
కిర్లంపూడి: కాపు జాతికి రిజర్వేషన్‌ల అమలుకు కృషి చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతులు కోల్పోయిన రిజర్వేషన్ విషయమై గతంలో రాసిన లేఖ సారాంశాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సోషల్ జస్టిస్ మంత్రి స్పందిస్తూ రాజ్యాంగ సవరణలు 103, 105–2019, 2021 యాక్ట్స్‌ను అనుసరించి ఆర్టికల్ 342ఎ(3) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చని చెప్పారని తెలిపారు.
తదనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తమ సామాజికవర్గానికి కూడా రిజర్వేషన్ కల్పించి వెలుగు నింపాలని ముద్రగడ తన లేఖలో కోరారు.