మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కురసాల కన్నబాబు. చిత్రంలో దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, మరికొందరు నేతలు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇతర నేతలతో కలసి ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎదురైన సందర్భాన్ని పక్కనపెట్టి కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమనే ధోరణిలో వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టుకుని కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరి చెప్పాలని కోరిన సందర్భంలో జగన్ అనేక వాస్తవ విషయాలను తన ప్రసంగంలో వివరించారని ఆయన తెలిపారు.
చంద్రబాబు దగా చేశారు...
రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని జగన్ విశదీకరించారన్నారు. ఈ వాస్తవం తెలిసినా టీడీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇచ్చేస్తానంటూ కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరిచేలా చూడాల్సిన చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు.
కేంద్రంలో మంత్రి పదవులు పంచుకుని అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు సర్కారు ఆరోజే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి ఉంటే.. కర్ణాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఇక్కడ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ చంద్రబాబులా గాలి మాటలు తాను చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారన్నారు. కాపులను మభ్యపెట్టే క్రమంలో మంజునాథన్ కమిషన్ వేసి దాని నివేదిక పూర్తికాకుండా, చైర్‌పర్సన్ సంతకం కూడా లేకుండా ఓ నివేదికను కేంద్రానికి పంపి చంద్రబాబు చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించలేకపోగా, వాస్తవాలను మాట్లాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై మాత్రం అర్థంలేని విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా చంద్రబాబు ఒక్కసారైనా కాపు రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ అడగలేకపోయారని కన్నబాబు విమర్శించారు. ఢిల్లీ పర్యటనల్లో పోలవరం ప్రాజెక్టు పనులను సొంత మనుషులకు కట్టబెట్టుకోవడం, లాలూచీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారే తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
బాబు తప్పు కనిపించట్లేదు కానీ.. జగన్ మాటల్ని వక్రీకరిస్తారా?
కాపు రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తమ పార్టీ చెప్పిన మాటలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని కన్నబాబు తెలిపారు. కాపుల ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని ఆయన గుర్తు చేస్తూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తామని చెప్పిన జగన్ మాటల్లోని చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోయినా ప్రశ్నించకపోవడం, ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్‌కల్యాణ్ స్పందించకపోయినా మాట్లాడని నేతలు, జగన్ వ్యాఖ్యలను వక్రీకరించడంలో మాత్రం ముందుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రధాని అభ్యర్థినని మోదీ, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న తనను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరితే తప్పుగా కనిపించట్లేదని, తమకు అధికారమిస్తే ప్రజలకు మంచి చేస్తానన్న జగన్ మాటలను మాత్రం అడుగడుగునా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ హామీలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్‌పైనా, గృహ నిర్మాణాల పథకాలపైనా ఇలాంటి విమర్శలే చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆచరణలో వాటిని వైఎస్ అమలు చేసి చూపించారన్నారు.
దేశవ్యాప్తంగా 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ఒక్క ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ 48 లక్షల ఇళ్లను నిర్మించారని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు హయత్ హోటళ్లకు, విదేశీ, స్వదేశీ పర్యటనల్లో వాడే విమాన చార్జీలకు చేసే దుబారాను తగ్గించుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపు కులస్తులు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ముద్రగడపై రాజా ఫైర్..
తన కుటుంబంపై జగన్ చూపించిన ప్రేమలో మొసలికన్నీరు కనిపిస్తుందంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదుగానూ కనిపిస్తున్నాయా? అని నిలదీశారు.
ముద్రగడ ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై యనమల చేస్తోన్న వ్యాఖ్యలపైనా రాజా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు 50సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందంటూ యనమల మాట్లాడారని, వాస్తవానికి 101సార్లు రాజ్యాంగ సవరణ జరిగిన విషయం కూడా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న యనమల వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ నాలుగేళ్లుగా ఏ గుడ్డిగాడిదకు పళ్లు తోముతున్నావని నిలదీశారు.
కాపుల్లో జగన్‌పై విశ్వాసం: జక్కంపూడి
జగన్ వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కాపు సామాజికవర్గంలో ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాట ఇస్తే కట్టుబడే వ్యక్తిత్వం, నమ్ముకున్నవారికి న్యాయం చేసే తత్వం జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు రెండునాల్కల ధోరణితో ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ముద్రగడ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఉద్యమ సమయంలో జగన్ అనుమతితోనే తామంతా ముద్రగడ వెంట నడిచిన విషయాన్ని మరువరాదన్నారు.
ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గోదావరి వంతెనపై అశేష జనవాహినితో కనిపించిన స్పందనకు బాబు పునాదులే కదిలాయని, అందుకే జగన్ మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ తమకు అనువుగా మలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీ పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు కోఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, పర్వత ప్రసాద్, మాజీమంత్రి కొప్పన మోహనరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment