చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మేనిఫెస్టో
కులాల మధ్యే కాదు.. కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి చంద్రబాబు దిగజారాడు
కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ధ్వజం
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు.
పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు
చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్‌కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్‌సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment