ముద్రగడ దీక్షపై స్పందించని ఏపీ సర్కార్
కిర్లంపూడి : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆయన దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దీక్ష విరమించబోనంటున్న ముద్రగడకు వైద్య పరీక్షల కోసం వైద్య బృందం మూడుసార్లు వచ్చింది. అయితే ఆయన రెండుసార్లు పరీక్షలను నిరాకరించారు.
ఇదిలా ఉంటే కిర్లంపూడిలో పోలీసులు అడుగడుగునా మోహరించారు. అయిదు చోట్ల సెక్యూరిటీ అవుట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి కిర్లంపూడిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ నిలువరిస్తున్నారు. ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వట్టి వసంత్ కుమార్, సి.రామచంద్రయ్య, కందుల దుర్గేష్ను పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో వాళ్లు వెనుదిరిగి వెళ్లిపోయారు.
మరోవైపు ముద్రగడ పద్మనాభం దీక్షకు ఏపీ సర్కార్ స్పందించడం లేదు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం వేసిన మంజునాథ కమిషన్ గడువు తగ్గించాలంటూ ముద్రగడ చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం డిమాండ్లపై ముందుకు రాకపోడంతో పాటు, మంత్రులు కూడా ముద్రగడతో చర్చలకు యత్నించడంలేదు. కేవలం పార్టీ నేతలను మాత్రమే పంపి చర్చలను తూతూమంత్రంగా ముగించిన విషయం తెలిసిందే.