికల ముందు ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయంతో అలవికాని హామీలు ఇవ్వడం, గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదలడం, ముద్రగడ వంటి నాయకులు పట్టుబడితే హామీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నట్టు నమ్మించడం ఆయన రాజకీయ శైలి. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత హామీలు ఇవ్వాలన్న పట్టింపు లేదు. పైగా యనమల రామకృష్ణుడు వంటి మిత్రుడు ఉన్నప్పుడు చంద్రబాబునాయుడికి వేరే శ త్రువు అక్కరలేదు. యనమలకూ, చంద్రబాబుకీ 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పటి నుంచి బలమైన స్నేహం. అప్పుడు శాసనసభాపతిగా యనమల చక్రం తిప్పిన కారణంగానే ఎన్టీఆర్ చేతుల్లోనుంచి పగ్గాలు లాగివేయగలిగారు చంద్రబాబు. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడనీయ కుండా, తన వాదన వినిపించనీయకుండా అమానుషంగా అవమానించిన సభా పతి యనమల. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం యనమలకు మంత్రివర్గంలో స్థానం, ముఖ్యమైన శాఖలు ఇచ్చినప్పటికీ ఆయన రాజకీయ ప్రాబల్యం తుని నియోజకవర్గం పరిధి దాటలేదు. 2014 ఎన్నికలలో గెలుపుపై అనుమానంతోనే ఒక సంవత్సరం ముందే శాసనమండలి సభ్యత్వం తీసు కున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో తమ్ముడు యనమల కృష్ణుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు కానీ గెలిపించుకోలేకపోయారు. నియోజవర్గంలో పట్టు లేకపోయినా జిల్లాలో మరొకరు పైకి వచ్చి స్థిరపడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతూ వచ్చారు. మంత్రివర్గం నుంచి వైదొలుగుతూ ముద్రగడ సమ ర్పించిన రాజీనామా పత్రాన్ని ఎన్టీఆర్ నెలరోజుల వరకూ ఆమోదించకుండా పక్కన పెట్టారు. అప్పుడు యనమల సలహా మేరకే ఎన్టీఆర్ రాజీనామాను ఆమోదించారని ముద్రగడ అనుమానం. ఇప్పుడు కూడా ముద్రగడ తెలుగు దేశం పార్టీలోకి వచ్చే అవకాశం లేకుండా చేసేందుకే ఆయనపైన అధికారుల చేత నిఘా పెట్టించి ఆరా తీయించడం వంటి పనులు యనమల చేశారని ముద్రగడ అనుయాయుల ఆరోపణ. జ్యోతుల నెహ్రూకు లోగడ మంత్రిపదవి రాకపోవ డానికి కూడా యనమల రాజకీయమే కారణమని వారి అభిప్రాయం. మొత్తం మీద కాపు ఉద్యమాన్ని పునరుద్ధరించాలని ముద్రగడ నిర్ణయించడానికి యన మల వైఖరి కూడా కారణమనే వాదన ఉంది. గతంలో యనమల వల్ల చంద్ర బాబుకి మేలు జరిగింది. కానీ ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవు తున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యురాలు రోజా విషయంలో తప్పుడు నిబం ధనను పేర్కొని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం విశేషానుభవం ఉన్న యనమల చేయవలసిన పని కాదు. సాక్షి మీడియా గ్రూపును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ బహిరంగ సభలలో చెబుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన కొత్త చట్టం పరిధిలోకి సాక్షి మీడియా రాదనే విషయం తెలియని అమాయకుడు కాదు యనమల. మీడియా సంస్థను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వం వల్ల కాదు. ఒక వేళ రామకృష్ణుడి సలహా పాటించి చంద్రబాబు అటువంటి దుస్సాహసం చేస్తే తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతుంది.
మీడియా గొంతునొక్కే యత్నం
ఇప్పటికే మీడియాను నియంత్రించడానికి అప్రజాస్వామ్యంగా, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. నిరాహారదీక్షను రాజకీయ సాధనంగా వినియోగించు కోవడం కొత్త కాదు. గాంధీ నుంచి ముద్రగడ దాకా అందరూ నిరాహారదీక్ష చేసినవారే. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నిరాహారదీక్ష చేశారు. వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నిరశన దీక్ష చేశారు. నాబోటి జర్నలిస్టులం ఇద్దరినీ పరామర్శించి సంఘీభావం చెప్పాం. పత్రికలలో సచిత్ర కథనాలు విరివిగా ప్రచురించాం. టీవీ చానళ్ళలో సవివరంగా చూపించాం. బ్రిటిష్ వలస పాలకులు సైతం గాంధీ నిరాహారదీక్షపైన పత్రికలలో వార్తలూ, వ్యాఖ్యలూ వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పలేదు. అసమ్మతిని అణచివేసేందుకు చంద్ర బాబు పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను పలకరించడానికి వెళ్ళేవారిని రాజమండ్రి విమానాశ్రయంలోనే అరెస్టు చేయడం, నిరాహార దృశ్యాలను చూపించే సాక్షి టీవీని ఆపుచేయ వలసిందిగా ఎంఎస్‌వోలపైన అక్రమంగా ఒత్తిడి తీసుకురావడం రాష్ట్రంలో నిరంకుశ ధోరణి ప్రబలుతున్నదనడానికి నిదర్శనం.
ముద్రగడ దీక్ష విరమించే వరకూ సాక్షి చానెల్‌ను ఆపు చేస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇదివరకు చంద్రబాబు తప్పు చేసేటప్పుడు అప్రతిష్ఠపాలు అవుతానేమోననే భయం ఉండేది. వెరపు కనిపిం చేది. ఇప్పుడు బరితెగింపు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. మీడియాలో వాస్తవాలు ప్రచరించకపోయినా, ప్రసారం చేయకపోయినా సోషల్ మీడియాలో కాల్పనిక వార్తలు స్వైరవిహారం చేసే ప్రమాదం ఉంది. మీడియా శక్తి చంద్రబాబుకి తెలుసు. 1995 ఆగస్టు తిరుగుబాటులో పత్రికలను సుముఖం చేసుకొని విజయం సాధించాడు. మీడియాను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్ర బాబుకి సాక్షి మీడియా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అసహనం పెరిగిన కొద్దీ అభద్రతాభావం పెరుగుతుంది. అది ఆధిక్య ప్రదర్శనకూ, నియంతృత్వ వైఖరికీ దారి తీస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న అప్రజాస్వామిక దృశ్యాలు ఈ ధోరణిని ప్రతిబింబించేవే.
- కె.రామచంద్రమూర్తి